నిచ్చెనలను ఉపయోగించడం—సురక్షితత్వం కోసం మీరు ఈ పరిశీలనలను చేస్తారా?
ఐర్లాండ్‌లోని తేజరిల్లు! విలేఖరి
పోల్ తన ఇంటి బయటి బల్బును మార్చవలసిన అవసరం ఉంది. పై అంతస్థు వెలుపలి కిటికీలను శుభ్రం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఈ పనులను చేయమని ఆయన భార్య చాలాసార్లు చెప్పింది. కాని పోల్ ఈ పనులను వాయిదావేస్తూ వచ్చాడు. ఎందుకని? ఎందుకంటే తను ఆ పనులను చేయాలంటే నిచ్చెనను ఉపయోగించాలి.
తను అలా భయపడటం సహేతుకమే. నిచ్చెనల వల్ల కలిగే ప్రమాదాల్లో, పెద్ద దెబ్బలు తగలవచ్చనీ, అవి మరణానికి కూడా దారితీయవచ్చనీ ఆయనకు తెలుసు. తరచూ ఇలా జరగడానికి కారణం, నిచ్చెనను సరిగ్గా ఎలా ఉపయోగించాలనే దాని గురించి వర్కర్లు సరిగా ఆలోచించకపోవడమే.
పోల్ ఈ పనులకు ఉపక్రమించే ముందు, నిచ్చెనల గురించి ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి వచ్చింది? ఆయన తన పనులను సురక్షితంగా చేయడానికి ఆయనకు సహాయపడిన పది విషయాలు ఈ క్రింద సూచించబడ్డాయి.
ప్రమాదం కలగని విధంగా ఉందా నిచ్చెన?
1 సరైన నిచ్చెనను తీసుకోండి. నిచ్చెన మరీ చిన్నగా ఉన్నట్లయితే నిచ్చెన మీద మునివేళ్ళపై నిలబడి పని చేయవలసి వస్తుంది. నిచ్చెన మరీ పొడుగ్గా ఉన్నట్లయితే దానిని సరైన విధంగా నిలబెట్టడం వీలు కాకపోవచ్చు, అది ప్రమాదకరం కాగలదు. మీ అటక మీదకు ఎక్కడానికి స్టెప్లాడర్ను ఉపయోగించకండి. మీ అటకకు తగిన నిచ్చెనను ఫిక్స్ చేసుకోండి, లేదా మీ అటకకు ఆనించడానికి వీలయ్యే నిచ్చెనను ఉపయోగించండి.
2 మీ నిచ్చెనను జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. నిచ్చెన బయటే ఉంచబడుతోందా? కలపనిచ్చెనలు తడిగా ఉన్నప్పుడు వ్యాకోచించి, పొడిగా ఉన్నప్పుడు సంకోచిస్తాయి. కాలక్రమేణా, నిచ్చెనకుండే మెట్లు వదులై నిచ్చెన బలహీనమయ్యేందుకు కారణమవుతుంది. కలపనిచ్చెన మెట్లలో ఏవైనా విరిగాయా లేక కుళ్ళిపోతున్న సూచనలు ఏమైనా కనపడుతున్నాయా? తరచుగా, ప్రతి చెక్క మెట్టుకు ఆసరాగా, దాని క్రింది భాగంలో లోహపు కడ్డీ ఉంటుంది. ఇది సరియైన స్థలంలో సురక్షితంగా అమర్చబడి ఉందా? నిచ్చెనలో ఉన్న లోహపు మెట్లను అమర్చేందుకు ఉపయోగించిన స్క్రూలు లేక మేకులు విరిగిపోయాయా లేక తుప్పుపట్టిపోయాయా? పెద్ద ఎక్స్టెన్షన్ నిచ్చెనలకు కప్పీలూ తాళ్ళూ ఉండవచ్చు. కప్పీలు సాఫీగా పనిచేస్తున్నాయా? తాడు వాడీ వాడీ బాగా పాడైపోయిన సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? అది ఇప్పటికీ కావలసినంత పొడవుందా? కావలసిన మరమ్మతులూ లేక పాతవి తీసి క్రొత్తవి అమర్చడాలూ అన్నీ వెంటనే చెయ్యండి.
మెట్లు ఎక్కుతున్నప్పుడు జారిపోకుండా ఉండేందుకు, మెట్లలో గాడులను చేస్తారు. గాడుల్లో చేరిన ఎలాంటి మురికినైనా మర్చిపోకుండా తొలగించండి. నిచ్చెన అడుగు భాగంలో నిచ్చెన జారిపడకుండా చేసే ఆన్టీస్లిప్ ప్యాడ్లు ఉండాలి. ఆ ప్యాడ్లు ఉన్నాయా, అవి పూర్తిగా అరిగిపోయాయా అన్నది చూడండి.
3 నిచ్చెనలను సురక్షితంగా రవాణా చేయండి. వాహనంలో తీసుకువెళ్ళేటప్పుడు, సరైన నిచ్చెనల ర్యాక్‌లో నిచ్చెనను భద్రంగా ఉంచండి లేదా ట్రెయిలర్లో నిచ్చెన కదలకుండా ఉండేందుకు కనీసం రెండు చోట్ల బిగించండి. పొడుగాటి నిచ్చెన యొక్క కొంత భాగం వాహనం వెలుపలే ఉండవచ్చు. అలా ఉన్నట్లయితే, వెనక వస్తున్నవాళ్ళకి స్పష్టంగా కనబడేలాగున నిచ్చెన చివరలో ఒక హెచ్చరిక జెండాను కట్టండి.
పెద్ద నిచ్చెనైతే ఇద్దరు వ్యక్తులు మోసుకువెళితే సురక్షితంగా ఉంటుంది. కానీ, మరొకరి సహాయం లేకుండా ఒక్కరే మోసుకొని వెళ్ళవలసి వస్తే, దానిని అడ్డంగా మోసుకు వెళ్ళాలనే మీరు ఎంపిక చేసుకున్నట్లయితే, మీరు నిచ్చెనను భుజానికి ఎత్తుకుని, ఒక చేతితో గట్టిగా పట్టుకొని, మరో చేతిని అది బ్యాలన్స్‌గా ఉండేందుకు ఉపయోగించండి. ఎవరికీ తగలకుండా ఉండేందుకు ముందు భాగంలో ఉండే దాని చివరను తల ఎత్తుకంటే పైగా ఉండేలా చూసుకోవాలి. నిచ్చెన ముందూ వెనకా సమానంగా ఉండేలా చూసుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి! హాస్యచిత్రాలు, నిచ్చెనను తీసుకెళ్లేటప్పుడు అది తగిలి ఎవ్వరికైనా దెబ్బలు తగలడాన్ని సరదా అన్నట్లుగా చూపించవచ్చు. నిజ జీవితంలో, మీకే అలా జరిగితే అది ఎంతమాత్రం సరదాగా ఉండదు.
నిచ్చెనను మీరు నిటారుగా మోస్తున్నప్పుడు, నిచ్చెన భారాన్ని శరీరం మీదకు తీసుకుని, ఒక చేతిని దాన్ని పట్టుకోవడానికి, మరొక చేతిని దాన్ని బ్యాలన్స్‌గా ఉంచడానికీ ఉపయోగించండి. అలా నిచ్చెనను మోసుకువెళ్తున్నప్పుడు, పైన వైర్లు, లైట్లు, సైన్‌బోర్డులు ఏమైనా ఉన్నాయేమో చూడండి!
4 నిచ్చెనను సరిగ్గా నిలబెట్టండి. భద్రత నిమిత్తమై, నిచ్చెనను దాని పార్శ్వ భాగం మీద ఆనించి ఉంచకండి. నేల మీది నుండి 75 డిగ్రీల కోణంలో దాన్ని ఆనించి ఉంచాలి.
5 పైనా, క్రిందా కూడా ఆసరా ఇవ్వండి. నిచ్చెన పై భాగాన్ని దేని మీద ఆనించి పెడుతున్నారనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిచ్చెనను దేనిపైన ఆనించబోతున్నారో ఆ చోటు గట్టిగా ఉండాలి, జారిపోయేలా ఉండకూడదు. నిచ్చెనను అద్దాల మీద లేక ప్లాస్టిక్ వాటి మీద ఆనించవద్దు. సాధ్యమైతే, నిచ్చెనను కదలకుండా ఉండే ఏదైనా ఒక దానికి బిగించండి. నిచ్చెన పైభాగం, నిచ్చెన మీది నుండి ఎక్కడికి ఎక్కాలనుకుంటారో అక్కడి నుండి దాదాపు ఒక మీటరు ఎత్తున ఉండాలి.
మీరు నిచ్చెనను అనేక సార్లు ఎక్కి దిగవలసిన అవసరం ఉండవచ్చు. అలాగైతే, ముఖ్యంగా మొదటిసారి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎక్కిన తర్వాత నిచ్చెన పైభాగాన్ని దేనితోనైనా బిగించి కట్టండి. మొదటిసారి ఎక్కేటప్పుడూ, అలాగే, పై కట్టును విప్పి చివరిసారి దిగేటప్పుడూ భద్రత ఉండదు. నిచ్చెనను మొదటిసారి ఎక్కేటప్పుడూ, చివరి సారి దిగేటప్పుడూ భద్రత కోసం, నిచ్చెన క్రిందిభాగాన్ని ఎవరినైనా పట్టుకోమనండి. నిచ్చెన 5 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు లేనప్పుడు మాత్రమే ఈ పద్ధతి ఫలకరంగా ఉంటుంది.
బిల్డింగ్ వెలుపలి నేల ఏటవాలుగా ఉన్నట్లయితే, నిచ్చెన అడుగు భాగంలో బరువైన దేనినైనా పెట్టడమో లేక నిచ్చెన క్రింది మెట్టును నేల మీద కదలకుండా ఉండే దేనికైనా కలిపి కట్టడమో చేయాలి. నేల సమతలంగా లేకపోయినప్పటికీ, గట్టిగా ఉన్నట్లయితే, నిచ్చెనను నిలబెట్టబోతున్న చోటును సమంగా చేసేందుకు, నిచ్చెన క్రింద ఒక దిమ్మను పెట్టండి. నిచ్చెనను నిలబెట్టవలసిన స్థలం మెత్తగా ఉన్నట్లయితే, ఆ చోటున జారిపోయేలా చేసేవేమైనా గానీ ఉన్నట్లయితే, గట్టిగా ఉండే ఒక కొయ్య పలకను గానీ, మరి దేన్నైనా గానీ పెట్టండి.
మీరు ఒక స్టెప్లాడర్ను ఉపయోగిస్తున్నట్లయితే, దాని నాలుగు కాళ్ళూ పూర్తిగా నేల మీద ఆనేలా చూడండి. నిచ్చెనలోని రెండు భాగాలూ, పూర్తిగా విడిగా నిలబడ్డాయా, సురక్షా కొండులు (సేఫ్టీ క్యాచెస్) వేసే ఉన్నాయా అన్నది చూసుకోండి.
మీరు సురక్షితంగా ఉన్నారా?
6 మీ షూస్ ఎలా ఉన్నాయో చూసుకోండి. మీరు ఒక నిచ్చెన ఎక్కే ముందు, మీ షూస్ అడుగు భాగం పొడిగానే ఉందా అన్నది చూసుకోండి. మట్టి వంటి దేన్నైనా, మీరు జారిపడేలా చేసే దేన్నైనా తొలగించండి.
7 వస్తువులను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. నిచ్చెన ఎక్కేటప్పుడు రెండు చేతులతో దాన్ని పట్టుకోగల్గేలా మీ చేతులను ఖాళీగా ఉంచుకోండి. సాధ్యమైతే, హోల్డరున్న బెల్టు పెట్టుకుని, మీ ఉపకరణాలను ఆ హోల్డరులో పెట్టుకోండి. మోయలేని వస్తువులను పైకి తీసుకు వెళ్ళేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులను కనుగొనే ప్రయత్నం చేయండి. కానీ మీరు నిచ్చెనను ఉపయోగించడం తప్పనిసరైతే, మీరు నిచ్చెన ఎక్కుతుండగా ఒక చెయ్యి తర్వాత మరో చేయిని మారుస్తూ నిచ్చెనపై ఒక చెయ్యి ఎప్పుడూ ఉండేలా జాగ్రత్త పడండి. నెమ్మదిగా జాగ్రత్తగా ఎక్కండి. ఒక పద్ధతి ప్రకారం ఎక్కండి. తొందర పడకండి.
మీరు విద్యుత్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నట్లయితే, వాటిని ఉపయోగించేటప్పుడు రెండు చేతులను ఉపయోగించకండి. ఉదాహరణకు, పనిచేస్తుండగా చేతిలో ఉన్న డ్రిల్ పని చేయడం ఆగిపోవచ్చు, చేతిలో నుండి జారిపడవచ్చు. అలా జరగడం వల్ల మీరు బ్యాలన్స్ తప్పి పడిపోవచ్చు. విద్యుత్ ఉపకరణాలను ఆన్ మీద లాక్ చేసి ఉంచవద్దు; అవి పని చేస్తుండగానే పడిపోవచ్చు.
8 ఇతరులను గురించి ఆలోచించేవారై ఉండండి. మీరు అందరూ తిరిగే ప్రదేశంలో పనిచేస్తున్నట్లయితే, నిచ్చెన అందరికీ కనిపించేలా పెట్టండి. సాధ్యమైతే, దాని చుట్టూ దడిలాంటిది కట్టండి. మీరు నిచ్చెనను ఏదైన ఒక మూల నుండి తీసుకువెళ్ళాలంటే, మీరు అలా తీసుకువెళ్ళబోతున్నారని ఇతరులు అనుకోకపోవచ్చన్న విషయాన్ని గుర్తించండి. ఫ్రెండ్లీగా ఒక హెచ్చరికా కేకను వేయండి, ఏమైనా దారికడ్డు ఉన్నాయేమో చూసుకోండి.
మీరు నిచ్చెన మీద ఉన్నప్పుడు, మీ దగ్గర పనిముట్లు ఉన్నట్లయితే, చిన్న స్క్రూ డ్రైవర్ అయినా సరే, అంత ఎత్తులో నుంచి ఎవరి మీదనైనా పడినప్పుడు హాని కలగవచ్చని గుర్తుంచుకోండి. ఏదో కారణాన మీరు అక్కడి నుండి వెళ్ళవలసి ఉన్నట్లయితే, మీరు నిచ్చెనను సురక్షితంగా బిగించలేకపోయినట్లయితే, మీరు తిరిగి వచ్చేవరకు దాన్ని చూసుకోవడానికి ఎవరినైనా నిలబెట్టండి, లేదా దాన్ని క్రింద పెట్టేయండి. అంతేకాని, చూసుకోవడానికి నిచ్చెన దగ్గర ఎవ్వరూ లేకుండా వదిలేసి వెళ్లకండి.
9 మీ ఆరోగ్యం ఎలా ఉందో నిర్ధారించుకోండి. నిచ్చెన ఎక్కడంలో బ్యాలన్సుగా ఉండడం, ఒక పద్ధతి ప్రకారం ఎక్కడం అనేవి ప్రాముఖ్యం గనుక, మీకు వంట్లో బాగోకపోయినా లేదా కడుపులో వికారంగా ఉన్నా లేదా కళ్లు తిరుగుతున్నట్టున్నా నిచ్చెన ఎక్కకండి.
10 ప్రమాదం కలకుండా జాగ్రత్తగా ఎక్కండి. జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకోండి. నిచ్చెన మీద ఒకే సమయంలో ఇద్దరో అంత కన్నా ఎక్కువ మందో ఉండడానికి అనుమతించకండి. గాలి బలంగా హోరుగా వీస్తున్నప్పుడు నిచ్చెన ఎక్కకండి. స్టెప్లాడర్ ఉపయోగిస్తున్నట్లయితే పైమెట్టు మీద నిలబడకండి, పొడవైన నిచ్చెన ఉపయోగిస్తున్నట్లయితే, పైనుండి నాల్గవ మెట్టును దాటి పైకి వెళ్ళకండి. ఎక్స్టెన్షన్ లాడర్ని మరీ అతిగా పొడిగించకండి; ఎక్స్టెన్షన్ లాడర్లోని రెండు నిచ్చెనల యొక్క కనీసం మూడు మెట్లు ఒకదానిపై ఒకటి ఉండేలా చూసుకోండి. మరీ దూరాన ఉన్నవాటిని అందుకోవడానికి ప్రయత్నించకండి. నిచ్చెనమీద నుండి మీరు మరీ దూరంగా సాగి పనిచేశారంటే సులభంగా బ్యాలన్స్ తప్పి పడిపోతారు. దెబ్బలు తగిలే ప్రమాదాన్ని కొనితెచ్చుకునే బదులు, నిచ్చెనను అక్కడి నుండి కావాల్సిన చోటుకి ఇంకొంచెం జరిపి పెట్టుకోండి, దానివల్ల చేసే పనిలో కొంచెం ఆలస్యమైన పర్వాలేదు. ఎక్కేటప్పుడు, నేరుగా పైకే చూడండి.
మీరు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, నిచ్చెనను ఉపయోగించేటప్పుడు ప్రమాదాలనేవి ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఈ సూచనల సహాయంతో బహుశా మీరా ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. అవి పోల్‌కు సహాయపడ్డాయి. ఆ ప్రకారంగా చేయడం ద్వారా, ఏ ప్రమాదమూ జరగకుండా, ఆయన, బయట బల్బ్ హోల్డర్‌లో క్రొత్త బల్బును పెట్టగల్గాడు. కిటికీని శుభ్రం చేసే సంగతి ఏమిటి? సరే, ఆయన ఆ పనిని . . . బహుశా మరో సమయంలో చేస్తుండవచ్చు!
[26, 27వ పేజీలోని చిత్రాలు]
1 సరైన నిచ్చెనను తీసుకోండి
2 మీ నిచ్చెనను జాగ్రత్తగా పరిశీలనగా చూడండి
3 నిచ్చెనలను సురక్షితంగా రవాణా చేయండి
4 నిచ్చెనను సరిగ్గా నిలబెట్టండి
5 పైనా, క్రిందా కూడా ఆసరా ఇవ్వండి
6 మీ షూస్ ఎలా ఉన్నాయో చూసుకోండి
7 వస్తువులను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి
8 ఇతరులను గురించి ఆలోచించేవారై ఉండండి
9 మీ ఆరోగ్యం ఎలా ఉందో నిర్ధారించుకోండి
10 ప్రమాదం కలగకుండా జాగ్రత్తగా ఎక్కండి