కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 10/1 పేజీలు 29-32
  • యెహోవా తన పనిని వృద్ధిచేయు విధానము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా తన పనిని వృద్ధిచేయు విధానము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • “డబ్బు ఎక్కడనుండి వస్తుంది?”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • “ప్రతి శ్రేష్ఠమైన యీవియు” యిచ్చేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • రాజ్య పనులకు డబ్బు ఎక్కడినుండి వస్తుంది?
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • రాజ్య ప్రచారసేవకు కొందరెలా విరాళాలిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 10/1 పేజీలు 29-32

యెహోవా తన పనిని వృద్ధిచేయు విధానము

ఇటీవలి దశాబ్దముల కాలములో యెహోవాసాక్షులు అద్భుతమైన విస్తరణను కలిగియున్నారు. కేవలం గత పది సంవత్సరములలో వారు 42,600 సంఘములనుండి 212 దేశములలో మొత్తము 60,192 సంఘములకు విస్తరించారు. దీనినిబట్టి, కొందరు సాక్షుల పనికి ఆర్థిక మద్దతు ఎలా వస్తుంది? అని అడిగియున్నారు. వాచ్‌టవర్‌ సొసైటి ఈ ప్రశ్నకు, తత్సంబంధమైన ఇతర ప్రశ్నలకు ఈ శీర్షికలో జవాబిచ్చుటకు సంతోషిస్తుంది.

యెహోవాసాక్షులు దశమభాగములు ఇచ్చుటను ఆచరిస్తారా?

లేదు. పురాతన ఇశ్రాయేలీయులలో దశమ భాగములు చెల్లించుట మోషే ధర్మశాస్త్రము క్రింద ఆలయములో పనిచేయు లేవీయులు, యాజకులకు జీవనాధారముగా యిచ్చుటకు ఆజ్ఞాపింపబడెను. వారికి కొన్ని పురములు తప్ప గోత్రపరంగా స్వాస్థ్యముగా యివ్వబడిన భూములు లేవు. కావున వారికి ఈ ప్రత్యేక మద్దతు అవసరమైయుండెను. దానితోపాటు నమ్మకస్థులైన ఇశ్రాయేలీయులు స్వచ్ఛందముగా ప్రత్యేక నిర్మాణములకొరకు అనగా గుడారనిర్మాణము, లేక తదుపరి ఆలయముకొరకు చందాలనిచ్చుటకు స్వతంత్రులైయుండిరి.—నిర్గమకాండము 25:1-8; 1 దినవృత్తాంతములు 29:3-7.

ఎలాగైనను, యేసు మరణించినప్పుడు ఆయన ‘విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును కొట్టివేసెను’ అని బైబిలు చెప్పుచున్నది. (ఎఫెసీయులు 2:15; కొలొస్సయులు 2:13, 14) ఇంకొక మాటలలో చెప్పాలంటే దేవుని దృష్టిలో ధర్మశాస్త్రము యూదులపైగాని లేక క్రైస్తవులపైగాని కట్టడగా లేదు. కావున ధర్మశాస్త్రపు ఇతర అంశములతోపాటు అనగా ఆలయమందు క్రమముగా అర్పించు బలులు మొదలగువాటితోపాటు దశమభాగము ఎంతమాత్రము విశ్వాసులకు అవసరమగు కట్టడ కాదు.

క్రైస్తవులలో ఇచ్చుట కేవలము ప్రేమచే పురికొల్పబడవలసినదేగాని, ఆజ్ఞ కాదు. అపొస్తలుడైన పౌలు అవసరతలోనున్న క్రైస్తవులకు చందా వసూల్లను ఏర్పాటుచేయునప్పుడు ఒక సూత్రమును ఆయన వివరించెను. ఆయన చెప్పినదేమనగా: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:7) అందునుబట్టి యెహోవాసాక్షులవలన ఈ విధమైన స్వచ్ఛందముగా ఇచ్చు లేఖన పద్ధతి ఆచరించబడుచున్నది.

నిధుల సేకరణ కొరకు ఏర్పాటుచేయు విందులు, చందావసూళ్లకు కవర్లను పంపుట, నిధులకొరకు ప్రచారముచేయుట మొదలగు పద్ధతులను మీరు ఉపయోగిస్తారా?

లేదు. నిజమైన క్రైస్తవుల ముందు బహుమతులనుగా ఆశగా చూపి, ఇచ్చుటకు వారిని బలవంతపెట్టనవసరము లేదు. చందా వసూళ్ల కొరకు జూదపు గృహములు, వ్యాపారము, చీట్లువేయు పద్ధతి, మత్తెక్కునట్లు తిని త్రాగే విందులతో కూడిన ఉత్సవములు ఏర్పాటుచేయుట, చర్చీలలో ప్రత్యేక స్థలములకొరకు డబ్బువసూలు చేయుటలాంటి పద్ధతులను ఉపయోగించు మతగుంపులు తమ ప్రజలకు ఆత్మీయాహారము పెట్టుట లేదు గనుక వారి గుళ్లకు హాజరగువారు స్వేచ్ఛగా చందాలిచ్చునట్లు దేవుని ఆత్మ వారిని నడిపించదు. గతించిన పద్ధతియగు దశమభాగమును ఆచరించువారి విషయములోనూ అలాగే చెప్పవచ్చును.—మత్తయి 10:8.

క్రొత్త రాజ్యమందిరములను, బ్రాంచి కార్యాలయములను నిర్మించుట, అలాగే న్యూయార్క్‌ లోని బ్రూక్లిన్‌ మరియు పాటర్‌సన్‌లయందు ప్రపంచ ప్రధాన కార్యాలయములలో చేయు విస్తరణలకు ఆర్థికసహాయము ఎలా వస్తుంది?

యెహోవా తన సాక్షులపై “వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనముగలవారును, ఔదార్యముగలవారును, (తమ ధనములో) ఇతరులకు పాలిచ్చువారునైయుండుటకు” తన ఆత్మను క్రుమ్మరించుచున్నాడు. (1 తిమోతి 6:18, 19) ఈ ఆత్మ యెహోవాసాక్షులను వారు రాజ్యపనిలో ప్రతివిధమైన మద్దతునిచ్చుటకు పురికొల్పుచున్నది.

ఉదాహరణకు, 1989లో 37,87,188 మంది సాక్షులు 212 దేశములలో దేవుని వాక్యమును బోధించుటయందు 83,54,26,538 గంటలు గడిపిరి. వారు ఆసక్తిగల వ్యక్తులతో 34,19,745 క్రమ గృహబైబిలు పఠనములను చేసారు. ఈ పనిచేయుటకు కావలసిన ఖర్చులను ఆపనిని చేయు ఆయా వ్యక్తులే భరించారు. వారు ప్రేమతో పడిన శ్రమకు యెహోవా ప్రతిఫలముగా 2,63,855 క్రొత్తగా బాప్తిస్మము పొందిన వారితో వృద్ధికలుగజేసెను.

అలాంటి ఇచ్చునట్టి ఆత్మ సాక్షులను మరియు ఇతర ఆసక్తిగల వ్యక్తులను ఈపనికి ఆర్థికసంబంధముగా మద్దతునిచ్చుటకు పురికొల్పుచున్నది. స్థానిక సంఘమునకు సంబంధించిన అనుదిన ఖర్చులకు సహాయము చేయుటతోపాటు అవసరమగు నిర్మాణపు పనికి అనగా రాజ్యమందిరము, అసెంబ్లీ హాలులను మరమ్మత్తు చేయుట, క్రొత్తవాటిని నిర్మించుట మొదలగువాటికి సహాయపడుదురు. విస్తారమైన పెరుగుదల ప్రతిసంవత్సరము జరుగుచున్నందున పెద్దసంఖ్యలో రాజ్యమందిరములు నిర్మింపబడవలసియున్నవి, వాటిలో కొన్నింటికి వందల వేల డాలర్లు ఖర్చగును. ఈ ఖర్చంతయు స్థానిక సాక్షుల స్వచ్ఛంద విరాళాలు మరియు శ్రమచే భరించబడుచున్నవి.

అంతేగాక, అనేక దేశాలలో బ్రాంచి ముద్రణా, మరియు కార్యాలయములతోపాటు, నివాసముకొరకు, అలాగే పెరుగుచున్న సంస్థకు కార్యాలయసభ్యుల మరియు ఇతర సౌకర్యముల అవసరతనుబట్టి, భవనములను విస్తృతముచేయుట లేక క్రొత్తవాటిని నిర్మించుట అవసరమగుచున్నది. ఇది కూడ స్వచ్ఛంద విరాళములు మరియు శ్రమచే బలపరచబడుచున్నది. ఇది న్యూయార్కు బ్రూక్లిన్‌ మరియు పాటర్‌సన్‌ ప్రాంతమందలి భవనములు ఇతర భవన మరమ్మత్తుల విషయంలోను సత్యమైయున్నది. సాధ్యమైనచోట స్థానిక సాక్షులే ఆర్థిక అవసరతను భరించుదురు. కొన్ని సందర్భములలో వాచ్‌టవర్‌ సొసైటి బ్రాంచ్‌ కార్యాలయములు ఇతరదేశములనుండి ఆర్థికసంబంధంగా లేక నిపుణత గలపనిని అందించునట్లు ఏర్పాటుచేయును. ఆవిధంగా సొసైటి నడిపింపు క్రింద “అందరికి సమానముగా” ఉండు పద్ధతి జరుగుచున్నది.—2 కొరింథీయులు 8:14.

అనేక మత గుంపులు చేయునట్లు మీరెందుకు ఆసుపత్రులను వైద్యకేంద్రములను మరియు ఇతర సహాయక కార్యములు, సాంఘిక సేవ మొదలగు వాటిని నడిపించరు?

యుద్ధము లేక పకృతి వైపరీత్యము సంభవించినప్పుడు తమకు సాధ్యమైనయెడల అలాంటి అత్యవసర పరిస్థితులకు యెహోవాసాక్షులు వెంటనే స్పందింతురు. వాస్తవమునకు ఆహారము, వస్త్రములు, పునర్నిర్మాణముకొరకు స్వచ్ఛందపనివారలుగా మొట్టమొదట ఆ ప్రాంతములో కనిపించువారు సాధారణముగా యెహోవాసాక్షులైయున్నారు. అయితే జీవిత భద్రత కొరకున్న పోలీసు, మరియు అగ్నిమాపక విభాగములను ఎలా నడపరో అలాగే ఆసుపత్రులు లేక వైద్యపరీక్ష కేంద్రములను నడపరు.

వారు సమర్పించుకున్న పరిచారకులైయుండి, అంతము రాకమునుపు ప్రపంచమంతటికి సాక్ష్యముగా రాజ్యసువార్తను బోధించి, ప్రకటించు పనిని కల్గియున్నారు. (మత్తయి 24:14) యేసు చెప్పినట్లు కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిగాయున్నారు. కాబట్టి యోగ్యమైనవైనను, అట్టి ఇతరపనుల నిమిత్తమై అత్యంత ప్రాముఖ్యమైన ఈ పనిని నిర్లక్ష్యపరచుట క్షమించగూడని విషయమవుతుంది.—మత్తయి 9:37, 38.

సహజంగా, అనేక మంది యెహోవాసాక్షులు డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రులందు సహాయకులై యున్నారు. అయితే వారు ముఖ్యపనిగా యెంచు క్రైస్తవ పరిచర్యకు దానిని అదనముగా ఎంచుదురు.

వాచ్‌టవర్‌ సొసైటి ఏ అధికారులైనను, దాని సభ్యులైనను, మీ విస్తార ముద్రణా కార్యాక్రమము ద్వారా డబ్బు సంపాదింతురా?

ఖచ్చితంగా లేదు! చట్టప్రకారం సొసైటి నాన్‌ ప్రోఫిట్‌ (లాభము పొందని) కార్పోరేషన్‌. స్టాక్‌ హోల్డర్స్‌గాని, భాగస్వామ్యముగాని, జీతాలుగాని లేవు. ప్రెసిడెంటుతో సహా ప్రధానకార్యాలయములో ఉండు ప్రతి పరిచారకుడు, డైరక్టర్లు చట్టపరంగా ఏ వ్యక్తిగత సంపాదనపొందని వారిగా ప్రమాణము చేసియున్నారు. అయితే వారికి ఆహారము, ఆశ్రయము, అవసరమగు వైద్యసదుపాయము అందించబడుతుంది. వీటితోపాటు వారి సాధారణ స్వంత ఖర్చుల నిమిత్తమై కొంత డబ్బు యివ్వబడుతుంది. ఒక సాక్షి సొసైటి పనినిమిత్తమై ప్రయాణించిన సాధారణంగా వారి ప్రయాణ ఖర్చులు భరించబడును.

అంతేగాక ప్రపంచంలో ఎక్కడకూడ మా పరిచారకులు వివాహములు చేసినందుకు, బాప్తిస్మము, లేక అంత్యక్రియలు జరిపించుటకు డబ్బువసూలు చేయరు. బహిరంగ ప్రసంగములకు లేక సమావేశములకు ప్రవేశ రుసుము లేక చందా వసూల్లు లేవు.

చందా వసూళ్లను ప్రత్యేకముగా సమకూర్చుట లేదు గనుక స్థానిక సంఘములు వాటి ఖర్చులను ఎలా భరిస్తాయి?

వ్యక్తులు యిష్టపడినట్లయిన స్వచ్ఛందముగా విరాళములనిచ్చునట్లు రాజ్యమందిరములో చందాపెట్టె లుంచబడును. (2 రాజులు 12:9) విరాళములన్నియు అవి పెద్దవైనను, చిన్నవైనను మెచ్చుకొనబడును. (మార్కు 12:42-44) నెలకొకసారి సంఘ లెక్కలనుచూచు పరిచారకుడు, వచ్చిన చందా, ఖర్చులు, సంఘము తరపున ప్రపంచవ్యాప్త ప్రకటన మరియు ఇతర పనులకొరకు వాచ్‌టవర్‌ సొసైటికి పంపిన చందా లెక్కలను క్లుప్తముగా సంఘమునకు తెలియజేయును.

వ్యక్తులు ఈ ఏర్పాటును అర్థము చేసికొనినప్పుడు, వారు యిష్టపడినట్లయిన “ప్రతిఒక్కరు తాము వృద్ధియగుకొలది” ఇందులో భాగము వహింతురు.(1 కొరింథీయులకు 16:2) ప్రపంచ వ్యాప్తముగానున్న 63,000 సంఘములలో ఇదే అభ్యసించబడుచున్నది.

పెంతెకొస్తు సమయములో తొలిక్రైస్తవులు తమకు కలిగినవాటిని సమిష్టిగాయుంచుకొనిరి. యెహోవాసాక్షులు దీనిని చేస్తారా?

సా.శ. 33 పెంతెకొస్తు తరువాత, దూరప్రాంతములనుండి వచ్చిన యూదులలో అప్పుడే క్రైస్తవులుగా మారినవారు మరియెక్కువగా ఆత్మీయ జ్ఞానమును పొందుటకు యెరూషలేములోనే ఉండిపోగా అత్యవసర పరిస్థితి ఏర్పడినది. తాత్కాలికముగా వారికి గృహము, ఆహారము అవసరమైనది. కావున స్థానికముగానున్న క్రైస్తవులు స్వచ్ఛందముగా తమ ఆస్తులను అమ్మి దీర్ఘకాలంగా వారితో సహవాసమును కలిగియుండుటకై వారందరు సమిష్టిగా అందు పొల్గొన్నారు. (అపొ. కార్యములు 2:1, 38-47; 4:32-37) వారిలో ఎవరును అమ్ముటకుగాని లేక దానిని కానుకగా యిచ్చుటకుగాని బలవంతపెట్టబడలేదు. (అపొ. కార్యములు 5:1-4) ఈ విధముగా అందరు తమకు కలిగినవాటిని యేకముచేసి పాలుపొందుట కొందరు తలంచినట్లు కమ్యూనిజమ్‌ కాదు. అది కేవలము తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. క్రైస్తవులు తమ స్వంత గృహములకు తిరిగి వెళ్లిన తరువాత ఆ పద్ధతి ఆగిపోయినది.

వస్తుసంబంధముగా ఇచ్చుట పాపమునుండి విమోచింపబడుటకు మార్గమని మీరు బోధింతురా?

ఎంతమాత్రము లేదు. బైబిలు ఈ విధముగా చెప్పుచున్నది: “పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు.”—1 పేతురు 1:18, 19.

యెహోవాసాక్షులు రక్షణకొరకై యేసు విమోచనబలియందు విశ్వాసముంచుదురే గాని, స్వచ్ఛంద విరాళములు తమకు రక్షణకలుగజేస్తాయని వారు వాటిని ఇవ్వరు. అయినను దేవుని నీతియుక్తమైన నూతనలోకముయొక్క సువార్తను వ్యాప్తిచేయుటకై కొంతమేరకు నిధులు అవసరమైయున్నవని వారికి తెలియును. (2 పేతురు 3:13) మరియు ఈ ప్రకటన పనికై విరాళములనిచ్చుట యెహోవావలన అనుగ్రహించబడిన ఆధిక్యతయని వారు భావింతురు.

తన కుమారుడైన సొలొమోను నిర్మించనైయున్న యెహోవా ఆలయమునకు పెద్దమొత్తములో విరాళమిచ్చునప్పుడు, రాజైన దావీదు ఇలా ప్రార్థించెను: “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును, పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి;. . .ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.”—1 దినవృత్తాంతములు 29:11, 14.

ఈనాడు యెహోవాసాక్షులును ఇతర నీతియుక్తమైన మనస్సుగలవారును దావీదు భావించినట్లే భావింతురు. యెహోవాను స్తుతించు పనికి మద్దతుగా చందాలనిచ్చు ఆధిక్యతను కలిగియుండుటకు వారు సంతోషించుదురు. అంతేగాక ఆయన సేవకై వారు ఇచ్చు సమస్తము ఏదోవిధముగా ఆయననుండి వచ్చునదేయని వారు గుర్తిస్తారు. యెహోవా ఇట్టి ఆత్మను ఆశీర్వాదిస్తూ, ఈ విధముగా తనపనిని వృద్ధిచేయుచున్నాడు. (w90 12/1)

[30వ పేజీలోని బాక్సు]

రాజ్యపనికై కొందరెట్లు చందా అందింతురు

◻ బహుమతులు: స్వచ్ఛంద విరాళముగా డబ్బును నేరుగా వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ ఇండియా, హెచ్‌-58 ఓల్డ్‌ కండాల రోడ్‌., లోనవ్లా 410 401, మహారాష్ట్ర., లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలకు గాని పంపవచ్చును. రియల్‌ ఎస్టేట్‌ (ఇల్లు, ఇళ్లస్థలములు), ఆభరణములు మొదలగు వెలగల వాటిని కూడ విరాళముగా ఇవ్వవచ్చును. వాటితో పాటు క్లుప్తముగా ఇవి విరాళముగా అందించబడుచున్నవని ఉత్తరము పంపవలెను.

◻ షరతుపై విరాళములిచ్చు పద్ధతి: వ్యక్తిగత అవసరమేర్పడినప్పుడు చందాదారులు తిరిగి తీసుకొను ఏర్పాటుతో వాచ్‌టవర్‌ సొసైటి ట్రస్టులో డబ్బు ఉంచవచ్చును.

◻ భీమా: జీవిత భీమా పాలసి లేక రిటైర్‌మెంట్‌/పింఛను మొదలగు వాటిని పొందు లబ్దిదారిగా వాచ్‌టవర్‌ సొసైటి పేరు పెట్టవచ్చును. ఆ ఏర్పాట్లను సొసైటికి తెలియజేయవలెను.

◻ ట్రస్టులు: బ్యాంకు పొదుపు ఖాతాలు సొసైటి ట్రస్టు పేరట పెట్టవచ్చును. ఇలా చేసినట్లయిన దయచేసి సొసైటికి తెలుపండి. దాత అతను/ఆమె జీవితకాలములో ప్రయోజనము పొందు ఏర్పాటుక్రింద స్టాకులు, బాండ్స్‌, ఆస్తులు కూడ విరాళముగా ఇవ్వవచ్చును. ఈ పద్ధతి తమ తదనంతరము ఆస్తి సొసైటికి చెందునట్లు చేయుచు మరణ వీలునామాలోని చిక్కులను, ఖర్చును తొలగించును.

◻ వీలునామాలు: ఆస్తి లేక డబ్బు చట్టబద్దమైన వీలునామా ద్వారా వాచ్‌టవర్‌ సొసైటికి అప్పగించవచ్చును. ఒక కాపి సొసైటికి పంపవలెను.

ఈ విషయములందు ఎక్కువ సమాచారమునకు గాని లేదా సలహాలకొరకు గాని వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్టు సొసైటి ఆఫ్‌ ఇండియా, హెచ్‌-58 ఓల్డ్‌ కందాల రోడ్‌., లోనవ్లా 410 401, మహారాష్ట్ర లేదా ఈ పత్రిక ప్రచురణ కర్తలకు గాని వ్రాయండి.

[31వ పేజీలోని చిత్రాలు]

న్యూయార్కు, పాటర్‌సన్‌లో నిర్మాణమందున్న యెహోవాసాక్షుల బైబిలు విద్యా కేంద్రంలో భాగము

[32వ పేజీలోని చిత్రాలు]

స్వచ్ఛంద విరాళములనిచ్చు తన ప్రజల భవన నిర్మాణపు పనిని యెహోవా వృద్ధిచేయును

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి