అవయవాల్ని కోల్పోవడం ఈ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
అనేక సందర్భాల్లో, అవయవాల్ని కోల్పోకుండా తప్పించుకోవచ్చు! పరిధీయ రక్తనాళాల వ్యాధి (పివిడి)తో బాధపడే ప్రజల విషయంలో కూడా ఇది నిజం. ముందటి శీర్షికలో ప్రస్తావించబడినట్లుగా, పివిడి తరచుగా మధుమేహవ్యాధి యొక్క ఫలితమే.a సంతోషకరంగా, మధుమేహవ్యాధిని తరచుగా అదుపు చేయవచ్చు.
“ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేయబడినా, లేకపోయినా మధుమేహవ్యాధి చికిత్సకు మూలరాయి ఆహార క్రమబద్ధతే” అని ది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది. న్యూయార్క్ నగరంలోని కింగ్స్ కౌంటీ హాస్పిటల్లో డాక్టర్‌గా పనిచేస్తున్న మార్సెల్ బయోల్ తేజరిల్లు!తో ఇలా అన్నారు: “మధుమేహవ్యాధి ఉన్నవారు తమ పరిస్థితిని గంభీరంగా తీసుకుని, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండి, వైద్య సంబంధ పర్యవేక్షణకు విధేయులై ఉండటం ద్వారా, తమ కాలును కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.” ఈ సలహాలను పాటించే, మధుమేహవ్యాధి రకం II ఉన్నవారు కొంతకాలానికి తమకున్న రోగచిహ్నాలు తగ్గుముఖం పట్టడాన్ని చూడవచ్చు.b
వ్యాయామం ఆవశ్యకం
వ్యాయామం కూడా ప్రాముఖ్యమే. శరీరంలోని గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయి క్రమబద్ధంగా ఉండటానికి ఇది సహాయం చేస్తుంది. పివిడి ఉందని నిర్ధారణ అయినప్పుడు, పాడైన శరీర భాగాలు తగినంత బలం పుంజుకునేందుకు, సంకోచ వ్యాకోచాలను కలిగి ఉండేందుకు, అలాగే వాటికి రక్తం ప్రవహించటానికి వ్యాయామం సహాయం చేస్తుంది. ఇంటర్మిట్టెంట్ క్లాడికేషన్ను తగ్గించడానికి కూడా వ్యాయామం దోహదపడుతుంది, నడిచేటప్పుడు లేక వ్యాయామం చేసేటప్పుడు పివిడి బాధితులకు తమ పిక్క కండరాలలో కలిగే నొప్పిని ఇంటర్మిట్టెంట్ క్లాడికేషన్ అంటారు. అయితే, అటువంటి వాళ్ళు తమ కాళ్ళకు ఒత్తిడిని కలిగించే వ్యాయామాలను, కుదుపులతో కూడిన వ్యాయామాలను చేయకుండా ఉండాలి. నడక, సైకిలు త్రొక్కడం, కాళ్ళతో పడవను నడపడం, ఈత కొట్టడం, ఆక్వా ఆరోబిక్స్ వంటి వ్యాయామాలు తగినవి. ఒకరు ఆహార క్రమబద్ధతను పాటించే ముందు, ఒక ప్రత్యేకమైన వ్యాయామాన్ని ప్రారంభించే ముందు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి.
సహజంగానే, మంచి ఆరోగ్యం కావాలనుకొనే వారెవరైనా పొగ త్రాగడం తప్పకుండా మానివేయాలి. పొగ త్రాగడం వల్ల వచ్చే లేదా ఎక్కువయ్యే ఆరోగ్య సమస్యల పెద్ద పట్టికలో పివిడి కేవలం ఒక్కటి మాత్రమే. “ప్రాముఖ్యంగా, పొగత్రాగే వ్యక్తికి మధుమేహవ్యాధి, పివిడి ఉన్నప్పుడు అంగవిచ్ఛేదనం కలగడానికి పొగ త్రాగడం ఒక పెద్ద కారకం అవుతుంది,” అని డాక్టర్ బయోల్ అన్నారు. ఎంత పెద్ద కారకం కాగలదు? “పొగ త్రాగనివారిలో కంటే పొగత్రాగేవారిలో 10 రెట్లు ఎక్కువగా అవయవాల్ని కోల్పోవడం జరుగుతుంది,” అని వికలాంగుల పునరావాస మార్గదర్శక పుస్తకం చెప్తుంది.
వ్యాధిగ్రస్తమైన కాళ్ళు, చేతుల పట్ల శ్రద్ధ వహించటం
పివిడి కాళ్ళకు రక్త ప్రసరణను తగ్గించివేయగలదు, ఇది న్యూరోపతి అని పిలువబడే స్థితిని అంటే, నాడులు మొద్దుబారి పోయే, లేక చచ్చుబడి పోయేస్థితిని తీసుకురాగలదు. అప్పుడిక కాళ్లకూ చేతులకూ గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చివరికి ఒక వ్యక్తి కేవలం పడకలో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, బాధితునికి నొప్పి తెలియదు గనుక, ఎలక్ట్రిక్ దుప్పటి లేదా వేడిని పుట్టించే దిండు బాగా వేడెక్కి పోతే అతడికి తీవ్రమైన గాయాలు కావచ్చు! ఈ కారణంగా, వీటి ఉత్పత్తిదారులు వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండమని మధుమేహ వ్యాధిగ్రస్తులను హెచ్చరిస్తారు.
వ్యాధిగ్రస్తమైన కాళ్ళు, చేతులకు ఇతర వ్యాధులు కూడా చాలా సులభంగా సోకుతాయి. కేవలం చిన్న పగులు అల్సర్లు, చివరకు గాంగ్రీన్కు కూడా నడిపిస్తుంది. కాబట్టి పాద సంరక్షణ ఆవశ్యకం, అంటే ఇందులో సౌకర్యంగా ఉండే, సరిపోయే బూట్లను వేసుకోవడం, కాళ్ళను, పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం ఇమిడి ఉన్నాయి. చాలా హాస్పిటల్లలో, పాద సంరక్షణను గూర్చి వ్యాధిగ్రస్తులకు బోధించే పాద సంరక్షణా విభాగాలు ఉన్నాయి.
శస్త్రచికిత్స అవసరమయ్యేంతగా పివిడి ముదిరిపోతే, శస్త్రవైద్యులు సాధారణంగా ఆ అవయవాన్ని తీసివేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఒక ప్రత్యామ్నాయ విధానం ఏమిటంటే బెలూన్ ఆంగియోప్లాస్టీ. వేస్క్యులార్ శస్త్రవైద్యుడు, సంకోచించి ఉన్న ధమనిలోకి కేథిటర్ను ప్రవేశపెడతాడు, ఆ కేథిటర్ కొనకు ఒక చిన్న బెలూన్ ఉంటుంది. ఆతర్వాత బెలూన్ ఉబ్బేలా చేస్తారు, దానితో సంకోచించి ఉన్న ధమని వ్యాకోచిస్తుంది. మరొక విధానం బైపాస్ సర్జరీ—శరీరంలోని మరొక భాగంలో నుండి తీసిన రక్తనాళాలను, వ్యాధి వచ్చి పాడైపోయి ఉన్న రక్తనాళాల స్థానంలోకి మారుస్తారు.
54 సంవత్సరాల బార్బర తనకు నాలుగేండ్లు ఉన్నప్పటి నుండి మధుమేహ వ్యాధి రకం Iతో బాధ పడుతుంది. ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, ఆమె పాదాలు పివిడికి గురయ్యాయి. పాదాలను తీసివేయడం మంచిదని కొందరు డాక్టర్లు సలహా ఇచ్చారు. అయితే, ఆమె పేరుగాంచిన ఒక వేస్క్యులార్ శస్త్రవైద్యుడ్ని సంప్రదించింది, ఆమె పాదాలకు రక్తప్రసరణను మెరుగుపరచడానికి ఆయన ఆంగియోప్లాస్టీని ఉపయోగించాడు. ఆంగియోప్లాస్టీ కొంతకాలం పాటు పని చేసింది కానీ, చివరకు బార్బరకు బైపాస్ సర్జరీ అవసరమయ్యింది, అది విజయవంతమయ్యింది. ఇప్పుడు బార్బర తన పాదాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది.
గాయాన్ని నివారించండి
అవయవాల్ని కోల్పోవడానికి నడిపించే రెండవ కారకం గాయం. ఈ గాయం శరీర భాగాలను ఎన్నుకోవడంలో ఎటువంటి భేదభావం చూపకుండా, శరీరంలోని ఏ భాగాన్నైనా నాశనం చేయగలదు. అయితే, గాయమయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి, జీవితం పట్ల దైవిక దృక్పథాన్ని కల్గివుండటం ఎంతగానో సహాయపడగలదు. క్రైస్తవులు తాము పనిచేస్తున్నప్పుడైనా, వాహనాలను నడిపేటప్పుడైనా, వినోదంలో పాల్గొనేటప్పుడైనా తమ శరీరాలతో, అవి దేవుడిచ్చిన బహుమానాలన్నట్లుగా వ్యవహరించాలి. కాబట్టి, వారు భద్రతా ఏర్పాట్లనన్నింటిని గౌరవించాలి, అనాలోచిత ప్రమాదాలను నివారించాలి.—రోమీయులు 12:1; 2 కొరింథీయులు 7:1.
అయితే, మందుపాతరలు పాతిపెట్టబడి ఉన్న ప్రాంతాల్లో గాయాలయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి ఏమి చేయడం జరుగుతోంది? మందుపాతరల గురించి తెలియజేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అనేక దేశాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యొక్క ఒక నివేదిక ప్రకారం, ఈ కార్యక్రమాలు, “మందుపాతరలున్న ప్రాంతాల్లో నివసించేటప్పుడు, పనిచేసేటప్పుడు వాటి బారినపడే ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలనేదాన్ని గురించి . . . ప్రమాదమున్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు” బోధిస్తాయి.
విచారకరంగా, “మందుపాతరల ఉనికికి ప్రజలు బాగా అలవాటు పడిపోయి, నిర్లక్ష్యంగా తయారౌతారు,” అని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేస్తుంది. “కొన్నిసార్లు మతసంబంధ కారకాలు, [ప్రజలు] ఇటువంటి ప్రమాదాలను గురించి విధిలిఖితం అనే దృక్పథాన్ని అలవరుచుకొనేలా ప్రోత్సహిస్తాయి.” అయితే ఇటువంటి విధిలిఖితమనే దృక్పథాలకు దేవుని వాక్యం మద్దతును ఇవ్వడం లేదు. అందుకు భిన్నంగా, జాగ్రత్తగా ఉండాలని, భద్రంగా ఉండాలని బైబిలు ప్రోత్సహిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 22:8; ప్రసంగి 10:9.
కాబట్టి జాగ్రత్త వహించడం ద్వారా, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకొనేందుకు ఆచరణాత్మకమైన చర్యలను తీసుకోవడం ద్వారా, అవయవాల్ని కోల్పోయే ప్రమాదాన్ని మీరు ఎంతగానో తగ్గించుకోవచ్చు. అయితే, ఇప్పటికే తమ అవయవాల్ని కోల్పోయిన వారి సంగతి ఏమిటి? వారు ఇప్పుడు కూడా ఒక శ్రేష్ఠమైన జీవితాన్ని అనుభవించవచ్చా?
[అధస్సూచీలు]
a ఒక వ్యక్తి తన నడుము క్రింది భాగానికి బిగుతుగా ఉన్న దుస్తులను వేసుకున్నా లేదా సరిపడని బూట్లను వేసుకున్నా లేదా ఎక్కువసేపు కూర్చున్నా (ప్రాముఖ్యంగా బాసిక పట్టు వేసుకుని) లేదా నిలబడి ఉన్నా ఈ రక్తనాళాల సమస్యలు ప్రారంభం కావచ్చు లేదా అధికం కావచ్చు.
b మధుమేహవ్యాధి రకం I ఉన్నవారు ప్రతీరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. అయితే, మధుమేహవ్యాధి రకం II (ఇన్సులిన్‌పై ఆధారపడని మధుమేహవ్యాధి) ఉన్నవారు తరచూ తమ ఆహార క్రమబద్ధతను పాటించడం ద్వారా, వ్యాయామం చేయడం ద్వారా దానిని అదుపులో ఉంచుకోవచ్చు. అమెరికాలో, మధుమేహవ్యాధి ఉన్న 95 శాతం మంది మధుమేహవ్యాధి రకం II ఉన్నవారే.
[4వ పేజీలోని చిత్రం]
పొగత్రాగడం, ప్రత్యేకించి రక్తనాళాల వ్యాధి ఉన్నవారికి అవయవాల్ని కోల్పోయే ప్రమాదాన్ని అధికం చేస్తుంది
[5వ పేజీలోని చిత్రం]
తగిన వ్యాయామం, మంచి ఆహార క్రమబద్ధత ఆరోగ్యకరమైన రక్తనాళ వ్యవస్థను కలిగి ఉండటానికి తోడ్పడుతుంది