ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు
దేవుడు ఎలాంటి వ్యక్తి?
దేవుడు అదృశ్యుడు, మనం ఆయనను చూడలేం. ఆయనే ఆకాశాన్ని, భూమిని, సమస్త జీవకోటిని సృష్టించాడు. దేవుణ్ణి ఎవరూ సృష్టించలేదు, ఆయనకు ఆరంభం లేదు. (కీర్తన 90:2) ప్రజలు తనకోసం వెదకాలనీ, తన గురించిన సత్యం తెలుసుకోవాలనీ దేవుడు కోరుకుంటున్నాడు.—అపొస్తలుల కార్యములు 17:24-27 చదవండి.
మనం దేవుని పేరు తెలుసుకోవచ్చు. సృష్టిని పరిశీలిస్తే, ఆయన లక్షణాల్లో కొన్ని అర్థమౌతాయి. (రోమీయులు 1:20) అయితే దేవుణ్ణి, ఆయన వ్యక్తిత్వాన్ని బాగా తెలుసుకోవాలంటే మాత్రం ఆయన వాక్యమైన బైబిలును లోతుగా పరిశీలించాలి.—కీర్తన 103:7-10 చదవండి.
అన్యాయాన్ని చూసినప్పుడు దేవునికి ఏమనిపిస్తుంది?
మన సృష్టికర్త యెహోవా అన్యాయాన్ని అసహ్యించుకుంటాడు. (ద్వితీయోపదేశకాండము 25:16) ఆయన మనుషులను తన పోలికలో తయారుచేశాడు. అందుకే మనలో చాలామందిమి అన్యాయాన్ని అసహ్యించుకుంటాం. మన చుట్టూ ఉన్న అన్యాయాలకు దేవుడు బాధ్యుడుకాడు. సొంతగా ఎంపికలు చేసుకునే స్వేచ్ఛను దేవుడు మనుషులకు ఇచ్చాడు. కానీ విచారకరమైన విషయమేమిటంటే, చాలామంది ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ అన్యాయాలు చేస్తున్నారు. అది చూసినప్పుడు, యెహోవా హృదయం నొచ్చుకుంటుంది.—ఆదికాండము 6:5, 6; ద్వితీయోపదేశకాండము 32:4, 5 చదవండి.
యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్యాయాన్ని ఎప్పటికీ చూస్తూ ఊరుకోడు. (కీర్తన 37:28, 29) ఆయన త్వరలోనే అన్యాయాలన్నిటినీ పూర్తిగా తీసేస్తాడని బైబిలు వాగ్దానం చేస్తుంది.—2 పేతురు 3:7-9, 13 చదవండి. (w14-E 01/01)
దేవుడు త్వరలోనే అందరికీ న్యాయం జరిగేలా చూస్తాడని బైబిలు వాగ్దానం చేస్తుంది