యౌవనులారా క్రైస్తవ భక్తిపూర్వక నమ్మకత్వమను పరీక్షలో మీరు ఉత్తీర్ణులగుదురా?
“అవినీతికర ప్రవర్తనను మీరు నమ్మకద్రోహముగా తలంచరు. కేవలము మీరు దానిలో ఏదోవినోదాన్ని కలిగియున్నారు. నిజమే, మీ తల్లిదండ్రులకుగాని, పెద్దలకుగాని తెలిస్తే, అది గుండెను పగులగొట్టి, అనేక సమస్యలను కలుగజేస్తుందని మీకు తెలుసు. అయితే ఆసరదాలో మునిగియున్నప్పుడు, అట్టి తలంపులన్నిటిని మీరు సులభంగా ప్రక్కకు త్రోసివేస్తారు.”
ఇప్పుడు చెప్పబడిన ఆ యువకుడు రహస్యంగా వ్యభిచారాన్ని చేస్తూ ఉండెను. అతను ద్వందజీవితాన్ని గడుపుతూ, ఒకప్రక్క తల్లిదండ్రులను, మరొకప్రక్క క్రైస్తవ సంఘాన్ని మోసగిస్తున్నాడు. ఆ సమయంలో క్రైస్తవ నమ్మకత్వం అను పరీక్షలో తాను తప్పిపోతున్నానని ఆయనకు అంత పెద్దగా తెలియదు.
వేలాదిమంది క్రైస్తవయౌవనులు అలాంటి నమ్మకత్వపు పరీక్షలో విఫలమయ్యారు. దానికి పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు! ఎందుకనగా, అపవాదియైన సాతాను దేవుని ప్రజలతో ‘యుద్ధముచేస్తూ’ వారి భక్తినికాపాడుకొను నమ్మకత్వమును పాడుచేయుటకు తాను చేయగలిగినదానినంతా చేయుచున్నాడు. (ప్రకటన 12:7) తన “కుతంత్రమైన పనులకు” ప్రత్యేకంగా యువకులను అతడు గురిగా పెట్టుకున్నాడు. (ఎఫెసీయులు 6:11, కింగ్డం ఇంటర్లీనియర్) కావున నమ్మకత్వముతో నిలబడుటకు నిజమైన కృషి మరియు తీర్మానము అవసరము.
అసలు భక్తిపూర్వకమైన నమ్మకత్వము అనగా ఏమిటి? హెబ్రీ లేఖనములలో “భక్తిపూర్వక నమ్మకత్వము” అను పదమునకు ఉపయోగించబడిన ఆదిమ భాషా పదము ఒకవ్యక్తితో ఒక ఉద్దేశ్యము నిమిత్తమై ప్రేమగల అనుబంధాన్ని ముడిపెట్టుకొనియుండుటను సూచించుచున్నది. (కీర్తన 18:25) అది సులభముగా విడిపోవు బలహీనమైనది కాక, ఆ వ్యక్తితో, అతనియెడలగల ఉద్దేశ్యము నెరవేరునంతవరకు పూర్ణముగా నిలిచియుండు అనుబంధాన్ని వర్ణించుచున్నది. గ్రీకులేఖనములలో “నమ్మకత్వము” కొరకైన ఆదిమ భాషాపదము, పరిశుద్ధత, నీతి, భక్తిపూర్వకమైన గౌరవమను భావాన్ని కలిగివున్నది.
ఆవిధముగా భక్తిపూర్వక నమ్మకత్వంలో దేవునితో కలిగియుండు సరియైన సంబంధమిమిడియున్నది. ఎఫెసీయులు 4:24 మనకు “నీతియు . . . యథార్థమైన భక్తితో” కూడిన “నవీన స్వభావమును” గూర్చి చెప్పుచున్నది. యెహోవాయెడల నీవు నమ్మకత్వము కలిగియుండుటకు ఇష్టపడుదువా? అట్లయిన, ఆయనతో నీవు తెగిపోనిబంధముతో, నీ మార్గములన్నిటియందు ఆయనను సంతోషపెట్టవలెనను తీర్మానముతో యథార్థమైన బంధాన్ని వృద్ధిచేసికొనవలెను. నిన్ను వేరుగా ప్రవర్తింపజేయుటకు శోధించు విషయమెంతటిదైనను, యెహోవాయొక్క నీతియుక్తమైన ప్రమాణములకు నీవు హత్తుకొనవలెను.
నమ్మకద్రోహులనుగా జేయుటకు వచ్చు వత్తిడులు
మెచ్చుకొనదగినరీతిలో, యెహోవాసాక్షులలోని అనేకమంది యువకులు, యథార్థపరులుగా ఉండుటకు పోరాడుతూ, తత్ఫలితంగా పవిత్రమైన మనస్సాక్షితో ఆనందిస్తున్నారు. అయినప్పటికినీ అపొస్తలుడైన పౌలు “అంత్యదినములలో” సాధారణంగా ప్రజలలో అపవిత్రత (నమ్మక ద్రోహము) ఉంటుందని ప్రవచించెను. (2 తిమోతి 3:1, 2) విషాదకరంగా, కొందరు క్రైస్తవ యువకులు నమ్మకద్రోహముతోనిండిన ఈ లోకము ‘వారిని దాని స్వంత విధానములోనికి మలుచుకొనునట్లు’ చేసుకొన్నారు. (రోమీయులు 12:2, ఫిలిప్స్) సాతాను దీనినెట్లు సాధించెను?
సాతాను ఉపయోగించు ఒక బలవర్ధకమైన సాధనము తోటివయస్కుల వత్తిడి. ఎక్కువమంది ప్రజలు ఇతరులచే బాగా తలంచబడాలని కోరుకుంటారు. ఈ సహజమైన కోరికను ఎలా వాడుకోవాలో సాతానుకు తెలుసు. కొందరు క్రైస్తవ యౌవనులు అందరివంటివారిగా దృష్టించబడాలని కోరుకుంటూ అనారోగ్యకరమైన సంభాషణలో, అవినీతికర ప్రవర్తన, పొగత్రాగుట, త్రాగుబోతుతనము, చివరకు మత్తుమందులు తీసికొనుటలో పాలుపొందారు. ఇదంతా వారి తోటివయస్కులైన స్నేహితులచే అంగీకరించబడటానికే జరిగినది.
సాతాను మనలను ‘మన శరీర ఆశలకు తగినట్లుగా ప్రవర్తించవలెనని, శరీరము కోరువాటిని మనము చేయవలెనని’ కోరుచున్నాడు. (ఎఫెసీయులు 2:3) “ఈడు వచ్చినప్పుడు” లైంగిక కోరిక ఎంత శక్తివంతంగావుంటుందో అతనికి తెలుసు. (1 కొరింథీయులు 7:36) నీవు ఆ ఆశలలో పడిపోవలెనని అతడు నిన్ను కోరుతున్నాడు. కొందరు క్రైస్తవ యువకులు, లైంగిక విషయాలతోకూడిన సాహిత్యమును చూచుట, సినిమాలు, వీడియోలు, హస్తప్రయోగమును అభ్యసించుట మొదలగువాటిని చేయుచు కోరకొనకనే వారు అతని చేతిలో ఆటబొమ్మలైరి. తరచు ఈ విషయములు వారు నమ్మకద్రోహమైన క్రియలలో పాల్గొనునట్లు వారిని నడిపించును. ఈ విషయములలో దేనితోనైనను సాతాను లోకము ‘నిన్ను దాని పద్ధతిలోకి మలుచు’ కొన్నదా?
ద్వంద జీవితమును గడుపుట
దానంతటదే గంభీరకర విషయమైన, వ్యభిచారమంతటి తీవ్రమైన చెడును చేస్తూనే, కొందరు యువకులు తమకష్టములను అధికము చేసికొందురు. కీర్తన 26:4 నందు చెప్పబడినట్లు వారు ‘అసత్యవంతమైన,’ మరియు తాము ‘ఏమైయున్నారో దానిని దాచి వుంచే’ “వేషధారులై” ఉన్నారు. అటువంటి యువకులు ద్వంద జీవితమును గడుపుచు తల్లిదండ్రులు, ఇతర పరిపక్వతగల క్రైస్తవుల మధ్య ఒకరీతిగాను, వారి తోటివయస్కులైన స్నేహితుల మధ్య మరొకరీతిగాను మెలగుచుందురు.
