దేవుని నిబంధనలనుండి నీవు ప్రయోజనము పొందెదవా?
“‘నీయందు అన్యజనులందరు ఆశీర్వదింపబడుదురు.’ కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు.”—గలతీయులు 3:8, 9.
1. అనేక పరిపాలనల ప్రభావమును చరిత్ర ఏమని చూపించుచున్నది?
“దయాళువైన [లేక, జ్ఞానముగల] ప్రభువులని” 18వ శతాబ్ద ఐరోపా పాలకులు పిలువబడిరి. వారు ‘పిత్రువాత్సల్యతతో ప్రజలను పాలించవలసియుండిరి, అయితే వారి పథకములు తప్పిపోయెను, వారి సంస్కరణలు విఫలమాయెను.’a (ది ఎన్‌సైక్లొపీడియా అమెరికానా) త్వరలోనే యూరపునంతటిని అలుముకొనిన విప్లవములకు ఇది ముఖ్యకారణముగా యుండెను.
2, 3. మానవపాలకులతో యెహోవా ఎట్లు వ్యత్యాసమును కలిగియున్నాడు?
2 చెప్పనలవికాని మానవపాలకుల నుండి యెహోవా ఎంత వ్యత్యాసముగలవాడైయున్నాడు. అన్యాయములకు బాధలకు నిజమైన నివారణను కలుగజేయు అంతిమమార్పు కొరకు మానవజాతికిగల తీవ్రఅవసరతను మనము సులభముగా చూడవచ్చును. అయితే దీనినితెచ్చు దేవునిక్రియలు ఒక పిచ్చిఊహమీద ఆధారపడియున్నదని మనము కలత చెందనవసరము లేదు. విశ్వాసమానవజాతికి నిత్యాశీర్వాదములను తెచ్చుటకుగల తన వాగ్ధానమును ప్రపంచమందు ఎక్కువగా పంచబడిన పుస్తకములో ఆయన దీనిని వ్రాయింపజేసియున్నాడు. ఇది ప్రజల గతములోని జాతీయత, జాతి, విద్య, లేక సామాజిక స్థానముల తారతమ్యములేనిదై యుండును. (గలతీయులు 3:28) అయితే దీనిమీద నీవు ఆధారపడగలవా?
3 అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన అభయములోని కొంతభాగమును అపొస్తలుడైన పౌలు ఎత్తిచూపుచు ఇలా వ్రాసెను: “నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును.” పౌలు ఇంకను చెప్పినదేమనగా, “దేవుడు అబద్ధమాడజాలడు గనుక,” మనము “మనయెదుట ఉంచబడిన నిరీక్షణను, చేపట్టుటకు బలమైన ప్రోత్సాహమును కలిగియుందము గాక.” (హెబ్రీయులు 6:13-18) దీనిని నెరవేర్చుటకు దేవుడు ఆధారమును కలుగజేసిన క్రమమును గమనించుట ద్వారా ఆ ఆశీర్వాదములయందలి మన నమ్మకము మరింత బలపర్చబడగలదు.
4. తనసంకల్పమును నెరవేర్చుటకు దేవుడు వివిధ నిబంధనలను ఎట్లు ఉపయోగించెను?
4 “భూలోకములోని జనములన్నియు” ఆశీర్వదించబడుటకు సాధనముగా ఉపయోగించబడు సంతానము చేరియుండు ఒక నిబంధనను దేవుడు అబ్రాహాముతో చేసియుండెనని మనమిదివరకే చూసియున్నాము. (ఆదికాండము 22:17, 18) ఇశ్రాయేలీయులు సహజసంతానముగా తయారయ్యిరి, అయితే మరి ఎక్కువైన ఆత్మీయ భావమునందు యేసు అబ్రాహాము సంతానములోని ముఖ్యభాగమయ్యెను. అంతేకాకుండా యేసు మహాగొప్ప అబ్రాహామగు యెహోవా కుమారుడును, సంతానమైయున్నాడు. “క్రీస్తు సంబంధులైన” క్రైస్తవులు అబ్రాహాము సంతానముయొక్క ద్వితీయభాగముగా తయారగుదురు. (గలతీయులు 3:16, 29) అబ్రాహాము నిబంధనను రూపొందించిన తర్వాత, దేవుడు ఇశ్రాయేలు జనాంగముతోచేసిన ధర్మశాస్త్ర నిబంధనను తాత్కాలికముగా చేర్చెను. అది ఇశ్రాయేలీయులు పాపులని, వారికి శాశ్వతకాల యాజకుడు మరియు ఒక పరిపూర్ణబలి అవసరమని నిరూపించినది. అది సంతానముయొక్క వంశక్రమమును కాపాడి ఆయనను గుర్తుపట్టుటకు సహాయము చేసినది. అలాగే ధర్మశాస్త్రము రాజులైన-యాజకుల జనాంగమును దేవుడే ఎలాగోతెచ్చునని కూడా చూపించినది. ధర్మశాస్త్రము ఇంకను ప్రభావమందుండగానే దేవుడు ఇశ్రాయేలునందు రాజ్యవంశపాలనకు దావీదుతో ఒక నిబంధనను చేసెను. ఈ దావీదురాజ్య నిబంధనకూడా, భూమిమీద శాశ్వతకాల పరిపాలన కలిగియుండు ఒకనిని సూచించినది.
5. ఏ ప్రశ్నలు లేక సమస్యలు పరిష్కరింపబడవలసిన అవసరత కలదు?
5 అయినను, పూర్తికాని లేక స్పష్టముకావలసిన అవసరతగలవిగా కన్పించిన ఈ నిబంధనలయొక్క ఆకృతులు లేక ఉద్దేశ్యములు ఇంకను అక్కడ ఉండెను. ఉదాహరణకు, రానైయున్న సంతానము దావీదు వంశక్రమములోని రాజైతే, క్రితమున్న యాజకులకంటే ఎక్కువైన శాశ్వతకాల యాజకునిగా ఆయనెట్లుండగలడు? (హెబ్రీయులు 5:1; 7:13, 14) భూపరిధి పరిమితినిమించి ఈ రాజు పాలించునా? మహాగొప్ప అబ్రాహాము కుటుంబమునందుండుటకు సంతానముయొక్క ద్వితీయభాగము ఎట్లు అర్హమైనది కాగలదు? అలావారు కాగల్గినను, వారిలో అనేకులు దావీదునుండి వచ్చినవారు కాదుగనుక, వారికి ఏ అధికారముండును? మన నిత్యాశీర్వాదముల కొరకు మార్గమును తెరచుచు, ఈ ప్రశ్నలను పరిష్కరించుటకు ఉపనిబంధనల రూపమున దేవుడు ఎట్లు న్యాయబద్ధమైన చర్యలు తీసుకొనెనో మనము చూద్దాము.
పరలోక యాజకుని కొరకైన నిబంధన
6, 7. (ఎ) కీర్తన 110:4, ప్రకారము ఏ ఉపనిబంధనను దేవుడు స్థిరపరచెను? (బి) ఈ ఉపనిబంధనను అర్థము చేసుకొనుటకు ఏ పూర్వరంగము మనకు సహాయము చేయును?
6 మనము చూచినట్లుగా, ధర్మశాస్త్ర కార్యపరిధినందే దేవుడు భూమిమీది అధికారముతో శాశ్వతముగా పరిపాలనచేయు వారసుని (సంతానము) కొరకు దావీదుతో ఒక నిబంధనను చేసెను. అయితే ఎల్లకాలముండు యాజకుడు వచ్చునని కూడా యెహోవా దావీదుకు బయల్పరచెను. దావీదు ఇలా వ్రాసెను: “‘మెల్కీసెదెకు క్రమముచొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని’ యెహోవా ప్రమాణము చేసియున్నాడు.” (దానిగూర్చి ఆయనెంతమాత్రము చింతించడు) (కీర్తన 110:4) యెహోవాకు, రానైయున్న యాజకుని మధ్య వ్యక్తిగత నిబంధనకు దారితీసిన దేవుని ప్రమాణవాక్యము వెనుకయున్నదేమిటి?
7 సాక్ష్యాధారముగా, ఆ తదుపరి కాలములలో (“షాలేము”అను పేరునుచేర్చిన) యెరూషలేము పట్టణముండిన ప్రాంతములోని ప్రాచీనషాలేమునకు మెల్కీసెదెకు రాజైయుండెను. ఆయన “సర్వోన్నతుడగు దేవుని” ఆరాధించిన రాజు అని అబ్రాహాముతో ఆయనకుండిన వ్యవహారముల వృత్తాంతము ఉన్నతపరచుచున్నది. (ఆదికాండము 14:17-20) అయినను, కీర్తన 110:4లోని దేవుని వ్యాఖ్యానము, మెల్కీసెదెకును ఒక ఉన్నత వ్యక్తినిచేయుచు ఆయన యాజకుడని కూడా చూపించుచున్నది. ఆతర్వాతి కాలములలో దైవనిర్ధారిత కార్యములను నెరవేర్చిన దావీదు సంబంధులగు రాజులు మరియు లేవీయ యాజకుల స్థానములో ఆయన రాజుగాను యాజకునిగాను సేవచేసెను.
8. మెల్కీసెదెకును పోలిన యాజకుని కొరకైన ఈ నిబంధన ఎవరితో చేయబడినది, మరియు దాని ఫలితము ఏమైయున్నది?
8 మెల్కీసెదెకును పోలిన యాజకుని కొరకైన ఈ నిబంధనను గూర్చిన మరిన్ని వివరములను మనకు పౌలు ఇచ్చుచున్నాడు. ఉదాహరణకు, “మెల్కీసెదెకు క్రమముచొప్పున ప్రధానయాజకుడని దేవుడు పిలిచినవాడు” యేసు క్రీస్తని ఆయన చెప్పుచున్నాడు. (హెబ్రీయులు 5:4-10; 6:20; 7:17, 21, 22) మెల్కీసెదెకునకు ఖచ్ఛితముగా మానవ తల్లిదండ్రులు ఉండినను, ఆయన వంశావళిని గూర్చిన చరిత్ర ఎక్కడను లేదు. కాబట్టి మెల్కీసెదెకు వంశక్రమము చొప్పున యేసు యాజకధర్మ కార్యమును స్వతంత్రించుకొనుటకు బదులు, ఆయనకు నియామకము తిన్నగా దేవునినుండి వచ్చెను. ఆయన “నిరంతరము యాజకునిగా యుండును” గనుక, యేసు యాజకత్వమునకు మరొక వారసుడుండడు. ఆయన యాజకసేవా ఆశీర్వాదములు నిత్యముండును గనుక, విషయమీలాగున్నది. “తనద్వారా దేవునియొద్దకు వచ్చువారిని. . .సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడును, విశ్వాసులను నిరంతరము ఉపదేశించి నడిపించు యాజకుని కలిగియున్నందుకు మనము నిజముగా ఆశీర్వదించబడిన వారమైయున్నాము.—హెబ్రీయులు 7:1-3, 15-17, 23-25.
9, 10. ఈ ఐదవ నిబంధనను గూర్చిన జ్ఞానము దేవుని సంకల్పమెట్లు నెరవేర్చబడునను మన అవగాహనను ఎట్లు విస్తరింపజేయుచున్నది?
9 రాజైన-యాజకునిగా యేసు పాత్ర భూపరిధిని దాటి పోవుననుట మరొక ప్రాముఖ్యమైన వాస్తవమైయున్నది. మెల్కీసెదెకును పోలిన యాజకుని కొరకైన ఈ నిబంధనను ప్రస్తావించిన సందర్భమందే, దావీదు ఇలా వ్రాసెను: “నా ప్రభువునుగూర్చి యెహోవా సెలవిచ్చినవాక్కు: ‘నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము.’” దావీదునకు ప్రభువగు—యేసు పరలోకములో యెహోవాయొద్ద స్థానముగలవాడైయుండవలెను, ఇది ఆయన పరలోకమునకు ఎక్కిపోయినప్పుడు సంభవించెను. శత్రువులను లోబరచుకొనుటకు, తీర్పులుతీర్చుటకు, యేసు పరలోకమునుండి, తన తండ్రితో అధికారమును ఉపయోగించగలడు.—కీర్తన 100:1, 2; అ. కార్యములు 2:33-36; హెబ్రీయులు 1:3; 8:1; 12:2.
10 కాబట్టి, ఈ ఐదవ నిబంధనను ఎరుగుట ద్వారా, యెహోవా తన సంకల్పమును నెరవేర్చు ఖచ్ఛితమైన మరియు క్రమమైన మార్గముయొక్క విశాలదృష్టిని మనము కలిగియుందుము. ప్రాథమిక సంతానము పరలోకములో యాజకుడై యుండును అలాగే ఆయన రాజు-యాజక అధికారము విశ్వమంతయు విస్తరించియుండునని ఇది స్థిరపరచుచున్నది.—1 పేతురు 3:22.
నూతననిబంధన మరియు సంతానముయొక్క ద్వితీయ భాగము
11. ద్వితీయ సంతానము విషయమై ఎలాంటిచిక్కులు ఉనికియందుండెను?
11 క్రితము మనము అబ్రాహాము నిబంధనను విచారించినప్పుడు, సహజమైన హక్కుగలవానిగా యేసు సంతానములో ప్రాథమిక భాగమయ్యెనని మనము గమనించితిమి. ఆయన తిన్నగా పితరుడైన అబ్రాహాము వంశమునుండి వచ్చినవాడైయుండెను, అలాగే పరిపూర్ణమానవునిగా మహాగొప్ప అబ్రాహాము కుమారునిగా అంగీకరింపబడెను. అయితే, “వాగ్దానము పొందినవారసులుగా” అబ్రాహాము సంతానమందు భాగమయ్యే ఆధిక్యతగల మానవులవిషయమేమి? (గలతీయులు 3:29) అసంపూర్ణులును, పాపియైన ఆదాము కుటుంబములోని భాగముగా వారు మహాగొప్ప అబ్రాహామయిన యెహోవా కుటుంబములో ఉండుటకు అర్హులైయుండరు. అసంపూర్ణతయొక్క అడ్డంకు ఎట్లు అధిగమించబడగలదు? అది మానవులకు అసాధ్యము, అయితే దేవునికి ఏదియు అసాధ్యము కాదు.—మత్తయి 19:25, 26.
12, 13. (ఎ) మరొక నిబంధనను దేవుడెట్లు ముందేచెప్పెను? (బి) ఈ నిబంధనయొక్క ఏ అంశము మన శ్రద్ధార్హమైయున్నది?
12 ధర్మశాస్త్రము ఇంకను ప్రభావమందుండగానే, దేవుడు తన ప్రవక్తద్వారా ముందుగనే ఇలా తెలియజేసెను: “నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్తనిబంధన చేయుదును. . .వాని పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు,. . .‘వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి’. . . .వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను. . . .నేను వారికి దేవుడనైయుందును వారు నాకు ప్రజలైయుందురు. వారు మరెన్నడును ‘యెహోవానుగూర్చి బోధనొందుము’ అని ఉపదేశము చేయరు,. . .ఏలయనగా అందరును నన్నెరిగినవారైయుందురు. . . .నేను వారిదోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసుకొనను.—యిర్మీయా 31:31-34.
13 సాక్ష్యాధారముగా, ధర్మశాస్త్రము క్రిందనున్న జంతుబలి ఏర్పాటు ‘వంటిదికాక’ ఈ క్రొత్తనిబంధనలోని ఒక అంశము పాపములను క్షమించునదైయున్నదని గమనింపుము. తాను మరణించిన దినముమీద యేసు వెలుగును ప్రకాశింపజేసెను. ధర్మశాస్త్రము కోరినప్రకారము పస్కాను ఆచరించుటకు తన శిష్యులతో చేరిన తర్వాత, ప్రభురాత్రి భోజనమును క్రీస్తు ఏర్పాటుచేసెను. యిందు అందరు ద్రాక్షారసము పాలుపంచుకొనుట చేరియుండును, దీనినిగూర్చి యేసు ఇలాచెప్పెను: “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తమువలననైన క్రొత్తనిబంధన.”—లూకా 22:14-20.
14. సంతానమందలి ద్వితీయభాగమును ఉత్పన్నముచేయుటకు క్రొత్తనిబంధన ఎందుకు ప్రాముఖ్యమైయున్నది?
14 కాబట్టి, క్రొత్తనిబంధన యేసుబలి ద్వారా పనిచేయును. అటువంటి పరిపూర్ణ బలి ఆధారముగా దేవుడు ‘దోషమును, పాపమును’ శాశ్వతముగా క్షమించగలడు. దాని భావమేమైయుండునో తలంచుము! ఆదాము కుటుంబములోని భక్తులైన మానవుల పాపములను పూర్తిగా క్షమించగలవాడై, దేవుడు వారిని పాపరహితులుగా దృష్టించి, వారిని మహాగొప్ప అబ్రాహాము ఆత్మీయకుమారులుగా జన్మింపజేయగలడు, అలాగే ఆపిమ్మట వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించనుగలడు. (రోమీయులు 8:14-17) ఆ విధముగా, యేసుబలి ద్వారా విలువచేకూర్చబడిన క్రొత్తనిబంధన ఆయన శిష్యులు అబ్రాహాము సంతానములోని ద్వితీయభాగముగా తయారయ్యేందుకు శక్తిమంతులను చేయును. పౌలు ఇలావ్రాసెను: మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన [యేసు] కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.—హెబ్రీయులు 2:14-16; 9:14.
15. క్రొత్తనిబంధన పక్షముననుండు వారెవరైయున్నారు?
15 యేసు మధ్యవర్తిగాను, బలిమూల్యముగాను ఉండగా, నిబంధన పక్షము వారెవరైయుందురు? దేవుడు “ఇశ్రాయేలు ఇంటివారితో” ఈ నిబంధనను చేయునని యిర్మీయా ముందుగనే చెప్పెను. ఎవరా ఇశ్రాయేలీయులు? క్రొత్తనిబంధన ముందున్న నిబంధనను వాడుకలోలేనిదానిగా చేసినందున, వారు ధర్మశాస్త్రము క్రింద సున్నతిపొందిన ఇశ్రాయేలీయులు మాత్రముకాదు. (హెబ్రీయులు 8:7, 13; 32వ పుట చూడుము.) విశ్వాసమూలమున అలంకారార్థముగా ‘ఆత్మద్వారా హృదయమందు సున్నతిపొందిన’ యూదులు మరియు అన్యులతో దేవుడు ఇప్పుడు వ్యవహరించును. నూతననిబంధనలో చేరియుండు వారు ‘తమ హృదయముల మీద ధర్మవిధి వ్రాయబడియుండుటను’ కలిగియుందురని తాను చెప్పిన విషయముతో ఇది పొందికను కలిగియున్నది. (రోమీయులు 2:28, 29; హెబ్రీయులు 8:10) అలాంటి ఆత్మీయ యూదులను పౌలు “దేవుని ఇశ్రాయేలు” అని పిలిచెను.—గలతీయులు 6:16; యాకోబు 1:1.
16. నిర్గమకాండము 19:6 సూచించినదానిని నెరవేర్చుటలో క్రొత్తనిబంధన ఎట్లు సహాయము చేయును?
16 ఇప్పుడు దేవుడు ఆత్మీయ ఇశ్రాయేలీయులతో వ్యవహరించుచున్నాడు గనుక, అవకాశమనే ద్వారము తెరువబడియున్నది. ధర్మశాస్త్రమును దేవుడు స్థిరపరచినప్పుడు, ఇశ్రాయేలీయుల కుమారులు తనకు “యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను” తయారగుదురని మాట్లాడెను. (నిర్గమకాండము 19:6) వాస్తవానికి, వారందరు రాజులైన-యాజకులుగా యుండగల జనాంగముగా సహజ ఇశ్రాయేలీయులు ఎన్నడును తయారుకాలేకపోయిరి, మరియు ఎన్నడును తయారుకాలేదు కూడా. అయితే అబ్రాహాము సంతానముయొక్క ద్వితీయ భాగముగా అంగీకరింపబడిన యూదులు మరియు అన్యులు రాజులైన-యాజకులు కాగలరు.b అలాంటివారిని గూర్చి చెప్పుచు అపొస్తలుడైన పేతురు దీనిని స్థిరపరచుచున్నాడు: “మీరు చీకటిలోనుండి ‘ఆశ్చర్యకరమైన తనవెలుగులోకి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన పరిశుద్ధజనముగాను, దేవుని సొత్తయిన ప్రజలునై’ యున్నారు.” వారికొరకు ‘వాడబారని స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినదనియు’ ఆయన వ్రాసెను.—1 పేతురు 1:4; 2:9, 10.
17. నూతననిబంధన ఎందుకు ధర్మశాస్త్రముకంటెను “ఎక్కువైనదై” యున్నది?
17 కాబట్టి, సంతానముయొక్క ద్వితీయభాగమును ఉత్పన్నము చేయుటలో నూతననిబంధన అంతకుముందేయుండిన అబ్రాహాము నిబంధనతో కలిసి పనిచేయును. యెహోవా అభిషక్తులైన క్రైస్తవుల మధ్యగల ఈ నూతననిబంధన, మహాగొప్ప అబ్రాహాముయొక్క రాజరిక కుటుంబములో పరలోక రాజులైన-యాజక జనాంగము రూపొందుటకు అనుమతించును. కాబట్టి, ఇది “మరి యెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధన” అని పౌలు ఎందుకు చెప్పెనో మనము చూడగలము. (హెబ్రీయులు 8:6) ఆ వాగ్దానములలో, ఎవరి దోషములు జ్ఞాపకమునకురావో ఆ భక్తుల హృదయములలో ధర్మవిధి వ్రాయబడుటయు మరియు ‘చిన్నలు మొదలుకొని పెద్దల పర్యంతము అందరు యెహోవాను ఎరిగియుండు’ ఆశీర్వాదములు చేరియుండును.—హెబ్రీయులు 8:11.
రాజ్యము కొరకైన యేసు నిబంధన
18. మనమిప్పటివరకు విచారించిన నిబంధనలన్నియు ఏ భావమునందు దేవుని సంకల్పమును పూర్తిగా నెరవేర్చలేదు?
18 మనము చర్చించిన ఆరు నిబంధనల మీద ప్రతిబింబించిన మీదట, తన సంకల్పమును నెరవేర్చుటకు కావలసినదంతయు యెహోవా చట్టరీత్యా ఏర్పాటుచేసినట్లుగా కన్పించవచ్చును. అయితే, మనము విచారించిన దానియంతటితో ముడిపడియుండు మరొక నిబంధనను బైబిలు పైకితెచ్చుచున్నది, ఈ నిబంధన విషయమునకు కావలసిన ముఖ్యాంశములనన్నింటిని ఒక కొలిక్కితెచ్చుచున్నది. ఆత్మాభిషేక-క్రైస్తవులు ‘ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి తమను తప్పించి తన పరలోకరాజ్యమునకు చేరునట్లు తమను రక్షించునని’ సరిగా అపేక్షింతురు. (2 తిమోతి 4:18) పరలోకమందు వారు రాజులుగాను యాజకులుగాను ఉందురు, అయితే వారికిగల అధికారమేమి? వారు పరలోకమునకు లేపబడినప్పుడు, క్రీస్తు అప్పటికే అక్కడ పరిపూర్ణ యాజకునిగా ఉండును. అట్లే ఆయన విశ్వపాలనకొరకు రాజ్యాధికారముతో నిలువబడినవాడైకూడా ఉండును. (కీర్తన 2:6-9; ప్రకటన 11:15) అయితే ఈ ఇతర రాజులైన-యాజకులకు చేయుటకు అక్కడ పని ఏమియుండును?
19. ఎప్పుడు మరియు ఎట్లు ప్రాముఖ్యమైన ఏడవ నిబంధన చేయబడినది?
19 సా.శ. 33 నీసాను 14వ తేదీన, సాయంకాలము యేసు ప్రభురాత్రి భోజనమును ఏర్పాటుచేసి “[తన] రక్తమువలననైన క్రొత్తనిబంధన” అని ప్రస్తావించిన తర్వాత ఆయన మరొక నిబంధననుగూర్చికూడా మాట్లాడెను, ఇది మన చర్చకు ఏడవదియైయున్నది. ఆయన తననమ్మకమైన శిష్యులతో ఇట్లనెను: “నా శ్రమలలో నాతో నిలిచియున్నవారు మీరే, గనుక నాతండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనములమీద కూర్చుండి ఇశ్రాయేలు పన్నెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:20, 28-30) మెల్కీసెదెకు క్రమముచొప్పున యాజకుడైయుండుటకు యేసుతో తండ్రి ఎట్లు నిబంధనను చేసెనో, అట్లే క్రీస్తు తననమ్మకమైన అనుచరులతో ఒక వ్యక్తిగత నిబంధనను చేసెను.
20. రాజ్యముకొరకైన నిబంధన ఎవరితో చేయబడినది, ఎందుకు? (దానియేలు 7:18; 2 తిమోతి 2:11-13)
20 యేసు 11మంది అపొస్తలులు నిశ్చయముగా ఆయన శ్రమలయందు ఆయనతో కూడాయుండిరి, అలాగే నిబంధన చూపినట్లు వారు సింహాసనముల మీద కూర్చుందురు. ఇంకను, ప్రకటన 3:21, నమ్మకస్థులుగా నిరూపించుకొను ఆత్మీయ-కుమారులగు క్రైస్తవులందరు పరలోక సింహాసనముల మీద కూర్చుందురని నిరూపించుచున్నది. ఆవిధముగా, ఈ నిబంధన యేసు రక్తముద్వారా కొనబడి యాజకులుగా మరియు రాజులుగా “భూలోకమందు ఏలుటకు” పరలోకమునకు తీసుకొనిపోబడు 1,44,000 మందికి సంబంధించినదైయున్నది. (ప్రకటన 1:4-6; 5:9, 10; 20:6) యేసు వారితో చేసిన నిబంధన, వారు అధికారమునందు ఆయనతో చేరునట్లు చేయును. రాజకుటుంబములోని పెండ్లికుమార్తె పరిపాలించుచున్న రాజుతో వివాహబంధము ద్వారా ఏకమై, అలా ఆమెకూడా ఆతని రాజ్యపాలనలో భాగమువహించు స్థానమునకు వచ్చుటవంటి భావమును దీనికొరకును చెప్పవచ్చును.—యోహాను 3:29; 2 కొరింథీయులు 11:2; ప్రకటన 19:7, 8.
21, 22. ఈ నిబంధనలు నెరవేర్చుదానినిబట్టి ఏ ఆశీర్వాదములను అపేక్షించవచ్చును?
21 ఇది విధేయతామానవజాతికి ఏలాంటి ప్రయోజనములకు ద్వారము తెరచును? యేసుగాని 1,44,000మందిగాని, “నిజమైన పరిష్కారములనివ్వలేని,” దయాళువైన ప్రభువులవలెనుండరు. బదులుగా, మనకు “సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను పాపము లేనివానిగా యుండిన” యేసు ప్రధానయాజకుడను అభయమివ్వబడినది. కాబట్టి, ఆయనెందుకు మానవ బలహీనతలయెడల ‘కనికరపడునో,’ అభిషక్తులైన క్రైస్తవుల విషయములో వాస్తవమైనట్లుగానే “వేరే గొర్రెలు” కూడా ఎందుకు “ధైర్యముగా” క్రీస్తుద్వారా దేవుని సింహాసనమును సమీపించగలరో మనము అర్థము చేసుకొనవచ్చును. ఆవిధముగా, వారుకూడా “కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృపాసనము” చేరవచ్చును.—హెబ్రీయులు 4:14-16; యోహాను 10:16.
22 నిబంధనయందున్నవారు యేసుతో రాజులైన-యాజకులుగా భాగమువహించినట్లే మానవజాతి ఆశీర్వాదమందును భాగము వహింతురు. ప్రాచీన లేవీయయాజకులు ఇశ్రాయేలు జనాంగమంతటికి ఎట్లు ప్రయోజనకరమైయుండిరో అట్లే యేసుతో పరలోక సింహాసనముల మీద సేవచేయువారు భూమిమీద జీవించువారందరికి నీతియందు తీర్పుతీర్చుదురు. (లూకా 22:30) ఆ రాజులైన-యాజకులు ఒకప్పుడు మానవులైయుండినందున, వారును మానవజాతి అవసరతలయెడల కనికరముగలవారైయుందురు. సంతానముయొక్క ద్వితీయభాగము, “జనములన్నియు ఆశీర్వదించబడునట్లు” చూచుటయందు యేసుతో సహకరించును.—గలతీయులు 3:8.
23. ఈ నిబంధనలతో సహకరించుటయందు వివిధప్రజలు ఎట్లు ప్రవర్తించవలెను?
23 మానవజాతికివచ్చు ఆశీర్వాదమందు భాగమువహించ ఇచ్ఛయించుచు, దేవుని నిబంధనలనుండి ప్రయోజనము పొందువారందరు, అలాచేయుటకు ఇప్పుడు ఆహ్వానింపబడుచున్నారు. (ప్రకటన 22:17) ఇందుకు, 1990 ఏప్రిల్ 10, మంగళవారము సాయంకాలము సూర్యాస్తమయము తర్వాత ఆచరింపబడు ప్రభురాత్రి భోజనముయొక్క ఆచరణకు హాజరగుట ఒక చర్యయైయున్నది. యెహోవా సాక్షుల సంఘమునందు హాజరగుటకు ఇప్పటినుండే దయచేసి పథకములను వేసికొనుము. అక్కడ నిబంధనలనుగూర్చి మీరు నేర్చుకొందురు, మరియు మీరెట్లు వాటినుండి ప్రయోజనము పొందగలరోకూడా మీరు మరింతగా చూతురు. (w89 2/1)
[అధస్సూచీలు]
a “సాహసోపేతమైన అనేక సంస్కరణలు సహితము బలహీన కర్షకవర్గమును, ప్రత్యేకహక్కులను, పన్నులువేయబడని శ్రీమంతులవర్గమును, ఇటు ప్రభుత్వములోను అటు సమాజములోను సరిగాయిమడలేని మధ్యతరగతివారిని కలుగజేసినవి. . .ప్రకాశవంతమైన రాజరికములు, ఇక అలక్ష్యముచేయలేని ప్రశ్నలనెదుర్కొన ఆరంభించెనని, అవి ఆ యుగ రాజకీయ, ఆర్ధిక వాస్తవరూపములయందు నిజమైన పరిష్కారములనివ్వలేనివిగా యుండెనని తప్పక చెప్పవలెను.”—వెస్ట్రన్ సివిలైజేషన్—ఇట్స్ జెనిసిస్ అండ్ డెస్టిని; ది మోడ్రన్ హెరిటేజ్.
b యేసు నూతననిబంధన పక్షము వాడుకాదు. ఆయన దాని మధ్యవర్తియైయున్నాడు మరియు పాపములు క్షమించబడవలసియున్నవాడు కాదు. అంతేకాకుండా, ఆయన దావీదు నిబంధన ప్రకారము రాజును, మెల్కీసెదెకు క్రమముచొప్పున యాజకుడును గనుక, ఆయన దీనిమూలముగా రాజును-యాజకుడు కావలసిన అవసరత కలదు.
మీకు జ్ఞాపకమున్నవా?
◻ కీర్తన 110:4లో ప్రస్తావించబడిన నిబంధన ఎందుకు చేయబడినది, మరియు అది నెరవేర్చినదేమి?
◻ ఎవరెవరు నూతననిబంధనలో ఉన్నారు, మరియు రాజులును యాజకులునైన జనాంగమును ఉత్పన్నముచేయుటకు అది ఎట్లు సహాయము చేసినది?
◻ యేసు ఎందుకు వ్యక్తిగతముగా తన అనుచరులతో ఒక నిబంధనను చేసెను?
◻ మనము విచారించిన ఏడు నిబంధనలు ఏమైయున్నవి?
[17వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఏదేను నిబంధన ఆదికాండము 3:15
అబ్రాహాము నిబంధన
ధర్మశాస్త్ర నిబంధన
దావీదురాజ్య నిబంధన
మెల్కీసెదెకును పోలిన యాజకునివలె నుండు నిబంధన
ప్రాథమిక సంతానము
ద్వితీయ సంతానము
నిత్య ఆశీర్వాదములు
[19వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఏదేను నిబంధన ఆదికాండము 3:15
అబ్రాహాము నిబంధన
ధర్మశాస్త్ర నిబంధన
నూతననిబంధన
దావీదురాజ్య నిబంధన
మెల్కీసెదెకును పోలిన యాజకునివలె నుండు నిబంధన
ప్రాథమిక సంతానము
పరలోకరాజ్యము కొరకైన నిబంధన
ద్వితీయ సంతానము
నిత్య ఆశీర్వాదములు