విశ్వాసము మరియు జ్ఞానము మన కెందుకవసరము?
యాకోబు పత్రికనుండి ఉన్నతాంశములు
శోధనలు వచ్చినపుడు యెహోవా సేవకులకు ఓర్పు అవసరము. దైవ అనుగ్రహమును పోగొట్టు పాపములను కూడ వారు విడిచి పెట్టవలెను. అట్టి విషయాలు యాకోబు పత్రికలో నెక్కిచెప్పబడినవి, వాటి విషయంలో కృషి సల్పుటకు చురుకైన విశ్వాసము, పరలోక జ్ఞానము అవసరము.
ఈ పత్రికా రచయిత తాను, యాకోబు అను పేరుగల్గిన యేసు ఇద్దరు అపొస్తలులలో ఒకనిగా ఎంచుకొనుటలేదు, గాని “దేవునియొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసునిగా” చెప్పుకొనెను. అట్లే యేసు తోడబుట్టిన సహోదరుడైన యూదా, తాను “యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనని” చెప్పుచున్నాడు. (యాకోబు 1:1; యూదా 1; మత్తయి 10:2, 3) అందుచేత, యేసు తోడబుట్టిన సహోదరుడైన యాకోబు స్పష్టమైనరీతిగా తన పేరు కల్గిన పత్రికను వ్రాసెను.—మార్కు 6:3.
సా.శ. 70లో జరిగిన యెరూషలేము నాశనమును ఈ పత్రిక ప్రస్తావించుట లేదు. మరియు రోమా చక్రవర్తి ప్రతినిధియైన ఫేస్తు మరణించిన కొంతకాలమునకు యాకోబు హతసాక్షియాయెనని చరిత్రకారుడైన జోసఫస్ సూచించెను. స్పష్టమైన విధంగా ఈ పత్రిక సా.శ. 62 నకు ముందు వ్రాయబడెను. ఇది ఆత్మీయ ఇశ్రాయేలు “పండ్రెండు గోత్రముల” వారికి సంబోధించబడెను, ఎందుకనగా “ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసమును” చేపట్టినవారికిది అన్వయించబడెను.—యాకోబు 1:1; 2:1; గలతీయులు 6:16.
యాకోబు తన సలహాలను మనము జ్ఞాపకముంచుకొనుటకు సహాయపడునట్టి దృష్టాంతముల నుపయోగించెను. ఉదాహరణకు అతడు, జ్ఞానము కొరకు దేవుని అడుగువాడు సందేహింపకూడదనెను, “సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్రతరంగమును పోలియుండును.” (1:5-8) మన నాలుక మన స్వాధీనములో ఉండవలెను. ఎందుకనగా చుక్కాని ఓడను నడుపురీతిగా అది మన మార్గమును మలచగలదు. (3:1, 4) శోధనలను సహించుటకు, వ్యవసాయకుడు భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనియుండునట్లుగా, ఓపికతో కూడిన సహనము మనము ప్రదర్శించవలెను.—5:7, 8.
విశ్వాసము, శోధనలు, క్రియలు
శోధనలు వచ్చినప్పటికిని, క్రైస్తవులముగా మనము సంతోషముగా ఉండగలమని యాకోబు మొదట చూపెను. (1:1-18) వీటిలో కొన్ని శోధనలు అనగా అనారోగ్యమువంటివి, మానవులందరికి సహజము, కాని క్రైస్తవులు దేవునికి క్రీస్తుకు దాసులైనందున కూడ శ్రమలను అనుభవించుదురు. జ్ఞానముకొరకు మనము విశ్వాసముతో అడుగుచూ ఉన్నట్లయితే సహించుటకు కావలసిన జ్ఞానమును యెహోవా మనకు దయచేయును. ఆయన కీడు విషయమై మనలను ఎన్నడూ శోధించడు, మేలైనది మనకు దయచేయునని మనము ఆయన మీద ఆధారపడగలము.
దేవుని సహాయము పొందాలంటే, విశ్వాసమును కనబర్చు క్రియలద్వారా మనము ఆయనను ఆరాధించవలెను. (1:19–2:26) మనము కేవలము వినువారము మాత్రము కాక “వాక్యప్రకారము ప్రవర్తించువారముగా” ఉండవలెను. మనము నాలుకను అదుపుచేయవలెను. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించి యిహలోక మాలిన్యము అంటకుండ ఉండవలెను. మనము ధనవంతులను సన్మానించి బీదలను అవమానిస్తే ప్రేమను గూర్చి “ప్రాముఖ్యమైన ఆజ్ఞను” ఉల్లంఘించు వారమగుదుము. అబ్రాహాము, రాహాబు మాదిరులు బాగుగా దృష్టాంతపర్చినట్లు విశ్వాసము క్రియలద్వారా ప్రదర్శించబడునని కూడ మనము గుర్తించుకొనవలసియున్నాము. నిజమే “క్రియలు లేని విశ్వాసము మృతము.”
పరలోక జ్ఞానము మరియు ప్రార్థన
తమ విధులను నిర్వర్తించుటకు బోధకులకు విశ్వాసము, జ్ఞానము రెండును అవసరము. (3:1-18) ఉపదేశకులుగా వారికి చాలా గొప్ప బాధ్యత ఉన్నది. వారివలె మనమును నాలుకకు కళ్ళెము వేయవలెను, దీనిచేయుటకు మనకు పరలోక జ్ఞానము సహాయపడును.
లోక పోకడలకు లొంగిపోవుటవలన దేవునితో మనకుగల సంబంధము చెడిపోవునని మనము గుర్తించునట్లు కూడ జ్ఞానము సహాయముచేయును. (4:1–5:12) స్వార్థముతో కూడిన ధ్యేయములను సాధించుటకు పోరాడినయెడల లేక మన సహోదరులకు తీర్పుతీర్చిన యెడల మనము పశ్చాత్తాప పడవలెను. ఈ లోకముతో స్నేహము చేయకుండుట ఎంతో ప్రాముఖ్యము, ఎందుకనగా అది ఆత్మీయ వ్యభిచారమే! నిర్లక్ష్యము చేయకుందము. ఓరిమిలేని ఆత్మనుండియు ఒకనిమీదనొకడు సణుగుకొనుటనుండియు మనలను మనము కాపాడుకొందము గాక.
ఎవడైనను ఆత్మీయ రోగముతో బాధపడుచున్నట్లయిన అతడు సంఘ పెద్దల సహాయము కోరవలెను. (5:13-20) పాపములు చేయబడినట్లయితే, వారి ప్రార్థనలు మరియు జ్ఞానయుక్త సలహా పశ్చాత్తాపపడిన పాపి తిరిగి ఆత్మీయ ఆరోగ్యమును పొందుటకు సహాయపడును. వాస్తవమునకు, “పాపిని వాని తప్పుమార్గములనుండి మళ్లించువాడు (ఆత్మీయ మరియు నిత్య) మరణము నుండి యొక (అపరాధము చేసినవాని) ఆత్మను రక్షించును. (w91 3/15)
[29వ పేజీలోని బాక్సు]
వాక్య ప్రకారము ప్రవర్తించు వారు: మనము “వినువారు మాత్రము కాక వాక్య ప్రకారము ప్రవర్తించువారమై” యుండవలెను. (యాకోబు 1:22-25) కేవలము వినువాడు “అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.” కొంతసేపు తన్ను పరిశీలించుకొన్న తరువాత అతడు వెళ్లిపోయి, “తానెట్టివాడో వెంటనే మరచిపోవును.” కాని “వాక్య ప్రకారము ప్రవర్తించువాడు, “క్రైస్తవునిగా చేయవలసిన దానినంతటిని కలిగియున్న దేవుని సంపూర్ణమైన లేక సమగ్రమైన చట్టమువైపు జాగ్రత్తగా చూచును. అతడు “(దానిలో) నిలకడగా ఉండి” దానితో పొందిక కల్గియుండుటకు తప్పులను సరిదిద్దుకొను ఉద్దేశ్యముతో ఆ చట్టమును పరిశోధించుచు కొనసాగును. (కీర్తన 119:16) అద్దములో చూచుకొని అది తెలియజేసిన దానిని మర్చిపోవు వానినుండి “క్రియచేయువారు” ఎట్లు వేరైయుండును? ఎందుకంటే, క్రియచేయువాడు యెహోవా వాక్యమును ఆచరణలో పెట్టి ఆయన అనుగ్రహమును బట్టి ఆనందిస్తాడు!—కీర్తన 19:7-11.