తల్లిదండ్రులు ఏమంటున్నారంటే . . .
కౌమారదశలోని పిల్లలున్న చాలామంది తల్లిదండ్రులకు కొత్తకొత్త సవాళ్లు ఎదురౌతాయి. ఈ దశలో పిల్లలకే కాదు మీకు కూడా ఎంతో అయోమయంగా ఉంటుంది, మరి అలాంటప్పుడు మీ పిల్లలకు సహాయం చేస్తూ వాళ్లను సరైన దారిలో ఎలా పెట్టవచ్చు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఏమి చెప్పారో చూడండి.
మార్పులు
“చిన్నప్పుడు మా అబ్బాయిని సరిదిద్దితే మారుమాట్లాడకుండా వినేవాడు. కానీ కౌమారప్రాయానికి వచ్చేసరికి వాడికి నా అధికారం మీద నమ్మకం పోయినట్లుంది. వాడు నేను చెప్పినదాన్నే కాదు చెప్పిన తీరును కూడా ప్రశ్నించడం మొదలుపెట్టాడు.”—ఫ్రాన్క్, కెనడా.
“మా అబ్బాయి ముందులా మాట్లాడడం లేదు. అడిగితే తప్ప నోరు విప్పడు, ముందులా వాడే వచ్చి చెబుతాడులే అని అనుకోవడానికి లేదు. వాడి నుండి విషయం రాబట్టడం కూడా కష్టమే. ఒకవేళ నోరు విప్పినా దానికి చాలా సమయం తీసుకుంటాడు.”—ఫ్రాన్సస్, ఆస్ట్రేలియా.
“ఈ వయసు పిల్లలతో వ్యవహరించాలంటే ఎంతో ఓపిక కావాలి. కొన్నిసార్లు వాళ్లమీద కోపం వెళ్లగక్కాలనిపించవచ్చు, కానీ ఎప్పుడైనా కోపం తగ్గాకే మాట్లాడడం మంచిది.”—ఫలీష, అమెరికా.
మాటలు
“కొన్నిసార్లు మా అమ్మాయి తనను తాను బాగా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరికొన్నిసార్లు, నేను ఊరికే తప్పులు పడుతున్నానని అనుకుంటుంది. తనను ప్రేమిస్తున్నాననీ తన మంచే కోరుతున్నాననీ అప్పుడప్పుడూ దానికి గుర్తుచేయాల్సి వస్తుంది.” —లీసా, అమెరికా.
“చిన్నప్పుడు మా పిల్లలు నా దగ్గర ఏదీ దాచేవాళ్లు కాదు. వాళ్ల మనసులో ఏముందో ఇట్టే తెలుసుకోగలిగేదాన్ని. ఇప్పుడైతే వాళ్లను అర్థంచేసుకుని, వాళ్ల వ్యక్తిత్వాన్ని గౌరవించడానికి ప్రయత్నించాల్సి వస్తుంది. అలాచేస్తేనే వాళ్లు దాపరికం లేకుండా మాట్లాడతారు.”—నాన్-హీ, కొరియా.
“కౌమారప్రాయంలోని పిల్లలకు అది చేయకూడదు ఇది చేయకూడదని చెబితే సరిపోదు. వాటిని ఎందుకు చేయకూడదో కారణాలు వివరించాలి, వాళ్ల హృదయాన్ని హత్తుకునే విధంగా మాట్లాడాలి. వాళ్ల మనసులో ఏముందో రాబట్టాలంటే వాళ్లు మనకు ఇష్టంలేని విధంగా మాట్లాడుతున్నా, వాళ్లు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండాలి.”—డాలీలా, బ్రెజిల్.
“మా అమ్మాయిని నలుగురిలో కాకుండా ఏకాంతంలోనే సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను.” —ఎడ్న, నైజీరియా.
“కొన్నిసార్లు మా అబ్బాయి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను వేరే పనుల్లోపడి వాడు చెప్పేది సరిగ్గా వినను. వాడు అది పసిగడతాడు. అందుకే అనుకుంటా, వాడు నాతో ఎక్కువగా మాట్లాడడు. వాడు ఎప్పుడూ మనసువిప్పి మాట్లాడాలంటే, వాడు చెప్పేది నేను జాగ్రత్తగా వినాలి.”—మీర్యామ్, మెక్సికో.
స్వేచ్ఛ
“కౌమారప్రాయంలో ఉన్న మా పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడానికి నేను ఎప్పుడూ భయపడేవాణ్ణి, అది వాళ్లకు నచ్చేదికాదు. నేను ఎందుకలా చేసేవాడినో నిర్మొహమాటంగా వాళ్లకు చెప్పాను. నా భయాలను వాళ్లకు వివరించాను, ఆ తర్వాత తాము ఎందుకు ఎక్కువ స్వేచ్ఛ కోరుకుంటున్నారో మా పిల్లలు చెప్పారు. నేను న్యాయంగా పెట్టిన కట్టుబాట్లు మీరకుండానే వాళ్లు మరింత స్వేచ్ఛ ఎలా అనుభవించవచ్చో మేము మాట్లాడుకున్నాం.” —ఎడ్వన్, ఘానా.
“మా అబ్బాయి బైక్ కావాలని పోరుపెట్టేవాడు. అది నాకు అస్సలు ఇష్టంలేదు కాబట్టి, కోపంగా వాణ్ణి తిట్టేదాన్ని, వాణ్ణి మాట్లాడనిచ్చేదాన్ని కాదు. బైక్ కొంటే వచ్చే నష్టాల గురించి అదే పనిగా చెప్పేదాన్ని. దాంతో వాడికి మరింత కోపమొచ్చేది, పట్టుదల పెరిగేది. ఇలాకాదని నేను మరో పద్ధతిలో నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. దాని గురించి అన్ని కోణాల్లో పరిశోధించమనీ దానివల్ల వచ్చే ప్రమాదాలు, ఖర్చులు, లైసెన్సు సంపాదించడానికి పడాల్సిన పాట్ల వంటివాటి గురించి తెలుసుకోమనీ చెప్పాను. అంతేకాదు, సంఘంలో అనుభవజ్ఞులైన సహోదరుల సలహా తీసుకోమని కూడా చెప్పాను. నా అభిప్రాయం బలవంతంగా వాడిమీద రుద్దే బదులు వాడి ఇష్టాల గురించి చెప్పనివ్వడం మంచిదని నేను గ్రహించాను. ఈ పద్ధతి బాగా పనిచేసింది.” —హే-యన్గ్, కొరియా.
“మేము మా పిల్లలకు కట్టుబాట్లు పెట్టినా, మెల్లమెల్లగా స్వేచ్ఛను కూడా ఇచ్చాం. వాళ్లకు ఇచ్చిన స్వేచ్ఛను ఎలా ఉపయోగించారనే దాన్ని బట్టి మరింత స్వేచ్ఛ ఇవ్వాలో వద్దో నిర్ణయించేవాళ్లం. స్వేచ్ఛను సంపాదించుకునే అవకాశాలు కల్పించి, వాళ్లు స్వేచ్ఛ అనుభవించాలన్నదే మా కోరికని వాళ్లకు తెలిసేలా చేశాం. కానీ వాళ్లు మా నమ్మకాన్ని వమ్ముచేసినప్పుడు తప్పకుండా శిక్షించేవాళ్లం.” —డారాటే, ఫ్రాన్స్.
“ప్రమాణాల విషయంలో నేనెప్పుడూ రాజీపడేదాన్ని కాదు. మా పిల్లలు నేను చెప్పినమాట వింటే, వాళ్ల కోరికలను కొన్నిసార్లు మన్నించేదాన్ని. ఉదాహరణకు, అప్పుడప్పుడు ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చేందుకు ఒప్పుకునేదాన్ని. కానీ నాకు చెప్పకుండా ఎక్కువసార్లు అలాచేస్తే వాళ్లను శిక్షించేదాన్ని.”—ఈల్-కన్, కొరియా.
“అన్నీ చెప్పినట్లు చేస్తూ బాధ్యతతో పనిచేసే ఉద్యోగిని యజమాని ఇష్టపడతాడు, అతని అవసరాల పట్ల మరింత శ్రద్ధ చూపిస్తాడు. అలాగే, మా అబ్బాయి మేము పెట్టిన కట్టుబాట్లను పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే వాడికి ఎక్కువ స్వేచ్ఛను ఇస్తాం. ఒక ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించనప్పుడు అతణ్ణి శిక్షించినట్లే మా అబ్బాయి తనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినప్పుడు దాన్ని పోగొట్టుకుంటాడు.”—రామాన్, మెక్సికో.
[22వ పేజీలోని క్యాప్షన్]
‘ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవించడానికి సరైన మార్గం నేర్పించండి, ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ ఆ మార్గంలోనే జీవించడం కొనసాగిస్తాడు.’—సామెతలు 22:6, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్
[23వ పేజీలోని క్యాప్షన్]
రెండు కుటుంబాల కథ
“కౌమారదశలోని పిల్లలను పెంచడం ఒక అద్భుతమైన అనుభవం”
జోసెఫ్: మా పెద్దమ్మాయిలు ఇద్దరు కౌమారదశలో ఉన్నారు. వాళ్ల అభిప్రాయాలను విని వాటికి స్పందించడం అవసరమని నేను గుర్తించాను. నా తప్పులు నిజాయితీగా ఒప్పుకుంటాను, మా అమ్మాయిలను గౌరవిస్తూ మాట్లాడతాను. అందుకే మా అమ్మాయిలు నాతో మాట్లాడడానికి సంకోచించరు. ఒక్కమాటలో చెప్పాలంటే, కౌమారదశలోని పిల్లలను పెంచడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ విషయంలో బైబిలు ఇస్తున్న నిర్దేశానికి మేమెంతో రుణపడివున్నాం.
లీసా: మా పెద్దమ్మాయి కౌమారదశలో అడుగుపెట్టాక ఆమెతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరముందని నేను గుర్తించాను. ఆమె చెప్పేది వినడానికి, ఆమెతో మాట్లాడడానికి, ఆమె భయాలను పోగొట్టడానికి ఎక్కువ సమయం వెచ్చించేదాన్ని. మా అమ్మాయిలు మనసువిప్పి మాట్లాడవచ్చని, వాళ్ల భావాలను గౌరవిస్తామని వాళ్లకు అభయమిచ్చాం. ‘వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి’ అనే యాకోబు 1:19లోవున్న మాటలను పాటించడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
విక్టోరియా: మా అమ్మే నాకు మంచి స్నేహితురాలు. తనలా ప్రేమ, ఆప్యాయతలు చూపించే వాళ్లను నేను ఇంతవరకు చూడనేలేదు. తను ఎవరితోనైనా అలాగే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మా అమ్మ “కల్లాకపటంలేనిది.” తనకు ఎవ్వరూ సాటిరారు.
ఓలివీయ: మా నాన్న ఇతరుల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు, ఏదైనా ఉదారంగా ఇస్తాడు. మేము పెద్దగా ఉన్నవాళ్లం కాకపోయినా ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటాడు. ఎప్పుడు గంభీరంగా ఉండాలో ఆయనకు తెలుసు. అదేకాదు, ఎప్పుడు సరదాగా ఉండాలో కూడా ఆయనకు బాగా తెలుసు. నాన్న అంటే ఎలా ఉండాలో ఆయనను చూస్తే తెలుస్తుంది. నేనాయన కూతురును అయినందుకు ఎంతో గర్వంగా ఉంది!
“మాకు ఎప్పుడూ బోరు కొట్టదు”
సన్నీ: మా అమ్మాయిలకు ఏదైనా సమస్య ఉంటే కుటుంబమంతా కూర్చుని చర్చిస్తాం. మేము దాపరికం లేకుండా మాట్లాడుకుని బైబిలు సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. వాళ్లు పరిణతి చెందిన వాళ్లతో స్నేహం చేసేలా చూస్తాం. మాకూ మా పిల్లలకూ వేర్వేరు స్నేహితులంటూ ఎవ్వరూ లేరు.
ఈనెస్: మేము ఉత్సాహంగా ఉంటూ పనులన్నీ కలిసి చేసుకుంటాం. యెహోవాసాక్షులుగా మేము పరిచర్య చేస్తాం, వ్యక్తిగతంగా, కుటుంబంగా బైబిలు అధ్యయనం చేస్తాం. విపత్తు సహాయక పనుల్లో, రాజ్యమందిర నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటాం, కాబట్టి మాకు తీరికే ఉండదు. అయితే, మేము సరదాగా గడపడానికి కూడా సమయం కేటాయిస్తాం. అందుకే మాకు ఎప్పుడూ బోరు కొట్టదు!
కెల్సీ: మా నాన్న మేము మాట్లాడినప్పుడు చక్కగా వింటారు, ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు. నాకు సహాయం అవసరమైనా, మాట్లాడాలనిపించినా మా అమ్మ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
సమాంత: మా అమ్మ నేను ఒక ముఖ్యమైన, ప్రత్యేకమైన వ్యక్తినన్నట్టు ఎంతో అపురూపంగా, ప్రేమగా చూసుకుంటుంది. ఆమె ఎప్పుడూ అలాగే ఉంటుంది. నేను చెప్పేది చక్కగా వింటుంది. నా గురించి శ్రద్ధ తీసుకుంటుంది. ఇంత మంచి స్నేహాన్ని దేనికోసమూ వదులుకోలేను.
[క్యాప్షన్]
కామేర కుటుంబం: జోసెఫ్, లీసా, విక్టోరియా, ఓలివీయ, ఈజాబెల్ల
సాపాటా కుటుంబం: కెల్సీ, ఈనెస్, సన్నీ, సమాంత
[22వ పేజీలోని క్యాప్షన్]
తల్లిదండ్రులు పిల్లలకు తగినంత స్వేచ్ఛ ఇవ్వడంతోపాటు సముచితమైన హద్దులు కూడా పెట్టాలి