అంగవైకల్యం అది మీకు సంభవించగలదా?
సెరాజీవో నగరాన్ని వెచ్చబరుస్తున్న వసంతకాల ఎండను ఆరుబయట ఉండి ఆస్వాదిస్తూన్న బెంజమిన్ మందుపాతర పాతిపెట్టబడిన నేల మీద కాలు మోపడంతో, ఆయన ఎడమ కాలు ఎగిరిపోయింది. “నేను లేవడానికి ప్రయత్నించాను కానీ, లేవలేకపోయాను” అని బెంజమిన్ గుర్తు చేసుకుంటున్నాడు. మందుపాతరల కారణంగా ఒక సంవత్సరంలో మరణించే, లేదా వికలాంగులుగా మారే 20,000 మంది ప్రజల్లో బెంజమిన్ ఒకడు మాత్రమే.
దాదాపు 150 లక్షల మందుపాతరలతో అంగోలా నిండిపోయివుంది, అంటే ఆ దేశంలోని ఒక్కో పురుషునికి, స్త్రీకి, పిల్లవానికి ఒకటికి మించి మందుపాతరలు ఉన్నాయన్నమాట. అంగోలాలో ఇప్పుడు అవయవాల్ని కోల్పోయినవారు 70,000 మంది ఉన్నారు. ఎనభై లక్షల నుండి ఒక కోటి వరకు పాతిపెట్టబడి ఉన్న మందుపాతరలతో కంబోడియా, అవయవాలను కోల్పోయిన వ్యక్తుల విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది, ప్రతి 236 మందిలో ఒక వ్యక్తి అలా అవయవాలను కోల్పోయారని అంచనా. బోస్నియా, హెర్జిగోవినాల్లో ముప్పై లక్షల కంటే ఎక్కువ మందుపాతరలు ఉన్నాయని నివేదించబడింది, అంటే ఒక చదరపు కిలోమీటరుకు 59 చొప్పున ఉన్నాయి.
కానీ, ప్రజలు తమ అవయవాల్ని కోల్పోయి బాధను అనుభవిస్తున్నది కేవలం యుద్ధబాధిత దేశాల్లో మాత్రమే కాదు. ఉదాహరణకు, అమెరికాలో, అవయవాల్ని కోల్పోయి బాధపడుతున్న వారు దాదాపు 4,00,000 మంది ఉన్నారు. ఆ సంఖ్యలోని పెద్దవారిలో అనేకులు, “పెరిఫెరల్ వాస్కులార్ వ్యాధి” లేదా పివిడి అని అంత సరికాని విధంగా పిలువబడుతున్న దీర్ఘకాలిక వ్యాధి ఫలితంగా తమ అవయవాల్ని కోల్పోయారు. ఈ పేరు అనేక రుగ్మతలను సూచించే సాధారణమైన పదం. “ధమనులు, సిరల చివరి భాగాలకు ప్రా[ముఖ్యంగా] తగినంత రక్తం సరఫరా కాకుండా అంతరాయం కలిగించే పరిస్థితులకు సంబంధించిన వ్యాధులను” వివరించడానికి పివిడి అనే పదం అంతగా సరిపోదని బర్స్ సైక్లోపెడిక్ మెడికల్ డిక్షనరీ నిర్వచించింది. పివిడికి ఒక ముఖ్య కారణం మధుమేహవ్యాధి. ద వరల్డ్ హెల్త్ రిపోర్ట్ 1998 ప్రకారం, “పెద్దవారిలో మధుమేహవ్యాధి కేసులు భౌగోళికంగా రెండింతల కంటే ఎక్కువ అవుతాయి అంటే, 1997లో 14కోట్ల 30 లక్షలుగా ఉన్న సంఖ్య 2025 సంవత్సరం నాటికి 30 కోట్లకు పెరుగుతుంది.”
అమెరికాలో, అవయవాల్ని కోల్పోవడానికి నడిపించే రెండవ కారకం, వాహనాలు, యంత్రాలు, విద్యుత్ ఉపకరణాలు, ప్రేలుడు పదార్థాల వల్ల జరిగే ప్రమాదాల మూలంగా కలిగే గాయం, అంగవిచ్ఛేదనకు 20 నుండి 30 శాతానికి కారణం కూడా అదే. అవయవాల్ని కోల్పోవడానికి ఇతర కారణాలు ట్యూమర్లు (దాదాపు 6 శాతం), పుట్టుకతో వచ్చే లోపాలు (దాదాపు 4 శాతం).
నిజానికి చెప్పాలంటే, అమూల్యమైన ఒక అవయవాన్ని కోల్పోవడాన్ని గురించిన తలంపే ఎంతో కలతపరుస్తుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించే మార్గం ఏదైనా ఉందా? మీరు ఇప్పటికే అవయవాల్ని కోల్పోయి బాధ పడుతున్నట్లయితే, మీరు ఒక శ్రేష్ఠమైన జీవితాన్ని ఎలా ఆనందించవచ్చు? తర్వాతి శీర్షికలు ఈ ప్రశ్నలను, ఇతర ప్రశ్నలను చర్చిస్తాయి.