యెహో సేవలో సంతోషించు యౌవనులు
“బాలుడు సహితము తన ప్రవర్తన శుద్ధమైనదో కాదో మరియు సరియైనదో కాదో, తన చేష్టలవలన తెలియపరచును.”—సామెతలు 20:11, న్యూ ఇంటర్నేషనల్ వర్హన్.
1. సమూయేలునుగూర్చి బైబిలుచెప్పు అసాధారణమైన విషయములు కొన్ని ఏమైయున్నవి?
షిలోహులోని యెహోవా మందిరములో “పరిచర్య” ప్రారంభించునాటికి బాలుడైన సమూయేలుకు కేవలము మూడు నుండి ఐదు సంవత్సరముల వయస్సు ఉండవచ్చును. ఆయన చేయవలసిన పనులలో ఒకటి “యెహోవా మందిరపు తలుపులను” తీయుటయై యుండెను. “సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను” అని బైబిలు చెప్పుచున్నది. ఎదిగినప్పుడు ఆయన ఇశ్రాయేలీయులను మరలా సత్యారాధనకు తెచ్చెను. ఆయన “తాను బ్రదికిన దినములన్నియు” దేవుని సేవించెను. ఆయన “తల నెరసిన ముసలివాడయినను” ప్రజలు “యెహోవాయందు భయభక్తులు కలిగి, . . . నిష్కపటులై (సత్యమందు) . . . ఆయనను సేవించుమని” ప్రజలను వేడుకొనెను. సమూయేలునుగూర్చి ప్రజలట్లు చెప్పిరని బైబిలు చెప్పుచున్నట్లుగా వారు ఇటువంటి శ్రేష్ఠమైన సంగతులను మిమ్మునుగూర్చి చెప్పగల్గుట అద్భుతకరముగా ఉండదా?—1 సమూయేలు 1:24; 2:18, 26; 3:15; 7:2-4, 15; 12:2, 24.
2. ఈనాడు యెహోవా ప్రజల కూటములలో పసివారు ఏమి నేర్చుకొందురు?
2 నీవు యెహోవా సాక్షులలో ఒకడవైనట్లయిన లేక వారి క్రైస్తవ కూటములకు హాజరైనట్లయిన ఈ పాఠ్యభాగము చదువబడు రాజ్యమందిరములో ఒకసారి కలియజూడుము. నీవు అన్ని వయస్సుల వారిని చూచెదవు. బహుశ వారిలో ఇప్పటికే “తల నెరసిన ముసలివారు” కలరు. ఇంకా అక్కడ తలిదండ్రులు, యౌవనులు, చిన్నపిల్లలు, ఇంకా చేతులలోనేవున్న పసివారును కలరు. ఈ పసివారు సహితము ఇప్పటికే నేర్చుకొనుచున్నారా? అవును. చిన్నవారిగానే యున్నప్పుడు తాముగా కూటములకు తీసుకురాబడిన వారిని అడుగుము. తాము చిన్నతనమునుండే దేవుని గౌరవించుటను, ఆయన ప్రజలను ప్రేమించుటను, ఆయన ఆరాధింపబడు స్థలములను ప్రశంసించుటను నేర్చుకొనిచుండిరని వారు నమ్మకముగా మీకు చెప్పుదురు. సమయము గడచుచుండగా చిన్నవారు అద్భుతకరమైన సంగతులను నేర్చుకొందురు. అనేకమంది యౌవనులును జ్ఞానమందును గుణగ్రహణయందును ఎదిగిన తర్వాత, ‘యౌవనులు, కన్యకలు వృద్ధులు, బాలురు’ గల గుంపులో భాగమగుదురు, వీరిని కీర్తన రచయిత “యెహోవా నామమును స్తుతించవలెను, ఏలయనగా ఆయన నామము మహోన్నతమైన నామమని” వేడుకొనెను.—కీర్తన 148:12, 13.
3. బైబిలును ఎరిగియున్న యౌవనులు జీవితమును దానిని ఎరుగని వారికి భిన్నముగా చూచుదురనుట ఎట్లు?
3 నీవు తలిదండ్రులు క్రమముగా అటువంటి కూటములకు తీసికొనివచ్చు బాలుడవైనట్లయిన, నీవు ప్రత్యేకముగా ఆశీర్వదించబడినవాడవు. అనేకమంది ఇతర యౌవనులు లోక సమస్యలవలన కష్టాలను ఎదుర్కొనుచున్నారు. కొందరు భూమి నాశనము చేయబడునను భయమును కలిగియున్నారు. దేవుడు దానిని సంభవింపజేయనీయడని, ఈ అందమైన గ్రహమును మానవులు నాశనముచేయుటకు ఆయన అనుమతించడని నీకు తెలియును. అట్లు సంభవించుటకు బదులు, బైబిలు ప్రకారము, దేవుడు “భూమిని నశింపజేయువారిని నశింపజేయును.” దేవుని నూతన లోకములో తేజోవంతమైన భవిష్యత్తు సమీపమందున్నట్లు బైబిలు వాగ్దానము చేయుచున్నదని నీవెరిగియున్నావు.—ప్రకటన 11:18; కీర్తన 37:29; 2 పేతురు 3:13.
నీ స్వంత విశ్వాసము
4. దేవుని మార్గముల నెరుగుట యౌవనులపై ఏ బాధ్యతనుంచును, మరియు దీని విషయములో బాలుడైన సమూయేలు ఎట్లు ఒక శ్రేష్ఠమైన మాదిరియైయున్నాడు?
4 క్రైస్తవ సత్యమును మొదట, నీ తలిదండ్రులు అనుసరించియుండవచ్చును. బహుశ వారు నిన్ను తీసికొనివచ్చినందున నీవు క్రైస్తవ కూటములకు వచ్చియుండవచ్చును, మరియు వారు చేయుచున్నందున బహుశ నీవును దైవ సేవయందు భాగము వహించియుండవచ్చును. అయినను, కాలము గడచుకొలది, యెహోవాను సేవించుట మరియు ఆయనకు లోబడుట నీ స్వంత ఆనందముగా తయారు కాగలదు. బాలుడైన సమూయేలు తల్లి ఆయనను సరియైన మార్గమున పెట్టెను, అయితే ఆయన వ్యక్తిగతముగా దానిని అనుసరించవలసియుండెను. మనమిట్లు చదువుదుము: “బాలుడు సహితము తన ప్రవర్తన శుద్ధమైనదో కాదో మరియు సరియైనదో కాదో, తన చేష్టలవలన తెలియపరచును.”—సామెతలు 20:11, NIV.
5. (ఎ) బైబిలు ఏ గొప్ప విలువను కలిగియున్నది? (బి) దేవుని లిఖితవాక్య ప్రాముఖ్యతను గూర్చి పౌలు తిమోతికి ఏమిచెప్పెను?
5 దేవుడు మననుండి ఏమికోరుచున్నాడో లేఖనములు మనకు తెలియజేయును. అవి మనకు మేలుచేయగల విస్తారమైన సమాచారమును సమకూర్చుచు, ఆయనను ఎట్లు ప్రీతిపరచవలెనో స్పష్టముగా చూపించును. అపొస్తలుడైన పౌలు తన యువ సహాయకుడగు తిమోతికి ఇట్లు చెప్పెను: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”—2 తిమోతి 3:16, 17.
6. తెలివి మరియు దైవిక జ్ఞానముల ప్రాముఖ్యతను గూర్చి సామెతల గ్రంథము ఏమి చెప్పుచున్నది?
6 “ఉపదేశమును అవలంభించి (విని) జ్ఞానులై యుండుడి” అని కూడ బైబిలు మనకు చెప్పుచున్నది. దాచబడిన ధనమును వెదకినట్లు నీవు వెదకుచుండగా, “తెలివికై మొర్రపెట్టుటకు” మరియు వివేచనను “వెదకుటకు” దేవుని ఆజ్ఞలను “దాచుకొనుమని” అది తెల్పుచున్నది. నీవు ఈ సలహాను పాటించినట్లయిన, అప్పుడు “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు, దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.” మనము ఈ హెచ్చరికనుకూడా కనుగొందుము: “కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాని నవలంభించి (విని) జ్ఞానులై యుండుడి నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.” నీవు బైబిలును అంత విలువైనదిగా ఎంచుదువా మరియు అది చెప్పుచున్న సంగతులను నేర్చుకొనుటకు అటువంటి ప్రయత్నము చేయుదువా?—సామెతలు 2:1-5; 8:32-35.
జ్ఞానము సంపాదించుము
7. మనము నేర్చుకొనవలసిన అతి ప్రాముఖ్యమైన విషయములేమై యున్నవి?
7 కొంతమంది యౌవనులు సమస్త క్రీడల గణాంకవివరములను ఎరిగియుందురు, లేక వారు వారి అభిమాన సంగీత బృందమునుగూర్చి పూర్తిగా నీకు చెప్పగలరు. వారు వాటియందు ఆసక్తి కలిగియున్నందున వాటిని సులభముగా నేర్చుకొందురు మరియు గుర్తుపెట్టుకొందురు. అయితే ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమనగా, దేవునిగూర్చి వారు ఏమి ఎరిగియున్నారు? ఆయన ఏమి చేసెనో కొంచెమాలోచించుము. దేవుడు ఈ విశ్వమును చేసెను. మనుష్యులు ఏమిచేయుదురు మరియు ఏ సంఘటనలు జరుగునో ఆయన ఎంతో కాలము ముందే తెలియజెప్పెను. బైబిలు దేవుని గూర్చియే కాకుండా, మనము ఆయనను ఎట్లు ప్రీతిపరచగలమో కూడ బోధించుచున్నది. మనమిప్పుడే ఎట్లు ధన్యతగల జీవితమును కలిగియుండగలము మరియు ఆయన నీతియుక్త నూతన లోకములో నిత్యజీవము నెట్లు సంపాదించుకొనగలమో చూపించుచున్నది. ఒకానొక బంతి ఆటలో ఎవరు గెలిచిరని తెలిసికొనుట లేక ప్రజలు త్వరగా మరచిపోవు సంగీతకారుల పేర్లను గుర్తుపెట్టుకొనుటకంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది కాదా?—యెషయా 42:5, 9; 46:9, 10; ఆమోసు 3:7.
8. యేసు మరియు యోషీయా ఎటువంటి మంచి మాదిరినుంచిరి?
8 రాజైన యోషీయా 15 సంవత్సరముల వయస్సువాడప్పుడు, “తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనెను.” యేసు 12 సంవత్సరముల వయస్సువాడప్పుడు, యెహోవాయొక్క “దేవాలయములో బోధకులమధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండెను.”a నీ వయస్సు ఏదైనను, దేవుడు చేసిన మరియు ఇంకను చేయవలసిన సంగతులనుగూర్చి నేర్చుకొనుటకు యోషీయా మరియు యేసువంటి నిజమైన ఆసక్తిని వృద్ధిచేసికొనియున్నావా?—2 దినవృత్తాంతములు 34:3; లూకా 2:46.
9. (ఎ) అనేకమంది యౌవనులు ఏ సమస్యను కలిగియున్నారు? (బి) చదువుటను మరియ పఠించుటను ఏది సులభము చేయును, మరియు ఇది నిజమని నీవు వ్యక్తిగతముగా కనుగొనియున్నావా?
9 ఏమైనను, నీవిట్లనవచ్చును: ‘చదవడం కష్టమైన పని’ అని అనేకమంది ప్రజలు వృద్ధులేమి పడుచువారేమి, చదువుట సులభమగునంతగా ఎన్నడును చదువలేదు. నీవు ఎంత ఎక్కువ చదువుదువో, నేర్చుకొనుట అంత సులభమగును. నీవు ఇదివరకే ఎరిగియున్న సంగతులకు క్రొత్త తలంపులను చేర్చుదువు, అలా నీవు వాటిని అర్థము చేసికొనుట మరియు గుర్తుచేసికొనుట సులభమగును.
10. (ఎ) క్రైస్తవ కూటములనుండి నీవెట్లు ఎక్కువ ప్రయోజనము పొందగలవు? (బి) ఈ విషయములో నీ స్వంత అనుభవమేమై యున్నది?
10 దేవునిగూర్చి మరింత నేర్చుకొనుటకు నీకు ఏది సహాయపడగలదు? బహుశ నీవు క్రైస్తవ కూటములకు మరియెక్కువ క్రమముగా హాజరుకావలసి యుండును. నీవు ముందుగనే సిద్ధపడి నిజముగా వాటియందు భాగము వహింతువా? ఉదాహరణకు, ఈ పాఠ్యభాగమందు చూపబడినను ఎత్తివ్రాయబడని లేఖన వచనములను చూచుటద్వారా నీవు మరింత లోతైన జ్ఞానము పొందుదువా? పేరాకు లేక పాఠ్యభాగమునకు ఈ వచనములు ఏ భావమును చేర్చునో గుర్తుచేయుటకు ఖాళీస్థలమందు ఒకటి లేక రెండు మాటలను నీవు వ్రాసికొనియున్నావా? లేఖన చర్చయెడల నీ ప్రశంసను ప్రదర్శించు వ్యాఖ్యానమందు వీటిలో ఒక వచనమునైనను చేర్చు అలవాటు నీకున్నదా? అనేక సంవత్సరములు క్రమముగా కూటములకు హాజరైన ఒక సంఘ పెద్ద ఇట్లు చెప్పుచున్నాడు: “నేను నిజముగా సిద్ధపడని ఏ పాఠ్యభాగము మీదైనను మనస్సు నిలుపుట కష్టమని నేను కనుగొంటిని, అయితే బహుగా పఠనము చేసిన దానిని అనుసరించుట ఖచ్ఛితముగా ఆనందదాయకము.”
11. బైబిలు-ఆధారిత ప్రసంగాలనుండి నీవు ఎక్కువను ఎట్లు పొందగలవు, మరియు ఇది ఎందుకంత ప్రాముఖ్యమైయున్నది?
11 నీవు బైబిలు ప్రసంగములను వినునప్పుడు, ప్రసంగము ఎట్లు వృద్ధిచేయబడినదో పరిశీలించుటకు మరియు చెప్పబడిన విషయాలపై నీ మనస్సు నిలుపుటకు నీవు క్లుప్తముగా నోట్సు వ్రాసికొందువా? మరింత సులభముగా అర్థము చేసికొనుటకు మరియు గుర్తుపెట్టుకొనుటకు వినుదానిని నీవు అదివరకే ఎరిగియున్న దానితో పోల్చుదువా? యేసు ఇట్లు ప్రార్థించెను: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము”. (యోహాను 17:3) జీవమునకు నడుపు జ్ఞానము నీవు సంపాదించవలసిన శ్రేష్ఠమైన జ్ఞానము కాదా? దీనినిగూర్చి బైబిలు ఏమి చెప్పుచున్నదో గమనించుము: “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు; తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును. జ్ఞానము నీ హృదయమును జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును, బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును.”—సామెతలు 2:6, 10, 11.
గుణగ్రహణయందు వృద్ధియగుము
12. దేవుడు మనకొరకు చేసియున్న కొన్ని అతిప్రాముఖ్యమైన సంగతులు ఏమైయున్నవి?
12 దేవుడు నీకొరకు చేసినదానిని నీవు నిజముగా గుణగ్రహించుచున్నావా? ఆయన అందమైన భూమిని సృజించి జీవముకొరకు దానిని సిద్ధము చేసెను. ఆయన మన మొదటి తలిదండ్రులను సృష్టించి, ఆ విధముగా మనము జన్మించుటను సాధ్యపరచెను. ఆయన మనకొరకు కుటుంబముల మద్దతు మరియు ప్రేమగల సంఘమును ఏర్పాటుచేసెను. (ఆదికాండము 1:27, 28; యోహాను 13:35; హెబ్రీయులు 10:25) ఆయనను గూర్చి మనకు ఎక్కువ బోధించుటకు మరియు నిత్యజీవమును సాధ్యపరచు విమోచన క్రయధనమును సమకూర్చుటకు ఆయన తన స్వంత కుమారుని ఈ భూమికి పంపెను. అటువంటి అద్భుతకరమైన ఈవులను నీవు నిజముగా ప్రశంసింతువా? ఆయనను గూర్చి నేర్చుకొనుటకు మరియు ఆయనను సేవించుటకు ఆయనిచ్చు ఆహ్వానమును అంగీకరించుటకు అవి నిన్ను కదిలించునా?—మత్తయి 20:28; యోహాను 1:18; రోమీయులు 5:21.
13. ఆయావ్యక్తుల యెడల దేవుడు శ్రద్ధ కలిగియున్నాడని నీవెందుకు భావింతువు?
13 ఈ విశ్వసృష్టికర్త ప్రజలయందు శ్రద్ధ కలిగియున్నాడు. ఆయన అబ్రాహామును “నా స్నేహితుడని పిలిచెను,” మరియు ఆయన మోషేతో ఇట్లనెను: “నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాను.” (యెషయా 41:8; నిర్గమకాండము 33:12) దేవుడు ఒక సూచనార్థక గ్రంథము లేక “జీవగ్రంథమును” కలిగియున్నాడని, అందు “జగదుత్పత్తి మొదలుకొని” ఆయన నమ్మకమైన సేవకుల పేర్లు వ్రాయబడియున్నవని ప్రకటన గ్రంథము సూచించుచున్నది. నీ పేరు అందు చేర్చబడునా?—ప్రకటన 3:5; 17:8; 2 తిమోతి 2:19.
14. దేవుని సూత్రములను అనుసరించుట నీ జీవితమును ఎట్లు అభివృద్ధి పరచగలదు?
14 దేవుని సూత్రములు పనిచేయును. ఆయన పద్ధతిచొప్పున చేయుట అనేక సమస్యలను—లైంగిక దుర్నీతిని, మాదక ద్రవ్యములకు అలవాటుపడుట, త్రాగుబోతుతనము, కోరని గర్భధారణలు, సుఖరోగములు, హింస, నరహత్య, ఇంకా ఇతర సమస్యల పెద్ద పట్టికను తొలగించివేయును. ఆయన మార్గము ననుసరించుట నీవు నిజమైన స్నేహితులను కనుగొనుటకు మరియు సంతోషదాయకమైన జీవితమును జీవించుటకు కూడ సహాయపడును. అలా చేయడము ప్రయోజనకరము కాదా? (1 కొరింథీయులు 6:9-11) దేవుని మార్గమందు పనులు చేయవలెనని తీర్మానించుకొను యౌవనుడు సహితము సరియైనది చేయుటకు మరింత బలము పొందగలడు. బైబిలిట్లు చెప్పుచున్నది: “యథార్థవంతుల యెడల [యెహోవా] యథార్థవంతునిగా” ఉండును. ఆయన “తన భక్తులను విడువడని” “తన ప్రజలను ఎడబాయడని” కూడ అది మనకు అభయమిచ్చుచున్నది.—కీర్తన 18:25; 37:28; 94:14; యెషయా 40:29-31.
దేవుని సేవించుటలో ముందుకు సాగుము
15. యువతకు సొలొమోను ఎటువంటి దైవిక సలహానిచ్చెను?
15 నీ గమ్యములు మృతమగుచున్న ఈ పాతలోకములో కేంద్రీకృతమైయున్నవా లేక నీతియుక్త నూతన లోకములోనా? ఎవరి మాట విందువు, దేవునిదా లేక ఆయనను విభేదించు లోకములో జ్ఞానులనబడిన వారిదా? వినోదము, ఉన్నత విద్య, లేక సమయాన్నంతా తీసికొను ఉద్యోగము దేవుని మరియు ఆయన సేవకంటె ముందు వచ్చుచున్నదా? మన జీవితములలో ఏది ముందు రావలెనో చూపుటకు జ్ఞానియైన సొలొమోను ప్రసంగి గ్రంథమంతటిని వ్రాసెను. చివరకు ఆయన చెప్పినదేమనగా: “దుర్దినములు రాకముందే, ‘ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని’ నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:1, 13.
16. మరిన్ని ఆధిక్యతలకు యౌవనస్థులు ఎట్లు చేరుకొనగలరు?
16 నీవెరిగియున్న వృద్ధ క్రైస్తవ సహోదరులందరు—పెద్దలు, పయనీర్లు, మరియు మీ ప్రాంతీయ మరియు జిల్లా కాపరులు—ఒకప్పుడు పిల్లలే. ఈనాడు వారు అనుభవించుచున్న ఆశీర్వాదములకు వారిని ఏమి నడిపించెను? వారు దేవుని ప్రేమించి ఆయనను సేవించుటకు ఇష్టపడిరి. వారిలో అనేకమంది జ్ఞానము మరియు అనుభవము సంపాదించుటకు వారు కలిగియుండిన సమయమును సద్వినియోగపరచుకొనిరి. వారు పఠించి కూటములలో భాగము వహించిరి. వారు బోధించుటలో పాల్గొనిరి, మరియు మరిన్ని ఆధిక్యతలకు—పయనీరు సేవకు, బేతేలు సేవ, లేక ఇతర ప్రతిఫలదాయక కార్యమునకు చేరుకొనిరి. వారు ‘అతీతమైన యౌవనస్థులు’ కారు; నీకు వలెనే వారును సాధారణమైన ఆసక్తులు శ్రద్ధలను కలిగియుండిరి. అయినను, వారు ఈ సలహాకు తమనుతాము అన్వయించుకొనిరి: “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక మీరు యెహోవా నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.”—కొలొస్సయులు 3:23, NW; లూకా 10:27; 2 తిమోతి 2:15 పోల్చుము.
17. యౌవనస్థులు దేవుని సేవలో పురోగమించుటకు ఏది సహాయపడగలదు?
17 నీ విషయమేమి? దేవుని సంగతులను నీవు నిజముగా గుణగ్రహించుదువా? ఆత్మీయ సంగతులను ముందుంచు వారియందే నీవు స్నేహితులను ఎంపిక చేసికొందువా? క్రైస్తవ కార్యమందు నీతో భాగము వహించుటకు ఇతరులను నీవు ప్రోత్సహించుదువా? వారినుండి నేర్చుకొనుటకు, వారి ఆనందమును రుచిచూచుటకు, వారి సత్‌క్రియల ద్వారా ప్రోత్సహింపబడుటకు వృద్ధులైన వారితో, మరింత అనుభవజ్ఞులతో క్రైస్తవ సేవయందు నీవు వెళ్లుదువా? దాదాపు 20 సంవత్సరముల క్రితము, మొదటి సారిగా తనతో ప్రాంతీయసేవలో పాల్గొనుటకు అప్యాయముగా పిలిచిన వృద్ధవ్యక్తిని, ఆ దినమును ఒక సాక్షి గుర్తుతెచ్చుకొనుచున్నది. తన జీవితములో అది ఒక మలుపు అని ఆమె చెప్పుచు ఇట్లనుచున్నది: “మొదటిసారి నేను అలా వెళ్లుచున్నాను, అయితే నా తలిదండ్రులు నన్ను తీసుకొని వెళ్లుటలేదని కాదు కాని, నేను కోరుకొనినందున అలా వెళ్లుచున్నాను.”
18. బాప్తిస్మమునకు సిద్ధపడుటకు ముందు ఆలోచించవలసిన సంగతులు ఏమైయున్నవి?
18 దేవుని పద్ధతిచొప్పున చేయుటలో నీవు అభివృద్ధి సాధించుచున్నట్లయిన, నీవు త్వరలోనే బాప్తిస్మమును గురించి ఆలోచించుటను ఆరంభింతువు. బాప్తిస్మము యౌవనదశలోనికి ప్రవేశించు ఒకానొక ఆచారమువంటిది కాదని గుర్తుంచుకొనుట ప్రాముఖ్యము. నీవు పెద్దవాడవైపోయావనుటను ఇది సూచించదు, లేక నీ స్నేహితులు ఈ పనిచేసియున్నారని నీవును చేయవలసిన సంగతికాదు. బాప్తిస్మమివ్వవలెనని అడుగుటకు ముందు, నీవు సత్యమును గూర్చి ప్రాథమిక జ్ఞానమును కలిగియుండి దేవుని వాక్యానుసారముగా జీవించువాడవై యుండవలెను. ఆ జ్ఞానమును ఇతరులతో పంచుకొనిన కారణయుక్తమైన అనుభవమును నీవు కలిగియుండవలెను మరియు ఇది సత్యారాధనలో ఒక భాగమని గ్రహించవలెను. (మత్తయి 24:14; 28:19, 20) ఈ ప్రాముఖ్యమైన క్రైస్తవ చర్య గైకొనిన పిదప నీవు బైబిలుయొక్క నీతియుక్తమైన నైతిక సూత్రముల ప్రకారము జీవించుట నీనుండి అపేక్షింపబడునని కూడ నీవు తెలిసికొనవలెను.b హృదయమందు, నీ ప్రేమగల పరలోకపు తండ్రికి నీ జీవితమును నీవు సమర్పించుకొనవలెను.—కీర్తన 40:8, 9 పోల్చుము.
19. ఒక వ్యక్తి ఎప్పుడు బాప్తిస్మము తీసికొనవలెను?
19 మిగతా జీవితములో ఏమి సంభవించినను, నీవు దేవుని సేవించుదువు అని స్థిరముగా నిర్ణయించుకొనినప్పుడు నీవు బాప్తిస్మమను చర్యను తీసికొందువు. ఇది దేవునిచిత్తము చేయుటకు, నీవు సంపూర్ణమైన, ఎటువంటి మినహాయింపులు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా యేసుక్రీస్తుద్వారా యెహోవాకు సమర్పించుకొనియున్నావని బహిరంగముగా సూచించుటయై యున్నది. ఒక క్రైస్తవ పెద్ద దాదాపు ఒక అర్ధ శతాబ్దమునాటి ఆ దినమును గుర్తు తెచ్చుకొనెను, ఆయన అప్పుడు గ్రహించినదేమనగా: “నేను దాని విషయములో ఏదో ఒకటి చేయవలెను!” ఇంగ్లాండు, న్యూకాసిల్‌లో కొన్ని సంవత్సరముల క్రితము బాప్తిస్మము తీసికొనిన యువకుడైన మిషెల్ ఇట్లనుచున్నాడు: “నాకు 13 సంవత్సరముల వయస్సప్పుడు నా జీవితమును సమర్పించుకొని బాప్తిస్మము తీసికొనవలెనని గ్రహించితిని; దేవుని సేవించుటకంటె నేను చేయగలిగినది ఏదియు లేదు.”
20. (ఎ) ఇప్పటికే లక్షలాది మంది యౌవనులచే ఎటువంటి చక్కని మాదిరి ఉంచబడెను? (బి) ఈ చర్యను ఎట్లు దృష్టించవలెను?
20 ఇటీవల కాలములో లక్షలాదిమంది యౌవనస్థులు బాప్తిస్మము తీసికొనిరి. వారు దేవుని వాక్యమును పఠించి ఆయనమార్గములను నేర్చుకొని ఆపిమ్మట సంతోషముతో తమ సమర్పణను బహిరంగముగా సూచించిన అనేకులైన వృద్ధులతో బాప్తిస్మము తీసికొనుటయందు చేరిరి. బాప్తిస్మముతో ఏదియు పూర్తికాలేదుగాని యెహోవా సేవలో నిరంతరము కొనసాగుటకు తీర్మానించుకొనిన తమ సమర్పణా జీవన విధానమునకు అది నిజమైన ఆరంభమని వారెరిగియున్నారు. (w90 8/1)
[అధస్సూచీలు]
a 4వ పుటలో “బైబిలు కాలములలో యౌవన సేవకులు” అను శీర్షికను చూడుము.
b “నేనింకా బాప్తిస్మము తీసుకోలేదు” అని చెప్పుట తప్పిదము చేయుటకొక సాకు అని దీని భావము కాదు. దేవుడు కోరుదానిని మనము తెలిసికొనిన వెంటనే, స్పష్టముగా మనము ఆయనకు లోబడు బాధ్యతను కలిగియున్నాము.—యాకోబు 4:17.
మీరెట్లు సమాధానమిత్తురు
◻ దేవునివాక్య జ్ఞానము ఎందుకంత ప్రాముఖ్యమై యున్నది?
◻ క్రైస్తవ కూటములనుండి నీవు ఎట్లు ఎక్కువ ప్రయోజనము పొందగలవు?
◻ దేవునినుండి కలుగు ఏ ఆశీర్వాదములు ఆయనకు లోబడుటకు మనలను కదిలించవలెను?
◻ దేవుని సేవలో నీవెట్లు ముందుకు సాగిపోగలవు?
◻ ఒకడు ఎప్పుడు బాప్తిస్మము తీసికొనవలెను?