కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • br-1110 పేజీలు 16-20
  • కౌమారదశ ఈ దశలో పిల్లల్ని ఎలా పెంచాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కౌమారదశ ఈ దశలో పిల్లల్ని ఎలా పెంచాలి?
  • తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాల్యదశ నుండి యవ్వనంలోకి . . .
  • కొత్త పరిస్థితికి మీరు అలవాటుపడవచ్చు
  • ఎదుగుతున్న మీ అబ్బాయి మీ మత నమ్మకాలను ప్రశ్నిస్తే ...
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • తల్లిదండ్రుల లక్ష్యం ఏమిటి?
    తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
  • యౌవనస్థులతో సంభాషించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యుక్తవయస్సు పిల్లల్ని బాధ్యతగల వ్యక్తులుగా తీర్చిదిద్దండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
br-1110 పేజీలు 16-20

కౌమారదశ ఈ దశలో పిల్లల్ని ఎలా పెంచాలి?

మీరు సికింద్రాబాదు నుండి బయలుదేరి ఇప్పుడే సిమ్లాలో అడుగుపెట్టారనుకోండి. దిగిన వెంటనే వాతావరణంలో మార్పు తెలుస్తుంది. ఆ వాతావరణానికి మీరు అలవాటుపడగలరా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా అలవాటుపడతారు.

పిల్లలు కౌమారదశకు చేరుకునేసరికి మీకు కూడా అలాంటి పరిస్థితే ఎదురౌతుంది. రాత్రికిరాత్రే పరిస్థితి మారిపోయినట్లు అనిపిస్తుంది. మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండని పిల్లవాడు ఇప్పుడు ఎక్కువగా తన స్నేహితులతో గడపాలనుకుంటాడు. ఆ రోజు జరిగిన విశేషాలు చెప్పనిదే నిద్రపోని మీ అమ్మాయి ఇప్పుడు, మీరు అడిగే ప్రశ్నలకు ముక్తసరిగా జవాబిస్తుంది.

“స్కూలు ఎలా జరిగింది?” అని మీరు అడుగుతారు.

“బాగానే జరిగింది” అని తను జవాబిస్తుంది.

నిశ్శబ్దం.

“ఏం ఆలోచిస్తున్నావ్‌?” అని మీరు అడుగుతారు.

“ఏమీలేదు” అని తను అంటుంది.

మరింత నిశ్శబ్దం.

అసలేమైంది? నిన్నమొన్నటివరకు ప్రతీది చెప్పిన మీ అమ్మాయి లేదా అబ్బాయి, ఇప్పుడు మీ దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నారని మీకు అనిపించవచ్చు. మీకు కూడా చెప్పని కొన్ని విషయాలు బయటివాళ్లకు చెబుతుండవచ్చు. వాళ్లు ఎదుగుతుండగా వెన్నంటే ఉండి సహాయం చేయాలనుకున్న మీరు ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు.

అలాగని ఈ దశలో మీ మధ్య దూరాలు పెరగాలా? అవసరంలేదు. ఆసక్తి, ఆందోళన కలగలిసిన ఈ దశలో ఏమి జరుగుతుందో మనం తెలుసుకుంటే వాళ్ల వెన్నంటే ఉండి సహాయం చేయగలుగుతాం.

బాల్యదశ నుండి యవ్వనంలోకి . . .

