స్వదేశివైనను లేక పరదేశివైనను, దేవుడు నిన్ను ఆహ్వానించుచున్నాడు!
“యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించెను.”—అపొ. కార్యములు 17:26.
1. విదేశీ సంస్కృతులున్న ప్రజలను అంగీకరించు విషయములో, ఈనాడు అనేక ప్రాంతములలో ఏ అప్రీతికరమైన పరిస్థితులు ఉనికిలో ఉన్నవి?
పత్రికా నివేదికలు సూచించునదేమనగా అనేక దేశాలలో పరదేశులు, వలసవచ్చువారు, శరణార్థులను గూర్చిన చింత పెరుగుచున్నది. ఆసియా, ఆఫ్రికా, యూరపు మరియు అమెరికా ఖండములోని దేశాలనుండి లక్షలాదిమంది నిరాశానిస్పృహలతో కదలివెళ్లుచున్నారు. బహుశః వారు అణగార్చు దారిద్యము, అంతర్యుద్ధము, లేక హింసనుండి విముక్తిని వెదకుచుండవచ్చును. అయితే వారు వేరొకచోటునకు స్వాగతించబడుచున్నారా? టైమ్ పత్రిక ఇట్లు వివరించినది: “యూరపులో వివిధ మతధర్మములు మారుటకు ఆరంభమగుచుండగా, సహించువారమని ఒకప్పుడు తలంచినట్లుగా తామిప్పుడు విదేశీ సంస్కృతులను సహించువారిగా లేనట్లు కొన్ని దేశాలు కనుగొనుచున్నవి.” 1,80,00,000 “అవాంఛిత” శరణార్థులను గూర్చి, టైమ్ ఇట్లు చెప్పినది: “స్థిరమైన దేశాలకు వారిద్వారా కలుగు సవాలు సమసిపోదు.”
2, 3. (ఎ) చేర్చుకొనుట విషయమై బైబిలు ఎటువంటి సేదదీర్చు అభయమును అందించుచున్నది? (బి) ప్రజలతో దేవుడు వ్యవహరించుటను గూర్చి లేఖనములను పరిశోధించుట వలన మనమెందుకు ప్రయోజనము పొందగలము?
2 ఈ విషయములో ఏది వృద్ధియైనను, ప్రతిజనాంగములోని ప్రజలను—ఆ వ్యక్తి అక్కడే జన్మించిన పౌరుడైనను, వలసవచ్చినవాడైనను, లేక ఒక శరణార్థియైనను వారిని దేవుడు ఆహ్వానించుచున్నాడని బైబిలు చూపించుచున్నది. (అపొ. కార్యములు 10:34, 35) ‘అయినను, మీరు దానినెట్లు చెప్పగలరు? ఇతరులనుండి ప్రత్యేకముగా, దేవుడు ప్రాచీన ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎన్నుకొనలేదా?’ అని కొందరడుగ వచ్చును.
3 సరే, దేవుడు ప్రాచీనకాల ప్రజలతో ఎట్లు వ్యవహరించెనో మనము చూద్దాము. ఈనాడు సత్యారాధికులకు లభించు ఆధిక్యతలకు సంబంధించిన కొన్ని ప్రవచనములను కూడ మనము పరిశీలించవచ్చును. ఈ ప్రవచనార్థక సమాచారమును పునఃసమీక్షించుట సంపూర్ణ అవగాహనపై వెలుగును ప్రసరింపజేయగలదు. మీరు దానిని ఎంతో ప్రోత్సాహకరమైనదిగా కనుగొనవచ్చును. ఆలాగే, మహాశ్రమల తరువాత, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాట్లాడు వారిలోనుండియు” వచ్చు ఆయావ్యక్తులతో దేవుడెట్లు వ్యవహరించవచ్చునో కూడ అది సూచించును.—ప్రకటన 7:9, 14-17.
‘జనములన్నియు ఆశీర్వదించబడును’
4. జాతీయతయొక్క సమస్య ఎట్లు వృద్ధియైనది, అయితే దేవుడు ఏ చర్యలు గైకొనెను?
4 జలప్రళయము తర్వాత, నోవహు స్వంత కుటుంబమే సమస్త మానవజాతిగా యుండెను, మరియు వారందరు సత్యారాధికులై యుండిరి. అయితే త్వరలోనే ఆ ఐక్యత మారిపోయెను. అలా ఎంతోకాలము గడువక ముందే, కొంతమంది దేవుని చిత్తమును అలక్ష్యముచేసి, ఒక గోపురమును నిర్మించ నారంభించిరి. వారుచేసిన ఈ పని ప్రజలు చెదిరిపోయి వివిధ జనాంగములుగా, భాషల వారిగా మానవజాతి ముక్కలగుటకు నడిపించెను. (ఆదికాండము 11:1-9) అయిననూ, అబ్రాహాము వరకు నడిపిన వంశక్రమములో సత్యారాధన కొనసాగెను. నమ్మకస్థుడైన అబ్రాహామును దేవుడు ఆశీర్వదించి అతని సంతానము గొప్ప జనాంగముగా తయారగునని వాగ్దానము చేసెను. (ఆదికాండము 12:1-3) ఆ జనాంగమే ప్రాచీన ఇశ్రాయేలీయులు.
5. అబ్రాహాముతో దేవుని వ్యవహారముల నుండి మనందరము ఎందుకు ధైర్యము తెచ్చుకొనగలము?
5 అయితే, యెహోవా ఇశ్రాయేలీయుకాని ఇతర ప్రజలను కాదనలేదు, ఎందుకనగా ఆయన సంకల్పము మానవజాతియంతటికి విస్తరించెను. దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినదానినుండి మనము దీనిని స్పష్టముగా చూడగలము: “నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:18) నిజమే, దేవుడు ఆ జనాంగమునకు ధర్మశాస్త్ర నియమావళిని యిచ్చి, తన ఆలయములో బలులు అర్పించుటకు యాజకులను ఏర్పాటుచేసి, నివసించుటకు వారికి వాగ్దాన దేశమును దయచేయుచు, శతాబ్దములపాటు ఆయన ఇశ్రాయేలీయులతో ప్రత్యేకరీతిలో వ్యవహరించాడు.
6. ఇశ్రాయేలీయులతో దేవుడుచేసిన ఏర్పాట్లు అందరికి ఎట్లు ప్రయోజనము తెచ్చును?
6 ఇశ్రాయేలీయులకు దేవుడు యిచ్చిన ధర్మశాస్త్రము ప్రజలందరి కొరకు మేలుకరమై యుండెను, ఏలయనగా అది మానవుని పాపమును స్పష్టముగా రుజువుపరచి, ఆ మానవ పాపమును శాశ్వతముగా పరిహరించుటకు ఒక పరిపూర్ణమైన బలి అవసరమని చూపించినది. (ఆదికాండము 3:19; హెబ్రీయులు 7:26-28; 9:9; 10:1-12) అయిననూ, ఎవరిద్వారా జనములన్నియు ఆశీర్వదించబడునో, ఆ అబ్రాహాము సంతానము వచ్చునని, తగిన అర్హతలను చూపించునని ఏ అభయము ఉండెను? ఇక్కడ మరలా ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రము సహాయము చేసెను. పిల్లలను సజీవముగా దహించుటవంటి ఆచారములు, లైంగిక దుర్నీతి క్రియలకు పేరుగాంచిన ప్రజలగు, కనానీయులతో అది మతాంతర వివాహములను నిషేధించినది. (లేవీయకాండము 18:6-24; 20:2, 3; ద్వితీయోపదేశకాండము 12:29-31; 18:9-12) వారు వారి అభ్యాసములు నిర్మూలించబడవలెనని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ సంతానముయొక్క వంశక్రమము పాడుకాకుండా పనిచేయును గనుక, ఆ ఆజ్ఞ పరదేశితోసహా, అందరికి దీర్ఘకాల ప్రయోజనములు తెచ్చునదై యుండెను.—లేవీయకాండము 18:24-28; ద్వితీయోపదేశకాండము 7:1-5; 9:5; 20:15-18.
7. దేవుడు క్రొత్తవారిని ఆహ్వానించెననుటకు ఏ తొలి సూచన కలదు?
7 ధర్మశాస్త్రము అమలులో ఉన్నప్పుడు మరియు దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేకముగా దృష్టించినప్పుడు కూడ, ఆయన ఇశ్రాయేలీయులు కానివారికి కృప జూపించెను. ఆ విధముగా చేయు ఆయన సుముఖత ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వమునుండి స్వంత దేశమునకు ప్రయాణమైనప్పుడు ప్రదర్శింపబడెను. “అనేకులైన అన్యజనుల సమూహమును . . . వారితోకూడ బయలుదేరెను.” (నిర్గమకాండము 12:38) పండితుడైన సి. ఎఫ్. కైల్ వారిని “పరదేశులు గొప్ప సందోహముగా . . . విభిన్నప్రజల గుంపుగా, లేక వివిధ జనాంగముల ప్రజల సమూహముగా” గుర్తించాడు. (లేవీయకాండము 24:10; సంఖ్యాకాండము 11:4) వారిలో బహుశః అనేకులు సత్యదేవుని అంగీకరించిన ఐగుప్తీయులై యుండవచ్చును.
పరదేశులకు ఆహ్వానము
8. దేవుని ప్రజలమధ్య గిబియోనీయులు ఎట్లు స్థానము సంపాదించిరి?
8 వాగ్దాన దేశమునుండి నీచమైన జనాంగములను తొలగించుమనిన దేవుని ఆజ్ఞను ఇశ్రాయేలీయులు నెరవేర్చుచుండగా, యెరూషలేముకు ఉత్తరమున జీవించిన, గిబియోనీయులను ఒక పరదేశుల గుంపును ఆయన కాపాడెను. ప్రాథేయపడి సమాధానము సంపాదించుటకు, వారు కపట వేషము ధరించిన రాయబారులను యెహోషువ నొద్దకు పంపిరి. వారి గుట్టు బయటపడినప్పుడు, యెహోషువ ఆ గిబియోనీయులు “సమాజము కొరకును యెహోవా . . . బలిపీఠము కొరకును కట్టెలు కొట్టువారిగాను నీళ్లు చేదువారిగాను” సేవచేయుదురని శాసించెను. (యెహోషువ 9:3-27) ఈనాడు వలసవెళ్లు అనేకులు క్రొత్త ప్రజలలో భాగమయ్యేందుకు దీనమైన సేవలు చేయుటకు సహితము అంగీకరింతురు.
9. ఇశ్రాయేలీయుల మధ్యగల పరదేశుల విషయములో రాహాబు, ఆమె కుటుంబముయొక్క మాదిరి ఎట్లు ప్రోత్సాహకరముగా ఉన్నది?
9 ఆనాడు కేవలము పరదేశుల గుంపులకు మాత్రమే కాదు; ఒంటరిగానున్న ఆయావ్యక్తులకు సహితము దేవుని ఆహ్వానము వర్తించునని తెలిసికొనుట నీకు ప్రోత్సాహకరముగా ఉండవచ్చును. ఈనాడు కొన్ని దేశాలు కేవలము సామాజిక హోదా, పెట్టుబడిపెట్టగల సంపద, లేక ఉన్నతవిద్యగల వారిని మాత్రమే వలసవచ్చుటకు ఆహ్వానించును. యెహోవా అలాచేయడు, దీనిని మనము గిబియోనీయులకు సంబంధించిన సంగతికి కొద్దిగాముందు జరిగిన ఒక సంఘటననుండి చూచెదము. అది దాదాపు ఏ మాత్రము ఉన్నత సామాజిక హోదాలేని కనానీయ వ్యక్తి చేరియున్న విషయము. బైబిలు ఆమెను “రాహాబను వేశ్య” అని పిలుచుచున్నది. సత్యదేవునియందు ఆమెచూపిన విశ్వాసము కారణముగా, ఆమె ఆమె యింటివారు యెరికో నాశనమునుండి కాపాడబడిరి. రాహాబు పరాయి దేశస్థురాలైనను, ఇశ్రాయేలీయులు ఆమెను అంగీకరించిరి. ఆమె విశ్వాసముయొక్క మాదిరి మనము అనుకరించవలసినంత విలువైనదిగా యుండెను. (హెబ్రీయులు 11:30, 31, 39, 40; యెహోషువ 2:1-21; 6:1-25) ఆమె మెస్సీయయొక్క పూర్వికులలో సహితము ఒకామెగా తయారయ్యెను.—మత్తయి 1:5, 16.
10. ఇశ్రాయేలీయులలో పరదేశులను స్వాగతించుట దేనిపై ఆధారపడియుండెను?
10 సత్యదేవుని ప్రీతిపరచుటకు వారుచేసిన కృషికి అనుగుణ్యముగా ఇశ్రాయేలీయులు కానివారుకూడ వాగ్దాన దేశములోనికి అంగీకరింపబడిరి. యెహోవాను సేవింపని వారితో, ప్రత్యేకముగా మతసంబంధముగా సహవాసము చేయకూడదని ఇశ్రాయేలీయులు చెప్పబడిరి. (యెహోషువ 23:6, 7, 12, 13; 1 రాజులు 11:1-8; సామెతలు 6:23-28) అయిననూ, ఇశ్రాయేలీయులు కాని నివాసులు అనేకమంది ప్రాథమిక నియమములకు విధేయులైరి. ఇతరులైతే సున్నతిపొందిన యూదామత ప్రవిష్టులైరి, కాగా యెహోవా తన సంఘ సభ్యులుగా వారిని పూర్తిగా ఆహ్వానించెను.—లేవీయకాండము 20:2; 24:22; సంఖ్యాకాండము 15:14-16; అపొ. కార్యములు 8:27.a
11, 12. (ఎ) పరదేశులైన ఆరాధికులను ఇశ్రాయేలీయులు ఎట్లు చూడవలెను? (బి) యెహోవా మాదిరిని అనుకరించుటలో మనమెట్లు అభివృద్ధిచెందు అవసరము కలదు?
11 పరదేశులయెడల తన దృక్పధమును అనుకరించుమని ఇశ్రాయేలీయులను దేవుడు నిర్దేశించెను. “మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి.” (లేవీయకాండము 19:33, 34; ద్వితీయోపదేశకాండము 1:16; 10:12-19) ధర్మశాస్త్రము క్రింద మనము లేనప్పటికిని, ఇది మనకు ఒక పాఠమును తెల్పుచున్నది. వేరొక తెగ, జాతి, లేక సంస్కృతి గలవారియెడల దురభిమానము మరియు విరోధభావములకు లొంగిపోవుట సులభమే. కావున మనమిట్లు ప్రశ్నించుకొనుట మంచిది: ‘యెహోవా మాదిరిని అనుకరిస్తూ, అటువంటి దురభిమానములకు నన్ను నేను దూరపరచుకొనుటకు ప్రయత్నించుచున్నానా?’
12 ఇశ్రాయేలీయులకు దేవుని ఆహ్వానపు ప్రత్యక్ష నిదర్శనము ఉండెను. రాజైన సొలొమోను ఇలా ప్రార్థించెను: “ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశమునుండి వచ్చి . . . యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, [వినుము] . . . అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి . . . నీయందు భయభక్తులు” కలిగియుందురు.—1 రాజులు 8:41-43; 2 దినవృత్తాంతములు 6:32, 33.
13. ఇశ్రాయేలీయులతో తన వ్యవహారములను మార్చుటకు దేవుడెందుకు ఏర్పాటుచేసెను?
13 తన ప్రజలుగా యెహోవా ఇంకనూ ఇశ్రాయేలీయులను ఉపయోగించుచు ఆ విధముగా మెస్సీయాయొక్క వంశక్రమమును కాపాడుచుండగా, దేవుడు ప్రాముఖ్యమైన మార్పులను ముందుగానే చెప్పెను. అంతకు పూర్వము ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమునకు హత్తుకొని ఉంటామని అంగీకరించినప్పుడు, వారు “యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను” ఉండు స్థితిని దేవుడు వారికి అనుగ్రహించెను. (నిర్గమకాండము 19:5, 6) అయితే శతాబ్దములపాటు ఇశ్రాయేలీయులు అపనమ్మకత్వమును ప్రదర్శించిరి. కావున తాను ఒక క్రొత్తనిబంధన చేసెదనని దానిప్రకారము “ఇశ్రాయేలు ఇంటివారిగా” తయారగువారి దోషము పాపము క్షమించబడునని దేవుడు ప్రవచించెను. (యిర్మీయా 31:33-34) అనేకుల పాపమును నిజముగా పరిహరించు మెస్సీయ వచ్చినప్పుడు, ఆ క్రొత్త నిబంధన చేయబడును.—యెషయా 53:5-7, 10-12.
పరలోకమందలి ఇశ్రాయేలీయులు
14. ఏ క్రొత్త “ఇశ్రాయేలును” దేవుడు అంగీకరించెను, మరియు ఎట్లు?
14 ఇదంతయు ఎట్లు నెరవేర్చబడినదో అర్థము చేసికొనుటకు క్రైస్తవ గ్రీకు లేఖనములు మనకు సహాయము చేయును. తన మరణము ధర్మశాస్త్రమును నెరవేర్చి పాపము సంపూర్ణముగా క్షమించబడుటకు పునాది వేసిన, యేసే ఆ మెస్సీయ. ఆ ప్రయోజనము పొందుటకు, ఒకడు సున్నతి పొందిన శరీర సంబంధమైన యూదుడే కానవసరము లేదు. నూతన నిబంధనలో, “అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు” అని అపొస్తలుడైన పౌలు వ్రాసెను. (రోమీయులు 2:28, 29; 7:6) యేసు బలియందు విశ్వాసముంచిన వారు క్షమాపణ పొందిరి, కాగా దేవుడు వీరిని ‘ఆత్మద్వారా యూదులైన’ వారిగా అంగీకరించాడు. వీరు “దేవుని ఇశ్రాయేలు” అని పిలువబడు ఆత్మీయ జనాంగముగా తయారగుదురు. —గలతీయులు 6:16.
15. ఆత్మీయ ఇశ్రాయేలునందు భాగమైయుండుటకు శరీర సంబంధమైన జాతీయత ఎందుకు పెద్దసంగతి కాదు?
15 అవును, ఆత్మీయ ఇశ్రాయేలుగా అంగీకరింపబడుట ఒకానొక జాతి లేక తెగ ప్రాతిపదికపై ఆధారపడలేదు. యేసు అపొస్తలుల వంటివారు కొందరు సహజ యూదులై యుండిరి. రోమా సైనికాధికారియైన కొర్నేలీ వంటి ఇతరులు, సున్నతి పొందని అన్యులై యుండిరి. (అపొ. కార్యములు 10:34, 35, 44-48) ఆత్మీయ ఇశ్రాయేలును గూర్చి పౌలు సరిగా చెప్పెను: “ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు.” (కొలొస్సయులు 3:11) దేవుని ఆత్మచే అభిషేకించబడిన వారు “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన” ప్రజలుగా తయారైరి.—1 పేతురు 2:9; నిర్గమకాండము 19:5, 6 పోల్చుము.
16, 17. (ఎ) దేవుని సంకల్పమందు ఆత్మీయ ఇశ్రాయేలీయులు ఏ పాత్రను కలిగియుందురు? (బి) దేవుని ఇశ్రాయేలు కానివారిని పరిగణలోనికి తీసికొనుట ఎందుకు సరియైయున్నది?
16 దేవుని సంకల్పమందు ఆత్మీయ ఇశ్రాయేలీయులు ఏ భవిష్యత్తును కలిగియుందురు? యేసు ఇట్లు జవాబిచ్చెను: “చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” (లూకా 12:32) “పౌరస్థితి పరలోకములో” ఉన్న అభిషక్తులు, రాజ్యపాలనయందు గొర్రెపిల్లతో సహవారసులుగా ఉందురు. (ఫిలిప్పీయులు 3:20; యోహాను 14:2, 3; ప్రకటన 5:9, 10) వీరు ‘ఇశ్రాయేలీయుల కుమారులలోనుండి ముద్రింపబడి’ “దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా మనుష్యులలోనుండి కొనబడినవారు” అని బైబిలు సూచించుచున్నది. వారి సంఖ్య 1,44,000. అయితే ముద్రింపబడిన వారి సంగతి చెప్పిన తర్వాత, యోహాను వేరొకగుంపును—“ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి(న), యెవడును లెక్కింపజాలని యొక్క గొప్పసమూహమును” పరిచయము చేయుచున్నాడు.—ప్రకటన 7:4, 9; 14:1-4.
17 ‘ఆత్మీయ ఇశ్రాయేలులో భాగముకాకుండా, బహుశః ఆ గొప్ప సమూహములోని వారిగా మహాశ్రమలను దాటుకొనివచ్చు లక్షలాదిమంది సంగతి ఏమి? మిగిలియున్న కొద్దిమంది ఆత్మీయ ఇశ్రాయేలీయుల సంబంధించినంతవరకు వారు ఈనాడు ఏ పాత్రను కలిగియుందురు?’ అని కొందరు ఆలోచించవచ్చును.b
ప్రవచనమందు పరదేశులు
18. బబులోను చెరనుండి ఇశ్రాయేలీయులు తిరిగివచ్చుటకు ఏది నడిపించెను?
18 ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రము క్రింద ఉండి, దానియెడల అపనమ్మకస్థులుగా ఉన్న కాలమునకు తిరిగిచూస్తే, ఇశ్రాయేలీయులను బబులోనీయులు నాశనముచేయుటకు దేవుడు తీర్మానించినట్లు మనము కనుగొందుము. సా.శ.పూ. 607లో ఇశ్రాయేలీయులు 70 సంవత్సరములపాటు చెరగా కొనిపోబడిరి. ఆ పిమ్మట దేవుడు ఆ జనాంగమును తిరిగి కొనెను. గవర్నరయిన జెరుబ్బాబెలు నాయకత్వముక్రింద, సహజ ఇశ్రాయేలీయుల శేషము వారి దేశమునకు తిరిగివచ్చెను. బబులోనును కూల్చివేసిన, మాదీయుల పారసీకుల పాలకులు తిరిగివచ్చుచున్న బంధీలకు కావలసిన సరకులనిచ్చి సహాయము చేసిరి. ఈ సంఘటనలను యెషయా గ్రంథము ప్రవచించినది. (యెషయా 1:1-9; 3:1-26; 14:1-5; 44:21-28; 47:1-4) ఆ తిరిగివచ్చుటను గూర్చిన చరిత్రాత్మక వివరములను ఎజ్రా మనకు ఇచ్చుచున్నాడు.—ఎజ్రా 1:1-11; 2:1, 2.
19. ఇశ్రాయేలీయులు తిరిగివచ్చుట విషయంలో, పరదేశులు ఇమిడియుందురనుటకు ఏ ప్రవచనార్థక సూచన కలదు?
19 ఇంకనూ, దేవుని ప్రజలను తిరిగికొనుటను మరియు తిరిగివచ్చుటను ముందుగానే చెప్పుటలో, యెషయా పులకరింపజేయు ఈ ప్రవచనము చెప్పెను: “జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు” (యెషయా 59:20; 60:3) సొలొమోను ప్రార్థన కనుగుణ్యముగా, ఆయావ్యక్తులైన ఆ పరదేశులకంటే ఎక్కువమంది ఆహ్వానింపబడుదురని దాని భావము. వీరి స్థానములో ఒక అసాధారణమైన మార్పును యెషయా సూచించుచున్నాడు. “జనములు” ఇశ్రాయేలు కుమారులతోపాటు సేవించుదురు: “అన్యులు నీ ప్రాకారములు కట్టుదురువారి రాజులు నీకు ఉపచారము చేయుదురు; ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాడు.”—యెషయా 60:10.
20, 21. (ఎ) చెరనుండి ఇశ్రాయేలీయులు తిరిగివచ్చుటకు ఏ సమాంతరమును మనము ఆధునిక కాలములలో కనుగొందుము? (బి) ఆ తర్వాత ఆత్మీయ ఇశ్రాయేలుకు ‘కుమారులు, కుమార్తెలు’ ఎట్లు చేర్చబడిరి?
20 అనేక విషయములలో, ఇశ్రాయేలీయులు చెరకు పోవుట మరియు తిరిగివచ్చుట ఆధునిక కాలముల ఆత్మీయ ఇశ్రాయేలుకు సమాంతరమును కలిగియున్నది. మొదటి ప్రపంచ యుద్ధమునకు ముందు, అభిషక్త క్రైస్తవుల శేషము సంపూర్ణముగా దేవుని చిత్తానుసారముగా లేకుండిరి; క్రీస్తుమత సామ్రాజ్య చర్చీల అభిప్రాయములను, అభ్యాసములను కొన్నింటిని వారు హత్తుకొనియుండిరి. ఆ పిమ్మట, యుద్ధోన్మాద కాలమున మరియు పాక్షికంగా మతనాయకుల దుష్ప్రేరణతో, శేషించిన ఆత్మీయ ఇశ్రాయేలునందు నాయకత్వము తీసుకొనుచున్నవారు అన్యాయముగా చెరసాలలో వేయబడ్డారు. యుద్ధము ముగిసిన తర్వాత, సా.శ. 1919లో అక్షరార్థ చెరలోనున్న ఆ అభిషక్తులు విడుదలచేయబడి నిర్దోషులుగా తీర్చబడిరి. ఇది ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమగు మహాబబులోను చెరనుండి దేవుని ప్రజలు విడుదల చేయబడిరని రుజువుచేసినది. ఆయన ప్రజలు ఆత్మీయ పరదైసును కట్టి దానిని స్వతంత్రించుకొనుటకై బయలువెళ్లిరి.—యెషయా 35:1-7; 65:13, 14.
21 ఇది యెషయా వర్ణించిన దానియందు సూచించబడెను: “వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనములు ఐశ్వర్యము నీయొద్దకు వచ్చును.” (యెషయా 60:4, 5) తర్వాతి దశాబ్దములలో, ఆత్మీయ ఇశ్రాయేలునందలి చివరి స్థానాలను భర్తీచేయుటకు ఆత్మచే అభిషక్తము చేయబడుచు, ‘కుమారులు కుమార్తెలు’ వచ్చుటకు ఆరంభించబడిరి.
22. ఆత్మీయ ఇశ్రాయేలుతో కలిసి పనిచేయుటకు “పరదేశులు” ఎట్లు వచ్చిరి?
22 ‘నీ ప్రాకారములను కట్టు అన్యులు’ ఎవరు? ఇది కూడా మన కాలములో జరిగినది. 1,44,000 మందిని పిలుచుట పూర్తికావస్తుండగా, ఆత్మీయ ఇశ్రాయేలుతో కలిసి ఆరాధించుటకు ప్రతిజనములోని గొప్పసమూహము సమకూడుటకు ఆరంభమాయెను. ఈ క్రొత్తవారు పరదైసు భూమిలో నిత్యము జీవించు బైబిలుపై ఆధారపడిన ఉత్తరాపేక్షను కలిగియున్నారు. వారి నమ్మకమైన సేవకు ఎట్టకేలకు వారికి లభించు స్థానము వేరైననూ, వారు రాజ్యసువార్తను ప్రకటించుటలో అభిషక్తుల శేషమునకు సహాయము చేయుటలో ఆనందించిరి.—మత్తయి 24:14.
23. “పరదేశులు” అభిషక్తులకు ఎంతమేరకు సహాయముచేశారు?
23 ఈనాడు “పరదేశులుగా” ఉన్న 40,00,000 మంది, ‘పరలోకములో తమ పౌరసత్వమును’ కలిగియున్న శేషముతో కలిసి, యెహోవా యెడల తమ భక్తిని నిరూపించుకొనుచున్నారు. వారిలోని అనేకులు స్త్రీలేమి, పురుషులేమి, వృద్ధులేమి, యౌవనులేమి పయినీర్లుగా పూర్తికాల సేవ చేయుచున్నారు. 66,000లకు పైగాగల అనేక సంఘములలో అలాంటి పరదేశులు పెద్దలుగా మరియు పరిచారకులుగా బాధ్యతలు నిర్వహించుచున్నారు. “అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు” అనిచెప్పిన యెషయా మాటల నెరవేర్పును చూస్తూ, శేషించిన వారు దీనియందు ఆనందించుచున్నారు.—యెషయా 61:5.
24. గతములో ఇశ్రాయేలీయులతో మరియు ఇతరులతో దేవుని వ్యవహారముల ద్వారా మనమెందుకు ప్రోత్సహింపబడగలము?
24 కావున నీవు భూమిపైనున్న ఏ దేశ పౌరుడవైననూ, వలసవచ్చిన వాడవైననూ, లేక శరణార్థివైననూ, సర్వశక్తిగలవాడు హృదయపూర్వకముగా ఆహ్వానించుచున్న ఆత్మీయ పరదేశిగా తయారగు మహాగొప్ప అవకాశమును నీవు కలిగియున్నావు. ప్రస్తుతమందు మరియు నిరంతర భవిష్యత్తునందు ఆయన సేవలో ఆధిక్యతలు అనుభవించు సాధ్యత ఆయన ఆహ్వానమందు చేరియున్నది. (w92 4/15)
[అధస్సూచీలు]
a “Alien resident,” “settler,” “stranger,” “foreigner,” అను పదాల తారతమ్యమును చూచుటకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్, ఇన్‌కార్పొ., వారు ప్రచురించిన ఇన్సైట్ ఆన్ ది స్క్రిప్చర్స్, సంపుటి 1, పుటలు 72-5, 849-51 చూడుము.
b యెహోవాసాక్షులు 1991లో ఆచరించిన సాంవత్సరిక ప్రభువు రాత్రి భోజన ఆచరణకు 1,06,00,000 మందికిపైగా హాజరైరి, అయితే అందు కేవలము 8,850 మంది మాత్రమే తాము శేషించిన ఆత్మీయ ఇశ్రాయేలీయులమని చెప్పుకొనిరి.
మీరు వీటిని గుర్తుంచుకొన్నారా?
◻ సమస్త జనాంగముల ప్రజలు తనకు అంగీకృతులేనని దేవుడెట్లు ఒక నిరీక్షణను అందించెను?
◻ దేవుని ప్రత్యేక ప్రజలైన ఇశ్రాయేలీయులే కాకుండా ఇతరులును, ఆయనను సమీపించవచ్చునని ఏది చూపుచున్నది?
◻ పరదేశులు ఇశ్రాయేలీయులతో చేరుదురని ప్రవచనమందు, దేవుడు ఎట్లు సూచించెను?
◻ ఇశ్రాయేలీయులు బబులోను చెరనుండి తిరిగివచ్చుటను ఏది సమాంతర పరచుచున్నది, మరియు “పరదేశులు” ఎట్లు ఇమిడియున్న వారైరి?
[23వ పేజీలోని చిత్రాలు]
యెహోవాను ఆరాధింపవచ్చు పరదేశులనుగూర్చి రాజైన సొలొమోను ప్రార్థించెను