కాలుగాని చెయ్యిగాని లేకున్నా శ్రేష్ఠమైన జీవితం
“పర్వతారోహకుడు మళ్ళీ అధిరోహించాడు.” టామ్ విట్కర్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పుడు ఒక వార్తా పత్రిక అలా ప్రకటించింది. ఆ మహోన్నత శిఖరాన్ని అంతకు ముందు ఎంతో మంది అధిరోహించారు, అయితే అలా ఎక్కిన వికలాంగులలో టామ్ విట్కర్ మొట్టమొదటివాడు! ఒక రోడ్డు ప్రమాదంలో విట్కర్ తన పాదాన్ని పోగొట్టుకున్నాడు. కానీ కృత్రిమ పాదం ఆయన తన క్రీడను కొనసాగించడాన్ని సాధ్యం చేసింది. ఇలాంటి ఉపకరణాలే వేలాది మంది ఇతర వికలాంగులు శ్రేష్ఠమైన జీవితాన్ని అనుభవించడానికి సహాయపడుతున్నాయి. నిజానికి, వికలాంగులు పరిగెత్తడాన్ని, బాస్కెట్ బాల్ ఆడడాన్ని, సైకిల్ త్రొక్కడాన్ని చూడటం ఇక ఎంత మాత్రం అసాధారణమైన విషయం కాదు.
మొదట్లో తయారు చేయబడిన కృత్రిమమైన కాళ్ళు, చేతులు కొయ్య మేకులతో, ఇనుప కొక్కేలతో చేయబడి ప్రాకృతిక స్థితిలో ఉండేవి. కానీ, యుద్ధాల్లో వేలాది మంది అంగహీనులైన తర్వాత వీటి తయారీలో అభివృద్ధి జరిగింది. నిజమైన కృత్రిమ అవయవాలున్న మొదటి తరాన్ని ప్రవేశపెట్టిన ఘనత 16వ శతాబ్దానికి చెందిన, ఫ్రెంచ్వాడైన ఆంబ్రోయిస్ పరే అనే ఒక సైనిక వైద్యుడికి దక్కడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈనాటి కృత్రిమ అవయవాల తయారీలో, సాధ్యమని కలలో కూడా అనుకోనంత సౌకర్యవంతంగా నడవగలిగేలా, చాలా సహజంగా కదలగలిగేలా అనేకమంది ప్రజలకు సహాయం చేసే హైడ్రాలిక్స్, సంక్లిష్టంగా కనిపించే మోకాలి కీళ్ళు, వంగే గుణం గల కార్బన్-ఫైబర్ పాదాలు, సిలికాన్, ప్లాస్టిక్లు, ఇతర ఆధునిక టెక్నాలజీ సంబంధ ఉత్పాదనలు ఉపయోగించబడుతున్నాయి. మైక్రో ఎలక్ట్రానిక్స్లో జరిగిన పురోభివృద్ధి, కృత్రిమమైన భుజాలను, చేతులను మరింత సహజంగా కదపడాన్ని సాధ్యం చేస్తుంది. ఈ కృత్రిమ అవయవాల రూపంలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. ఆధునిక కృత్రిమ అవయవాలు చేతి వ్రేళ్ళను, కాలి వ్రేళ్ళను కలిగి ఉంటున్నాయి, కొన్నింటికైతే సిరలు కూడా ఉన్నట్లు కనిపిస్తాయి. నిజానికి, కేన్సర్ కారణంగా తన కాలును కోల్పోయిన ఒక మోడల్ కృత్రిమమైన కాలుతో ఎంత సహజంగా కనిపిస్తుందంటే, ఆమె తన మోడలింగ్ను కొనసాగించగలుగుతుంది కూడా.
మానసిక దృక్పథం ప్రాముఖ్యం
అయినప్పటికీ, మానసిక-ఆరోగ్య నిపుణురాలైన ఎలన్ వించెల్ ఇలా హెచ్చరిస్తున్నారు: “మీరు అవయవాన్ని కోల్పోవడం వంటి వ్యక్తిగత సంక్షోభంలో పడినప్పుడు మీరు ప్రతి అంశంలోనూ అంటే శారీరక, భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక అంశాల్లో సవాలును ఎదుర్కుంటారు.” గాయం వల్ల గాంగ్రీన్ వచ్చి తన కాలును పోగొట్టుకున్న విలియంను పరిశీలించండి. ఆయనిలా చెబుతున్నాడు: “మన జీవితంలోని ఏ సవాలును అధిగమించడానికైనా ఒక కీలకం, మన మానసిక దృక్పథమే. నాకున్న వైకల్యతను నేనెన్నడూ ప్రతికూలమైనదిగా దృష్టించలేదు. బదులుగా, నాకు ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి ఎదురైన ఏ ప్రతికూలతల గురించైనా నేను అనుకూల దృక్పథాన్నే కలిగివున్నాను.” తాను కూడా వికలాంగురాలైన ఎలన్ వించెల్ దానితో ఏకీభవిస్తూ, నిరాశతో ఉండే ప్రజల కంటే, అనుకూల దృక్పథం గల వికలాంగులు తమ స్థితితో మరింత చక్కగా సర్దుకుపోతారని చెబుతుంది. బైబిలు చెబుతున్నట్లుగా, “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.”—సామెతలు 17:22.
అవయవాల్ని కోల్పోయి, ఆ పరిస్థితితో చక్కగా సర్దుకుపోయిన అనేకమంది క్రైస్తవులతో తేజరిల్లు! మాట్లాడింది. వికలాంగులు తమ వైకల్యతను గురించి ఎప్పుడూ ఎక్కువగా చింతకలిగి ఉండడాన్ని లేక దాన్ని గుప్తంగా ఉంచడాన్ని నివారించాలని అనేకులు సూచించారు. “నా అంగవైకల్యాన్ని గురించి మాట్లాడటం నిషేధించవలసిన విషయాల్లో ఒకటిగా ఇతరులు తలంచినప్పుడు అది నన్ను చాలా బాధపెడుతుంది, అది ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగిస్తుందని నాకనిపిస్తుంది” అని తన ఎడమ కాలు మోకాలి క్రింది భాగం వరకు కోల్పోయిన డెల్ చెప్పాడు. మీకు కుడిచేయి లేనట్లయితే, మీరు ఎవరికైనా పరిచయం చేయబడినట్లైతే, మీరే ముందుకు వెళ్ళి చొరవ తీసుకుని ఎడమ చేతితో కరచాలనం చేయండని కొందరు నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఎవరైనా మీ కృత్రిమ అవయవాలను గురించి అడిగితే, దాని గురించి వారికి చెప్పండి. మీరు సిగ్గుపడకుండా ఉండటం అవతలి వ్యక్తి నిశ్చింతగా ఉండటానికి సహాయం చేస్తుంది. సాధారణంగా, సంభాషణ త్వరలోనే ఇతర విషయాల వైపుకు మళ్ళుతుంది.
“నవ్వుటకు” సమయం కలదు. (ప్రసంగి 3:4) తన చేతిని పోగొట్టుకున్న ఒక స్త్రీ ఇలా చెబుతుంది: ‘అన్నింటికంటే ముఖ్యంగా, మీ హాస్య దృక్పథాన్ని కోల్పోకండి ! చాలావరకు మనల్ని గురించి మనకున్న దృక్పథమే, మన విషయంలో లోకానికున్న దృక్పథాన్ని నిర్ణయిస్తుంది.’
“ఏడ్చుటకు” సమయం కలదు
తన కాలును కోల్పోయిన తర్వాత, “ఇక ఆశంటూ ఏమీ లేదు, ఇక నా జీవితం అంతా అయిపోయింది” అని డెల్ తనలో తాను అనుకున్నాడు. అంగోలాలోని మందుపాతరల కారణంగా ఫ్లోరిండో, ఫ్లోరియానో ఇద్దరూ తమ కాలునూ, చేయినీ కోల్పోయారు. తాను మూడు రాత్రులు, మూడు పగళ్ళు ఏడ్చానని ఫ్లోరిండో చెబుతున్నాడు. ఫ్లోరియానో కూడా తన భావోద్వేగాలతో అదేవిధమైన పోరాటాన్ని పోరాడాడు. “నాకు కేవలం 25 యేళ్ళు మాత్రమే, ఒక రోజు నేను అంతా చేయగలిగాను, మర్నాడు కనీసం నిలబడలేకపోయాను. నేను కృంగిపోయాను, నిరుత్సాహపడిపోయాను” అని ఆయన వ్రాస్తున్నాడు.
“ఏడ్చుటకు” సమయం కలదు. (ప్రసంగి 3:4) మీరు ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దుఃఖించడం సహజమే. (న్యాయాధిపతులు 11:37; ప్రసంగి 7:1-3 పోల్చండి.) “బాధను పోగొట్టుకోవడానికి ఏకైక మార్గం దాన్ని సహించడమే,” అని ఎలన్ వించెల్ వ్రాస్తుంది. తదనుభూతి గలవారికి తమ భావాలను వ్యక్తపరచడం తరచుగా సహాయకరంగా ఉండగలదు. (సామెతలు 12:25) దుఃఖం అనేది కలకాలం ఉండదు. కొంతమంది అవయవాల్ని కోల్పోవడం మూలంగా కలిగే ఉద్వేగాఘాతం తర్వాత భావోద్వేగపరంగా తాత్కాలికంగా చాలా అస్థిరంగానూ, విమర్శనాత్మకంగానూ, వ్యాకులంగానూ, లేక ఎవరితోనూ కలవలేనట్లుగానూ తయారవ్వవచ్చు. అయితే, సాధారణంగా ఈ భావాలు మెల్లగా తగ్గిపోతాయి. అలా తగ్గిపోనట్లయితే, సాధారణంగా చికిత్స అవసరమయ్యే క్లినికల్ డిప్రెషన్ వచ్చి ఉండవచ్చు. అటువంటి సహాయం అవసరమయ్యేలా తమ ప్రియమైన వారిలో ఏమైనా లక్షణాలు కన్పిస్తాయేమోనని కుటుంబ సభ్యులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండాలి.a
రెండు కాళ్ళకు పక్షవాతం వచ్చిన డబ్ల్యూ. మిట్చెల్ ఇలా వ్రాస్తున్నాడు: “శ్రద్ధ తీసుకొనే ప్రజలు మనకందరికీ అవసరం. ఒకరు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు తన చుట్టూ ఉన్నారని భావించినప్పుడు ఇంచుమించు దేనినైనా భరించగలుగుతారు, అయితే ఒంటరిగా జీవించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి చిన్న వ్యతిరేకతే అడ్డంకు కాగలదు. స్నేహ బంధాలు వాటంతటవే ఏర్పడవు, వాటిని చురుకుగా ప్రారంభించి, కొనసాగించుకోవాలి, లేదా అవి క్షీణించిపోతాయి.”—సామెతలు 18:24 పోల్చండి.
కాలుగాని చెయ్యిగాని లేకున్నా శ్రేష్ఠమైన జీవనం
అవయవాల్ని కోల్పోయినప్పటికీ, అనేకమంది వికలాంగులు శ్రేష్ఠమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఉదాహరణకు రస్సెల్ తన ఎడమకాలు మోకాలి పై భాగం మాత్రమే ఉండి పుట్టారు. 78 ఏళ్ళ వయస్సులో ఇప్పుడు కూడా ఆయన క్రమంగా వ్యాయామం చేస్తారు, ఇప్పుడాయన చేతి కర్రను ఉపయోగిస్తున్నప్పటికీ, ఆయన సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. సహజంగానే ఉత్సాహంగా ఉండే రస్సెల్, తనకు దీర్ఘ కాలంగా ఉన్న మారుపేరు ఆనందం అని చెప్పారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో తన కాలును పోగొట్టుకున్న డాగ్లాస్, ఆధునిక కృత్రిమ కాలు సహాయంతో నడుస్తున్నారు. యెహోవాసాక్షుల్లో ఒకరిగా ఆయన ఇప్పటికి ఆరు సంవత్సరాలుగా ఒక క్రమ పయినీర్గా అంటే, పూర్తికాల సువార్తికునిగా సేవ చేయడంలో ఆనందిస్తున్నారు. తన కాలును పోగొట్టుకున్నప్పుడు తన జీవితం ఇక అయిపోయిందని తలంచిన డెల్ మీకు గుర్తున్నారా? ఆయన కూడా తనకు తాను ఆర్థిక మద్దతును ఇచ్చుకుంటూ, ఒక పయినీర్గా సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు.
అయితే, పేద దేశాల్లో లేక యుద్ధం వల్ల అస్తవ్యస్తమైన ప్రాంతాల్లో అవయవాల్ని కోల్పోయిన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా చెబుతుంది: “నిజానికి ఈనాడు వైకల్యతలతో ఉన్న ప్రజల్లో చాలా కొద్ది శాతం మంది మాత్రమే సహాయాన్ని పొందుతున్నారు.” చాలామంది ఇటూ అటూ తిరగడానికి చేతికర్రల మీద, మొండి ఊత కర్రల మీదనే ఆధారపడుతున్నారు. అయినప్పటికీ, కొన్నిసార్లు సహాయం లభిస్తుంది. అంగోలాలోని మందు పాతరల వల్ల వికలాంగులైన ఫ్లోరియానో, ప్లోరిండోలకు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా స్విస్ ప్రభుత్వం ద్వారా కృత్రిమ అవయవాలు లభించాయి. యెహోవాసాక్షుల స్థానిక సంఘంలో ఫ్లోరియానో ఒక పరిచర్య సేవకునిగా ఆనందంతో సేవ చేస్తున్నాడు, ఫ్లోరిండో ఒక పెద్దగా, పూర్తికాల సువార్తికునిగా సేవ చేస్తున్నాడు.
వికలాంగుల పట్ల శ్రద్ధ వహించే ఒక సంస్థ ఇలా చెప్తున్నప్పుడు చక్కగా వ్యక్తపర్చింది: “తమ ధైర్యాన్ని పోగొట్టుకొన్నవారే నిజమైన వికలాంగులు!” ఆసక్తికరంగా, వికలాంగులకు ధైర్యాన్నివ్వడంలో బైబిలు ఒక పెద్ద పాత్రను నిర్వహించింది. “నేను కోలుకుంటున్న సమయంలోనే బైబిలు సత్యాన్ని నేర్చుకోవడం నాకు ఎంతగానో సహాయం చేసింది” అని డెల్ చెబుతున్నాడు. అదేవిధంగా, “నా కష్టాల్లో నా బైబిలు-ఆధారిత నిరీక్షణ నాకెల్లప్పుడూ సహాయం చేసింది” అని రస్సెల్ చెబుతున్నాడు. వికలాంగుల కోసం బైబిలు ఏ నిరీక్షణను అందజేస్తుంది?
[అధస్సూచీలు]
a కావలికోట మార్చి 15, 1990 సంచికలోని “కృంగినవారు తిరిగి ఆనందాన్ని పొందేలా ఎలా సహాయం చేయవచ్చు” (ఆంగ్లం) అనే శీర్షికను చూడండి.
[8వ పేజీలోని బాక్సు]
నొప్పి ఉందనే భ్రమ
కోల్పోయిన అవయవం ఇంకా ఉన్నట్టు అనిపించే ఒక నిజమైన అనుభూతిని ఫాంటమ్ లింబ్ సెన్సేషన్ సూచిస్తుంది. ఇది శస్త్ర చికిత్స తర్వాత వికలాంగులకు కలిగే సాధారణ అనుభూతి, ఈ ఉద్వేగం ఎంత వాస్తవమైనదంటే, వికలాంగుల కోసమైన ఒక పుస్తకం ఇలా చెబుతుంది: “కృత్రిమ అవయవాలు లేకుండా మీరు మంచం మీద నుండి దిగేటప్పుడు, కుర్చీలో నుండి లేచేటప్పుడు ఈ ఉద్వేగపూరిత భ్రమ విషయమై జాగ్రత్తగా ఉండండి. మీ పాదం లేదన్న విషయాన్ని మీకు మీరు గుర్తుచేసుకొనేందుకు ఎల్లప్పుడు క్రిందకు చూడండి.” తన రెండు కాళ్ళను పోగొట్టుకున్న ఒక రోగి డాక్టరుతో కరచాలనం చేయడానికని లేచి నిలబడింది, కానీ నేలమీద పడిపోయింది!
కాలు లేక చెయ్యి నొప్పిగా ఉన్నట్లు భ్రమ కలగడం మరొక సమస్య. ఇది తొలగించబడిన అవయవం నుండి వస్తుందనిపించే నిజమైన నొప్పి. ఈ నొప్పి ఉందనిపించే భ్రమ యొక్క తీవ్రత, రకం, కాలవ్యవధి వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. సంతోషకరంగా, ఉద్వేగపూరిత భ్రమ, నొప్పి ఉందనిపించే భ్రమ కాలంతో పాటు సాధారణంగా తగ్గుతాయి.
[6వ పేజీలోని చిత్రం]
ఆధునిక కృత్రిమ అవయవాలు అనేకమంది వికలాంగుల జీవితాలను ఎంతో ఆనందభరితం చేస్తున్నాయి
[క్రెడిట్ లైను]
Photo courtesy of RGP Prosthetics
[7వ పేజీలోని చిత్రం]
పోగొట్టుకున్న దానికి సాధారణ ప్రతిచర్య దుఃఖం
[8వ పేజీలోని చిత్రం]
అనేకమంది వికలాంగులైన ప్రజలు శ్రేష్ఠమైన జీవితాన్ని గడుపుతున్నారు