మతం యువతకు ఎంత ఆసక్తికరంగా ఉంది?
ఫ్రాన్స్‌లోని తేజరిల్లు! విలేఖరి
ప్రేక్షకుల్లోని 7,50,000 మంది యౌవనస్థులను పరవశులను చేసిన సాయంకాలమది. వాళ్ళు జెండాలను ఊపారు, పాటలు పాడారు, చప్పట్లు కొట్టారు. లేజర్ కిరణాలు, మంటలు ప్రజ్వలించాయి, సంగీతకారులు జనసమూహాన్ని హోరెత్తించారు. వాతావరణం “అప్పటికప్పుడు రూపొందిన నైట్‌క్లబ్” అన్నట్లుగా ఉంది. చివరికి, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న మనిషి ప్రశంసా అరుపులు వినబడుతుండగా స్టేజ్ మీదకు వచ్చాడు.
అది రాక్ సంగీత బృందపు ప్రపంచ టూర్ ప్రారంభమా? కాదు. క్యాథలిక్ వేల్డ్ యూత్ డేస్ కాలంలో పారిస్‌లో జరిగిన మత సమావేశమది. ఆ మనిషి మరెవరో కాదు, సాక్షాత్తు పోప్ జాన్ పాల్ II!
కొందరికైతే, మత సంబంధ వేడుకల్లో యువత ఇలాంటి ఆసక్తి చూపించడం చాలా వింతగా అనిపించవచ్చు. కానీ, ఇప్పుడు మాధ్యమాలు యువతలో మతం పునర్జీవించడాన్ని గురించి మాట్లాడుతున్నాయి.
బాహ్య రూపాలు
మతం చాలా బాగా పురోగమిస్తున్నట్లు పైకి కనిపిస్తుంది. దాదాపు 68 శాతం మంది యూరోప్ యువత తాము ఒక మతానికి చెందినవారని చెబుతుంటే, ఐర్లాండ్‌లో అలా చెప్పుకునే వారి శాతం 90 కన్నా ఎక్కువే. మునుపటి సోవియట్ రిపబ్లిక్ అయిన అర్మీనియాలో మతం గడిచిన యుగం యొక్క అవశేషమని ఒకప్పుడు పరిగణించబడేది. ఒకప్పుడు నిర్జనమైన చర్చీలు ఇప్పుడు నిండిపోయాయనీ, “యువతరాన్ని తనవైపుకు తిప్పుకునేందుకు మతానికున్న ఆకర్షణ శక్తిని చూసి నేను ఆశ్చర్యచకితుడనయ్యాను” అనీ ఒక ప్రీస్ట్ చెప్పాడు.
అనేక దేశాల్లోని మాధ్యమాలు, యువత మత తెగల్లోనూ, కరిస్మాటిక్ గ్రూపుల్లోనూ పాల్గొనడాన్ని అంతటా ప్రచురం చేస్తున్నాయి. మొదట్లో పేర్కొన్నటువంటి మత వేడుకలు ప్రసిద్ధికెక్కాయి. అయితే, మనం విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే ఏమవుతుంది?
ఇంకాస్త పరిశీలనగా చూడడం
ఇంకాస్త పరిశీలనగా చూస్తే, 1967లో, 81 శాతం మంది ఫ్రెంచ్ యువత దేవునిలో విశ్వసించిందనీ, అయితే, 1997లో అలా విశ్వసించేవారి శాతం సగం కన్నా తక్కువగా ఉందనీ వెల్లడవుతుంది. యూరోప్‌లో మొత్తం మీద, 28 శాతం మంది యౌవనస్థులు మాత్రమే వ్యక్తిత్వమున్న దేవుడ్ని నమ్ముతున్నారు. అయితే యూరప్‌లో కేవలం 12 శాతం మంది యౌవనస్థులు మాత్రమే తరచూ ప్రార్థిస్తారన్నది ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇది యువత మతాన్ని దృష్టించే విధంలో ఎలా ప్రతిబింబించబడింది?
డెన్మార్క్‌లో, 90 శాతం మంది యౌవనస్థులు తాము నేషనల్ చర్చికి చెందినవారమని చెబుతారు. అయితే కేవలం 3 శాతం మంది మాత్రమే తాము చురుకైన సభ్యులుగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. 1997లో ఫ్రాన్స్‌లో లా క్ర్వా అనే క్యాథలిక్ వార్తాపత్రిక చేసిన సర్వేలో, తమ జీవితాల్లో మతం నిజానికి ఏ పాత్రనూ నిర్వహించడం లేదని 70 శాతం ఫ్రెంచ్ యువత ఒప్పుకుంటోందని చూపించబడింది. వారిలో నాలుగింట మూడు వంతుల మంది మత బోధ కన్నా వ్యక్తిగత అనుభవానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మరనేక ఇతర యూరోపియన్ దేశాల్లోని పరిస్థితి కూడా ఇదే.
యువత చర్చీలకు దూరంగా ఎందుకు ఉంటోంది? వారిలో అనేకుల మతాలు ఇచ్చే నిర్దేశాలు నమ్మకాన్ని కలిగించవు. ఉదాహరణకు, ఫ్రాన్సులోని, యువతలో అధిక సంఖ్యాకులు, మతం లోకంలోని ఒక విచ్ఛిన్న కారకమని నమ్ముతారు. అంతేకాక, స్పెయిన్‌లోని జూడీట్ అనే 15 ఏండ్ల క్యాథలిక్ అమ్మాయి భావించినట్లు యౌవనస్థులు భావించడం అసాధారణమేమీ కాదు. ఆమె ఇలా అన్నది: “నైతికత విషయంలో చర్చి చెప్పే దానితో నేను ఏకీభవించను.” అలాగే, తైవాన్‌లోని 20 ఏండ్ల జోసఫ్, మతం “మరీ చాదస్తంగా ఉంటుందని” కనుగొంటున్నాడు. అయితే, యౌవనస్థుల్లో అధిక సంఖ్యాకులు తమ మతంతో ఏకీభవించనట్లయితే, మరి వాళ్ళు దేనిని విశ్వసిస్తున్నారు?
సొంత అభిరుచులకు తగిన మతాన్ని ఎంచుకోవడం
యౌవనస్థులు మెనూలోని డిష్‌లను ఎంచుకున్నట్లు మత నమ్మకాలను ఎంచుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మత “ఆచారాలను అభిరుచికి తగ్గట్లు ఎంచుకోవడం” అని ఒక పత్రిక పిలుస్తుంది. దానినే “మత సంబంధ విండో షాపింగ్” అని ఒక క్యాథలిక్ పత్రిక చెబుతుంది. పాతబడినట్లు ఒకప్పుడు ఎంచబడిన తలంపులు ఇప్పుడు ఆచరణలో ఉన్నాయి. అలా యూరప్‌లో దాదాపు 33 శాతం మంది యౌవనస్థులు అదృష్ట తాయెత్తులను నమ్ముతున్నారు. సోది చెప్పేవారు భవిష్యత్తును గురించి చెబుతారని 40 శాతం యువత నమ్ముతుంది, నక్షత్రాలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతాయని 27 శాతం మంది నమ్ముతున్నారు. ఇప్పుడు యూరప్‌లోని అనేక మంది యౌవనస్థుల నమ్మకాల్లో అవతారాలు ధరించడం వంటి నమ్మకాలు భాగమై కూర్చున్నాయి.
యౌవనస్థులు తమ అభిలాషలకు తగినటువంటి తలంపులను ఎంపిక చేసుకోగల్గే విధంగా ఉన్నాయి వివిధ మతాల నమ్మకాలు. కేవలం ఒక మతం మాత్రమే సత్యాన్ని గుత్తంగా కలిగి ఉందని చాలా కొద్ది మంది నమ్ముతారు. తమకు ఇష్టం వచ్చినదానిని ఎంపిక చేసుకునే యౌవనస్థులకు, తమ మత నమ్మకాల మధ్య భేదం అంతగా ఉన్నట్లు కనిపించడం లేదు. అలా, సామాజికవేత్తలు ఇప్పుడు, సాంప్రదాయక నమ్మకాలను “క్రమేణా తుడిచిపెట్టడమో,” లేక “మొత్తంగా రూపుమాపడమో” జరగడాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో, పారంపర్య మతాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయి?
యౌవనస్థుల కోసం మతాల దాహం
యౌవనస్థులను ఆకర్షించడం ఒక సవాలని మతాలు కనుగొంటున్నాయి. పారిస్‌లో జరిగిన క్యాథలిక్ వేల్డ్ యూత్ డేస్ వేడుకకు హాజరైన జనసమూహాన్నుద్దేశిస్తూ, ఒక ఫ్రెంచ్ ప్రీస్ట్ ఇలా అడిగాడు: “ఈ యువత ఎక్కడ నుండి వస్తుంది? మా చర్చీలో యౌవనస్థులే లేరు. నేను వాళ్ళనెప్పుడూ చూడనే లేదు.” యౌవనస్థులను ఆకర్షించాలనీ, వాళ్ళ అవధానాన్ని చూరగొనాలనీ ప్రయత్నం చేస్తున్న క్యాథలిక్ చర్చి తన సమర్పణ పద్ధతినీ, మాధ్యమాన్నీ మార్చవలసి ఉంటుంది.
“చర్చి తన స్టైల్‌ను మార్చుకుంటుంది!” అని ఫ్రెంచ్ వార్తాపత్రికయైన లా ఫిగరో తెలియజేసింది. పారిస్‌లో 12వ వేల్డ్ యూత్ డేస్ వేడుక సమర్పణకు, రాక్ గానాలను సంస్థీకరించడంలో అనుభవజ్ఞులైన ఏజెన్సీలను చర్చి ఉపయోగించింది. 100 కన్నా ఎక్కువ దేశాల నుండి వస్తున్న యౌవనస్థులకు వినోదాన్ని ఇచ్చేందుకు 300 కన్నా ఎక్కువ షోలు ప్రదర్శించబడ్డాయి. మత నాయకుల కోసం ప్రత్యేక డిజైన్లుగల వస్త్రాలు తయారు చేయబడ్డాయి.
నేటి యౌవనస్థుల గురించి అంతగా తెలియనందువల్లా, వారికి తగినట్లుగా ఉండవలసిన అవసరత ఉందని భావించడం వల్లా, అనేక మతాలు సమస్త విశ్వాసాలను ఇముడ్చుకుంటున్నాయి. పారిస్‌లో వేల్డ్ యూత్ డేస్ వేడుకను సంస్థీకరించిన మీషెల్ డ్యూబో అనేపేరు గల ఒక మతనాయకుడు ఈ పాలసీని ప్రతిబింబిస్తూ, ఇలా అన్నాడు: “నిజమే, బాప్తిస్మం తీసుకున్నవాళ్ళందరూ క్రీస్తుకు నమ్మకమైనవారై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే, వాళ్ళు అలా కాకపోయినప్పటికీ వారికి చర్చిలో స్థానముంది.”
జవాబుల కోసం యువత అన్వేషణ
జవాబుల కొరకైన యౌవనస్థుల అన్వేషణ నిజానికి యథార్థమైనదని ఎత్తిచూపుతూ, పారిస్‌లో మత వేడుకలకు వచ్చిన యౌవనస్థుల హాజరును “విశ్వాస వ్యక్తీకరణగా కాక, విశ్వాసం కొరకైన కేక”గా ఒక వార్తాపత్రిక వర్ణిస్తుంది. అలాంటి కేకకు క్యాథలిక్ చర్చి జవాబిచ్చిందా?
మీరు దాని ముసుగును తీసివేస్తే, లేదా ఒక క్యాథలిక్ వార్తాపత్రిక పిలుస్తున్నట్లు, పెద్ద మత వేడుకల “మాయా దృశ్యం” గుండా తొంగి చూస్తే, ఏమి కనిపిస్తుంది? ల మొండ్ అనే ఫ్రెంచ్ వార్తాపత్రిక, ఉపరితల అడుగున ఉన్న “యథార్థసత్త్వం లేమి”పై వ్యాఖ్యానించింది.
ఆహారం అందించే తీరు ముఖ్యమైనదే అయినప్పటికీ, అది పోషకగుణం కలదై ఉండాలి. జీవిత పరమార్థమేమిటన్న యౌవనస్థుల ప్రశ్నలకు ఆధ్యాత్మికంగా పోషించేటువంటి జవాబులు అవసరం. యౌవనస్థులకు ఇవ్వబడే జవాబులు ఆకట్టుకునేవే అయినా అర్థశూన్యంగా ఉంటే వారిని తృప్తిపరచవు.
అలా ఏ ప్రాధాన్యతా లేని మత సంఘటనలు నేడు యౌవనస్థులపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తాయా? ఫ్రెంచ్ సామాజికవేత్త డాన్యేల్ హెర్వ్యూ లేఝే గమనించిన విషయం: “ఈ భావోద్వేగభరితమైన సంస్థీకృత సంఘటనలు పురోభివృద్ధికరమైన శాశ్వతమైన సామాజిక ప్రభావాలను చూపించే అవకాశం లేదు.” అయితే, మరి యౌవనస్థులు తమ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులను ఎక్కడ నుండి పొందగలరు?
సంతృప్తికరమైన జవాబులు
1997వ సంవత్సరంలో, లీ ప్వాన్ అనే ఫ్రెంచ్ పత్రిక యౌవనస్థులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ఒక శీర్షిక వ్రాసింది. అనేక యౌవనస్థులు జీవిత పరమార్థాన్ని గురించిన ప్రశ్నలనే కాకుండా, నేరం, దౌర్జన్యం వంటివాటిని కూడా ఎదుర్కోవాలి. దానిని అధిగమించడం సాధ్యమా? ఆ పత్రికా శీర్షిక ఇలా వివరిస్తుంది: “30 ఏండ్ల వయస్సులో, మద్యం, మత్తుమందులు, దౌర్జన్యాలవల్ల తన శరీరం చెల్లించవలసి వచ్చిన గొప్ప మూల్యం గురించి డేవిడ్ చింతించనారంభించాడు. తాను పవిత్రుడవ్వాలన్న ఆయన నిరీక్షణలకు జవాబుతో యెహోవాసాక్షులు ఆయన తలుపు తట్టారు. ఆయన పఠించాడు. ఆయన మారాడు. ఆయన జూదంలో ఋణపడిన దానినంతటినీ తీర్చేశాడు. పేకాటలో తమని మోసం చేశాడని ఎరగనివారందరికీ సహితం తిరిగి చెల్లించాడు. పొగత్రాగడము, త్రాగుబోతుతనము లేదా పోట్లాడడము పూర్తిగా మానేశాడు.”
యెహోవాసాక్షులతో బైబిలు పఠించిన ఇతర యౌవనస్థుల గురించి చెబుతూ ఆ శీర్షిక ఇలా కొనసాగించింది: “వాళ్లు తమ ప్రశ్నలన్నింటికి జవాబులను కనుగొన్నారు.” ఒక యువ సాక్షి ఇలా సరళంగా చెప్పారు: “బైబిలు రెండువేల సంవత్సరాలుగా సత్యాన్ని గురించి చెబుతుంది. అలాంటప్పుడు మనం మార్గదర్శనం కోసం మరో చోటికి ఎందుకు వెళ్ళాలి?”
దేవుని వాక్యంలో యువతకు ఒక సందేశం ఉంది. దానిలోని ఆచరణాత్మక సలహా వారు నేటి సమస్యలను ఎదుర్కోడానికి సహాయపడుతుంది, శాంతియుతమైన భవిష్యత్తూ, సహోదరత్వాలలో నమ్మకం ఉండేందుకు వారికి గట్టి ఆధారాన్ని ఇస్తుంది. ఎడతెగక మారుతున్న లోకంలో, బైబిలు ఇచ్చే నిరీక్షణ “నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరు”గా ఉండి, స్థైర్యాన్నీ సాంత్వననూ ఇస్తుంది. (హెబ్రీయులు 6:19) లక్షలాది మంది యౌవనస్థులు యెహోవాసాక్షులతో వ్యక్తిగతంగా బైబిలు పఠించడం ద్వారా తమ జీవితాలకు నిజమైన అర్థాన్ని కనుగొన్నారు. బైబిలు అంతర్గతంగా తీసుకువచ్చే మార్పులను తమకై తామే చూశారు. బైబిలు సమాధానాలను పొందడం ద్వారా, యౌవనస్థులు నిజమైన విశ్వాసం కొరకైన తమ అన్వేషణకు ఫలితాన్ని పొందారు.
[25వ పేజీలోని చిత్రం]
పారిస్‌లోని వేలాదిమంది యువతీ యువకులను మత వేడుకలు ఆకట్టుకుంటాయి
[26వ పేజీలోని చిత్రం]
పారిస్‌లో వేల్డ్ యూత్ డేస్—యథార్థ మత పునరుజ్జీవనమా?