దేవుని సేవించు పిల్లలు
మంచి పిల్లలు, తమ సమయమును వెచ్చించి, జీతము పుచ్చుకొనకుండా మీ గుమ్మముయొద్దకు వచ్చి దేవుని గురించి మాట్లాడుట, మీకు అసామాన్యమనిపించునా? అపనమ్మకము పెరుగుచున్న ఈ కాలములో, పిల్లలు తమ తలిదండ్రులతో కలిసి, సంతోషకరమైన భవిష్యత్తును గురించి తెలుపుచున్నారు, మహత్తరమైన ఈ బైబిలు వాగ్దానములను గూర్చి యితరులతో మాట్లాడుట మీకు ఆశ్చర్యమనిపించునా?a
ప్రపంచమంతటా 60,000 కన్న పైగానున్న యెహోవా సాక్షుల సంఘము లనేకములలో చాలామంది పిల్లలను మీరు కనుగొందురు. వారమునకొకసారి జరుగు ఆదివారపు పాఠశాలకుగాని (Sunday School) లేక మతసారాంశబోధనా (Catechism) తరగతికిగాని వారు వెళ్లరు. దానికి బదులు ఈ పిన్నవయస్కులు సంఘకూటముల వలన ప్రయోజనము పొందుట మాత్రమే గాక వీరు దానిలో పాల్గొందురుకూడా. పసివారు చిన్న చిన్న జవాబులు చెప్పుదురు. కౌమార దశలోనున్న (13-19 సంవత్సరముల లోపు) వారు దైవపరిపాలనా పాఠశాలయందు పాల్గొందురు. పాఠశాల సెలవులలో అనేకమంది పిల్లలు, దేవుని గురించి, భవిష్యత్తును గురించి ఆయన చేసిన మహత్తరమైన వాగ్దానములను గూర్చి పొరుగువారు నేర్చుకొనునట్లు సహాయపడుదురు.
యౌవనములో యిట్టి పనులు చేయుట క్రొత్తేమి కాదు. విశ్వాసులైన అనేకమంది బాలబాలికలు, పసివారు, యౌవనస్థులను గురించి బైబిలు చెప్పుచున్నది. వారు దేవుని సేవించుటలో అసాధారణమైన మాదిరి చూపిరి.
దేవుని సేవలో “బాలుర గుంపు” సేదదీర్చునట్టి “మంచు బిందువుల” వలెనుందురని బైబిలు పుస్తకమైన కీర్తనల గ్రంథము ప్రవచించుచున్నది. దేవుని నామమును “యౌవనులు” “కన్యకలు” స్తుతింతురనికూడ అది తెలుపుచున్నది. (కీర్తన 110:3; 148:12, 13) సా.శ. 33వ సంవత్సరములో పెంతెకొస్తు దినమున దేవుని పరిశుద్ధాత్మ విశ్వాసులపై కుమ్మరింపబడినప్పుడు, బహుశ కొందరు పిల్లలుకూడ వారిలో ఉండవచ్చును. అ దినమున దాదాపు 3,000 మంది దేవుని వాక్యమును అంగీకరించి బాప్తిస్మము తీసికొనిరి. ఉలికిపడునట్లు చేయు ఈ సంఘటన యావేలు ప్రవచనముయొక్క నెరవేర్పని అపొస్తలుడైన పేతురు తెల్పెను: “మీ కుమారులును, మీ కుమార్తెలును ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలుకందురు.”—అపొ.కార్యములు 2:4-8, 16, 17, 41.
తమ యౌవనదశలో యెహోవా దేవుని సేవించిన మంచి మాదిరియైన ప్రజలు బైబిలులో యింకా ఉన్నారు. వారెవరనగా, సమూయేలు, నీతిమంతుడైన దావీదు, ఖ్యాతిగాంచిన బైబిలు ప్రవక్తలు యిర్మీయా, దానియేలు, విశ్వాసియైన తిమోతి. ఈ బైబిలు ఉదాహరణలు చర్చించు మూడు శీర్షికలు ఈ సంచికనందు కలవు. ఈ శీర్షికలనుండి యౌవనులు, వృద్ధులు దేవుని సేవించుట గంభీరమైన విషయమని ఎందుకు తలంచుదురో, పొరుగువారును అట్లు చేయుటకు వారికి సహాయపడు నిమిత్తము వారెందుకంత సమయమును వెచ్చించుదురో మీరు గ్రహించుదురు. (w90 8/1)
[అధస్సూచీలు]
a 1946 నుండి అమెరికాలో జన్మించిన పిల్లలలో 12 శాతము మాత్రమే వారి 16వ ఏట “చాలావరకు విశ్వాసమును” కలిగియుండెనని 1985లో జరిపిన మాదిరి సర్వేలో వెల్లడైనది.