సహాయముకొరకైన మన అత్యవసర మొరలను యెహోవా వినును
సహాయము తక్షణమే అవసరమైనది. రాజుయొక్క పానదాయకుని విచార వదనములో అది స్పష్టమాయెను. అందుకు కారణమేమని అడుగగా, పానదాయకుడు, యెరూషలేము దాని ప్రాకారముల పాడైన స్థితినిబట్టి తనకు దుఃఖము కలదని పలికెను. ‘ఏమి కావలసి మనవి చేయుచున్నావని అడుగగా, “నేను (వెంటనే NW) ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి” తిని అని ఆ పానదాయకుడైన నెహెమ్యా తరువాత వ్రాసాడు. అది యెహోవా సహాయముకొరకు తక్షణమే, మౌనముగా, అత్యవసరంగా చేసిన ప్రార్థన. దాని ఫలితము? పారసీక దేశపు రాజైన అర్తహషస్త వెంటనే యెరూషలేముయొక్క ప్రాకారములను తిరిగికట్టుటకు నెహెమ్యాకు అధికారమిచ్చెను!—నెహెమ్యా 2:1-6.
అవును, దేవుడు ఆయనను ప్రేమించువారి అత్యవసర మొరలను వినును. (కీర్తన 65:2) శోధన ఒకవేళ నీవు భరించగలిగిన దానికంటే ఎక్కువగా కనిపించినట్లయిన కీర్తన రచయితయైన దావీదు దైవిక సహాయపు తక్షణ అవసరతలోయున్నప్పుడు కీర్తన 70లో, చేసినట్లు నీవును ప్రార్థించవచ్చును. ఈ కీర్తనకు పైగా వ్రాయబడిన అంశము దాని ఉద్దేశ్యము “జ్ఞాపకార్థము” అని చూపినది. స్వల్పమార్పులతో ఇది కీర్తన 40:13-17ను పునరావృతము చేయుచున్నది. అయితే యెహోవా ప్రజలుగా 70వ కీర్తన మనకు ఎట్లు సహాయము చేయగలదు?
తక్షణ విడుదలకైన మొర
దావీదు ఈ విధమైన మొరతో ప్రారంభించెను: “దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.” (కీర్తన 70:1) బాధలో నున్నప్పుడు దేవుడు మనకు త్వరగా సహాయముచేయ వచ్చునట్లు మనము ప్రార్థించవచ్చును. యెహోవా మనలను కీడుచేత శోధింపడు. “దైవభక్తిగలిగిన ప్రజలను శోధనలోనుండి ఎట్లు విడిపింపవలెనో ఆయనకు తెలియును.” (2 పేతురు 2:9 NW; యాకోబు 1:13) అయితే ఒకవేళ ఆయన బహుశ మనకు దేనినైనా బోధించుటకై, శోధనను అలాగే కొనసాగుటకు అనుమతించిన అప్పుడు సంగతేమి? అప్పుడు మనము దానితో వ్యవహరించుటకు తగిన జ్ఞానమునివ్వమని ప్రార్థించవచ్చును. మనము విశ్వాసముతో అడిగిన ఆయన జ్ఞానము దయచేయును. (యాకోబు 1:5-8) శోధనలను సహించుటకు అవసరమైన బలమును కూడ దేవుడు మనకు అనుగ్రహించును. ఉదాహరణకు, ‘రోగశయ్యమీద యెహోవా మనలను ఆదరించును’—కీర్తన 41:1-3; హెబ్రీయులు 10:36.
మనము స్వతంత్రించుకొనియున్న పాపముతోయున్నందునను, యెడతెగక శోధనకు గురియయ్యే స్థితిలో యున్నందునను, అలాగే యెహోవాతో మనకుగల సంబంధమును అపవాది నాశనముచేయుటకు ప్రయత్నము చేయుచున్నందునను, ఇవి మనలను దేవుని సహాయముకొరకై ప్రతి దినము ప్రార్థించునట్లు కదలించవలెను. (కీర్తన 51:1-5; రోమీయులు 5:12; 12:12) యేసుయొక్క మాదిరి ప్రార్థనలోని ఈ మాటలు ఎంతో గుర్తింపదగినవి: “మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.” (మత్తయి 6:13) ఔను, ఆయనకు అవిధేయులగునట్లు శోధింపబడునప్పుడు దానికి లోబడునట్లు అనుమతించకుమనియు, “దుష్టుడైన” సాతాను మనలను లోపరచుకొనకుండునట్లు దానిని అడ్డగించుమనియు మనము దేవుని అడగవచ్చును. అయితే విడుదల చేయుమని మనముచేయు విన్నపములతో పాటు, మనలను అనవసరముగా శోధనలకు, సాతాను ఉరులకు గురిచేయు పరిస్థితులను తొలగించుకొనుటకు తగిన చర్యలను తీసుకొనుటకూడ అవసరము.—2 కొరింథీయులు 2:11.
“ఆహా!” అని పలుకువారు
మనము అభ్యాసముచేయు విశ్వాసమునుబట్టి శత్రువులు మనలను నిందించుచున్నందున మనము ఎంతో దుఃఖకరంగా శోధించబడవచ్చును. అది నీకు సంభవిస్తున్న దావీదుయొక్క ఈ మాటలను ధ్యానించుము: “నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురు గాక. నాకు కీడుచేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురు గాక.” (కీర్తన 70:2, 3) దావీదు శత్రువులు ఆయన మరణించవలెనని చూశారు; వారు ఆయన ‘ప్రాణమును’ లేక జీవమును తీయగోరుచున్నారు. అయితే ఆయన దానికి ప్రతీకారమును చేయుటకు ప్రయత్నించే బదులు, దేవుడు వారిని అవమానమునకు గురిచేయునని విశ్వాసమును కనపరచెను. దావీదు ఆయన శత్రువులు “సిగ్గుపడి అవమానమొందుదురుగాక” అని ప్రార్థించెను. అనగా—వారు తమ దుష్టపన్నాగములను నెరవేర్చుటకు చేయు ప్రయత్నములో చిక్కుల్లో పెట్టబడి, భంగపరచబడి, కలవరముతో, విఫలులు కావలెను. అవును, ఆయనను గాయపరచ చూచువారు, ఆయన ఆపదయందు ఆనందించువారు కలవరపర్చబడి, అవమానమునొందుదురు గాక.
ఒక శత్రువునికి ఆపద వచ్చినప్పుడు, ఆ కీడునుబట్టి మనము సంతోషించిన, అట్టి పాపమును బట్టి మనము యెహోవాకు లెక్క ఒప్పజెప్పవలెను. (సామెతలు 17:5; 24:17, 18) ఏమైనను, శత్రువులు దేవునిని ఆయన ప్రజలను నిందించినప్పుడు, ఆయన పరిశుద్ధ నామము నిమిత్తమై, ఎవరిముందు వారు మహిమను వెదకుచున్నారో అట్టి ప్రజలయెదుట, యెహోవా వారిని ‘వెనుకకు మళ్లింపజేసి సిగ్గునొందునట్లు చేయవలెనని’ మనము ప్రార్థించవచ్చును. (కీర్తన 106:8) పగతీర్చుకొనుట దేవుని పని, అందువలన ఆయన తన శత్రువులను మన శత్రువులను భంగపరచి, సిగ్గునొందునట్లు చేయును. (ద్వితీయోపదేశకాండము 32:35) ఉదాహరణకు, నాజీ లీడరైన అడాల్ఫ్ హిట్లరు జర్మనీనుండి యెహోవాసాక్షులను పూర్తిగా తుడిచిపెట్టుటకు కృషిచేసెను. ఎంత దుఃఖకరంగా ఆయన విఫలమయ్యాడు! ఇప్పుడు అనేక వేలమంది అక్కడ రాజ్యవర్తమానమును ప్రకటించుచున్నారు.
తిరస్కార భావముతో అపహాస్యముచేయుచు, మన శత్రువులు: “ఆహా ఆహా” అని పలుక వచ్చును. వారు దేవుని ఆయన ప్రజలను దూషిస్తున్నారు గనుక అట్టి పాపులు అవమానమును అనుభవిస్తూ, “వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.” ఇందుకొరకు మనము ప్రార్థించునపుడు, మనము మన యథార్థతను కాపాడుకొనుచు, ఆయనను దూషించు సాతానుకు, లేక మరొకరికి ఆయన జవాబిచ్చునట్లు యెహోవా హృదయమును సంతోషపెట్టుదము. (సామెతలు 27:11) అహంకారులైన మన శత్రువులకు మనము ఎప్పటికి భయపడ కూడదు. ఎందుకనగా “యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.” (సామెతలు 29:25) దేవుని ప్రజలను చెరగా కొనిపోయిన గర్వాంధుడైన బబులోను రాజగు నెబుకద్నెజరు, అవమానమును అనుభవించి ‘పరలోకపు రాజు గర్వముతో నటించువారిని అణపశక్తుడని’ అంగీకరించెను.—దానియేలు 4:37.
“దేవుడు మహిమపరచబడును గాక”
శత్రువులు మనకు ఆపద కలుగజేసినను, మనము ఎల్లప్పుడు తోటి ఆరాధికులతో పాటు యెహోవాను కొనియాడుదము. దేవుని మహిమ పరచుటలో తాను విఫలమైనందున కలుగు బాధలోనే మ్రగ్గిపోవుటకు బదులు, దావీదు ఇలా అన్నాడు: “నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారందరు—దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక.” (కీర్తన 70:4) యెహోవా ప్రజలు “ఉత్సహించి, సంతోషించెదరు” గనుక వారు ఎప్పుడు ఆనందముగా ఉందురు. ఆయనకు సమర్పించుకొని, బాప్తిస్మము పొందిన సాక్షులుగా ఆయనతోగల సన్నిహిత సంబంధమునుండి కలుగు గొప్ప ఆనందమును వారు కలిగియున్నారు. (కీర్తన 25:14) అయినను, వారు వినయముతో దేవుని వెదకువారిగా దృష్టింపబడవచ్చును. దేవుని ఆజ్ఞలను గైకొనుచుండు విశ్వాసులుగా, వారు యెడతెగక ఆయననుగూర్చి ఆయన వాక్యమును గూర్చి మరియెక్కువ జ్ఞానమును వెదకుచుందురు.—ప్రసంగి 3:11; 12:13, 14; యెషయా 54:13.
యెహోవాసాక్షులు సువార్తను ప్రకటించుచుండగా, తద్వారా మరొకరీతిలో వారు నిత్యము “దేవుడు మహిమపరచుబడును గాక” అని చెప్పుచున్నారు. ఆయనను ఉన్నతస్థానమందు ఉంచుటద్వారా వారు యెహోవాను కొనియాడుదురు. సత్యమును వెదకువారికి ఆనందముగా వారు, దేవునిగూర్చి నేర్చుకొని ఆయనను మహిమపరచుటకు సహాయముచేయుదురు. యెహోవా ప్రజలు సుఖమును ప్రేమించు లోకస్తులవలె గాక, ‘ఆయన రక్షణను’ ప్రేమించెదరు. (2 తిమోతి 3:1-5) వారు స్వతంత్రించుకొనియున్న తమ పాపమును గుర్తించినవారై, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పాపవిమోచన బలిద్వారా సాధ్యపరచబడిన, యెహోవాదేవుని ప్రేమగల నిత్యజీవపు రక్షణ ఏర్పాటుకు ఎంతో కృతజ్ఞులైయున్నారు. (యోహాను 3:16; రోమీయులు 5:8; 1 యోహాను 2:1, 2) నీవు దేవునిని మహిమపరచుచు, ఆయనకు స్తుతి కలుగు నిమిత్తము సత్యారాధనను అభ్యసిస్తూ, ఆయన ‘రక్షణను ప్రేమిస్తున్నావని’ చూపుదువా?—యోహాను 4:23, 24.
విడుదల దయచేయు వానియందు నమ్మకముంచుము
ఈ కీర్తనలో దావీదు తన్నుతాను వ్యక్తపరచుకొన్నప్పుడు, దౌర్భాగ్యకరమైన అవసరతను కలిగియున్నాడు. ఆయన ఇలా అనెను: “నేను శ్రమలపాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమీ.” (కీర్తన 70:5) విశ్వాసులను తల్లక్రిందులుచేయు హింస, శోధన, సాతాను ముట్టడులు మొదలగు శోధనలచే బాధించబడినవారమై, కొన్నిసార్లు మనము “దీనులము” గా (దౌర్భాగ్యులముగా) కనిపించవచ్చును. దిక్కులేనివారము కాకపోయినను, నీతి నియమములేని శత్రువులకు మనము కాపుదలలేనివారముగా కనిపించుదుము. ఏమైనను తన నమ్మకమైన సేవకులుగా యెహోవా మనలను రక్షించగలడనియు, రక్షించుననియు నమ్మగలము.—కీర్తన 9:17-20.
అవసరమైనప్పుడు యెహోవా మనకు ‘విడుదలను దయచేయువాడు’. మన స్వంత పొరపాట్లే మనలను శోధనకరమైన పరిస్థితిలోకి తెచ్చియుండవచ్చును. ఒకవేళ మన ‘స్వంత మూర్ఖత మన మార్గమును తారుమారు చేసిన’ ‘మన హృదయము యెహోవామీద కోపగించుకొనకుండ’ చూసుకొందము. (సామెతలు 19:3) అందుకు ఆయన బాధ్యుడు కాడు. మనము విశ్వాసముతో ప్రార్థించినట్లయిన సహాయముచేయుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. (కీర్తన 37:5) మనము పాపమును తొలగించుకొనుటకు పోరాడుతున్నట్లయిన విషయమేమి? అట్లయిన ఈ విషయమును గూర్చి ప్రార్థనలో నిర్థిష్టముగా ప్రస్తావిస్తూ, నీతియుక్తమైన మార్గమును వెంబడించుటలో కొనసాగునట్లు దైవిక సహాయమును అడుగుచుండవలెను. (మత్తయి 5:6; రోమీయులు 7:21-25) దేవుడు మన హృదయపూర్వకమైన ప్రార్థనకు జవాబిచ్చును. మనము ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుకు లోపరచుకొనినట్లయిన ఆత్మీయముగా వర్ధిల్లుదుము.—కీర్తన 51:17; ఎఫెసీయులు 4:30.
విశ్వాస పరీక్షలో వచ్చు వేదనలనుబట్టి, మనము ఎక్కువ కాలము సహించుకొనలేమని భావించవచ్చును. పాపభరితమైన మన శరీరము బలహీనమైనది కావున, అది విడుదలను త్వరగా కోరవచ్చును. (మార్కు 14:38) కావున మనమిట్లు మొరపెట్ట వచ్చును: “యెహోవా ఆలస్యము చేయకుమీ.” ప్రత్యేకముగా మనము దేవుని నామముపై కలుగు నింద విషయమై శ్రద్ధకలిగియున్నట్లయిన, ప్రవక్తయైన దానియేలు వలె ప్రార్థించుటకు నడుపబడవచ్చును: “ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము; ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, యీపట్టణమును ఈ జనమును నీ పేరుపెట్టబడినవే.” (దానియేలు 9:19) మన పరలోకపు తండ్రి ఎంతో ఆలస్యముచేయడని మనము విశ్వాసమును కలిగియుండవచ్చును. ఎట్లనగా అపొస్తలుడైన పౌలు ఈ అభయ మిచ్చెను: “గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృపపొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.”—హెబ్రీయులు 4:16.
యెహోవా విడుదలను దయచేయువాడని ఎన్నటికిని మరచిపోకుము. ఆయన సేవకులముగా దీనిని మరియు కీర్తన 70లోని, ప్రార్థనాపూర్వక మనోభావములను జ్ఞాపకమందుంచుకొనుట మంచిది. మరింత శ్రద్ధ అవసరమైన ఒక దానినిగూర్చి కొన్ని సార్లు పదేపదే మనము ప్రార్థించవలసిన అవసరముండవచ్చును. (1 థెస్సలొనీకయులు 5:17) ఒక ప్రత్యేక సమస్యకు వేరే ఏ పరిష్కారము లేదన్నట్లు కనిపించవచ్చును. మన అయోమయ స్థితినుండి బయటపడే మార్గమే లేనట్లుండవచ్చును. అయితే మన ప్రేమగల పరలోకపు తండ్రి మనలను బలపరచి, మనము భరించగలిగినదానికంటే ఎక్కువగా మనలను శోధింపనియ్యడు. కనుక, సదాకాలము రాజైన వాని సింహాసనముయొద్దకు హృదయపూర్వక ప్రార్థనతో సమీపించుటకు ఎప్పటికిని అలిసిపోకుము. (1 కొరింథీయులు 10:13; ఫిలిప్పీయులు 4:6, 7, 13; ప్రకటన 15:3) విశ్వాసముతో ప్రార్థించుడి, ఆయనను దృఢముగానమ్ముడి, ఎందుకనగా సహాయముకొరకైన మన అత్యవసర మొరలను యెహోవా వినును. (w91 5/15)