వారు ‘ఆలాగుననే చేశారు’
“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.”—1 యోహాను 5:3.
1. దేవుని ప్రేమ యొక్క విస్తీర్ణతను గురించి ఏమి చెప్పవచ్చు?
“దేవుడు ప్రేమాస్వరూపి.” దేవుని తెలుసుకుని, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారందరూ, ఆ ప్రేమ యొక్క గంభీరతపట్ల ప్రగాఢమైన మెప్పును కలిగివుంటారు. “మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను.” యేసు యొక్క ప్రశస్తమైన విమోచనా బలియందు మనం విశ్వాసాన్ని ప్రదర్శిస్తుండగా, మనం ‘దేవుని ప్రేమయందు నిలిచి’ ఉంటాం. (1 యోహాను 4:8-10, 16) అలా మనం ఇప్పుడు విస్తారమైన ఆత్మీయ దీవెనలను, రాబోయే విధానంలో నిత్య జీవాన్ని అనుభవించగలం.—యోహాను 17:3; 1 యోహాను 2:15, 17.
2. దేవుని ఆజ్ఞలను అనుసరించడం ఆయన సేవకులకు ఎలా లాభం చేకూర్చింది?
2 దేవుని ఆజ్ఞలను అనుసరించి, దాని ఫలితంగా మెండైన దీవెనలను పొందినవారి ఉదాహరణలు బైబిలునందు పుష్కలంగా ఉన్నాయి. వీరిలో క్రైస్తవులకు పూర్వమున్న సాక్షులు ఉన్నారు, వారిలో కొందరిని గూర్చి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.” (హెబ్రీయులు 11:13) తర్వాత, ‘యేసుక్రీస్తు ద్వారా కలిగిన కృపా సత్యము’ నుండి దేవుని యొక్క భక్తిగల క్రైస్తవసేవకులు ప్రయోజనం పొందారు. (యోహాను 1:17) నిజంగా “భారమైనవి” కాని ఆయన ఆజ్ఞలకు విధేయులైన నమ్మకస్థులగు సాక్షులకు, మానవచరిత్ర యొక్క 6,000 సంవత్సరాల కాలమంతటిలో యెహోవా ప్రతిఫలమిచ్చాడు.—1 యోహాను 5:2, 3.
నోవహు దినములలో
3. నోవహు ఏయే విధాలుగా ‘ఆలాగుననే’ చేశాడు?
3 బైబిలు ఇలా పేర్కొంటుంది: “విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.” రాబోయే దైవిక తీర్పును గురించి జలప్రళయానికి ముందున్న దౌర్జన్యపూరిత లోకాన్ని హెచ్చరించడం ద్వారా, “నీతిని ప్రకటించిన” వానిగా నోవహు దేవునికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు. (హెబ్రీయులు 11:7; 2 పేతురు 2:5) ఓడను నిర్మించడంలో ఆయన దైవికంగా ఇవ్వబడిన నమూనాను జాగ్రత్తగా అనుకరించాడు. తర్వాత అతను సూచింపబడిన జంతువులను మరియు ఆహార సరఫరాలను అందులోనికి తెచ్చాడు. “నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.”—ఆదికాండము 6:22.
4, 5. (ఎ) ఈనాటి వరకు ఓ దుష్టప్రభావం మానవజాతిని ఎలా ప్రభావితం చేసింది? (బి) దైవిక నియమాలకు విధేయత చూపడంలో మనం ‘ఆలాగుననే’ ఎందుకు చేయాలి?
4 నోవహు మరియు ఆయన కుటుంబం అవిధేయులైన దూతల దుష్టప్రభావాన్ని ఎదుర్కొనవలసి ఉండినది. దేవుని ఈ కుమారులు మానవశరీరాలు దాల్చి, స్త్రీలతో సహచర్యం చేసి, మానవజాతిపై దౌర్జన్యం చేసిన మానవాతీత మహా కాయులను ఉత్పన్నం చేశారు. “భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.” ఆ దుష్ట తరాన్ని నిర్మూలించేందుకు యెహోవా జలప్రళయాన్ని తెచ్చాడు. (ఆదికాండము 6:4, 11-17; 7:1) దయ్యాలైన దూతలు నోవహు కాలంనుండి మానవ ఆకారాన్ని ధరించుకునేందుకు అనుమతింపబడలేదు. అయినప్పటికీ, ‘లోకమంతయు’ అపవాదియగు సాతానైన ‘దుష్టుని యందు’ కొనసాగుతునేవుంది. (1 యోహాను 5:19; ప్రకటన 12:9) ప్రవచనార్థకంగా, నోవహు కాలంలోని తిరుగుబాటుదారులైన ఆ తరాన్ని, యేసు తన “ప్రత్యక్షత” యొక్క సూచన 1914లో స్పష్టమయ్యేందుకు ప్రారంభించినప్పటి నుండి తనను నిరాకరించిన మానవజాతి యొక్క తరానికి పోల్చాడు.—మత్తయి 24:3, 34, 37-39; లూకా 17:26, 27.
5 నోవహు కాలంలో వలెనే, నేడు కూడా సాతాను మానవజాతికి మరియు మన గ్రహానికి నాశనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. (ప్రకటన 11:15-18) కావున, ప్రేరేపిత ఆజ్ఞను మనం లక్ష్యపెట్టడం చాలా అత్యవసరం: “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.” (ఎఫెసీయులు 6:11) ఇందులో, దేవుని వాక్యాన్ని చదివి దాన్ని మన జీవితాలలో అన్వయించుకోవడం ద్వారా మనం దృఢపర్చబడుతున్నాం. అంతేకాక, మనకు యెహోవా యొక్క శ్రద్ధ తీసుకునే సంస్థ, దానితోపాటు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన” అభిషిక్త “దాసుడు” మరియు మనం వెళ్లాల్సిన మార్గంలో మనకు సహనంతో కాపుదలనిచ్చేందుకు ఆయన ప్రేమపూర్వక పెద్దలు ఉన్నారు. మనం భూవ్యాప్త ప్రకటనాపనిని సాధించాల్సి ఉంది. (మత్తయి 24:14, 45-47) దైవిక నడిపింపుకు ఎంతో జాగ్రత్తగా విధేయుడైన నోవహు వలె, మనం కూడా ‘ఆలాగుననే చేద్దాం.’
మోషే—మనుష్యులందరిలో సాత్వికుడు
6, 7. (ఎ) మోషే ఏ దీవెనకరమైన ఎంపిక చేసుకున్నాడు? (బి) మోషే మన కొరకు ఏ ధైర్యవంతమైన మాదిరినుంచాడు?
6 విశ్వాసంగల మరోవ్యక్తి అయిన మోషేను పరిశీలించండి. ఐగుప్తు సుఖభోగాలలో స్వయం లాలసత్వ జీవితాన్ని ఆయన ఆనందించగల్గేవాడే. ఆయన, “అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట”ను ఎన్నుకున్నాడు. యెహోవా యొక్క నియమిత సేవకునిగా, “అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను. . . . [మరియు] అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధిగలవాడై” యుండెను.—హెబ్రీయులు 11:23-28.
7 సంఖ్యాకాండము 12:3నందు మనమిలా చదువుతాం: “మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” దానికి భిన్నంగా, ఐగుప్తుకు చెందిన ఫరో మనుష్యులందరిలో కెల్లా అహంకారివలె ప్రవర్తించాడు. ఫరోపై తన తీర్పును ప్రకటించమని యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినప్పుడు, వారెలా ప్రతిస్పందించారు? మనకిలా చెప్పబడుతుంది: “మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.” (నిర్గమకాండము 7:4-7) నేడు దేవుని తీర్పులను ప్రకటిస్తున్న మనకు ఎంతటి ధైర్యవంతమైన మాదిరి అది!
8. ఇశ్రాయేలీయులు ఎలా ‘ఆలాగుననే’ చేయవలసి ఉండిరి, తత్ఫలితంగా వచ్చిన ఆనందాన్ని సమీప భవిష్యత్తుతో ఎలా సరిసమానం చేయవచ్చు?
