కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 7/8 పేజీలు 24-27
  • కాగితాలు అవసరంలేని నిర్వచనాతీతమైన కార్యాలయం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కాగితాలు అవసరంలేని నిర్వచనాతీతమైన కార్యాలయం
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కాగితాల అవసరం ఉండదని ఆశించడం వాస్తవానికి విరుద్ధం
  • కాగితాలు ఎందుకు నిలుస్తున్నాయంటే
  • మనం అన్ని వృక్షాలను నాశనం చేస్తామా?
  • నిషేధాజ్ఞల క్రింద బైబిలు సాహిత్యాన్ని ముద్రించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇరవయవ శతాబ్దపు ఫాక్స్‌
    తేజరిల్లు!—1992
తేజరిల్లు!—1999
g99 7/8 పేజీలు 24-27

కాగితాలు అవసరంలేని నిర్వచనాతీతమైన కార్యాలయం

ఈ శీర్షిక యొక్క చివరి చిత్తుప్రతి, మామూలు కాగితాల మీద 11 పేజీల హార్డ్‌ కాపీలో ముద్రించబడింది.a ఎడిటింగ్‌ ప్రాసెస్‌లో, ఇది దాదాపు 20 సార్లు పునఃముద్రించబడింది. చివరికి, దీన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 అనువాద జట్లకు పంపించబడింది. ఆ తర్వాత, ప్రతి జట్టూ అనువాదం చేసిన దాదాపు ఆరు చిత్తుప్రతులను ముద్రించింది. మొత్తం మీద ఈ శీర్షిక ప్రింటింగ్‌ ప్రాసెస్‌కు చేరుకునే సరికి 5,000 కన్నా ఎక్కువ పేపర్‌ షీట్లు ఉపయోగించబడ్డాయి!

ఈ కంప్యూటర్‌ యుగారంభంలో, “కాగితాలు అవసరంలేని కార్యాలయం” వచ్చేస్తోంది అని భవిష్యత్తును గురించి కొందరు చేసిన సూచనలూ, ఈ వాస్తవాలూ పరస్పరం ఎంత విరుద్ధంగా ఉన్నాయో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అల్‌వన్‌ టాఫ్లర్‌ అనే భావిశాస్త్రవాది ద తాడ్‌ వేవ్‌ అనే తన పుస్తకంలో, ‘దేనినైనా కాగితాల్లో నకలు తీయడమన్నది, ఇలక్ట్రానిక్‌ వర్డ్‌ ప్రాసెసింగ్‌ మెషీన్‌లను తర్కరహితంగా ఉపయోగించడమే అవుతుంది, ఆ మెషీన్‌ల ఉద్దేశాన్నే ఉల్లంఘించినట్లవుతుంది’ అని కూడా ఉద్ఘాటించాడు. ఆసక్తికరంగా, 1981లో, ఇంటర్నాషనల్‌ బిసినెస్‌ మెషీన్స్‌ కార్పొరేషన్‌వారు తమ మొదటి పర్సనల్‌ కంప్యూటర్‌లను ప్రవేశపెట్టినప్పుడు, దానికి ప్రింటర్‌ను జత చేయనక్కరలేదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కంప్యూటర్‌ను ఉపయోగించేవాళ్ళు సమాచారాన్ని కంప్యూటర్‌ మోనిటర్‌ మీద చదవడానికి ఇష్టపడతారని కంపెనీ భావించిందని కొందరు వాదిస్తారు. ఏది ఏమైనా, కాగితమనేది కేవలం మ్యూజియమ్‌లలోను, దుమ్ముపట్టిన ప్రాచీన పత్రనిలయాల్లోను మాత్రమే కనిపించే వస్తువుగా మారడాన్ని గురించి—“కాగితాల్లేని పరదైసును” గురించి కొందరు కలలు కన్నారు.

కాగితాల అవసరం ఉండదని ఆశించడం వాస్తవానికి విరుద్ధం

అయితే, నిజానికి, కాగితాలు ఉపయోగించని కార్యాలయాలను తీసుకురావాలని ఉద్దేశించిన ఉపకరణాలే మనలను కాగితాల్లో ముంచెత్తుతున్నాయి. వాస్తవానికి, ఇటీవలి సంవత్సరాల్లో కాగితాల ఉపయోగం మొత్తంమీద పెరిగింది అని కొందరు అంచనా వేస్తున్నారు. ఇంటర్నాషనల్‌ డేటా కార్పొరేషన్‌లోని విశ్లేషణకర్తయైన స్కోట్‌ మక్రీడీ, “మన కార్యాలయాలను ఆటోమేటిక్‌గా మార్చడం ద్వారా మనం చేసిందేమిటంటే, కాగితాలను, సంవత్సరానికి సగటున 25 శాతం పెరుగుదల రేటులో ఉత్పత్తి చేసే మన సామర్థ్యాన్ని పెంచుకున్నామన్నదే” అని అంటున్నారు. పర్సనల్‌ కంప్యూటర్లూ, ప్రింటర్లూ, ఫాక్స్‌ మెషీన్లూ, ఇ-మెయిల్‌లూ, కాపీయర్లూ, ఇంటర్‌నెట్టూ సమాచార విస్తృతిని అధికం చేశాయి. చాలా మంది ప్రజలు ప్రతిరోజూ ఆ సమాచారంతో వ్యవహరిస్తారు, ప్రింట్‌ తీసుకుంటారు. క్యాప్‌ వెంచర్స్‌ ఇన్‌కార్పోరేషన్‌ ప్రకారం, 1998లో ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల 80 లక్షల ప్రింటర్లూ, 6 కోట్ల 90 లక్షల ఫాక్స్‌ మెషీన్లూ, 2 కోట్ల 20 లక్షల మల్టీఫంక్షన్‌ మెషీన్‌లు (ఒక్కదాన్లోనే ప్రింటర్‌, స్కానర్‌, కాపియరూ ఉంటాయి), 1 కోటీ 60 లక్షల స్కానర్‌లూ, 1 కోటి 20 లక్షల కాపియర్‌లూ ఉన్నాయి.

అమెరికా సంవత్సరానికి, 1,30,000 కోట్ల డాక్యుమెంట్లను ఉత్పత్తి చేస్తుంది—అది గ్రాండ్‌ కెన్యన్‌ లోయ అంతటికీ 107 సార్లు వాల్‌పేపర్‌ వేయించేందుకు సరిపోతుంది అని 1990లోని పవర్‌షిఫ్ట్‌ అనే తన పుస్తకంలో టాఫ్లర్‌ అంచనా వేస్తున్నారు! వస్తున్న నివేదికలన్నింటి ప్రకారం, ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఒక వార్తామూలం ప్రకారం, 1995 నాటికి, అమెరికా, రోజుకు, 60 కోట్ల డాక్యుమెంట్లను—270 కిలోమీటర్ల పొడవున్న ఫైల్‌ డ్రాయర్‌ను నింపేన్ని డాక్యుమెంట్లను ఉత్పత్తి చేస్తుంది. 2000వ సంవత్సరం ఆరంభం కాబోతుండగా, ఈ ధోరణి మారే లక్షణాలు ఏమీ కనబడడం లేదు; సమాచారంలో చాలా మటుకు కాగితం మీదుగానే అందించుకోవడం జరుగుతుంది.

కాగితాలు ఎందుకు నిలుస్తున్నాయంటే

కాగితాల స్థానంలో ఇలక్ట్రానిక్స్‌ వస్తుందన్న సూచనల్లో ఏంటి లోపం? అంతర్జాతీయ కాగితపు కంపెనీ తను ఇలా ఊహించడానికి ధైర్యం చూపిస్తుంది: “ప్రజలకు సమాచారం కేవలం వేళ్ళ చివర్లలో ఉండడం ఇష్టం లేదు. తమ వేళ్ళమధ్య ఉండడమే వాళ్ళకు ఇష్టం. వాళ్ళు వాటిని పట్టుకోగల్గాలనీ, మడవాలనీ, పేజీ అంచు మడవాలనీ; ఫాక్స్‌ పంపాలనీ, కాపీ తీయాలనీ, అవసరమైనప్పుడు రెఫర్‌ చేయాలనీ; మార్జిన్‌లో వ్రాసుకోవాలనీ, లేదా, రిఫ్రిజిరేటర్‌ మీద అంటించుకోవాలనీ ఇష్టపడతారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ప్రింట్‌ అవుట్‌ తియ్యాలని—అతిత్వరగా, తప్పులు లేకుండా, ఉజ్జ్వలమైన వర్ణాల్లో ప్రింట్‌ అవుట్‌ తీయాలని కోరుకుంటారు.”

కాగితం వల్ల నిర్దిష్ట ప్రయోజనాలున్నాయన్నది ఒప్పుకోవలసిందే. దాన్ని ఉన్నచోట నుండి తీసి ఎక్కడైనా పెట్టవచ్చు, కాగితం చౌకైనది, భద్రంగా ఉంటుంది. జాగ్రత్తగా పదిలం చేయడం సులభం. రిసైకిల్‌ చేయవచ్చు. కాగితాలను ఎటువైపుకు త్రిప్పాలన్నా సులభమే—మీరు ఎన్నో పేజీలో ఉన్నారు, ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయన్నది మీరు చూడవచ్చు. “ప్రజలకు కాగితాలంటే చాలా ఇష్టం. వాటిని తమ చేతులతో పట్టుకోవాలనుకుంటారు” అని ఆఫీసులకు కావలసినవాటిని సరఫరా చేసే ఒక కంపెనీ ప్రతినిధియైన డాన్‌ కాక్స్‌ అంటున్నారు. “కాగితాలు అవసరం లేని కార్యాలయాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తున్న ప్రజలను మేము చూశాం. కానీ, వేలాది కంప్యూటర్లన్నింటిలో కనిపించే విశేషమొకటుంది, అదేమిటంటే, వాటన్నింటికీ కనీసం ఒక్కొక్క ప్రింటర్‌ కనెక్షన్‌ ఉంది” అని అరిజోనా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీస్‌, ఆర్కైవ్స్‌ అండ్‌ పబ్లిక్‌ రికార్డ్స్‌లో రిపోర్ట్‌ల విశ్లేషణకర్తయైన జెరీ మలరీ అంటున్నారు.

తర్వాత, పాత అలవాట్లు మానుకోవడమనేది చాలా కష్టం. నేడు వ్యాపారంలో ఉన్న ప్రజలు ముద్రిత పుటలో చదవడం నేర్చుకుంటూ పెరిగారు. మౌస్‌ను ఒక్కసారి క్లిక్‌ చేస్తే ఒక డాక్యుమెంట్‌గానీ, ఇ-మెయిల్‌గానీ ప్రింట్‌ అవుతుంది. తర్వాత తనకు వీలున్నప్పుడు చదువుకోవచ్చు. ఎక్కడుండైనా చదువుకోవచ్చు. చాలావరకు కంప్యూటర్లను అంత సౌకర్యంగా తీసుకువెళ్ళలేని అనేక చోట్లకు ముద్రిత సమాచారాన్ని తీసుకువెళ్ళవచ్చు—బెడ్‌ మీద నుండి మొదలు కొని, బాత్‌టబ్‌ వరకు, సముద్రతీరాన బ్లాంకెట్‌ను పరచుకుని దాని మీది వరకూ ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు!

మరొక కారకం: కంప్యూటర్ల రాకతో, కొంత కాలం క్రితంవరకూ ప్రొఫెషనల్‌ ప్రింటర్‌లు మాత్రమే తయారు చేయగల డాక్యుమెంట్లను ప్రజలు సులభంగా తయారు చేసుకుంటున్నారు. ఫుల్‌కలర్‌ కాపీలు, చిత్తుప్రతులు, రిపోర్టులు మొదలుకొని, చిత్రాలతో కూడిన సమర్పణలు, చార్ట్‌లు, గ్రాఫ్‌లు, బిసినెస్‌ కార్డ్‌లు, పోస్ట్‌కార్డ్‌లు మొదలుకొని దేన్నైనా అతి తక్కువ శ్రమతో ఉత్పత్తి చేయవచ్చు. అలాంటి సామర్థ్యాలు ప్రయోగాలను పురికొల్పుతాయి. అలా, కంప్యూటర్‌ ఉపయోగించే వ్యక్తి ఒక డాక్యుమెంట్‌ను ఉపయోగించిన తర్వాత, దాని ఫాంట్‌నీ, డిజైన్‌నీ మార్చి మరోసారి ప్రింట్‌ తీయాలనే ప్రలోభం కలగవచ్చు. దీని తర్వాత, ఆయన మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తుండవచ్చు, మీరూహిస్తున్నట్లే, అలా ఆయన అనేక ప్రింటౌట్లను తీస్తాడు!

ఈ పరిస్థితికి ఇంటర్‌నెట్‌ కూడా దాదాపుగా అపరిమితమైన సమాచారాన్ని ఇవ్వడం ద్వారా మరింత దోహదపడింది.b ఇంటర్‌నెట్‌ ఉపయోగించేవాళ్ళు తాము పరిశోధనచేసి కనుగొన్న విషయాలను హార్డ్‌ కాపీ మీద ప్రింట్‌ అవుట్‌ తీసుకుంటుండగా, చాలా కాగితాలు ఉపయోగించబడుతుండడం అనివార్యమైపోయింది.

కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లు, ఉపకరణాలు బాగా విపణిలోకి వస్తుండగా, వాటిని ఎలా ఉపయోగించాలని చూపించే మరిన్ని పుస్తకాలు కూడా అవసరమన్న వాస్తవాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అంతటా కంప్యూటర్లను ఉపయోగించడం అలాంటి మ్యాన్వల్‌లు, కంప్యూటర్‌ పత్రికలు ప్రవాహంగా వచ్చేలా చేశాయి.

స్క్రీన్‌ మీద డిజిట్లను చూడడంలో—ముఖ్యంగా పాత మోనిటర్‌లను చూడడంలో కొన్ని సమస్యలుండగలవన్నది ఒప్పుకోవలసిన విషయమే. కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్న కొందరు, కంటికి కష్టంగా ఉన్నట్లు ఇప్పటికీ ఫిర్యాదు చేస్తారు. ఏది ఏమైనా, పాత వీడియో డిస్‌ప్లేలు స్పష్టంగా కనిపించేందుకు, చక్కని దృశ్య నాణ్యతను చూపించేందుకు పదిరెట్లు మెరుగుపరచవలసిన అవసరముందని అంచనావేయబడుతోంది.

అంతేకాక, కొంత మందికి, ఒక కాగితంమీద చూడడం చాలా అత్యవసరమైన, ప్రాముఖ్యమైన విషయం. స్క్రీన్‌ మీద చూసేదానికన్నా, కాగితం మీద చూడడమైతే త్వరగా జరుగుతుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ముద్రిత డాక్యుమెంటు ఒకరి పనికీ, కృషికీ నిదర్శనంగా ఉంటుంది. దాన్ని చేతిలోకి తీసుకోవచ్చు, అది కంటికి కనిపిస్తుంది. సూపర్‌వైజర్‌ చేతికి, లేదా క్లయంట్‌ చేతికి ఇవ్వబడిన భౌతిక రూపంలో ఉన్న డాక్యుమెంట్‌ ఇలక్ట్రానిక్‌ మెస్సేజ్‌ కన్నా మరింత అవధానాన్ని పొందుతుంది, మరింత ప్రతిస్పందనను తెస్తుంది.

చివరిగా, చాలామంది తమ డేటాను కోల్పోతామేమోనని భయపడతారు. అలాంటి భయం తరచూ సహేతుకమైనదే. ఇప్పుడు, ఎంతో సంక్లిష్టమైన బ్యాక్‌అప్‌ సిస్టమ్‌ ఉన్నా కూడా, ఎన్నో గంటలు కష్టపడి చేసినదాని ఫలితం దక్కడమనేది విద్యుచ్ఛక్తి పెరగడం, డిస్క్‌ క్రాష్‌ అవ్వడం, లేదా తప్పు కీని నొక్కడం అనేవి జరగకుండ ఉండేదానిపైనే ఆధారపడి ఉంటుంది. కనుక, చాలామంది ప్రజలు, కాగితం మరింత భద్రంగా ఉంటుందని పరిగణిస్తారు. ఆసక్తికరంగా, ఆసిడ్‌-ఫ్రీ పేపరుకున్న 200-300 సంవత్సరాల ఆయుష్షును పోల్చి చూస్తే, ఇలక్ట్రానిక్‌ రికార్డులను అతి తక్కువ కాలం మాత్రమే చదవగలమని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. నిజమే, ఇలక్ట్రానిక్‌ సమాచారం చాలా నెమ్మదిగా మాత్రమే పాడైపోతుంది. కాని సాంకేతిక శాస్త్రం అతి త్వరగా పురోభివృద్ధి చెందుతుంది. వాడుకలోలేని హార్డ్‌వేర్‌లు, సాఫ్ట్‌వేర్‌లు ఉపేక్షించబడుతున్నాయి గనుక, పాత కంప్యూటర్‌ రికార్డులను చదవడం చాలా కష్టం కావచ్చు.

కనుక, కాగితాలు అవసరంలేని కార్యాలయం అనే స్వప్నం వాస్తవరూపం దాల్చుతుందా లేదా అన్నది వేచి చూడవలసిన విషయంగా ఉంది. అదే సమయంలో, మార్క్‌ ట్వయిన్‌ చెప్పిన మాటల్లోని కొంత భాగాన్ని తీసుకుని చెప్పాలంటే, కాగితాలకు కాలం చెల్లిందనే నివేదికలు మరీ అతిశయంగా మాట్లాడుతున్నాయని స్పష్టమౌతుంది.

మనం అన్ని వృక్షాలను నాశనం చేస్తామా?

ఒక చెట్టు నుండి ఎన్ని షీట్ల పేపర్లను తయారు చేయవచ్చు? వృక్షాల పరిమాణం, అవి ఎలాంటివి, ఎలాంటి కాగితం, కాగితం బరువు వంటి అనేక కారకాలు ఇమిడి ఉన్నప్పటికీ, వాణిజ్య ఉపయోగానికి తగిన పరిమాణంగల ఒక పల్ప్‌వుడ్‌ వృక్షం నుండి, వ్రాసేందుకు, ముద్రించేందుకు ఉపయోగించే స్టాండర్డ్‌ కాగితాల—12,000 షీట్లను తయారు చేయవచ్చు అని అంచనావేయబడుతుంది. అలాగైనప్పటికీ, ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాగితాల పెద్ద పరిమాణం బంజరు భూమిగా మారిన, వనరహిత ప్రదేశాల పెద్ద చిత్రాన్ని ఇస్తుంది. మనం నిజంగానే పర్యావరణ సంక్లిష్టావస్థవైపుగా పయనిస్తున్నామా?

కాగితం ఉత్పత్తిదారులు, ఈ విషయమై భయపడాల్సిన పరిస్థితిలేదని నొక్కిచెబుతున్నారు. చాలా పెద్ద మొత్తంలోని కాగితాలు—కొన్ని దేశాల్లో 50 శాతం కాగితాలు—చెత్తకుప్పలో కలిసిపోనున్న పేళ్ళ నుండి, కలప పరిశ్రమల్లోని వ్యర్థ పదార్థాల నుండి తయారు చేయబడుతున్నాయని వాళ్ళు వెంటనే సూచిస్తారు. పేళ్ళు కుళ్ళిపోతే మిథేన్‌ను తయారవుతుంది. మిథేన్‌ హరితగృహ వాయువు. దీనికి భూగోళం వేడెక్కిపోవడంతో సంబంధముంది. కనుక కాగితాల ఉత్పత్తిలో ఈ పేళ్ళు సద్వినియోగం చేయబడుతున్నాయి. అయితే, కాలుష్యాన్ని సృష్టిస్తున్నందుకూ, అడవులను పాడుచేస్తున్నందుకూ ప్రతిస్పందిస్తూ, పర్యావరణ సంబంధ గుంపులు మరియు వినియోగదారులు గుంపులు కాగితపు పరిశ్రమను నిందించాయి. కాగితం ఉత్పాదనలో ఉపయోగించే ఇంధనాలు హరితగృహ వాయువులను ఉత్పత్తి చేస్తున్నాయి అని వాళ్ళు వాదిస్తున్నారు! వ్యర్థకాగితం చెత్తగా మారినప్పుడు అదనపు హరితగృహ వాయువులు సృష్టించబడతాయి అని కూడా వాళ్ళు అంటున్నారు.

అయినప్పటికీ, వాల్డ్‌ బిసినెస్‌ కౌన్సిల్‌ ఫొర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ చేసిన ఒక అధ్యయనం, భూమిమీద ఉన్న వనరులు తగ్గిపోకుండా కాగితాలను అవసరమైనంత పరిమాణంలో ఉత్పత్తి చేయడం సాధ్యమనే అభిప్రాయానికి వచ్చింది. ఒక కారణమేమిటంటే, వృక్షాలను పునఃనవీకరించవచ్చు, కాగితాన్ని రిసైకిల్‌ చేయవచ్చు. అయినప్పటికీ, “పారిశ్రామిక ప్రాక్టీసుల్లో, పేపర్‌ సైకిల్‌లోని ప్రతి స్థాయిలోను—అడవులను సరైనవిధంగా చూసుకోవడం, గుజ్జును, కాగితాన్ని తయారు చేయడం, కాగితాన్ని ఉపయోగించడం, రీసైక్లింగ్‌, ఎనర్జీ రికవరీ, చివరికి పంపిణీ చేయడంలో—మరిన్ని మార్పులు చేయవలసి ఉంది” అని ఆ అధ్యయనం నొక్కిచెప్పింది. కాగితపు పరిశ్రమ పర్యావరణానికి హానికలగకుండా, ఆర్థికంగా సరసమైన విధంగా గుజ్జును తయారు చేసే ప్రయత్నంలో, గోధుమ గడ్డిపోచ, త్వరగా పెరిగే చెట్లు, ధాన్యపు మొక్కలు, జనపమొక్కవంటి ప్రత్యామ్నాయాల కోసం చూస్తోంది. అలాంటి పద్ధతులు ఎంతమేరకు అమలుచేయవచ్చు, అవి ఫలకరంగా ఉంటాయా అన్నది వేచి చూడాలి.

[అధస్సూచీలు]

a రెఫరెన్స్‌లూ, ఆర్ట్‌ డైరక్షన్‌లతో సహా.

b తేజరిల్లు! ఆగస్టు 8, 1997వ సంచికలోని “ఇంటర్‌నెట్‌—అది మీకు అవసరమా” అనే పరంపరను చూడండి.

[27వ పేజీలోని బాక్సు]

కార్యాలయంలో కాగితాలు వృథా అవ్వడాన్ని ఎలా తగ్గించవచ్చంటే

✔ వీలైనంత తక్కువ ప్రింట్‌ తీసుకోండి. డాక్యుమెంట్లను స్క్రీన్‌ మీదే పునఃపరిశీలించి కావలసిన మార్పులు చేయండి. హార్డ్‌ కాపీల సంఖ్యను, చిత్తుప్రతుల సంఖ్యను తగ్గించండి.

✔ పెద్ద డాక్యుమెంట్ల కోసం, చదవగల్గేంత చిన్న ఫాంట్‌ సైజ్‌ను ఉపయోగించండి.

✔ మీ ప్రింటర్‌ను ఆన్‌ చేసినప్పుడెల్లా, లేదా ఒక డాక్యుమెంట్‌ను ప్రింట్‌ చేస్తున్నప్పుడెల్లా, అది టెస్ట్‌ను గానీ హెడ్‌లైన్‌గానీ ఉపయోగిస్తున్నట్లయితే, ఆ ఫీచర్‌ను ఆఫ్‌ చేయండి.

✔ వాడిన కాగితాన్ని రిసైకిల్‌ చేయండి.

✔ రిసైకిల్‌ చేసే ముందు, ఒక వైపు మాత్రమే ముద్రించిన కాగితాన్ని దాని మరో వైపు తర్వాత ముద్రించేందుకు ప్రక్కనబెట్టండి. వాటిని చిత్తుప్రతులను ముద్రించే కాగితాల్లో కానీ, విడి కాగితాల సెట్లో కానీ పెట్టండి.

✔ వీలైనంత వరకూ, రెండు వైపులా ప్రింట్‌ చేసుకోండి లేదా కాపీలు తీసుకోండి.

✔ డాక్యుమెంట్‌లను ఆఫీసులో అందరితో పంచుకోవడం తప్పనిసరైనప్పుడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాపీని ప్రింట్‌ చేసే బదులు, ఒక్కటే తీసి అందరికీ ఒకరి తర్వాత ఒకరికి పంపండి.

✔ హార్డ్‌ కాపీ అవసరం లేకుండా చేసేందుకు, నేరుగా మీ కంప్యూటర్‌ నుండి ఫాక్స్‌లను పంపండి. మీరు ఫాక్స్‌ తీసేటప్పుడు హార్డ్‌ కాపీలను ఉపయోగించడం తప్పనిసరైనప్పుడు, కవర్‌ షీట్‌ను ఉపయోగించకుండా కాగితాన్ని ఆదా చేయండి.

✔ అనవసరంగా ఇ-మెయిల్‌ మెస్సేజ్‌లను ప్రింట్‌ చేయకండి.

[24వ పేజీలోని చిత్రం]

కాగితాలు అవసరంలేని కార్యాలయాలను తీసుకురావాలని ఉద్దేశించిన ఉపకరణాలే మనలను కాగితాల్లో ముంచెత్తుతున్నాయి అని కొందరు వాదిస్తారు

[26వ పేజీలోని చిత్రం]

కొన్నిసార్లు, కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద చూడడం కన్నా, ప్రింటెడ్‌ పేజీని ఉపయోగించడమే సులభం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి