అందము బాహ్యమైనదే కావచ్చును
దేవునిచేత మొదటగా సృజింపబడిన ఏకైక స్త్రీయగు, హవ్వ మాత్రమే బహుశ భూమిమీద నివసించిన స్త్రీలందరిలో బహుసౌందర్యవతి అయివుండవచ్చును. కానీ ఆమె, ఆమె భర్తయైన ఆదాము యెహోవాకు వ్యతిరేకముగా తిరుగుబాటుచేసిరి. కావున, హవ్వ దేవునితో సత్సంబంధమును కోల్పోయి మానవజాతి మీదకు ఘోరమైన విపత్తుతెచ్చుటలో భాగము వహించెను. ఆ తరువాత కూడా ఆమె అందగత్తెగా వుండెననుటలో సందేహములేదుగాని, ఆమెకున్న అందము కేవలము బాహ్యమైనది మాత్రమే అయివుండెను.
అందము దేవుడిచ్చు బహుమానమైయున్నది. మరియు కొందరు దీనిని వారసత్వముగా ఇతరులనుండి ఎక్కువగా పొందిరి. చాలామంది తాము ఉన్నదానికంటె మరి ఎక్కువ అందముగా కనబడవలెనని కోరుకొందురు. అలాగే మరెంతోమంది తమ అందమును మరింత ఎక్కువ చేసుకొనుటకు ఎంతో ధనమును, సమయమును, ఖర్చుచేయుదురు. అయితే అందము ఇతర లక్షణములతో పొందికగా లేనట్లయిన కాలక్రమేణా అది విలువలేనిదైయుండునని హవ్వ ఉదాహరణ చూపుచున్నది. ఆ ఇతర లక్షణములేవి? వెనుకటి రాజైన సొలొమోను రోజుల్లో నున్న యొక అనుభవము మనకు దాని జవాబిచ్చుటకు సహాయముచేయును.
అందము కంటె గొప్పదైనది
బైబిలు పుస్తకమైన పరమగీతము షూలేమీయురాలైన ఒక అందమైన గ్రామీణ బాలికనుగూర్చి తెల్పుచున్నది. ఈమె ఆ ప్రాంతపు గొర్రెలకాపరి యొక్క ప్రేమలో పడినది. ఆమె అందమునకు రాజు ఆకర్షితుడై ఆమెను తన భార్యగా చేసికొను ఆశతో ఆమెను ఆయన యెరూషలేమునకు తెచ్చెను. ఆ యౌవనస్త్రీకి ఇది ఎంతమంచి అవకాశమైయున్నది! అక్కడ ఆమె తన అందమునుబట్టి ఐశ్వర్యమును, అధికారమును మరియు పలుకుబడిని ఆ రాజ్యములో సంపాదించవచ్చును. కానీ ఆ యౌవనబాలిక రాజుయొక్క చనువుతో కూడిన పొగడ్తలను స్థిరబుద్ధితో తిరస్కరించెను. ఆమె యెరూషలేము యొక్క సంపదకును, దాని శోభకును వెన్నుజూపి తన గొర్రెలకాపరి కుర్రవాని యెడల విశ్వాసముగా ఉండెను. ఆమె విషయములో సౌందర్యము కేవలము బాహ్యమైనదేకాక అంతకు మించినదైయుండెను. ఆమె మిడిమిడి జ్ఞానముగల అవకాశవాది లేక పేరాశగలదైయుండలేదు. దానికి బదులుగా, తన పూర్వికురాలైన హవ్వకు లేని అంతర్గత సౌందర్యమును కలిగియుండెను.—పరమగీతము 1:15; 4:1; 8:4, 6, 10.
భౌతిక అందముయొక్క ఉరులు
భౌతిక అందము కోరదగినదైనను, అది అంతర్గత అందమును ఎన్నటికిని తీసుకురాలేని కొన్నిసమస్యలను తీసికొనివచ్చును. ఉదాహరణకు, దాదాపు 4,000 సంవత్సరముల పూర్వము పితరుడైన యాకోబునకు బహు రూపసియైన దీనాయను కుమార్తెయుండెను. ఆమె అవివేకముగా “ఆ దేశకుమార్తెలతో స్నేహము” చేసినప్పుడు షెకెము అను యౌవనస్థుడు ఆమె అందమునకు ఆకర్షితుడై ఆమెను అవమానపరచెను.—ఆదికాండము 34:1, 2.
అదనముగా, పైకి కనిపించు అందము అంతరంగ సౌందర్యముతో సమానముగా లేనట్లయిన అది ఒకని స్వంత అంచనాలను ఉప్పొంగించును. రాజైన దావీదుకున్న అబ్షాలోమను కుమారునిగూర్చి మనమిట్లు చదువుదుము: “ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యముగలవాడు ఒకడును లేడు.” (2 సమూయేలు 14:25) అయితే అబ్షాలోముకున్న సౌందర్యము అతని అంతరంగ చెడుతనమును కప్పివేసెను. అతడు నిష్పలుడు, ఆశబోతు, మరియు నిర్ధయుడునైయుండెను. అతడు నిపుణతతో తన బాహ్యసౌందర్యమునుపయోగించి తనను వెంబడించుటకు ఇశ్రాయేలీయులలో ఒక గుంపును తయారుచేసికొని ఆ తరువాత తన తండ్రి సింహాసనమును కూలద్రోయుటకు కుట్రపన్నెను. తత్ఫలితముగా, దేశములో అంతఃకలహము రేగిన తరువాత ఈ అందమైన యవనస్థుడు చంపబడెను.
పురుష సౌందర్యము
అబ్షాలోము విషయములో గమనించినట్లు, బైబిల్ పురుషులను స్త్రీలను గురించి మాటలాడుచు వారు అందముగలవారని చెప్పుచున్నది. ఉదాహరణకు, తన పురుష సౌందర్యమునుబట్టి ఉరిలో పడకుండా తప్పించుకొన్నవారిలో యోసేపు ఒకడు. ఇతడు దీనాకు తమ్ముడైయుండెను. (ఆదికాండము 30:20-24) తాను యవనస్థుడిగా నున్నప్పుడు యోసేపు సహోదరులు ఈర్ష్యతో అతనిని ఐగుప్తునకు తీసికొనిపోబడుటకు బానిసగా అమ్మిరి. అచ్చట, పోతీఫరు అను పేరుగల సైనికాధికారిచే కొనబడిన ఆయన, నమ్మకముగాను, యథార్థవంతుడునై యున్నందున యోసేపు పోతీఫరు గృహమునంతటికిని నిర్వాహకుడుగా నుండెను. ఇంతలో “యోసేపు రూపవంతుడుగాను, సుందరుడుగాను,” ఎదిగెను.—ఆదికాండము 39:6.
పోతీఫరు భార్య యోసేపుపై మోహమును పెంచుకొని తరచుగా తనతో శయనించుమని సిగ్గులేకుండా ప్రయత్నించుచూ వచ్చెను. కానీ, ఆ యవనస్థుడు తనకు భౌతిక సౌందర్యముతో పాటు అంతరంగ సౌందర్యము కలదని చూపెను. తనయజమానుడైన పోతీఫరుకు, వ్యతిరేకముగా పాపముచేయుటకు నిరాకరించి ఆ స్త్రీ నుండి దూరముగా పారిపోయెను. తత్ఫలితముగా, అతడు చెఱసాలలో వేయబడెను. ఎందుకు? ఎందుకనగా నిరాశ చెందిన పోతీఫరు భార్య అతడు తనను అవమానపరచ ప్రయత్నించెనని నిందవేసెను! ఈ చేదు అనుభవము, యోసేపు యొక్క స్వభావమును మార్చలేదుగాని ఆయన కష్టసమయములో చూపిన ఉన్నతమైన మాదిరి అప్పటినుండి నీతిహృదయముగలవారికి ప్రోత్సాహకరముగా యుండెను.
ఈ మాదిరులు చూపునట్లుగా భౌతికముగా చూపరులకు అందముగా కనిపించుటకంటె అంతరంగ సౌందర్యము—అనగా వ్యక్తిత్వపు అందము, మరిముఖ్యముగా అది దేవునిపైగల విశ్వాసముపై ఆధారపడినప్పుడు—ఎంతో ప్రాముఖ్యమైనది. వివాహమునకై ఎదురుచూచు యవనస్థులు దీనిని ఎరుగవలయును. ఉద్యోగులకొరకు వెదకు యజమానులు దీనిని తప్పక గుర్తుంచుకొనవలయును. భౌతిక అందము కలిగినను లేకపోయినను మనందరము ఈ అతిప్రాముఖ్యమైన అంతరంగ సౌందర్యమును పెంపొందించుకొనుటను మనస్సునందుంచుకొనవలెను. అయితే దీనిలో ఏమి చేరియున్నది? మరియు దీనినెట్లు పెంపొందించుకొనగలము? తదుపరిశీర్షికలో దీనిని మనము చర్చించుదాము. (w89 2/1)