ప్రపంచ పరిశీలన
స్త్రీలపై దాడి
“బ్రెజిల్‌లో స్త్రీలపై జరిగే దాడిలో 63 శాతం ఇంట్లోనే జరుగుతోంది, దాంట్లో కేవలం మూడవవంతు మాత్రమే రిపోర్టు చేయబడుతోంది” అని ఓ గ్లోబో వార్తా పత్రిక తెలియజేస్తోంది. “ప్రధానంగా పేద స్త్రీలే ఇంట్లో హింసించబడుతున్నారు, తాము హింసించబడుతున్నామన్న విషయాన్ని గురించి తరచూ పోలీసులకు రిపోర్టుచేసేది కూడా వాళ్లే. హింసించబడుతున్న ధనవంతులైన స్త్రీలు గణాంకాల లెక్కలో అరుదుగా కన్పిస్తారు” అని కూడా ఆ పత్రిక అంటోంది. ఇతర దేశాలు కూడా ఇలాంటి గణాంకాలనే నివేదిస్తున్నాయి. ఉదాహరణకు అమెరికా న్యాయశాఖ వెల్లడిచేసిన ఒక సర్వే ప్రకారం, “అమెరికాలోని సగం కంటే ఎక్కువమంది స్త్రీలు, వారి జీవితంలోని ఏదో ఒక సమయంలో శారీరకంగా హింసించబడినవారే, ప్రతి ఐదుగురిలో ఒకరు మానభంగం చేయబడ్డారు లేక వాళ్ళను మానభంగం చేసే ప్రయత్నం జరిగింది” అని రోయిటర్స్ న్యూస్ సర్వీస్ చెబుతోంది. అమెరికాలోని ఆరోగ్య మానవ సేవల కార్యదర్శి అయిన డాన్నా షాలాలా, “ఈ సర్వేలోని ప్రతి ఒక్కరూ మన కుమార్తెలకూ, తల్లులకూ, మన పొరుగువారికీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు” అని అంటున్నారు.
“అలక్ష్యం చేయబడిన సహాయకం”
ఆసుపత్రుల్లో రోగులను స్వస్థపరిచే ప్రక్రియలో ప్రాముఖ్యమైన ఒక కారకం ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడుతుంది అని జర్మన్ వార్తాపత్రికయైన సూకోలోజీ హాయిటా చెబుతుంది. ఆ కారకం, ప్రక్క బెడ్డులో రోగి. తనకు సమీపంలో తనకులాగే రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉండడం రోగం నయం కావడంలో సహాయకరంగా ఉంటుందనీ, సాధారణంగా అందరూ నమ్మేదానికి భిన్నంగా, రోగుల్లో కేవలం అల్పసంఖ్యాకులు, అంటే దాదాపు 7 శాతం మంది మాత్రమే ఒంటరిగా ఉండాలని కోరుకుంటారనీ ఒక అధ్యయనం చూపిస్తుంది. చాలామంది, తమ గదిలో ఒకరో ఇద్దరో రోగులు ఉండడాన్ని ఇష్టపడతారు. అయినప్పటికీ, ఆ రోగులు ఎలాంటి వ్యక్తులు అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఆదర్శవంతుడైన రూమ్‌మేట్, “ముఖ్యంగా కలిసిపోయేవాడూ, సహనశీలం గలవాడూ అయ్యుండాలి” అని ఆ శీర్షిక చెబుతుంది. ఈ క్రింది కోరదగిన లక్షణాలు ఆయా లక్షణాలకున్న ప్రాముఖ్యతను బట్టి ఈ విధంగా పట్టిక చేయబడ్డాయి: “అర్థం చేసుకోవడం, హాస్యప్రియం, పారిశుద్ధ్యత, విశాలమైన మనస్సు, సహాయపడే గుణం, ఇతరుల విషయంలో శ్రద్ధ చూపడం, ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం, స్నేహశీలం, సత్యసంధత, శుభ్రత, సమతుల్యత, ఓపిక, వివేచన, దయ, నెమ్మది, తెలివి, పరిస్థితులను బట్టి నడుచుకోవడం, అప్రమత్తత.”
మిచ్ తుఫాను సాధించినదేమిటంటే
గత సంవత్సరం, భీకరమైన మిచ్ తుఫాను రావడం వల్ల వేలాది మంది చనిపోయినప్పటికీ, సుమారు పది లక్షల మందిని అది బాధించినప్పటికీ, దానివల్ల ఒక మంచి పని కూడా జరిగింది. ఈ తుఫాను “క్రొత్త గోడలనూ, ఎముకలనూ, పురావస్తు ముక్కలనూ వెలికి తేవడం” ద్వారా, నికరాగ్వాలో ఈశాన్యదిశగా 90 కిలోమీటర్ల దూరాన ఉన్న లీయోన్ వ్యేహో శిథిలాలను త్రవ్వుతున్న పురావస్తు శాస్త్రజ్ఞులకు సహాయపడిందని మెక్సికో సిటీలోని, ఎక్సెల్స్‌యోర్ అనే వార్తాపత్రిక నివేదించింది. మిచ్ తుఫాను వచ్చి నేల కొట్టుకుపోవడం వల్ల, ఎంతోకాలంగా పురావస్తు శాస్త్రజ్ఞులు ఏ ప్రాంతాన్ని కనుగొనడంలో విఫలులయ్యారో ఆ ప్రాంతం వెలికి వచ్చింది అని లీయోన్ వ్యేహో రూయిన్స్ హిస్టోరికల్ సైట్ డైరెక్టరైన రీగోబర్టో నాబారో వివరిస్తున్నారు. 2.5 మీటర్ల ఎత్తూ, 70 సెంటీమీటర్ల వెడల్పూ, 100 మీటర్ల పొడవూ ఉన్న ఒక గోడ బయటపడింది. నాబారో అభిప్రాయం ప్రకారం, “పురావస్తు శాస్త్రజ్ఞులకు అనేక సంవత్సరాలు పట్టే పనిని ఈ తుఫాను మూడు రోజుల్లో చేసింది” అని ఆ వార్తాపత్రిక పేర్కొంటోంది.
అమిత వ్యాయామం వల్ల కలిగే ప్రమాదాలు
వ్యాయమం హృదయానికీ, ఊపిరితిత్తులకూ మంచిదే కానీ, అమిత వ్యాయామం ఎముకలను బలహీనం చేసి, శేషజీవితంలో సమస్యలు తలెత్తడానికి కారణమవుతుంది. లండన్‌లోని గార్డియన్ పత్రిక ప్రకారం, మానవుని అస్థిపంజరంపై వ్యాయామం చూపించే ప్రభావాన్ని గురించి చర్చించిన ఒక సమావేశంలో నివేదించబడింది ఈ విషయమే. రన్నర్లూ, “శరీర దారుఢ్యాన్ని అత్యధిక స్థాయిలో పెంచుకోవాలని ప్రయత్నించే”వారూ చాలా ప్రమాదంలో ఉన్నారు. ఏరోబిక్ లేదా డ్యాన్స్ క్లాసుల్లో చాలా తరచుగా పాల్గొనే యువతులు శరీర భాగాల్లో ఒత్తిడి అధికమై ఎముకలు ఫ్రాక్చర్ అయి బాధపడుతారనీ, వయస్సు మళ్ళుతుండగా ఓస్టోపొరసిస్‌తో బాధపడవలసి వచ్చే ప్రమాదం ఉందనీ చెప్పబడుతుంది. “18 లేదా 19 ఏళ్ళవరకు మాత్రమే అథ్లెట్ల ఎముకల బలం పెరుగుతుందనీ, ఆ తర్వాత వయస్సు మళ్ళుతున్న కొలది అవి బలహీనమవ్వడం మొదలౌతుందని హెచ్చరించబడింది. ఎముకల బలాన్ని పెంచుకునేందుకు, స్క్వాష్, టెన్నిస్ మంచి ఆటలుగా గుర్తించబడ్డాయి” అని ఆ శీర్షిక చెప్పింది. యూనివర్సిటీ కాలెజ్ ఆఫ్ లండన్‌కు చెందిన బోన్ సెంటర్ అధిపతియైన మైకిల్ హార్టన్, వ్యాయామానికీ, ఆరోగ్యానికీ మధ్య సరైన సమతుల్యత ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చాడు. “యౌవనస్థులు చాలా ఎక్కువ వ్యాయామం చేయాలని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. అది కొన్నాళ్ళపాటు ప్రయోజనకరంగా ఉండవచ్చు. కానీ ఈ యౌవనస్థులు 50 ఏళ్ళ వయస్సుకు చేరుకునే సరికి వాళ్ళకు ఏమి సంభవిస్తుందో ఎవరూ ఆలోచించలేదు” అని ఆయన హెచ్చరించాడు.
జలుబుకు మందు లేదా?
బ్రిటన్స్ కామన్ కోల్డ్ సెంటర్ పది సంవత్సరాలపాటు 80 లక్షల డాలర్లు ఖర్చు పెట్టి పరిశోధన చేసిన తర్వాత, చివరికి తన పరాజయాన్ని ఒప్పుకుంది. జలుబు రావడానికి 200 కన్నా ఎక్కువ వైరసులు కారణమౌతాయి కనుక, జలుబుకు ఒక చికిత్సను కనుగొనడమంటే, “మశూచినీ, చికెన్‌పోక్స్‌నీ, గవదబిళ్ళలనీ, జర్మన్ మశూచినీ ఒకేసారి చికిత్సచేయడానికి ప్రయత్నించడం లాంటిదే. అన్ని వైరసులనూ ఒకేసారి నిర్మూలం చేసే చికిత్స వస్తుందని నేననుకోవడం లేదు. మనం చేయగల్గిందల్లా, జలుబుతో సర్దుకుపోవడమేననుకుంటా” అని కార్డిఫ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వేల్స్‌లోని సెంటర్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ రొనాల్డ్ ఎకల్స్ వ్యాఖ్యానిస్తున్నారు.