ఇంటింటను బహిరంగముగాను బోధించుడి
“ఇంటింటను బహిరంగముగాను బోధించుటకు . . . . నేను వెనుకాడలేదు.”—అపొస్తలుల కార్యములు 20:20, “బయింగ్టన్.”
1. యెహోవాసాక్షుల ఇంటింటి పరిచర్యయొక్క సఫలతనుగూర్చి ఒక కేథలిక్ మతగురువు ఎట్లు వ్యాఖ్యానించెను?
“కేథలిక్కులు సువార్తను ఇంటింటికి తీసుకొని వెళ్తున్నారు” అని, 1987 అక్టోబరు 4వ తారీఖు ప్రొవిడెన్స్‌న్ సన్‌డే జర్నల్ హెడ్ లైన్‌లో చదువబడినది. ఆ వార్తాపత్రిక ఈ పనిలోని ముఖ్య ఉద్దేశ్యము “గుడికి హాజరై దాని కార్యకలాపములలో పాల్గొనువారిలో మందగించియున్నవారిని ఎక్కువ చురుకుదనము చేయుట” అని తెల్పినది. డొయిసెస్ ప్రాంతమున సువార్త ప్రకటన కొరకున్న ఆఫీసు డైరెక్టరైన జాన్ అలార్డ్ అను మతగురువు ఈ విధముగా అన్నట్లు చెప్పబడినది: “నిశ్చయంగా, ఎంతో సందేహాస్పదమైన స్థితి కలుగబోతుంది. ప్రజలు ‘ఇదిగో వారు యెహోవాసాక్షులవలె వెళ్తున్నారని’ అంటారు. యెహోవాసాక్షులు సఫలీకృతులై యున్నారు. కాదా? నేను సవాలు చేస్తాను, మీరు స్టేట్‌లో (రొడే ఐలాండ్, యు. ఎస్. ఎ.,) ఏ రాజ్యమందిరములోకైన వెళ్లిచూడండి, సంఘాలు ఒకప్పటి కేథలిక్కులతో నిండియుండటం కన్పిస్తుంది.”
2. యుక్తమైనరీతిగా ఏ ప్రశ్న లేవదీయబడినది?
2 ఔను, సఫలీకృతమైన తమ ఇంటింటి పరిచర్యకు యెహోవాసాక్షులు ప్రఖ్యాతిగాంచియున్నారు. అయితే వారు ఇంటింటికి ఎందుకు వెళ్లుదురు?
అపొస్తలుల పద్ధతి
3. (ఎ) యేసు తన శిష్యులకు ఏ పనిని ఆజ్ఞాపించెను? (బి) ఏ ముఖ్యమైన మార్గమున క్రీస్తు తొలి అనుచరులు వారికి ఆజ్ఞాపించబడిన పనిని నెరవేర్చిరి?
3 యేసుక్రీస్తు తన అనుచరులకు ఈ అర్థవంతమైన పనిని ఆజ్ఞాపించెను. ఆయన: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” (మత్తయి 28:19, 20) ఈ పని జరుగునట్టి ముఖ్యమైన పద్ధతి సా. శ. 33 పెంతెకొస్తుదినము తరువాత వెంటనే స్పష్టమయినది. వారు “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసేక్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొస్తలుల కార్యములు 5:42) ఆ తదుపరి 20 సంవత్సరముల తర్వాత, అపొస్తలుడైన పౌలు ఇంటింటి పరిచర్యలో పాల్గొనుచుండెను. ఏలయనగా ఆయన ఎఫెసునుండి వచ్చిన పెద్దలకు ఇలా జ్ఞాపకముచేసెను: “మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు బోధించుట. . .మీకు తెలియును.”—అపొస్తలుల కార్యములు 20:20.
4. అపొస్తలుల కార్యములు 5:42 మరియు అపొస్తలుల కార్యములు 20:20, యేసు అనుచరులు తమ ప్రకటనను ఇంటింటికి పంచిపెట్టిరను భావమిస్తున్నదని ఎందుకు చెప్పగలము?
4 అపొస్తలుల కార్యములు 5:42లో “ఇంటింట” అను మాటలు కాట్’ అయ్’కోన్ అను దానినుండి తర్జుమా చేయబడినవి. ఇచ్చట కా.ట’ “పంచిపెట్టునట్టి” భావములో ఉపయోగించబడినది. కావున శిష్యుల ప్రకటన ఒక ఇంటినుండి మరొక ఇంటికి పంచిపెట్టబడినది. అపొస్తలుల కార్యములు 20:20పై వ్యాఖ్యానిస్తూ, రాన్‌డాల్ఫ్ ఒ. యీగర్ వ్రాసినది ఇలా ఉన్నది, పౌలు “బహిరంగ సమావేశములలోను [డి.మో.సి’యా] ఇంటింటను (నిందమోపుతూ పంచిపెట్టునట్లు [కా.ట’]) బోధించెను. “పౌలు ఎఫెసులో మూడు సంవత్సరములు గడిపెను. ఆయన ప్రతి ఇంటిని దర్శించెను, కనీసము ప్రజలందరికి (వచనము 26) ప్రకటించెను. ఇచ్చట ఇంటింట మరియు బహిరంగ కూటములలో సువార్తను ప్రకటించుటకు లేఖన ఆమోదము ఉన్నది.”
5. అపొస్తలుల కార్యములు 20:20 నందు పౌలు ఎందుకు పెద్దలను సాంఘికంగా కలియుటనుగూర్చియో లేక కాపరిగా సందర్శించుటను గూర్చియో సూచించుటలేదు?
5 కా.ట’ ఇదే రీతిలో ఉపయోగించబడుట మనకు లూకా 8:1 నందు కనబడుతుంది. అది యేసు “ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను” ప్రకటించుటనుగూర్చి మాట్లాడుచున్నది. పౌలు అపొస్తలుల కార్యములు 20:20 నందు కాట్’ అయ్’కోస్ అను బహువచన రూపమును ఉపయోగించెను. ఇచ్చట కొన్ని బైబిలు తర్జుమాలు “మీ గృహములలో” అని చదువబడుచున్నవి. అయితే అపొస్తలుడు కేవలము పెద్దల గృహాలలో సాంఘికంగా కలియుటను లేక తోటి విశ్వాసుల గృహాలలో కాపరిగా సందర్శించుటను గూర్చి సూచించుటలేదు. ఆయన తదుపరి మాటలు, తాను అవిశ్వాసుల మధ్య చేసిన ఇంటింటి పరిచర్యను గూర్చి మాట్లాడుచున్నట్లు చూపుచున్నవి. ఎందుకనగా ఆయన: “దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును . . . . ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో మీకు తెలియును,” అని అన్నాడు. (అపొస్తలుల కార్యములు 20:21) తోటి విశ్వాసులు అప్పటికే మారుమనస్సు పొంది యేసునందు విశ్వాసముంచియున్నారు గనుక, అపొస్తలుల కార్యములు 5:42 మరియు అపొస్తలుల కార్యములు 20:20 “ఇంటింటికి” లేక ప్రతి గుమ్మముయొద్ద అవిశ్వాసులైనవారికి ప్రకటించుటకు సంబంధించినవై యున్నవి.
దానికి ప్రత్యామ్నాయము లేదు
6. ఎఫెసులో పౌలుయొక్క ప్రకటన పని స్వభావికతనుగూర్చి ఏమి చెప్పబడినది?
6 అపొస్తలుల కార్యములు 20:20 నందలి పౌలు మాటలపై వ్యాఖ్యానిస్తూ, 1844లో అబియల్ ఎబోట్ లివర్‌మోర్ ఇలా వ్రాసెను: “ఆయన కేవలము బహిరంగ సమావేశములలో ప్రసంగములిచ్చుటతోనే, లేక ఇతర సాధనములద్వారా దానిని అందించుటతోనే తృప్తిచెందక, తన గొప్పపనిని ఆసక్తితో ఒక్కొక్కరికి వ్యక్తిగతంగాను ఇంటింటికి చేరునట్లు పనిచేయుచు అక్షర్ధాముగా గృహము లోకి, అనగా ఎఫెసీయుల గృహజీవితములోకి, హృదయాలలోకి పరలోక సత్యమును తీసుకెళ్లుటయందు ఆయన పట్టుదలతో పనిచేసెను.” చాలా ఇటీవలి కాలమందు ఈ విధంగా గమనించబడినది: “తొలి శతాబ్దపు క్రైస్తవులు సువార్తను ఇంటింటికి వ్యాప్తిచేయువారిగా ఆదినుండి ప్రముఖంగా గుర్తించబడియున్నారు, (అపొస్తలుల కార్యములు 2:46; 5:42 రెంటిని ఒకదానితో మరొకదానిని పోల్చుము) . . . [పౌలు] ఎఫెసులోని యూదులయెడల, అన్యులయెడల తన బాధ్యతను పూర్తిగా తీర్చుకొన్నాడు. వారు వారి పాపములలోనే నాశనమయిన అందుకు వారు ఏ సాకు చెప్పుటకు వీలులేకుండ విడిచిపెట్టబడిరి.”—ది వెస్లేయన్ బైబిలు కామెంటరి, వాల్యూమ్ 4, పేజిలు 642-3.
7. యెహోవాసాక్షుల ఇంటింటి పరిచర్యను దేవుడు అంగీకరిస్తున్నాడని ఎందుకు చెప్పవచ్చును?
7 సువార్తను ప్రకటించుటలో బహిరంగముగా మాట్లాడుట తనదైన స్థానమును కలిగియున్నను గుమ్మముయొద్ద వ్యక్తిగతంగా కలియుటకు అది ప్రత్యామ్నాయము కాదు. ఈ విషయములో విద్వాంసుడైన జోసఫ్ అడిసన్ అలెక్సాండర్ ఇలా అన్నాడు: “చర్చియొద్ద మరియు ఇంటియొద్ద ప్రకటించుట సాధించిన ప్రయోజన స్థానములో అలాంటి ఫలితమునిచ్చు మరొకదేనినైనను అందుకు ప్రత్యామ్నాయముగా దానిస్థానములో చర్చి ఇంతవరకు ప్రవేశపెట్టలేక పోయినది.” విద్వాంసుడైన ఒ. ఎ. హిల్స్ దానిని ఇలా అన్నాడు: “బహిరంగముగా బోధించుట, ఇంటింట బోధించుట ఒకదానితో మరొకటి కలగలుపుగా వెళ్లవలసి యున్నవి.” యెహోవాసాక్షులు వారి వారపు బహిరంగ కూటములలోని ప్రసంగముల ద్వారా బోధను అందిస్తున్నారు. అంతేగాక అపొస్తలుల పద్ధతి ప్రకారము ఇంటింటికి బైబిలు సత్యమును వ్యాప్తిచేయుట కూడ ప్రతిఫలదాయకమైనదను స్పష్టమైన నిదర్శనమును వారు కలిగియున్నారు. నిశ్చయంగా యెహోవా దానిని అంగీకరిస్తున్నాడు. ఏలయనగా అటువంటి పరిచర్య ఫలితంగా ప్రతిసంవత్సరము తన ఉన్నతపరచబడిన ఆరాధనకు వేలాదిమంది ప్రవాహమువలె వచ్చునట్లు ఆయన చేయుచున్నాడు.—యెషయా 2:1-4; 60:8, 22.
8. (ఎ) ఇంటింటి పరిచర్య ఎందుకు ఫలకరమైనదో చెప్పు కారణమును గూర్చి ఏమి చెప్పబడినది? (బి) గుమ్మముయొద్ద ప్రకటించుదానికి మరియు ఇతర సాక్ష్యమిచ్చుపనికి యెహోవాసాక్షులు పౌలుకు ఎట్లు పోల్చబడవచ్చును?
8 ఇంకొక అధికార మూల మిట్లు చెప్పియున్నది: “చర్చియొద్ద బోధించబడినదానికంటె తమ గుమ్మముయొద్ద బోధించబడినదానిని జ్ఞాపకముంచుకొనుటను ప్రజలు సులభమైనదానిగా కనుగొనుచున్నారు.” శ్రేష్టమైనరీతిలో పౌలు ఒక పరిచారకునిగా మంచి మాదిరినుంచుచు క్రమంగా గుమ్మములయొద్ద ఉన్నాడు. “ఆయన సమాజమందిరము మరియు సంతలోను బోధించుట మరియు ప్రసంగించుటతోనే సంతృప్తిపడలేదు” అని బైబిలు విద్వాంసుడైన ఎడ్విన్. డబ్లు. రైస్ వ్రాసెను. “ఆయన ఎప్పుడూ శ్రద్ధతో ‘ఇంటింట’ ‘బోధించుచుండెను.’ ఆయన ఎఫెసులో, క్రీస్తుకు మనుష్యులను సంపాదించుటకు, ఇంటింటితో, ఒక్కొక్కరిని సన్నిహితముగా ఎదుర్కొంటు, ముఖాముఖిగా చెడుతో పోరాటము సలిపెను.” యెహోవాసాక్షులు గుమ్మముయొద్ద ఒక్కొక్క వ్యక్తితో కలసి చేయు చర్చలను ఫలకరమైనవిగా గుర్తించుచున్నారు. అంతేగాక వారు పునర్దర్శనములను చేయుచు, ఒక వేళ వారు అనుమతిస్తే, చివరకు వ్యతిరేకులతో కూడ సహేతుకమైన చర్చలను చేయుటకు సంతోషిస్తారు. ఇది పౌలుకు ఎంత సారూప్యముగా ఉన్నది! ఆయనను గూర్చి యఫ్. ఎన్. పిలోబెట్ ఇలా వ్రాసెను: “పౌలు పనియంత కూటములలోనే కాదు. ఎవరైన తెలిసికొనగోరుచున్నారని లేక ఆసక్తిగలవారని లేక చివరకు వ్యతిరేకించువారైనను మతమునుగూర్చి చర్చించుటకు ఇష్టపడుచున్నారని ఆయనకు తెలిసిన ప్రతిచోట అనేకులను వారివారి గృహములలో వ్యక్తిగతంగా కలిసికొనెను.”
పెద్దలు నాయకత్వము వహించవలెను
9. తోటి పెద్దలకు పౌలు ఏ మాదిరినుంచెను?
9 తోటి పెద్దలకు పౌలు ఏ మాదిరినుంచెను? వారు నిర్భయముగా మరియు అలయక ఇంటింటికి సువార్తను ప్రకటించువారిగా యుండవలెనని ఆయన చూపెను. 1879లో జె. గ్లెంట్‌వర్త్ బట్లర్ ఇలా వ్రాశాడు: “[ఎఫెసు పెద్దలకు] పౌలును గూర్చి తెలిసినదేమనగా, ఆయన [పౌలు] తన ప్రకటనలో తనకువచ్చు వ్యక్తిగత అపాయము లేక జనాదరణను గూర్చిన తలంపునుబట్టి ఏ మాత్రము ప్రభావితము చెందలేదు. అవసరమైన సత్యవిషయములో దేనిని దాచుకొనలేదు. ఒక పక్షమే వహించు పక్షపాత వైఖరితో, సత్యమునుగూర్చి ఒక ప్రత్యేకమైన లేక క్రొత్తదనముచూపు అంశములపై కేంద్రీకృతమైయుండలేదు. బదులుగా, ‘బోధించుటకు’ లేక నిర్మించుటకు కేవలము, ప్రయోజనకరమైనదానినే సంపూర్తిగా దృఢముగా కోరుచుండెను. అనగా: దేవుని ఉపదేశమంతటిని దాని స్వచ్ఛతలో, దాని సంపూర్ణతయందు ప్రవేశ పెట్టుచుండెను. ఈ విధముగా తురన్ను పాఠశాలయందు మరియు శిష్యులు సమకూడు ఇతర స్థలములలోనేగాక ప్రవేశించగలిగిన ప్రతి ఇంట క్రైస్తవ సత్యమును నమ్మకముగా చూపుట, మనఃపూర్వకమైన పట్టుదలతో బోధించుట ఆయన అలవాటైయుండెను. ఇంటింటికి, వ్యక్తివ్యక్తికి, దినదినము క్రీస్తులాంటి ఆశ మరియు పరితాపముతో సువార్తను మోసుకెళ్లెను. అన్ని తరగతులు మరియు జాతులవారికి, విరోధభావముగల యూదునికి, హేళనచేయు గ్రీకు దేశస్థునికి గూడార్ధములను వివరించునట్టియు, ఇతర రక్షణదాయకమైన ప్రాముఖ్య సత్యములతో నిండినట్టిదియునైన ఒకే అంశమును కలిగియుండెను. అదేమనగా—దేవునియెదుట మారుమనస్సుపొంది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట.”
10, 11. (ఎ) క్రైస్తవ పరిచర్య విషయంలో ఎఫెసు పెద్దలనుండి పౌలు ఏమి కోరెను? (బి) పౌలువలె, పెద్దలతోసహా యెహోవాసాక్షులు ఎటువంటి ప్రకటనపనిలో పాల్గొందురు?
10 సంక్షిప్తముగా, ఎఫెసు పెద్దలనుండి పౌలు దేనిని కోరియుండెను? అపొస్తలుని పదములను విద్వాంసుడైన ఇ. యస్. యంగ్ ఈవిధముగా క్లుప్తీకరించి చెప్పాడు: “నేను బహిరంగంగానే మాట్లాడలేదు. అన్ని తరగతుల వారికి యూదులయెడల అన్యులయెడల ఇంటింటికి వెళ్లి ప్రయాసపడితిని. అన్ని తరగతులవారికి నాపరిచర్యయొక్క అంశమేమనగా ‘దేవుని యెదుట మారుమనస్సుపొంది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటే.’” పౌలు మాటలను ఇంకో విధంగా చెబుతూ, డబ్లు. బి. రైలే ఇలా వ్రాసెను: “స్పష్టమైన అర్ధమేమిటనగా: ‘నేను మిమ్ములను కోరునదేమనగా నేను ప్రారంభించినదానిలోనే అనగా పనిచేయుట, బోధించుటలో మీరు కొనసాగవలెను. నేను ఎదిరించినట్లు మీరును ఎదిరించవలెను. నావలె బహిరంగంగాను, వ్యక్తిగతంగాను, వీధులలో మరియు ఇంటింట బోధించుచు, అలాగే యూదులకును, గ్రీకులకును దేవునియెదుట మారుమనస్సుపొంది ప్రభువైన యేసుక్రీసునందు విశ్వాసముంచవలెనని సాక్ష్యమివ్వవలెను. ఏలయనగా ఇవి ప్రాముఖ్యమైనవి!’”
11 నిశ్చయంగా, అపొస్తలుల కార్యములు 20లో, తోటిపెద్దలు ఇంటింటికి వెళ్లు యెహోవాసాక్షులైయుండవలెనని కోరబడినట్లు పౌలు చూపుచున్నాడు. ఈ విషయములో మొదటి శతాబ్దపు పెద్దలు నాయకత్వము వహిస్తూ, సంఘములోని ఇతర సభ్యులకు తగిన మాదిరిని ఉంచవలెను. (హెబ్రీయులు 13:17 ను పోల్చుము.) అప్పటి, పౌలువలెనే యెహోవాసాక్షులు ఇంటింటికి వెళ్లి ప్రకటించుచు సమస్త జనాంగములకు దేవునిరాజ్యము, ఆయన యెడల మారుమనస్సు, యేసుక్రీస్తునందు విశ్వాసమును గూర్చి చెప్పుచున్నారు. (మార్కు 13:10; లూకా 24:45-48) అలాంటి ఇంటింటి పనిలో ఆధునిక సాక్షులలో నియమించబడిన పెద్దలు నాయకత్వమును తీసుకొనవలెనని కోరబడుచున్నారు.—అపొస్తలుల కార్యములు 20:28.
12. గతములో కొందరు పెద్దలు దేనిని చేయుటకు తిరస్కరించారు, అయితే ఈనాడు పెద్దలు దేనియందు నాయకత్వము వహించుదురు?
12 చార్లెన్ టేజ్ రస్సల్ 1879లో జియోన్స్ వాచ్ టవర్ అండ్ హేరాల్డ్ ఆఫ్ క్రైస్ట్ ప్రజన్స్ అను పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. అది ప్రస్తుతము వాచ్‌టవర్ అనౌన్సింగ్ జెహోవాస్ కింగ్‌డం అని పిలువబడుచున్నది. రస్సల్ మరియు ఇతర బైబిలు విద్యార్థు రాజ్యవర్తమానమును అపొస్తలుల పద్ధతిలో ప్రకటించిరి. అయితే, తరువాతి సంవత్సరములలో కొందరు సంఘ పెద్దలు సాక్ష్యమిచ్చు తమ బాధ్యతలకు తగినట్లు జీవించలేదు. ఉదాహరణకు ఒక సాక్షి ఇలా వ్రాసెను: “1927లో—అందరు సాహిత్యములు తీసుకొని, ఇంటింటికి సాక్ష్యమిచ్చు పనిలో భాగము వహించవలెనని, ప్రత్యేకముగా ఆదివారపు ఇంటింటి పనిలో పాల్గొనవలెనని ప్రకటన చేయబడేంత వరకు అంతా సబబుగానే నడిచింది. మేము ఎన్నుకొనిన పెద్దలు మా తరగతినంతటిని ఆ పనిని చేపట్టుటకు, లేక అందు పాల్గొనుటకు నిరుత్సాహపరచిరి.” తగినకాలములో ఇంటింటి ప్రకటన పనిలో పొల్గొనుటకు ఇష్టపడని పురుషులు పెద్దలుగా సేవచేయు ఆధిక్యతనుండి తొలగించబడిరి. ఈనాడు కూడ పెద్దలుగా లేక పరిచారకులుగా సేవచేయువారు ఇంటింటికి సాక్ష్యమిచ్చుపనిలో లేక క్రైస్తవ పరిచర్యయొక్క ఇతర రూపములలో నాయకత్వము తీసుకొనవలెనని కోరబడుచున్నారు.
ప్రతిఒక్కరు ఒక సాక్షియే
13. (ఎ) ప్రజలు రాజ్యవర్తమానమును వినకపోయినను మనము ఏమి చేయవలెను? (బి) పౌలు యెహెజ్కేలుకు ఎట్లు పోల్చబడెను?
13 యెహోవా సహాయముతో, క్రైస్తవులు రాజ్యవర్తమానమును ఒక వేళ అది మెప్పుతో స్వీకరించబడకపోయినను ఇంటింటికి ప్రకటించవలెను. దేవుని కావలివానిగా యెహెజ్కేలు, ప్రజలు వినినను, వినకపోయినను వారిని హెచ్చరించవలసియుండెను. (యెహెజ్కేలు 2:5-7; 3:11, 27; 33:1-6) యెహెజ్కేలుకు మరియు పౌలుకు మధ్య సారూప్యతను చూపుతూ ఇ. యమ్. బ్లెయిక్‌లాక్ ఇలా వ్రాశాడు: “[అపొస్తలుల కార్యములు 20 అధ్యాయములోని పౌలు మాటల] నుండి ఎఫెసులో పరిచర్య ఎలా జరిగిందో ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. క్రిందివాటిని గమనించండి: మొదటిది, పౌలు తక్షణమే ప్రదర్శించిన విశ్వాస్యత. ఆయన ప్రఖ్యాతి లేక ప్రజాదరణకొరకు చూడలేదు. యెహెజ్కేలువలెనె కావలివాని పనికి నియమించబడి, తన కర్తవ్యమును యథార్థమైన ఆసక్తి, తన మాటలకు బలము చేకూర్చగల ప్రవర్తనను బట్టి నెరవేర్చాడు. రెండవది, ఆయన ప్రేమగల సానుభూతి. ఆయన నాశనమునుగూర్చిన మాటలను ఏ విధమైన భావప్రేరణ లేకుండా పెదవులతో మాట్లాడేవాడు కాదు. మూడవది, ఆయన అలుపులేని శ్రమకోర్చెడి సువార్త పని. బహిరంగముగాను ఇంటింటను, నగరములోను, ఆ ప్రాంతమంతట ఆయన సువార్తను ప్రకటించెను.”
14. సాక్ష్యమిచ్చుట యేసుక్రీస్తుద్వారా ప్రార్థనలో యెహోవాకు సమర్పించుకున్న ప్రతిఒక్కరి బాధ్యత ఎందుకైయున్నది?
14 తన ప్రస్తుత దిన సేవకులపై దేవుని విస్తారమైన దీవెన, వారు యెహోవాసాక్షులను పేరును ధరించుటలో ఆయన ఆనందిస్తున్నాడని నిస్సంశయముగా చూపుతుంది. (యెషయా 43:10-12) అంతేగాక వారు క్రీస్తుకు కూడ సాక్షులైయున్నారు. ఎందుకనగా యేసు తన అనుచరులతో: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.” (అపొస్తలుల కార్యములు 1:8) కావున సాక్ష్యమిచ్చుట ప్రార్థనలో యేసుక్రీస్తుద్వారా యెహోవా దేవునికి సమర్పించుకున్న ప్రతిఒక్కరి బాధ్యతైయున్నది.
15. తొలి క్రైస్తవుల సాక్ష్యమిచ్చు పనినిగూర్చి ఏమి చెప్పబడియున్నది?
15 సాక్ష్యమిచ్చుటనుగూర్చి ఇట్లు చెప్పబడినది: “అందులో చర్చి అంతయు ఇమిడియున్నది. తొలి చర్చి మిషనరి ఉద్యమము స్త్రీ మిషనరీ సొసైటి లేక ఇతరదేశాలకు పంపు మిషనరి బోర్డు బాధ్యతపై ఆధారపడినది కాదు. లేక సాక్ష్యమిచ్చుపని నిపుణులైన పెద్దలు, డీకన్లు, లేక అపొస్తలులకే వదలిపెట్టబడలేదు. . . . ఆ తొలి రోజులలో చర్చియే మిషనుగా ఉండెను. తొలికాలపు చర్చి మిషనరీ కార్యక్రమము రెండు ఉద్దేశ్యములపై ఆధారపడియుండెను: (1) చర్చియొక్క ముఖ్యమైన పని ప్రపంచమంతట సువార్తను ప్రకటించుట. (2) ఈ పనిని నెరవేర్చవలసిన బాధ్యత క్రైస్తవ సమాజమంతటిపై ఆధారపడియుండుట.—జె. హెర్‌బర్ట్ కేన్.
16. క్రైస్తవులనుగూర్చి మరియు సాక్ష్యమిచ్చుటను గూర్చి క్రీస్తుమత సామ్రాజ్యములోని రచయితలు సహితము దేనిని ఒప్పుకొందురు?
16 ఆధునిక దిన క్రీస్తుమత సామ్రాజ్యపు రచయితలు రాజ్యవర్తమానముతో ఏకీభవించక పోయినను, కొందరు సాక్ష్యమిచ్చుట క్రైస్తవ కర్తవ్యమని ఒప్పుకొందురు. ఉదాహరణకు ఎవ్విరివన్ ఎ మినిస్టర్, అను పుస్తకములో ఆస్కార్. ఇ. ప్యూట్ ఇట్లు అభిప్రాయపడెను: “దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన పరిచర్యను ఏ పాస్టరు నెరవేర్చలేడు. దురదృష్టకరంగా శతాబ్దములుగాయున్న చర్చియొక్క తప్పుగ్రహింపు గుడికి సంబంధించిన 500 మంది పనిని ఒక్క పాస్టరుకు అప్పగించునట్లు చేసినది. అయితే తొలి చర్చిలో పరిస్థితి అలా లేదు. విశ్వసించినవారు వాక్యమును ప్రకటిస్తూ ప్రతిచోటికి వెళ్లిరి.”
17. తొలి క్రైస్తవుల జీవితములలో సాక్ష్యమిచ్చు పని కలిగియున్న స్థానమునుగూర్చి ఏమి చెప్పవచ్చును?
17 ఈనాడు యెహోవా ప్రజల మధ్యయున్నట్లే తొలి క్రైస్తవుల జీవితములో సాక్ష్యమిచ్చుట అతి ప్రధానవిషయమైయుండెను. “విశదంగా చెప్పాలంటే, మొదటి మూడు శతాబ్దముల క్రైస్తవ కదలిక విశ్వాసమును వ్యాప్తిచేయుటలో గొప్ప ఉత్సాహముతో కూడినదిగా గుర్తింపబడినది. క్రైస్తవ అభిలాషయంతయు విమోచనా వర్తమానమును చెప్పుటయే. . . . అయినను యేసుయొక్క ప్రభావము, బోధలను వ్యాప్తిచేయుట తొలికాలములో మనము మిషనరీలని పిలువవలసినవారికి కొంతవరకే పరిమితమైయున్నది. అది సమాజములోని సమస్త వృత్తులు, రంగము, తరగతులలోని మనుష్యులు సాధించినది. వారు రోమా సామ్రాజ్యములోని అతి సుదీర్ఘప్రాంతాలకు ఆ అంతఃజీవితములోని రహస్యమును, లోకముయెడలగల ఆ నూతన దృక్పథమును వారి అనుభవములో రక్షణయైనదానిని మోసుకొనివెళ్లిరి. [తొలి క్రైస్తవత్వము] ప్రస్తుత లోక విధానంతపు సమీపతనుగూర్చి ఎంతో ఎక్కువగా ఒప్పించబడిరి. అది నూతన లోక విధానము ఆకస్మికముగా, అద్భుతంగా స్థాపించబడుటయందు నమ్మకముంచినది.”
18. ఏ గొప్ప నిరీక్షణ రాజకీయనాయకుల కలలకంటే ఎంతో మిన్నయైనది?
18 వారి ఇంటింటి సాక్ష్యపు పనిలోను మరి ఇతర రూపముల పరిచర్యలోను యెహోవాసాక్షులు ఆనందముతో తమను వినువారిని దేవుడు వాగ్దానముచేసిన నూతన లోకమువైపు మళ్లించుదురు. దానిని గూర్చి ప్రవచింపబడిన నిత్యజీవపు ఆశీర్వాదములు నూతనలోక విధానమును నిర్మించబోతున్నామనుకొనుచున్న వారి ప్రస్తుత మధుర స్వప్నములకంటే ఎంతో మిన్నగా ఉండును. (2 పేతురు 3:13; ప్రకటన 21:1-4) ప్రతి ఒక్కరు దేవుని అద్భుత నూతన లోకములో జీవించుటకు ఇష్టపడునట్లు కన్పించుచున్నను, విషయము మాత్రము అది కాదు. ఏమైనను, నిత్యజీవమును వెదకువారికి యెహోవా సేవకులు బోధించగల కొన్ని ఫలవంతమైన మార్గములేమో తదుపరి పరిశీలించుదము. (w91 1/15)
మీరెట్లు ప్రత్యుత్తర మిచ్చెదరు?
◻ అపొస్తలుల కార్యములు 5:42 మరియు అపొస్తలుల కార్యములు 20:20 యేసు అనుచరులు ఇంటింటికి ప్రకటించవలెనను భావము కలిగియున్నదని మనమెందుకు చెప్పగలము?
◻ యెహోవాసాక్షుల ఇంటింటి పరిచర్యను దేవుడు అంగీకరిస్తున్నాడని మనకెట్లు తెలియును?
◻ పరిచర్య విషయములో పెద్దలనుండి పరిచారకులనుండి ఏమి కోరబడుచున్నది?
◻ క్రైస్తవుని జీవితములో సాక్ష్యమిచ్చుపనికి ఏ స్థానముండవలెను?
[22వ పేజీలోని చిత్రం]
సా.శ. 33.,లో యేసు శిష్యులు మానక ఇంటింట సాక్ష్యమిచ్చిరి
[25వ పేజీలోని చిత్రం]
పౌలు “ఇంటింటికి” బోధించెను. ఈ విధమైన పరిచర్య ఈనాడు యెహోవాసాక్షులవలన జరిగించబడుచున్నది