“ప్రార్థనచేయ మాకు నేర్పుము”
“ఆయన శిష్యులలో ఒకడు, ‘ప్రభువా, మాకు ప్రార్థనచేయ నేర్పుము’ అని ఆయనను అడిగెను.”—లూకా 11:1.
1-3. (ఎ) యేసు శిష్యులు ప్రార్థన విషయమై ఉపదేశమునెందుకు వెదకిరి? (బి) ప్రార్థనను గూర్చి ఏ ప్రశ్నలు ఉత్పన్నమగును?
కొందరు శ్రావ్యముగా పాడు స్వరమును వరముగా పొందియున్నారు. మరికొందరు సంగీతకారులుగా సహజమైన సామర్థ్యమును కలిగియున్నారు. అయితే వారు అతి ఉన్నతమైన సంభావ్యతను చేరుకొనుటకు, ఈ గాయకులకు మరియు వాయిద్యకారులకు సహితము ఉపదేశము అవసరము. ప్రార్థన విషయమందును అది అట్లేయున్నది. తమ ప్రార్థనలను దేవుడు ఆలకింపవలెనంటే తమకు ఉపదేశము అవసరమను సంగతిని యేసుక్రీస్తు శిష్యులు గ్రహించిరి.
2 తన 12 మంది అపొస్తలులను ఎంపికచేసికొను దినమునకు ముందురాత్రి చేసినట్లుగానే, యేసు తరచు ఏకాంతముగా ప్రార్థనయందు తన తండ్రియొద్దకు వెళ్లెను. (లూకా 6:12-16) తన శిష్యులును ఏకాంతముగా ప్రార్థించవలెనని ఆయన వారిని బలవంత పెట్టినను, మనుష్యులు చూడవలెనని ప్రార్థించు వేషధారులైన మతస్థులవలె కాకుండ, ఆయన బహిరంగముగా ప్రార్థించుటను వారు గమనించిరి. (మత్తయి 6:5, 6) కాబట్టి, న్యాయసమ్మతముగా యేసు అనుచరులు ఆయన యిచ్చు మరి శ్రేష్ఠమైన ఉపదేశమును కోరిరి. మనము ఈ విధముగా చదువుదుము: “ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ‘ప్రభువా, [బాప్తిస్మమిచ్చు] యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థనచేయ నేర్పుమని’ ఆయన నడిగెను.”—లూకా 11:1.
3 యేసు ఎట్లు ప్రత్యుత్తరమిచ్చెను? ఆయన మాదిరినుండి మనమేమి నేర్చుకొనగలము? మరియు ప్రార్థన విషయమై ఆయనిచ్చిన ఉపదేశమునుండి మనమెట్లు ప్రయోజనము పొందగలము?
మన కొరకు పాఠములు
4. మనము ఎందుకు “యెడతెగక ప్రార్థించవలెను,” మరియు అట్లుచేయుట అనగా దాని భావమేమి?
4 ప్రార్థనా పురుషునిగా యేసు మాటలు మరియు మాదిరినుండి మనమెంతో నేర్చుకోగలము. ఒక పాఠమేమనగా దేవుని పరిపూర్ణ కుమారుడే క్రమముగా ప్రార్థించవలసి యుండగా, ఆయన అపరిపూర్ణ శిష్యులు నడిపింపు, ఓదార్పు, మరియు ఆత్మీయ పోషణ కొరకు మరిఎక్కువ అవసరతతో దేవునివైపు ఎడతెగక చూడవలసియున్నారు. కాబట్టి, మనము “యెడతెగక ప్రార్థించవలెను.” (1 థెస్సలొనీకయులు 5:17 ) అంటే మనము అన్నిసమయములలో అక్షరార్థముగా మోకాళ్లమీద యుండవలెనని దీని భావము కాదు. బదులుగా, మనము తదేకముగా ప్రార్థనా దృక్పధమును కలిగియుండవలెను. మనము వివేకము గలవారమై ప్రవర్తించుటకు మరియు అన్ని సమయములలో ఆయన గుర్తింపు ఉండులాగున మనము మన జీవిత ప్రతి ఆకృతిలోను నడిపింపు కొరకు దేవునివైపు చూడవలెను.—సామెతలు 15:24.
5. ప్రార్థనకు మనము కేటాయించు సమయములో ఏమి చొచ్చుకొని రావచ్చును, మరియు దీనినిగూర్చి మనమేమి చేయవలెను?
5 ఈ “అంత్యదినములలో,” మనము ప్రార్థించు సమయములోనికి అనేక సంగతులు చొచ్చుకొనివచ్చును. (2 తిమోతి 3:1) అయితే గృహ చింతలు, వ్యాపార శ్రద్ధల వంటివి మన పరలోకపు తండ్రికి క్రమముగాచేయు ప్రార్థనలో జోక్యము కలిగించుకొనినట్లయిన, మనము ఈ జీవిత చింతల భారముతో బహుగా కృంగినవారమై యుందుము. అటువంటి పరిస్థితిని ఆలస్యము చేయకుండా సరిదిద్దుకొనవలెను, ఏలయనగా ప్రార్థించుటకు తప్పిపోవుట విశ్వాసము కోల్పోవుటకు నడిపించును. మనము మన లౌకిక బాధ్యతలను తగ్గించుకొనవలెను లేక జీవిత శ్రద్ధలను నడిపింపుకొరకు మన హృదయమును చిత్తశుద్ధితో దేవునివైపు మరలామరలా త్రిప్పుకొనుటతో సమతూకము చేసికొనవలెను. మనము “ప్రార్థనలు చేయుటకు మెలకువగా” ఉండవలెను.—1 పేతురు 4:7.
6. మనమే ప్రార్థనను అధ్యయనమ చేయుదుము, మరియు ఏ ఉద్దేశ్యముతో?
6 మాదిరి ప్రార్థనయని పిలువబడిన దానిలో, ఖచ్ఛితముగా ఏమిచెప్పవలెనో కాదుగాని, ఎట్లు ప్రార్థించవలెనో యేసు తన శిష్యులకు నేర్పించెను. వివిధ సందర్భములు చేరియున్నందున లూకా వృత్తాంతము మత్తయిలో ఉన్నదానికి కొంచెము వేరుగా యున్నది. యేసు అనుచరులుగా మరియు యెహోవా సాక్షులుగా మన ప్రార్థనల స్వరూపముయొక్క నమూనాగా ఈ ప్రార్థనను మనము అధ్యయనము చేద్దాం.
మన తండ్రి మరియు ఆయన నామము
7. యెహోవాను “మాతండ్రి” అని సంబోదించు ఆధిక్యత ఎవరికి కలదు?
7 “పరలోకమందున్న మా తండ్రీ,” (మత్తయి 6:9; లూకా 11:2) యెహోవా మానవజాతి సృష్టికర్తయు మరియు పరలోకమందుండు వాడుగనుక, ఆయనను “పరలోకమందున్న మాతండ్రి” అని సంబోదించుట సరియైయున్నది. (1 రాజులు 8:49; అపొ.కార్యములు 17:24, 28) “మా” అని ఉపయోగించుట ఇతరులుకూడ దేవునితో సంబంధమును కలిగియున్నారని గుర్తించుచున్నది. అయితే ఆయనను తమ తండ్రి అని పిలుచు కట్టుబాట్లుగల ఆధిక్యత ఎవరికి కలదు? కేవలము ఆయన ఆరాధికుల కుటుంబములో సమర్పించుకొని బాప్తిస్మంపొందిన ఆయావ్యక్తులకు మాత్రమే. యెహోవాను “మాతండ్రి” అని పిలుచుట మనము దేవునియందు విశ్వాసము కలిగియున్నామని మరియు ఆయనతో సమాధానము కలిగియుండుటకు యేసు విమోచన క్రయధనమును సంపూర్ణముగా అంగీకరించుట మాత్రమే ఆధారమని గ్రహించుచున్నామని సూచించుచున్నది.—హెబ్రీయులు 4:14-16; 11:6.
8. యెహోవాకుచేయు ప్రార్థనయందు మనము సమయము గడుప ఎందుకు కోరుకొందుము?
