కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 7/1 పేజీలు 4-6
  • నీవు ప్రార్థించునప్పుడు దేవుడు ఆలకించునా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీవు ప్రార్థించునప్పుడు దేవుడు ఆలకించునా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆలకింపబడిన ప్రార్థనలు
  • ప్రార్థనలకు ప్రత్యుత్తరములు
  • దేవుడు ఆలకించునని నమ్మకము కలిగియుండుము
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • పరిచయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ప్రార్థనలు—వాటికి యెహోవా ఎలా జవాబిస్తాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ప్రార్థన చేయడం ఏమైనా మంచిని చేకూర్చగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 7/1 పేజీలు 4-6

నీవు ప్రార్థించునప్పుడు దేవుడు ఆలకించునా?

ఒక విషయమును ఎవరికైనా అప్పగించాలా లేక వ్యక్తిగతముగా దానిని చేపట్టాలా అనుదానిని ముఖ్య పాలనాధికారి నిర్ణయించును. అదేవిధంగా, ఏ విషయమందైనను తానెంతమేరకు వ్యక్తిగతముగా ఇమిడియుండాలి అనేదానిని నిర్ణయించు ఎంపికను విశ్వ సార్వభౌమ పరిపాలకుడు కలిగియున్నాడు. మన ప్రార్థనలలో దేవుడు వ్యక్తిగతముగా ఇమిడియుండుటకు ఎంపిక చేసికున్నాడనియు అందువలన మనమాయనకు ప్రార్థించాలని నిర్దేశించుచున్నాడనియు లేఖనములు మనకు బోధించుచున్నవి.—కీర్తన 66:19; 69:13.

ఈ విషయమందలి దేవుని ఎంపిక తన మానవ సేవకుల ప్రార్థనలయందు ఆయనకున్న వ్యక్తిగత శ్రద్ధను బయల్పరచుచున్నది. ప్రతి విధమైన తలంపు మరియు చింతతో తన ప్రజలు తనను సమీపించుటను నిరుత్సాహపరచే బదులు, ఆయన వారికిట్లు ఉద్బోధించుచున్నాడు: “యెడతెగక ప్రార్థనచేయుడి,” “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి,” “నీ భారము యెహోవామీద మోపుము,” “మీ చింత యావత్తు ఆయన [దేవుని] మీద వేయుడి.”—1 థెస్సలొనీకయులు 5:15; రోమీయులు 12:12; కీర్తన 55:22; 1 పేతురు 5:7.

తన సేవకుల ప్రార్థనలకు దేవుడు ధ్యానమివ్వ నిచ్ఛయించనట్లయిన, తనను దరిచేరు అటువంటి ఏర్పాటును ఆయన ఎన్నడును చేసియుండేవాడు కాదు, దానిని నిరాటంకముగా ఉపయోగించుటకు ప్రోత్సహించి యుండేవాడు కాదు. కాబట్టి, తన ప్రజలు తనను సమీపించుటకు దేవుడు ఎంపికచేసికొనిన ఈ ఏర్పాటు, ఆయన నిజముగా ఆలకించునని నమ్ముటకు ఒక కారణమై యున్నది. అవును, తన ప్రతి సేవకుని ప్రార్థనలను ఆయన లక్ష్యపెట్టును.

దేవుడు ప్రార్థనలను ఆలకించునని సరళముగా బైబిలు చెప్పుచున్న వాస్తవమును మనము ఉపేక్షించలేము. ఉదాహరణకు, అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాయుచున్నాడు: “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.” (1 యోహాను 5:14) రాజైన దావీదు యెహోవా దేవుని ‘ప్రార్థన ఆలకించువాడు’ అని సూచించి, నమ్మకముతో ఇట్లు నొక్కిచెప్పెను: “ఆయన నా ప్రార్థన నాలకించును.”—కీర్తన 55:17; 65:2.

ప్రార్థించుట నిస్సందేహముగా దానియందదే ప్రయోజనములను కలిగియున్నను, నీతిమంతుడు ప్రార్థించునప్పుడు దానియందు ఇంకెంతో ఎక్కువ ఇమిడియున్నదని లేఖనములు చూపించుచున్నవి. ఎవరో ఒకరు ఆలకిస్తున్నారు. అలా ఆలకించునది దేవుడే.—యాకోబు 5:16-18.

ఆలకింపబడిన ప్రార్థనలు

వాస్తవముగా దేవుడు ఆలకించి ప్రత్యుత్తరమిచ్చిన ప్రజల ప్రార్థనలను గూర్చి బైబిలు చెప్పు వృత్తాంతములు విస్తారముగా ఉన్నవి. ప్రార్థనా ప్రయోజనములు పరిష్కరించు చికిత్సా ప్రభావముకంటే, ఒకని తలంపులను వ్యక్తపరచుటకంటే ఎక్కువ దూరము వెళ్లునని వారి అనుభవములు స్పష్టముగా స్థిరపరచుచున్నవి. అవి ప్రార్థనల కనుగుణ్యముగా ఒకవ్యక్తి చేయు వ్యక్తిగత కృషికంటే ఎక్కువగా ఉండును.

ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజరికమును అక్రమంగా చేజిక్కించుకొనవలెనని అబ్షాలోము పన్నిన కుట్ర తెలిసినప్పుడు, రాజైన దావీదు ఇలా ప్రార్థించాడు: “యెహోవా అహీతోపెలుయొక్క [అబ్షాలోము సలహాదారు] ఆలోచనను చెడగొట్టుము.” అది చిన్న విన్నపమేమి కాదు, ఏలయనగా “అహీతోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవునియొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్లుగా ఉండెను.” రాజైన దావీదును పడద్రోయుటకు అహీతోపెలు సూచించిన యుద్ధతంత్రమును అబ్షాలోము ఆ తర్వాత త్రోసిపుచ్చెను. ఎందుకు? “యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించి యుండెను.” ఇక్కడ విషయమేమంటే, దావీదు ప్రార్థన ఆలకింపబడెను.—2 సమూయేలు 15:31; 16:23; 17:14.

అదేప్రకారము, తన మరణకరమైన రోగమునుండి తనకు విముక్తిని ప్రసాదించుమని హిజ్కియా ప్రార్థించిన తర్వాత, ఆయన బాగుపడెను. ప్రార్థన చేసినందున హిజ్కియాకు కలిగిన మానసిక ప్రయోజనముల వలన మాత్రమే ఆయన రోగవిముక్తుడాయెనా? అట్లెంత మాత్రము కాదు! యెషయా ప్రవక్తద్వారా, యెహోవా అందించిన వర్తమానమేమై యుండెననగా: “నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను.”—2 రాజులు 20:1-6.

తను అపేక్షించియుండిన దానికంటె ఆలస్యముగా ప్రార్థనకు ప్రత్యుత్తరము లభించిన దానియేలుకు యెహోవా దూత ఇట్లు అభయమిచ్చెను: “నీవు చెప్పిన మాటలు వినబడినవి.” కేవలము మానవ సామర్థ్యమును మాత్రమే ప్రస్తుతించలేని విధములుగా హన్నా, యేసు శిష్యులు, సైన్యాధిపతియగు కొర్నేలీవంటి ఇతరుల ప్రార్థనలకు ప్రత్యుత్తరమివ్వబడెను. కాబట్టి, దైవ చిత్తానుసారముగా చేయు ప్రార్థనలు ఆలకింపబడునని, దేవుడు వాటికి ప్రత్యుత్తరమిచ్చునని బైబిలు స్పష్టముగా బోధించుచున్నది.—దానియేలు 10:2-14; 1 సమూయేలు 1:1-20; అపొ. కార్యములు 10:1-7.

అయితే ఈనాడు తన నమ్మకమైన సేవకుల ప్రార్థనలకు దేవుడు ఎట్లు ప్రత్యుత్తరమిచ్చును?

ప్రార్థనలకు ప్రత్యుత్తరములు

పైన ప్రస్తావించబడిన ప్రార్థనలు నాటకీయంగా, అద్భుతరీతిలో ప్రత్యుత్తరమివ్వబడెను. కానీ బైబిలు కాలములలో సహితము, ప్రార్థనలకు తరచు లభించిన అనేక ప్రత్యుత్తరములు సులభముగా గ్రహించగలవిగా లేకుండెనని దయచేసి మనస్సునందుంచుకొనుము. ఎందుకనగా అవి నైతిక బలమును, అవగాహనను చేకూర్చుటకు, దేవుని సేవకులు నీతి విధానమునకు హత్తుకొనియుండుటకు సంబంధించినవై యుండెను. ప్రత్యేకముగా క్రైస్తవుల విషయములో, ప్రార్థనలకు వచ్చే ప్రత్యుత్తరములు అత్యద్భుతకరమైన లేక శక్తివంతమైన కార్యములు గాక, ముఖ్యముగా ఆత్మీయ విషయములతో చేర్చబడియుండెను.—కొలొస్సయులు 1:9.

కాబట్టి అన్ని సమయాలలో నీవు అపేక్షించిన విధంగా లేక కోరిన విధంగా నీ ప్రార్థనలకు ప్రత్యుత్తరము లభించనట్లయిన నిరుత్సాహపడకుము. ఉదాహరణకు, ఒకానొక పరీక్షను నీనుండి తొలగించుటకు బదులు, దానిని సహించుటకు దేవుడు నీకు ‘అసాధారణమైన శక్తినిచ్చుటకు’ ఎంపిక చేసికొనియుండవచ్చును. (2 కొరింథీయులు 4:7; 2 తిమోతి 4:17) మనమెన్నటికిని అటువంటి ప్రార్థనా విలువను తక్కువచేయకూడదు, లేక యెహోవా మన ప్రార్థనకు అసలు ప్రత్యుత్తరమివ్వనే లేదను నిర్ణయానికి రాకూడదు.

ఎవరిదో ఎందుకు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విషయమే ఆలోచించండి. దైవదూషకుడను పేరున మరణించకూడదను చింతతో, యేసు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము.” దేవుడు కృపతో ఈ ప్రార్థనను విన్నాడా? అవును, హెబ్రీయులు 5:7లో వ్రాయబడినట్లు ఆయన దానిని విన్నాడు. హింసాకొయ్యపై చనిపోనవసరము లేకుండా యెహోవా తన కుమారుని విడిపించలేదు. బదులుగా, “పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.”—లూకా 22:42, 43.

అది నాటకీయమైన, అద్భుతకరమైన ప్రత్యుత్తరమా? మనలో ఎవరికైనను, అది అట్లేవుండును. అయితే అటువంటి శక్తికి మూలమైన యెహోవా దేవునికి, ఇది ఎంతమాత్రము అద్భుతము కాదు. ఆలాగే యేసు తన గతమందలి పరలోకపు జీవితములో, దూతలు మానవులకు ప్రత్యక్షమగు పాత సందర్భములతో పరిచయము కలిగియుండెను. కావున ఒక దూత ప్రత్యక్షమగుట వలన మనమీద ఉండు నాటకీయ ప్రభావము ఆలాగే ఆయనమీద ఉండదు. అయినను, తన మానవపూర్వ ఉనికియందు యేసు వ్యక్తిగతముగా ఎరిగియున్న ఈ దూత, ముందున్న పరీక్షను ఎదుర్కొనుటకు ఆయనను బలపరచుటకు సహాయము చేసెను.

ఈనాడు తన నమ్మకమైన సేవకుల ప్రార్థనలకు ప్రత్యుత్తరమిచ్చుటలో యెహోవా తరచు సహించుటకు కావలసిన బలమును దయచేయును. ఈ మద్దతు మనము వ్యక్తిగతముగా సహవాసము చేయుచున్న తోటి ఆరాధికులనుండి వచ్చు ప్రోత్సాహము రూపమున ఉండవచ్చును. మనకు కలిగిన పరీక్షలవంటి పరీక్షలను మనతోటి ఆరాధికులు అనుభవించలేదు గనుక, వారు మనలను బలపరచు స్థానములో లేరని బహుశః తలంచుచు, మనలో ఎవరైనను ఆ ప్రోత్సాహమును తిరస్కరించుదుమా? తనకు ప్రత్యక్షమైన దూత విషయములో యేసు అదే దృష్టిని కలిగియుండవచ్చును. కానీ ఆయన దానిని తన ప్రార్థనకు యెహోవా ఇచ్చిన ప్రత్యుత్తరముగా అంగీకరించాడు. కావుననే ఆయన నమ్మకముగా తన తండ్రి చిత్తమును నెరవేర్చ గలిగెను. మనముకూడా మన ప్రార్థనలకు దేవుడిచ్చు బలమును అనుగ్రహపూర్ణముగా అంగీకరించుటకు ఇచ్ఛయించెదము. ఓపికతో సహించిన అటువంటి సమయముల తరువాత, తరచు చెప్పనలవికాని ఆశీర్వాదములు లభించుననికూడా గుర్తుంచుకొనుము.—ప్రసంగి 11:6; యాకోబు 5:11.

దేవుడు ఆలకించునని నమ్మకము కలిగియుండుము

వెంటనే నీకు ప్రత్యుత్తరము లభించనట్లయిన ప్రార్థనా ప్రభావమందలి నీ నమ్మకమును ఎన్నడును పోగొట్టుకొనకుము. కృంగుదలనుండి వ్యక్తిగత ఉపశమనం పొందుటకు లేక దేవునికి ఒకడుచేయు సేవలో బాధ్యత పెరుగుట కొరకు చేయునటువంటి కొన్ని ప్రార్థనల ప్రత్యుత్తరం కొరకు, అది సరియని మరియు శ్రేష్ఠమని దేవుడెరిగిన సమయము కొరకు వేచియుండవలసి యుండును. (లూకా 18:7, 8; 1 పేతురు 5:6) లోతైన వ్యక్తిగత విషయమై నీవు ప్రార్థించుచున్నట్లయిన, నీ కోరిక ప్రబలమైనదని, నీ ఉద్దేశము స్వచ్ఛమైనదని, శుద్ధమైనదని నీ పట్టుదలద్వారా దేవునికి చూపించుము. దేవదూతతో కొంత తడవు తీక్షణముగా పెనుగులాడినప్పుడును, ఆ తరువాతను యాకోబు ఈ ఆత్మను కనబరచెను, ఆయనిట్లనెను: “నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యను.” (ఆదికాండము 32:24-32) మనము ఎడతెగక అడిగితిమేని, తగిన సమయమున ఆశీర్వదించబడుదుమని మనమూ అటువంటి నమ్మకమునే కలిగియుండవలెను.—లూకా 11:9.

చివరిగా మరొక్క విషయము. విశ్వ సార్వభౌమునినుండి ప్రత్యుత్తరముపొందుట ఒక అమూల్యమైన ఆధిక్యతయై యున్నది. దీని దృష్ట్యా, యెహోవా దేవుడు తన వాక్యముద్వారా, తన ఆజ్ఞలనుగూర్చి మనతో మాట్లాడునప్పుడు మనము జాగ్రత్తగా వింటున్నామా? మన ప్రార్థనలు, మనలను మన సృష్టికర్తతో మరింత సన్నిహితులను చేయును గనుక, ఆయన మనతో చెప్పు ప్రతిదానికి ఎక్కువ శ్రద్ధనిచ్చుటకు మనము కోరుకొందము. (w92 4/15)

[6వ పేజీలోని చిత్రాలు]

దేవుడు ప్రార్థనను ఆలకించును. మరి మనము తన వాక్యముద్వారా ఆయనచెప్పు దానిని వింటున్నామా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి