కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 11/1 పేజీలు 4-7
  • ప్రపంచశాంతి నిజముగా దాని భావమేమి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచశాంతి నిజముగా దాని భావమేమి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భూగోళమంతటా నిరాయుధీకరణ—దేవుని విధానము!
  • ఇంటి ముంగిట శాంతి
  • శాంతి మరియు నీ వ్యక్తిగత క్షేమము
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • నిజమైన శాంతిని వెదకి దానిని వెంటాడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 11/1 పేజీలు 4-7

ప్రపంచశాంతి నిజముగా దాని భావమేమి?

దేవుడు తన మనస్సునందు కల్గియున్న ప్రపంచశాంతి, భూగోళమంతటా కాల్పుల విరమణ లేక అణుయుద్ధ స్తంభనకంటే ఎంతో మిన్నయైనది. “శాంతి” అనుపదమును బైబిలు వాడు విధానమును బట్టి యిది స్పష్టమగుచున్నది.

ఉదాహరణకు, హెబ్రీ లేఖనములలో (“పాతనిబంధన”) శాంతికి వాడు పదము షాలోమ్‌. పితరుడైన యాకోబు తనకుమారుడైన యోసేబుతో చెప్పిన మాటలందు ఈ పదముయొక్క రూపము ఆదికాండము 37:14లో వాడబడెను: “అప్పుడతడు నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలిసికొని నాకు వర్తమానము తెమ్ము.”a మరల ఆదికాండము 41:16 నందు షాలోమ్‌ వాడబడింది, అచ్చట “క్షేమకరమని” తర్జుమా చేయబడెను.

అందుచేత బైబిలు భావములో, నిజమైన శాంతి కేవలము పోరాటములను నిలిపి వేయుట మాత్రమే కాదుగాని, ఆరోగ్యము, భద్రత, మరియు సంక్షేమము కూడ యిమిడియున్నది. శాంతిని ఎలా సాధించవలెనో అను చిక్కు ప్రశ్నను మానవులు పరిష్కరించలేక పోయిరని మా ఆగస్టు 1, 1991 సంచిక చూపెను. “సమాధానకర్తయగు అధిపతియైన” యేసుక్రీస్తు మాత్రమే, ఆ విడిపోయిన ముక్కలను దగ్గరకు చేర్చి భూమికి నిజమైన శాంతిని తేగల్గును. (యెషయా 9:6, 7) దృష్టాంతమునకు కీర్తన 72:7, 8 నందు అతని పరిపాలనను గూర్చి బైబిలు ఏమి ప్రవచించుచున్నదో చూడుము: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రమునుండి సముద్రమువరకు యూప్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యముచేయును.” ఆరోగ్యము, భద్రత, క్షేమము ప్రపంచవ్యాప్తముగా ఉండుటను ఊహించుము! ఏ రాజకీయ సంధి దానిని ఎప్పటికి సాధించజాలదు. దేవుని రాజ్యము మాత్రమే సాధించగలదు, అంతకన్నా ఎక్కువే అది సాధించును. ఇట్టి భవిష్యత్‌ ప్రపంచశాంతిని గూర్చిన ఉల్లాసకరమగు ప్రవచనాత్మక దర్శనములనేకమైనవాటిని బైబిలు యిచ్చుచున్నది. వాటిలో కొన్నింటిని మనము పరిశీలించెదము.

భూగోళమంతటా నిరాయుధీకరణ—దేవుని విధానము!

కీర్తన 46:8, 9 ఇట్లనుచున్నది: “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద ఆశ్చర్యమును గొల్పు సంఘటనలను కలుగజేయువాడు. విల్లువిరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే; యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే.” “విల్లు” “బల్లెము” “యుద్ధరథము” అనుమాటలు ఏదేని యుద్ధాయుధము లేక యుద్ధ సామాగ్రికి చిహ్నములు. ఆవిధంగా యెహోవా, ఆయుధాల పరిమితి, లేదా పూర్తి నిరాయుధీకరణ కంటె అధికంగా చేయును. అణ్వాయుధాలును, ఫిరంగులును, ట్యాంకులు, క్షిపణి వాహకాలు, చేతి బాంబులు, ప్లాస్టిక్‌ బాంబులు, తుపాకులు, రివాల్వర్లు—ప్రపంచశాంతిని భంగపరచు మరిదేనినైనను సరే ఆయన సంపూర్ణంగా తుడిచి పెట్టును.

అయిన, కేవలము ఆయుధాలే యుద్ధాన్ని జరిగించవు. సాధారణంగా, యుద్ధము ద్వేషం, దురాశ, లేక దౌర్జన్యముతో కూడిన అసంపూర్ణ మానవ స్వభావమునుండి ఉత్పన్నమగుచున్నది. (యాకోబు 4:1-3 పోల్చుము) ప్రజలలోని అటువంటి దుష్ట వ్యక్తిత్వ లక్షణాలను తొలగించుట ద్వారా దేవుని రాజ్యము యుద్ధమునకు మూలకారణముపై దాడిచేయును. ఎట్లు? భూవ్యాప్తంగా విద్యాబోధనా కార్యక్రమము ద్వారా అట్లు చేయును. “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.”—యెషయా 11:9.

ఆవిధముగా “యెహోవాచేత బోధించబడిన” తరువాత మానవజాతి మరెన్నడును తమ యుద్ధమునకు, శత్రుత్వమునకు, లేక తిరస్కారమునకు ఆధారమగు జాతి విభేధములను చూడదు. (యోహాను 6:45) “దేవుడు పక్షపాతి కాడు” భూనివాసులు ఆయన నిష్పక్షపాత వైఖరిని ప్రతిబింబించెదరు. (అపొస్తలుల కార్యములు 10:34) దేశ సరిహద్దులను తొలగించుట ద్వారా జాతి ఘర్షణలకు కారణమైన ఏ శక్తినైనను ఆ రాజ్యము నిర్మూలించును. ‘సముద్రమునుండి సముద్రము వరకు భూదిగంతములవరకు’ అందరూ క్రీస్తు పాలనకు తమ యిష్టమును కృతజ్ఞతా పూర్వక అంకిత భావమును ప్రదర్శించెదరు.—కీర్తన 72:8.

అటువంటి శాంతి చిరకాలముండులాగున, మానవ చరిత్రలో గొప్ప వేర్పాటు శక్తిగా పనిచేసిన: అబద్ధమతమును కూడ ఆ రాజ్యము నిర్మూలించును. (జెఫన్యా 2:11) ఏకైక సత్యదేవుని ఆరాధనలో మానవులు యేకమైయుందురు. (యెషయా 2:2, 3) ప్రపంచవ్యాప్త సహోదరత్వము పెంపారును!

ఇంటి ముంగిట శాంతి

వ్యక్తిగత కుటుంబములు అవమానములు, వేధించుమాటలు, బెదరింపులు, నిత్యము తలెత్తు మరుభూములైనట్లయితే, ప్రపంచశాంతివలన ప్రయోజనమేమి? నేడు అనేక కుటుంబములు ఆవిధంగానే ఉన్నవి. ఇతర కుటుంబాలు బాధాకరమైన నిశ్శబ్ద ముసుగు చాటున దీర్ఘకాల వైరమును కప్పిపుచ్చును.

కాబట్టి నిజమైన శాంతి తప్పక కుటుంబ సమాధానమును కలిగియుండాలి. రాజ్య విద్యా కార్యక్రమము క్రింద, భార్యాభర్తలు ప్రేమ, గౌరవములతో ఒకరినొకరు వ్యవహరించుతీరు బోధించబడును. (కొలొస్సయులు 3:18, 19) పిల్లలు ‘అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినునట్లు’ బోధింపబడుదురు. (కొలొస్సయులు 3:20) తల్లిదండ్రులను కలతపెట్టుటకు, తొందరపెట్టుటకు తిరుగబడే యౌవనులు ఇక ఉండరు. విధేయతే ప్రమాణముగా సహకారమే సూత్రముగా యుండును. పిల్లలను చూచుట సంతోషము మనచుట్టూ వారిని కలిగియుండుట ఆనందముగా ఉండును.

ఈనాడు, ఆర్థిక వత్తిడులు కుటుంబ కలహాలను మరింత ఉద్రుతము చేయుచున్నవి. ఎందుకనగా తల్లిదండ్రులు ఇరువురు లౌకిక ఉద్యోగములలో ఎక్కువ పనిభారము మోయవలసి వచ్చుచున్నది. కాని క్రీస్తు పరిపాలన క్రింద కుటుంబములు అణగద్రొక్కుచున్న ఆర్థిక భారములనుండి పెరిగిపోవుచున్న అద్దెలు, శిఖరానికి చేరుకొనుచున్న తాకట్టు చెల్లింపులు, పన్నులు, నిరుద్యోగము వంటి వాటినుండి విడుదల పొందును. ఆశలను నెరవేర్చు, సవాలునిచ్చు పని కావలసినంత దొరకును. ఎవరును ఇండ్లులేనివారై యుండనవసరములేదు. ఈ సత్యములను యెషయా 65:21-23 నందు గల ప్రవచనము ఎట్లు ఉన్నత పరచుచున్నదో గమనించుము: “జనులు ఇండ్లుకట్టుకొని వాటిలో కాపురముందురు. . . .వారు కట్టుకొన్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. . . .తాము చేసుకొనిన దాని ఫలము పూర్తిగా అనుభవించుదురు. వారు వృధాగ ప్రయాస పడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవాచేత ఆశీర్వాదింపబడిన వారగుదురు. వారి సంతానపువారు వారి యొద్దనే ఉందురు.”

పట్టణ కాలుష్యసంబంధమైన దృశ్యములు, శబ్దములు, వాసనలచే బాధించబడని పరిసరాలలో జీవించుటను ఊహించుము! సంపూర్ణంగా సాగుచేయబడి, సుందరమైన మైదానములు, అందముగా కత్తెరించబడిన మొక్కలుగల పచ్చని భూమిపై—నీ భూమిపై— నివసించుటను ఊహించుము. ఆహ్లాదమునిచ్చు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన గాలిని పీల్చుటను ఊహించుము. ఆధునిక నాగరికత సృష్టించిన కర్కశమైన శబ్దములను కాదుగాని, ఉపశమనమునిచ్చు ప్రకృతిలోని శబ్దములను వింటున్నట్లు ఊహించుము. నిజమే, కొందరు అదృష్టవంతులు ఇప్పటికే కొద్దిపాటి పరిమాణములో వీటిలో కొన్నింటిని అనుభవించుచున్నారు. కాని, దేవుని రాజ్యము క్రింద శాంతియుత జీవన పరిస్థితులను అందరూ అనుభవించెదరు. ఇక పేదవారు, ఆకలిగొనువారు, అభాగ్యులు ఉండరు.—కీర్తన 72:13, 14, 16.

బైబిలు ఇంకనూ “భక్తిహీనులు దేశములోనుండకుండ నిర్మూలమగుదురు” అని వాగ్ధానము చేయుచున్నది. (సామెతలు 2:22) అనగా నేరము నిర్మూలించబడునని అర్థము. నీ బిడ్డ ఆడుటకు బయటికి వచ్చినట్లయితే, పిల్లలపై అత్యాచారము జరుపువారు లేక వారిని ఎత్తుకు పోయేందుకు పొంచియుండేవారు, త్రాగి కార్లను అదుపు తప్పినడిపేవారు, మాదక ద్రవ్యాల పిచ్చితో తిరుగాడు యౌవనులగూర్చి నీవు చింతపడనక్కరలేదు. నీ పిల్లలు పరిపూర్ణ భద్రత రక్షణతో ఆడుకొందురు.

శాంతి మరియు నీ వ్యక్తిగత క్షేమము

చివరిగా, వ్యక్తిగత క్షేమము అను అంశముంది. పరదైసు పరిస్థితులు సహితం కేన్సరు బాధను లేదా కీళ్లనొప్పులను తీసివేయజాలవు. అందుచేత నిజమైన శాంతి రోగమును అనారోగ్యమును, మరణమును నిర్మూలించవలెను. అది సాధ్యమగునా? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మానవ రుగ్మతలపై తనకున్న అధికారమును అనేక పర్యాయములు ప్రదర్శించెను. (మత్తయి 8:14-17) పరలోక ఉన్నత స్థానమునుండి క్రీస్తు భూగోళమంతా అద్భుతములు చేయగలడు! బైబిలు వాగ్ధానము చేయుచున్నది. ఆ కాలమున “గుడ్డివారి కన్నులు తెరువబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును.”—యెషయా 33:24; 35:5, 6.

అయితే, మానవుని దుఃఖపరిస్థితులకు వ్యతిరేకంగా క్రీస్తు జరుపు పోరాటము అంతటితో ఆగిపోదు. క్రీస్తు రాజ్యాధికారమును గూర్చి అపొస్తలుడైన పౌలు వర్ణించెను: “ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపచేయబడు శత్రువు మరణము.” (1 కొరింథీయులు 15:25, 26) అనగా ఆదినుండి మానవజాతిపై మరణము తీసుకు వచ్చిన వినాశనము తీసివేయబడును. యేసుక్రీస్తు తానే వివరించినట్లు: “ఒక కాలము వచ్చుచున్నది. ఆకాలమును సమాధులలోనున్నవారందరు ఆయన [క్రీస్తు] శబ్ధమును విని బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) వ్యసనముతో కూడిన పరిస్థితులందు జీవించి చనిపోయిన లక్షలాదిమంది ఆవిధంగా రాబోవు ప్రపంచశాంతిలో పాలుపొందు అవకాశమును పొందగల్గుదురు.

నీవు దానిలో భాగము కల్గియుందువా? ఈ విషయమును గూర్చి బైబిలు బోధించుదానిని ఇంకను ఎక్కువ నేర్చుకొనుటకు యెహోవా సాక్షులు నిన్ను అర్థించుచున్నారు.b ప్రపంచశాంతికొరకైన నిరీక్షణ ఎంతో ఉత్తేజమును కల్గించునది, ఎంతో నిజమైనది, అలక్ష్యము చేయరానిది. దేవునివాక్యమును నేర్చుకొనుటకును ఆచరణలో పెట్టుటకును, నిన్ను నీవు వెచ్చించుకొన్నట్లయితే “సమాధానకర్తయగు దేవుడు నీకు—నిరంతరము—తోడైయుండునని” నిశ్చయతను కలిగియుండుము!—ఫిలిప్పీయులు 4:9. (w90 4/15)

[అధస్సూచీలు]

a అక్షరార్థంగా “నీ సహోదరుల శాంతిని, మందయొక్క శాంతిని చూచిరమ్ము.”

b ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాసినట్లయిన ఉచిత గృహ బైబిలు పఠనము ఏర్పాటు చేయబడును.

[5వ పేజీలోని చిత్రాలు]

యెహోవా “భూదిగంతములవరకు” యుద్ధములు మాన్పివేయును

[క్రెడిట్‌ లైను]

USAF Official Photo

[6వ పేజీలోని చిత్రాలు]

భర్తలు మరియు భార్యలు ఒకరితో ఒకరు సమాధానముతో వ్యవహరించుటకు బోధించబడుదురు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి