ప్రపంచ పరిశీలన
జననాల రేటు తక్కువవ్వడం వల్ల కలిగే పరిణామాలు
‘పారిశ్రామిక ప్రపంచంలో జననాల రేటు తక్కువవ్వడం ఇప్పుడు కలవరానికి ఒక కారణంగా తయారవుతుంది’ అని పారిస్‌లోని ఇంటర్‌నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అనే వార్తాపత్రిక నివేదించింది. ఎందుకు? ఎందుకంటే, చివరకు వృద్ధుల జనాభాకు మద్దతు ఇవ్వడానికి చాలినంతమంది యౌవనస్థులు ఉండరని దానర్థం. ఉదాహరణకు, యూరప్‌లోని అనేక దేశాలు 20 సంవత్సరాల లోపు ఉన్న వారికంటే 60 సంవత్సరాలు పైపడ్డ ప్రజల జనాభా ఎక్కువ ఉండే స్థితికి చేరుకుంటున్నాయి. దూరదేశాలకు ప్రయాణించడానికి, జీవనోపాధిని సంపాదించడానికి, లేక పైచదువులు చదవడానికి దంపతులు పిల్లలను కనడాన్ని వాయిదావేసే వైఖరి వృద్ధుల జనాభా పెరగటం గురించి పేర్కొన్న కారణాలలో ఒకటి. ఇవ్వబడుతున్న ఇతర కారణాలలో ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలు ఉంటే “ఒక భారంగా” లేక “ఇబ్బందిగా” తయారవడం, ఇప్పుడు ప్రజలు మునుపు జీవించిన దానికంటే దీర్ఘకాలం జీవిస్తున్నారన్న వాస్తవం ఉన్నాయి.
నిద్రా కొరత పెరగటం
అమెరికాలో నివసించేవాళ్ళు “ఈ శతాబ్దపు ప్రారంభంలో [వాళ్ళు] నిద్ర పోయినదానికన్నా ఇప్పుడు రాత్రి వేళల్లో దాదాపు ఒక గంటన్నర సేపు తక్కువ నిద్రపోతున్నారనీ, “బహుశా, ఈ సమస్య విషమించవచ్చు” అనీ న్యూస్‌వీక్ పేర్కొన్నది. ఎందుకు? “నిద్రను తాము దొంగిలించవచ్చని ప్రజలు దృష్టిస్తున్నారు” అని విస్‌కాన్సిన్ యూనివర్శిటీలో, వ్యాధి నివారణ మందుల ఒక ప్రొఫెసరు అయిన టెర్రీ యంగ్ చెబుతున్నాడు. “కష్టపడి పని చేస్తున్నారన్నదానికి, ఎంతో పురోభివృద్ధిలో ఉన్నారన్న దానికి అది సూచన అని దృష్టించబడుతుంది.” కాని, నిద్రను నష్టపోవడం వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతాయి, కృంగుదల, గుండెకు సంబంధించిన సమస్యలు వంటివి ఏర్పడతాయి. ఎలుకలకు నిద్ర లేకుండా చేయటం వల్ల రెండున్నర వారాల తర్వాత అవి చచ్చిపోయాయి. “బహుశ, మీరు అదే విధంగా అకస్మాత్తుగా చనిపోకపోవచ్చు, కాని, నిద్రలేకుండా ఉండటం పరోక్షంగా మీ జీవితానికి నష్టం కలుగజేయవచ్చు, ఎప్పుడంటే అలసిపోయిన డాక్టరు రోగానికి తప్పు మందును నిర్దేశించినప్పుడూ లేక నిద్ర మత్తులో ఉన్న ఒక ఆటో డ్రైవరు వాహనాన్ని మీ మీదికి తెచ్చినప్పుడు” అని న్యూస్‌వీక్ తెలియజేసింది. “వాహనం నడిపేటప్పుడూ ఉద్యోగ స్థలాల్లోనూ చురుకుగా ఉండడానికి ఉన్న మంచి ఆచరించదగ్గ మార్గాలు ఏమంటే నిద్రపోవటానికి తగినంత సమయం అనుమతించడం, అప్పుడప్పుడూ చిన్న కునుకు తీయడాన్ని ప్రజలు నేర్చుకొనే అవసరం ఉంది” అని నిద్రపై పరిశోధన సాగించిన జేమ్స్ వాల్స్ చెప్పాడు.
అతినిద్రా వ్యాధి మళ్ళీ దాడిచేయటం
1974లో, అతినిద్రా వ్యాధికి సంబంధించిన మూడు కేసులను అంగోలా దేశం రిపోర్టు చేసింది. అక్కడ కనీసం 3,00,000 కేసులు ఉండవచ్చని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వేలాదిమంది బహుశ లక్షలాదిమంది అపాయంలో ఉండవచ్చు. సీసీ ఈగ కుట్టడం వల్ల అతినిద్రా వ్యాధి కల్గుతుంది. పరాన్నజీవి సోకిన మానవుని రక్తాన్ని పీల్చిన తర్వాత ఈ ఈగ మరొకరికి ఆ వ్యాధి సోకేలా చేయడానికి బయలుదేరుతుంది. పొలాల్లో పనిచేస్తున్న ప్రజలు లేక నది దగ్గర బట్టలు ఉతుకుతున్నవారు—తమ తల్లుల వీపులకు కట్టిన శిశువులు కూడా బాధితుల్లో ఉన్నారు. బాధితులు ప్రారంభంలో తలనొప్పి, జ్వరం, వాంతులతో బాధపడతారు. రాత్రిళ్ళు నిద్రపోలేకపోవడంతో సాధారణంగా వాళ్ళు పగటివేళల్లో కునికిపాట్లుపడుతుంటారు. ఆ పరాన్నజీవి కేంద్రనాడీ మండలంలోనికీ చివరికి మెదడులోకీ ప్రవేశించడం వల్ల పిచ్చెక్కడం, కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది, మరణానికి కూడా దారితీస్తుంది. వ్యాధిసోకే చక్రాన్ని ఆపుచేయడం, వ్యాధి సోకినవాళ్ళకు చికిత్స చేయడం ఖర్చుతోనూ, కష్టంతోనూ కూడినది—ఒకసారి చికిత్స చేయించుకోవడానికి దాదాపు 90 డాలర్లు అవుతుంది, “అంగోలాలో ఇది చాలా ఖర్చుతో కూడినదని,” లండన్‌లోని ద డైలీ టెలిగ్రాఫ్ నివేదించింది.
ఆశించిన ఫలితం కాదు
తరచూ నగర ట్రాఫిక్, డ్రైవర్ల సహనాన్ని అతిగా పరీక్షిస్తుంది. రోమ్‌లోని లాసపియన్జా విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్రజ్ఞుల చేత ఒక పరిశోధన నిర్వహించబడింది. ఆ పరిశోధన ద్వారా ట్రాఫిక్ పెరుగుతుండగా మత విషయాలపై బూతులాడటం కూడా పెరుగుతుందని తేలింది. కోరీరే డెల్లా సెరా అనే వార్తాపత్రిక ప్రకారం, గ్రామ ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో, “54 శాతం మంది బూతులాడేవారు, మతంపట్ల అగౌరవంగా ప్రవర్తించేవారు” ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యల మూలంగానే అలా ప్రవర్తించారు. అయితే, పెద్ద-పట్టణాల్లోని ట్రాఫిక్‌లో “సెయింట్‌లనీ, కన్యమేరీ విగ్రహాలను దూషించే ప్రవృత్తి” పెరుగుతుందన్నది స్పష్టమౌతుంది. “ఈ రోజుల్లోని ముఖ్యనగరాల్లో 78 శాతం మంది బూతులాడేవారు తిట్లు తిట్టేవారు అలా చేయడానికి ట్రాఫిక్ కారణం అవుతుందని,” వార్తాపత్రిక తెలియజేసింది. రోమ్‌లో ఇటీవల ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా తయారయ్యింది, ఎందుకంటే 2000వ సంవత్సరం కోసం సిద్ధపాటుగా నిర్మాణాలు చేయడం జరుగుతుంది. ఆ సంవత్సరాన్ని పశ్చాత్తాప ప్రార్థనలు చేయబడే క్యాథలిక్ జూబిలీ సంవత్సరంగా కూడా ప్రకటించబడింది. “ఇది వాస్తవ విరుద్ధంగా ఉన్నా కాని నిజం, రోమ్‌లో జూబిలీ చూపించే మొట్టమొదటి ప్రభావం పశ్చాత్తాప ప్రార్థనలు పెరగడం కాదుగానీ బూతుల సంఖ్య పెరగడమే” అని పరిశీలించడానికి వచ్చిన అనుసంధానకర్త వ్యాఖ్యానించాడు.
శాస్త్రీయ సంగీతంతో ప్రయాణికులను ఉపశమింపజేయడం
రియో డె జనైరోలోని 18 భూగర్భ స్టేషన్‌లలో రైళ్ళకోసం ఎదురుచూసే ప్రయాణికులు స్ట్రాస్, వివాల్డీ, చోపిన్, చికోవిస్కీ, మొజార్ట్, బాక్, బిజెట్, స్కుబర్ట్, బ్రామ్స్ వంటి కంపోజర్ల సంగీతాన్ని వినగలరు. ఇలా ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ అధికారులు, “ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగినప్పుడు ప్రయాణికుల్ని శాంతింపజేయడానికి” ప్రయత్నిస్తున్నారని ఊ గ్లోబూ అనే వార్తాపత్రిక తెలియజేసింది. సంగీతకారుల లిస్టు తయారైన తర్వాత, “రైలు ప్లాట్‌ఫారమ్‌లు డ్యాన్స్ హాళ్లన్న తలంపు కలుగనివ్వని సంగీతం ఎంపిక చేయబడింది.” “ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రతిస్పందన లభించింది” అని రియో డె జనైరోలో భూగర్భ స్టేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ అయిన లోవిష్ మేరియా మీరాండ చెప్పాడు.
ప్రతీ ఒక్కరి బాధ్యత
“1970వ సంవత్సరం నుంచి ప్రకృతిసిద్ధమైన ప్రపంచంలో 30 శాతాన్ని నిర్మూలించారు. ఇందులో అడవులు, స్వచ్ఛమైన నీరు, సముద్ర వనరులను నాశనం చేయడం ఇమిడివుంది” అని గార్డియన్ వీక్లీ అనే వార్తాపత్రికలోని ఒక శీర్షిక తెలియపరచింది. ఈ శీర్షిక ప్రపంచవ్యాప్త ప్రకృతి నిధితో (WWF) సహా ఇటీవలి మూడు సంస్థలు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా గుర్తించింది ఏమంటే, ప్రకృతి వనరులను ఎక్కువ మోతాదుల్లో పాశ్చాత్య దేశాలు ఎప్పటినుంచో వినియోగించుకుంటున్నప్పటికీ, వర్థమాన దేశాలు ఇప్పుడు “వారికున్న సహజ వనరులను ఎక్కువ సంఖ్యలో నిర్మూలం చేసేస్తున్నారు.” “ఇలా చేయడం వల్ల ప్రమాదానికి కారణం అవుతుందని మాకు తెలుసు, కాని ఈ రిపోర్టును మేము ఇచ్చే వరకూ ఇది ఎంత ప్రమాదకరం అన్న వాస్తవాన్ని మేము గుర్తించలేదు” అని WWFలోని ఒక అధికారి గుర్తించారు. రిపోర్టులు దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని చెబుతుండగా, ప్రత్యేకించి “ప్రకృతిసిద్ధమైన వనరులను అజాగ్రత్తగా చూసినందుకు వ్యక్తిగతంగా ప్రతీఒక్కరూ బాధ్యులై ఉన్నారని” ఆ పేపరు చెప్పింది.
పొగత్రాగడం వల్ల కోట్లు ఖర్చు
అనేక ప్రాంతాల్లో పొగత్రాగే వారి సంఖ్య తక్కువవుతున్నప్పటికీ, స్విట్జర్లాండ్‌లో పరిస్థితి అలానే స్థిరంగా ఉందని బెర్నర్ ఓబర్‌లేండ్ అనే వార్తాపత్రిక తెలియజేసింది. దాదాపు జనాభాలో మూడవవంతు పొగత్రాగుతారు. ఎయిడ్స్, హెరాయిన్, కొకైన్, మత్తుపానీయాలు, అగ్ని, మోటరువాహనాల ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు ఈ కారణాలన్నింటితో చనిపోయే వారిసంఖ్య కన్నా ఎక్కువగా పొగాకు సంబంధంగా చనిపోతున్నవారి సంఖ్య సంవత్సరానికి 8,000 మందికి పైగా ఉంది. స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా నిర్వహించబడిన ఒక పరిశీలనలో 1995లో స్విట్జర్లాండ్‌లోని ప్రజలు ఉపయోగించిన పొగాకు యొక్క రేటు వెయ్యి కోట్ల స్విస్ ఫ్రాంక్‌లు అని, ఆరువందల కోట్ల అమెరికా డాలర్ల కన్నా ఎక్కువ అని నిర్ధారించింది. వైద్య ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు, ఉద్యోగంలో ఉత్పత్తి తక్కువకావడం, వ్యాధుల మూలంగా పొగత్రాగేవారి, వారిపై ఆధారపడేవారి జీవిత నాణ్యత తగ్గడం, పొగత్రాగడం మూలంగా చనిపోయినవారి కుటుంబ సభ్యులు అనుభవించిన బాధలు వీటన్నింటినీ లెక్కలోనికి తీసుకోగా అంత మొత్తం ఖర్చు అయ్యిందని ఆ అధ్యయనం చెబుతుంది.
మీ గుండెను కాపాడుకోండి
“వాతావరణం వేడిగా ఉంటే గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉందని ఎప్పుడూ మనకు తెలిసిందే—కాని చల్లని వాతావరణంలో కూడా గుండె జబ్బులు వస్తాయని ఇప్పుడు మనకు తెలుసు,” అని కెనడా, ఒంటారియోలో హార్ట్ అండ్ స్ట్రోక్ సంస్థలో గుండెకు సంబంధించిన నిపుణుడూ ప్రతినిధీయైన డాక్టర్ ఆంథోనీ గ్రాహమ్ తెలిపాడు. ద గ్లోబ్ అండ్ మెయిల్ అనే వార్తాపత్రిక రిపోర్టు చేసిన దానిని బట్టి, ఫ్రాన్స్‌లో 2,50,000 మంది పురుషులను ఒక పది-సంవత్సరాలు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, పది డిగ్రీల సెల్సియస్ సగటు వాతావరణం పెరిగినా గానీ తగ్గినా గానీ “మొదటిసారిగా గుండెపోటు 13 శాతం పెరిగే ప్రమాదం ఉందని” చూపించింది. ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు, గుండె వేగంగానూ, గట్టిగానూ కొట్టుకుంటుంది, ఎందుకంటే వేడిని పుట్టించడానికి చర్మం నుంచి రక్తం శరీరంలోని లోపలి భాగాలకు రవాణా చేయబడుతుంది. ప్రజలు వాళ్ళకు వాళ్ళుగా ఎక్కువ అలసిపోయినప్పుడు లేక సరియైన విధంగా వస్త్రాలు వేసుకోనప్పుడు ఎక్కువ ప్రమాదం ఏర్పడుతుంది. డాక్టర్ గ్రాహమ్ హెచ్చరించేదేమంటే: “అయిదు నెలల వరకూ తిని కూర్చుని టీవీ చూడటంలో నిమగ్నమై ఉండి తర్వాత హఠాత్తుగా బయటకు వెళ్ళి చలిలో ఇంటిముందు ఉన్న మంచును ఎత్తివేయడం మంచిదికాదు. ఆ పనిచేయడానికి ముందు దానికి తగ్గ శక్తిని తెచ్చుకోవాలి.”
మీ పాపతో మాట్లాడండి
ప్రతీరోజూ కనీసం 30 నిమిషాలపాటు చిన్న పిల్లలతో మాట్లాడటం వల్ల వారి జ్ఞానం, భాషా నైపుణ్యాలు గుర్తించదగిన విధంగా పెరగగలవు అని లండన్ యొక్క డైలీ టెలిగ్రాఫ్ రిపోర్టు చేసింది. పిల్లల్లో తొమ్మిది నెలలున్న 140 మంది పిల్లల్ని పరిశోధకులు పరిశీలించారు. వారి పిల్లలతో ఎంత బాగా మాట్లాడవచ్చో గుంపులోని సగంమంది తల్లిదండ్రులకు సలహాఇచ్చి, వేరే సగంమంది అలా చేయడానికి ఎలాంటి సూచనలను ఇవ్వలేదు. అటుతర్వాత ఏడు సంవత్సరాలకు “జ్ఞానంలో మొత్తం వేరే గుంపుకన్నా సంవత్సరం మూడు నెలలు [మాట్లాడిన-వారి] గుంపు ప్రగతిపథంలో ఉంది,” వారి భాషా నైపుణ్యాలు “చాలా ఎక్కువ అర్థవంతమైనవి” అని రిపోర్టు తెలియజేసింది. సమాజంలో ఏర్పడిన ప్రధాన మార్పులను బట్టి ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో ముందు మాట్లాడిన దానికన్నా తక్కువ మాట్లాడుతున్నారని పరిశోధకురాలైన డాక్టర్ సాలీ వార్డ్ అభిప్రాయపడుతుంది. ఉదాహరణకు, చాలామంది తల్లులు పనికి వెళ్తున్నారు, సంభాషణకు బదులు చాలా ఇళ్ళల్లో వీడియోటేపులు దాన్ని భర్తీ చేస్తున్నాయి.