నిజమైన సౌందర్యమును నీవు పెంపొందించుకొనవచ్చును
చూపులకు అందముగానుండు విషయములో బైబిల్ స్త్రీలకును, పురుషులకును సలహాలు కలిగియున్నది. అది పురుషులకిట్లు వ్రాయుచున్నది: “యవనస్థుల బలము వారికి అలంకారము.” (సామెతలు 20:29) అవును, యవనస్థులకున్న శక్తి మరియు బలము చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. కానీ, వారి యౌవన బలము క్షీణించినప్పుడేమి జరుగును? బైబిలు సామెత చెప్పునదేమనగా: “నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము. అది నీతి ప్రవర్తనగలవానికి కలిగియుండును.” (సామెతలు 16:31) నీతి అంతరంగ సౌందర్యపు ఒక దృక్కోణము. ఒక యౌవనస్థుడు దానిని పెంపొందించుకొనినట్లయితే తన ఆకర్షిత యౌవన సౌందర్యమును కోల్పోవునప్పుడును అది మాత్రము నిలిచియుండును.
స్త్రీలనుగూర్చి బైబిలిలా చెప్పుచున్నది: “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.” (సామెతలు 31:30) అందముగల యౌవనసౌందర్యవతి ఒక మనోహరమైన సహవాసిగానుండును. అయితే, భౌతిక సౌందర్యము వెనుక వేషధారణ మరియు స్వార్థచింతన దాగియున్నట్లయిన అప్పుడేమి? అది కేవలము బాహ్యసౌందర్యము మాత్రమే అయివుండి అంతరంగ చెడురూపమును కప్పిపుచ్చును. అందము వాడిపోయినప్పుడు ఏమి మిగిలియుండును? ‘యెహోవాయందు గల భయము’ను బట్టి పుట్టిన వాడబారని అంతరంగ సౌందర్యము బాహ్యసౌందర్యముతో సమముగా ఉన్నట్లయిన అది ఎంత మంచిగానుండును!
వ్యక్తిత్వములో మార్పు
ఈ అంతరంగ సౌందర్యమును పెంపొందించుకొనుట సాధ్యపడేదేనా? సాధ్యపడగలదు. నిజానికి క్రైస్తవులకిది తప్పనిసరియై యున్నది. దేవుడు నిజమైన అందమును లెక్కించును. “దేనికాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు.” (ప్రసంగి 3:11 రివైజ్డ్ డర్డ్ వర్షన్) అంతరంగమందలి చెడు లక్షణములను ఎవరి ప్రవర్తన బహిర్గతముచేయునో వారి ఆరాధనను దేవుడు అంగీకరించడు.
అపొస్తలుడైన పౌలు కొలస్సయులకు వ్రాసిన మాటలలో అంతరంగ సౌందర్యమును పెంపొందించుకొను అవశ్యకతను గూర్చి సూచించెను. మొదట ఆయన వారికి బుద్ధి చెప్పుచూ, “ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో నొకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా విసర్జించుడి.” అవును, అట్టి వికారచేష్టలు చేయువారెవరైనను, దేవునికి మరియు సరియైన ఆలోచన కలిగిన మానవులకు అసహ్యకరముగానుందురు. ఆ తరువాత, పౌలు కొనసాగించుచూ యిట్లనుచున్నాడు: “జ్ఞానము కలుగునిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొనుడి.” (కొలస్సయులు 3:8-10) దేవుని చిత్తమునకు అనుగుణ్యమైన భావములను, ఆలోచనలను మనము ‘ధరించుకొనవలెను’. ఈ “నూతన స్వభావము”ను ఏ లక్షణములు సూచించును?
క్రైస్తవ లక్షణములు
ఆ నూతన స్వభావమును కలుగజేయు అనేక అందమైన లక్షణములను బైబిలు పేర్కొంటున్నది. కానీ, అంతరంగ సౌందర్యమునకు నిజమైన ఆధారము యేసు మాటలలో వివరించబడినది. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” (మత్తయి 22:37-39) దేవుని యెడల మనకు గల ప్రేమ మనము ఆయనను సంతోషపరచు వ్యక్తిగా ఉండుటకు నడిపించును. అటువంటి ప్రేమ ఆయనను గురించి ఇతరులతో మాటలాడుటకును, తద్వారా తమ సృష్టికర్తను వారు ఎరుగునట్లు సహాయముచేయుటకును మనలను కదలించును.—యెషయా 52:7.
నూతన వ్యక్తిత్వమును తయారుచేయు కొన్ని ఇతరలక్షణములను గూర్చి అపొస్తలుడైన పౌలు వివరించుచున్నాడు: “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టివాటికి విరోధమైన నియమమేమియులేదు.”—గలతీయులు 5:22, 23.
