శాంతి నిరాయుధీకరణ వలన వచ్చునా?
“నిరాయుధీకరణను శాంతితోకలుపుట ఒకగొప్ప పొరపాటైయున్నది.” రెండవ ప్రపంచ యుద్ధములో అనేక దేశములు దూకుటకు ఐదు సంవత్సరముల ముందు విన్‌స్టన్ చర్చిల్ అట్లు చెప్పెను. ఆయన ఇంకా “మీరు శాంతి గలవారైతే నిరాయుధీకరణను అవలంభింతురనెను.”
ఎంతటి విరుద్ధమైన ప్రకటన! శాంతిని హామీగా ఇవ్వనప్పుడు ఎవరు అస్త్రసన్యాసముచేసి తమకు ముప్పు తెచ్చుకొందురు? యుద్ధముకొరకు ఆయుధములు కోకొల్లలుగా దాచినప్పుడు నిజమైన సమాధానము ఎట్లు వచ్చును? ఇట్టి పరిస్థితులలో రాజకీయనాయకులు ఎన్నటికిని దీనికి మార్గము కనుగొనలేరు.
రెండు సంవత్సరముల క్రితము నానాజాతి సమితి అస్త్రసన్యాసమును గురించిన సమ్మేళనమును ముగించిన తరువాత 1934లో విన్‌స్టన్ చర్చిల్ పైవిధముగా వ్యాఖ్యానించెను. ఈ సమ్మేళనము ఏర్పరచుటకు 12 సంవత్సరములు పట్టినది. దాని సంకల్పమేమనగా ఐరోపా వారు తిరిగి ఆయుధము కలిగియుండకుండా నిరోధించుటయే. అనేక మంది పౌరులు మరణించుట, లక్షలకొలది సైనికులు గాయపడుటతో పాటు 90 లక్షల సైనికుల భయంకరమైన హత్యాకాండ మొదటి ప్రపంచ యుద్ధము నందు జరుగుటను భూవ్యాప్తముగా నున్న ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకొనేయున్నారు. అయినను నిరాయుధీకరణ ఎన్నటికిని పనిచేయలేదు. ఎందుకు?
నిరాయుధీకరణకు ప్రయత్నములు
నిరాయుధీకరణ సూత్రము ప్రవేశ పెట్టబడినను, అది చాలా అరుదుగా ప్రతిభావంతముగా అమలుచేయబడుతుంది. ఉదాహరణకు, 1919 వెర్సల్లెస్ ఒప్పందము ప్రకారము జర్మనీ అస్త్రసన్యాసము చేసినది. ఎందుకనగా “సరిపోయినంత అభయము దానికి ఇవ్వబడినది మరియు తమ దేశపు అంతరంగిక రక్షణకు “సరిపోయినంత తక్కువగా జాతీయ ఆయుధ ఉత్పత్తి తగ్గింపబడినది.” ఇది యు.యస్. అధ్యక్షులలో ఒకడైన ఉడ్రోవిల్సన్ చెప్పిన దాని కనుగుణంగా ఉండి నానాజాతి సమితి నిబంధనలలో 8వ ఆర్టికల్ నందు పొందుపరచబడినది. అయితే హిట్లర్ అధికారమునకు వచ్చినప్పుడు అతడు వెంటనే ఈ సూత్రమును తిరస్కరించెను.
రెండవ ప్రపంచ యుద్ధము తరువాత నిరాయుధీకరణను విజయవంతముగా అమలు జరుపుటకు సరియైన పునాదిని ఐక్యరాజ్యసమితి వేయగలిగినదా? లేదు. దాని విఫలతకు కారణము దృఢమైన ప్రయత్నము లేక కాదు. నేడు జనసమూహములను ఒక్కసారే నాశనముచేయగల న్యూక్లియర్ ఆయుధములు లభ్యమవుచుండగా నిరాయుధీకరణ త్వరగా తీసుకొనవలసిన గొప్ప విషయమైయున్నది. దిన్యూ ఎన్‌సైక్లొపీడియా బ్రిటానిక ఇట్లు చెప్పుచున్నది: “ఆయుధముల పరుగు ఆర్థికంగా తగినదికాదు మరియు అది ఎటులైనను యుద్ధమునకు నడిపించునను ఇంతకు ముందున్న భావన ఇప్పుడు తీసి వేయబడి దానికి బదులుగా భవిష్యత్తులో ఉపయోగించు అణు ఆయుధముల వలన మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది అనునది చోటుచేసికొనినది.”
తూర్పు పశ్చిమ ఆయుధ పరుగును నిరోధించుటకు 1952లో 12-దేశములతో కూడిన నిరాయుధీకరణ కమీషన్ ఏర్పాటు చేయబడినది. అది ముందుకు పోవుటలో విఫలమైనది మరియు క్రమేణా రెండు గొప్పశక్తివంతమైన దేశములు ఒకదానికొకటి విరుద్ధముగా ఇంకా ఆయుధములు గురిపెట్టుకొనియున్నవి. నేటివరకు అనేకరకముల ఒప్పందములు, అంగీకారములు కుదుర్చుకొనబడినవి. అయినను, ఒకరియెడల మరొకరికి నమ్మకములేని పరిస్థితి తమ యుద్ధాయుధములు పూర్తిగా నిషేధించుటకు అనుమతించలేదు. కనుకనే బ్రిటానిక క్రొత్త సర్వసంగ్రహ నిఘంటువు దీనిని గూర్చి “అది భ్రమతో ఆలోచించువారు చేయు వాదన” అని చెప్పుచున్నది.
వెలను లెక్కించుట
ఆయుధములు విసర్జించుటా లేక చేబూనుట వీనిలో ఇమిడియున్న వెల ఎంత? వెల అనేది ఎప్పుడూ డబ్బు రూపేణ లెక్కింపబడదు. ఆయుధములను ఉత్పత్తిచేయు కర్మాగారములలోనున్న ఉద్యోగమును కూడా మొదటగా ఆలోచించవలెను. అనేక దేశములలో వసూలైన పన్నులను ఆయుధములు కొనుగోలు చేయుటకు ఉపయోగించుచున్నందున, వాటిని వసూలు చేయుటకు ఉద్యోగులు అవసరము. కావున అస్త్రసన్యాసము నిరుద్యోగమును తెచ్చును. అందువలననే సైనిక అవసరతలకు భారీగా పెట్టుబడులు పెట్టిన దేశములు పూర్తిగా అస్త్రసన్యాసమను మాటకు వణకుచున్నవి. అటువంటి ఆలోచనవారికి ఒక పీడకలలాగా ఉంటుంది.
అయినను యుద్ధయంత్రములను నడుపుటలో ఇమిడియున్న గొప్పధనమును మనము నిర్లక్ష్యము చేయలేము. ప్రపంచపు మొత్తము ఉత్పత్తిలో 10 శాతము యుద్ధాయుధములపై వ్యయపరచబడుచున్నదని అంచనావేయబడినది. అది ఎంత మొత్తము? ఖచ్చితమైన సంఖ్యలు ద్రవ్యొల్భణము వలన మారవచ్చును. అయినను ఆలోచించండి. రోజులో ఉన్న ప్రతినిముషమునకు పదిలక్షల పౌండ్లు (అనగా 15 లక్షల 40 వేల అమెరికన్ డాలర్లు) ఖర్చగుచున్నవి. అదే మొత్తము మీచేతిలో ఉంటే మీరు ముందుగా వేటిని ఎన్నుకుంటారు? కరువు నివారించుటకు? ఆరోగ్యమును సంరక్షించుటకు? శిశు సంక్షేమమునకు? ప్రకృతిసిద్ధ వాతావరణమును పునరుద్ధరించుటకు? చేయవలసినది ఇంకా ఎంతో ఉన్నది!
ఉదాహరణకు “టాంకులనుండి ట్రాక్టర్లకు” అను కార్యక్రమము ఈ మధ్యనే యు.యస్.యస్.ఆర్. లో ప్రకటింపబడినది. ఇక్కడ కొన్ని యుద్ధాయుధములు తయారుచేయు కర్మాగారములు, 200 రకముల వ్యవసాయ-పరిశ్రమకు ఉపయోగపడు అత్యాధునికమైన సామాగ్రిని ఉత్పత్తిచేయు కర్మాగారములుగా మార్చబడినవి. ఎందుకని వ్యవసాయ సామగ్రివారికి అత్యవసరమైనది? ఎందుకనగా బ్రిటన్ యొక్క ఫార్మింగ్ న్యూస్ ప్రకారము “దేశములో పండిన పండ్లలో, కూరగాయలలో మూడవవంతు మాత్రమే వాడకందార్లకు చేరుతుంది. మిగతావి కుళ్లిపోవుటకు పొలములోనే వదలి వేయబడుచున్నవి. లేక రవాణాచేయునపుడు, దాచినపుడు మిగతావి కుళ్ళిపోవుచున్నవి.”
టాంకులకు బదులుగా ట్రాక్టర్లను ఉత్పత్తిచేయుట మెచ్చుకోదగినదే అయినా అది అసాధారణమైనది గనుక పత్రికల ప్రముఖ వార్తలలో చోటుచేసుకున్నది. ఇంకా దీని ప్రభావము మొత్తము యుద్ధాయుధముతో పోల్చితే అతి స్వల్పము. యేసుక్రీస్తు ముందుగా ప్రవచించినట్లుగా “నివాసయోగ్యమైన భూమిమీదకు రాబోవు వాటివిషయమై ఎదురుచూచుచు మనుష్యులు ధైర్యము చెడి కూలు” ఈ ప్రపంచములో ఇంకా లెక్కించలేనన్ని వందలకోట్ల పౌండ్లు, రూబుళ్ళ, మరియు డాలర్లు యుద్ధాయుధములపై వెచ్చింపబడుతున్నాయి. ఈ భయమును చెదరగొట్టుటెట్లు? పూర్తి అస్త్రసన్యాసము కేవలము కలలాగానే మిగిలిపోవునా? లేనట్లయితే దానిని తెచ్చుటకు అవసరమైనదేది?—లూకా 21:26 NW. (w89 12/15)