8 మన పరలోకపు తండ్రికి ఎంత చేరువగా ఉన్నామని మనము భావించవలెను! తమ తండ్రి యొద్దకు వెళ్లుటకు ఎన్నటికిని అలసిపోని పిల్లలవలె, మనము దేవునికి చేయు ప్రార్థనలో సమయము గడపుటకు కోరుకొనవలెను. ఆయన దయచేయు ఆత్మీయ మరియు వస్తుదాయక ఆశీర్వాదముల కొరకైన లోతైన కృతజ్ఞత ఆయన చూపిన మంచితనము కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనలను కదిలించవలెను. మనలను ఆయన పోషించునను మనోనమ్మకముతో, మనలను కృంగదీయు భారములను ఆయనయొద్దకు మోసికొనిపోవలెనని మనము భావించవలెను. (కీర్తన 55:22) మనము నమ్మకముగా యున్నట్లయిన, ఆయన మనయెడల శ్రద్ధవహించును గనుక చివరకు ప్రతిదీ మనయెడల మంచిగా పరిణమించునని మనము నిశ్చయత కలిగియుండవచ్చును.—1 పేతురు 5:6, 7.
9. దేవుని నామ పరిశుద్ధత కొరకు చేయు ప్రార్థన దేనికొరకు విన్నపమై యున్నది?
9 “నీ నామము పరిశుద్ధపరచబడు (ప్రతిష్ఠింపబడు) గాక.” (మత్తయి 6:9; లూకా 11:2) కొన్నిసార్లు “నామము” అను పదము ఆ వ్యక్తినే సూచించును, మరియు “ప్రతిష్ఠించుట” అనగా “పరిశుద్ధము చేయుట, ప్రత్యేకముగా ఉంచుట లేక పవిత్రముగా ఎంచుట” అని భావము. (ప్రకటన 3:4 పోల్చుము.) కాబట్టి, వాస్తవమందు దేవుని నామ ప్రతిష్ఠ కొరకు చేయు ప్రార్థన తననుతాను ప్రతిష్ఠించుకొనుటకు యెహోవా చర్యగైకొనవలెనని విన్నపము చేయుటయై యున్నది. ఎట్లు? ఆయన నామముమీద పేర్చబడిన నిందను సంపూర్ణముగా తుడిచివేయుట ద్వారా. (కీర్తన 135:13) దానిని చేయుటకు, దేవుడు దుష్టత్వమును తొలగించి, తనను మహిమపరచుకొని తానే యెహోవానని జనులు తెలిసికొనునట్లు చేయును. (యెహెజ్కేలు 36:23; 38:23) మనము ఆ దినమును చూడగోరి యెహోవా ఘనతను నిజముగా గుణగ్రహించినట్లయిన, “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అను పదముల భావముగల పూజ్యస్వభావముతో మనము అన్ని సమయములలో ఆయనను సమీపింతుము.
దేవుని రాజ్యము మరియు ఆయన చిత్తము
10. దేవుని రాజ్యము రావలెనని మనము ప్రార్థించునప్పుడు దాని భావమేమైయున్నది?
10 “నీ రాజ్యము వచ్చుగాక.” (మత్తయి 6:10; లూకా 11:2) ఇక్కడ రాజ్యమనగా యెహోవా పరిపాలనా సార్వభౌమాధిపత్యమై యున్నది. ఇది యేసుక్రీస్తు ఆయన తోటి “పరిశుద్ధుల” ఆధ్వర్యములోని మెస్సీయ ప్రభుత్వము ద్వారా వ్యక్తపర్చబడినది. (దానియేలు 7:13, 14, 18, 27; యెషయా 9:6, 7; 11:1-5) అది “వచ్చుగాక” అని ప్రార్థించుటలో దాని భావమేమి? అనగా దైవ పరిపాలనకు వ్యతిరేకముగా భూమిమీదున్న సమస్త వ్యతిరేకులకు విరుద్ధముగా దేవుని రాజ్యము రావలెనని ప్రార్థించుటయై యున్నది. ఆ రాజ్యము ‘ఈ సమస్త భూ రాజ్యములను పగులగొట్టి అంతమొందించిన’ పిదప, అది లోకమంతటిని ఒక పరదైసు భూమిగా మార్చును.—దానియేలు 2:44; లూకా 23:43.
