ప్రపంచ శాంతిని గూర్చిన స్వప్నం ఒక చెదరిన దృశ్యము
ప్రపంచ శాంతికి ఉన్న అవకాశాలపై ఆశావాదం విపరీతంగా పెరుగుచున్నది. ది టొరంటో స్టార్ పత్రికలో తన వ్యాసమందు కేరల్ గోయర్ యిలా వ్రాసెను: “ఆఫ్ఘనిస్తాన్ నుండి అంగోలా వరకు శాంతి ఒడంబడికలు కోకొల్లలుగా చేయబడినవి. కొన్ని నెలలక్రితం అణచుటకు వీలుకానట్లు కన్పించిన ప్రాంతీయ పోరాటములు సద్దుమణిగినట్లు కన్పించుచున్నవి. ఐక్యరాజ్య సమితి ఉత్తేజితమైన పునర్జన్మను పొందుచున్నది.” ఇది “నిరీక్షణను గూర్చిన ప్రపంచవ్యాప్త అంటువ్యాధిని” వ్యాప్తిచేసెనని గోయర్ చెప్పుచున్నది. ఆలాగే యుయస్ఎ టుడే పత్రిక సంపాదకీయం యిలా ప్రకటించింది: “ప్రపంచమంతటా శాంతి ఒక్కసారిగా విజృంభించినది.”
ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో గమనించదగిన విషయమేదనగా యుఎన్ క్రోనికల్ వర్ణించినట్లు “సోవియట్ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ల మధ్య స్నేహ సంబంధాలు ప్రగతి సాధిస్తున్నవి.” సైన్యాల ఉపసంహరణ, తూర్పుఐరోపాలో ఆశ్చర్యమును గొల్పు సంఘటనలు, సైన్యాలు, ఆయుధాల తగ్గింపుపై చర్చలు—ఈ మార్పులు అగ్రరాజ్యాలు చివరకు ఆయుధాలపోటీకి పగ్గాలువేసి ఆపగలవన్న ఆశలను చిగురింపజేసినవి. సంవత్సరానికి 850 వేల మిలియన్ల డాలర్లకుపైగా ఖర్చుచేయబడుచున్న సైనిక వ్యయం ఆర్థిక రంగాన్ని నష్టపర్చుచున్న ఈ లోకంలో, ఇది ఎంతో కోరదగిన పరిణామము.
అయినప్పటికిని, ప్రపంచశాంతిని గూర్చిన మానవునికల నిజమగుటకు ఎంతవరకు సాధ్యమగును? ఎంతో ఆశావాదమును కల్గిన పరిశీలకులు సహితము, ఆయుధాల తగ్గింపునకు ఆయుధాల పూర్తి తొలగింపునకు మధ్య ఎంతో దూరమున్నదని అంగీకరించుచున్నారు. అణు నిరాయుధీకరణకు ముందెన్నడు లేనంత స్థాయిలో పరస్పర నమ్మకము అవసరము. కాని విచారకరంగా, అగ్రరాజ్యాలు పరస్పర అపనమ్మకమును సుదీర్ఘమైన చరిత్రగా కల్గియున్నవి. బైబిలులో ప్రవచింపబడినట్లుగా ఇది మనుష్యులు “అతిద్వేషులని” [“ఒడంబడికను మీరువారు” కింగ్ జేమ్సు వర్హన్] నిరూపించబడిన యుగం.—2 తిమోతి 3:3.
అదియునుగాక అణ్వాయుధాల తొలగింపు మూలంగా శాంతివచ్చునని ప్రతి ఒక్కరు భావించుటలేదు. దేశములు తమ అణ్వాయుధ నిల్వలను తుడిచి పెట్టునట్లు చేయగల్గినప్పటికిని, వాడుకలో ఉన్న ఇతర సాంకేతిక ఆయుధాలు సహితం ఎంతో సమర్థవంతముగా చంపగలవు. ఈ వాస్తవానికి 1, 2 ప్రపంచయుద్ధములు సహితం ఎంతో భయానక సాక్ష్యమిచ్చుచున్నవి. అంతేకాకుండ, అణ్వాయుధాలను పునరుత్పత్తిచేయుటకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానము అందుబాటులో ఉండి—రాజకీయ ఉద్రిక్తల తొలి సూచన కనపడగానే అవి సంసిద్ధమగుటకు వేచియున్నవి. రాజకీయ శాస్త్రజ్ఞుడైన రిచర్డ్ లెబె వంటివారు కూడ యిట్లు వాదించుచున్నారు: “కొన్ని అణ్వాయుధాలను దగ్గర ఉంచుకొనుట బహశా ప్రజలను అప్రమత్తులుగా ఉంచును.”
కాని, అణ్వాయుధాలు ఉన్నంతకాలం, శాంతి సాధించబడిందని చెప్పిన యెడల, అణువినాశన భయము దానిని వెక్కిరించును; అలాగే లక్షలాదిమంది ప్రజల అనుదిన జీవితాలనుండి శాంతిని దోచుకొను సైనికేతర సమస్యలు కొనసాగుచుండును. యుఎన్ సెక్రెటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డిక్యులర్ “ఇండ్లులేని లేదా పూర్తి అధ్వాన్నముగా చాలిచాలని యిండ్లుగల లక్షలాదిమంది సాటి పౌరుల దుస్థితినిగూర్చి మాట్లాడెను. ఈ సమస్య రానురాను మరింత దిగజారుతున్నది.” యుఎన్ క్రోనికల్ యింకను తెల్పునదేమనగా ఆర్థికముగా వెనుకబడియుండుట “మానవులలో మూడోవంతును, ప్రభావితం చేయుచున్నది, కొన్ని సందర్భాలలో దారిద్ర్యము దిక్కులేనితనము యుద్ధంవల్ల ఏర్పడిన బాధలను పోలి ఉండును.” మరి అంచనాలను బట్టి ప్రపంచములోని ఒక కోటి ఇరవైలక్షలమంది శరణార్థుల విషయమేమి? ఆయుధాల తగ్గింపు లేదా పూర్తి నిరాయుధీకరణ వారి జీవితాలకు శాంతిని తేగలవా?
స్పష్టంగా, ప్రపంచ శాంతినిగూర్చిన మానవుని స్వప్నం ఒక చెదరిన దృశ్యమే. ఏలయనగా అది—దూరదృష్టిలేనిది, సంకుచితమైనది, పరిమితమైన దృశ్యం. శాంతికొరకు ఇంతకన్నా మంచి భవిష్యత్తు ఏమైనా ఉన్నదా? నిజంగానే ఉన్నది. ఈ పత్రికయొక్క ఆగస్టు 1, 1991 సంచికలో శాంతికొరకు నిశ్చయమైన నిరీక్షణను బైబిలు ఇచ్చుచున్నదని మనము చూచాము.a మానవుడు ఎదురుచూస్తున్న దానికి మించిన శాంతిని యేసుక్రీస్తు, దేవుని రాజ్యముయొక్క రాజుగా త్వరలో తీసుకురానైయున్నాడు. అయితే ఈ శాంతి నిజంగా మానవులకు ఏ భావమును కల్గియుండును? తదుపరి శీర్షిక దీనిని చర్చించును. (w90 4/15)
[అధస్సూచీలు]
a “మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?” ఆగస్టు 1, 1991 సంచికలో చూడుము.