శాశ్వత శాంతిని ఎవరు తీసుకురాగలరు?
“వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.”
ఈ భాగం కింగ్ జేమ్స్ వర్షన్ బైబిలునందలి యెషయా 2వ అధ్యాయం 4వ వచనంలోనిది. అది ఐక్య రాజ్య సమితి అభివృద్ధి పథకం (యు.ఎన్.డి.పి.) వారు ప్రచురించిన హ్యుమన్ డివలప్మెంట్ రిపోర్ట్ 1994 ఈ మాటలను ఎత్తి వ్రాసింది మరి ఆ తర్వాత ఆ నివేదిక ఇంకా ఇలా చెప్పింది: “ప్రచ్ఛన్న యుద్ధం [1990 నందు] అంతమవ్వడంతో ఈ ప్రవచనం నెరవేరే సమయం వచ్చినట్లు కనిపించింది. అయితే ఇంతవరకు అది ఓ మోసపూరిత నిరీక్షణగానే నిరూపించబడింది.”
సైనిక ఖర్చుతగ్గించడం
అంతర్జాతీయ రాజకీయ వాతావరణంలోని మార్పుకు సైనిక ఖర్చుల్లో అధిక తగ్గుదల తోడు కాగలదన్న వాస్తవం శాంతిని గూర్చిన ఆశలు తగ్గిపోయేందుకు ఒక కారణమైంది. కొంత తగ్గుదల ఉన్నమాట నిజమే. ఐక్య రాజ్య సమితి లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సైన్యానికి అయ్యే ఖర్చు 1987లోని 99,500 కోట్ల డాలర్ల శిఖరాగ్రంనుండి 1992లో 81,500 కోట్ల డాలర్లకు తగ్గింది. అయినా, 81,500 కోట్ల డాలర్లంటే చాలా ఎక్కువే. ప్రపంచ జనాభాలోని సగంమంది సమిష్టి ఆదాయానికి అది ఇంచుమించు సరిసమానం!
నిరాయుధీకరణకు విరుద్ధంగా పనిచేసే మరో విషయమేమంటే సైనిక శక్తి భద్రతను తీసుకువస్తుందన్న దృష్టియే. కనుక, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినప్పటికీ, జాతీయ భద్రతకు చేసే ఖర్చు ఎక్కువగా ఉండాలని పారిశ్రామిక దేశాల్లోని వారు వాదిస్తున్నారు. తాను అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి డైరెక్టరుగా ఉన్నప్పుడు జేమ్స్ ఊస్లే కాంగ్రెస్‌తో 1993 ఫిబ్రవరిలో ఇలా చెప్పాడు: “మనం ఓ పెద్ద ఘటసర్పాన్ని [రష్యాను] నరికేశాము కానీ మననింకా భయకంపితం చేసే రకరకాల విష సర్పాలున్న అడవిలో జీవిస్తున్నాము.”
వర్ధమాన దేశాల్లో అయ్యే అధిక సైనిక వ్యయం, భవిష్యత్తులో ఘటసర్పాలూ, విష సర్పాలూ కాగల అవకాశాలున్న దేశాలనుండి వచ్చే దాడిని నివారించే సాధనమని సర్ది చెప్పబడుతుంది. అయితే వాస్తవానికి, యు.ఎన్.డి.పి. ఇలా చెప్పింది: “వర్ధమాన దేశాలు కొన్ని అంతర్జాతీయ యుద్ధాలను మాత్రమే చేశాయి, మరి అనేకం తమ ప్రజలను అదుపులో పెట్టేందుకు సైనిక దళాలను ఉపయోగించాయి.” వాస్తవానికి, యు.ఎన్.డి.పి. ఆ నివేదిక ఇలా వివరించింది: “వర్ధమాన దేశాల్లో, బయటివారి ఒత్తిడివల్ల జరిగే యుద్ధాల్లో మరణించే వారికంటే సామాజిక అశ్రద్ధ (కుపోషణ మరియు నివారించదగిన రోగాల) వల్ల మరణించే అవకాశాలు 33 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ, సగటున ఒక వైద్యునికి 20 మంది సైనికులున్నారు. ఇకపోతే, సైనికులు వ్యక్తిగత భద్రతను అధికం చేసే బదులు దాన్ని తగ్గించే అవకాశమే ఎక్కువగా ఉంది.”
అంతర్జాతీయ ఆయుధ వ్యాపారం
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, తమ సంబంధాలను దృఢపర్చుకునేందుకూ సైనిక స్థావరాలను సంపాదించేందుకు అధికారం చెలాయించేందుకు అగ్రరాజ్యాలు తమ మిత్ర దేశాలకు ఆయుధాలను విక్రయించాయి. అనేక దేశాల సేనలు గొప్పగా పెరిగాయి. ఉదాహరణకు ప్రస్తుతం, 33 దేశాల్లో 1,000 కంటే అధిక యుద్ధ ట్యాంకులున్నాయి.
ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది కనుక, ఆయుధాలు అమ్మేందుకు రాజకీయ మరియు యుద్ధ సంబంధిత కారణాలు తగ్గాయి. అయినప్పటికీ, ఆర్థిక ప్రోత్సాహకాలు దృఢంగా ఉంటాయి. డబ్బు చేసుకోవచ్చు! కనుక, తమ దేశాల్లో ఆయుధాల డిమాండు తగ్గిపోతుండగా, ఉద్యోగాలను కాపాడేందుకు ఆర్థికపరిస్థితిని బలంగా ఉంచేందుకు గల ఏకైకమార్గం విదేశాలకు యుద్ధపరికరాలను అమ్మడమేనని యుద్ధపరికరాలను తయారు చేసేవారు ప్రభుత్వాలను నమ్మిస్తున్నారు.
వరల్డ్ వాచ్ అనే పత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “అగ్రరాజ్యాలు తమ అణు క్షిపణులును వెనక్కి తీసుకున్నట్లుగానే, ఎవరు కొనుక్కోవడానికి వస్తే వారికి సాంప్రదాయిక బాంబులనూ తుపాకులను అమ్ముతున్నారు.” దాని లెక్కలేమిటి? స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 1988 నుండి 1992 వరకు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడుపోయిన సాంప్రదాయిక ఆయుధాలు వెల 15,100 కోట్ల డాలర్లు. అతి పెద్ద ఎగుమతి దారీ రాజ్యం అమెరికా, దాని తర్వాత మునుపటి సోవియట్ యూనియన్.
అణు భయం ఇంకా ఉంది
అణు భయం విషయమేమిటి? అమెరికా మరియు సోవియట్ యూనియన్ (లేక దాని తర్వాత వచ్చిన దేశాలు) 1987 నందు ఇంటర్మీడియేట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీపై, 1991, 1993లలో రెండు స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీపై [స్టార్ట్] సంతకాలను చేశాయి.
స్టార్ట్ ఒప్పందాలు ఒక క్షిపణి శిరోభాగము కంటే ఎక్కువగా ఉన్న భూతల ఆయుధాలను నిరోధించింది మరియు మూడువంతుల అణు క్షిపణి శిరోభాగాలను రవాణా చేసే వాహనాలు 2003 కల్లా తీసివేయాలని ఆదేశించింది. అయితే అణ్వస్త్రాలతోకూడిన మూడవ ప్రపంచయుద్ధ భయం తగ్గినప్పటికీ ఈ భూమ్మీది జీవాన్ని అనేకమార్లు నాశనం చేయగలిగేంతటి విశాలమైన ఆయుధ శాలలు ఇంకా ఉన్నాయి.
ఈ ఆయుధాలను వేరుచేయడం మూలంగా అణు దొంగతనం జరిగే అవకాశాలను అధికం చేస్తుంది. ఉదాహరణకు, రష్యా ప్రతి సంవత్సరం 2,000 క్షిపణి శిరోభాగాలను వేరుచేసి దాస్తోంది, వాటినుండి పిట్స్ అని పిలువబడే పిడికిలంత సైజుగల ప్లూటోనియపు అండాలను తీస్తుంది. తయారు చేసేందుకు ఎంతో ఖర్చూ సాంకేతికత అవసరమైన క్షిపణి శిరోభాగల ఈ పిట్స్, అణు బాంబుల్లో ముఖ్యమైన మిశ్రణం. పిట్స్ సామాన్యంగా అణుధార్మిక ప్రసరణను అడ్డగించే స్టీలు పొరలో ఉంటాయి కనుక, ఓ దొంగ తన జేబులో వాటిలో ఒకదాన్ని పెట్టుకుని పోవచ్చన్న విషయాన్ని ఊహించగలం. రెడిమేడ్ పిట్‌ను సంపాదించిన ఉగ్రవాది, దాని చుట్టూ పేల్చే యంత్రాన్ని బిగించి అత్యంత శక్తివంతమైన బాంబును తయారు చేసుకోవచ్చు.
మరో భయమేమంటే, అనేకానేక దేశాలకు అణ్వాయుధాలు వ్యాపించే ప్రమాదం. అయిదు దేశాలు—చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగడమ్ మరియు అమెరికా—అణుశక్తి ఉన్న దేశాలుగా గుర్తించబడుతున్నాయి మరియు అనేక ఇతర దేశాలు కూడా అణ్వస్త్రాలను త్వరలో ఏర్పాటు చేసుకునే శక్తిగలవని భావించబడుతున్నాయి.
అనేక దేశాలు అణ్వాయుధాలను పొందుతుండగా, ఎవరోఒకరు వాటిని ఉపయోగించే సాధ్యత అంతకంతకూ పెరుగుతుంది. ఈ భయంకరమైన ఆయుధాలు ఉపయోగింపబడతాయని ప్రజలు భయపడడం సబబే. ది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ వార్ అనే పుస్తకం చెబుతున్నట్లుగా, “వాటి శక్తి ఎంత అధికంగా ఉందంటే, సాంప్రదాయిక ఆయుధాలు వాటి ముందు దిగదుడుపే.”
నిరాయుధీకరణ మరియు శాంతి
దేశాలు తమ వినాశనకర ఆయుధాలను వదిలించుకోవాలంటే అప్పుడేమిటి? అలాచేస్తే అది శాంతియుత లోకం వస్తుందన్న నమ్మకాన్నిస్తుందా? లేనేలేదు. సైనిక చరిత్రకారుడు జాన్ కీగన్ ఇలా చెప్పాడు: “ఆగస్టు 9, 1945 నుండి అణ్వాయుధాలు ఎవరినీ చంపలేదు. ఆ తేది నుండి మరణించిన 5,00,00,000 మందిలో అనేకులు, అదే సమయంలో ప్రపంచాన్ని ముంచెత్తిన డ్రై సెల్ బ్యాటరీలూ, ట్రాన్సిస్టర్ రేడియోల కంటే కొంచెం ఎక్కువ ధర తక్కువ శక్తి గల ఆయుధ సామాగ్రితోను మరియు చవకగానూ, పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసిన వాటితోనూ చంపబడ్డారు.”
తక్కువ సాంకేతికతగల ఆయుధాలను ఉపయోగించి జరిపిన వినాశనానికి సరిక్రొత్త ఉదాహరణ రువాండా. దాని గురించి ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా (1994) ఇలా చెబుతోంది: “ప్రజలలో ఎక్కువమంది రోమన్ కాథోలిక్కులు. . . . ఎక్కువగా రోమన్ కాథోలిక్ మరియు ఇతర క్రైస్తవ చర్చీలవారే ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను నడిపిస్తారు.” అయినప్పటికీ, రువాండాలో పెద్ద కత్తులు ధరించిన ప్రజలచే అయిదు లక్షలమంది చంపబడ్డారు. ప్రపంచ శాంతిని తీసుకువచ్చేందుకు సాంప్రదాయిక మరియు అణ్వాయుధాలను తగ్గించడం కంటే ఎక్కువే చేయాల్సిన అవసరం ఉందన్నది స్పష్టం. అంతేకాకుండా, ప్రపంచ మతాలు అందించే బోధలు కాకుండా మరేదో కావాలి.
జాతి విరోధాలు అధికమౌతున్నాయి
ఐక్య రాజ్య సమితికి చెందిన శరణార్థుల ఉన్నత కమీషనరు సాడాకో ఓగాటా ఇటీవల ఇలా అన్నారు: “ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత సమస్యలన్నీ తీరిపోతాయని మేమనుకున్నాము. ప్రచ్ఛన్న యుద్ధానికి మరో విషయముందని, అంటే తమ పలుకుబడిగల ప్రాంతాల్లో ఉన్న వారిపై అగ్రరాజ్యాలు తమ ఆదేశాలను జారీచేశాయి లేక బలవంతంగా ఆదేశాలను ఇచ్చాయి. . . . కనుక ఇప్పుడు, అంటే ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత, పారంపర్య ప్రచ్ఛన్నమైన, బహుశ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కాలంలో ఉన్నటువంటి వివాదాలు ఒక్కసారిగా పెల్లుబకడం ప్రారంభమైనట్లు మనం చూస్తున్నాం.”
పులిట్జర్ బహుమతిని గెలుచుకున్న చరిత్రకారుడు, రచయిత ఆర్థర్ షేసింగర్ కూడా అలాంటి విషయాన్నే చెప్పాడు: “ఒక రకమైన ద్వేషాలు తీరిన తర్వాత మరోరకానివి వస్తున్నాయి. తూర్పు యూరప్‌లో ఉక్కుపిడికిలిని సడలించడం, మునుపటి సోవియట్ యూనియన్‌లోను చరిత్రలోను జ్ఞాపక స్మృతులలోనూ లోతుగా పాతుకుపోయిన సైద్ధాంతిక కుల, జాతి, మత, భాషా భేదాలు చెలరేగాయి. . . . 20 శతాబ్దం సైద్ధాంతిక పోరాటాల శతాబ్దమైతే, 21వ శతాబ్దం జాతివైషమ్య యుద్ధాలతో ప్రారంభమౌతుంది.”
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 1989, 1992 మధ్య కాలంలో 82 సాయుధ పోరాటాలు జరిగాయి, వాటిలో అనేకం వర్ధమాన దేశాలలోనే జరిగాయి. 1993వ సంవత్సరంలో, 42 దేశాలమధ్య పెద్ద పోరాటాలు జరిగాయి మరి 37 దేశాలు రాజకీయ హింసాత్మక సంఘటనలను ఎదుర్కున్నాయి. ఇంతలో, ఐక్య రాజ్య సమితి—దాని సొమ్ము పూర్తిగా ఆరిపోయి—కేవలం 17 సైనిక చర్యలు చేపట్టేందుకు ఎంతో కష్టపడింది కానీ పెద్దగా విజయాన్ని సాధించలేదు. మరి మానవజాతి శాంతియుత లోకం కొరకు మరెక్కడైనా చూడవల్సివుంది.
అస్పష్టంగా ఉన్న సమస్యలు
భవిష్యత్తును ఆశాభావంతో చూసే బదులు, అనేకులు విపత్సూచకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ది అట్లాంటిక్ మంత్లీ 1994 అనే పత్రిక ఫిబ్రవరి ముఖ శీర్షికలో రానున్న దశాబ్దాలను గూర్చి చెప్పిన ఓ విపత్సూచకాన్ని ఇలా క్లుప్తీకరించింది: “వాతవరణ మరియు సాంఘిక విపత్తులవల్ల మాటిమాటికీ వచ్చే శరణార్థులవల్ల దేశాలు విచ్ఛిన్నమౌతున్నాయి. . . . తక్కువ వనరులు, ప్రత్యేకంగా నీటి వనరుల కొరతనుబట్టి యుద్ధాలు జరుగుతున్నాయి మరియు పేదవర్గంలోని సాయుధ దళాలు ఉన్నతవర్గంవారి వ్యక్తిగత భద్రతా సిబ్బందితో తలపడినప్పుడు నేరంతోపాటు యుద్ధం జరుగుతూనే ఉంటుంది.”
దాని భావం శాశ్వత శాంతి అసాధ్యమైనదనా? కానేకాదు! మనం భవిష్యత్తును నమ్మకంతో ఎందుకు చూడగలము అనేందుకుగల కారణాలను తదుపరి శీర్షిక చూపిస్తుంది.
[5వ పేజీలోని బాక్సు]
మతం—శాంతిని తీసుకురాగల శక్తి?
దేశాలు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ప్రపంచ మతాలు శాంతి సౌభాతృత్వపు బోధలను విడనాడుతాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోని పరిస్థితిని గూర్చి బ్రిగేడియర్ జనరల్ ఫ్రాంక్ పి. క్రూజర్ ఇలా చెప్పాడు: “మనకున్నవాటిలో రక్త దాహాన్ని ప్రబోధించే వాటిలో గొప్పవి క్రైస్తవ చర్చీలు మరి వాటిని మనం బాగా వినియోగించుకుంటున్నాము.”
యుగాలుగా, యుద్ధంలో మతం పాత్ర ఒకేలా ఉంటూ వచ్చింది. కాథోలిక్కు చరిత్రకారుడైన ఇ.ఐ.వాట్కిన్ ఇలా అంగీకరించారు: “అంగీకరించేందుకు అది వేదనకరమైనప్పటికీ, అబద్ధాన్ని స్థాపించేందుకు లేక కపట యథార్థత కొరకు, తమ దేశాలు చేసిన యుద్ధాలన్నింటికీ బిషప్పులు ఎడతెగక తమ మద్దతునిచ్చారనే చారిత్రాత్మక వాస్తవాన్ని మనం కాదనలేము లేక పట్టించుకోకుండా ఉండలేము.” మరియు కెనడాలోని వాంకోవర్నందలి సన్ పత్రిక సంపాదకీయం ఇలా చెప్పింది: “చర్చీలు జాతీయతా భావాలను అనుసరించడం బహుశ సంస్థీకరించబడిన మతాలన్నింటి బలహీనతే కాబోలు. . . . ఇరు పక్షాల్లోనూ దేవుడు ఉన్నాడని చెప్పకుండా జరిగిన యుద్ధమేదైనా ఉందా?”
స్పష్టంగా, ప్రపంచ మతాలు శాంతికి ప్రేరకంగా ఉండే బదులు, యుద్ధాలను హత్యలను ప్రబోధించాయి—ఇది రువాండాలోని హత్యాకాండవల్ల ఎంతో చక్కగా కనుపర్చబడింది.
[6వ పేజీలోని బాక్సు]
యుద్ధ నిరర్థకత
1936 నందు ప్రచురించబడిన ఐ ఫౌన్డ్ నో పీస్ అనే పుస్తకంలో విదేశీ విలేఖరి వెబ్ మిల్లర్ ఇలా వ్రాశాడు: “[మొదటి ప్రపంచ యుద్ధం] జరిగిన ఎనిమిది సంవత్సరాలు దాటేవరకు దాని ఘోరకలితో కూడిన భయంకర యుద్ధపు అసహ్యతా నిరర్థకతలు నామీద అంత గట్టి ముద్రని వేయకపోవడం చిత్రం.” ఆ సందర్భంలో ఆయన వర్డన్ యుద్ధ మైదానాన్ని తిరిగి సందర్శించి, 10,50,000 మంది చనిపోయారని చెప్పాడు.
“యుద్ధంలో కోట్లమంది ఇతరులతో సహా నేనూ మోసపోయాను. ప్రపంచ యుద్ధం క్రొత్త యుద్ధాలకు జన్మనివ్వడంలో మాత్రమే విజయం సాధించింది. ఎనభై ఐదు లక్షల మంది పురుషులు వృథాగా మరణించారు, కోట్లమంది వర్ణింపరాని భయాన్ని అనుభవించారు, కోట్లాది మంది వేదననూ విహీనతనూ అసంతోషాన్ని అనుభవించారు, మరి ఇదంతా ఆశ్చర్యపడేంత అవాస్తవంతో జరిగింది” అని మిల్లర్ వ్రాశాడు.
ఈ పుస్తకం ప్రచురించబడిన మూడు సంవత్సరాల తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ది వాషింగ్టన్ పోస్ట్ “మన 20వ శతాబ్దపు యుద్ధాలు యోధులపైనా ప్రజలపైనా సమానంగా జరిగిన ‘సంపూర్ణ యుద్ధాలు.’ . . . గత శతాబ్దాల్లో జరిగిన క్రౌర్యమైన యుద్ధాలు, దీనితో పోల్చితే అవి చిన్న చిన్న పోరాటాలే” అని చెప్పింది. ఓ అధికార అంచనా ప్రకారం, 1914 తర్వాతి యుద్ధాల్లో ప్రజా తిరుగుబాటుల్లో 19.7 కోట్లమంది చనిపోయారు.
అయినప్పటికీ, మానవుల యుద్ధాలు తిరుగుబాట్లన్నీ శాంతినీ సంతోషాన్నీ తీసుకురాలేదు. వాషింగ్టన్ పోస్ట్ ఇలా చెప్పింది: “ఈ శతాబ్దంలో ఏ రాజకీయ లేక ఆర్థిక విధానాలు ఇంతవరకూ కోట్లమంది అవిశ్రాంత ప్రజలను శాంతిపర్చలేదు లేక తృప్తిపర్చలేదు.”
[7వ పేజీలోని చిత్రం]
తమ స్వంత మతంవారివల్ల రువాండాలో చంపబడిన లక్షలాది ప్రజల్లో ఈ తల్లి ఒకరు
[క్రెడిట్ లైను]
Albert Facelly/Sipa Press