11. విశ్వమంతటిలో యెహోవా చిత్తము నెరవేర్చబడుటను చూచుటకు మనము కోరినట్లయిన, మనమేమి చేయుదుము?
11 “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:10) ఇది తన శత్రువులను తీసివేయుటతో సహా, భూమియెడల తన సంకల్పము నెరవేర్చవలెనని దేవునికి చేయు విన్నపమైయున్నది. (కీర్తన 83:9-18; 135:6-10) వాస్తవానికి, విశ్వమంతటిలో దైవచిత్తము నెరవేర్చబడుటను మనము చూడగోరుచున్నామని దాని భావము. అదే మన హృదయములో ఉన్నట్లయిన, మన శక్తివంచన లేకుండా అన్నివేళలా యెహోవా చిత్తమును మనము చేయుదుము. మన స్వంత విషయములోనే చిత్తశుద్ధితో దేవుని చిత్తముచేయ కృషిసల్పకపోయినట్లయిన, మనము నమ్మకముగా అటువంటి విన్నపము చేయలేము. మనము ఈ విధముగా ప్రార్థించుచున్నట్లయిన, మనము అవిశ్వాసిని ప్రేమించుట లేక లోక విధానములను అవలంభించుట వంటి ఆ చిత్తమునకు వ్యతిరేకమైన సంగతులు చేయకుండుటను రూఢిపరచుకొనవలెను. (1 కొరింథీయులు 7:39; 1 యోహాను 2:15-17) బదులుగా, మనము అన్ని సమయములలో ‘ఈ విషయములో యెహోవా చిత్తము ఏమిటి?’ అను తలంపును మనస్సులో ఉంచుకొనవలెను. అవును, మన పూర్ణ హృదయముతో మనము దేవుని ప్రేమించినట్లయిన, మన జీవనవ్యవహారమంతటిలో మనము ఆయన నడిపింపును వెదుకుదుము.—మత్తయి 22:37.
మన అనుదినాహారము
12. కేవలము ‘దినాహారము’ కొరకు విన్నవించుట మనపై ఎటువంటి మంచి ప్రభావమును కలిగియుండును?
12 “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.” (మత్తయి 6:11) లూకా వృత్తాంతము ఇలా చదువబడుచున్నది: “మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము.” (లూకా 11:3) కావలసిన ఆహారము “నేడు” దయచేయుమని దేవుని అడుగుట దినదినము మన అవసరతలను తీర్చు ఆయన సామర్థ్యమందు మన విశ్వాసమును వృద్ధిచేయును. ఇశ్రాయేలీయులు వారము కొరకు లేక అంతకంటే ఎక్కువ కొరకు కాదు, ‘ఏనాడు బత్తెము ఆనాడే” అన్నట్లు మన్నాను ఏరుకోవలసి యుండెను. (నిర్గమకాండము 16:4) ఈ ప్రార్థన మనకు ప్రతి దినము ఉత్పన్నమగు అవసరత కొరకే గాని బహురుచికరమైన రీతిలో మరియు విస్తారమైన రీతిలో సమకూర్చవలెననుటకు కాదు. కేవలము దినాహారము కొరకు విన్నవించుట మనము దురాశపరులము కాకుండా కూడ సహాయము చేయును.—1 కొరింథీయులు 6:9, 10.
13. (ఎ) విశాలభావమందు, మన అనుదినాహారము కొరకు అడుగుటయొక్క భావమేమి? (బి) మనము కష్టించి పనిచేసినను మరియు బ్రతుకుటకు మనకు విస్తారముగా ఉన్నను, మన దృక్పధమేమై యుండవలెను?
13 విశాలభావమందు, దినాహారము కొరకు అడుగుట మనము స్వేచ్ఛను కోరుటలేదుగాని, ఆహారము, నీరు, దుస్తులు ఇంకా ఇతర అవసరతల కొరకు తదేకముగా దేవునివైపు చూచుచున్నామని సూచించును. ఆయన ఆరాధికుల కుటుంబములోని సమర్పిత సభ్యులుగా, మన తండ్రియందు నమ్మికయుంచుదుము అంతేగాని అద్భుతరీతిన ఆయన సమకూర్చవలెనని వేచిచూస్తు ఊరకనే కూర్చోము. మనము పనిచేస్తాము మరియు ఆహారమును ఇతర అవసరతలను సంపాదించుకొనుటకు మనకు అందుబాటులోవున్న దేనినైనను ఉపయోగిస్తాము. అయినను, మనము సరియైన రీతిలో ప్రార్థనయందు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాము ఎందుకంటే ఈ ఏర్పాట్ల వెనుక మన పరలోకపు తండ్రి ప్రేమ, జ్ఞానము, మరియు శక్తి ఉండుటను మనము చూచెదము. (అపొ.కార్యములు 14:15-17; లూకా 22:19 పోల్చుము.) మన పట్టుదల ఫలితముగా మనకు క్షేమాభివృద్ధి కలుగును. అయితే మనము కష్టించి పనిచేసినను మరియు సరిపడునంతగా లేకపోయినను, మనము కృతజ్ఞులముగా మరియు తృప్తిగలవారమై యుందాము. (ఫిలిప్పీయులు 4:12; 1 తిమోతి 6:6-8) వాస్తవానికి, సంపదగలవారికంటే సామాన్య జీవితము, మరియు దుస్తులుగలవారు ఎక్కువ సంతోషముగా ఉందురు. కావున మన ఆధీనములో లేని పరిస్థితులనుబట్టి మనకు లేమియున్నను, మనము విషాదహృదయులు కాకుందము. మనమింకను ఆత్మీయముగా సంపన్నముగా ఉండగలము. అవును, మనము విశ్వాసమందు, నిరీక్షణయందు మరియు మన హృదయపూర్వక ప్రార్థనయందు స్తుతి, కృతజ్ఞతలు ఎవరియొద్దకు ఎక్కిపోవునో ఆ యెహోవా కొరకైన ప్రేమయందు శక్తిలేని వారమై యుండనవసరము లేదు.
మన రుణములను క్షమించుట
14. ఏ రుణములకు మనము క్షమాపణ అడుగవలెను, మరియు వాటికి దేవుడు దేనిని అన్వయింపజేయును?
14 “మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము.” (మత్తయి 6:12) లూకా వృత్తాంతము ఆ రుణములు పాపములని చూపుచున్నది. (లూకా 11:4) స్వాస్థ్యముగా కలిగిన పాపము మన తండ్రి పరిపూర్ణ చిత్తము ప్రకారము పనులు చేయకుండా మనను అడ్డగించుచున్నది. అనగా, మనము ‘ఆత్మానుసారముగా నడుచుకొనుటకు’ ప్రారంభించినందున, ఈ తప్పిదములు మన రుణములైయున్నవి, లేక దేవునియెడల బాధ్యతయైయున్నది. (గలతీయులు 5:16-25; రోమీయులు 7:21-25 పోల్చుము.) మనము ఈ రుణములను ఎందుకు కలిగియున్నామంటే, మనము అసంపూర్ణులమైయుండి దేవుని కట్టడలను పరిపూర్ణముగా పాటించలేని వారమైయున్నాము. ఈ పాపముల క్షమాపణ కొరకే మనము ప్రార్థించు ఆధిక్యతను కలిగియున్నాము. సంతోషదాయకమైన విషయమేమనగా, దేవుడు ఈ రుణములకు, లేక పాపములకు యేసు విమోచన క్రయధన బలి విలువను అన్వయించగలడు.—రోమీయులు 5:8; 6:23.
15. అవసరమైన శిక్షణయెడల మనమెటువంటి దృక్పధమును కలిగియుండవలెను?
15 మన రుణములను, లేక పాపములను దేవుడు క్షమించవలెనని అపేక్షించినట్లయిన, మనము పశ్చాత్తాపపడి శిక్షణను పొందుటకు ఇష్టపడువారమై యుండవలెను. (సామెతలు 28:13; అపొ.కార్యములు 3:19) యెహోవా మనలను ప్రేమించుచున్నందున, మన బలహీనతలను మనము చక్కదిద్దుకొనులాగున మనకు వ్యక్తిగతముగా కావలసిన శిక్షణ ఆయన మనకిచ్చుచున్నాడు. (సామెతలు 6:23; హెబ్రీయులు 12:4-6) ఏమైనను, విశ్వాసము పెరిగి దేవుని నియమములు మరియు సూత్రముల ప్రకారము మన హృదయము సంపూర్ణముగా నిండియున్నది గనుక మనము వీసమెత్తైనను ఇష్టపూర్వకముగా తప్పిదము చేయమను జ్ఞానమున్నట్లయిన, మనము సంతోషించగలము. అయితే ఏదైనా తప్పిదమందు కొంత ఇష్టమున్నదని మనకు అర్థమయినట్లయిన అప్పుడు సంగతి ఏమి? అప్పుడు మనము మిక్కిలి వ్యధచెందినవారమై క్షమాపణ కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించవలెను. (హెబ్రీయులు 10:26-31) మనము పొందిన హెచ్చరికను అన్వయించుచు, వెంటనే మన విధానమును సరిదిద్దుకొనవలెను.
16. మన పాపములను క్షమించుమని దేవుని ఎడతెగక అడుగుట ఎందుకు ప్రయోజనకరమై యున్నది?
16 మన పాపములు క్షమించుమని క్రమముగా దేవుని అడుగుట ప్రయోజనకరమగును. ఈ విధముగా చేయుట మన పాపము మనముందుంచబడి మనము వినయస్థులమై యుండుటకు దోహదపడును. (కీర్తన 51:3, 4, 7) మనము మన పరలోకపు తండ్రి “మన పాపములను క్షమించి. . . సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా” చేయవలెను. (1 యోహాను 1:8, 9) అంతేకాకుండ, ప్రార్థనయందు మన పాపములను ప్రస్తావించుట వాటికి వ్యతిరేకముగా మనము తీవ్రముగా పోరాడుటకు మనకు సహాయము చేయును. ఆ విధముగా మనము మనకు అవసరమైన విమోచన క్రయధనము మరియు యేసు చిందించిన రక్తముయొక్క విలువను గూర్చి తదేకముగా గుర్తుచేయబడుదుము.—1 యోహాను 2:1, 2; ప్రకటన 7:9, 14.
17. క్షమాపణ కొరకు ప్రార్థించుట ఇతరులతో మనకున్న సంబంధమందు మనకెట్లు సహాయము చేయును?
17 క్షమాపణ కొరకు ప్రార్థించుట పెద్ద చిన్న విషయములలో మనకు రుణపడియున్న వారియెడల జాలి, కనికరము మరియు ఔదార్యము చూపించుటకుకూడ మనకు సహాయము చేయును. లూకా వృత్తాంతము ఇట్లనుచున్నది: “మేము మాకచ్చియున్న ప్రతి వాని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము.” (లూకా 11:4) వాస్తవానికి, మనకు “అచ్చియున్న వారిని,” మనకు వ్యతిరేకముగా పాపముచేసిన వ్యక్తులను మనమప్పటికే క్షమించియుంటేనే మనము దేవునినుండి క్షమాపణ పొందగలము. (మత్తయి 6:12; మార్కు 11:25) యేసు ఇంకను ఇట్లనెను: “మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.” (మత్తయి 6:14, 15) పాపక్షమాపణ కొరకు ప్రార్థించుట మనము ఇతరులను భరించుటకు మరియు వారిని క్షమించుటకు కదిలించవలెను. అపొస్తలుడైన పౌలు ఇట్లు వ్రాసెను: “యెహోవా మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.”—కొలొస్సయులు 3:13 NW; ఎఫెసీయులు 4:32.
శోధన మరియు దుష్టుడు
18. మనకు కలుగు శోధనలు మరియు పరీక్షల విషయమై మనమెందుకు ఎన్నడును దేవుని నిందించకూడదు?
18 “మమ్మును శోధనలోకి తేకుము.” (మత్తయి 6:13; లూకా 11:4) మనము పాపము చేయవలెనని యెహోవా మనలను శోధించునని ఈ మాటల భావము కాదు. లేఖనములు కొన్నిసార్లు దేవుడు కేవలము అనుమతించు సంగతులను ఆయన చేయుచున్నాడని లేక కల్గించుచున్నాడని మాట్లాడును. (రూతు 1:20, 21; ప్రసంగి 11:5 పోల్చుము.) అయితే “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు” అని శిష్యుడైన యాకోబు వ్రాసెను. (యాకోబు 1:13) కావున, శోధనలు మరియు కీడుకరమైన పరీక్షల విషయమై మనము ఎన్నడును దేవుని నిందించకూడదు, ఏలయనగా సాతాను శోధకుడైయుండి మనము దేవునికి వ్యతిరేకముగా పాపము చేయవలెనని ప్రయత్నించును.—మత్తయి 4:3; 1 థెస్సలొనీకయులు 3:5.
19. శోధన సంబంధముగా మనమెట్లు ప్రార్థించవచ్చును?
19 “మమ్మును శోధనలోకి తేకుము” అను విన్నపముద్వారా మనము నిజానికి, ఆయనకు అవిధేయులమగుటకు వత్తిడి తేబడినప్పుడు లేక శోధింపబడినప్పుడు మనము దానికి లొంగిపోకుండా చేయుమని యెహోవాను అడుగుటయై యున్నది. మనకు అతికఠినమైయుండు శోధనేదియు మనమార్గమున రాకుండ మన అడుగులను నడిపించుమని మన తండ్రిని మనము వేడుకొనవచ్చును. ఈ విషయమై పౌలు ఇట్లు వ్రాసెను: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరియేదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” (1 కొరింథీయులు 10:13) మనము భరింపగలిగినదానికంటే ఎక్కువగా శోధింపబడకుండా నడిపించవలెనని ఆలాగే బహుగా కృంగినప్పుడు తప్పించుకొనుమార్గమును దయచేయవలెనని మనము యెహోవాకు ప్రార్థించ వచ్చును. శోధనలు అపవాదినుండి, మన పాప శరీరమునుబట్టి, ఇతరుల బలహీనతలనుబట్టి కలుగును, అయితే మన ప్రేమగల తండ్రి మనము అణచివేయబడకుండ మనలను నడిపించగలడు.
20. “దుష్టుని నుండి” తప్పించుమని ఎందుకు ప్రార్థించవలెను?
20 “దుష్టుని నుండి తప్పించుము.” (మత్తయి 6:13) మనలను లొంగదీసుకొనకుండ, దేవుడు నిశ్చయముగా “దుష్టుడైన” సాతానును అడ్డగించగలడు. (2 పేతురు 2:9) అపవాదినుండి తప్పింపబడు ఇంతగొప్ప అవసరత ఇప్పటికంటే క్రితమెన్నడు లేకుండెను, ఏలయనగా అతడు ‘తనకు కొద్దిసమయమే కలదని బహు కోపముగలవాడైయున్నాడు.’ (ప్రకటన 12:12) సాతాను కుతంత్రములు మనకు తెలియనివి కావు ఆలాగే మన బలహీనతలు అతనికి తెలియకుండా లేవు. కావున, సింహమువంటి విరోధియొక్క పట్టునుండి మనలను తప్పించవలెనని యెహోవాకు మనము ప్రార్థించు అవసరత కలదు. (2 కొరింథీయులు 2:11; 1 పేతురు 5:8, 9; కీర్తన 141: 8, 9 పోల్చుము.) ఉదాహరణకు, మనము పెండ్లి చేసికొనవలెనను ఇష్టము కలిగినట్లయిన, లైంగిక దుర్నీతికి లేక అవిశ్వాసిని వివాహమాడుటద్వారా దేవునికి అవిధేయులగుటకు నడిపించు లౌకిక సంబంధములను పెంపొందించుకొనవలెనని కలుగు శోధననుండి మరియు సాతాను కుతంత్రములనుండి తప్పించుమని మనము యెహోవాను అడుగవచ్చును. (ద్వితీయోపదేశకాండము 7:3, 4; 1 కొరింథీయులు 7:39) మనము ఐశ్వర్యము కొరకు కాంక్షింతుమా? అప్పుడు మనము జూదమాడుటకు లేక మోసము చేయుటకు కలుగు శోధనను ఎదుర్కొనుటకు ప్రార్థనాసహాయము మనకు అవసరము కావచ్చును. యెహోవాతో మనకున్న సంబంధమును నాశనముచేయు ఆతురతగల సాతాను శోధనలను తన ఆయుధగారములోని ఎటువంటి ఆయుధమునైనను ఉపయోగించును. కాబట్టి, నీతిమంతులను ఎన్నటికిని శోధనకు విడిచిపెట్టని మరియు దుష్టునినుండి తప్పించు మన పరలోకపు తండ్రికి మనము ఎడతెగక ప్రార్థన చేయుదము గాక.
ప్రార్థన విశ్వాసమును మరియు నిరీక్షణను వృద్ధిచేయును
21. రాజ్యము కొరకు ప్రార్థించుటనుండి మనమెట్లు ప్రయోజనము పొందితిమి?
21 మనలను దుష్టునినుండి తప్పించు మన పరలోకపు తండ్రి, మనలను సమృద్ధిగా ఆశీర్వదించుటలో ఆనందించును. అయినను, తన ప్రియమైన ప్రజలు “నీ రాజ్యము వచ్చుగాక” అని ఇంత దీర్ఘకాలము ప్రార్థించుటకు ఆయనెందుకు అనుమతించెను? సరే, సంవత్సరములుగా, ఈ విధముగా ప్రార్థించుట రాజ్యము కొరకైన మన కోరిక మరియు ప్రశంస వృద్ధియైనది. అటువంటి ప్రార్థన ఈ శ్రేయస్కరమైన పరలోక ప్రభుత్వముయొక్క మన గొప్ప అవసరతను గుర్తుచేసినది. అంతేకాకుండ అది రాజ్యపరిపాలన క్రింద జీవముయొక్క నిరీక్షణను మనయెదుట ఉంచుచున్నది.—ప్రకటన 21:1-5.
22. మన పరలోకపు తండ్రియైన యెహోవాకు ప్రార్థించుట విషయమై ఎడతెగక మనము ఎటువంటి దృక్పధమును కలిగియుండవలెను?
22 ప్రార్థన నిస్సంకోచముగా యెహోవాయందు విశ్వాసమును వృద్ధిచేయును. ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చినప్పుడు ఆయనతో మనకున్న బంధము బలపడును. కావున, ప్రతిదినము ఆయనకు స్తుతి, కృతజ్ఞత మరియు విన్నపములు చేయుటలో మనము ఎన్నటికిని అలసిపోకూడదు. “ప్రభువా, ప్రార్థనచేయ మాకు నేర్పుము” అని తన అనుచరులు చేసిన విన్నపమునకు సహాయకరమగు ప్రత్యుత్తరమిచ్చినందుకు యేసుకు మనము కృతజ్ఞలమై యుందుము గాక. (w90 5/15)
మీరు జ్ఞాపకము తెచ్చుకొందురా?
◻ ప్రార్థనా పురుషునిగా యేసు మాటలు మరియు మాదిరినుండి మనమెటువంటి పాఠములు నేర్చుకొనగలము?
◻ మన పరలోకపు తండ్రి మరియు ఆయన నామము సంబంధముగా మనము దేనికొరకు ప్రార్థించవలెను?
◻ దేవుని రాజ్యము వచ్చుగాకని మరియు ఆయన చిత్తము భూమిపై నెరవేరవలెనని మనము ప్రార్థించునప్పుడు మనమేమి విన్నవించుచున్నాము?
◻ మన అనుదినాహారము కొరకు ప్రార్థించునప్పుడు మనము దేనికొరకు అడుగుచున్నాము?
◻ మా రుణములు క్షమించుమని ప్రార్థించునప్పుడు దాని భావమేమి?
◻ శోధననుగూర్చి మరియు దుష్టుడైన సాతానునుండి తప్పించుమని ప్రార్థించుట ఎందుకు ఆవశ్యకము?
[17వ పేజీలోని చిత్రాలు]
తామెట్లు ప్రార్థించవలెనో నేర్పుమని యేసు అనుచరులు ఆయనను అడిగిరి. ప్రార్థన విషయమై ఆయనిచ్చిన ఉపదేశములనుండి ఎట్లు ప్రయోజనము పొందవచ్చునో మీకు తెలుసా?