బైబిలు ఉద్దేశం
తల్లిదండ్రుల లక్ష్యం ఏమిటి?
మీ పిల్లలు పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత ఎలా ఉంటే బాగుంటుందని మీరనుకుంటున్నారు?
1. అచ్చం మీలా.
2. తిరుగుబాటు చేస్తూ మీకు వ్యతిరేకంగా ఉండాలనుకునే వారిలా.
3. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ, బాధ్యతగా ప్రవర్తించే వారిలా.
కొంతమంది తల్లిదండ్రులు మూడవదాన్ని ఎంచుకున్నా, మొదటిదాన్ని ఎంచుకున్న వాళ్లలా ప్రవర్తిస్తుంటారు. వాళ్లు తమ అభిప్రాయాలను పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. చివరికి, పిల్లలు ఏం చదవాలో ఏ ఉద్యోగం చేయాలో కూడా చెబుతుంటారు. ఫలితం? అలాంటి పిల్లలకు తమ కాళ్లమీద తాము నిలబడే అవకాశం ఏమాత్రం దొరికినా, అమ్మానాన్నలు చెప్పినదానికి వ్యతిరేకంగా చేయడం మొదలుపెడతారు. విచిత్రం ఏమిటంటే, తమ పిల్లలను అచ్చం తమలా తయారుచేయాలని చూసే చాలామంది తల్లిదండ్రుల పిల్లలు చివరికి వాళ్లకు పూర్తి వ్యతిరేకంగా తయారౌతారు.
పూర్తిగా అదుపు చేయడం ఎందుకు సరి కాదు?
కౌమారప్రాయంలో ఉన్న లేదా ఎదుగుతున్న మీ పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత బాధ్యతలు తెలుసుకుని మంచి నిర్ణయాలు తీసుకోవాలని మీరు కోరుకుంటారు. దానికోసం మీరేమి చేయాలి? ఒక విషయం మాత్రం స్పష్టం: పిల్లల్ని పూర్తిగా అదుపుచేయడం వల్ల మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకో కింద ఉన్న రెండు కారణాలు చూస్తే మీకే అర్థమౌతుంది.
1. అది బైబిలుకు విరుద్ధం. యెహోవా దేవుడు మనుష్యులను సృష్టించినప్పుడు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. మంచి మార్గమైనా చెడు మార్గమైనా, జీవితంలో వాళ్లకు నచ్చిన మార్గంలో మనుష్యులను దేవుడు వెళ్లనిస్తాడు. ఉదాహరణకు, కయీను తన తమ్ముడైన హేబెలును చంపేంతగా కోపం మనసులో ఉంచుకున్నప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు: “నీవు మంచిని చేస్తే తలెత్తుకోవా? మంచిని చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. నిన్ను మింగివేయాలని దానికి నీ మీద ఆశ ఉంది. కానీ, నీవు దాన్ని లోబరుచుకోవాలి.”—ఆదికాండము 4:7, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
యెహోవా కయీనుకు స్పష్టమైన సలహా ఇచ్చినా దానికి లోబడేలా అతనిని ఒత్తిడి చేయలేదు. తన కోపాన్ని అదుపు చేసుకోవాలో లేదో కయీనే నిర్ణయించుకోవాలి. తాను సృష్టించిన వాళ్లు తనకు లోబడివుండేలా వారిని పూర్తిగా అదుపు చేయాలని యెహోవా ప్రయత్నించడు. కౌమారదశలో ఉన్న మీ పిల్లల విషయంలో మీరు కూడా అలాగే ఉండాలని గుర్తుపెట్టుకోవాలి.a
2. అలా చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. ఓ సేల్స్‌మాన్ ఎలాగైనా మీతో ఒక వస్తువు కొనిపించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడనకుందాం. ఆయన ప్రయత్నించే కొద్దీ ఆ వస్తువును కొనకూడదని మీకు గట్టిగా అనిపిస్తుంటుంది. ఒకవేళ మీకు ఆ వస్తువు అవసరమైనా, అతని ప్రవర్తన వల్ల విసుగొచ్చి ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని మీరు చూస్తారు.
మీరు మీ విలువలను, నమ్మకాలను, లక్ష్యాలను ఎదుగుతున్న పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నిస్తే అలాంటిదే జరిగే ప్రమాదం ఉంది. మీ పిల్లలు వాటిని ఇష్టపడతారా? ఆ అవకాశం చాలా తక్కువ! నిజానికి మీరలా చేయాలని చూస్తే, ఎదుగుతున్న పిల్లలకు మీ అభిప్రాయాలు, ఆలోచనలు నచ్చక వాటికి దూరంగా ఉండడం మంచిదని అనుకుంటారు. అందుకే, పిల్లలను పూర్తిగా అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించడం వల్ల ప్రయోజనం ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి చేయవచ్చు?
