యేసుయొక్క జీవితము పరిచర్య
వినయమును గూర్చి యేసు ఒక పాఠమును చెప్పుట
ఫిలిప్పుదైన కైసరయ ప్రాంత సమీపములో దయ్యము పట్టిన బాలుని స్వస్థపరచిన తర్వాత, యేసు తిరిగి కపెర్నహూములోని గృహమునకు వెళ్లుటకు ఇష్టపడును. అయితే ఆ ప్రయాణములో ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉండగోరును. ఎందుకనగా ఆయన తన మరణము, మరియు ఆ తర్వాత వారి బాధ్యతల విషయములో వారిని ఇంకను సిద్ధపరచనుద్దేశించెను. “మనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు, వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని” ఆయన వారికి వివరించును.
యేసు దీనినిగూర్చి అంతకుముందు మాట్లాడినను, మరియు ముగ్గురు అపొస్తలులు ఆయన రూపాంతరము పొందుటను, ఆ సమయములో ఆయన “నిర్గమము” చర్చించబడుటను వాస్తవముగా చూచినను, ఆయన అనుచరులు ఈ విషయములో ఇంకను గ్రహింపులేనివారైయున్నారు. అంతకుముందు పేతురువలె, ఆయన చంపబడునను సంగతిని ఒప్పుకొనకుండుటకు వారిలో ఎవరును ప్రయత్నించక పోయినను, దానినిగూర్చి ఎక్కువగా ప్రశ్నించుటకు వారు భయపడుదురు.
చివరకు వారు కపెర్నహూముకు చేరుకొనిరి, ఇది యేసు పరిచర్య కాలములో ఆయన స్థావరమువలె నుండెను. అంతేకాకుండ అది పేతురు మరియు అనేకమంది ఇతర అపొస్తలుల స్వంత పట్టణము కూడా. అక్కడ, దేవాలయపు పన్ను వసూలుచేయు వ్యక్తులు పేతురునొద్దకు వత్తురు. బహుశ అందరు అంగీకరించిన ఈ వాడుక విషయములో యేసునందు తప్పుబట్టుటకు, వారిట్లడుగుదురు: “మీ బోధకుడు రెండు షెకెలు [దేవాలయపుపన్ను] చెల్లింపడా?”
అందుకు పేతురు, “చెల్లించునని” సమాధానమిచ్చును.
బహుశ ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంటికివచ్చిన యేసు, ఏమి జరిగెనో గ్రహించును. కావున పేతురు ఆ మాటను ఎత్తకముందే, యేసు ఇట్లడుగును: “సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా?”
పేతురు, “అన్యులయొద్దనే” అని జవాబిచ్చును.
“ఆలాగైతే కుమారులు స్వతంత్రులే” అని యేసు అభిప్రాయపడును. దేవాలయమందు ఆరాధింపబడుచున్న వాడు, యేసుకు తండ్రియు మరియు విశ్వమునకే రాజైయున్నందున, దేవుని కుమారుడు నిజానికి చట్టబద్ధముగా దేవాలయపుపన్ను చెల్లించవలసిన అవసరత లేదు. “అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలమువేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దానినోరు తెరచినయెడల ఒక నాణెము [నాలుగు షెకెలు] దొరుకును; దానిని తీసికొని నాకొరకును నీకొరకును వారికిమ్మని” యేసు అతనితో చెప్పును.
కపెర్నహూముకు తిరిగివచ్చిన తర్వాత శిష్యులు, బహుశ పేతురు ఇంటిలో కలిసికొనినప్పుడు, వారిట్లడుగుదురు: “పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు?” ఫిలిప్పుదైన కైసరయనుండి తిరిగివచ్చునప్పుడు తన వెనుకవచ్చుచు వారిలోవారు చర్చించుకొనుచుండిన విషయము ఎరిగియున్నవాడై, ఆ ప్రశ్న అడుగుటకు వారిని ప్రేరేపించిన దానిని గ్రహించిన యేసు, “మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనినిగూర్చి వాదించుచుంటిరని” వారిని అడుగును. కలవరపడిన శిష్యులు మౌనముగా ఉందురు, ఏలయనగా దారిలో వారు తమలోతాము ఎవరు గొప్పయని వాదించుచుండిరి.
యేసు బోధించి దాదాపు మూడు సంవత్సరములైన తర్వాతకూడ, శిష్యులు అటువంటి వాదమును కలిగియుండుట వింతగా కన్పించుట లేదా? అది మానవ అసంపూర్ణతయొక్క, మరియు మత పూర్వరంగముయొక్క బలమైన ప్రభావమును బయల్పరచుచున్నది. శిష్యులు పెరిగిన యూదామతము ప్రతివ్యవహరములోను స్థానమును లేక హోదాను నొక్కితెల్పెడిది. అంతేకాకుండ, రాజ్యముయొక్క “తాళపుచెవులను” గూర్చి యేసు తనకు వాగ్దానము చేసినందున, బహుశ పేతురు, తాను ఉన్నతుడనని భావించియుండవచ్చును. యేసు రూపాంతరమును కన్నులారా చూసినందున యాకోబు, యోహానుకూడ అటువంటి భావమునే కలిగియుండవచ్చును.
విషయమేదైనను, వారి దృక్పధములను సరిదిద్దు ప్రయత్నములో యేసు వారికి విషయమును కదిలించు రీతిలో ప్రదర్శనా పూర్వకముగా చూపించును. ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి, అతనిచుట్టు తనచేతులువేసి, ఇట్లనెను: “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనేగాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాటియొక బిడ్డను నాపేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును.”
తన శిష్యులను సరిదిద్దుటకు ఎంత అద్భుతమైన విధానము! యేసు వారి విషయమై కోపగించి, వారిని గర్విష్ఠులని, ఆశబోతులని లేక అత్యాశగలవారని పిలువలేదు. అయితే సాధారణముగా తమగుణములో నమ్రత కలిగియుండి, అత్యాశలేని మరియు తమలోతాము హోదాను ఆలోచించని చిన్నపిల్లల ఉదాహరణను దృష్టాంతపరచుటద్వారా ఆయన తన సరిదిద్దు బోధనుచేయును. ఆ విధముగా యేసు, తన శిష్యులు చిన్నపిల్లలలోవుండు లక్షణములను వృద్ధిచేసికొనవలెనని చూపించును. యేసు ముగించినట్లుగా: “మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు.” మత్తయి 17:22-27; 18:1-5; మార్కు 9:30-37; లూకా 9:43-48.
◆ కపెర్నహూమునుండి తిరిగివచ్చిన తర్వాత, యేసు ఏ బోధను పునరుద్ఘాటించెను, మరియు అది ఎట్లు తీసికొనబడెను?
◆ దేవాలయపుపన్ను కట్టు బాధ్యత యేసుకు ఎందుకు లేదు, అయితే ఆయన దానిని ఎందుకు చెల్లించెను?
◆ శిష్యులు వాదించుకొనుటకు బహుశ ఏది కారణమగును, మరియు యేసు వారినెట్లు సరిదిద్దును? (w88 2/1)