పిల్లలకు ఐదేళ్లు వచ్చేసరికి వాళ్ల మెదడు దాదాపు పూర్తిగా ఎదుగుతుందని పరిశోధకులు ఒకప్పుడు అనుకునేవాళ్లు. ఆ వయసు తర్వాత దాని పరిమాణంలో పెద్దగా మార్పు ఉండకపోయినా, దాని పనితీరు గురించి మాత్రం అలా చెప్పలేమని వాళ్లు ఇప్పుడు అనుకుంటున్నారు. యుక్తవయసులోకి అడుగుపెట్టాక వాళ్ల హార్మోన్లలో పెనుమార్పులు వస్తాయి. దాంతో వాళ్ల ఆలోచనా తీరే మారిపోతుంది. చిన్నపిల్లలు ఫలానాది తప్పా ఒప్పా అని మాత్రమే చూస్తారు. కానీ కౌమారదశ వచ్చేసరికి వాళ్లు మరింత లోతుగా ఆలోచించడం మొదలుపెడతారు, ప్రతీదానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. (1 కొరింథీయులు 13:11) తమకంటూ కొన్ని నమ్మకాలను ఏర్పరచుకుంటారు, వాటిని ఇతరుల ముందు చెప్పడానికి సంకోచించరు.

ఇటలీవాసి అయిన పావోలో తన పిల్లవాడిలో అలాంటి మార్పునే గమనించాడు. ఆయనిలా అంటున్నాడు: “మా అబ్బాయిని చూసినప్పుడు నా ముందు ఒక పిల్లవాడు కాదుగానీ ఒక చిన్నసైజు పెద్దమనిషి నిలబడినట్టు అనిపిస్తుంది. వాడి శరీరంలో వచ్చిన మార్పులను అంతకన్నా ఎక్కువగా వాడి ఆలోచనాతీరులో వచ్చిన మార్పులను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది. వాడు ఇప్పుడు తన అభిప్రాయాలను చెప్పడానికి, వాటిని సమర్థించుకోవడానికి భయపడడంలేదు.”

మీ పిల్లవాడిలో కూడా అలాంటి మార్పులేవైనా గమనించారా? చిన్నప్పుడు వాడు మీరెలా చెబితే అలా చేసేవాడు. ఎందుకు చేయాలని వాడు అడిగితే, “నేను చెబుతున్నాను కదా” అని మీరు చెబితే సరిపోయేది. ఇప్పుడు వాడికి అన్నిటికీ కారణాలు కావాలి. ఆఖరికి, వాడు కుటుంబ విలువల్నే ప్రశ్నిస్తుండవచ్చు. కొన్నిసార్లు వాడు కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడడం చూస్తే తిరుగుబాటు చేస్తున్నాడేమో అనిపిస్తుంది.

మీ పిల్లవాడు మీ విలువల్ని లెక్కచేయడం లేదని అనుకోకండి. వాడు కేవలం, మీ విలువల్నే తన విలువలుగా చేసుకోవడానికి పోరాడుతుండవచ్చు. ఉదాహరణకు, మీరు ఇల్లు మారుతున్నప్పుడు మీతోపాటు సామాన్లు కూడా తీసుకువెళ్తారు. కొత్త ఇంట్లో ప్రతీ వస్తువుకు స్థలం కేటాయించడం వీలవుతుందా? కాకపోవచ్చు. అలాగని విలువైన వస్తువులను పారేయరు కదా?

పిల్లలు ‘తమ తండ్రిని, తల్లిని విడిచే’ రోజు కోసం సిద్ధపడుతున్నప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు. (ఆదికాండము 2:24) మీ పిల్లవాడు ఇంకా చిన్నవాడే కాబట్టి ఆ రోజు రావడానికి ఇంకా సమయముంది. కానీ వాడు ఇప్పటినుండే సర్దుకోవడం మొదలుపెట్టాడు. కౌమారదశలో ఉన్న మీ అబ్బాయి మీరు నేర్పించిన విలువల్ని పరిశీలించి, పెద్దయ్యాక వేటిని అనుసరించాలో నిర్ణయించుకుంటున్నాడు.a

మీ పిల్లవాడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనే ఆలోచనే మీలో భయాందోళనలను కలిగించవచ్చు. అయితే, ఇప్పుడు ఏ విలువలు ప్రాముఖ్యమైనవని వాడు ఎంచుతాడో పెద్దవాడయ్యాక వాటినే పాటిస్తాడని గుర్తుపెట్టుకోండి. మీ పిల్లవాడు మీతో ఉన్నప్పుడే, తను భవిష్యత్తులో పాటించాల్సిన విలువల గురించి జాగ్రత్తగా పరిశీలించేందుకు సమయం దొరుకుతుంది.—అపొస్తలుల కార్యములు 17:11.

మీ పిల్లవాడు అలా చేయడం మంచిదే. ఇప్పుడు మీ ప్రమాణాలను వాడు గుడ్డిగా పాటిస్తే, రేపు ఇతరుల ప్రమాణాలను కూడా ముందూవెనకా ఆలోచించకుండా పాటించేస్తాడు. (నిర్గమకాండము 23:2) అలాంటి పిల్లలు వేరేవాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతారు కాబట్టి వాళ్లను బైబిలు “బుద్ధిలేని” వాళ్లు అని అంటోంది. (సామెతలు 7:7) బలమైన నమ్మకాలు లేని యువకుడు, ‘తప్పు త్రోవలో నడిపించే మోసగాళ్ల బోధల గాలి తాకిడికి, అలల పోటుకు కొట్టుకొనిపోయే’ ప్రమాదముంది.—ఎఫెసీయులు 4:14, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

మీ పిల్లవాడు అలా కాకూడదంటే ఏమి చేయాలి? ఈ కింది మూడు అంశాలపై దృష్టి నిలపాలి.

1 మంచి చెడులను గుర్తించగలగాలి

‘ఎదిగినవాళ్లు మంచిచెడులను గుర్తించడంలో నేర్పు సంపాదిస్తారు’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (హెబ్రీయులు 5:14, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ‘కానీ ఇవన్నీ నేను చిన్నప్పటి నుండే మా పిల్లవాడికి నేర్పిస్తూ వచ్చాను’ అని మీరు అంటారేమో. నిజమే, ఆ సమయంలో మీ పిల్లవాడికి అదెంతో మేలు చేసింది, తర్వాతి దశకు వాణ్ణి సిద్ధంచేసింది. (2 తిమోతి 3:14, 15) అయినా మంచిచెడులను గుర్తించడంలో నేర్పు సంపాదించాలని పౌలు అన్నాడు. చిన్నపిల్లలకు తప్పొప్పుల పరిజ్ఞానం ఉండవచ్చు. అయితే, కొంచెం ఎదిగాక వాళ్లు ‘బుద్ధి విషయంలో పెద్దవారు కావాలి.’ (1 కొరింథీయులు 14:20; సామెతలు 1:4; 2:11) మీ పిల్లవాడు గుడ్డిగా కాకుండా తన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి మీరు చెప్పింది చేయాలని మీరు కోరుకుంటారు. (రోమీయులు 12:1, 2) ఈ విషయంలో మీరు వాడికి ఎలా సహాయం చేయవచ్చు?

మొదటిగా వాణ్ణి మనసువిప్పి మాట్లాడనివ్వండి, మధ్యలో అడ్డుచెప్పకండి, మీకు ఇష్టంలేని విధంగా మాట్లాడినా అతిగా స్పందించకండి. ‘వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికీ కోపించడానికీ నిదానించాలి’ అని బైబిలు చెబుతోంది. (యాకోబు 1:19; సామెతలు 18:13) యేసు కూడా ఇలా చెప్పాడు: ‘హృదయంలో నిండివున్న దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది.’ (మత్తయి 12:34) మీ పిల్లవాడు చెప్పేది జాగ్రత్తగా వింటే వాడు నిజంగా దేని గురించి ఆందోళనపడుతున్నాడో మీరు తెలుసుకోగలుగుతారు.

ఒకవేళ మీరు మాట్లాడాల్సివచ్చినా, కటువుగా కాకుండా ప్రశ్నలు వేస్తూ మాట్లాడండి. యేసు తన శిష్యులతోనే కాక మొండివాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా అవతలివాళ్ల మనసులో ఉన్నది రాబట్టడానికి కొన్నిసార్లు, “మీకేమి తోచుచున్నది?” అని అడిగేవాడు. (మత్తయి 21:23, 28) మీ పిల్లవాడు మీకు ఇష్టంలేని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు మీరు కూడా యేసులాగే చేయవచ్చు. మచ్చుకు ఒక సన్నివేశాన్ని చూద్దాం.

మీ పిల్లవాడు ఇలా అంటే: “నాకు దేవుని మీద నమ్మకం లేదనిపిస్తోంది.”

ఇలా అనకండి: “దేవుని మీద నమ్మకం లేదంటావేమిటి? చిన్నప్పటినుండి నీకు అదే కదా నేర్పించింది! ఖచ్చితంగా నీకు ఆయనమీద నమ్మకముంది. అందులో అనుమానం లేదు.”

మీరిలా అనొచ్చు: “నీకు ఎందుకలా అనిపిస్తోంది?”

మీ పిల్లవాడి మనసులో ఉన్నది ఎందుకు తెలుసుకోవాలి? వాడు చెప్పేది మీరు విన్నా, వాడు ఏమి ఆలోచిస్తున్నాడో కూడా మీరు తెలుసుకోవాలి. (సామెతలు 20:5) దేవుడు ఉన్నాడని వాడు నమ్ముతుండవచ్చు, కానీ దేవుని ప్రమాణాల విషయంలో వాడికి కొన్ని సందేహాలు ఉండవచ్చు.

ఉదాహరణకు, దేవుని నైతిక నియమాలను మీరాలనిపించే శోధనకు గురౌతున్న ఓ పిల్లవాడు, దాన్ని తప్పించుకోవడానికి దేవుడు లేడని నమ్మాలనుకుంటాడు. (కీర్తన 14:1) ‘దేవుడు లేకపోతే బైబిలు ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉండదు కదా’ అని వాడు అనుకోవచ్చు.

కౌమారదశకు చేరిన మీ పిల్లవాడి ఆలోచనాతీరు అలావుంటే, ‘దేవుని ప్రమాణాలు నా మంచి కోసమేనని నేను నమ్ముతున్నానా?’ అనే ప్రశ్న గురించి వాడు ఆలోచిస్తే మంచిది. (యెషయా 48:17, 18) అవి తన మంచి కోసమేనని వాడు నమ్ముతుంటే, తన శ్రేయస్సు కోసం వాటిని పాటించడానికి ప్రయాసపడడంలో తప్పులేదని వాణ్ణి ప్రోత్సహించాలి.—గలతీయులు 5:1.

మీ పిల్లవాడు ఇలా అంటే: “ఇది మీ మతం అయినంత మాత్రాన నా మతం కావాలని రూలేమీ లేదు కదా?”

ఇలా అనకండి: “ఇది మన మతం, నువ్వు మా పిల్లోడివి. మేము ఏది నమ్మమని చెబితే నువ్వు దాన్నే నమ్మాలి.”

మీరిలా అనొచ్చు: “నువ్వు చాలా పెద్దమాట అన్నావు. మా నమ్మకాలు నీకు అవసరం లేదన్నావంటే, నీకంటూ వేరే నమ్మకాలు ఉండాలి కదా, అవేంటో చెప్పు. ఏ ప్రమాణాలు పాటిస్తే బాగుంటుందని నీకు అనిపిస్తుంది?”

మీ పిల్లవాడి మనసులో ఉన్నది ఎందుకు తెలుసుకోవాలి? అలా మాట్లాడడం వల్ల తను ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోగలుగుతాడు. మీ నమ్మకాలకు తన నమ్మకాలకు తేడా లేదనీ, తను ఆందోళనపడుతుంది పూర్తిగా వేరేదాని గురించనీ తెలుసుకొని వాడు ఆశ్చర్యపోవచ్చు.

బహుశా, ఇతరులకు తన నమ్మకాలను ఎలా వివరించాలో వాడికి తెలిసివుండకపోవచ్చు. (కొలొస్సయులు 4:6; 1 పేతురు 3:15) లేదా వేరే నమ్మకాలున్న అమ్మాయి ఆకర్షణలో పడ్డాడేమో! అసలు సమస్య ఏమిటో తెలుసుకోండి. దాన్ని గ్రహించేలా వాడికి సహాయం చేయండి. వాడు మంచిచెడులు ఎంతబాగా గ్రహిస్తే, పెద్దవాడైనప్పుడు అంతబాగా దాన్నుండి ప్రయోజనం పొందుతాడు.

2 పెద్దవాళ్ల నిర్దేశం ఉండాలి

కౌమారదశ పిల్లల్లో ఉండాల్సిన “ఒత్తిడి, కలత” నేడు కొన్ని సంస్కృతుల్లోని పిల్లల్లో అసలు కనిపించడం లేదని కొందరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ సమాజాల్లోని పిల్లలు పిన్నవయసులోనే పెద్దవాళ్లలా ప్రవర్తిస్తారని పరిశోధకులు గుర్తించారు. వాళ్లు పెద్దవాళ్లతో కలిసి పనిచేస్తారు, పెద్దపెద్ద బాధ్యతలు చేపడతారు. “యువతీయువకుల పోకడలు,” “బాల్యనేరాలు” చివరకు “కౌమారదశ” వంటి పదాలు ఆ సంస్కృతుల్లో లేనేలేవు.

అనేక దేశాల్లో స్కూళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. అలాంటి స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు మంచి స్నేహితులెవరైనా ఉన్నారంటే అది తోటి విద్యార్థులే. వాళ్లు ఇంటికి వస్తే ఇంట్లో ఎవరూ ఉండరు. అమ్మానాన్నలా ఇద్దరూ ఉద్యోగస్థులే. బంధువులేమో దగ్గర్లో ఉండరు. ఇక మిగిలింది తోటి స్నేహితులే.b వాళ్లు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారో మీరు గుర్తించారా? ఒక్క చెడు సహవాసాలు మాత్రమే కాదు ఇంకా ఎన్నో సమస్యలు వాళ్లకు ఎదురౌతాయి. పెద్దవాళ్ల సహవాసం లేకపోతే ఆఖరికి మంచి పిల్లలు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించే ప్రమాదముందని పరిశోధకులు గుర్తించారు.

ప్రాచీన ఇశ్రాయేలులో పిల్లలకు పెద్దవాళ్లతో సహవసించే అవకాశముండేది.c కౌమారదశలోనే యూదా దేశానికి రాజైన ఉజ్జియా గురించి బైబిలు చెబుతోంది. అంత పెద్ద బాధ్యతను ఉజ్జియా ఎలా నిర్వర్తించగలిగాడు? పెద్దవాడైన జెకర్యా మార్గనిర్దేశం వల్లే అది కొంతవరకు సాధ్యమైంది. ఆయన గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ప్రభువైన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగివుండాలో జెకర్యా ఉజ్జియాకు నేర్పాడు.”—2 దినవృత్తాంతములు 26:5, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

మీ విలువల్నే పాటించే పెద్దవాళ్లెవరైనా మీ పిల్లవానికి స్నేహితులుగా ఉంటూ మార్గనిర్దేశం చేస్తున్నారా? అలాగైతే, వాళ్లను చూసి అసూయపడకండి. వాళ్ల సహవాసం వల్ల మీ పిల్లలు సరైన దారిలో నడవగలుగుతారు. బైబిల్లోని ఒక సామెత ఇలా చెబుతోంది: ‘జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానంగలవాడౌతాడు.’—సామెతలు 13:20.

3 బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి

పిల్లలు వారానికి ఇన్ని గంటల కన్నా ఎక్కువ పని చేయకూడదు లేదా ఈ పనులు చేయకూడదు లాంటి నియమాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. పనిస్థలంలో జరిగే ప్రమాదాల నుండి పిల్లలను రక్షించడానికే ఆ దేశాలు అలాంటి నియమాలను విధించాయి. 18, 19 శతాబ్దాల్లో వచ్చిన పారిశ్రామిక విప్లవం కారణంగానే ఆ నియమాలు పుట్టుకొచ్చాయి.

పిల్లలను ప్రమాదాల నుండి, దౌర్జన్యం నుండి రక్షించేందుకే బాల కార్మిక చట్టాలు ఉనికిలోకి వచ్చాయనే మాట నిజమే అయినా, అవి వాళ్లకు బాధ్యత తెలియకుండా చేస్తాయని కొంతమంది నిపుణులు వాదిస్తారు. అందుకే, “దేన్నైనా దౌర్జన్యంగా పొందే హక్కు, కష్టపడకుండానే ఆయా సౌకర్యాలను పొందే హక్కు తమకుందనే భావన” కౌమారదశలో ఉన్న చాలామంది పిల్లల్లో పెరుగుతోందని ఎస్కేపింగ్‌ ది ఎండ్‌లెస్‌ అడాలసెన్స్‌ అనే పుస్తకం చెబుతోంది. “పిల్లలకు బాధ్యతలు నేర్పించకుండా కేవలం వాళ్లను సంతోషపెట్టడానికే మొగ్గుచూపుతున్న ఈ ప్రపంచంలో,” పిల్లల ఆలోచనాతీరు సహజంగా అలాగే ఉంటుందని దాని రచయితలు చెబుతున్నారు.

బైబిలైతే చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టిన యవ్వనుల గురించి చెబుతోంది. తిమోతి ఉదాహరణే తీసుకోండి. అపొస్తలుడైన పౌలు ఆయనను కలిసినప్పుడు తిమోతి కౌమారదశలోనే ఉండివుంటాడు. పౌలు సాహచర్యం వల్ల ఆయనకు ఎంతో మేలు జరిగింది. ‘నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింప చేయి’ అని ఒకానొక సందర్భంలో పౌలు తిమోతితో అన్నాడు. (2 తిమోతి 1:6) తిమోతి దాదాపు 20 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి పౌలుతో ప్రయాణాలు చేశాడు, సంఘాలను స్థాపిస్తూ సహోదరులను బలపర్చడంలో పౌలుకు సహాయం చేశాడు. దాదాపు పదేళ్లు తిమోతితో కలిసి పనిచేసిన తర్వాత, పౌలు ఆయన గురించి ఫిలిప్పీలోని క్రైస్తవులకు ఇలా చెప్పగలిగాడు: ‘మీ క్షేమం గురించి నిజంగా చింతించే అతనిలాంటి వాడెవడూ నా దగ్గర లేడు.’—ఫిలిప్పీయులు 2:20.

కౌమారదశలోని పిల్లలు బాధ్యతలు చేపట్టేందుకు ఇష్టపడతారు. అది మంచిదని, దానివల్ల మేలు జరుగుతుందని వాళ్లకు అనిపిస్తే మరింత ఇష్టంగా వాటిని చేపడతారు. దానివల్ల ప్రస్తుతం వాళ్లలో ఉన్న చక్కని నైపుణ్యాలు తెలుస్తాయి, వాళ్లు ముందుముందు బాధ్యతగల పెద్దవాళ్లుగా ఎదుగుతారు.

కొత్త పరిస్థితికి మీరు అలవాటుపడవచ్చు

ఈ ఆర్టికల్‌ మొదట్లో ప్రస్తావించినట్లు, మీకు ఒకవేళ కౌమారదశలోని పిల్లలు ఉంటే మీరు కొన్నేళ్ల క్రితం ఉన్న పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి మధ్య తేడాను గుర్తించేవుంటారు. మీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు గతంలో ఎలా సర్దుకుపోయారో ఇప్పుడూ అలాగే సర్దుకుపోగలరనే ధీమాతో ఉండండి.

మీ పిల్లవాడి కౌమారదశను (1) మంచిచెడులను గుర్తించేలా సహాయం చేసేందుకు, (2) పెద్దవాళ్ల నిర్దేశం ఉండేలా చూసేందుకు, (3) బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో నేర్పించేందుకు దొరికిన అవకాశంగా చూడండి. అలాచేస్తే మీ పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా తీర్చిదిద్దగలుగుతారు.

[అధస్సూచీలు]

a మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన కావలికోట అక్టోబరు - డిసెంబరు, 2009, 10-12 పేజీలను చూడండి.

b కౌమారదశలోని పిల్లలు సహజంగానే తోటి స్నేహితులతో ఉండాలని కోరుకుంటారు. వినోద పరిశ్రమ ఆ కోరికను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. యువతీయువకులకంటూ ఒక ప్రత్యేక సంస్కృతి ఉందని పెద్దవాళ్లు దాన్ని అర్థంచేసుకోలేరనే తలంపును, వాళ్లు తమలో కలిసిపోలేరనే ఆలోచనను అది పెంచిపోషిస్తోంది.

c “కౌమారదశ,” “కిశోరప్రాయం” వంటి పదాలు బైబిల్లో లేవు. ఇప్పుడు అనేక సంస్కృతుల్లో సాధారణంగా కనిపించే పోకడలకు భిన్నంగా, గతంలో దేవుని ప్రజల్లోని యవ్వనులు చిన్న వయసులోనే పెద్దవాళ్లలా బరువైన బాధ్యతలను చేపట్టేవాళ్లు.

[20వ పేజీలోని బాక్సు/చిత్రం]

“ఇంతకన్నా మంచి తల్లిదండ్రులు ఉండరేమో!”

బైబిలు సూత్రాలను ఎల్లప్పుడూ పాటించాలని యెహోవాసాక్షులైన తల్లిదండ్రులు తమ మాటల ద్వారా, చేతల ద్వారా పిల్లలకు నేర్పిస్తారు. (ఎఫెసీయులు 6:4) కానీ ఈ విషయంలో పిల్లలను బలవంతపెట్టరు. పిల్లలు కాస్త ఎదిగాక తాము పాటించే విలువల విషయంలో సొంతగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు అర్థంచేసుకుంటారు.

పద్దెనిమిదేళ్ల ఆష్లిన్‌ తన తల్లిదండ్రులు నేర్పించిన విలువలనే పాటిస్తోంది. “నా దృష్టిలో నా మతమంటే ఏదో వారానికి ఒకరోజు పాటించేది కాదు. దాన్ని నేను జీవితంలో ప్రతీక్షణం పాటిస్తాను. దాని సూత్రాలను మనసులో ఉంచుకునే ఏ పనైనా చేస్తాను. చివరకు స్నేహితులకు, చదువులకు, పుస్తకాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా వాటి ఆధారంగానే తీసుకుంటాను” అని ఆమె అంటోంది.

క్రైస్తవ తల్లిదండ్రులు తనకిచ్చిన శిక్షణను ఎంతో మెచ్చుకుంటూ ఆమె ఇలా అంది: “ఇంతకన్నా మంచి తల్లిదండ్రులు ఉండరేమో! నేను ఒక యెహోవాసాక్షిని కావాలనే కోరికను, ఎప్పుడూ అలాగే ఉండాలనే ఆశను వాళ్లు నాలో కలిగించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. నేను బతికివున్నంత కాలం వాళ్లు నాకు ప్రేరణగా ఉంటారు.”

[17వ పేజీలోని క్యాప్షన్‌]

మీ పిల్లలను మాట్లాడనివ్వండి

[18వ పేజీలోని క్యాప్షన్‌]

మార్గనిర్దేశం చేసే పెద్దవాళ్ల వల్ల మీ పిల్లలకు మేలు జరుగుతుంది

[19వ పేజీలోని క్యాప్షన్‌]

మంచి పనులు చేయడం వల్ల మీ పిల్లలు బాధ్యతగలవారిగా తయారౌతారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి