కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • br-1110 పేజీలు 26-28
  • నా గురించి నాకు తెలుసా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా గురించి నాకు తెలుసా?
  • తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1 నా బలాలు ఏమిటి?
  • 2 నా బలహీనతలు ఏమిటి?
  • 3 నా లక్ష్యాలు ఏమిటి?
  • 4 నా నమ్మకాలు ఏమిటి?
  • నా గురించి నాకు పూర్తిగా తెలుసా?
    యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • 9 గుర్తింపు
    తేజరిల్లు!—2018
  • యేసు అద్భుతంగా స్వస్థపర్చడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఈ వ్యక్తి నాకు తగిన వ్యక్తేనా?
    తేజరిల్లు!—2007
మరిన్ని
తేజరిల్లు!: పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?
br-1110 పేజీలు 26-28

యువత ఇలా అడుగుతోంది

నా గురించి నాకు తెలుసా?

బాలు రావడం చూసిన మధుకు జరుగబోయేది అర్థమై కంగారు మొదలైంది. “మధు, ఒకసారి ట్రై చేస్తావా!” అంటూ బాలు తన చేతిలో ఏముందో చూపిస్తాడు. అది సరిగ్గా మధు ఊహించిందే – గంజాయి కలిపిన సిగరెట్టు. అది తీసుకోవడం మధుకు ఇష్టం లేదు అలాగని అందరిముందు చేతకానివాడిలా కనిపించడం కూడా ఇష్టంలేదు. మధు తటపటాయిస్తూ “ఆఁ, ఇప్పుడొద్దులే ఈసారెప్పుడైనా . . .” అంటాడు.

బాలు రావడం చూసిన ఝాన్సీకి జరుగబోయేది అర్థమైంది కానీ ఏం చేయాలో ఆమెకు తెలుసు. “ఝాన్సీ, ఒకసారి ట్రై చేస్తావా!” అంటూ బాలు తన చేతిలో ఏముందో చూపిస్తాడు. అది సరిగ్గా ఝాన్సీ ఊహించిందే – గంజాయి కలిపిన సిగరెట్టు. “నాకొద్దు” అని నిక్కచ్చిగా చెప్పింది. “నాకు అంత త్వరగా చనిపోవాలని లేదు బాలు, అయినా . . . నువ్వు అసలు సిగరెట్టే తాగవనుకున్నానే!”

వాళ్లిద్దరిలో ఝాన్సీ మాత్రమే ఒత్తిడిని ఎందుకు చక్కగా ఎదుర్కోగలిగింది? ఎందుకంటే మధుకు, ఝాన్సీకి ఒక విషయంలో తేడా ఉంది. అదేంటో తెలుసా? ఝాన్సీ ఒక గుర్తింపు సంపాదించుకుంది. గుర్తింపు అంటే పేరు, ఫోటో ఉన్న కార్డు కాదు. అది మీ లోపలే ఉండి, మీరెవరో మీకెలాంటి విలువలు ఉన్నాయో మీకు తెలియజేస్తుంది. అలా తెలిసుంటే, తప్పు చేయాలనే ఒత్తిడులను మీరు ఎదుర్కోగలుగుతారు. వేరే వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలు అవ్వరు, మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోగలుగుతారు. అంతటి నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? దానికోసం ముందుగా కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం మంచిది.

1 నా బలాలు ఏమిటి?

ఎందుకు తెలుసుకోవాలి? మీకు ఏయే సామర్థ్యాలు, మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటే మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది.

ఆలోచించండి: ప్రతీ ఒక్కరికి రకరకాల నైపుణ్యాలు ఉంటాయి. కొంతమందికి కళల్లో, సంగీతంలో నైపుణ్యం ఉంటుంది, మరికొంతమంది ఆటల్లో రాణిస్తారు. రమ్య అనే అమ్మాయి కార్లు బాగా రిపేరు చేస్తుంది.a “మెకానిక్‌ అవ్వాలనేది నా కోరికని నాకు 15 ఏళ్లున్నప్పుడు అర్థమయ్యింది” అని ఆమె చెబుతుంది.

బైబిలు ఉదాహరణ: ‘మాటల్లో నేను నేర్పులేనివాణ్ణి అయినా జ్ఞానంలో నేర్పులేనివాణ్ణి కాను’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 కొరింథీయులు 11:6) ఇతరుల వల్ల ఇబ్బందులు పడినా, లేఖనాల మీద ఉన్న చక్కని అవగాహన వల్ల పౌలు స్థిరంగా ఉండగలిగాడు. ఇతరుల్లో ఉన్న చెడు లక్షణాలను చూసి ఆయన నీరుగారిపోలేదు.—2 కొరింథీయులు 10:10; 11:5.

మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీకు ఏ సామర్థ్యం, నైపుణ్యం ఉందో కింద రాయండి.

․․․․․

ఇప్పుడు మీలో ఉన్న మంచి లక్షణాన్ని వివరించండి. (మీరు ఇతరుల గురించి పట్టించుకుంటారా? వాళ్లకు సహాయం చేస్తారా? మీరు ఆధారపడదగ్గ వ్యక్తేనా? సమయాన్ని పాటిస్తారా?)

․․․․․

“నేను అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎవరైనా నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను పనిలో ఎంత బిజీగావున్నా ఆ పని ఆపి వాళ్లు చెప్పేది వింటాను.”—భావన.

మీలో ఏ మంచి లక్షణం ఉందో తెలుసుకోవడం మీకు కష్టంగా ఉంటే, చిన్నతనం నుండి మీరు ఏ విషయంలో మెరుగయ్యారో ఆలోచించి, దాన్ని కింద రాయండి.—“మీ తోటివాళ్లు ఇలా అంటున్నారు” అనే బాక్సు చూడండి.

․․․․․

2 నా బలహీనతలు ఏమిటి?

ఎందుకు తెలుసుకోవాలి? బలహీనంగా ఉన్న ఒకే ఒక్క లింకువల్ల ఎంతటి బలమైన గొలుసైనా తెగిపోయే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్న బలహీనతలు మీ జీవితాన్ని అదుపు చేస్తుంటే మీ గుర్తింపు తొందరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

ఆలోచించండి: లోపాలు అందరిలో ఉంటాయి. (రోమీయులు 3:23) ప్రతీ ఒక్కరు తమలో ఉన్న ఏదో ఒక లక్షణాన్ని మార్చుకోవాలని అనుకుంటారు. శిరీష అనే అమ్మాయి ఇలా అంటుంది, “చిన్నచిన్న విషయాల కోసం నేనెందుకు చికాకుపడాలి? ప్రతీ చిన్న విషయానికి నాకు కోపం వస్తుంది అప్పుడు ఏం మాట్లాడతానో, ఏం చేస్తానో నాకే తెలియదు!”

బైబిలు ఉదాహరణ: తన బలహీనతలు ఏమిటో పౌలుకు తెలుసు. ఆయన ఇలా రాశాడు, ‘అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కాని వేరొక నియమం నా అవయవాల్లో ఉందని నాకు కనబడుతుంది. అది నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ పాప నియమానికి నన్ను చెరపట్టి లోబరచుకుంటుంది.’—రోమీయులు 7:22, 23.

మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు ఏయే బలహీనతలను మార్చుకోవాలనుకుంటున్నారు?

․․․․․

“ప్రేమ కథలతో ఉన్న సినిమాలు చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తోందని, ప్రేమించడానికి నేను కూడా ఒక అబ్బాయిని చూసుకోవాలనే కోరిక కలుగుతోందని నేను గ్రహించాను. కాబట్టి నేను చూసే వినోదం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమయ్యింది.”—కావ్య.

3 నా లక్ష్యాలు ఏమిటి?

ఎందుకు తెలుసుకోవాలి? మీకు లక్ష్యాలు ఉంటేనే, మీ జీవితం ఒక దిశగా సాగుతుంది, దానికి అర్థం చేకూరుతుంది. మీ గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుతగిలే వ్యక్తులకు, పరిస్థితులకు కూడా దూరంగా ఉండగలుగుతారు.

ఆలోచించండి: మీరు ఒక ఆటో ఎక్కి, దానిలోని పెట్రోలు అయిపోయేంత వరకూ ఒకే వీధి చూట్టూ గిరగిరా తిప్పమని డ్రైవరుకు చెబుతారా? అది తెలివితక్కువ పని, డబ్బు కూడా దండగ! లక్ష్యాలు ఉంటే మీరు మీ జీవితంలో గమ్యం లేకుండా ఊరికే తిరగరు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో మీకు తెలుస్తుంది.

బైబిలు ఉదాహరణ: “నేను గమ్యం లేకుండా పరుగెత్తను” అని పౌలు రాశాడు. (1 కొరింథీయులు 9:26, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) గాలి ఎటు వీస్తే అటు వెళ్తూ, జీవితం ఎలా నడిపిస్తే అటు నడవాలని పౌలు కోరుకోలేదు కానీ జీవితంలో లక్ష్యాలు పెట్టుకుని వాటికి తగ్గట్టుగా జీవించాడు.—ఫిలిప్పీయులు 3:12-14.

మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వచ్చే సంవత్సరంలోపు మీరు చేరుకోవాలనుకుంటున్న మూడు లక్ష్యాలను కింద రాయండి.

1 ․․․․․

2 ․․․․․

3 ․․․․․

వీటిలో మీకు అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఏదో ఎంచుకుని దాన్ని చేరుకోవడానికి ఇప్పటినుండే ఏం చేయవచ్చో కింద రాయండి.

․․․․․

“నేను ఏదో ఒక పని చేస్తుండకపోతే, గమ్యం లేని ప్రయాణం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంటుంది. లక్ష్యాలు పెట్టుకోవడం వాటిని సాధించడానికి ప్రయత్నించడం చాలా మంచిది.”—జీవన్‌.

4 నా నమ్మకాలు ఏమిటి?

ఎందుకు తెలుసుకోవాలి? ఖచ్చితమైన నమ్మకాలు లేకపోతే మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నీళ్లకు ఏ రంగు కలిపితే ఆ రంగులోకి మారతాయి అలాగే మీ స్నేహితులకు తగ్గట్లుగా మీ రంగు మారే అవకాశం ఉంది. మీకంటూ ఒక గుర్తింపు లేదని ఖచ్చితంగా చెప్పడానికి అది ఒక రుజువు.

ఆలోచించండి: ‘ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో’ పరీక్షించమని బైబిలు క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. (రోమీయులు 12:2) మీరు నమ్మిన దాన్నే పాటిస్తే, ఇతరులు ఏం చేసినా మీరు మీరుగానే ఉంటారు.

బైబిలు ఉదాహరణ: ప్రవక్తయైన దానియేలు కుటుంబ సభ్యులకు, తోటి ఆరాధకులకు దూరంగా ఉన్నా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలని చిన్నప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాడు. (దానియేలు 1:8) అలా చేసినందుకే దానియేలు మారిపోకుండా తన నమ్మకాల ప్రకారం జీవించాడు.

మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ నమ్మకాలు ఏమిటి? ఉదాహరణకు:

● దేవుని మీద మీకు నమ్మకం ఉందా? ఒకవేళ ఉంటే ఎందుకు నమ్ముతున్నారు? ఆయన ఉన్నాడని మీరు దేన్ని బట్టి నమ్ముతున్నారు?

● దేవుడు నైతిక విలువలు పెట్టింది మీ మంచి కోసమేనని మీరు నమ్ముతున్నారా? అలా అయితే ఎందుకు నమ్ముతున్నారు? ఉదాహరణకు సెక్స్‌ విషయంలో మీ తోటివారిలా “స్వతంత్రంగా” జీవించడం కన్నా దేవుని నియమాలకు లోబడడం వల్లే ఎక్కువ సంతోషంగా ఉంటారని మీకు ఎలా నమ్మకం కుదిరింది?

ఈ ప్రశ్నలకు వెంటనే జవాబులు ఇవ్వాలనేమీ లేదు. మీరు అలా నమ్మడానికి కారణాలేమిటో సావధానంగా ఆలోచించండి. అలా చేసినప్పుడు మీరు మీ నమ్మకాలను మరింత బాగా సమర్థించుకోగలుగుతారు.—సామెతలు 14:15; 1 పేతురు 3:15.

“మీ నమ్మకాల గురించి మీకే సరిగ్గా తెలియకపోతే స్కూల్లో పిల్లలు తమ నమ్మకాలను మీమీద రుద్దుతారు. అయితే నా విశ్వాసం విషయంలో అపనమ్మకంగా ఉండాలని నేను అనుకోలేదు. కాబట్టి నా నమ్మకాలకున్న స్పష్టమైన, బలమైన రుజువులను తెలుసుకోవాలని కృషి చేశాను. ‘అది నా మత నమ్మకాలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని నేను చేయలేను’ అని చెప్పే బదులు ‘అది చేయడం సరి కాదని నాకు అనిపిస్తుంది’ అని చెప్పగలగడం ముఖ్యం. అవి నా నమ్మకాలు.”—స్నేహ.

రాలిన ఆకు అయితే చిన్న గాలికి కూడా ఎగిరిపోతుంది, కానీ చెట్టు మాత్రం పెద్దపెద్ద తుఫానులు వచ్చినా స్థిరంగా నిలబడే ఉంటుంది. ఈ రెండింటిలో మీరు దేనిలా ఉండాలనుకుంటున్నారు? మీలోని గుర్తింపును బలపర్చుకుంటే మీరు ఆ చెట్టులా ఉంటారు. అప్పుడు, నా గురించి నాకు తెలుసా? అనే ప్రశ్నకు జవాబివ్వగలుగుతారు.

[అధస్సూచి]

a కొన్ని అసలు పేర్లు కావు.

[27వ పేజీలోని క్యాప్షన్‌]

మీ తోటివాళ్లు ఇలా అంటున్నారు

“ఏ నిర్ణయం తీసుకోవాల్సివచ్చినా అన్ని అంశాలను లెక్కలోకి తీసుకోవాలని, దేవునికి ఇష్టం లేని పనులకు దూరంగా ఉండాలని నేను ఎదిగేకొద్దీ నేర్చుకున్నాను.”

“నా చిన్నప్పుడు నాలా ఉండని వాళ్లంతా తేడా మనుష్యులని అనుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం అందరూ ఒకే రకంగా ఉండకపోవడమే బాగుందని అనిపిస్తుంది, వాళ్ల అభిప్రాయాలకు విలువివ్వడం నేర్చుకున్నాను.”

[26వ పేజీలోని క్యాప్షన్‌]

బలాలు

బలహీనతలు

లక్ష్యాలు

నమ్మకాలు

[27వ పేజీలోని చిత్రం]

జెర్మియా

[27వ పేజీలోని చిత్రం]

జెన్నిఫర్‌

[28వ పేజీలోని క్యాప్షన్‌]

మీ తల్లిదండ్రులను ఇలా అడిగి చూడండి

నాలో ఏ సామర్థ్యాలు ఉన్నాయని మీరు గమనించారు? ఏ లక్షణాలను నేను మార్చుకోవాలని మీకనిపిస్తుంది? మీరు దేవుని ప్రమాణాల మీద నమ్మకం పెంచుకోవడానికి ఏం చేశారు?

[28వ పేజీలోని చిత్రం]

మీ గుర్తింపు బలంగా ఉంటే, పెద్ద తుఫానులను కూడా తట్టుకునే లోతైన వేళ్లున్న చెట్టులా మీరు ఉంటారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి