మా పాఠకుల నుండి
వంతెనలు ఇక్కడ హూండూరాస్‌లో ఉన్న వంతెనల్లో 80 శాతం వంతెనలు మిచ్ తుపాను మూలంగా ధ్వంసమైపోయిన తర్వాత, “వంతెనలు—అవి లేని జీవితం ఎలా ఉంటుంది?” అనే శీర్షిక ఉన్న సంచిక (డిసెంబరు 8, 1998) మాకు అందింది. నా భర్తా నేనూ ఈ ప్రాంతంలో ఎప్పుడూ ప్రయాణాలు చేస్తూ ఉంటాం, మా పనిలో మాకు వంతెనలు ఎంత ప్రాముఖ్యమైనవి అన్న విషయాన్ని వెంటనే గ్రహించాము. ఆసక్తికరమైన సమయానుకూలమైన ఈ శీర్షికను బట్టి మేము మీకు కృతజ్ఞతలు తెలపాలనుకున్నాం. చివరి పేరా చెప్పినట్లే, మేము ఇకమీదట వంతెనలను తేలిగ్గా తీసుకోము!
సి. హెచ్., హూండూరాస్
జంతువుల పట్ల క్రూరత్వం “బైబిలు ఉద్దేశము: జంతువుల పట్ల క్రూరత్వం—తప్పా?” అన్న శీర్షికను రూపొందించడంలో మీరు ఎంత చక్కని పనిని చేశారో తెలియజేసేందుకు నేను మీకు దీన్ని వ్రాస్తున్నాను. (డిసెంబరు 8, 1998) జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని, మరి ముఖ్యంగా క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు క్రూరంగా ప్రవర్తించడాన్ని దేవుడు ఆమోదించడనే దాన్ని మీరు చూపించడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అనుకుంటున్నాను.
జె. ఎల్. సి., అమెరికా
తల్లిదండ్రులు లేని యౌవనస్థులు “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .నేనెందుకు నా తల్లిదండ్రులు లేకుండా జీవించాలి?” (డిసెంబరు 8, 1998) అనే శీర్షికను ప్రచురించినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు. నాకు 11 ఏండ్లున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. నేనూ, నా సహోదరులూ ఎంత దుర్భరమైన జీవితాన్ని జీవించామో ప్రజలు ఎప్పటికీ అర్థంచేసుకోలేరని నేనిప్పటి వరకు అనుకునేదాన్ని. కాని ఇతరులు మమ్మల్ని అర్థంచేసుకుంటారని ఇప్పుడు నేను భావిస్తున్నాను. మీకు నా కృతజ్ఞతలు.
కె. వై., జపాన్
సరిగ్గా నాకు కేవలం తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు, నాకు 12 సంవత్సరాలు రాకముందే మా అమ్మ చనిపోయింది. మీ శీర్షిక ఎంతో సాంత్వననిస్తూ, అనాథలు నిజంగా ఎలా భావిస్తారో చూపించింది. చనిపోయిన మన ప్రియమైన వారిని యెహోవా తిరిగి జీవానికి తీసుకువస్తాడని తెలుసుకోవడం ఎంత సంతోషంకరమైన విషయం !
ఎమ్. ఎస్. ఎస్., బ్రెజిల్
నాకు 40 ఏండ్లు, నేను శీర్షికను పదేపదే చదివాను. నాకు రెండేళ్ళ వయస్సున్నప్పటి నుండే నేను అనాథను గనుక, ఈ శీర్షికను చదవడం మొదలుపెట్టింది మొదలుకుని దీన్ని చదవడం పూర్తి చేసేంత వరకూ నాకళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ, నా తల్లిదండ్రుల ఫొటోను చూసినప్పుడెల్లా నాకు ఏడుపు వస్తుంది. ఇలాంటి శీర్షికలను వ్రాస్తున్నందుకు కృతజ్ఞతలు!
జె. కె. వి., ఫ్రాన్స్
నాకు తల్లిదండ్రులు ఉన్నారు, కాని నేను మేనియక్-డిప్రెషన్‌తో (బైపోలార్) ఉన్నాను, క్లిష్టసమయాలను ఎలా అధిగమించాలో చర్చించే ఏ శీర్షికైనా సరే ఆసక్తి చూపిస్తాను. నిజ-జీవిత అనుభవాలనూ “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ”లో కనుగొనబడే బైబిలు-ఆధారపు ఉపదేశాలనూ నేను చాలా ఇష్టపడతానని మీకు చెప్పాలనుకున్నాను.
ఎస్. హెచ్., కెనడా
చేతులు కడుక్కోవడం నాకు 11 ఏండ్లు, “చేతులు కడుక్కుని తుడుచుకోండి !” (డిసెంబరు 8, 1998) అనే శీర్షికను ప్రచురించినందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాను. తినే ముందూ, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాతా చేతులు కడుక్కోవాలని ఇది నన్ను ప్రోత్సహించింది. ఇన్‌ఫెక్షన్ కావడం అనేది మా పట్టణంలో సర్వసాధారణం, కనుక ఈ శీర్షిక చాలా ఉపయోగకరమైనది.
ఎమ్. ఎఫ్., ఇటలీ
చిన్న చిన్న ఆనందాలు “ప్రపంచ పరిశీలన”లో “పిల్లలు చిన్న చిన్న ఆనందాలను ఇష్టపడతారు” (జవవరి 8, 1999) అనే ఐటమ్‌ను ప్రచురించినందుకు కృతజ్ఞతలు. నేను నా పిల్లల నుండి దూరంగా నివసిస్తున్నాను, మూడు నెలలకు ఒకసారి చూడడానికి మాత్రమే నేను అనుమతించబడ్డాను. సమయాన్ని మేము కలిసి గడుపుతున్నప్పుడు ఏమి చెయ్యాలో నాకు తెలియదు, వాళ్ళకు బోర్ కొడుతుందేమో అని భయపడుతూ ఏవేవో చాలా ప్లాన్‌లు వేస్తుంటాను. కలిసి గడిపే సమయం ఆసన్నమైనప్పుడే నేను ఈ అంశాన్ని చదివాను. కచ్చితంగా సరియైన సమయానికి ఇది వచ్చింది !
ఎమ్. వై., జపాన్
పాములు “పాముల్ని గురించి ప్రజల్లో పాతుకుపోయిన తప్పుడు అభిప్రాయాలు” (నవంబరు 8, 1998) అనే మీ శీర్షికను బట్టి చాలా కృతజ్ఞతలు. సమ్మోహనకరమైనవే అయినా, అపార్థం చేసుకోబడిన ఈ జంతువుల విషయంలో ప్రజలకున్న అజ్ఞానాన్ని మీరు ప్రస్తావించిన ఏడు పాయింట్లు నిశ్చయంగా పారద్రోలాయి.
ఆర్. కె., అమెరికా