కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 12 పేజీలు 118-127
  • “దేవుడు అన్యాయస్థుడా?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుడు అన్యాయస్థుడా?”
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాకు అన్యాయం అంటే చెడ్డ చిరాకు
  • అసలైన సమస్య
  • మనుషుల యథార్థతకు సాతాను వంకలు పెట్టాడు
  • యెహోవా న్యాయం ఎందుకు గొప్పది?
  • యెహోవా న్యాయం మీద నమ్మకం ఉంచండి
  • దేవుడు అన్యాయమును గూర్చి ఎప్పుడైన ఏమైన చేస్తాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • అన్యాయాన్ని మీరు సహించగలరు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • అన్యాయం జరిగితే ఏం చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 12 పేజీలు 118-127
సొదొమ, గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిసినప్పుడు లోతు, అతని ఇద్దరు కూతుర్లు సోయరుకు క్షేమంగా చేరుకుంటున్నారు.

అధ్యాయం 12

“దేవుడు అన్యాయస్థుడా?”

1. అన్యాయాన్ని చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది?

విధవరాలైన ముసలమ్మను మోసం చేసి, ఆమె దాచుకున్న సొమ్మంతా దోచుకుపోయారు. మనసులేని ఒక తల్లి, అప్పుడే పుట్టిన తన పసికందును రోడ్డు పక్కన వదిలేసింది. చేయని నేరానికి ఒకాయన్ని జైల్లో పడేశారు. ఇవన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మనందరికీ చాలా బాధేస్తుంది కదా. అది సహజమే. మనుషులుగా మనకు ఏది మంచి, ఏది చెడు అని ఒక అభిప్రాయం ఉంటుంది. అన్యాయాన్ని చూసినప్పుడు మనకు ఒళ్లు మండిపోతుంది. నేరస్తుడికి శిక్ష పడాలని, అన్యాయం జరిగినవాళ్లకు న్యాయం జరగాలని మనం కోరుకుంటాం. ఒకవేళ అలా జరగకపోతే, ‘ఇదంతా దేవుడికి కనిపించట్లేదా? ఆయన ఎందుకు ఏమీ చేయట్లేదు?’ అని మనకు అనిపిస్తుంది.

2. అన్యాయాన్ని చూసి హబక్కూకు ఏమన్నాడు? ఆయన అలా అడిగినందుకు యెహోవా ఎందుకు కోప్పడలేదు?

2 చరిత్ర మొత్తంలో, కొంతమంది నమ్మకమైన యెహోవా సేవకులు అలాంటి ప్రశ్నలే అడిగారు. ఉదాహరణకు, హబక్కూకు ప్రవక్త దేవునికి ఇలా ప్రార్థించాడు: “నన్నెందుకు దుష్టత్వాన్ని చూడనిస్తున్నావు? అణచివేతను నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? నాశనం, దౌర్జన్యం ఎందుకు నా కళ్లముందు ఉన్నాయి? గొడవలు, కొట్లాటలు ఎందుకు ఎక్కువౌతున్నాయి?” (హబక్కూకు 1:3) ఇలా అడిగినందుకు యెహోవా హబక్కూకు మీద కోప్పడలేదు. ఎందుకంటే, అసలు న్యాయం అనే ఆలోచనను మనుషుల్లో పెట్టిందే యెహోవా. అవును, యెహోవా అంత కాకపోయినా మనలో కూడా కొంచెం న్యాయం ఉంది.

యెహోవాకు అన్యాయం అంటే చెడ్డ చిరాకు

3. అన్యాయం గురించి మనకన్నా ఎక్కువ యెహోవాకే తెలుసని ఎందుకు చెప్పవచ్చు?

3 యెహోవా కళ్లకు గంతలు లేవు, జరుగుతున్న ప్రతీదాన్ని ఆయన చూస్తాడు. నోవహు రోజుల గురించి బైబిలు ఇలా చెప్తుంది: “భూమ్మీద మనుషుల దుష్టత్వం చాలా ఎక్కువగా ఉందని, వాళ్ల హృదయంలోని ఆలోచనలన్నీ ఎప్పుడూ చెడువైపే మొగ్గుచూపుతాయని యెహోవా గమనించాడు.” (ఆదికాండం 6:5) ఆ మాటల అర్థమేంటో ఆలోచించండి. మనం విన్న లేదా మనకు జరిగిన ఒకటి-అర అన్యాయాలే మనకు తెలిసి ఉండవచ్చు. కానీ యెహోవా భూమంతటా జరుగుతున్న అన్యాయాల్ని చూస్తాడు. ఏ మూలన ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు! దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, యెహోవా ఆ అన్యాయాలకు కారణమైన చెడ్డ ఆలోచనల్ని కూడా గమనించగలడు.—యిర్మీయా 17:10.

4, 5. (ఎ) అన్యాయానికి బలైనవాళ్లను యెహోవా పట్టించుకుంటాడని బైబిలు ఎలా చూపిస్తుంది? (బి) స్వయంగా యెహోవాకే ఎలాంటి అన్యాయం జరిగింది?

4 యెహోవా అన్యాయాన్ని గమనించడమే కాదు, దానికి బలైనవాళ్లను పట్టించుకుంటాడు కూడా. తన ప్రజల్ని శత్రు జనాంగాలు హింసించినప్పుడు, యెహోవాకు చాలా బాధేసింది. “తమను అణచివేస్తున్న వాళ్ల కారణంగా, తమతో క్రూరంగా ప్రవర్తిస్తున్న వాళ్ల కారణంగా ప్రజలు మూల్గుతుండడం చూసి” ఆయన జాలిపడ్డాడు. (న్యాయాధిపతులు 2:18) మీరు గమనించే ఉంటారు, ప్రజలు అన్యాయాన్ని ఎక్కువగా చూసేకొద్దీ వాళ్ల మనసు మొద్దుబారిపోయి, ఇక అది వాళ్లకు తప్పుగా అనిపించదు. కానీ యెహోవా విషయమైతే అదికాదు! ఆయన దాదాపు 6,000 సంవత్సరాలుగా, భూమంతటా జరుగుతున్న అన్యాయాల్ని చూస్తున్నాడు. అయినా, అన్యాయం విషయంలో ఆయన అభిప్రాయం కొంచెం కూడా మారలేదు. “అబద్ధాలాడే నాలుక, అమాయకుల రక్తం చిందించే చేతులు, . . . నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పే దొంగ సాక్షి” యెహోవాకు అసహ్యమని బైబిలు మనకు భరోసా ఇస్తుంది.—సామెతలు 6:16-19.

5 యెహోవాకు అన్యాయం అంటే ఎంత చిరాకో, ఆయన ఇశ్రాయేలీయుల్లోని అన్యాయస్థులైన అధిపతులతో అన్న మాటల్ని బట్టి అర్థమౌతుంది. “మీకు న్యాయం తెలిసుండాలి కదా?” అని ఆయన తన ప్రవక్త ద్వారా అడిగించాడు. వాళ్లు అధికారాన్ని ఎలా తప్పుగా ఉపయోగిస్తున్నారో కొన్ని పోలికలు చెప్పాక, చివరికి వాళ్లకు ఏమౌతుందో కూడా యెహోవా చెప్పాడు. “వాళ్లు సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తారు, కానీ ఆయన వాళ్లకు జవాబివ్వడు. వాళ్ల చెడ్డపనుల్ని బట్టి, ఆ సమయంలో ఆయన వాళ్లకు కనిపించకుండా తన ముఖాన్ని తిప్పుకుంటాడు.” (మీకా 3:1-4) నిజంగా, యెహోవాకు అన్యాయం అంటే ఎంత కంపరమో కదా! ఎవరిదాకో ఎందుకు, స్వయంగా యెహోవాయే అన్యాయాన్ని అనుభవించాడు! కొన్ని వేల సంవత్సరాలుగా, సాతాను అన్యాయంగా ఆయన మీద నిందలేస్తున్నాడు. (సామెతలు 27:11) దానికి తోడు, యెహోవాకు జరిగిన అన్నిటికన్నా పెద్ద అన్యాయం ఏంటంటే, ‘ఏ పాపం చేయని’ తన సొంత కుమారుడు ఒక నేరస్తుడిలా చనిపోవడం. (1 పేతురు 2:22; యెషయా 53:9) అవును, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి, యెహోవా అన్యాయానికి బలైనవాళ్ల బాధను చూస్తాడు, వాళ్లను ఖచ్చితంగా పట్టించుకుంటాడు.

6. అన్యాయం జరిగినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు?

6 అయినా, మనం అన్యాయాన్ని చూసినప్పుడు లేదా మనకే అన్యాయం జరిగినప్పుడు, కోపం-బాధ రావడం సహజమే. ఎందుకంటే, దేవుడు మనల్ని తన స్వరూపంలో చేశాడు. ఆయనలో అన్యాయం రవ్వంత కూడా లేదు. (ఆదికాండం 1:27) అలాంటప్పుడు, యెహోవా అన్యాయాన్ని ఎందుకు తీసేయట్లేదు?

అసలైన సమస్య

7. యెహోవా పేరుకు, ఆయన పరిపాలించే విధానానికి ఏ సవాలు ఎదురైంది? వివరించండి.

7 ఆ ప్రశ్నకు జవాబు తెలియాలంటే, మనం అసలైన సమస్య దగ్గరికి వెళ్లాలి. మనం ముందే చూసినట్టు, సృష్టికర్తగా యెహోవాకు భూమిని, అందులో ఉన్న వాళ్లందర్నీ పరిపాలించే హక్కు ఉంది. (కీర్తన 24:1; ప్రకటన 4:11) కానీ మనుషులు సృష్టించబడిన కొత్తలో, ఒకరు ఆయన పేరు మీద బురద చల్లి, ఆయన పరిపాలనా విధానాన్ని సవాలు చేశారు. అసలు ఏం జరిగింది? యెహోవా మొదటి మనిషైన ఆదాముతో, ఏదెను తోటలో ఫలానా చెట్టు పండు తినొద్దని చెప్పాడు. ఒకవేళ తింటే “నువ్వు ఖచ్చితంగా చనిపోతావు” అని కూడా చెప్పాడు. (ఆదికాండం 2:17) ఆ ఆజ్ఞను పాటించడం ఆదాముకు గానీ, అతని భార్య అయిన హవ్వకు గానీ అసలు కష్టమే కాదు. అయినప్పటికీ, దేవుడు లేనిపోని నియమాలు పెట్టి వాళ్ల చేతులు కట్టేస్తున్నాడని హవ్వ అనుకునేలా సాతాను నమ్మించాడు. ఒకవేళ ఆమె ఆ చెట్టు పండు తింటే ఏమౌతుంది? సాతాను ఇలా అబద్ధం చెప్పాడు: “మీరు చావనే చావరు. మీరు దాని పండ్లను తిన్న రోజునే మీ కళ్లు తెరుచుకుంటాయని, మీకు మంచిచెడులు తెలిసి మీరు దేవునిలా అవుతారని దేవునికి తెలుసు.”—ఆదికాండం 3:1-5.

8. (ఎ) సాతాను ఏ విషయాన్ని చెప్పకనే చెప్పాడు? (బి) దేవుని పేరు గురించి, ఆయన సర్వాధిపత్యం గురించి సాతాను ఏ సవాలు చేశాడు?

8 అలా, యెహోవా హవ్వ దగ్గర ఒక ముఖ్యమైన విషయాన్ని దాచిపెట్టడమే కాదు, అబద్ధం కూడా ఆడాడని సాతాను విషం కక్కాడు. సాతాను మాటలకు హవ్వ బుట్టలో పడిపోయి, యెహోవా స్వభావాన్నే అనుమానించడం మొదలుపెట్టింది. అలా సాతాను యెహోవా పేరు మీద దారుణంగా బురద చల్లాడు. దాంతోపాటు, సాతాను యెహోవా సర్వాధిపత్యాన్ని లేదా పరిపాలించే విధానాన్ని కూడా ప్రశ్నించాడు. యెహోవా సర్వాధిపతి అనే వాస్తవాన్ని సాతాను ప్రశ్నించలేదు గానీ తెలివిగా దేవునికి ఆ హక్కు, అర్హత, సత్తా ఉన్నాయా అని ప్రశ్నించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, యెహోవా సరిగ్గా పరిపాలించట్లేదని, తన పౌరుల మంచి గురించి ఆలోచించట్లేదని సాతాను నిందించాడు.

9. (ఎ) దేవుని మాట వినకపోవడం వల్ల ఆదాముహవ్వలకు ఏం జరిగింది? దానివల్ల ఏ ముఖ్యమైన ప్రశ్నలు తెర మీదికి వచ్చాయి? (బి) యెహోవా ఆదాముహవ్వల్ని, సాతానును అక్కడికక్కడే ఎందుకు నాశనం చేయలేదు?

9 యెహోవా తినొద్దని చెప్పిన చెట్టు పండును తినడం ద్వారా ఆదాము, హవ్వ ఇద్దరూ అవిధేయత చూపించారు. వాళ్ల అవిధేయత వల్ల, దేవుడు ముందే చెప్పినట్టు మరణం అనే శిక్షను పొందారు. సాతాను చెప్పిన అబద్ధం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తెర మీదికి వచ్చాయి. యెహోవాకు మనుషుల్ని పరిపాలించే హక్కు నిజంగా ఉందా, లేక మనుషులే సొంతగా పరిపాలించుకుంటే బాగుంటుందా? యెహోవా తన సర్వాధిపత్యాన్ని సరిగ్గానే ఉపయోగిస్తున్నాడా? కావాలనుకుంటే, యెహోవా తనకున్న అపారమైన శక్తిని ఉపయోగించి ఆ తిరుగుబాటుదారుల్ని అక్కడికక్కడే నాశనం చేయవచ్చు. కానీ ప్రశ్న ఆయన శక్తి గురించి కాదు, ఆయన పేరు గురించి, అందులోనూ ఆయన పరిపాలించే విధానం గురించి. కాబట్టి దేవుడు ఆదాముహవ్వల్ని, సాతానును నాశనం చేసేస్తే, ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. అదీగాక, ఇంకొన్ని కొత్త ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనుషులు సొంతగా పరిపాలించుకోగలరో లేదో తేలాలంటే, దానికి ఒకేఒక్క దారి, దేవుడు వాళ్లకు కొంచెం సమయం ఇవ్వడమే.

10. మనుషుల పరిపాలన గురించి చరిత్ర ఏం రుజువు చేసింది?

10 అలా సమయం ఇవ్వడం వల్ల ఏం తేలింది? గడిచిన వేల సంవత్సరాల్లో, మనుషులు నిరంకుశ పాలన, ప్రజాస్వామ్యం, సోషలిస్టు ప్రభుత్వం, కమ్యూనిస్టు ప్రభుత్వం అంటూ రకరకాల ప్రభుత్వాలతో ప్రయోగాలు చేశారు. తీరా ఏమైంది? బైబిలు ఏం చెప్పిందో అదే జరిగింది: “మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు.” (ప్రసంగి 8:9) యిర్మీయా ప్రవక్త సరిగ్గానే చెప్పాడు: “తాను వెళ్లాల్సిన దారిని మనిషి సొంతగా కనుక్కోలేడని నాకు బాగా తెలుసు. తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి లేదు.”—యిర్మీయా 10:23.

11. మనుషులు బాధలు పడడానికి యెహోవా ఎందుకు ఒప్పుకున్నాడు?

11 మనుషులు దేవుణ్ణి వదిలేసి సొంతగా పరిపాలించుకోవడం వల్ల ఏరికోరి కష్టాల్ని కొని తెచ్చుకుంటారని యెహోవాకు ముందు నుండే తెలుసు. ఆయన తెలిసితెలిసి దీనికి ఒప్పుకోవడం అన్యాయం అని మీకు అనిపిస్తుందా? కానేకాదు! ఇలా ఆలోచించండి: మీ పిల్లాడికి ఒక పెద్ద జబ్బు వచ్చింది, ఆపరేషన్‌ చేయకపోతే బ్రతకడు. ఆపరేషన్‌ వల్ల మీ అబ్బాయి కొంచెం నొప్పి అనుభవించాల్సి వస్తుంది. అది మీకూ బాధే. అయినా సరే, మీరు దానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆపరేషన్‌ చేయించడం వల్ల భవిష్యత్తులో మీ పిల్లాడు ఆరోగ్యంగా ఉంటాడని మీకు తెలుసు. అదేవిధంగా, మనుషులు సొంతగా పరిపాలించుకోవడం వల్ల కొంచెం బాధ, వేదన అనుభవిస్తారని దేవునికి తెలుసు. ఆయన ఆ విషయాన్ని ముందే చెప్పాడు కూడా. (ఆదికాండం 3:16-19) మనుషులు సొంతగా పరిపాలించుకుంటే ఎన్ని ఘోరాలు జరుగుతాయో వాళ్ల కళ్లతో వాళ్లు చూసేలా వదిలేస్తేనే, ఈ బాధలకు-వేదనలకు శాశ్వత ముగింపు తీసుకురావచ్చని ఆయనకు తెలుసు. అప్పుడే ఏదెను తోటలో మొదలైన సమస్య పూర్తిగా, శాశ్వతంగా పరిష్కారం అవుతుంది.

మనుషుల యథార్థతకు సాతాను వంకలు పెట్టాడు

12. యోబు ఉదాహరణ చూపిస్తున్నట్టు, సాతాను మనుషుల మీద ఏ నింద వేశాడు?

12 ఆ సమస్యలో ఇంకో విషయం కూడా ఉంది. సాతాను యెహోవాకున్న పరిపాలించే హక్కును, పరిపాలించే విధానాన్ని ప్రశ్నించడం ద్వారా ఆయన సర్వాధిపత్యానికి, పేరుకే కాదు, దేవుని సేవకుల యథార్థతకు కూడా వంకలు పెట్టాడు. ఉదాహరణకు, నీతిమంతుడైన యోబు గురించి సాతాను యెహోవాతో ఇలా అన్నాడు: “నువ్వు అతని చుట్టూ, అతని ఇంటివాళ్ల చుట్టూ, అతనికున్న వాటన్నిటి చుట్టూ కంచె వేశావు కదా. నువ్వు అతని చేతుల కష్టాన్ని దీవించావు, దానివల్ల అతని పశుసంపద దేశంలో ఎంతగానో విస్తరించింది. అయితే, ఇప్పుడు నువ్వు నీ చెయ్యి చాపి అతనికున్న వాటన్నిటినీ తీసేయి, అతను ఖచ్చితంగా నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు.”—యోబు 1:10, 11.

13. సాతాను యోబు మీద వేసిన నిందలకు అర్థమేంటి? దానిలోకి మనుషులందర్నీ ఎలా లాగాడు?

13 యెహోవా యోబును కాపాడుతూ, అతని భక్తిని కొనుక్కుంటున్నాడని సాతాను నిందించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, యోబు యథార్థత అంతా నటనే అని, అతను దేవుని నుండి ఏదో ఆశించే ఆరాధిస్తున్నాడని సాతాను అన్నాడు. ఒకవేళ దేవుడు యోబును ఆశీర్వదించడం ఆపేస్తే, అతను తన సృష్టికర్తను దూషిస్తాడని కూడా సాతాను అన్నాడు. యోబు “నింద లేనివాడు, నిజాయితీపరుడు; దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉన్నాడు” అని సాతానుకు కూడా తెలుసు.a అలాంటి వ్యక్తి యథార్థతనే చెడగొడితే, ఇంక ఏ మనిషీ యథార్థంగా ఉండే ఛాన్సే లేదని సాతాను అనుకున్నాడు. అలా సాతాను, దేవుణ్ణి ఆరాధిస్తున్న వాళ్లందరి యథార్థతను ప్రశ్నించాడు. నిజానికి, సాతాను మనుషులందర్నీ అందులోకి లాగుతూ యెహోవాతో ఇలా అన్నాడు: “తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకున్నవన్నీ మనిషి ఇచ్చేస్తాడు.”—యోబు 1:8; 2:4.

14. సాతాను మనుషుల మీద వేసిన నింద విషయంలో చరిత్ర ఏం రుజువు చేసింది?

14 కానీ ఆ మాటల్ని కొట్టిపారేస్తూ, చరిత్రలో యోబులాగే చాలామంది కష్టాల్లో యెహోవాకు నమ్మకంగా ఉండి ఆయన హృదయాన్ని సంతోషపెట్టారు. కష్టం వస్తే మనుషులు దేవుణ్ణి ఆరాధించడం ఆపేస్తారని సాతాను పొగరుగా అన్న మాటలకు, యెహోవా ధీటుగా సమాధానం చెప్పేలా వాళ్లు బ్రతికారు. (హెబ్రీయులు 11:4-38) అవును, కష్టాలు ఊపిరాడకుండా చేసినప్పుడు మంచి మనసున్నవాళ్లు, తట్టుకునే శక్తి కోసం యెహోవా మీద ఇంకా ఎక్కువ ఆధారపడ్డారే గానీ, ఆయనకు వెన్ను చూపలేదు.—2 కొరింథీయులు 4:7-10.

15. యెహోవా గతంలో చేసిన, అలాగే భవిష్యత్తులో చేయబోయే తీర్పుల గురించి మనకు ఏ ప్రశ్న రావచ్చు?

15 సర్వాధిపత్యం గురించి, మనుషుల యథార్థత గురించి సాతాను ప్రశ్నించినప్పుడు యెహోవా దాన్ని ఎలా పరిష్కరించాడో చూస్తే ఆయన న్యాయం గురించి తెలుస్తుంది. అయితే ఆ లక్షణం గురించి ఇంకా తెలియాలంటే, ఆయన తీర్పుల గురించి కూడా తెలుసుకోవాలి. ఆయన ఒక్కొక్కరికి, కొన్నిసార్లు మొత్తం ఊరికి ఎలాంటి తీర్పులు తీర్చాడో బైబిల్లో ఉంది. అలాగే భవిష్యత్తులో ఆయన తీర్చబోయే తీర్పుల గురించిన ప్రవచనాలు కూడా బైబిల్లో ఉన్నాయి. యెహోవా ఇప్పటివరకు, అలాగే ఇకముందు కూడా న్యాయంగానే తీర్పు తీరుస్తాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

యెహోవా న్యాయం ఎందుకు గొప్పది?

సొదొమ, గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిసినప్పుడు లోతు, అతని ఇద్దరు కూతుర్లు సోయరుకు క్షేమంగా చేరుకుంటున్నారు. వాళ్ల వెనకాల, ఉప్పు స్తంభంగా మారిన లోతు భార్య కనిపిస్తుంది.

యెహోవా ఎన్నడూ “దుష్టులతో పాటు నీతిమంతుల్ని” తుడిచిపెట్టడు

16, 17. నిజమైన న్యాయం విషయంలో మనుషులకున్న అవగాహన అంతంతమాత్రమే అని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

16 యెహోవా గురించి మాత్రమే “ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి” అని చెప్పగలం. (ద్వితీయోపదేశకాండం 32:4) కానీ మనలో ఎవ్వరం మన గురించి ఆ మాట అనలేం. ఎందుకంటే, మనకున్న మిడిమిడి జ్ఞానం వల్ల ఏది సరైనదో పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఉదాహరణకు, అబ్రాహాము గురించి ఆలోచించండి. సొదొమ ఎంత చెడ్డగా ఉన్నా, దాన్ని నాశనం చేయొద్దని ఆయన యెహోవాను బతిమాలాడు. ఆయన యెహోవాను ఇలా అడిగాడు: “నువ్వు నిజంగా దుష్టులతో పాటు నీతిమంతుల్ని తుడిచిపెడతావా?” (ఆదికాండం 18:23-33) యెహోవా ఎప్పటికీ అలా చేయడు. నీతిమంతుడైన లోతు, అతని కూతుళ్లు సోయరు అనే నగరానికి క్షేమంగా వచ్చిన తర్వాతే, యెహోవా సొదొమ మీద “అగ్నిగంధకాల్ని కురిపించాడు.” (ఆదికాండం 19:22-24) దానికి పూర్తి భిన్నంగా, యెహోవా నీనెవె ప్రజల మీద కరుణ చూపించినప్పుడు, యోనాకు “విపరీతమైన కోపం వచ్చింది.” ఎందుకంటే ఆ నగరం నాశనమౌతుందని యోనా అప్పటికే ప్రకటించాడు కాబట్టి, వాళ్లు పశ్చాత్తాపపడినా సరే వాళ్లను నాశనం చేయాలంటూ ఆయన మొండిపట్టు పట్టాడు.—యోనా 3:10–4:1.

17 దేవుని న్యాయంలో, దుష్టుల్ని శిక్షించడంతో పాటు నీతిమంతుల్ని కాపాడడం కూడా ఉందని యెహోవా అబ్రాహాముకు అర్థమయ్యేలా చేశాడు. మరోపక్క యోనా, యెహోవా కరుణగల దేవుడని నేర్చుకోవాల్సి వచ్చింది. ఒకవేళ దుష్టులు తమ ప్రవర్తన మార్చుకుంటే, ఆయన “క్షమించడానికి సిద్ధంగా” ఉంటాడు. (కీర్తన 86:5) కొంతమంది తమ అధికారాన్ని చూపించుకోవడానికే ప్రజల్ని శిక్షిస్తారు, కరుణ చూపిస్తే నలుగురూ తమను చేతగానివాళ్లు అనుకుంటారని భయపడతారు. కానీ యెహోవా అస్సలు అలా కాదు. కరుణ చూపించడానికి ఏ చిన్న ఆధారం ఉన్నా, యెహోవా దాన్ని వదిలిపెట్టడు.—యెషయా 55:7; యెహెజ్కేలు 18:23.

18. యెహోవా కేవలం ఫీలింగ్స్‌ని బట్టి గుడ్డిగా తీర్పు తీర్చడని ఎలా చెప్పవచ్చు?

18 అలాగని, యెహోవా కేవలం ఫీలింగ్స్‌ని బట్టి గుడ్డిగా తీర్పు తీర్చడు. తన సొంత ప్రజలు విగ్రహారాధనలో కూరుకుపోయినప్పుడు, యెహోవా వాళ్లతో ఇలా తేల్చి చెప్పాడు: “నీ మార్గాల ప్రకారం నీకు తీర్పు తీర్చి, నీ అసహ్యమైన పనులన్నిటిని బట్టి నిన్ను లెక్క అడుగుతాను. నా కన్ను నీ మీద జాలిపడదు, నేను కనికరపడను. నేను నీ మార్గాల ఫలితాల్ని నీ మీదికి రప్పిస్తాను.” (యెహెజ్కేలు 7:3, 4) కాబట్టి మనుషులు ఎప్పుడైతే చెడ్డపనులు చేస్తూ రాటుతేలిపోతారో, యెహోవా వాళ్ల పనులకు తగ్గట్టు వాళ్లకు తీర్పు తీరుస్తాడు. అయితే, ఆయన గట్టి రుజువుల ఆధారంగా తీర్పు తీరుస్తాడు. అందుకే సొదొమ-గొమొర్రాల గురించి బిగ్గరగా మొర వినబడినప్పుడు, యెహోవా ఇలా అన్నాడు: “నేను కిందికి వెళ్లి, నాకు వినబడిన మొర నిజమో కాదో, వాళ్ల పనులు నిజంగా అంత చెడ్డగా ఉన్నాయో లేదో చూస్తాను.” (ఆదికాండం 18:20, 21) చెప్పింది పూర్తిగా వినకుండానే ఒక ముగింపుకు వచ్చేసే మనుషుల్లా యెహోవా లేనందుకు ఎంత సంతోషంగా ఉందో కదా! నిజంగా, బైబిలు చెప్తున్నట్టు యెహోవా “నమ్మకమైన దేవుడు, ఆయన ఎన్నడూ అన్యాయం చేయడు.”—ద్వితీయోపదేశకాండం 32:4.

యెహోవా న్యాయం మీద నమ్మకం ఉంచండి

19. యెహోవా న్యాయం గురించి మనకు ఏమైనా చిక్కు ప్రశ్నలు ఉంటే, ఏం చేయవచ్చు?

19 యెహోవా గతంలో తీర్చిన తీర్పుల గురించి, భవిష్యత్తులో ఒక్కొక్కరికి లేదా గుంపులకు తీర్చబోయే తీర్పుల గురించి బైబిలు ప్రతీ విషయం చెప్పట్లేదు. బైబిల్లో అలాంటి పూర్తి వివరాలు లేని లేఖనాల్ని, ప్రవచనాల్ని చదివినప్పుడు, అవి మనకు అర్థం కాకపోతే మీకా ప్రవక్తలాగే నమ్మకంగా ఉండవచ్చు. ఆయన ఇలా రాశాడు: “నా రక్షకుడైన దేవుని కోసం ఓపిగ్గా వేచివుంటాను.”—మీకా 7:7.

20, 21. యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

20 యెహోవా ప్రతీ సందర్భంలో సరైనదే చేస్తాడని మనం పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. కొన్నిసార్లు మనుషులు అన్యాయాన్ని పట్టించుకోవట్లేదు అని మనకు అనిపించినా, యెహోవా ఇలా మాటిస్తున్నాడు: “పగతీర్చుకోవడం, ప్రతిఫలం ఇవ్వడం నా పని.” (రోమీయులు 12:19) మనం ఆయన కోసం ఓపిగ్గా వేచి ఉంటే, అపొస్తలుడైన పౌలు అన్నట్టే మనమూ గట్టి నమ్మకంతో ఇలా అంటాం: “దేవుడు అన్యాయస్థుడా? కానేకాదు!”—రోమీయులు 9:14.

21 ఈలోగా మనం “ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో” జీవిస్తున్నాం. (2 తిమోతి 3:1) చాలామంది ప్రజలు అన్యాయం వల్ల, దౌర్జన్యం వల్ల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. (ప్రసంగి 4:1) కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, యెహోవాలో రవ్వంత కూడా మార్పు లేదు. ఆయన ఇప్పటికీ అన్యాయాన్ని చీదరించుకుంటాడు, దానికి బలైనవాళ్లను చేరదీస్తాడు. ఒకవేళ మనం నమ్మకంగా ఉంటూ ఆయన సర్వాధిపత్యానికి లోబడుతూ ఉంటే, ఆయన తన రాజ్యం ద్వారా ఈ అన్యాయాలన్నిటినీ తీసేసేంత వరకూ వాటిని తట్టుకునే శక్తిని ఇస్తాడు.—1 పేతురు 5:6, 7.

a యెహోవా యోబు గురించి ఇలా అన్నాడు: “భూమ్మీద అతని లాంటివాళ్లు ఎవరూ లేరు.” (యోబు 1:8) యోబు బహుశా, యోసేపు చనిపోయిన తర్వాత అలాగే మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడు అవ్వడానికి ముందు జీవించి ఉంటాడు. కాబట్టి, ఆ సమయంలో యోబు అంత యథార్థవంతులు ఎవ్వరూ లేరు అని చెప్పవచ్చు.

ధ్యానించడానికి ప్రశ్నలు

  • ద్వితీయోపదేశకాండం 10:17-19 యెహోవా పక్షపాతం చూపించడని మనం ఎందుకు నమ్మవచ్చు?

  • యోబు 34:1-12 మీకు అన్యాయం జరిగినప్పుడు, ఎలీహు మాటలు మీలో ఏ నమ్మకాన్ని నింపుతాయి?

  • కీర్తన 1:1-6 యెహోవా నీతిమంతుల పనుల్ని, అలాగే దుష్టుల పనుల్ని జాగ్రత్తగా గమనిస్తాడని తెలుసుకోవడం ఎందుకు ఓదార్పును ఇస్తుంది?

  • మలాకీ 2:13-16 కొంతమంది భర్తలు సరైన కారణం లేకుండా భార్యలకు విడాకులు ఇచ్చి అన్యాయం చేసినప్పుడు, యెహోవాకు ఎలా అనిపించింది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి