కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 7/8 పేజీలు 21-23
  • ఎగతాళిని నేనెలా ఎదుర్కోగలను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎగతాళిని నేనెలా ఎదుర్కోగలను?
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వారెందుకు ఎగతాళి చేస్తారు
  • సమాధానం చెప్పడం
  • మాట్లాడటం
  • పరీక్షించబడిన విశ్వాసమే గట్టి విశ్వాసం
  • క్రైస్తవ యౌవనులారా విశ్వాసమందు స్థిరులైయుండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యౌవనులారా—మీరు చేసిన కార్యమును యెహోవా మరచిపోడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • దేవునిగూర్చి ఎందుకు మాట్లాడాలి?
    తేజరిల్లు!—1994
  • యౌవనులారా మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
తేజరిల్లు!—1999
g99 7/8 పేజీలు 21-23

యువత ఇలా అడుగుతోంది

ఎగతాళిని నేనెలా ఎదుర్కోగలను?

వస్త్రధారణలో లేక ప్రవర్తనలో తోటి స్నేహితుల నుంచి వ్యత్యాసంగా ఉన్న యౌవనస్థులు క్రూరమైన ఎగతాళికి గురై ఉండవచ్చు. తరచు వేరే యౌవనస్థుల ప్రవర్తననుండి తమ ప్రవర్తన పూర్తి వ్యత్యాసంగా ఉన్న క్రైస్తవ యౌవనస్థుల విషయంలో ఇది నిజం. “లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు,” అని క్రీస్తు తన నిజమైన అనుచరులకు చెప్పలేదా?—యోహాను 15:20.

యెహోవాసాక్షులైన యౌవనస్థులపై ఇది ఎలా ప్రభావం చూపుతుంది? కొన్ని సెలవు దినాలను ఆచరించనందువల్ల వారిలో కొంతమంది ఎగతాళికి గురౌతున్నారు; జెండా వందనం చెయ్యకపోవడం వల్ల ఇతరులు విమర్శించబడుతున్నారు. మత్తుమందులను దుర్వినియోగం చేయనందుకూ, నిజాయితీగా ఉంటున్నందుకూ, బైబిలులోని నైతిక ప్రమాణాలను పాటిస్తున్నందుకు వారిలో అనేకమంది వేధించబడుతున్నారు.

ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదు. వాస్తవానికి, “తమతోకూడ [జనాంగాలలోని ప్రజలతో కూడ] మీరు పరుగెత్తకపోయనందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు” అని మొదటి శతాబ్దంలో జీవించిన క్రైస్తవులకు అపొస్తలుడైన పేతురు చెప్పాడు. (1 పేతురు 4:4) వాళ్ళు “మిమ్మల్ని చెడ్డ పేర్లతో పిలుస్తారు” (నాక్స్‌), లేక “వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తారు” అని వేరే అనువాదాలు చెబుతున్నాయి.—టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

మీ మతసంబంధమైన నమ్మకాలను బట్టి మీరెప్పుడైనా ఎగతాళికి గురయ్యారా? అలా అయితే ధైర్యం తెచ్చుకోండి. మీకు అనేకమంది తోడున్నారు! మీరు మీ విశ్వాసాన్నిబట్టి నిందించబడుతున్నప్పుడు కలిగే బాధను అధిగమించడాన్ని నేర్చుకోగలరని తెలుసుకోవడం వల్ల మీరు సంతోషిస్తారు.

వారెందుకు ఎగతాళి చేస్తారు

తమ సొంత విశ్వాసంలోనూ, ప్రవర్తనలోనూ తమనుండి వ్యత్యాసంగా ఉన్నవాళ్ళను ఎందుకు కొంతమంది ఎగతాళి చేస్తారు? కొన్నిసార్లు ఎగతాళి చేసేవారు—చాలావరకూ క్రూరుల్లాగే ఉంటారు—వారికి భద్రతాభావం ఉండదు. వాళ్ళు తమ తోటివాళ్ళ ఎదుట తమ గొప్పతనాన్ని చూపించుకొనేందుకుగాను మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. వాస్తవానికి, అలా వేధించేవాళ్ళు, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, మిమ్మల్ని బాహాటంగా విమర్శించడానికి ఆసక్తిగానీ—లేక ధైర్యంగానీ—చూపించడం అరుదు.

మరోవైపు, పేతురు వ్రాసినట్లు కొంతమంది అపహాసకులు ‘ఆశ్చర్యపడతారు.’ అవును, మీ ప్రవర్తన విషయమై వారు నిజంగా తికమకపడవచ్చు. ఉదాహరణకు, మీరు యెహోవాసాక్షుల్లో ఒకరైతే, కొన్ని సెలవుదినాలతో సంబంధంవున్న కార్యకలాపాల్లో మీరు భాగం వహించకపోవడం నిజంగా వారికి విచిత్రంగా అనిపించవచ్చు. సాక్షులను గురించి అపార్థం చేసుకొనే సమాచారాన్ని దృఢనిశ్చయం చేసుకున్న వ్యతిరేకుల నుండి కూడా వారు వినివుండవచ్చు.

కారణం ఏదైనప్పటికీ, ఎక్కువ ఎగతాళి మాటలతో కూడిన దాడిని ఎదుర్కొన్నప్పుడు, ‘ఆలోచన లేకుండా కత్తిపోటువంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు,’ అన్న బైబిలు సామెతతో మీరు ఏకీభవించవచ్చు. (సామెతలు 12:18; NW) కాని అలాంటి మాటలు మాట్లాడేవారు బహుశ వ్యక్తిగా మిమ్మల్ని ఇష్టపడకపోవడాన్ని బట్టి కాకపోవచ్చని గుర్తుంచుకోండి. కచ్చితంగా బైబిలు సామెత పేర్కొన్న ప్రకారమే వారు చేస్తుండవచ్చు—‘ఆలోచన లేకుండా మాట్లాడతారు.’

అయినప్పటికీ, ఎగతాళికి గురికావడమన్నది, కత్తిపోటులాగ బాధ కల్గించవచ్చు. అవమానకరమైన మాటల తాకిడిని ఆపుచేసేందుకుగాను మీ విశ్వాసంతో రాజీపడాలన్న ప్రలోభం కలుగుతున్నట్లు మీకనిపించవచ్చు. అయితే, మీ నమ్మకాల మూలంగానే, మీరు ఎగతాళికి గురైతే మీరు దాన్ని ఎలా అధిగమించగలరు?

సమాధానం చెప్పడం

“నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండుడి,” అని అపొస్తలుడైన పేతురు క్రైస్తవులకు ఉద్బోధించాడు. (1 పేతురు 3:15) మీరు అనుభవజ్ఞానం పొంది, ఆ విధంగా మీ నమ్మకాలకున్న కారణాలను అర్థం చేసుకోవడం, మీ విశ్వాసం విషయమై అలాంటి సమాధానం చెప్పడం అవసరం.

అయితే, మీరు “ప్రగాఢమైన గౌరవంతో” లేక ద బైబిల్‌ ఇన్‌ బేసిక్‌ ఇంగ్లీష్‌ అనువదించినట్లు “గర్వము లేకుండా” ఇతరులకు మీరే స్వయంగా ఎలా వ్యక్తపరచాలనేది కూడా నేర్చుకోవడం తప్పనిసరి. బైబిలులోను, దాని బోధల్లోను మీకున్న జ్ఞానం మీరు ఇతరులకంటే ఉన్నతులని అనుకునేలా చేయకూడదు. దానికి భిన్నంగా, “ఎక్కువమందిని సంపాదించికొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని,” అని తన పరిచర్యను గురించి వ్రాసిన అపొస్తలుడైన పౌలుకున్నటువంటి దృక్పథాన్ని అలవరచుకోవడానికి మీరు శ్రమించండి.—1 కొరింథీయులు 9:19.

మీ విశ్వాసం గురించి సమాధానం చెప్పడానికి సిగ్గుపడుతున్నట్లుగా మీరు కనుగొన్నట్లయితే, నిరాశపడవద్దు. అనేకమంది యౌవన సాక్షులు అదే విధంగా భావించారు. “నేను ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు, నేను పండుగదినాలను ఎందుకు ఆచరించటంలేదు లేక జెండా వందనం ఎందుకు చేయటంలేదు లేక నేను ఇంటింటి పరిచర్యకి ఎందుకు వెళ్తున్నానన్నది కూడా ఇతరులకు ఎలా వివరించాలో నాకు తెలిసేది కాదు,” అని జమాల్‌ చెప్పాడు. అతనికి ఏది సహాయపడింది? “చివరికి నేను ఈ విషయాలను గురించి వివరించగల్గేవరకూ మా నాన్నగారు నాకు సహాయంచేస్తూ వచ్చారు, ఇది నాలో చాలా మార్పును తీసుకొచ్చింది” అని ఆయన చెబుతున్నాడు. మీ నమ్మకాలను ఇతరులకు వివరించడం మీకు కష్టంగా ఉన్నట్లయితే, మీరు దేవుని గూర్చిన జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించేందుకు మీకు సహాయం చేయడానికి బహుశ మీరు తల్లి/తండ్రి లేక క్రైస్తవ సంఘంలోని మరొక పరిపక్వత గల వ్యక్తి సహాయాన్ని తీసుకోవచ్చు.—ఎఫెసీయులు 3:17-19.

పాఠశాలలో మాట్లాడేందుకు ధైర్యాన్ని కూడదీసుకోవడానికి వ్యక్తిగత బైబిలు పఠన కార్యక్రమం తనకు సహాయం చేసిందని 16 సంవత్సరాల యువ సాక్షి చెప్పింది. “నేను ఒక సాక్షిగా ఉన్నందుకు, నా తరగతిలోనివారు నన్ను ఆటపట్టిస్తుంటే, ఏమి చెప్పాలో నాకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పూర్తికాల పరిచారకురాలిగా నేను బైబిలును చాలాసార్లు పఠించాను, నేను సమాధానం ఇవ్వగల్గుతున్నాను కూడా. ఇటీవలి కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని అతి క్రొత్త శీర్షికలను ఎప్పటికప్పుడు చదవడం నేను నా స్కూల్లోని వారికి నా నమ్మకాల గురించి మాట్లాడటానికి సహాయపడింది.

అయితే, ఏ రెండు పరిస్థితులు ఒకలా ఉండవు. కనుక, వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు విధానాల్లో ప్రతిస్పందించడం అవసరం. నిర్దయతతో కూడిన మాట మీకు కోపాన్ని తెప్పించినట్లయితే, ‘కీడుకు ప్రతి కీడు’ చేయడం ఎంతమాత్రం సరియైనది కాదు. (రోమీయులు 12:17-21) అవమానకరమైనమాటకు బదులివ్వడమనేది—ఎంత తెలివిగా మాట్లాడినట్లు కనిపించినా కూడా—కేవలం అగ్నికి ఆజ్యం పోసినట్లుంటుందే తప్ప, సాధించగల్గేది మరేమీ లేదు. అది మరింత ఎగతాళిని ప్రోత్సహించినట్లు కూడా అవుతుంది. అందువల్ల, అవమానాన్ని లెక్కచేయకుండా ఉండటమే మంచిదని కొంతమంది కనుగొన్నారు.

కొన్ని సందర్భాలలో, ఎవరైనా తమాషా కోసమే సదుద్దేశంతోనే ఏదైనా అంటే, కోపం తెచ్చుకునే బదులు, ఆ తమాషాకి నవ్వడమే జ్ఞానపూర్వకమైన పని. (ప్రసంగి 7:9) తన మాటలకు కొద్దిగానైనా లేక అసలు ఫలితం లేదని హేళనచేసేవాడు గమనిస్తే తను వేధించడం పూర్తిగా మానివేయవచ్చు.—సామెతలు 24:29; 1 పేతురు 2:23 పోల్చండి.

మాట్లాడటం

అయితే, కొన్నిసార్లు మీ నమ్మకాలను గురించి క్లుప్తంగానూ, లౌక్యంగానూ వివరించే వీలు కలుగవచ్చు. 13 సంవత్సరాల అమ్మాయి అలా చేయడానికి ప్రయత్నించింది, దానివల్ల మంచి ఫలితాలు కలిగాయి. “అనేకమంది విద్యార్థులు యెహోవాసాక్షులను ఎగతాళి చేయడం మొదలుపెట్టినప్పుడు నేను క్లాసుకు వెళ్తున్నాను. నేను మాట్లాడుదామనుకున్నాను. కాని, అంతలో వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోనారంభించారు, వాళ్ళలో ఒక్కరు తప్ప మిగతావాళ్ళందరూ అప్పటికీ నా వైపు చూసి ఎగతాళిగా నవ్వుతూనే ఉన్నారు” అని ఆమె అంటోంది. “జేమీ అనే పేరుగల అమ్మాయి నా వైపుకు తిరిగి తన దగ్గర మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం ఉందని చెప్పింది.a దానిలో చాలా వరకూ తను చదివేసిందనీ, మన నమ్మకాల గురించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని పొందడానికి తనకు ఆసక్తి ఉందని చెప్పింది. జేమీతో బైబిలును పఠించడం ప్రారంభించాను” అని సాక్షియైన ఆ విద్యార్థిని వివరించింది. తన అనుభవం ద్వారా ప్రోత్సాహం పొందిన ఈ యువ సాక్షి ఇతర యౌవనస్థులతో మాట్లాడటం ప్రారంభించింది. “ఆసక్తిని కనపరచిన నలుగురు తోటి విద్యార్థులను నేను క్రమంగా దర్శిస్తున్నాను, వారు త్వరలోనే పఠనం చేస్తారనే నమ్మకం నాకుంది” అని ఆమె చెప్పింది.

సంవత్సరాల క్రితం, ఆఫ్రికాలోని లైబీరియా దేశంలో ఒక విద్యార్థికి ఇలాంటి అనుభవమే కలిగింది. సమాజశాస్త్ర క్లాసు జరుగుతుండగా, యెహోవాసాక్షుల్లో ఒకనిగా తను పరిణామ సిద్ధాంతాన్ని కాదు గానీ, సమస్తమూ సృష్టించబడిందనే నమ్ముతున్నాని గౌరవపూర్వకంగా వివరించాడు. మొదట్లో, తన తోటి తరగతివారిలో చాలామంది ఎంతో విమర్శించేవాళ్ళు. కాని ఆయన తన నమ్మకాలను వివరించడానికి ఆ ఉపాధ్యాయుడు అనుమతించాడు. తర్వాత జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా?b (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఆ ఉపాధ్యాయుడు తీసుకున్నాడు.

ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత ఉపాధ్యాయుడు “ఈ పుస్తకం సాటిలేనిది, సృష్టిని గురించి తెలిపే సైన్స్‌ పుస్తకాల్లో ఇది అతి శ్రేష్ఠమైనది, ఇలాంటి దానిని నేనెప్పుడూ చదవలేదు” అని ఆ తరగతిలోని పిల్లలతో చెప్పాడు. తర్వాతి రెండు సెమిస్టర్లలో తరగతి పుస్తకాలతోపాటూ సృష్టి పుస్తకాన్ని కూడా ఉపయోగించాలని ఉద్దేశిస్తున్నానని ఆ ఉపాధ్యాయుడు వివరంగా చెప్పాడు. సాక్షియైన ఆ విద్యార్థి నుండి ఆ పుస్తకాన్ని కొనుక్కోమని తరగతిలోని వారికి చెప్పాడు. అనేక పుస్తకాలు అందించబడ్డాయి, చాలామంది విద్యార్థులు యెహోవాసాక్షుల గురించిన తమ దృక్కోణాన్ని మార్చుకొన్నారు!

పరీక్షించబడిన విశ్వాసమే గట్టి విశ్వాసం

నిజమే, బైబిలు ఆధారంగా మీకున్న దృక్పథాన్ని పంచుకోని—లేక మెచ్చుకోని అనేకమంది వల్ల కొన్నిసార్లు మీరు స్థైర్యాన్ని కోల్పోయినట్లు ఫీలవ్వవచ్చు. (కీర్తన 3:1, 2 పోల్చండి.) కాబట్టి, మీ నమ్మకాలనూ, విశ్వాసాలనూ పంచుకొనే వారి సహవాసం కోసం వెదకడం జ్ఞానయుక్తం. (సామెతలు 27:17) కాని, మీ పాఠశాలలో లేక మీ పొరుగువారిలో మీకున్నటువంటి విశ్వాసమే ఉన్న యౌవనస్థులు లేకపోతే అప్పుడేమిటి?

అలా అయితే, మీ మహాగొప్ప స్నేహితుడు యెహోవా దేవుడు అనీ, ఆయన మీకు మద్దతునివ్వగలడనీ గుర్తుంచుకోండి. వేలకొలది సంవత్సరాలుగా అపవాదియైన సాతాను వేసే నిందలు ప్రాముఖ్యంగా ఆయనపై గురిపెట్టినవే. అందువల్ల, మీరు మీ విశ్వాసం విషయంలో స్థిరంగా నిలిచినప్పుడు అది యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తుందనే నమ్మకాన్ని మనం కల్గివుండవచ్చు. మీరు అలా ప్రవర్తించడం ‘తనను నిందించే సాతానుకు బదులివ్వడానికి’ ఆయనకు అవకాశాన్నిస్తుంది.—సామెతలు 27:11.

అప్పుడప్పుడు, మన విశ్వాసం పరీక్షించబడుతుందన్నది మనం ఎదురుచూడవలసిన విషయమే. (2 తిమోతి 3:12) కాని, ‘అగ్ని పరీక్షతో నిర్ధారించబడినా కూడా నశించిపోయే స్వర్ణం కంటే’ పరీక్షకు గురైన మన విశ్వాసం అమూల్యమైనదని అపొస్తలుడైన పేతురు మనకు అభయాన్నిస్తున్నాడు. (1 పేతురు 1:7, NW) కనుక, మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని నిందించినప్పుడు, అది మీ విశ్వాసాన్ని బలపరచుకునే అవకాశంగా దృష్టించి, మీ ఓర్పును కనపరచండి. ఓర్పు ‘అంగీకరించబడిన స్థితికి’ నడిపిస్తుందని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 5:3-5; NW) అవును, యెహోవా మెప్పును పొందాలనే కోరిక, విశ్వాసం మూలంగా మీరు పడే నిందలను అధిగమించడానికి మీకు శక్తివంతమైన ప్రేరణనిస్తుంది !

[అధస్సూచీలు]

a వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రచురించినది.

b వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ అఫ్‌ ఇండియా ప్రచురించినది.

[22వ పేజీలోని చిత్రం]

మీ విశ్వాసం గురించి మీరు సమాధానం ఇవ్వగలరా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి