యేసు జీవితము పరిచర్య
అత్యానందముగా మారిన కన్నీరు
రక్తస్రావముగల స్త్రీ స్వస్థపరచబడటం యాయీరు చూచినప్పుడు యేసు యొక్క సూచకక్రియలయెడల తన విశ్వాసంపెరిగిందనుటలో సందేహములేదు. చావుకు సిద్ధమైయున్న తన 12సంవత్సరముల ప్రాయముగల కూతురును బాగుచేయుమని యాయీరు ఆ దినమునకు ముందే యేసును అడిగియున్నాడు. కానీ వారు కపెర్నహూమునకు దగ్గఱలోనున్న యాయీరు ఇంటికి వెళ్లుచుండగా ఒక స్త్రీ కేవలము ఆయన వెలుపటి చెంగును ముట్టినంతనే బాగుపడెను.
ఈ లోపున, యాయీరు ఏది జరుగుతుందని భయపడెనో అదే జరిగెను. ఆ స్త్రీ యేసుతో ఇంకా మాటలాడుచుండగనే కొంతమంది మనుష్యులు వచ్చి యాయీరుతో మెల్లగా, “నీ కుమార్తె చనిపోయినది. నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి?”
అది ఎంత చెడువార్తగానుండెను! సమాజములో గొప్పగా గౌరవింపబడు ఈ మనుష్యుడు, తన కుమార్తె మరణవార్త వినగానే ఎట్లు నిస్సహాయుడయ్యెనో ఆలోచించుడి. ఏమైనను, యేసు వీరి సంభాషణను వినెను. ఆయన యాయీరు వైపు తిరిగి “భయపడకుము, నమ్మిక మాత్రముంచు” మనెను.
దుఃఖములో మునిగియున్న ఆవ్యక్తి వెంట యేసు అతని ఇంటికి వచ్చెను. వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజల గుంపు ఏడ్చుచూ తమ్మునుతాము చరచుకొనుచూ యుండిరి. యేసు లోపలికి ప్రవేశించి “మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదిగాని చనిపోలేదని” వారితో చెప్పెను.
దీనిని విన్నప్రజలు ఆ బాలిక నిజముగా చనిపోయెనని ఎరిగిరి గనుక వారు యేసును పరిహసించిరి. గాఢ నిద్రలోనున్న వారిని లేపినంత తేలికగా దేవుడు తనకిచ్చిన శక్తితో మృతులను లేపవచ్చునని చూపించుటకు ఆమె నిద్రపోతుందని యేసు చెప్పెను.
పేతురు, యోహాను, యాకోబు మరియు ఆ బాలిక తలిదండ్రులను తప్ప మిగతావారినందరిని యేసు బయటకు పంపివేసెను. ఈ ఐదుగురిని తనతో ఆ బాలిక ఉన్నగదిలోనికి తీసికొనిపోయెను. ఆ చిన్నదాని చేయిపట్టుకొని “తలీ’.తా’కుమీ” అనెను. ఆ మాటకు “చిన్నదానా లెమ్ము” అని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగెను! ఈ దృశ్యమును చూచిన ఆమె తలిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడి అత్యానందము నొందిరి.
ఆమెకు తినుటకు ఏదైన ఇవ్వమని వారికి చెప్పిన తరువాత జరిగిన విషయములను ఎవ్వరికి తెల్పవద్దని యేసు యాయీరునకును అతని భార్యకును ఖండితముగా ఆజ్ఞాపించెను. యేసు ఈ విధముగా చెప్పినప్పటికిని, ఈ విషయమును గూర్చిన వార్త ఆ ప్రాంతమంతయు వ్యాపించెను. ఇది యేసు చేసిన రెండవ పునరుత్థానము. మత్తయి 9:18-26; మార్కు 5:35-43; లూకా 8:41-56.
◆ యాయీరు ఏ వార్తను వినెను, మరియు యేసు అతనినెట్లు ప్రోత్సహించెను?
◆ వారు యాయీరు యింటికి వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లుండెను?
◆ బాలిక నిద్రపోతుందని యేసు ఎందుకు చెప్పెను?
◆ యేసుతో పాటు ఈ పునరుత్థానమును చూచిన మిగతా ఐదుగురు ఎవరు? (w87 6/15)