దేవుడిచ్చు బలముపై ఆధారపడుము
రెండవ తిమోతి నుండి ఉన్నతాంశములు
తన సేవకులు శోధనలను హింసను సహించు శక్తిని యెహోవా ఇచ్చును. తిమోతికిని మరియు ఇతర క్రైస్తవులకును దేవుడిచ్చు బలము ఎంత అవసరమైయుండెను! సా.శ 64.లో రోమును అగ్ని ధ్వంసముచేసినపుడు దానికి బాధ్యుడు నీరో చక్రవర్తి అను వదంతి కలదు. ఆ నిందనుండి తన్నుతాను కాపాడుకొనుటకు ఆయన ఆ నిందను క్రైస్తవులపై వేయగా అది క్రైస్తవులకు హింసను కలుగజేసినది. చాలా వరకు ఆ సమయములో (దాదాపు సా.శ. 65), పౌలు మరలా రోములో ఖైదీగా ఉంచబడెను. ఆయన మరణమును ఎదుర్కొనబోవుచున్నను, తిమోతికి తన రెండవ పత్రికను వ్రాసెను.
పౌలు పత్రిక తిమోతిని మతభ్రష్టులను ఎదిరించి హింసయందును స్థిరముగా నిలబడి ఉండుటకు సిద్ధముచేసినది. ఆయనను అది ఆత్మీయ అభివృద్ధిని చేసుకొనుచుండుటకు ప్రోత్సహించి, చెరలో పౌలు కలిగియున్న పరిస్థితులనుగూర్చి వివరించెను. చదువరులకు కూడా ఈ పత్రిక దేవుడిచ్చు బలముపై ఆధారపడుటకు సహాయముచేయును.
కీడును సహించుచు సాధుత్వముతో బోధించుము
సువార్త ప్రచారకులుగా హింసను సహించుటకు దేవుడు శక్తిననుగ్రహించును. (2 తిమోతి 1:1-18) పౌలు తిమోతిని ఎప్పటికిని తన ప్రార్థనలలో మరువక, అతనియొక్క నిష్కపటమైన విశ్వాసమును ఆయన గుర్తుచేసుకొనెను. దేవుడు తిమోతికి పిరికితనముగల ఆత్మనియ్యలేదు గాని శక్తి, ప్రేమ మరియు స్వస్థబుద్ధియుగల ఆత్మనే యిచ్చియున్నాడు. కావున ఆయన సాక్ష్యమిచ్చుటయందును సువార్త నిమిత్తమై హింసను సహించుటయందును సిగ్గుపడకూడదు. పౌలు నుండి నేర్చుకొనిన “హిత వాక్య ప్రమాణమును” గైకొనవలెనని కూడ ఆయన గట్టిగా ప్రోత్సహించబడెను. అలాగే మనమును ఇతరులు దానినుండి తొలగిపోయినను మనమట్టుకు మనము నిజమైన క్రైస్తవ సత్యమునకు ఖచ్చితముగా హత్తుకొనియుండవలెను.
పౌలు బోధించిన విషయములను వారు ఇతరులకును బోధించునట్లు నమ్మకమైన మనుష్యులకును ఆయన వాటిని అప్పగించవలెను. (2:1-26) కీడును సహించునపుడు నమ్మకముగా ఉండి క్రీస్తుయొక్క మంచి సైనికునిగా ఉండవలెనని తిమోతి గట్టిగా పురికొల్పబడెను. సువార్తనిమిత్తమై పౌలు తన మట్టుకు తానే బంధకములలో ఉన్నాడు. పరిశుద్ధమైన దానిని భంగపరచు పనికిరాని మాటలను విసర్జించి దేవునియెదుట యోగ్యమైన పనివానిగా కనపరచుకొనుటకు తన శక్తికొలది పనిచేయవలెనని తిమోతిని ఆయన ప్రోత్సహించెను. మరియు ప్రభువుయొక్క దాసుడు సాధుత్వముతో ఇతరులకు బోధించవలెననియు ఆయనకు చెప్పబడెను.
వాక్యమును ప్రకటించుము!
అంత్యదినములను ఎదుర్కొని లేఖన సత్యమును హత్తుకొనియుండుటకు దేవుడిచ్చు బలము అవసరము. (3:1-17) ‘యెల్లప్పుడు నేర్చుకొనుచున్నను సత్యమును గూర్చిన ఖచ్చితమైన జ్ఞానమును ఎప్పుడును పొందలేని’ మనుష్యులు భక్తిహీనులలోనుండి లేచుదురు. అయితే అట్టి ‘దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.’ ఏమైనను తిమోతి మాత్రము ‘తాను నేర్చుకొన్నవాటియందు నిలకడగా’ ఉండవలెను. కావున ‘దైవజనుడు సన్నద్ధుడై ప్రతిసత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నదని తెలిసికొని’ మనమును ఆలాగే చేయవలెను.
తిమోతి మతభ్రష్టులను ఎదిరించి తన పరిచర్యను సంపూర్తి చేయవలెను. (4:1-22) ఆయన ‘వాక్యమును ప్రకటించి’ దానికి హత్తుకొనియుండుటద్వారా అట్లు చేయవచ్చును. ఇది ప్రాముఖ్యమైయుండెను, ఎందుకనగా కొందరు అబద్ధ సిద్ధాంతమును బోధించుటనుబట్టి సంఘము అప్పుడు “కష్టతరమైన సమయమును” ఎదుర్కొనుచుండెను. యెహోవాసాక్షులును ప్రస్తుతము సంఘమునకు మరియు బయటివారికి అనానుకూల పరిస్థితులందును అత్యవసరముగా ప్రకటించుచు దేవుని వాక్యమును హత్తుకొనియుందురు. ఆయన కొందరివలన విడిచిపెట్టబడినను పౌలు “విశ్వాసమును కాపాడుకొనెను.” ఆయన ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము ‘ప్రభువు ఆయనను బలపరచెను’. మనము కూడా దేవుడిచ్చు బలముపై ఆధారపడి సువార్తను ప్రకటించుచుందుము గాక! (w91 1/15)
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
మంచి సైనికుడు: “క్రీస్తుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములో చిక్కుకొనడు” అని పౌలు తిమోతిని గట్టిగా కోరెను. (2 తిమోతి 2:3, 4) రోమీయుల పదాతి సైనికుడు గొడ్డలి, బుట్ట, మూడుదినముల బత్తెము మరియు ఇతరపదార్థములు మొదలగు బరువైన ఆయుధములను మోసికొని పోవునప్పుడు ‘శ్రమను అనుభవించెను.’ (జోసఫస్ వార్స్ ఆఫ్ ది జ్యూస్, పుస్తకము 3, అధ్యాయము 5) అతను జీవనవ్యాపార ఆసక్తులను వెంటాడడు. ఎందుకనగా అది తన అధికారిని సంతోషపెట్టి, ఖర్చులకు సరిపడునంతగా ఉండదు. అలాగే క్రైస్తవుడును “క్రీస్తుయొక్క మంచి సైనికునిగా” ముడిపడివున్న శ్రమలను అనుభవించును. లేఖన సంబంధమగు తన విధులను నెరవేర్చుటకు క్రైస్తవుడు లౌకిక ఉద్యోగమందు పనిచేయుచున్నను, వస్తుసంబంధమైనవాటికి సంబంధించిన వాటియందు అనవసరముగా నిమగ్నమై తన ఆత్మీయ యుద్ధ పోరాటములో అవి తనను ఆగిపోవునట్లు చేయురీతిగా చేసికొనకూడదు. (1 థెస్సలొనీకయులు 2:9) ఇంటింటికి సాక్ష్యమిచ్చుటలో తాను “దేవుని వాక్యమగు ఆత్మ ఖడ్గమును” వాడుచు, ప్రజలు మతసంబంధమగు తప్పిదమునుండి స్వతంత్రులగుటకు ఆయన సహాయముచేయును. (ఎఫెసీయులు 6:11-17; యోహాను 8:31, 32) జీవము అపాయమందున్నది గనుక క్రైస్తవ సైనికులందరు యేసుక్రీస్తును మరియు యెహోవాదేవుని ఈ విధముగా సంతోషపెట్టుదురు గాక.