కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 2/1 పేజీలు 21-25
  • భర్తగా ప్రేమను మరియు గౌరవమును చూపుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భర్తగా ప్రేమను మరియు గౌరవమును చూపుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రీస్తు—సేదదీర్చు మాదిరి
  • సేదదీర్చు భర్తలుగా మరియు తండ్రులుగా ఎట్లుండవలెను
  • జ్ఞానముచొప్పున కాపురముచేయుట
  • స్త్రీతత్వపు ఘటమును సన్మానించుట
  • నిరంతరం నిలిచే వివాహానికి రెండు కీలకాలు
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • ప్రగాఢ గౌరవాన్ని పొందే భర్త
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • దేవుడు జతపరచినవారిని వేరుచేయకూడదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 2/1 పేజీలు 21-25

భర్తగా ప్రేమను మరియు గౌరవమును చూపుట

“మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమించవలెను.”—ఎఫెసీయులు 5:33.

1, 2. (ఎ) ఈనాడు లోకములో విడాకుల సమస్య ఎంతవిస్తారముగా ఉన్నది? (బి) దానికి భిన్నముగా, ఏ పరిస్థితి ఉనికియందున్నది?

1980 దశాబ్ద మధ్యకాలములో సైకాలజీ టుడే ఈవిధముగా వ్రాసినది: “[అ.సం.రాష్ట్రములలో] ప్రతియేటా పదిలక్షలకంటే ఎక్కువ దంపతులు తాము ఆశించిన సుఖమునకు, ఇప్పుడు విడాకులద్వారా స్వస్తి చెప్పుచున్నారు; అమెరికాలో సగటు వివాహితకాలము కేవలము 9.4సం.లు మాత్రమే. . . .నిజమే, కొన్నిసార్లు సంతోషభరిత వివాహితజీవితమును గడిపినవారే లేనట్లు కన్పించుచున్నది.” (జూన్‌ 1985) పెద్దలను పిల్లలను లెక్కతీసుకొంటే, కేవలము ఒక దేశములోనే ప్రతియేటా దాదాపు లెక్కకు 30 లక్షలమంది ప్రజలు చీలిపోయిన వివాహము ద్వారా ప్రభావితులగుచున్నవారే. అయితే విడాకులనినది ప్రపంచవ్యాప్త సమస్యయైయున్నది, కాగా ఇది లక్షలాది వివాహములలో ప్రేమ మరియు గౌరవముల కొరతను సూచించుచున్నది.

2 మరొక ప్రక్కన, “చూసిచూడనట్లుండవలెననుట వైపుమొగ్గుచూపు వేరొకగుంపు కలదు: ఆ దంపతులు ఏదోఒకవిధముగా కలిసి జీవించుటకు ప్రయత్నింతురు, వారు మరణముతప్ప మరొకటి తమను విడదీయుటకు అనుమతించరు.” (సైకాలజీ టుడే) ఆవిధముగా, తమ వివాహమును కలిపియుంచుకొనుటకు కష్టించిపనిచేయు దంపతులు లక్షలాదిమంది కలరు.

3. మనకైమనము ఏ ప్రశ్నలను అడుగుకొనవచ్చును?

3 మీ వివాహము ఎట్లున్నది? భార్యాభర్తల మధ్య ప్రేమానురాగములు మరియు గౌరవభావము కలదా? మీ కుటుంబములో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమ నెలకొనియున్నదా? లేక కొన్నిసార్లు మీరు కసి, అపనమ్మకములతో సతమతమగువారిగా యుందురా? మనలో ఎవరును పరిపూర్ణులు కారు గనుగ ఏ కుటుంబమునందైనను, అలాగే ప్రతివారును క్రైస్తవునిగాయుండ ప్రయత్నించుచున్న కుటుంబమందును కష్టపరిస్థితులు ఉత్పన్నము కావచ్చును, ఏలయనగా “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు”—రోమీయులు 3:23.

4. సంతోషభరితమైన కుటుంబములో కీలకపాత్ర ఎవరిదని పౌలు మరియు పేతురు సూచించుచున్నారు?

4 ఏ కుటుంబములోనైనను కష్టములు తలెత్తవచ్చునను వాస్తవము దృష్ట్యా, కుటుంబమును సమాధానకరమైన పొందికగల మార్గమున పెట్టుటయందు కీలకపాత్ర ఎవరిదైయున్నది? వారి లేఖలలో కనుగొనబడు సూటియైన సలహానందు అపొస్తలులగు పౌలు మరియు పేతురు దానికి జవాబిచ్చుచున్నారు. పౌలు ఇలా వ్రాసెను: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను.” ఆయనింకను చెప్పినదేమనగా: “క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి. స్త్రీలారా, ప్రభువునకువలె మీ స్వపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు.” (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:21-23) అదే ధోరణిలో, పేతురు ఇలా వ్రాసెను: “అటువలె [క్రీస్తు మాదిరిని అనుకరించుచు] స్త్రీలారా, మీరు మీస్వపురుషులకు లోబడియుండుడి.”—1 పేతురు 2:21–3:1.

క్రీస్తు—సేదదీర్చు మాదిరి

5, 6. శిరసత్వమును నిర్వహించుటలో యేసు క్రీస్తు ఎట్లు ఒక మాదిరియైయున్నాడు?

5 ముందివ్వబడిన సలహాప్రకారము, భర్త కుటుంబమునకు లేఖనానుసారమైన శిరస్సైయున్నాడు. అయితే ఏ భావమునందు ఆయన శిరస్సైయున్నాడు? ఎట్లు శిరసత్వమును నిర్వహించవలెను? ‘తాను ఇంటిపెద్దనని, బైబిలు అలాచెప్పుచున్నదని’ ఒత్తిడిచేయుచు గౌరవమును పొందుట సులభమని కొందరు భర్తలు కనుగొనియుండవచ్చును. అయితే అది క్రీస్తు మాదిరికి సరిపోవునా? క్రీస్తు గర్వముతో తన అనుచరులనుండి గౌరవమును అడిగెనా? “ఇక్కడ దేవుని కుమారుడు ఇంకెవరున్నారు? మీరు నన్ను గౌరవించవలెను,”అని యేసు అహంకారముతో చెప్పిన సందర్భమేదైనా మనము కనుగొనగలమా? దానికి భిన్నముగా, యేసు గౌరవమును సంపాదించెను. ఎట్లు? తన ప్రవర్తనలో, మాటలో, ఇతరులను కనికరముతో చూచుటద్వారా ఆయన మాదిరియుంచెను.—మార్కు 6:30-34.

6 కాబట్టి భర్తగా, తండ్రిగా సరియైనరీతిలో శిరసత్వమును నిర్వహించుటకు యేసు క్రీస్తు మాదిరిననుసరించుట కీలకమైయున్నది. యేసు వివాహితుడు కాకపోయినను, ఆయన తనశిష్యులను చూసినవిధము భర్తలకు మాదిరియైయున్నది. యేసు పరిపూర్ణమాదిరి గనుగ, నిశ్చయముగా అది ఏ భర్తకైనను ఒక సవాలుయైయున్నది. (హెబ్రీయులు 4:15; 12:1-3) అయినను, భర్తయైనవాడు క్రీస్తుమాదిరికి ఎంత చేరువగావచ్చునో, అంత గాఢముగా ఆయన ప్రేమింపబడును మరియు గౌరవము చూపబడును. కాబట్టి, యేసు ఎలాంటి వ్యక్తియో మనము మరింత దగ్గరగా చూద్దాము.—ఎఫెసీయులు 5:25-29:; 1 పేతురు 2:21, 22.

7. యేసు తన అనుచరులకు ఏమి అందించియున్నాడు, మరియు ఏ మూలమునుండి?

7 ఒక సంధర్భములో, యేసు ప్రజలతో ఇట్లనెను: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తమైనవారలారా, నా యొద్దకురండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సుగలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” ఇప్పుడు యేసు వినువారికి ఏమి అందించెను? ఆత్మీయ విశ్రాంతి! అయితే ఏ మూలమునుండి విశ్రాంతి వచ్చును? అంతకుముందే యేసు ఇట్లనెను: “కుమారుడు తప్ప ఎవడును తండ్రిని ఎరుగడు, తాను ఇష్టపడినవానికి కుమారుడు ఆయనను బయల్పరచును.” యేసు తన నిజమైన అనుచరులకు తండ్రిని బయల్పరచుట ద్వారా వారికి విశ్రాంతిని దయచేయునని ఇది సూచించినది. ఆయన “సాత్వికుడును దీనమనస్సుగలవాడును”గనుక, విశ్రాంతి ఆయనతో సహవాసము చేయుటద్వారా వచ్చుననికూడా యేసు మాటలు భావమిచ్చుచున్నవి.—మత్తయి 11:25-30, NW.

సేదదీర్చు భర్తలుగా మరియు తండ్రులుగా ఎట్లుండవలెను

8. ఏ విధములుగా భర్త మరియు తండ్రి సేదదీర్చువాడై యుండవలెను?

8 క్రైస్తవభర్త ఆత్మీయ మరియు వ్యక్తిగత విధానములయందు తన కుటుంబమునకు సేదదీర్చువానిగాయుండవలెనని చూచుటకు యేసు మాటలు మనకు సహాయముచేయును. తన దీనస్వభావ మాదిరి మరియు బోధద్వారా ఆయన పరలోక తండ్రిని ఎరుగుటకు తనకుటుంబమునకు సహాయము చేయుచున్న వాడైయుండవలెను. ఆయన ప్రవర్తన దేవుని కుమారునియొక్క మనస్సును క్రియలను ప్రతిబింబించవలెను. (యోహాను 15:8-10; 1 కొరింథీయులు 2:16) ఆయన ప్రేమగల భర్త, తండ్రి, మరియు స్నేహితుడైయుండునందున, ఆవ్యక్తితో సహవాసముచేయుట కుటుంబములోని వారందరికి విశ్రాంతిని కలుగజేయునదిగా యుండును. ఆయన సమీపించదగిన వానిగాయుండవలెను, అంతేగాని మాట్లాడుటకు సహితము తీరికలేనివానిగా యుండకూడదు. నిజానికి, ఆయన కేవలము వినువానిగాకాక, ఆలకించువాడైయుండుటకు నేర్చుకొనవలెను.—యాకోబు 1:19.

9. కొన్నిసార్లు సంఘమందలి పెద్దలమీద ఏ సమస్య ప్రభావము చూపును?

9 ఇది సంఘపెద్దల మీద వారికుటుంబముల మీద కొన్నిసార్లు ప్రభావమునుచూపు ఒక సమస్యను మనస్సునకు తెచ్చుచున్నది. సాధారణముగా ఒకపెద్ద సంఘ ఆత్మీయ అవసరతలకు హాజరగుటయందు పనిరద్దీని కలిగియుండును. క్రైస్తవకూటములు, పరిచర్య, మరియు కాపరిపని సంబంధముగా ఆయన మంచిమాదిరినుంచవలెను. (హెబ్రీయులు 13:7, 17) ఏదిఏమైనను, కొంతమంది పెద్దలు వాస్తవమందు సంఘముకొరకు తమను పూర్తిగా వినియోగించుకొనిరి. ఆపనిలో వారు తమకుటుంబములను నిర్లక్ష్యముచేసిరి, కొన్నిసార్లు దానిఫలితములు బాధాకరమైనవిగా యుండెను. ఒకపెద్ద తన స్వంతకుమారునితో సహితము పఠనము చేయుటకు తీరికలేని వాడాయెను. దానిని చేయుటకు ఆయన మరొకరిని ఏర్పాటుచేసెను!

10. అటు సంఘములోను ఇటు గృహమందును శిరసత్వమును నిర్వహించుటలో పెద్దలు ఎట్లు సమతుల్యతను కలిగియుండగలరు?

10 ఈ ఉదాహరణ ఏమి నొక్కితెలియజేయుచున్నది? ఒకవ్యక్తి సంఘము మరియు భార్యాపిల్లలయెడల తనకున్న విధులమధ్య సమతూకమును కాపాడుకొను అవసరత ఎంతైనాకలదు. ఉదాహరణకు, కూటముల తర్వాత పెద్దలు తరచుగా కొన్నిసమస్యలను తీర్చుటలో, చర్చలలో మునిగియుందురు. అలాంటప్పుడు, రాజ్యమందిరములో గంటలతరబడి వారు వేచియుండుటకు బదులు, సాధ్యమైతే మరియు అది అభ్యాససిద్ధమైతే తన భార్యాపిల్లలను ఇంటికి తీసుకొనివెళ్ళుటకు ఎవరినైనా ఏర్పాటుచేయుట విశ్రాంతిదాయకముగా ఉండదా? బైబిలు అవసరతల ప్రకారము, ‘కాపరిపని ఇంటియొద్దనే ఆరంభమగునని’ చెప్పవచ్చును. ఒకపెద్ద తనకుటుంబమును నిర్లక్ష్యము చేసినట్లయిన, తన నియామకమునే ప్రమాదములో పడవేసుకొనగలడు. కాబట్టి పెద్దలు శ్రద్ధగలవారై, తనకుటుంబ భావోద్రేక, ఆత్మీయ మరియు ఇతర అవసరతలను పరిగణలోనికి తీసుకొనువారై యుండవలెను.—1 తిమోతి 3:4, 5; తీతు 1:5, 6.

11, 12. ఒక క్రైస్తవభర్త ఎట్లు తనకుటుంబముయొక్క మద్దతును సంపాదించగలడు, మరియు ప్రతి భర్త తనకైతాను ఏ ప్రశ్నలను అడుగుకొనవచ్చును?

11 సేదదీర్చు క్రైస్తవభర్త తనకుటుంబముతో చర్చించకుండా నిర్ణయములను చేయుటయందు క్రూరునిగా లేక నిరంకుశునిగాకూడా ఉండడు. ఉద్యోగమార్పిడి లేక ఇంటినిమార్చు విషయములో లేక అల్పమైన కుటుంబవినోదము విషయములోకూడా బహుశ నిర్ణయము చేయవలసియుండును. కుటుంబమంతయు ప్రభావమునకు లోనగును గనుక, వారందరితో మాట్లాడుట జ్ఞానయుక్తమును, దయాపూర్వకమును కాదా? వారి అభిప్రాయములు ఆయన తెలివైన, మరింత శ్రద్ధాకరమైన నిర్ణయము చేయుటకు సహాయముచేయవచ్చును. అప్పుడు కుటుంబమందలి వారందరు ఆయనకు మద్దతునిచ్చుటకు సులభముగాయుండును.—సామెతలు 15:22, పోల్చుము.

12 ముందు విచారించినదానినుండి, క్రైస్తవభర్త మరియు తండ్రి ఇంటిలో కేవలము క్రమశిక్షణను అమలుపరచు వ్యక్తికాదని రుజువైనది. ఆయన విశ్రాంతిని కలుగజేయువాడునై యుండవలెను. భర్తలారా, తండ్రులారా మీరు క్రీస్తువలెనున్నారా? మీరు మీకుటుంబమునకు సేదదీర్చువారిగా యున్నారా?—ఎఫెసీయులు 6:4; కొలస్సయులు 3:21.

జ్ఞానముచొప్పున కాపురముచేయుట

13. పేతురు ఏ శ్రేష్ఠమైన సలహాను భర్తలకిచ్చుచున్నాడు?

13 ఇంతకుముందే చూసినట్లుగా, పేతురు మరియు పౌలు వీరిద్దరు వివాహితులైన దంపతులకు శ్రేష్ఠమైన సలహాను అందించుచున్నారు. వివాహితుడైయున్నందున పేతురు తన సలహానిచ్చుటలో రెండితలుగా—అనుభవము మరియు పరిశుద్ధాత్మ నడిపింపు—యోగ్యతగలవాడై యుండెను. (మత్తయి 8:14) “పురుషులారా, (భర్తలారా). . .ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మామించి,. . .జ్ఞానముచొప్పున వారితో కాపురముచేయుడి.”అని చెప్పుచు ఆయన భర్తలకు సూటియైన సలహానిచ్చుచున్నాడు. జె. డబ్ల్యు. సి. వాండ్‌ చేసిన తాత్పర్యసహిత భాషాంతరములో ఆ వాక్యము ఇట్లు చదువబడుచున్నది: “భర్తలైనవారు భార్యలతో తమకున్న సంబంధము విషయమై సూక్ష్మబుద్ధితో అదేప్రకారము బైబిలు సూత్రములను తప్పక అన్వయించవలెను.”—1 పేతురు 3:7.

14. ఇప్పుడు ఏ ప్రశ్నలు ఉత్పన్నమగును?

14 “జ్ఞానముచొప్పున” లేక “సూక్ష్మబుద్ధితో క్రైస్తవసూత్రములను అన్వయించి” కాపురముచేయుట అనగా ఇప్పుడు దానిభావమేమైయున్నది? భర్త తనభార్యను ఎట్లు సన్మానింపగలడు? నిజానికి, క్రైస్తవభర్త పేతురు సలహాను ఎట్లు అర్థము చేసుకొనవలెను?

15. (ఎ) కొన్ని వివాహములు ఎందుకు విఫలమగును? (బి) వివాహమందు నిజమైన సవాలు ఏమైయున్నది?

15 అనేక వివాహములు కేవలము భౌతికవిషయముల మీద మరియు లైంగిక ఆకర్షణల మీద ఆధారపడియుండును. అయినను అందముగా కన్పించునవి ఎక్కువకాలము నిలిచియుండవు గనుక, కేవలము వాటిమీద ఆధారపడి శాశ్వతకాల వివాహమునకు అభయమివ్వలేము. వివాహమైన కొన్నిసంవత్సరములకు వారితల తెల్లబడును, వారిచర్మము ముడతలు పడిపోవును. అయితే వివాహమనునది రెండు మనస్సులను, రెండు వ్యక్తిత్వములను, రెండు విభిన్నజీవితములను, రెండు ఆత్మీయవిలువలను, మరియు రెండు భాషలను ఐక్యము చేయునదైయున్నదని గుర్తుంచుకొనుము. అయినను, ధన్యతగల వివాహమునకు దీనిని అర్థముచేసుకొనుట అవశ్యకము.—సామెతలు 17:1; 21:9.

16. ‘జ్ఞానము చొప్పున కాపురముచేయుటయందు’ ఏమి యిమిడియున్నది?

16 ఇతర విషయములతోబాటు, క్రైస్తవభర్త తనభార్యతో “జ్ఞానముచొప్పున కాపురము చేయవలెను, అనగా ఆయన నిజముగా ఆమె అవసరతలనన్నింటిని అర్థము చేసుకొనవలెనని దాని భావమైయున్నది. ఇవి కేవలము ఆమె భౌతికావసరములు కాదు, అయితే మరిప్రాముఖ్యముగా అవి ఆమె భావోద్రేక, మానసిక, మరియు ఆత్మీయావసరతలై యున్నవి. ‘జ్ఞానముచొప్పున ఆమెతో కాపురము చేసినట్లయిన’ తనకొరకు దేవుడు ఏర్పాటుచేసిన పాత్రను ఆయన అర్థము చేసుకొనును. అలాగే ఆయన ఆమె స్త్రీతత్వపు ఘనతను కూడా గౌరవించును. పేతురు జీవించిన కాలమునాటి ఆత్మజ్ఞానవాద సంబంధుల దృష్టికి ఇది పూర్తిగా విరుద్ధమైయుండెను, వారు తమయందలి “స్త్రీలను తక్కువైన, ఐహికమైన, అశుద్ధమైనవారని వారిని ఈసడించుకొనెడివారు.” (ది ఆంకర్‌ బైబిల్‌) ఒక స్పానిష్‌ భాషాంతరమునందు పేతురు మాటలు ఇట్లు చదువబడును: “భర్తల విషయము: స్త్రీ మరింత సున్నితమైన శరీరముగలది గనుక, శ్రద్ధచూపుచు, మీభాగస్వామ్య జీవితమునందు నేర్పును (ఔచిత్యమును) కలిగియుండుము.” (Nueva Biblia Espanola) భర్తలు కొన్నిసార్లు మరచిపోవు చక్కని అంశమునకు ఇది ప్రాధాన్యతనిచ్చుచున్నది.

17. (ఎ) ఇతర విషయములతోబాటు “బలహీన ఘటము”యొక్క “సున్నిత శరీరమందు” ఏమి చేరియున్నది? (బి) తనభార్య ఘనతకు భర్త గౌరవము చూపగల ఒక మార్గమేమైయున్నది?

17 భార్య ఎందుకు “మరింత సున్నితమైన శరీరముగలదై”యున్నది? ఇతర విషయములయందు, ఆమెకు పునరుత్పత్తిచేయు వరము కలదు. ఆమెకుగల పునరుత్పత్తి జీవితము నెలనెలావచ్చు ఋతుక్రమముయొక్క ఆధీనములో ఉండును, కొన్నిరోజులపాటు ఉండే ఈ సమయములో ఆమె కొంతపరిమాణము మేరకు ప్రయాసమునకు (శ్రమకు) లోనగును. దీనిని భర్త లెక్కలోనికి తీసుకొనుటయందు విఫలుడై నెలలోని మిగతారోజులలోవలెనే అదే కోరికను కోరినట్లయిన, అతను ఆమెను సన్మానించుటలో తప్పిపోయిన వాడగును. అలాంటప్పుడు ఆయన జ్ఞానముచొప్పున కాక స్వార్ధఅజ్ఞానముతో ఆమెతో జీవించున్నవాడని చూపించుకొనువాడైయుండును.—లేవీయకాండము 18:19; 1 కొరింథీయులు 7:5.

స్త్రీతత్వపు ఘటమును సన్మానించుట

18. (ఎ) కొంతమంది భర్తలు ఏ ప్రతికూల అలవాటునందు పడిపోవుదురు? (బి) ఒక క్రైస్తవ భర్త ఎట్లు ప్రవర్తించవలెను?

18 భార్యయెడల, ఆమె లక్షణములయెడల గుణగ్రహణను వ్యక్తపరచుట మరియు చూపించుట ద్వారా భర్త ఆమెయెడల గౌరవమును ప్రేమను చూపించవచ్చును, ఇది మరొక మార్గమైయున్నది. భర్త తన భార్యను అవమానపరచు మాటలను పలుకు లేక తన పరిహాసమునకు ఆస్కారమైన వ్యక్తిగాచేయు అలవాటునందు పడిపోవచ్చును. అటువంటి భర్త ఇది తాను మరింత అనుకూల స్థానమందుండుటకు సహాయముచేయునని తలంచవచ్చును. అయితే వాస్తవమేమనగా, దానిఫలితము భిన్నముగాయుండును. ఏలయనగా ఆయన ఎప్పుడును తనభార్యను తెలివితక్కువ దానినిచేయుట (పరిహసించుట) వలన: ఇంత తెలివితక్కువ దానిని ఇతడెందుకు వివాహము చేసుకొనెను? అను ప్రశ్న ఉత్పన్నమగును. నిజానికి, కేవలము భద్రములేని భర్త అలాంటి ఎత్తులకు పాల్పడునట్లుగా కన్పించుచున్నది. ప్రేమగల భర్త తన భార్యను గౌరవించును.—సామెతలు 12:18; 1 కొరింథీయులు 13:4-8.

19. భర్త తన భార్యను అప్రతిష్ఠపాలుచేయుట ఎందుకు సరికాదు?

19 కొన్ని దేశములలో, నమ్రతగాయుండునది అను రూపమున తమభార్యలను అప్రతిష్ఠపాలుచేయుట కలదు. ఉదాహరణకు, జపాను దేశములోని భర్త తన భార్యను “గుసాయి” (Gusai) అను మాటతో పరిచయము చేయును, దీనికి ‘మూఢమతి లేక తెలివితక్కువదని’ భావము. అవతలి వ్యక్తి స్త్రీనిగూర్చి దానికనుబంధముగా మాట్లాడి పరిస్థితిని సమతూకము చేయవలెననుట దీని ఉద్దేశ్యమైయున్నది. క్రైస్తవభర్త ఈవిధముగా పరిచయము చేయుచున్నట్లయిన, అతను పేతురు సలహాయిచ్చినట్లుగా తనభార్యను నిజముగా ‘సన్మానించుచున్నాడా’? మరొక కోణమునుండి విషయమును చూచినట్లయిన, అతను నిజముగా తన పొరుగువ్యక్తిని గూర్చి సత్యము మాట్లాడుచున్నాడా? తనభార్య తెలివితక్కువదని అతను నిజముగా నమ్ముచున్నాడా?—ఎఫెసీయులు 4:15, 25; 5:28, 29.

20. (ఎ) భార్యభర్తల మధ్య ఏ భిన్నస్వభావము వృద్ధిచెందవచ్చును? (బి) దానిని ఎట్లు తప్పించుకొనవచ్చును?

20 కేవలము రాజ్యమందిరములోనేకాదు ఇంటియొద్దనైనను లేక మరేసందర్భములోనైనను తనభార్య తన క్రైస్తవసహోదరియను విషయమును మరచిపోవుటద్వారా భర్త కొన్నిసార్లు ప్రేమ గౌరవములను చూపించ కొరతను కలిగియుండవచ్చును. రాజ్యమందిరములో దయగా, మర్యాదగా మాట్లాడి ఆపైన ఇంటిలో కఠినముగా, మొరటుగా యుండుట ఎంత సులభము! కాబట్టి పౌలు సలహా ఎంత సరియైయున్నది! ఆయనిట్లు వ్రాసెను: “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయువాటినే ఆసక్తితో అనుసరింతము.” “తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైనదానియందు అతని సంతోషపరచవలెను.” (రోమీయులు 14:19; 15:2) భార్య లేక భర్తనుమించి సన్నిహితుడైయుండు పొరుగువాడు ఎవరునులేరు.

21. తమ భార్యలను ప్రోత్సహించుటకు భర్తలు ఏమి చేయవచ్చును?

21 కాబట్టి, ప్రేమగల క్రైస్తవభర్త తన మాటలు మరియు క్రియలద్వారా తనభార్యయెడల ప్రశంసను కనబరచును. ఒక అజ్ఞాతకవి ఇలా వ్రాసెను:

“వివాహ తగవుల బాధ్యతల మధ్యను

శ్రమలు జీవిత కర్తవ్యములున్నను

నీ ప్రియభార్య నీకు అమూల్యమని నీవు ఎంచితే—

అలా అని ఆమెకు చెప్పు! . . .

నీవు తనవాడివి తనవాడివి మాత్రమే;

ఆమె నీస్వంతమని నీకును తెలుసులే;

దానిని రాతిమీద చెక్కుటకు వేచియుండకుము—

అలా అని ఆమెకు చెప్పు!”

ఈ మనోభావములను ప్రాచీనకాలములోని రాజైన లెమూయేలు తల్లి స్పష్టముగా బలపరచినది. ఆదర్శవంతమైన భార్యను ఆమె కొంతభాగము ఇలా వర్ణించినది: “ఆమె కుమారులు ఏకస్వరముతో ఆమెను ధన్యురాలందురు; ఆమె భర్తకూడా ఆమె విషయమై అట్లనుచూ, ‘అనేకమంది స్త్రీలు ఆమె ఎంత సమర్ధురాలో చూపించుచున్నారని; అయితే ఆమె వారందరిని మించినదని,’ ఆమెను కొనియాడును.” (సామెతలు 31:1, 28, 29, ది న్యూ ఇంగ్లీషు బైబిల్‌) భర్తలారా, మీభార్యలను మీరు క్రమముగా కొనియాడుచున్నారా, లేక కేవలము మరులుగొల్పుటకు మాత్రమే మీరలా చేయుచున్నారా?

22, 23. దేనిమీద విజయవంతమగు వివాహము ఆధారపడియున్నది?

22 కేవలము జీతమును ఇంటికితెచ్చుట మాత్రమే సరిపోదు, అయితే భర్త తన వివాహమునకు ప్రేమను గౌరవమును చూపించువాడైయుండవలెనని ఈ క్లుప్తవిచారణ ద్వారా రుజువైనది. వివాహజీవిత విజయము ప్రేమ, యథార్థత, మరియు శ్రద్ధాపూర్వక సంబంధముల మీద ఆధారపడియుండును. (1 పేతురు 3:8, 9) భార్యాభర్తలిద్దరు ప్రతివారి విలువలను గుణగ్రహించుచు, బలపరచుకొంటూ, వారివారి బలహీనతలను చూసిచూడనట్లుండుటకు మరియు క్షమించుటకు నేర్చుకొనుచుండగా సంవత్సరములు గడచుకొలది వారి సంబంధము మరింత గాఢమగును.—ఎఫెసీయులు 4:32; కొలస్సయులు 3:12-14.

23 ప్రేమను, గౌరవమును చూపించుటలో భర్త నాయకత్వము వహించినట్లయిన, యావత్‌ కుటుంబము ఆశీర్వదించబడును. అయితే ధన్యతగల కుటుంబములో క్రైస్తవభార్య ఏ పాత్ర వహించవలెను? మా ఏప్రిల్‌నెల సంచిక దానిని దానిసంబంధ ప్రశ్నలను చర్చించును. (w89 5/15)

మీరు జ్ఞప్తికి తెచ్చుకొందురా?

◻ సంతోషభరిత వివాహమందు కీలకపాత్ర ఎవరిదైయున్నది, మరియు ఎందుకు?

◻ భర్తలు ఎట్లు క్రీస్తుసేదదీర్చు మాదిరిని అనుకరించగలరు?

◻ సంఘ మరియు కుటుంబ బాధ్యతల మధ్య ఏ సమతుల్యత అవసరము?

◻ భర్త ‘జ్ఞానముచొప్పున తన భార్యతో ఎట్లు కాపురము’ చేయగలడు?

◻ ‘బలహీన ఘటముగా భార్యను సన్మానించుట’ అనగా దాని భావమేమి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి