మన పిల్లలలో క్రైస్తవ వ్యక్తిత్వములను నిర్మించుట
వాండా తల్లి, తన భర్త తనను విడిచి వెళ్లిననూ, తన కూతురిలో క్రైస్తవ గుణములను నిర్మించుటకు కష్టపడి పనిచేసింది. వాండాకు 12 ఏళ్లున్నప్పుడు, ఈ శిక్షణ పరీక్షించబడింది. ఆ సమయంలో వాండా తన తమ్ముడు చెల్లితో కలిసి, కొంతకాలము తన తండ్రితో జీవించవలసి వచ్చింది. ఆమె తండ్రి విశ్వాసి కాడు, కావున తన తల్లి ఆమెను గమనించుటకు దగ్గరలో లేనప్పుడు వాండా ఎట్లు ప్రవర్తిస్తుంది?
క్రైస్తవ తలిదండ్రులందరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొనవలసిన ఒక పరిస్థితి ఏదనగా పిల్లలు తమకుతాము నిర్ణయములు చేయవలసిన సమయము, అది వారి విశ్వాసమును పరీక్షిస్తుంది. వాండా వలె, వారు తమ క్రైస్తవ తలిదండ్రులనుండి వేరుపరచ బడవచ్చును. వారు పాఠశాలలో తమ ఈడువారి నుండి తప్పుచేయుటకు వత్తిడిని ఎదుర్కొన వచ్చును. లేక వారు బలమైన శోధనలను ఎదుర్కొనవచ్చును. క్రైస్తవ తలిదండ్రులు ఆశించేది, ప్రార్థించేది ఏమంటే ఆ సమయము వచ్చినప్పుడు, వారి పిల్లలు ఆ పరీక్షను ఎదుర్కొనుటకు తగిన బలముగల క్రైస్తవ వ్యక్తిత్వములను కలిగియుండాలని.
క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలలో దృఢమైన క్రైస్తవ గుణములను ఎట్లు నిర్మించగలరు? వాండాకు ఏమి జరిగిందో తెలిసికొనుటకు ముందు, ఆ ప్రశ్నకు జవాబునిచ్చుటలో బైబిలు ఎట్లు సహాయము చేస్తుందో చూద్దాం. ఆ జవాబు అపొస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవులకు వ్రాసిన ఈ మాటలలో ఉంది: “వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైననూ ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దాని తేట పరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.”—1 కొరింథీయులు 3:11-13.
ఆ పునాది
పౌలు ఆ మాటలనెందుకు వ్రాసెను? ఆయన కొరింథులో క్రైస్తవ వ్యక్తిత్వములను నిర్మించు కార్మక్రమమును ప్రారంభించెను, కానీ ఆ కార్యక్రమము సమస్యలలో పడింది. పౌలుయొక్క నిర్మాణ కార్యక్రమము తన శారీరక పిల్లలకు సంబంధించింది కాదు. తన ప్రకటించు పనివలన క్రైస్తవులుగా మారిన వారికి సంబంధించినది. కానీ ఆయన వారిని తన ఆత్మీయ సంతానముగా భావించాడు, కావున ఆయన చెప్పునది క్రైస్తవ తలిదండ్రులకు కూడా విలువైనది.—1 కొరింథీయులు 4:15.
పౌలు కొరింథుకు కొంతకాలము ముందు వచ్చి అక్కడొక క్రైస్తవ సంఘమును స్థాపించాడు. అతని ప్రకటనకు స్పందించిన వారు తమ వ్యక్తిత్వములలో గొప్ప మార్పులు చేసికున్నారు. కొందరు ముందు అనైతిక వ్యక్తులు, దొంగలు, విగ్రహారాధికులు, మరియు త్రాగుబోతులై యుండిరి. (1 కొరింథీయులు 6:9-11) అయితే వారు క్రైస్తవ ఆలోచనా విధానమునకు మార్పు చేసికొనగలిగిరి, ఎందుకనగా పౌలు ఒక మంచి పునాదిని వేసెనని చెప్పవచ్చును. ఆ పునాది ఏమైయున్నది? “వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే.”—1 కొరింథీయులు 3:11.
కొరింథులోని ఈ క్రొత్త విశ్వాసులకు బోధించునప్పుడు పౌలు ఈ పునాదిని ఎట్లు వేసెను? ఆయన మనకు చెప్పుచున్నాడు: “సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతోను గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన (హింసాకొయ్యపై వ్రేలాడదీయబడిన NW) యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.” (1 కొరింథీయులు 2:1, 2; అపొ. కార్యములు 18:5) ఆయన తనవైపు అవధానమును మళ్లించుకొనలేదు లేక మేధస్సుకు సంబంధించిన బాహ్యమైన ఆకర్షణనిచ్చుటకు సత్యమును సవరించలేదు. దానికి బదులుగా, ఆయన యేసుక్రీస్తు వైపు మరియు దేవుడు ఈయనను వాడిన విధానముపై అవధానమును మళ్లించెను.
వాస్తవముగా, యేసు క్రైస్తవ నిర్మాణమునకు వైభవోపేతముగా దృఢమైన పునాదియైయున్నాడు. ఆయన విమోచన క్రయధన బలిని అందించాడు. ఆయనిప్పుడు పరలోకంలో రాజుగా ఏలుతున్నాడు మరియు త్వరలో హార్మెగిద్దోనునందు దేవుని శత్రువులను నాశనము చేయనున్నాడు. అటు తరువాత ఆయన దేవుని నీతిని వెయ్యి-సంవత్సరముల పాలనలో స్థాపించును, మరియు దేవుని ప్రధాన యాజకునిగా, ఆయన మానవజాతిని క్రమక్రమంగా పరిపూర్ణతకు తీసికెళ్లును. ఒకడు దానికి మించిన పునాదిని కోరగలడా?
కావున, మన పిల్లలలో క్రైస్తవ వ్యక్తిత్వములను నిర్మించుటలో, పౌలును అనుకరించుట మంచిది మరియు వారు ఈ ప్రాముఖ్యమైన వాస్తవములను గుణగ్రహించునట్లు నిశ్చయపడవలెను. యేసు ఇంతవరకు చేసిన దానిని మరియు ఇంకను చేయనున్న వాటిని బట్టి బాల్యదశ నుండే, వారు యేసును ప్రేమించుటకు నేర్పించవలెను.—1 పేతురు 1:8.
ఆ కట్టుట
అయితే, పౌలు ఈ మంచి పునాదిని వేసినను, ఆ కట్టడము కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నది. (1 కొరింథీయులు 3:10) ఆ సమస్య ఈనాడు అనేకమంది తలిదండ్రులు ఎదుర్కొనేదానికి భిన్నముగా లేదు. వారు తమ పిల్లలను క్రైస్తవ విశ్వాసములో పెంచి, పిల్లలు సత్యమంటే ఏమిటో అర్థంచేసికున్నారని నిశ్చయంగా భావిస్తారు. కానీ వారు పెద్దవారైనప్పుడు, పిల్లలు విశ్వాసమును విడిచివెళ్లుదురు లేక తిరస్కరించుదురు. అలాగెందుకు? తరచుగా కట్టడానికి వాడిన సామగ్రిని బట్టి అలా జరుగుతుంది.
విలువైన సామగ్రితో వ్యక్తిత్వములను కట్టవచ్చునని పౌలు చెప్పాడు: బంగారము, వెండి, వెలగల రాళ్లు. లేక అవి చౌక సామగ్రితో కూడా కట్టవచ్చును: కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు. (1 కొరింథీయులు 3:12) అయితే, కట్టువాడు బంగారము, వెండి, మరియు వెలగల రాళ్లు, వాడినట్లయితే అతడు మేలైన కట్టడాన్ని, ఒక విశిష్ఠమైన విలువగలదాన్ని నిర్మిస్తుండవచ్చు. అయితే అతడు కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు వాడినట్లయితే అతడు కేవలము పని నడిపించే, తాత్కాలికమైన, చౌకబారు కట్టడాన్ని కట్టును.
కొరింథులో దుర్భలమైన అత్మీయ సామగ్రి వాడబడినట్లు కనబడుతుంది. పౌలు వేసిన పునాదిపై కట్టువారు బలమైన, కొనసాగగల కట్టడములను నిర్మించక, చౌకబారుగా కట్టుచుండిరి. వారు మనుష్యులవైపు చూడనారంభించిరి, కావున వారిలో, అనైక్యం, అసూయ, మరియు కలహము ఉండెను. (1 కొరింథీయులు 1:10-12; 3:1-4) దీనినెట్లు నివారించగలిగి యుండేవారు? వారు ఉన్నత-శ్రేణికి చెందిన, మన్నికగల సామగ్రిని వాడుట ద్వారా.
ఒక క్రైస్తవుని వ్యక్తిత్వానికి అవశ్యకమైన భాగమైన విలువగల లక్షణములను ఇవి సూచించుచున్నవి. ఏ ప్రత్యేక లక్షణాలు? అపొస్తలుడైన పేతురు ఒక దానిని ప్రస్తావించాడు: “సువర్ణము . . . కంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచిన”ది. (1 పేతురు 1:6, 7) సొలొమోను రాజు ఇంకా రెండింటిని చర్చించాడు: జ్ఞానము మరియు వివేచన, “వెండిని సంపాదించుకొనుటకంటె” వాటిని సంపాదించుకొనుట “మేలు.” (సామెతలు 3:13-15) మరియు దావీదు రాజు యెహోవాయందైన భయము మరియు ఆయన న్యాయవిధుల యెడల గుణగ్రహణ “బంగారు కంటెను కోరదగినవి” అని మనకు గుర్తుచేస్తున్నాడు.—కీర్తన 19:9, 10.
ఇవి మరియు ఇతర విలువైన సామగ్రిని క్రైస్తవ వ్యక్తిత్వములోనికి నిర్మించిన అవి మన పిల్లలు పరీక్షలను నెగ్గుటకు సహాయపడగలవు. అయితే, మనము ఆ సామగ్రితో కడుతున్నామని ఎట్లు నిశ్చయపరచుకొనగలము? మన స్వంత హృదయములకు మరియు మన పిల్లల హృదయములకు ధ్యానమునిచ్చుట ద్వారా.
విజయవంతమైన కట్టుడుపని
కట్టుడు పనిలో తలిదండ్రుల హృదయము కలిగియున్న పాత్రను యెహోవా ప్రాచీన ఇశ్రాయేలు దేశములోని తలిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలో చూడగలము: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.” తరువాత ఆయనింకా ఇలా చెప్పెను: “నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజే”యవలెను. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) కావున, ఇతరులను బలపరచకముందు, మనము మనలను బలపరచుకోవాలి. మనం చేయువాటి ద్వారా మరియు మాట్లాడు వాటిద్వారా మన వ్యక్తిత్వము సరైన సామగ్రితో తయారయిందని మన పిల్లలు చూడగలగాలి.—కొలొస్సయులు 3:9, 10.
తరువాత, మన ఉపదేశము వారి హృదయమును చేరవలెను. క్రైస్తవ వ్యక్తిత్వములను విజయవంతముగా కట్టిన వానిగా, యేసు, దృష్టాంతములు మరియు ప్రశ్నల ద్వారా హృదయములను చేరుకున్నాడు. (మత్తయి 17:24-27; మార్కు 13:34) ఇవే బోధనా పద్ధతులు చాలా ఫలవంతమైనవని తలిదండ్రులు తెలిసికొందురు. క్రైస్తవ సత్యములు తమపిల్లల హృదయములను ఆకట్టుకొనునట్లు చేయుటకు వారు దృష్టాంతములను వాడుదురు, మరియు వారు ఆలోచనతో కూడిన ప్రశ్నల ద్వారా వారి ఎదిగిన పిల్లలు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో, వారి హృదయాల్లో ఎలా తర్కిస్తున్నారో వివేచించుదురు.—సామెతలు 20:5.
నమ్మకముగా ఉండు కోరికను ఇశ్రాయేలీయులలో నిర్మించుటకు మోషే ప్రయత్నించుచు ఇట్లు చెప్పెను: “నీ మేలుకొరకు . . . నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొ”నుము. (ద్వితీయోపదేశకాండము 10:13) అదేవిధంగా, తలిదండ్రులు దేవుని ప్రమాణములు ఏమైయున్నవో స్పష్టముగా తమకు వివరించుటయేగాక యథార్థత, నైతిక శుభ్రత, మరియు మంచి సహవాసము ఎందుకు వారి మంచికైయున్నవని వారిని ఒప్పించినట్లయిన, బాగుగా ప్రవర్తించినవారై యుందురు.
చివరిగా, యేసు ఇట్లు చెప్పెను: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును యెరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) పిన్న వయసులోనే పిల్లలు యెహోవాను వ్యక్తిగతంగా ఎరిగి, ఆయనతో తమ సమస్యలను గూర్చి మాట్లాడుటకు నేర్చుకొని, వారి ప్రార్థనలకు ఆయన ప్రత్యుత్తరమిచ్చుటను వారు అనుభవించినప్పుడు, వారు క్రైస్తవ వ్యక్తిత్వంలో అతి ప్రాధాన్యమైన భాగమును పెంపొందించుకుందురు: అదేమనగా వారి సృష్టికర్తతో ఒక వ్యక్తిగతమైన సంబంధమే.
అగ్ని
పౌలు తెలిసికొనినదేమనగా కొరింథులో కట్టుపని సరిగా జరిగించనప్పుడు, శాఖాభిమానము మరియు భిన్నాభిప్రాయము వంటి లౌకికమైన లక్షణములు వేరు పారినవి. ఇది ప్రమాదకరమైనది ఎందుకనగా, ఆయనిట్లు వివరించెను, “వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.”—1 కొరింథీయులు 3:13
అగ్ని ఏమైయున్నది? అది ఒక క్రైస్తవునిపై సాతాను తెచ్చే ఏ పరీక్షయైనా కావచ్చును. అది తోటి వారినుండి వచ్చు వత్తిడి కావచ్చును, శారీరక శోధన, వస్తుసంబంధమైన ఆశ, హింస, బలహీనపరచు ప్రభావముగల సందేహములు కావచ్చును. అటువంటి పరీక్షలు నిశ్చయముగా వచ్చును. “వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును.” వివేకము గల తలిదండ్రులు తమ పిల్లలు పరీక్షించబడుదురను అపేక్షతో వారి వ్యక్తిత్వములను కట్టుదురు. కాని యెహోవా సహాయముతో తమ పిల్లలు పరీక్షలను ఎదుర్కొని బయటపడగలరని నమ్మకము కలిగియుందురు. తలిదండ్రులు ఈ దృక్పధమును కలిగియుంటే వారు గొప్పగా ఆశీర్వదించబడుదురు.
ప్రతిఫలమ
“పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.” (1 కొరింథీయులు 3:14) అపొస్తలుడైన పౌలు ప్రతిఫలమును పొందెను. తాను కట్టుపనిని చేసిన థెస్సలొనీకయ పట్టణములోని క్రైస్తవులకు ఆయన వ్రాసెను: “ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునైయున్నారు.”—1 థెస్సలొనీకయులు 2:19, 20.
వాండా యొక్క తల్లి ఈ ప్రతిఫలమును పొందింది. 12-సంవత్సరముల వాండా తన తల్లినుండి వేరు పరచబడినప్పుడు మొదట ఏడుస్తూ పడుకునేది. తరువాత తన సమస్యలన్నిటిని యెహోవాతో ప్రార్థనలో చర్చించుమని తన తల్లి ఇచ్చిన సలహాను గుర్తుకు తెచ్చుకుంది. ఆమె ప్రార్థనచేసింది మరియు త్వరలో టెలిఫోన్ పుస్తకములో దగ్గరలో యెహోవాసాక్షులు ఉన్నారేమో అని చూడాలనే తలంపు వచ్చింది. వారిని ఆమె కనుక్కుంది మరియు తన తండ్రి ఇంటి వీధిదగ్గరే ఒక కుటుంబము ఉందని ఆమె తెలిసికుంది. “నేను ఎంతో సంతోషించాను!” అని వాండా అన్నది.
ఈ కుటుంబము యొక్క ప్రోత్సాహముతో, వాండా తన తమ్ముడు, చెల్లి క్రైస్తవ కార్యక్రమములోనికి తిరిగివచ్చుటకు ఏర్పాటు చేసింది. “మేమందరము కూటములకు తయారగునట్లు చూచు బాధ్యత నాపైయున్నది,” అని ఆమె వివరించింది. “నేను మా బట్టలు ఉతికి, తలలు దువ్వి, మేమందరము శుభ్రముగా మరియు చూడదగిన వారముగా ఉండునట్లు చేయవలసి వచ్చింది.” ఒక అమ్మాయికి ఇది కష్టమైన పనే, కానీ ఆమె దానిని చేసింది. ఒకసారి వారి తండ్రి వారిని కూటములకు పోకుండా ఆపుటకు ప్రయత్నించాడు, కాని వారు ప్రాధేయపడినప్పుడు, ఆయన వారిని వెళ్లనిచ్చాడు.
తరువాత, పిల్లలు తమ తల్లితో తిరిగి కలిసికున్నారు. వాండా 15 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత, క్రైస్తవ బాప్తిస్మము పొందింది, అటు తరువాత మిషనరీ కావాలనే ఆశను వ్యక్తపరచింది. అవును, వాండాయొక్క తల్లి పని పరీక్షను నెగ్గింది. తన కూతురు స్వంతగా సత్యము కొరకు దృఢముగా నిలబడుటను చూచు ప్రతిఫలమును ఆనందించింది. తమ పిల్లలలో క్రైస్తవ వ్యక్తిత్వమును కట్టుటకు పని చేయుచున్న తలిదండ్రులందరు అదే విధముగా సఫలులగుదురు గాక. (w91 7/1)
[30వ పేజీలోని బాక్సు]
ఈ శీర్షిక చూపించునట్లుగా, తలిదండ్రులు వారి పిల్లలలో క్రైస్తవ వ్యక్తిత్వములను కట్టుటకు కష్టపడినను, పిల్లలుకూడా తమకుతాము బాధ్యతను కలిగియున్నారు. వారు, క్రైస్తవులందరి వలె, తమకుతాము కట్టుపనిని చేయవలెను. (ఎఫెసీయులు 4:22-24) ఈ విషయములో తలిదండ్రులకు అద్భుతమైన అవకాశము ఉన్నప్పటికి, చివరికి ప్రతి వ్యక్తి అతడు లేక ఆమె యెహోవాను సేవించుటకు స్వంత నిర్ణయము చేయాలి.