కౌమారప్రాయంలో ఉన్న పిల్లల జీవితాల్ని శాసించాలని చూడడం మంచిది కాదు. బహుశ వాళ్ల చిన్నప్పుడు మీరు మీ అభిప్రాయాలను వాళ్ల మీద రుద్దడానికి ప్రయత్నించి ఉంటారు. అయితే ఇప్పుడు, సరైన వాటిని చేయడం ఎందుకు తెలివైన పనో అర్థంచేసుకోవడానికి వాళ్లకు సహాయం చేయండి. మీరు యెహోవాను ఆరాధించే వాళ్లయితే, దేవుని సూత్రాల ప్రకారం నడుచుకోవడం వల్ల మున్ముందు ఎంత సంతృప్తిగా జీవించవచ్చో చూపించండి.—యెషయా 48:17, 18.
మీరు అలా చేస్తూ మంచి మాదిరి ఉంచండి. ఎదుగుతున్న మీ పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో, అలా మీరు ఉండండి. (1 కొరింథీయులు 11:1) మీరు మీ జీవితంలో ఏ విలువలు పాటించాలనుకుంటున్నారో స్పష్టంగా చూపించండి. (సామెతలు 4:11) ఎదుగుతున్న మీ పిల్లలు దేవుణ్ణి, ఆయన ప్రమాణాలను ప్రేమించడం నేర్చుకుంటే మీరు దగ్గర లేకపోయినా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.—కీర్తన 119:97; ఫిలిప్పీయులు 2:12.
ఉపయోగపడే పనులు నేర్పించండి
ఈ పత్రికలోని 2వ పేజీలో ఉన్నట్లుగా మీ పిల్లలు పెరిగి పెద్దయి ‘తండ్రిని, తల్లిని విడిచే’ రోజు వస్తుంది. రోజులు ఎంతో త్వరగా గడిచిపోయాయని అప్పుడు మీకు అనిపించవచ్చు. (ఆదికాండము 2:24) మీ పిల్లలు పెద్దవాళ్లయ్యేసరికి తమకాళ్ళపై నిలబడడానికి కావాల్సిన సామర్థ్యాలను సంపాదించుకునేలా మీరు చూడాలి. వాళ్లు మీతో ఉన్నప్పుడే అంటే ఇప్పుడే మీరు నేర్పించగలిగే కొన్ని విషయాలను చూడండి.
ఇంటి పనులు. మీ అబ్బాయికి వంట చేయడం వచ్చా? తన బట్టలు ఉతుక్కొని, ఇస్త్రీ చేసుకుంటాడా? తన గదిని శుభ్రంగా సర్దిపెట్టుకుంటాడా? బండికి చిన్నచిన్న మరమ్మతులు చేయడం, దానిని మంచిగా వాడుకోవడం వచ్చా? ఇలాంటి పనులు నేర్చుకుంటే పిల్లలు మున్ముందు తమ పనులను చక్కగా చేసుకుంటారు. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: ‘నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను.’—ఫిలిప్పీయులు 4:11.
ఇతరులతో మెలగడం. (యాకోబు 3:17) మీ అబ్బాయి ఇతరులతో చక్కగా ప్రవర్తిస్తాడా? సమస్యలను శాంతంగా, దయగా ఎలా పరిష్కరించాలో అతనికి తెలుసా? ఇతరులను ఎలా గౌరవించాలో, విభేదాలను సామరస్యంగా ఎలా పరిష్కరించుకోవాలో నేర్పించారా? (ఎఫెసీయులు 4:29, 31, 32) “అందర్నీ గౌరవించండి” అని బైబిలు చెబుతుంది.—1 పేతురు 2:17, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.
డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టడం. (లూకా 14:28) తన కాళ్లమీద తాను నిలబడేలా మీ అబ్బాయికి ఏదైనా పని నేర్పించడం వీలౌతుందా? అప్పులు చేయకుండా ఉన్నదాంట్లోనే సర్దుకోవడం నేర్పిస్తున్నారా? చూసిన ప్రతీదాన్ని కొనకుండా అవసరమైనవాటి కోసం డబ్బులు దాచుకోవడం, ఉన్నవాటితో తృప్తిపడడం నేర్పించారా? (సామెతలు 22:7) పౌలు ఇలా రాశాడు: ‘అన్నవస్త్రములు కలిగి వాటితో తృప్తి పొందుదాం.’—1 తిమోతి 6:7, 8.
సరైన విలువల ప్రకారం జీవించడం, జీవితంలో ఉపయోగపడే పనులు చేయడం నేర్చుకున్న పిల్లలు బాధ్యతగల పెద్ద వాళ్లుగా ఎదుగుతారు. అప్పుడు తల్లిదండ్రులు తమ లక్ష్యం సాధించినట్లే!—సామెతలు 23:24.
[అధస్సూచి]
a మరింత సమాచారం కోసం, కావలికోట (ఆంగ్లం) ఫిబ్రవరి 1, 2011, 18-19 పేజీలు చూడండి.
మీరెప్పుడైనా ఆలోచించారా?
● తల్లిదండ్రులుగా మీ లక్ష్యం ఏమిటి? —హెబ్రీయులు 5:14.
● మీ పిల్లలు పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత వాళ్ల బాధ్యత ఏమిటి?—యెహోషువ 24:15.
[25వ పేజీలోని క్యాప్షన్]
మీ పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత ఎలా ఉండాలని మీరనుకుంటున్నారు?
అచ్చం మీలా . . .
తిరుగుబాటు చేసేలా . . .
బాధ్యతగా ప్రవర్తించేలా