“దేవుని వాక్యము సజీవమును బలము గలదైయున్నది”
1, 2. (ఎ)క్రైస్తవులుగా తయారయినవారి జీవితములలో మార్పులకు ఏది కారణమగుచున్నది? (బి) బైబిలు ఒక వ్యక్తిమీద ఎంత గాఢముగా ప్రభావము చూపగలదు?
సా.శ. మొదటి శతాబ్ద అర్థభాగమున, రోమాలోవున్న క్రైస్తవ సంఘమునకు అపొస్తలుడైన పౌలు ఒక లేఖను వ్రాసెను. అందు నిజమైన క్రైస్తవులు మార్పులు చేసుకొను అవసరత కలదని ఆయన నొక్కి తెలియజేసెను. ఆయనిట్లనెను: “మీరు ఈలోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:2) యేసు అనుచరుల ఆలోచనా విధానమునే సవరించుచు, వారిని మార్చునది ఏమైయున్నది? ప్రధానముగా, అది దేవుని వాక్యమగు బైబిలు శక్తియైయున్నది.
2 పౌలు యిలా వ్రాసినప్పుడు మనమీద బైబిలు ప్రభావము ఎంత గాఢముగా ఉండునో చూపించెను: “దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (హెబ్రీయులు 4:12) అవును, ప్రజలలో అటువంటి మార్పులను తెచ్చు అసాధారణమైన బైబిలు శక్తి, అది కేవలము మానవ వాక్యము కంటే ఎక్కువైనదని సమ్మతింపజేయు నిరూపణయైయున్నది.
3, 4. క్రైస్తవుల వ్యక్తిత్వములు ఎంత విస్తారముగా మార్పు చెందినవి?
3 రోమీయులు 12:2లో “రూపాంతరము పొందుడి” అని భాషాంతరము చేయబడిన పదము మెటామోర్‌ఫూ అను గ్రీకు పదమునుండి వచ్చినదైయున్నది. గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరము పొందుటకు పోలికగా, యిది సంపూర్ణ మార్పును సూచించుచున్నది. అది ఎంత సంపూర్ణమంటే, దానిని బైబిలు ఒకని వ్యక్తిత్వమే మారిపోవుట అని మాట్లాడుచున్నది. మరొక బైబిలు వచనమందు మనమిట్లు చదువుదుము: “ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానముకలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.”—కొలొస్సయులు 3:9, 10.
4 కొరింథు సంఘమునకు వ్రాయుచు, మొదటి శతాబ్దములో విస్తారముగా జరిగిన వ్యక్తిత్వమార్పులనుగూర్చి పౌలు చూపించెను. ఆయనిట్లనెను: “జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనముగలవారైనను, పురుషసంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, . . . మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిరి.” (1 కొరింథీయులు 6:9-11) అవును, అవినీతిపరులు, పోట్లాడువారు, దొంగలు, త్రాగుబోతులు మాదిరికరమైన క్రైస్తవులుగా రూపాంతరము పొందిరి.
ఈనాటి వ్యక్తిత్వ మార్పులు
5, 6. బైబిలు శక్తిద్వారా ఒక యౌవనస్థుని వ్యక్తిత్వమెట్లు సంపూర్ణముగా మారిపోయినది?
5 అదేవిధమైన వ్యక్తిత్వ మార్పులను ఈనాడును చూడవచ్చును. ఉదాహరణకు, దక్షిణ అమెరికాలో ఒక యౌవనుడు తన తొమ్మిది సంవత్సరముల వయస్సునందే అనాధగా విడువబడెను. తలిదండ్రుల నడిపింపులేని వానిగా అతడు తీవ్రమైన వ్యక్తిత్వ సమస్యలను పెంపొందించుకొనెను. ఆయన యిలా అంటున్నాడు: “నేను 18 సంవత్సరముల వాడనగునప్పటికి పూర్తిగా మాదక ద్రవ్యములకు బానిసనై, ఆ అలవాటు కొరకు దొంగతనముచేసి అప్పటికే కొంతకాలము జైలులో గడిపాను.” యెహోవా సాక్షియైన అతని ఆంటి ఒకరు, చివరకు అతనికి సహాయపడగలిగినది.
6 ఆ యౌవనుడు యిప్పుడిలా వివరించుచున్నాడు: “మా ఆంటి నాతో బైబిలును పఠించుటకు ఆరంభించినది, అలా ఏడు నెలలు గడిచేటప్పటికి నేను ఆ మాదక ద్రవ్య అలవాటునుండి తప్పుకోగలిగాను.” అతడు తన పాత స్నేహితులనుకూడ వదులుకొని యెహోవా సాక్షులమధ్య క్రొత్త సహవాసులను కనుగొనెను. ఆయన యింకను యిట్లనుచున్నాడు: “ఈ క్రొత్త సహవాసులు, అలాగే నా క్రమ బైబిలు పఠనము, నేను అభివృద్ధిచెంది చివరకు నా జీవితమును సమర్పించుకొని దేవుని సేవచేయుటకు నన్ను శక్తివంతుని చేసినది.” అవును, ఒకప్పుడు మాదక ద్రవ్యములకు బానిస మరియు దొంగగావున్న వ్యక్తి, యిప్పుడు పరిశుభ్ర నడవడిగల క్రైస్తవుడై యున్నాడు. ఆ సంపూర్ణ మార్పు ఎట్లు కలిగినది? బైబిలు శక్తి మూలముగానే.
7, 8. బైబిలు సహాయముద్వారా కష్టతరమైన వ్యక్తిత్వ సమస్య ఒకటి ఎట్లు పరిష్కరింపబడినదో వివరింపుము.
7 మరియొక ఉదాహరణ దక్షిణ ఐరోపానుండి వచ్చుచున్నది. అక్కడ యువకుడైన ఒకవ్యక్తి కష్టతరమైన వ్యక్తిత్వపు సమస్యతో పెద్దవాడయ్యెను: బహు ముక్కోపిగా అతడు తయారయ్యెను. ఎప్పుడు అతడు పోట్లటలయందు మునిగియుండెడివాడు. ఒకసారి కుటుంబములో వాదన జరిగినప్పుడు, అతడు కోపముతో తండ్రి అనికూడ చూడకుండ అతని స్పృహ తప్పేట్లు కొట్టాడు! ఏమైతేనేం, చివరకు యితను యెహోవా సాక్షులతో బైబిలును పఠించి, రోమీయులకు వ్రాసిన పత్రికలో దేవుని ఆజ్ఞయిలా ఉండడాన్ని అతడు గమనించాడు: “కీడుకు ప్రతికీడెవనికి చేయవద్దు. . . . శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, . . . ఉగ్రతకు చోటియ్యుడి.”—రోమీయులు 12:17-19.
8 తన బలహీనత ఎంత చెడ్డదో గ్రహించుటకు ఆ మాటలు అతనికి సహాయపడినవి. పెరుగుచున్న బైబిలు జ్ఞానము అతని మనస్సాక్షిని శుద్ధిచేసెను, కాగా అది అతను ఈ ముక్కోపమును లోబరచుకొనుటకు సహాయపడినది. తన పఠనమందు అతడు కొంత అభివృద్ధి సాధించిన తర్వాత, ఒకసారి ఒకక్రొత్తవాడు అవమానకరముగా యితనిమీద కేకలు వేసెను. అప్పుడు అతనిలో పూర్వపు కోపము ఉబికి వచ్చినది. అయితే అతను దానివిషయమై సిగ్గుపడెను; కాగా యిది అతడు తన కోపమును అణచుకొనుటకు సహాయపడినది. ప్రాముఖ్యమైన ఆత్మఫలమగు ఆశానిగ్రహమును అతడు వృద్ధిచేసుకొనెను. (గలతీయులు 5:22, 23) యిప్పుడు అతని వ్యక్తిత్వము మరొక రకముగా ఉన్నది, దేవునివాక్య శక్తికి కృతజ్ఞతలు.
9. పౌలు ప్రకారము దేనిద్వారా మన వ్యక్తిత్వము మారినది?
9 అంత శక్తివంతమైన ప్రభావమును బైబిలు ఎట్లు ఉత్పన్నము చేసినది? కొలొస్సయులకు 3:10లో పౌలు, ఖచ్ఛితమైన జ్ఞానముద్వారా మన వ్యక్తిత్వములు మారినవని చెప్పెను, కాగా ఆ జ్ఞానమును బైబిలునందు కనుగొనవచ్చును. అయితే జ్ఞానము ప్రజలను ఎట్లు మార్చును?
ఖచ్ఛితమైన జ్ఞానముయొక్క పాత్ర
10, 11. (ఎ) బైబిలును మనము పఠించినప్పుడు కోరదగిన మరియు కోరదగని గుణలక్షణములనుగూర్చి ఏమి నేర్చుకొందుము? (బి) మన వ్యక్తిత్వమార్పుమీద ప్రభావము చూపుటకు జ్ఞానమునకు తోడుగా యింకా ఏమి అవసరము?
10 మొదట, విడిచిపెట్టవలసిన కోరదగని గుణలక్షణములను బైబిలు గుర్తించుచున్నది. వీటిలో, “అహంకారదృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపుచేతులును, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును, లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు, అన్నదమ్ములలో జగడము పుట్టించుటయు,” అను సంగతులు చేరియున్నవి. (సామెతలు 6:16-19) రెండవది, మనము పెంపొందించుకొనవలసిన కోరదగిన లక్షణములను బైబిలు వివరించుచున్నది. వీటిలో, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” చేరియున్నవి.—గలతీయులు 5:22, 23.
11 ఒక నిష్కల్మషమైన వ్యక్తి తాను ఏ వ్యక్తిత్వ లక్షణములను పెంపొందించుకొనవలసిన అవసరత కలదు, మరియు వేటిని తీసివేయుటకు పనిచేయవలెనను దానిని చూచుటకు మరియు తనను పరీక్షించుకొనుటకు అటువంటి ఖచ్ఛితమైన జ్ఞానము, సహాయము చేయును. (యాకోబు 1:25) అయినను, అది కేవలము ఆరంభము మాత్రమే. జ్ఞానమునకు తోడుగా, మారవలెనని అతడు కోరునట్లుచేయుటకు కదిలించగల ప్రేరణయు అవసరము. యిక్కడ మరలా, అతనికి బైబిలునుండి ఖచ్ఛితమైన జ్ఞానము అవసరము.
మంచిగాయుండుటకు కదిలింపబడుట
12. దేవుని వ్యక్తిత్వమునుగూర్చిన జ్ఞానము మారుటకు మనకెట్లు సహాయము చేయును?
12 కోరదగిన నవీన స్వభావము “సృష్టించినవాని పోలిక చొప్పున” మార్చబడినదని పౌలు చెప్పెను. (కొలొస్సయులకు 3:10) కాబట్టి క్రైస్తవ వ్యక్తిత్వము దేవుని స్వంత వ్యక్తిత్వమును పోలియుండవలెను. (ఎఫెసీయులు 5:1) బైబిలుద్వారా దేవుని వ్యక్తిత్వము మనకు బయల్పరచబడినది. మానవజాతితో ఆయన వ్యవహారములను మనము చూచుటయే కాకుండ, ఆయన శ్రేష్ఠమైన లక్షణములగు ప్రేమ, దయాళుత్వము, మంచితనము, కరుణ, మరియు నీతిని మనము గమనించవచ్చును. అటువంటి జ్ఞానము దేవుని ప్రేమించుటకు, దేవుడు అంగీకరించు వ్యక్తిగావుండ కోరుటకు సహృదయముగల వ్యక్తిని నడిపించును. (మత్తయి 22:37) ప్రియమైన పిల్లలుగా మనము మన పరలోకపు తండ్రిని ప్రీతిపరచగోరుదుము, కాబట్టి మన బలహీనత మరియు అసంపూర్ణ స్థితియందును సాధ్యమైనంత మేరకు ఆయన వ్యక్తిత్వమును అనుకరించ ప్రయత్నింతుము.—ఎఫెసీయులు 5:1.
13. ‘నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుటకు’ ఏ జ్ఞానము మనకు బోధించును?
13 మంచి వ్యక్తిత్వ లక్షణములు మరియు చెడు లక్షణములు ఈ రెండును ఎక్కడికి నడిపించునో తెల్పు బైబిలు జ్ఞానముద్వారా మన ప్రేరణ బలపరచబడును. (కీర్తన 14:1-5; 15:1-5; 18:20, 24) తన భక్తి విషయమై మరియు నీతివిషయమైన ప్రేమకొరకు దావీదు ఆశీర్వదించబడెననియు, అయితే ఆశానిగ్రహము కోల్పోవుట వలన బాధపడెననియు మనము నేర్చుకొందుము. సొలొమోను చక్కని లక్షణములు తన వృద్ధాప్యమందు చెరచబడుటవలన కలిగిన దుఃఖకర ఫలితమును మనము చూచెదము. అహాబు బలహీనత, మనష్షే మూర్ఖ మత భ్రష్టతయొక్క విపత్కర ప్రభావములకు భిన్నముగా యోషీయా మరియు హిజ్కీయాల నీతి ఫలితముగా ఆశీర్వాదములు వచ్చెను. (గలతీయులు 6:7) ఆ విధముగా మనము ‘నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుటకు’ నేర్చుకొందుము.—హెబ్రీయులు 1:9; కీర్తన 45:7; 97:10.
14. లోకముయెడల దానియందలి ఆయావ్యక్తులయెడల యెహోవా సంకల్పములు ఏమైయున్నవి?
14 దేవుని సంకల్పములను గూర్చిన ఖచ్ఛితమైన జ్ఞానముద్వారా ఈ ప్రేరణ మరి ఎక్కువగా బలపరచబడును. అటువంటి జ్ఞానము, మన తలంపులను క్రియలను కదిలించు ఆత్మయగు ‘చిత్తవృత్తినే’ మార్చుకొనుటకు సహాయము చేయును. (ఎఫెసీయులు 4:23, 24) బైబిలును చదివినప్పుడు, యెహోవా ఎల్లకాలము దుష్టత్వమును సహించడని మనము నేర్చుకొందుము. త్వరలోనే ఈ అవినీతికర లోకమును నాశనముచేసి, ‘నీతి నివసించు ఒక క్రొత్త ఆకాశమును, ఒక క్రొత్త భూమిని’ ఆయన తెచ్చును. (2 పేతురు 3:8-10, 13) ఈ నూతన లోకములో ఎవరు నివసింతురు? “యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు; విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”—సామెతలు 2:21, 22.
15. యెహోవా సంకల్పములనుగూర్చి బైబిలు చెప్పుదానిని మనము నిజముగా నమ్మినట్లయిన, యిది ఆయావ్యక్తులుగా మనమీద ఎట్లు ప్రభావము చూపును?
15 మనము ఈ వాగ్ధానమును నిజముగా నమ్మినట్లయిన, మన ఆలోచనా విధానమంతయు ప్రభావితమగును. దుష్టత్వ నాశనమునుగూర్చి ప్రవచించిన తర్వాత అపొస్తలుడగు పేతురు యిట్లనుచున్నాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, యెహోవా దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధ ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతురు 3:11, 12 NW) దుష్టులు నాశనమైనప్పుడు విడిచిపెట్టబడు నీతిమంతుల మధ్యలో ఉండవలెనను మన బలమైన కోరికద్వారా మన వ్యక్తిత్వములు మార్చబడవలెను.
16. నూతన లోకములో ఎలాంటి వ్యక్తిత్వములకు తావుండదు, మరియు ఈ జ్ఞానము మనమీద ఎట్లు ప్రభావమును చూపవలెను?
16 ఈ లోకాంతము తర్వాత, “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను, ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను,” అని ప్రకటన గ్రంథము నీతిమంతులకు వాగ్ధానము చేయుచున్నది. అయితే ఆ పిమ్మట “పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును అబద్ధికులును” తిరస్కరింపబడుదురని హెచ్చరించుచున్నది. (ప్రకటన 21:4, 8) నూతన లోకములో ప్రవేశించుటను అనుమతించుటకు దేవుడు నిరాకరించు కోరదగని లక్షణములను విసర్జించుట ఎంత జ్ఞానయుక్తము!
బయటనుండి సహాయము
17. ఎలాంటి సహాయమును వెదకమని బైబిలు మనకు ఉపదేశించుచున్నది?
17 అయినను, మానవులు బలహీనులు గనుక, వారు మార్పులు చేసుకొనవలెనన్నట్లయిన సాధారణముగా సమాచారము మరియు ప్రేరణకు తోడుగా మరియేదో వారికి కావల్సియుండును. వారికి వ్యక్తిగత సహాయము అవసరము, కాగా ఈ సహాయమును మనమెక్కడ కనుగొనవచ్చునో బైబిలు మనకు చూపించుచున్నది. ఉదాహరణకు, అది యిట్లు చెప్పుచున్నది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) అదేప్రకారము, మనము పెంపొందించుకొనవలసిన లక్షణములను ప్రదర్శించు వారితో మనము సహవాసము చేసినట్లయిన, మనము వారివలెనే తయారగుటకు మనకు బహుగా సహాయమగును.—ఆదికాండము 6:9; సామెతలు 2:20; 1 కొరింథీయులు 15:33.
18, 19. దేవుని ఆత్మకొరకు మన మనస్సును మరియు హృదయమును తెరచుటకు మనమేమి చేయు అవసరత కలదు?
18 దీనికి తోడుగా, ఏ ఆత్మతో తొలికాలములలో అద్భుతములు చేసెనో ఆ పరిశుద్ధాత్మ రూపమున యెహోవా తానుగా సహాయము దయచేయును. నిజానికి, బహుగా కోరదగిన లక్షణములగు “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” “ఆత్మ ఫలములని” పిలువబడినవి. (గలతీయులు 5:22, 23) పరిశుద్ధాత్మ సహాయమును మనమెట్లు పొందుదుము? బైబిలు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది గనుక, దానిని మనము చదివినప్పుడు లేక దానిగూర్చి యితరులతో మాట్లాడినప్పుడు తనవైపుకు మరల్చుకొనగల ఆ ఆత్మకు మన మనస్సును హృదయమును తెరచిన వారమగుదుము. (2 తిమోతి 3:16) అవును, మన నిరీక్షణనుగూర్చి యితరులతో మాట్లాడినప్పుడు, ఆ ఆత్మయొక్క సూటియైన చర్యను మనమనుభవించవచ్చునని యేసు వాగ్ధానము చేసెను.—మత్తయి 10:18-20.
19 అంతేకాకుండా, “ప్రార్థనయందు పట్టుదల గలవారై యుండుడి,” అని బైబిలు ఆజ్ఞాపించుచున్నది. (రోమీయులు 12:12) ప్రార్థనయందు యెహోవాను మనము సంబోధింతుము, ఆయనను స్తుతింతుము, కృతజ్ఞతలు తెల్పుదుము, మరియు సహాయము కొరకు ఆయనను అడుగుదుము. ముక్కోపము, మూర్ఖత్వము, అసహనము, లేక అహంకారమువంటి కోరదగని వ్యక్తిత్వ లక్షణములను అధిగమించుటకు సహాయము కొరకు మనమడిగినట్లయిన, ఆ ప్రార్థనకు అనుగుణ్యముగా మనము చేయు ఏ ప్రయత్నములనైనను దేవుని ఆత్మ బలపరచును.—యోహాను 14:13, 14; యాకోబు 1:5; 1 యోహాను 5:14.
20. నూతన స్వభావమును ధరించుకొనుట యెడల క్రైస్తవులు ఎడతెగక ఎందుకు పనిచేయుచునే యుండవలెను?
20 “మీ మనస్సుమారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని వ్రాసినప్పుడు, పౌలు బాప్తిస్మము పొందిన, అభిషక్తులైన క్రైస్తవసంఘమునకు వ్రాయుచుండెను. (రోమీయులు 1:7; 12:2) అసలు గ్రీకునందు, ఆయన ఎడతెగక చర్యను తీసుకొనుచునుండుట అను భావమునిచ్చు క్రియాపద రూపమును ఉపయోగించెను. బైబిలునుండి కలిగిన ఖచ్ఛితమైన జ్ఞానము ద్వారా మనలో కలిగిన మార్పు అంతకంతకు అభివృద్ధియగునటువంటిదని యిది సూచించుచున్నది. మనము ఈనాడు—పౌలు దినమందలి క్రైస్తవులవలెనే—అవినీతి ప్రభావములు పూర్తిగా నిండియున్న లోకముచేత చుట్టబడియున్నాము. మరియు మనము—వారి వలెనే—అసంపూర్ణులము, తప్పిదము చేయు వారమైయున్నాము. (ఆదికాండము 8:21) కాబట్టి, వారివలెనే మనము ప్రాచీన, స్వార్థపూరిత వ్యక్తిత్వమును అధికమించుచు క్రొత్త వ్యక్తిత్వమును ధరించుకొనుటకు ఎడతెగక పనిచేయుచునే యుండవలెను. తొలి క్రైస్తవులు ఎంతమేరకు విజయము సాధించిరంటే వారు తమచుట్టువున్న లోకమునుండి పూర్తిగా వేరై నిలిచియుండిరి. క్రైస్తవులు ఈనాడును అలానే చేయుదురు.
“యెహోవాచేత ఉపదేశమునొందు” ప్రజలు
21. అంత్యదినములలో దేవుని ప్రజలమీద నెరవేరిన ప్రవచనములు కొన్ని ఏమైయున్నవి?
21 అవును, దేవుని ఆత్మ ఈనాడు కేవలము ఆయావ్యక్తులమీదనే కాక లక్షలసంఖ్యలో వారుచేరియున్న క్రైస్తవ వ్యవస్థమీదను పనిచేయుచున్నది. ఈ సంస్థమీద యెషయా పలికిన ఈ ప్రవచన వాక్యములు నెరవేరినవి: “జనులు గుంపులు గుంపులుగా వచ్చి: ‘యాకోబు దేవుని మందిరమునకు వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము’ అని చెప్పుకొందురు.” (యెషయా 2:3) వారి విషయములో యెషయా పలికిన మరొక ప్రవచనముకూడ నెరవేరినది: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశమునొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” (యెషయా 54:13) యెహోవాచేత ఉపదేశించబడుచున్నందున సమాధానముననుభవించుచున్న వీరు ఎవరైయున్నారు?
22. (ఎ) ఈనాడు ఎవరు యెహోవాచే బోధింపబడుచున్నారు? (బి) యెహోవా సాక్షులు వేరుగా ఉన్నారని బయటివారు గుర్తించుచున్నారని చూపించుటకు ఉదాహరణలనిమ్ము.
22 ఉత్తర అమెరికాలో న్యూ హెవెన్ రిజిష్టర్ అను పత్రికకు వ్రాసిన లేఖలోని ఈ భాగమును గమనించుము: “వారు మతము మార్చుకొనునట్లు చేయుట విషయములో నావలె మీరును, రెచ్చగొట్టబడుదురో లేక కోపగించుకొందురో లేదోగాని, వారి అంకితభావము, వారి ఆరోగ్యదాయకత్వము, మానవ ప్రవర్తనయొక్క వారి అసాధారణమైన మాదిరి మరియు ఆరోగ్యప్రదమైన జీవనము విషయములో మీరు వారిని మెచ్చుకోవలసి ఉంటుంది.” ఎవరినిగూర్చి ఆ లేఖవ్రాసిన వ్యక్తి మాట్లాడుచున్నాడు? అదే గుంపునుగూర్చి చర్చించిన అర్జెంటీనా, బ్యూనోస్ ఏర్స్‌లోని హెరాల్డ్ యిలా చెప్పినది: “అనేక సంవత్సరములుగా యెహోవా సాక్షులు కష్టపడి పనిచేయువారిగాను, నిశ్చలమైనవారిగాను, మితవ్యయము మరియు దైవభక్తిగల పౌరులుగాను నిరూపించబడిరి.” అదేవిధముగా వారినిగూర్చి ఇటలీ వార్తాపత్రికయగు లా స్టాంపా యిలా చెప్పినది: “వారు పన్నులు ఎగవేయరు లేక తమ స్వంత లాభము కొరకు వారు తమకు అనుకూలముకాని చట్టములను పాటించని వారిగా ఉండరు. పొరుగువారియెడల ప్రేమ, అధికారమును తృణీకరింపకుండుట, అహింస మరియు వ్యక్తిగత నమ్మకత్వమువంటి నైతిక ఆదర్శములు . . . వారి ‘ప్రతిదిన’ జీవన విధానమందు ప్రవేశించునవై యుండును.”
23. యెహోవా సాక్షులు ఒక వ్యవస్థగా ఎందుకు భిన్నముగా నిలిచియున్నారు?
23 ఒక గుంపుగా—తొలి క్రైస్తవులవలెనే—యెహోవా సాక్షులు వేరుగా ఎందుకు నిలిచియుందురు? అనేక విషయములలో వారు ప్రతివారివలెనే యున్నారు. వారును అదే మానవ అసంపూర్ణతతో జన్మించారు, వారికిని అవే ఆర్ధిక సమస్యలు మరియు ప్రాధమిక అవసరతలు ఉన్నవి. అయితే, ప్రపంచవ్యాప్త సంఘముగా, వారు తమ జీవితములలో దేవుని వాక్య బలమును అనుమతింతురు. తత్ఫలితముగా కలిగిన స్వచ్ఛమైన క్రైస్తవులయొక్క అంతర్జాతీయ సహోదరత్వము, బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమనుటకు శక్తివంతమైన రుజువైయున్నది.—కీర్తన 133:1.
బైబిలు ప్రేరేపించబడినది
24. అనేకమంది పక్షముగా మన ప్రార్థన ఏమైయున్నది?
24 ఈ రెండు శీర్షికలయందు, బైబిలు మానవ వాక్యముకాదు, దేవుని వాక్యమని ప్రదర్శించు రెండు విధములైన రుజువును మాత్రమే చర్చించాము. వారు బైబిలు అసమాంతరమైన జ్ఞానమును లేక ప్రజలనుమార్చు దాని శక్తిని—లేక దాని ఔన్నత్యమును గుర్తింపజేయు మరి అనేకమైన సంగతులను—విచారించినను లేకపోయినను, అది తప్పక దేవుని ప్రేరేపిత వాక్యమై యుండవలెననుటను నిష్కల్మషమైన ప్రజలు గ్రహింపక మానరు. అనేకమంది ఈ సత్యమును గుర్తింపవత్తురని క్రైస్తవులుగా మనము ప్రార్థింతుము. అప్పుడు వారుకూడ కీర్తనల రచయితయొక్క సంతోషకరమైన ఈ మాటలను ప్రతిధ్వనింతురు: “యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.”—కీర్తన 119:159,160. (w90 4/1)
మీకు గుర్తున్నవా?
◻ నిజమైన క్రైస్తవులమీద బైబిలు ఏ ప్రభావమును కలిగియున్నది?
◻ మనము మారుటకు ఖచ్ఛితమైన జ్ఞానము ఎట్లు సహాయము చేయును?
◻ మంచి లక్షణములను పెంపొందించుకొనుటకు చెడువాటిని అధిగమించుటకు బైబిలు సహాయము మనలను ఎట్లు కదిలించును?
◻ దైవిక లక్షణములను వృద్ధిచేసుకొనుటకు ఏ సహాయము అందుబాటులో కలదు?
◻ బైబిలు ప్రేరేపింపబడినదనుటకు యెహోవా ప్రజలమధ్య ఏ రుజువును చూడవచ్చును?
[25వ పేజీలోని చిత్రాలు]
సొలొమోను వృద్ధాప్యమందు చూపిన అవిశ్వాసము యొక్క ఫలితము మనము నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుటకు ప్రేరణనివ్వవలెను
[27వ పేజీలోని చిత్రాలు]
సహాయము కొరకు యెహోవాను మనము అడిగినట్లయిన, చెడు లక్షణములను అధికమించుటకు మనము చేయు ఎటువంటి ప్రయత్నములనైనను ఆయన ఆత్మ బలపరచును