8 ఇశ్రాయేలీయులు మోషేకు యథార్థంగా మద్దతునిచ్చారా? యెహోవా పది తెగుళ్లలో తొమ్మిదింటి చేత ఐగుప్తును పీడించిన తర్వాత, పస్కాను ఆచరించడాన్ని గురించి ఆయన ఇశ్రాయేలీయులకు వివరంగా ఉపదేశాలనిచ్చాడు. “అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.” (నిర్గమకాండము 12:27, 28) సా.శ.పూ. 1513 నీసాను 14న ఆ గణనీయమైన దినం యొక్క అర్థరాత్రి, దేవుని దూత ఐగుప్తీయుల ప్రథమ సంతానాన్నంతటినీ చంపాడు, కానీ ఇశ్రాయేలీయుల ఇళ్లను దాటి వెళ్లాడు. ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానం ఎందుకు వదిలివేయబడింది? ఎందుకంటే తమ ద్వారబంధాలపై పూయబడిన పస్కా గొర్రెపిల్ల రక్తాన్నిబట్టి వారు రక్షణపొందారు. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినలాగుననే వారు చేశారు. అవును, ‘వారు ఆలాగుననే చేశారు.’ (నిర్గమకాండము 12:50, 51) ఎర్ర సముద్రం వద్ద, విధేయులైన తన ప్రజలను రక్షిస్తూ, ఫరోను అతని శక్తివంతమైన సైనిక బలగాన్ని నాశనం చేయడంలో యెహోవా మరో అద్భుతాన్ని చేశాడు. ఇశ్రాయేలీయులెంతగా ఉన్నతపర్చబడ్డారో కదా! అదేవిధంగా నేడు, యెహోవా ఆజ్ఞలకు విధేయులౌతున్న అనేకులు అర్మగిద్దోనులో ఆయన సత్యనిరూపణకు ప్రత్యక్షసాక్షులుగా నిలుస్తారు.—నిర్గమకాండము 15:1, 2; ప్రకటన 15:3, 4.
9. గుడారానికి సంబంధించి ఇశ్రాయేలీయులు ‘ఆలాగుననే’ చేయడం ఏ ఆధునికదిన ఆధిక్యతలను సూచించింది?
9 ఇశ్రాయేలీయులు చందాలు వేసి అరణ్యంలో గుడారాన్ని నిర్మించాలని యెహోవా ఆజ్ఞాపించినప్పుడు, ప్రజలు ఉదారంగా తమ పూర్తి మద్దతునిచ్చారు. అప్పుడు, మోషే మరియు ఆయన ఇష్టపూర్వక పనివారు యెహోవా అందించిన నిర్మాణసంబంధ పథకాలను అతిచిన్న వివరాలతో సహా అనుసరించారు. “ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి.” అలాగే, యాజకత్వాన్ని ప్రారంభించేటప్పుడు కూడా, “మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.” (నిర్గమకాండము 39:32; 40:16) ఆధునిక కాలాల్లో, ప్రకటనాపనికి మరియు రాజ్య విస్తరణ కొరకైన కార్యాలకు హృదయపూర్వక మద్దతును ఇవ్వగల అవకాశం మనకుంది. ‘ఆలాగుననే’ చేయడంలో అలా ఐక్యమవ్వడం మన ఆధిక్యత.
యెహోషువ—ధైర్యవంతుడు, చాలా శక్తిమంతుడు
10, 11. (ఎ) యెహోషువను ఏది విజయానికి సమర్థున్ని చేసింది? (బి) ఆధునిక దిన శ్రమలను ఎదుర్కోడానికి మనమెలా శక్తిమంతులం కాగలం?
10 ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపించేందుకు మోషే యెహోషువకు ఆజ్ఞాపించినప్పుడు, యెహోవా యొక్క ప్రేరేపిత వ్రాతపూర్వక వాక్యంలో మోషే వ్రాసిన ఐదుగ్రంథాలు, ఒకటి లేక రెండు కీర్తనలు మరియు యోబు గ్రంథం మాత్రమే ఉండిండవచ్చు. వారు వాగ్దాన దేశం చేరుకున్న తర్వాత ప్రజలను సమకూర్చి “ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను” అని మోషే యెహోషువకు ఉపదేశించాడు. (ద్వితీయోపదేశకాండము 31:10-12) అంతేకాక, యెహోవా తానే యెహోషువకిలా ఆజ్ఞాపించాడు: “ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.”—యెహోషువ 1:8.
11 యెహోవా వాక్యమైన బైబిలును అనుదినం చదవడం, ఈ క్లిష్టమైన “అంత్య దినముల”లోని శ్రమలను ఎదుర్కోడానికి ఆయన ఆధునిక దిన సాక్షులను ఎలా శక్తివంతం చేస్తుందో, అదేలా యెహోవా “గ్రంథమును” అనుదినం చదవడం, రాబోయే శ్రమలను ఎదుర్కోడానికి యెహోషువను సమర్థున్ని చేసింది. (2 తిమోతి 3:1) ఒక దౌర్జన్యపూరిత లోకం చేత చుట్టుముట్టబడిన వారంగా, యెహోషువకు దేవుడిచ్చిన సలహాను మనం కూడా హృదయానికి హత్తుకుందాం: “నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.” (యెహోషువ 1:9) కనానును జయించిన తర్వాత, తమ స్వాస్థ్యములలో స్థిరపడుతుండగా ఇశ్రాయేలు గోత్రాలవారు మెండుగా ఆశీర్వదింపబడ్డారు. “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి.” (యెహోషువ 14:5) దేవుని వాక్యాన్ని చదివి దాన్ని మన జీవితాల్లో అన్వయించుకుని, ‘ఆలాగుననే’ చేసే మనకొరకు కూడా నేడు అలాంటి ఆశీర్వాదమే వేచివుంది.
నమ్మకస్థులు మరియు అవిధేయులైన—రాజులు
12. (ఎ) ఇశ్రాయేలులో రాజులకు ఏ ఆజ్ఞ ఇవ్వబడింది? (బి) విధేయత చూపడంలో రాజులు విఫలులవ్వడం దేనికి దారితీసింది?
12 ఇశ్రాయేలులోని రాజుల సంగతేమిటి? రాజు ఈ నియమానికి విధేయుడవ్వాలని యెహోవా నియమించాడు: “అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తనకొరకు వ్రాసికొనవలెను; అది అతనియొద్ద ఉండవలెను. . . . తన దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని యీ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.” (ద్వితీయోపదేశకాండము 17:18, 19) ఇశ్రాయేలీయుల రాజులు ఈ ఆజ్ఞకు విధేయులయ్యారా? వారిలో అధికశాతం విఫలులైనందున ద్వితీయోపదేశకాండము 28:15-68నందు ముందే చెప్పబడిన శాపములను వారు అనుభవించారు. తుదకు, ఇశ్రాయేలీయులు “దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకు . . . చెదరగొట్ట”బడ్డారు.
13. యెహోవా వాక్యంపట్ల ప్రేమను చూపడంద్వారా దావీదు వలె మనమెలా ప్రయోజనం పొందగలం?
13 అయితే, ఇశ్రాయేలులో మొదటి యథార్థపరుడైన మానవరాజగు దావీదు, యెహోవాకు విశేషమైన భక్తిని కనపర్చాడు. “దావీదు చిగురైన” జయించుచున్న “యూదాగోత్రపు సింహము” అయిన యేసుక్రీస్తును సూచిస్తూ ఆయన “యూదా కొదమ సింహము” అని నిరూపించుకున్నాడు. (ఆదికాండము 49:8, 9; ప్రకటన 5:5) దావీదు బలము ఎక్కడ ఉండినది? ఆయనకు యెహోవా యొక్క వ్రాతపూర్వక వాక్యంపై ప్రగాఢమైన మెప్పు ఉండినది మరి దానికి అనుగుణంగా ఆయన జీవించాడు. కీర్తన 19నందలి “దావీదు కీర్తన”లో మనమిలా చదువుతాం: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది.” యెహోవా యొక్క శాసనం, ఉపదేశాలు, ధర్మము మరియు న్యాయవిధులను సూచించిన తర్వాత, దావీదు ఇలా పేర్కొన్నాడు: “అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.” (కీర్తన 19:7-11) యెహోవా వాక్యాన్ని చదవడం, దాన్ని ధ్యానించడం 3,000 సంవత్సరాల పూర్వం దీవెనకరంగా ఉంటే, అది నేడు ఇంకా ఎంత ఎక్కువ దీవెనకరంగా ఉండగలదు!—కీర్తన 1:1-3; 13:6; 119:72, 97, 111.
14. జ్ఞానం కంటే ఎక్కువే కావాలనే అవసరతను సొలొమోను ప్రవర్తన ఏ విధంగా చూపుతుంది?
14 ఇంకా, ఈ జ్ఞానాన్ని పొందడం మాత్రమే సరిపోదు. దేవుని సేవకులు ఈ జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించడం, దైవిక చిత్తానికి అనుగుణంగా దాన్ని అన్వయించుకోవడం—అవును, ‘ఆలాగుననే’ చేయడం కూడా ప్రాముఖ్యం. “ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు” యెహోవా ఎన్నుకున్న, దావీదు కుమారుడైన సొలొమోను విషయంలో దీన్ని ఉదహరించవచ్చు. ‘ప్రేరేపణ ద్వారా’ దావీదు పొందిన మచ్చులను ఉపయోగిస్తూ, మందిరాన్ని నిర్మించాల్సిన నియామకాన్ని సొలొమోను అందుకున్నాడు. (1 దినవృత్తాంతములు 28:5, 11-13) సొలొమోను ఈ బృహత్పథకాన్ని ఎలా సాధించగలడు? ఆయన ప్రార్థనకు జవాబులో, యెహోవా ఆయనకు బుద్ధిని, జ్ఞానాన్నిచ్చాడు. వీటితో, అలాగే దైవికంగా ఇవ్వబడిన పథకానికి హత్తుకోవడం ద్వారా సొలొమోను ఆ మహిమాన్విత గృహాన్ని నిర్మించగల్గాడు, అది తర్వాత యెహోవామహిమతో నింపబడింది. (2 దినవృత్తాంతములు 7:2, 3) అయితే తర్వాత సొలొమోను విఫలుడయ్యాడు. ఏ విషయంలో? ఇశ్రాయేలులోని రాజును గురించి యెహోవా ధర్మశాస్త్రం ఇలా పేర్కొన్నది: “తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు.” (ద్వితీయోపదేశకాండము 17:17) అయినప్పటికీ సొలొమోనుకు “ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; . . . అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రి”ప్పిరి. తన తర్వాతి సంవత్సరాల్లో సొలొమోను ‘ఆలాగుననే’ చేయడంనుండి వైదొలగాడు.—1 రాజులు 11:3, 4; నెహెమ్యా 13:26.
15. యోషీయా ఎలా ‘ఆలాగుననే’ చేశాడు?
15 యూదాలో కొందరు విధేయులైన రాజులు ఉండిరి, వారిలో యోషీయా చివరివాడు. 648 సా.శ.పూ. ఆయన దేశంనుండి విగ్రహారాధనను తీసివేసి యెహోవా మందిరాన్ని నవీకరించడం ప్రారంభించాడు. అక్కడే “మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము”ను ప్రధానయాజకుడు కనుగొన్నాడు. యోషీయా దాని గురించి ఏం చేశాడు? “రాజును, యూదా వారందరును, యెరూషలేము కాపురస్థులును, యాజకులును, లేవీయులును, జనులలో పిన్న పెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నియు వారికి వినిపింపబడెను పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి—నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.” (2 దినవృత్తాంతములు 34:14, 30, 31) అవును, యోషీయా ‘ఆలాగుననే చేశాడు.’ ఆయన యథార్థతమూలంగా, విశ్వాసంలేని యూదాపై అమలుచేయవలసిన యెహోవా తీర్పు ఆయన దారితప్పిన కుమారుల కాలంవరకు నిలుపుచేయబడింది.
దేవుని వాక్య ప్రకారం జీవించడం
16, 17. (ఎ) మనం ఏ విషయాలలో యేసు అడుగుజాడలను అనుసరించాలి? (బి) దేవుని యొక్క నమ్మకమైన సేవకులలో వేరే ఎవరు మనకు ఉదాహరణలుగా ఉన్నారు?
16 జీవించిన వారందరిలోకెల్లా, దేవుని వాక్యంపై ధ్యానించడం మరియు దానికి అనుగుణంగా జీవించడంలో ప్రభువైన యేసుక్రీస్తు చూపినది అతి చక్కని మాదిరి. దేవుని వాక్యం ఆయనకు ఆహారంలా ఉండినది. (యోహాను 4:34) ఆయన తన శ్రోతలకిలా చెప్పాడు: “తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.” (యోహాను 5:19, 30; 7:28; 8:28, 42) యేసు ‘ఆలాగుననే చేస్తూ,’ ఇలా ప్రకటించాడు: “నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.” (యోహాను 6:38) యెహోవా సమర్పిత సాక్షులుగా మనం యేసు అడుగుజాడలను అనుసరిస్తూ, ‘ఆలాగుననే’ చేయాలని ఆజ్ఞాపించబడ్డాం.—లూకా 9:23; 14:27; 1 పేతురు 2:21.
17 దేవుని చిత్తాన్ని చేయడం యేసు మనస్సులో ఎప్పుడూ ఎంతో ప్రప్రథమంగా ఉండేది. ఆయన దేవుని వాక్యంతో సంపూర్ణ పరిచయం కలిగివున్నాడు, అందుకే ఆయన లేఖనాధార జవాబులనిచ్చేందుకు సమర్థుడయ్యాడు. (మత్తయి 4:1-11; 12:24-31) దేవుని వాక్యానికి ఎడతెగని అవధానాన్నివ్వడం ద్వారా, మనం కూడా ‘సన్నద్ధులమై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండ’గలం. (2 తిమోతి 3:16, 17) ప్రాచీన కాలాలు మరియు ఆ తర్వాతి కాలాల్లో ఉండిన యెహోవా నమ్మకమైన సేవకుల మాదిరిని, మరి అందరికంటే ఎక్కువగా, “నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను,” అని చెప్పిన మన యజమానియైన యేసుక్రీస్తు మాదిరిని అనుసరిద్దాం. (యోహాను 14:31) ‘ఆలాగుననే’ చేయడంలో కొనసాగడం ద్వారా మనం కూడా దేవునికి మన ప్రేమను చూపుదాం.—మార్కు 12:29-31.
18. ‘వాక్యప్రకారం చేసే వారమయ్యేందుకు’ ఏది మనల్ని పురికొల్పాలి మరియు దీని తర్వాత ఏది చర్చించబడుతుంది?
18 బైబిలు కాలాల్లోని దేవుని విధేయులైన సేవకుల ప్రవర్తనను గురించి మనం ధ్యానిస్తుండగా, సాతాను దుష్ట విధానపు ముగింపుదినాల్లో నమ్మకమైన సేవచేయాలని మనం ప్రోత్సహింపబడమా? (రోమీయులు 15:4-6) తదుపరి శీర్షిక చర్చించేలా, మనం సంపూర్ణ భావంలో ‘వాక్యప్రకారం చేసే వారమయ్యేందుకు’ వాస్తవంగా మనం పురికొల్పబడాలి.—యాకోబు 1:22.
మీరు జ్ఞాపకం చేసుకుంటారా?
◻ “దేవుని ప్రేమ” మనకు ఏ భావాన్ని కలిగి ఉండాలి?
◻ నోవహు, మోషే, యెహోషువ అనువారి ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకుంటాం?
◻ ఇశ్రాయేలులోని రాజులు ఎంత మేరకు దేవుని ‘వాక్యానికి’ విధేయులయ్యారు?
◻ ‘ఆలాగుననే’ చేయడంలో యేసు ఎలా మన మాదిరికర్త అయ్యాడు?
[15వ పేజీలోని చిత్రాలు]
నోవహు, మోషే, యెహోషువ అనువారు ‘ఆలాగుననే చేశారు’