దేవుడు అన్యాయమును గూర్చి ఎప్పుడైన ఏమైన చేస్తాడా?
“అది న్యాయము కాదు.” వ్యక్తిగతముగా తనకు న్యాయము త్రిప్పివేయబడుటను అనుభవించిన తరువాత ఒక యౌవన విధ్యార్థిని మహాకోపముతో కలత చెందినదై “నిజంగా దేవుడుంటే ఇటువంటి అన్యాయమును ఆయన ఎట్లు అనుమతిస్తాడు?” అని అడిగింది. ఈ యౌవన స్త్రీ మనోభావము యెడల నీవు సానుభూతి చూపియుందువా? బహుశా అట్లు చేయుదువు. అయితే ఆమె అభ్యంతరమునకు నీవు సమాధానమును కూడా ఇచ్చియుందువా?
పిల్లవానిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు నీవు నీ తల్లిదండ్రులవలన అన్యాయముగా చూడబడితివని భావించియుండవచ్చును. అయితే స్పష్టమైన రీతిలో అన్యాయముగా కనిపించిన ఆసంగతి వారు ఉనికిలో లేరని రుజువుపరచదు? అట్లు చేసినదా? అలాగే, దేవుడు అన్యాయమును అనుమతించటమనేది ఏ విధముగానైనను ఆయన ఉనికిలోలేడని నిరూపించదు.
అయితే యౌవన విద్యార్థిని ఇది పూర్తిగా భిన్నమైన విషయమని జవాబిచ్చెను. అసంపూర్ణుడైన మానవ తండ్రి కొద్దిగా తనమట్టుకు తానే అన్యాయమును చేసికొనియుండవచ్చును. లేక వాస్తవములన్ని తెలియకుండుటనుబట్టి అన్యాయమును ఆయన గుర్తించియుండక పోవచ్చును. అంతేగాక మానవ పరిమితులనుబట్టి ఆయన చూచిన అన్యాయమును గూర్చియు ఏమియుచేయుటకు శక్తిలేనివాడైయుండవచ్చును. వీటిలో ఏవియు సర్వజ్ఞానము, సర్వబలము కలిగిన దేవునికి అన్వయించవు అని ఆమె వాదించెను.
అన్యాయమును అనుమతించుట దైవలక్షణములకు తగినది కాదని నీవును భావించవచ్చును. అయినను, అత్యున్నత జ్ఞానముతో కొంత దీర్ఘకాలము అన్యాయమును అనుమతించుటకు దేవుడు పొగడదగిన కారణమును కలిగియున్నాడా?
బైబిలు వ్రాతగాళ్లు దేవుని “నీతిని మరియు న్యాయమును ప్రేమించు వానిగా” ఎంచిరి. “ఆయన మార్గములన్నియు న్యాయములు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన యందు అన్యాయము లేదని” మోషే వ్రాసెను.—కీర్తన 33:5; ద్వితీయోపదేశకాండము 32:4, NW; యోబు 37:23.
యెహోవాను అన్యాయమందు ఆనందించని దేవునిగా చూచుటయే గాక ఒక దినమున దానిని ఆయన తీసివేయుననియు అంగీకరించిరి. ఉదాహరణకు ఈ పరిస్థితిని యెషయా ఇట్లు ప్రవచించెను: “ఆలకించుడి! రాజు నీతిని బట్టి రాజ్యపరిపాలన చేయును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫల భరితమైన భూమిలో నీతి నివసించును.” (యెషయా 32:1, 16) అయితే ఎప్పుడు? అన్యాయముతో నిండిన లోకమును తీసివేయాలని దేవుడు కోరినట్లయిన, అసలు మొదట ఆయన దానిని ఎందుకు అనుమతించెను?
అన్యాయము—ఎదుకు అనుమతించబడెను?
విశ్వములో ఎక్కడను అన్యాయము ఉండని ఒక సమయముండెను. కేవలము అపవాదియగు సాతాను వత్తిడిక్రింద ఆదాము హవ్వలు తిరుగుబాటు చేసినప్పటినుండియే మానవజాతికి అన్యాయము తెలిసినది. ఆ తిరుగుబాటు సమయములో సాతాను వెంటనే నాశనము చేయబడలేదు. తన స్వంత మంచి ఉద్దేశ్యమును బట్టియే దేవుడు, మానవుడు అన్యాయమును జరిగించు సమయమును అనుమతించెను. తనకు అర్పించుకొన్నవారెవరో పరీక్షించుటకు, అనగా వారు ఆయనకు నమ్మకస్థులుగా నిరూపించుకొందురా అని మానవజాతికి ఆయన కొంత సమయమును అనుమతించియున్నాడు. వారు యథార్థపరులుగా నిరూపించుకొనుటకు ఎన్నుకొనుటయనునది దేవునికి వ్యతిరేకముగా మానవసృష్టినంతటిని త్రిప్పు సాతాను సామర్థ్యమును తిరస్కరించుటయై యుండును. ఆ విధముగా దేవుని సార్వభౌమాధిపత్యము సరైనదని నిరూపించబడి సాతాను క్రియలన్నియు నాశనము చేయబడి, సమస్త అన్యాయము తీసివేయబడును.
ఆ సమయమునకు లోపల అన్యాయముగా ప్రవర్తించుటనుండి దేవుడు ప్రజలను ఆపినట్లయిన వారు కలిగియున్న ఎన్నుకొను స్వాతంత్ర్యమును ఆయన నిరోధించినట్లగును. మరొకప్రక్కన ఇతరుల పనులను బట్టి అన్యాయపు ఫలితములను అనుభవించులాగున ప్రజలను అనుమతించుటనుబట్టి దైవిక చట్టముల స్థానములో తమ స్వంత లోపపూరితమైన ప్రమాణములను పెట్టుచు ఆదాము హవ్వలు తిరుగుబాటుచేయుట ఎంతటి హానికరమో దేవుడు వివరించుచున్నాడు. తాము విత్తినదానిని కోయుటకు మానవజాతిని అనుమతించుట ద్వారా విషయములను దేవుని మార్గమందు చేయుట ఎంత ఉన్నతమైనదో గుర్తించునట్లు దేవుడు యథార్థపరులైన మానవులకు సహాయము చేయుచున్నాడు.—యిర్మీయా 10:23; గలతీయులు 6:7.
దానికి తోడుగా వ్యక్తులు చేయు న్యాయ మరియు అన్యాయ క్రియలు దాగియున్న సాక్ష్యమును వెల్లడిపరచును. పూర్తి న్యాయము భూమిపై తిరిగి స్థాపించబడినప్పుడు నూతన లోకములో భూమిపై జీవించుటకు యోగ్యులైన వారిగా తీర్పుతీర్చుటకు ఈ క్రియలు దేవునికి ఆధారమును కలుగజేయును. దానిని సూచించు దానిని మనమిట్లు చదువుదుము: “దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణము నెందడు, అవశ్యముగా అతడు బ్రతుకును.”—యెహెజ్కేలు 18:21.
అన్యాయము ఎప్పుడు అంతమొందును?
మానవజాతితో యెహోవా దేవుని వ్యవహారములన్నియు ఎల్లప్పుడు న్యాయము మరియు ప్రేమగల దయతో గుర్తించబడియున్నవి. దానిని వివరిస్తూ, దేవుని నమ్మకమైన దాసుడగు అబ్రాహాము ఎందుకు ఒక విషయము అలా జరుగుచున్నది అర్థము చేసుకొనలేక పోయినప్పుడు దేవుని గూర్చి ఆయన ఇట్లు చెప్పెను: “ఆ చొప్పునచేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?” (ఆదికాండము 18:25) క్రీస్తు రాకతో దేవుని లక్షణములైన న్యాయము, ప్రేమగల దయ పెద్దగా కనపడెను. యేసు క్రీస్తు ద్వారా ఏర్పాటుచేయబడిన విమోచన క్రయధన ఏర్పాటు యూదునికి, యూదుడు కానివానికి సమానముగా నిత్యజీవమునకు మార్గము తెరచెను. ఇది పేతురును ఇట్లు చెప్పుటకు నడిపెను: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతిజనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.
దేవుని మెస్సియా రాజు తన పరిపాలనను ప్రారంభించెననియు, పరిపూర్ణమైన ప్రమాణములో మనభూమికి న్యాయము తిరిగి స్థాపించబడుననియు ప్రకటించుటలో యెహోవా సాక్షులు చురుకుగా ఉన్నారు.a ఆ రాజు ప్రస్తుత అన్యాయపు లోకమును నాశనముచేసి, దాని అదృశ్య దేవుని శక్తిని పగలగొట్టినపుడు ఇది నెరవేర్చబడును. ఇది త్వరలోనే “సర్వాధికారియగు దేవుని యుద్ధ దినమున” అనగా సాధారణముగా ఆర్మగెద్దోను అని పిలువబడు దానియందు త్వరలో సంభవించునని బైబిలు చూపుచున్నది.—ప్రకటన 16:14, 16.
“ఉగ్రతను చూపించునప్పుడు దేవుడు అన్యాయస్థుడు కాడు” గనుక ఆర్మగెద్దోను న్యాయమైన యుద్ధమైయుండును. (రోమీయులు 3:5, NW) ఆ తరువాత క్రీస్తుయేసు తన సహ పరిపాలకులు, అనగా అపొస్తలులు మొదలగువారు పరలోకమునుండి వెయ్యి సంవత్సరములు పరిపాలన చేయుదురు. (ప్రకటన 20:4) అన్యాయమును అనుభవించిన లక్షల ప్రజలు తమ జీవితములలో మొదటిసారిగా పరిపూర్ణమైన న్యాయమును అనుభవించుటకు మానవజాతి తొలిగృహమగు, భూమిపైకి నీతియుక్తమైన విధానములో పునరుత్థానమగుదురు.
“దేవునియందు అన్యాయము కలదా?”
దేవుని వ్యవహారములలో ఒకదానిని గూర్చి అపొస్తలుడైన పౌలు ఆ ప్రశ్ననడిగెను. అయితే దానికి జవాబు ఏమిటి? పౌలు, “అట్లనరాదు” అని వ్రాసెను. కుమ్మరివానిచే ఉగ్రతాపాత్రమైన ఘటములుగాను లేక కరుణాపాత్రమైన ఘటములుగాను చేయబడు మట్టికి మానవులను పోల్చుతూ పౌలు ఇట్లు వివరించెను: “దేవుడు తన ఉగ్రతను మరియు శక్తిని చూపుటకు సిద్ధముగా ఉండియు నాశనమునకు పాత్రులై తనకు కోపము కలుగజేయునట్టి ప్రజలను ఆయన ఓపికతో సహించుచున్నాడు. ఎందుకనగా ఇతరులను బట్టి, అనగా ఎవరి యందు ఆయన తన మహిమైశ్వర్యమును కనపరచవలెనని కోరుచున్నాడో వారిని బట్టియు, మరియు తాను కరుణించగోరువారిని బట్టియు వారిని సహించుచున్నాడు.”—రోమీయులు 9:14, 20-24, ది జెరూషలేము బైబిలు.
తొలుత చెప్పబడిన యౌవన విధ్యార్థినివలె సాధారణముగా లేక ఒక ప్రత్యేక తప్పిదమందు దేవుడు అన్యాయమును ఎందుకు అనుమతించాడో అర్థము చేసికొనుటను నీవు కష్టముగా కనుగొనవచ్చును. అయితే తనచే రూపించబడిన మనము ఆయన ఓపికను మరియు అట్లు చేయుటలోని ఆయన జ్ఞానమును ప్రశ్నించుటకు మనమెవరము? యెహోవా దేవుడు యోబుతో ఇట్లు చెప్పెను: “నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దొషివని నీవు తీర్పుపొందుటకై నామీద అపరాధము మోపుదువా?”—యోబు 40:8.
ఎన్నటికిని ఆ దోషము మనపైకి వచ్చుటకు మనము యిష్టపడము. బదులుగా అన్యాయము మన వెంట ఉన్నను న్యాయవంతుడైన దేవుడు త్వరలో భూమియంతటి నుండి దానిని తీసివేయునని తెలుసుకొనుటయందు ఆనందింతుము. (w89 10/15)
[అధస్సూచీలు]
a దేవుని రాజ్యము భూమిపై దాని అదృశ్యపరిపాలనను 1914లో ప్రారంభించియున్నదను రుజువుకొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ వారిచే ప్రచురించబడిన యుకెన్ లివ్ ఫరెవర్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్, అను పుస్తకము పేజీలు 134-41 చూడుము. ఈ పుస్తకము “దేవుడు దుష్టత్వము నెందుకు అనుమతించెను?” అను అంశముపై ఒక అధ్యాయమును కూడ కలిగియున్నది.
[31వ పేజీలోని చిత్రాలు]
అన్యాయము అనుమతించబడుట అనేది దేవుడు ఉనికిలో లేడనుదానిని ఏ విధముగానైనను రుజువుచేయుటకు ఉపయోగించబడజాలదు
సామాన్యమైన ఇంగిత జ్ఞానము, వ్యక్తిగత నిగ్రహము, మరియు పరిస్థితిని గమనించుకొనునట్టి లక్షణములను ప్రయోగించుటకు ధిక్కరించు త్రాగినడుపు డ్రైవరు విషయములో అపరాధము దేవునిదా?
మన భూమిపై సంపూర్ణ న్యాయము తిరిగి స్థాపించబడుటకు సమయము సమీపించి యున్నది