బైబిలు కాలములలో యౌవన సేవకులు
బైబిలు అనేకమంది మంచి పిల్లలనుగూర్చి తెలుపుచున్నది. వారు దేవునియెడల తమయొక్క సేవను గంభీరముగా తీసికొనిరి. వారట్లు చేసినందున బహుగా ఆశీర్వదించబడిరి. మనము యౌవనులమైనను, లేక వృద్ధులమైనను మరియు తలనెరిసిన వారమైనను, ఈ శ్రేష్ఠమైన బైబిలు ఉదాహరణలు గొప్ప ప్రోత్సాహమును సమకూర్చగలవు.
యోసేపు ఐగుప్తులోనికి దాస్యమునకు అమ్మబడినప్పుడు అతనికి 17 సంవత్సరములే. అక్కడ తన కుటుంబమునకు చాలాదూరమున, అతనిని ఎరిగిన వారికి కనబడనిచోట యోసేపు తన యథార్థతను రుజువుపరచుకొనెను. పోతీఫరు భార్య యోసేపుకు దుర్భుద్ధి కలిగించుటకు ప్రయత్నించినప్పుడు, అతడిట్లనెను: “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?” తన కాలములో గొప్ప అధికారము కలిగిన బలవంతుడైన ఫరో ఎదుటకూడ, యోసేపు అవకాశమును చేజిక్కించుకొని, ఫరో కనిన కలల భావమును వివరించి దేవుని మహిమపరచెను. అతడు బహుగా ఆశీర్వదింపబడెను. కరవువలన వచ్చు మరణమునుండి ఐగుప్తీయులను, అతని కుటుంబీకులను రక్షించుటకు అతని తండ్రియైన యాకోబును, ఆయన కుటుంబీకులను ఐగుప్తుకు రప్పించుటకు దేవుడు అతనిని వాడుకొనెను.—ఆదికాండము 37:2; 39:7-9; 41:15, 16, 32.
యౌవనములో విశ్వాసముగానున్న మోషే మరియు ఇతరులు
ఫరో కుమార్తె మోషేను తన స్వంత బిడ్డగా స్వీకరించెను. అయినను మోషే తలిదండ్రులు, ఆయనకు నిజమైన దేవునిగురించి బోధించిరి. బైబిలు చెప్పునదేమనగా మోషే పెద్దవాడైనప్పుడు “ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అల్పకాల పాపభోగము అనుభవించుటకంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించెను.” తన ప్రజలను ఐగప్తునుండి రప్పించుటకు, సీనాయివద్ద ధర్మశాస్త్రమును అందుకొనుటకు, బైబిలులో ఎక్కువ భాగము వ్రాయుటకు, దేవుడు మోషేను ఉపయోగించెను. మీ వయస్సు ఎంతైనప్పటికిని, మోషే చేసినట్లుగా దేవుని సేవించుటకు నిశ్చయతను పెంపొందించుకొనుచున్నారా?—హెబ్రీయులు 11:23-29; నిర్గమకాండము 2:1-10.
దేవుని ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు చదువబడునప్పుడు మిగిలిన వారితోపాటు “పిన్నలు” కూడ వినుచుండినట్లు లేఖనములు మనకు తెల్పుచున్నవి. (ద్వితీయోపదేశకాండము 31:10-13) నెహెమ్యా కాలములో ధర్మశాస్త్రమును వినుటకు “తెలివితో వినగలిగిన వారందరు, ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు” నిలుచునేవారు. (నెహెమ్యా 8:1-8) పిల్లలు అంతా అర్థము చేసికొనలేకుండినను, యెహోవాను ప్రేమించి, ఆరాధించి, విధేయులగుటను గుణగ్రహించగలిగెడివారు. మీ వయస్సు ఎంతైనప్పటికిని, సభలయందు, సమావేశములందు దేవుని వాక్యము చర్చించగా మీరు వింటిరా? ఇశ్రాయేలీయుల పిల్లలవలే మీరును ఆయనకు విధేయులగుటను నేర్చుకొంటిరా?
దావీదు, యోషీయా మరియు యిర్మీయా
ఒక ప్రత్యేకమైన సేవకు దేవుడు దావీదును ఏర్పరచుకొనెను. అతడు ఎనిమిదిమంది సోదరులలో చిన్నవాడు. అతనినిగూర్చి దేవుడిట్లనెను: “నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నియు నెరవేర్చెను.” తన ప్రజలను “కాచుటకు” దేవుడు అతనిని ఎన్నుకొనెను. దావీదు ఆ సేవను జరిగించుచు అనేక సంవత్సరములు యెహోవా యెడల ప్రేమను నిరూపించుకొనెను. డెబ్బయికి పైగా కీర్తనలను వ్రాసెను. యేసుక్రీస్తు వంశావళిలో పూర్వికుడాయెను. మీరు పిల్లలైనను, పెద్దలైనను దేవుని మార్గములను గుణగ్రహించుచున్నారా? దావీదు చేసినట్లు, దేవుడు కోరుచున్నవి చేయుదురా?—అపొ.కార్యములు 13:22; కీర్తన 78:70, 71; 1 సమూయేలు 16:10, 11; లూకా 3:23, 31.
యోషీయా ఎనిమిది సంవత్సరముల వయస్సులోనే రాజాయెను. 15 సంవత్సరములప్పుడు “అతడింకను బాలుడైయుండగా తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనెను.” 20 సంవత్సరములకు ముందే అతడు అబద్ధ ఆరాధనకు వ్యతిరేకముగా తన ప్రచారమును ప్రారంభించెను. తరువాత అతడు దేవాలయమును బాగుచేసి, ఆ దేశములో పరిశుద్ధ ఆరాధనను నెలకొల్పెను. అతని గూర్చి మనమిట్లు చదువుదుము: “అతని దినములన్నియు వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.” మనమందరము యోషీయావలే రాజులము కాలేము. కానీ మనము దేవుని సేవించగలము. మన వయస్సు ఏదైనప్పటికి అబద్ధ ఆరాధనకు వ్యతిరేకముగా స్థిరముగా నిలబడగలము.—2 దినవృత్తాంతములు 34:3, 8, 33.
సర్వశక్తిగల దేవుడు యిర్మీయాతో ఇట్లనెను: “తల్లి గర్భములో నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని. నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.” ప్రవక్తగా నుండుటకు నేను బాలుడనని యిర్మీయా నిరసన తెలుపుచు, “అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తిచాలదు” అని అనెను. అందుకు యెహోవా “‘నేను బాలుడనని’ అనవద్దు. నేను పంపువారియొద్దకు నీవు పోవలెను. నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెనని” చెప్పెను. 40 సంవత్సరములకు పైగా యిర్మీయా అట్లేచేసెను. అతడు ఆపుచేయవలెనని తలంచిననూ, అట్లు చేయలేకపోయెను. దేవుని వాక్యము, “అతని ఎముకలలో అగ్నివలె మండుచుండెను.” అతడు మాట్లాడక తప్పలేదు! మీ వయస్సు ఎంతైనను, యిర్మీయాకు ఉన్నట్టి విశ్వాసమును అభివృద్ధి చేసికొనుచున్నారా? అతడు చేసినట్లే దేవుని సేవలో ముందుకు సాగుచున్నారా?—యిర్మీయా 1:4-8; 20:9.
దానియేలు, యేసు మరియు తిమోతి
మీరు దానియేలును గూర్చి వినలేదా? బబులోను రాజు, బలవంతుడైన నెబుకద్నెజరు న్యాయస్థానమునకు ఇతర “పిల్లలతో” పాటు దానియేలు కూడ కొనిపోబడినప్పుడు, అతడు 20 సంవత్సరములలోపు వాడే. దానియేలు యౌవనుడైనప్పటికిని, అతడు దేవునికి విధేయుడగుటకు నిశ్చయించుకొనెను. దేవుని శాసనము ఉల్లంఘించిన లేక అన్య ఆచారముల వలన కలుషితమైన ఆహారమువలన తాము అపవిత్ర పరచబడకుండునట్లు దానియేలు అతని అనుచరులు వాటిని తిరస్కరించిరి. 80 సంవత్సరములకుపైగా, దానియేలు చలించలేదు. దేవుని ప్రార్థించుట నిలుప లేదు. తత్ఫలితముగా అతడు సింహపు బోనులో పడవేయబడినను అతడు యథార్థతను కాపాడుకొనెను. దేవునియెడల మీయొక్క సేవ, మీ యొక్క ప్రార్థనలు అంత ప్రాముఖ్యమని మీరు ఎంచుదురా? మీరట్లు ఎంచవలెను.—దానియేలు 1:3, 4, 8; 6:10, 16, 22.
పండ్రెండు సంవత్సరముల వయస్సులో యేసు, యెరూషలేము దేవాలయములో మతగురువుల మధ్య కూర్చునియుండెను. “వారిమాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచుండెను. ఆయన [బాలుడైన యేసు] మాటలు వినిన వారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి.” యేసువలె దేవాలయములో పెద్దలచే చేయబడిన లేఖనముల చర్చ యేసుకు కల్గించినట్లే మీకును ఆసక్తిని కలిగించదా? మీ ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు యితరులు విస్మయమొందుదురా? నేడును పిల్లలైన చాలామంది సాక్షులు చదువుచు, శ్రద్ధగా వినుచు క్రైస్తవ కూటములలో పాల్గొందురు. పెద్దల నాశ్చర్యపరచునట్టి లేఖనముల జ్ఞానము వారికుండును.—లూకా 2:42, 46, 47.
బాలుడైయుండగా “పరిశుద్ధలేఖనములు” బోధింపబడిన తిమోతివలె మీరున్నారా? అతడు యువకుడుగా నున్నప్పుడు కనీసము రెండు సంఘములలో అతడు “సహోదరులచే మంచి పేరుపొందెను.” తనతో ప్రయాణించవలసినదిగా అపొస్తలుడైన పౌలు తిమోతిని కోరెను. తన సరుకులు మోయువాడుగా మాత్రమేకాదు. ఇతరులకు బోధించుటలో పౌలుకు సహాయపడు నిమిత్తము. అటువంటి అర్హతలకు మీరును ఎన్నుకొనబడుదురా? మీ సంఘములోనేగాక యితర సంఘములలోను మీ పరిచర్య “మెచ్చుకొనబడుచున్నదా”?—2 తిమోతి 3:15; అపొ.కార్యములు 16:1-4.
ఎటువంటి భవిష్యత్తును మీరు కోరుచున్నారు?
పిల్లలు నేడు యోసేపు, మోషే, దావీదు మరియు ఇతరులవంటి విశ్వాసము కలిగియుండుట నేడు సాధ్యమేనా? అవును సాధ్యమే. సమయమును మంచిగా గడుపుటయందు మాత్రమే యౌవనులు ఆసక్తి కలిగియుందురను మాట నిజమే. కాని ఇతరులు దేవుని యెరుగుటకు తమయెడల దేవుని చిత్తమును యెరుగుటకు, తమ యౌవనమును జ్ఞానముతో ఉపయోగించుచున్నారు. వీరు ఈ బైబిలు ప్రవచనమును నెరవేర్చుదురు: “యుద్ధసన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు . . . నీ యౌవనులలో శ్రేష్ఠులు మంచు బిందువులవలె నుందురు.”—కీర్తన 110:3.
మంచి మాదిరియైన అట్టి పిల్లలు తమ వయస్సును మించిన జ్ఞానమును కనబరచుదురు. ఎందుకనగా ప్రస్తుత జీవితము విజయవంతమగుటకు, రానున్న క్రొత్త లోకములో మహిమగల భవిష్యత్తునిచ్చుటకు దేవుడు వారికి సహాయపడగలడు. (1 తిమోతి 4:8) అయినను, ఒక ఆధునిక యౌవనుడు, బైబిలులో తెల్పబడిన బాలురవలె తన విశ్వాసమునెట్లు వృద్ధి చేసికొనగలడు? మీరు తెలిసికొనగోరినచో ఈ పత్రిక 27వ పుటనుండి ప్రారంభమైన “యెహోవా సేవలో సంతోషించు యౌవనులు” అను శీర్షికను చదువవలసిందిగా మేము మిమ్మును ఆహ్వానించుచున్నాము. (w90 8/1)
[5వ పేజీలోని చిత్రాలు]
బాలుడైన మోషే ఐగుప్తు ధనముచేత తన మనస్సును చెరుపుకొనలేదు
యౌవనుడైన దావీదు యెహోవా హృదయమునకు యిష్టునిగాయుండెను
[6వ పేజీలోని చిత్రాలు]
“నేను బాలుడనే” అని యిర్మీయా భావించినను, జనసమ్మతముకాని వర్తమానమును ఆయన ధైర్యముగా ప్రకటించెను
12 సంవత్సరముల వయస్సులో యేసు, దేవుని వాక్యమందు తనకుగల అవగాహనతో తన పెద్దలను ఆశ్చర్యపరచెను
[7వ పేజీలోని చిత్రాలు]
ఇశ్రాయేలీయులలో దేవుని ధర్మశాస్త్రము చదువబడినప్పుడు పిన్నవారు సహితము వినిరి. మరి మీరు?