వీటితోపాటు బైబిలు భర్తలకిట్లు ప్రత్యేకముగా చెప్పుచున్నది: “క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. . .భర్తలారా, క్రీస్తు సంఘమును ప్రేమించి దానికొరకు తన్నుతాను అప్పగించుకొనినట్లుగా మీరును మీ భార్యలను ప్రేమించుడి.” (ఎఫెసీయులు 5:23, 27) మరియు బైబిలు భార్యలకు చెప్పునదేమనగా: “స్త్రీలారా, ప్రభువునకు వలె మీస్వంత పురుషులకు లోబడియుండుడి. . .భార్యయైతే తనభర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసీయులు 5:22, 33) భర్త తనబాధ్యతలను నిస్వార్థముతోను, ప్రేమతోను, మరియు సహనముతోను నిర్వర్తించినట్లయిన ఆ కుటుంబమెంత ఆకర్షణీయముగా ఉండును! విమర్శల వర్షము కురిపించకుండా, పోటీపడకుండా, ప్రేమతో మద్దతునిస్తూ తన అంతరంగ సౌందర్యమును భార్య కనబరచినప్పుడు, ఆ భర్త తన పాత్ర నెంత తేలికగా నిర్వహించగలడు! అటువంటి పరిస్థితుల మధ్య కుటుంబజీవితము, నిజముగా సంతోషదాయకముగా నుండగలదు.
ఇంతకుముందున్న శీర్షికలో చెప్పబడిన ఉదాహరణములో ఈ లక్షణములలో కొన్ని పనిచేయుట చూపబడినవి. సొలొమోను ఐశ్వర్యము కొరకు తన ప్రేమికుని విడనాడనందువలన షూలేమీయురాలు స్థిరత్వమును మరియు తన కాపరి ప్రేమికుని యెడల లోతైన ప్రేమను కనపర్చినది. తనయజమానుడైన పోతీఫరుకు వ్యతిరేకముగా పాపముచేయకుండుటవలన యోసేపు అత్యంత అంతర్గత మంచితనమును కనపర్చెను. పోతీఫరు భార్య బలవంతము చేసినప్పుడు ఆ ప్రదేశమును వీడుటద్వారా అతడు ఆశానిగ్రహమును కనపర్చెను. అతని జీవితమున చెడుచేయు అనేక దుర్ఘటనలను తిరస్కరించుటద్వారా ఆయన సాత్వికము, సమాధానము, మరియు దీర్ఘశాంతము కనపర్చుటలో మాదిరి యాయెను.
వికారమైన లోకములో అందము
అటువంటి అందమైనలక్షణములు నేడు అభ్యాసయోగ్యమేనా? అనేకమంది అట్లు తలంచరు. దానికి బదులుగా, వారు స్వార్థచింతనకులోనై తాము నివసించుచున్న లోకమునకు అనుగుణ్యముగా కఠినహృదయమునలవర్చుకొందురు. వారు జీవించవలెనంటే మూర్ఖముగాను, ఆశబోతులుగాను, అన్నివిషయములలో తామేముందుగా నుండవలెననియు మరియు తాము పొందినవన్నియు అందుకొను లోభులుగాను ఉండవలెనని భావింతురు.
దీనికి విరుద్ధముగా, బైబిలిట్లు ప్రోత్సహించుచున్నది: “కక్షచేతనైనను, వృధాతిశయముచేతనైనను, ఏమియుచేయక వినయమైన మనస్సుగలవారై ఒకనికొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును స్వంతకార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను.” (ఫిలిప్పీయులు 2:3, 4) సహజముగా మానవులు ఈ మేలైన సలహా పాటించనందువలననే ఈ మానవసమాజము అంతకంతకు చెడిపోవుచున్నది.
ఇంకా ఈ లోకములో ఒకవ్యక్తియొక్క విజయమును, అతనికున్న సంపద మరియు స్థానమునుబట్టి కొలుతురు. ఒక ధనికుడు విజయవంతమైన వ్యక్తిగా ఎంచబడును. ఏమైనను, నిజమైన విలువల విషయములో ఒకడు ధనికుడా లేక పేదవాడా అనునది అంతప్రాముఖ్యమైనది కాదు. నిజముగా, సంపద దానికి సంబంధించిన అపాయములను కలిగియున్నది. బైబిలిట్లు చెప్పుచున్నది: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను, అవివేక యుక్తములును హానికరమైన అనేక దురాశలలోను పడుదురు.” ఇంకా అది ఇట్లనుచున్నది: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.”—1 తిమోతి 6:9, 10.
బహుశ, స్వార్థము, లోభత్వము, సంపదను విస్తరించుకొనువారు మరియు మొండితనము గలప్రజలు తరచుగా తాత్కాలిక “విజయమును” నేడు పొందవచ్చును. కానీ, అది నిజమైన విజయము కాదు. ఎందుకంటే అటువంటి వికారమైన జీవనవిధానము వలన కలుగు—ఒక సమ్మతముకాని వ్యక్తిత్వము, విరిగిన వివాహములు, అనారోగ్యము మరియు సహజనిరాశ—మిక్కిలి వ్యయమగు జీవనమైయున్నది. మానవుడు దేవుని స్వరూపమందు సృజింపబడినవాడు గనుక దేవుడు అతనిలో సహజముగా పెట్టిన లక్షణములకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుచున్నంతకాలము తాను నిజమైన వ్యక్తిగత ఆనందమును పొందలేడు.—ఆదికాండము 1:27.
అంతర్గత సౌందర్యమును పెంపొందించుకొనుట
అయితే మనమెట్లు ఈ లోకపు చెడు ప్రభావమునెదుర్కొని గౌరవప్రదమైన దేవుని లక్షణములను పెంపొందించుకొనగలము? పౌలు ఈ లక్షణములను పేర్కొంటు, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు అశానిగ్రహము” అను వాటిని “ఆత్మీయఫలములు”గా పిలిచెను. (గలతీయులు 5:22, 23) గనుక ఈ అందమైన అంతర్గత లక్షణములను అలవరచుకొనవలెనంటె మనకు దేవుని ఆత్మ అవసరమైయున్నది.
ఎట్లు? సరే, దేవుని ఆత్మతో ప్రేరేపింపబడిన బైబిలును చదువుటద్వారా అది మనలోనున్న ఈ లక్షణములను గుర్తించి వాటిని మనలో బలపరచుకొను ఆశను పెంపొందించును. (2 తిమోతి 3:16) అటువంటి పథకములో సహాయముచేయుటకు యెహోవాసాక్షులు ఎల్లప్పుడు ముందుకు వచ్చుదురు. ఎందుకనగా ప్రజలకు బైబిలుచదువుటలో సహాయపడుట వారి పరిచర్యలో భాగమని వారు తలంచుదురు. యథార్థమైన స్వయంపరీక్ష మనమెక్కడ తప్పిపోవుచున్నామో కనుగొనుటకు సహాయపడును. ఆ విషయములో దేవుని ఆత్మ సహాయముకొరకు మనము ప్రార్థించవచ్చును. దేవుని ఆరాధించు తోటివారితో మనము సహవసించుట ద్వారా అది మనకవసరమైన స్నేహితుల మద్దతునిచ్చును. కాగా ఇక్కడ కూడా దేవుని ఆత్మ మనకు సహాయముచేయును. ఏలయనగా “ఇద్దరుముగ్గురు ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారిమధ్యన ఉందునని” యేసు చెప్పెను.—మత్తయి 18:20.
ముందున్న అందమైన ప్రపంచము
సాధారణముగా, మన అసంపూర్ణతను మనమెవరము సంపూర్ణముగా అధికమించలేము. అయితే ఈ అంతర్గత సౌందర్యమును మనము పెంపొందించ కృషిసల్పినట్లయిన దేవుడు మన ప్రయత్నములను ఆశీర్వదించును. మరియు ఆయన అద్భుతకరమైన రీతిలో మనకు ప్రతిఫలమిచ్చును. ఇప్పుడున్న దానికి పూర్తిగా విరుద్ధమైన నూతన విధానమును శీఘ్రముగా తెచ్చుట దేవుని సంకల్పమని బైబిలులో మనకు వ్రాయబడియున్నది. దానిలో, “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) యేసు తానే యిట్లు చెప్పెను: “సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.”—మత్తయి 5:5.
ఆ సమయములో చూపులకు వికారము కలిగించు పోటీపడు స్వభావము, ఈ విధానపు స్వార్థచింతల స్థానములో అందమైన ప్రశాంతత, నెమ్మది నెలకొల్పబడును. “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు; నాశనముచేయదు, సముద్రము జలముతో నిండియుండునట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును.” (యెషయా 11:9) నిజముగా, దేవుడు “వారి కన్నుల ప్రతిబాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనయైనను యిక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:4.
అటువంటి పరిస్థితులు కోరదగినవైనట్లున్నవా? అప్పుడు భూమిపై నివసించు మానవులు దేవునియెడల మరియు పొరుగు వారియెడలగల ప్రేమపై ఆధారపడిన అంతరంగ సౌందర్యమును కలిగియుందురు గనుకనే అవి సాధ్యము. మరియు ఆయనను ఇప్పుడు సేవించుచు, ఆయన కట్టడలను అనుసరించగట్టిగా పోరాడుచు, “నూతనస్వభావమును” ధరించుకొనువారు అట్టి వాగ్ధాన నెరవేర్పులను చూచెదరని దేవుడు ప్రమాణము చేయుచున్నాడు. అందముగా కనబడుట, శారీరక సౌందర్యము ఎన్నటికిని అట్టి ఆశీర్వాదములను తీసుకురాలేవు. కాబట్టి సరైన ఆలోచనగల మానవులను, స్వయంగా దేవునిని సంతోషపరచు దీర్ఘకాలము నిలచునట్టిదియు మరియు సంపన్నవంతమునైన అంతరంగ సౌందర్యమును అభివృద్ధిచేసికొనుటకు ఎంతమంచి కారణము కలదు! (w89 2/1)
[6వ పేజీలోని చిత్రాలు]
శారీరక ఆకర్షణ గలప్రజలు స్వార్థమును, తప్పులుచేయుటను విడనాడవలెను. దానికి బదులుగా దేవుని సంతోషపరచు అంతరంగ సౌందర్యమును పెంపొందించుకొనవలెను