అయితే ద్వందజీవితమును గడుపుటనేది, అపాయకరమైనదై, తన్నుతాను మోసపుచ్చుకొనేదైయుండును. అనాలోచితంగా చేయు చెడుక్రియలు ఎల్లప్పుడు ఇంకొన్ని చెడుక్రియలకు నడుపును. మనస్సాక్షి మొదట బాధపడినను, ఒకవ్యక్తి చెడుక్రియలో ఎక్కువకాలము గడిపేకొలది, వాని మనస్సాక్షి చెడుక్రియకు స్పందించకుండకూడా తయారగును. అతడు చేయు చెడునుబట్టి అక్షరార్థముగా ‘బాధపడుటకూడ లేకపోవును.’—ఎఫెసీయులు 4:19, కింగ్డం ఇంటర్లీనియర్.
ఈ దశలో ఒకడు తన చెడుక్రియను ఒప్పుకొని, సహాయముపొందుట అత్యంత కష్టమైనసంగతిగా మారును. తప్పులో ఇతర క్రైస్తవ యువకులు ఇమిడివుంటే ప్రత్యేకముగా ఇది ఎంతో వాస్తవము. పెడత్రోవబట్టిన నమ్మకత్వభావము తరచు నెలవుచేసికొనును. ప్రారంభములో చెప్పబడిన యువకుడు ఇలా వివరించెను: “నీవు ఏమి చేస్తున్నావో నీవు గ్రహిస్తావు, అది తప్పని కూడ నీకుతెలుసు. అందులో చేరియున్న ఇతర వ్యక్తులు కష్టములో పడకుండునట్లు, దానినెవరికి చెప్పకూడదని నీవు అంగీకరిస్తావు.”
ఒక వ్యక్తి తాను ‘ఏమైయున్నాడో’ తన తల్లిదండ్రులయెదుట, సంఘముయెదుట దాచుకొనవచ్చును, గాని యెహోవాయెదుట దాచుకొనలేడు. “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియులేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” (హెబ్రీయులు 4:13) బైబిలు మనకు ఇట్లు అభయమిచ్చుచున్నది: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.” (సామెతలు 28:13) తగిన కాలములో తప్పిదము బయటపడును. యెహోవాకంటె అధికమైన జ్ఞానిగా ఒకడు చూపుకొనలేడు. సామెతలు 3:7 ఇట్లు చెప్పుచున్నది: “నేను జ్ఞానినిగదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనమును విడిచిపెట్టుము.” ఇంకను, “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.” అని కూడా గుర్తుంచుకొనుము.—సామెతలు 15:3.
ముందు ప్రస్తావించబడిన యువకుడు, అతనితోపాటు రహస్యముగా చెడుక్రియలో పాల్గొన్న అనేకమంది ఇతరులు, చివరకు బయటపడిరి. అంతేగాక తాను, తన అనుచరులు క్రైస్తవ సంఘమునుండి వెలివేయబడవలసిన స్థితివచ్చెను. తరువాత వారు ఆత్మీయముగా కోలుకొని, తిరిగి చేర్చుకొనబడిరి. అయినను, నమ్మకత్వముయొక్క భావమును వారు ఎంత కష్టమైనరీతిలో నేర్చుకొనిరి!
దేవునితో ‘విషయములను పరిష్కరించుకొనుట’
ఒకడు చెడుక్రియను జరిగించుటద్వారా ఇప్పటికే, ఏదోఒకరీతిలో నమ్మకత్వము లేనివానిగా తయారైనట్లయిన మరి ఏమి చెయ్యాలి? ఒకడు తనను తాను బుద్ధిహీనునిగా చేసికొని, విషయములను చక్కదిద్దుకొనవలసిన అవసరతను ధిక్కరించుట సులభము. రహస్యంగా వ్యభిచారములో పాల్గొనిన ఒకయువకుడు ఇలా అన్నాడు: “ఇది ఏదోఒకరకంగా నా తప్పిదానికి పరిహారం కలుగచేస్తుందని తలంచి, నేను నా ప్రాంతీయ పరిచర్యను ఎక్కువచేశాను.” తిరుగుబాటుచేసిన ఇశ్రాయేలు జనాంగముకూడ అలాగే, వారి బలులతో యెహోవాను శాంతింప ప్రయత్నించారు. కానీ యెహోవా అలాంటి వేషధారణకరమైన భక్తిని తృణీకరించెను. ఆయనవారిని గట్టిగా ఇట్లు కోరెను: “మిమ్మును కడుగుకొనుడి, శుద్ధిచేసికొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండ వాటిని తొలగింపుడి.” వారు తమ విషయములను ఆయనతో పరిష్కరించుకొనిన తర్వాతనే యెహోవా వారి అర్పణలను అంగీకరించును. ఈనాడు కూడ చెడుక్రియలో పాల్గొనిన ఎవరి విషయములోనైనా అదే సంగతి వాస్తవము.—యెషయా 1:11, 15-18.
ఒకడు తన తోటి వయస్కుడైన స్నేహితునితో దాన్ని చెప్పుకున్నంత మాత్రమున యెహోవాతో విషయములను చక్కపరచుకొనలేడు. ఎందుకనగా తరచు తోటిజతగాండ్రుకూడ జీవితంలో, అనుభవంలో సమానంగానేవున్నారు గనుక శ్రేష్టమైన సహాయమును వారు అందించలేరు. అతిప్రాముఖ్యముగా నీ పాపమును వారు క్షమించలేరు. దేవుడు మాత్రమే దానిని చేయగలడు. కావున ఒప్పుకొనుచు, ఆయనకు “మీ హృదయమును కుమ్మరించుడి.” (కీర్తన 62:8) నీవు నీ ప్రవర్తనను గూర్చి ఎంతో సిగ్గునొందినను, యెహోవా ‘విస్తారముగా క్షమించునను అభయమును కలిగియుండుము.’—యెషయా 55:7.
నీకు అదనపు సహాయము అవసరము. “ప్రారంభములోనే, వెంటనే నీ తల్లిదండ్రులకు తెలియజేయుము, పెద్దలకు తెలియజేయుము,” అని అటువంటి సహాయముపొందిన ఒక క్రైస్తవ యువకుడు ఉద్భోదించుచున్నాడు. ఔను, నీ తల్లిదండ్రులు నీకు సహాయముచేయుటకు బహుశా మంచి స్థానములో ఉన్నారు. ‘నీ హృదయమును వారికిచ్చి’ నీ సమస్యలను పూర్తిగా వారికి తెలియజేయుము. (సామెతలు 23:26) అవసరమైనట్లయిన నీకు వారు పెద్దలనుండి ఇంకా ఎక్కువ సహాయము పొందునట్లు ఏర్పాటు చేయగలరు.—యాకోబు 5:14, 15.
నిజమైన నమ్మకత్వమును ప్రదర్శించుట—ఎట్లు?
మొట్టమొదట ఎప్పటికిని నమ్మకద్రోహమైన ప్రవర్తనలో పడకుండుటయే అత్యంత శ్రేష్టము. కీర్తన 18:25 మనకిలా చెప్పుచున్నది: “దయగలవారియెడల నీవు దయచూపించుదువు. యథార్థవంతులయెడల యథార్థవంతుడవుగా నుందువు.” యథార్థతగలిగి ఉన్నతమైన ప్రమాణములతోకూడిన ప్రవర్తనను కాపాడుకొనువారిని యెహోవా విస్తారముగా దీవించును.
అయినను, నీ యథార్థతను పరీక్షకు గురిచేయు ఇతర మార్గములు కలవు. ఉదాహరణకు, నీ స్నేహితుడొకరు, త్రోవతప్పు విధానమును ప్రారంభించాడు. పెడత్రోవ పట్టిన నమ్మకత్వమును నీ స్నేహితునియెడల చూపుతూ, యెహోవాయెడల చూపవలసిన నమ్మకత్వముకంటె దానిని ఉన్నతమైనదానిగా చేయుదువా? ప్రేమగల విషయమేమనగా ఆ స్నేహితునితో కలసి ఆ విషయమును తన తల్లిదండ్రులకు లేక పెద్దలకు తెలియజేయుమని గట్టిగా పురికొల్పవలెను. తగినంత కాలవ్యవధిలో తాను తెలియజేయకపోయిన, నీవే దాన్ని చేయవలసి వస్తుందని నీ స్నేహితునితో చెప్పుము. సామెతలు 27:5 ఇలా చెప్పుచున్నది: “లోలోపల ప్రేమించుటకంటె బహిరంగముగా గద్దించుట మేలు.” నీ స్నేహితునికి ఈ విధంగా సహాయము చేయుటద్వారా నీ స్నేహితము నిజమైనదని, యెహోవాయెడల నీవు పూర్ణమైన నమ్మకత్వమును కలిగియున్నావని ప్రదర్శించుదువు.
ఏవిధమైన పరీక్షలోనైనను నమ్మకత్వమును కనపరచగల శక్తి, యెహోవాతోగల బలమైన వ్యక్తిగత సంబంధమునుండి ఉత్పన్నమై వస్తుంది. అటువంటి సంబంధమును అనుభవించాలంటే అర్థవంతమైన ప్రార్థన, శ్రద్ధతోకూడిన వ్యక్తిగత పఠనము ముఖ్యము. ఆసక్తిదాయకంగా, తప్పుచేస్తున్నట్టు ముందు ప్రస్తావించబడిన యువకులందరు వారి ప్రార్థనలు, వ్యక్తిగత పఠన అలవాట్లు ఏదో వాడుక చొప్పున చేసేవిగా మారినవని, కొంత కాలమునకు అవి పూర్తిగాలేకుండ పోయినవని ఒప్పుకున్నారు. యెహోవా వారికి నిజమైనవానిగా ఉండకుండ పోయాడు. దానివెంటనే అపవిత్రమైన ప్రవర్తనకూడ మొదలైంది. నీవు, నమ్మకత్వముతోయుండుటకు ప్రార్థన మరియు వ్యక్తిగతపఠనము ద్వారా యెహోవాతో నీ సంబంధమును బలపరచుకొంటున్నావా?
నిజమే, కొన్నిసార్లు మంచి సమయమును కలిగియుండకుండ నేను పోగొట్టుకొంటున్నానేమోనని నీవు అనుకొనవచ్చును. “కొన్నిసార్లు లోక ప్రజలే చాలా వినోదంగా బ్రతుకుతున్నట్లు కనిపిస్తుందని” ఒక యౌవన స్త్రీ అనెను. “అయితే పరిస్థితిలో నీవు చిక్కుబడిపోయినప్పుడు అది ఎంతమాత్రము వినోదము కాదని నీవు చూడగలుగుదువు.” ఆమె లైంగిక దుర్నీతిలో పాల్గొని, గర్భము ధరించి, గర్భస్రావము చేయించుకొనిన తర్వాత అనుభవముతో మాట్లాడినది. ఇప్పుడామె “సత్యములో ఉండుట సంరక్షణకరము,” అని చెబుతుంది. కష్టమైనరీతిలో గుణపాఠం నేర్చుకొంది. కీర్తన 119:165 “దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు” అని మనకు గుర్తుచేయుచున్నది.
కావున, భక్తిపూర్వకమైన నమ్మకత్వముతో నిలబడుటకు నీ శక్తికొలది కృషిచేయుము. యెహోవాతో చిరకాలము నిలువగల సంబంధమును నిర్మించుకొనుటకు పనిచేయుము. చెడును ద్వేషించి మంచిని హత్తుకొనుము. (రోమీయులు 12:9) కీర్తన 97:10 మనకు ఇట్లు చెప్పుచున్నది: “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును ద్వేషించుడి. ఆయన తన భక్తుల ఆత్మలను కాపాడుచున్నాడు. దుష్టుల చేతిలోనుండి ఆయనవారిని విడిపించును.” ఔను, ఒక క్రైస్తవ యౌవనునిగా, యెహోవా సంరక్షణనుండి నీవు మేలుపొంది, క్రైస్తవ నమ్మకత్వమను పరీక్షలో ఉత్తీర్ణుడవైతే, నిత్యజీవమును అనుభవించెదవు. (w91 6/15)