కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 6/8 పేజీలు 14-17
  • కామెనియస్‌—ఆధునిక విద్యకు ఆద్యుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కామెనియస్‌—ఆధునిక విద్యకు ఆద్యుడు
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పెంపకం, విద్య
  • ఆయన ఎందుకు బహిష్కరించబడ్డారంటే
  • “మనస్సును వధించే శాలలు”
  • ఒక క్రొత్త బోధనా పద్ధతి ఉనికిలోకి రావడం
  • జాన్‌ కామెనియస్‌ రచనలు
  • ఆయననేది ప్రేరేపించింది?
  • ఒక నిరంతర వారసత్వం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—2000
  • బోధకుడిగా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • విద్య—యెహోవాను స్తుతించేందుకు దానిని వినియోగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • సంకల్పముతో కూడిన విద్య
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 6/8 పేజీలు 14-17

కామెనియస్‌—ఆధునిక విద్యకు ఆద్యుడు

జెక్‌ రిపబ్లిక్‌లోని తేజరిల్లు! విలేఖరి

ఒక ఉపాధ్యాయుడిగా జాన్‌ కామెనియస్‌కు తాను పని చేసిన 17వ శతాబ్దంలోని విద్యా విధానంలో ఉన్న లోటుపాట్లను గురించి బాగా తెలుసు. నిజమే, ఏ విద్యా విధానం ఎన్నడూ పరిపూర్ణమైనదిగా ఉండలేదు అయితే, 17వ శతాబ్దంలో యూరప్‌లోని విద్యా విధానం మాత్రం స్పష్టంగా ఘోరంగా ఉండేది.

ఫిర్యాదులు చేస్తూ, నిందిస్తూ ఒక ప్రక్కన నిలబడడానికి బదులు కామెనియస్‌ దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అంతేగాక, ఆధునిక విద్యకు ఆద్యుడు అని పిలువబడిన ఈ వ్యక్తి నుండి మనమేమి నేర్చుకోగలము?

పెంపకం, విద్య

జాన్‌ ఆమోస్‌ కామెనియస్‌ (ఆయన మాతృభాష అయిన జెక్‌లో యాన్‌ ఆమోస్‌ కామన్‌స్కీ) ఈనాడు జెక్‌ రిపబ్లిక్‌గా పిలువబడుతున్న దానిలోని ప్రాంతమైన మొరావియాలో 1592, మార్చి 28న జన్మించాడు. ఈయన ఒక మధ్య తరగతి రైతు దంపతుల ఐదుగురి పిల్లల్లో చివరివాడు, ఏకైక కుమారుడు.

ఈయన తల్లిదండ్రులు యూనిటీ ఆఫ్‌ బ్రెత్‌రెన్‌లో (తర్వాత అది బోహిమియన్‌ బ్రెత్‌రెన్‌ లేదా మొరావియన్‌ చర్చిగా పిలువబడింది) సభ్యులు, వాల్డెన్సులు, అలాగే పీటర్‌ కెల్‌చిక్కీ వంటి ఇతర పునఃస్థాపకుల ప్రభావం క్రింద 15వ శతాబ్దపు మధ్యభాగంలో ఈ మత గుంపు ఆవిర్భవించింది. కామెనియస్‌ జర్మనీలో తన చదువును పూర్తి చేసుకుని తన స్వదేశానికి తిరిగి వచ్చారు. తర్వాత, 24 సంవత్సరాల వయస్సులో యూనిటీ ఆఫ్‌ బ్రెత్‌రెన్‌కు ప్రీస్టుగా నియమించబడ్డారు.

ఆయన ఎందుకు బహిష్కరించబడ్డారంటే

1618లో కామెనియస్‌ ప్రేగ్‌కు తూర్పున 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫల్‌నెక్‌లోని ఒక చిన్న చర్చిలో పనులు నిర్వహించారు. ఆ సమయంలో యూరప్‌లో ప్రొటస్టెంట్‌లకు వ్యతిరేకంగా క్యాథలిక్కుల కౌంటర్‌ రిఫార్మేషన్‌ కొనసాగుతోంది. క్యాథలిక్కులకు, ప్రొటస్టెంట్‌లకు మధ్య ఉద్రిక్తతలు పెరగడం కొనసాగి, చివరకు ముప్పై సంవత్సరాల యుద్ధం (1618-48) ప్రారంభమైంది.

ఒక దశాబ్దం పోరాటం తర్వాత, మొరావియాలో రోమన్‌ క్యాథలిక్‌ మతం చట్టబద్ధమైన మతంగా ప్రకటించబడింది. కామెనియస్‌కు, ఉన్నత శ్రేణికి చెందిన ఇతర వ్యక్తులకు ఒక అవకాశం ఇవ్వబడింది. అదేమిటంటే,—క్యాథలిక్కు మతాన్నైనా అంగీకరించాలి లేదా దేశాన్ని వదిలి పెట్టైనా వెళ్ళిపోవాలి. కామెనియస్‌కైతే, తన మతాన్ని మార్చుకొనే ప్రసక్తే లేదు. కనుక, ఆయన తన కుటుంబాన్ని తీసుకొని పోలెండ్‌లోని యూనిటీ ఆఫ్‌ బ్రెత్‌రెన్‌ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన లెష్నో అనే ఒక చిన్న పట్టణానికి తరలి వెళ్ళారు. 42 సంవత్సరాల పాటు కొనసాగిన బహిష్కరణకు అది ప్రారంభం. ఇక ఎన్నడూ ఆయన తన స్వదేశంలో మళ్ళీ నివసించలేదు.

“మనస్సును వధించే శాలలు”

కామెనియస్‌కు లెష్నోలోని జిమ్నాసియంలో—కళాశాల విద్యార్థులుగా తయారయ్యేందుకు శిక్షణను ఇచ్చే పాఠశాలలో—లాటిన్‌ను బోధించే ఉద్యోగం దొరికింది. అయితే, అతి కొద్ది కాలంలోనే ఆయన అక్కడి అసంబద్ధమైన బోధనా పద్ధతులను బట్టి అసంతృప్తి చెందాడు—ఇది కారణసహితమే.

కామెనియస్‌ రోజుల్లో విద్యా విధానం చాలా ఘోరమైన స్థితిలో ఉంది. ఉదాహరణకు, విద్య అనేది కేవలం మగవారికి మాత్రమేనని నమ్మేవారు. అయితే, పేదరికంలో పుట్టిన మగవారికి ఆ అవకాశం ఉండేది కాదు. ప్రాముఖ్యంగా లాటిన్‌ పదాలను, వాక్యాలను, వాక్యరచనను విద్యార్థుల బుర్రల్లోకి ఎక్కించడమే తరగతి గది బోధన. ఎందుకు లాటిన్‌లోనే? ఎందుకంటే మధ్య యుగపు సంవత్సరాల్లో అనేక పాఠశాలలు క్యాథలిక్‌ చర్చి ఆధీనంలో ఉండేవి. ఈ చర్చి అర్చనా కార్యక్రమం లాటిన్‌ భాషలో జరిగేది. పౌరోహిత్యానికి సభ్యులు వస్తూనే ఉండాలంటే లాటిన్‌ బోధన తప్పని సరి.

అదనంగా, నేర్చుకోవడానికి సంబంధించి ప్రత్యేకమైన లక్ష్యాలను ఏర్పరచడానికి ఏవిధమైన తలంపు ఇవ్వడం జరగలేదు. అంతేగాక బోధన అన్నది విద్యార్థులను చిన్న చిన్న విషయాల నుండి క్రమేణా సంక్లిష్టమైన విషయాలకు నడిపించేలా రూపొందించబడనూలేదు. క్రమశిక్షణ కఠినంగా ఉండేది, కొన్నిసార్లు క్రూరంగా ఉండేది, నైతిక వాతావరణమైతే ఇక చెప్పనక్కరలేదు.

17వ శతాబ్దపు పాఠశాలల గురించి, అవి “పూర్తిగా అస్తవ్యస్తమైనవి” “అనాసక్తి కరమైనవి” అని స్కాటిష్‌ విద్యావేత్తయైన సైమన్‌ లోరీ అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కామెనియస్‌ మరింత తీక్షణంగా విమర్శించాడు. ఆయన పాఠశాలలను “మనస్సును వధించే శాలలు” అని పిలిచాడు.

ఒక క్రొత్త బోధనా పద్ధతి ఉనికిలోకి రావడం

విద్యా విధానాన్ని పునరుద్ధరించ వలసిన అవసరాన్ని గురించి మాట్లాడిన వారిలో కామెనియస్‌ మొదటి వాడేమీ కాదు. ఇంగ్లాండులోని ఫ్రాన్సెస్‌ బేకన్‌ అనే వ్యక్తి లాటిన్‌కు ఇస్తున్న ప్రాముఖ్యతను తిరస్కరిస్తూ, మళ్ళీ ప్రకృతి సంబంధమైన అధ్యయనం వైపుకు మరలడాన్ని ఆయన సూచించాడు. జర్మనీలోని వోల్ఫ్‌గాంగ్‌ రాట్క, జాన్‌ వాలెంటైన్‌ ఆండ్రూ అలాగే ఇతరులు కూడా పరిస్థితిని మెరుగుపర్చడానికి ప్రయత్నించారు. అయితే, వీరందరూ తమ ఆలోచనలకు అధికార పూర్వకమైన మద్దతును పొందలేకపోయారు.

కామెనియస్‌ విద్యను భారమైనదిగా ఉండేలా కాదుగానీ, ఆసక్తికరమైనదిగా ఉండేలా చేసిన ఒక విధానాన్ని ప్రతిపాదించాడు. ఆయన తన విద్యా పథకాన్ని పంపాడియా అని పిలిచాడు, దీని అర్థం “సార్వత్రిక విద్య.” ప్రతి ఒక్కరు ఆనందించగలిగేలా ఒక క్రమబద్ధమైన బోధనా విధానాన్ని సుస్థాపించడమే ఆయన లక్ష్యం. ప్రాథమిక ఆలోచనలు సహజంగానే సంక్లిష్టమైన వాటికి నడిపించేలా పిల్లలకు విషయాలను ఒకదాని తర్వాత ఒకటిగా బోధించాలని ఆయన అన్నారు. పాఠశాల విద్య యొక్క మొదటి కొద్ది సంవత్సరాల్లో లాటిన్‌కు బదులు మాతృభాషను ఉపయోగించడాన్ని కూడా కామెనియస్‌ ప్రోత్సహించారు.

అయితే, విద్య అనేది కొంత వయసు వరకే నంటూ హద్దులు పెట్టకూడదు, కానీ ఒకని జీవిత కాలమంతా దాన్ని హత్తుకోవాలి. చదువు “పూర్తిగా ఆచరణాత్మకమైనదిగానూ, సంపూర్ణ సంతోషాన్నిచ్చేదిగాను ఉండాలి, అటువంటి చదువు, పాఠశాలను వినోదకరమైనదిగా చేయాలి, అంటే అది మన జీవితమంతటికీ ఆహ్లాదకరమైన ప్రారంభాన్నివ్వాలి” అని ఆయన వ్రాశారు. పాఠశాల అనేది కేవలం మనస్సుకు మాత్రమే విద్యను అభ్యసింపజేసేదిగా కాదుగానీ, నైతిక, ఆధ్యాత్మిక ఉపదేశాన్నిస్తూ పూర్తి వ్యక్తికి విద్యను అభ్యసింపజేసేదై ఉండాలి అని కూడా ఆయన విశ్వసించారు.

జాన్‌ కామెనియస్‌ రచనలు

విద్యారంగానికి సంబంధించి కామెనియస్‌ చేసిన రచనలలో మొదటిదైన ద స్కూల్‌ ఆఫ్‌ ఇన్‌ఫాన్సీ 1630లో ప్రచురించబడింది.a ఈ పుస్తకం ఇంటి దగ్గర పిల్లలకు బోధించేటప్పుడు తల్లులకు, ఆయాలకు సహాయకరంగా ఉండేలా రూపొందించబడింది. ఆ తర్వాత 1631లో, లాటిన్‌ బోధనను పూర్తిగా పునరుద్ధరించిన ద గేట్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌ అన్‌లాక్‌డ్‌ అనే పుస్తకం ప్రచురించబడింది. దీనిలో విషయమంతా జెక్‌, లాటిన్‌ భాషలలో రెండు సమాంతర భాగాలుగా ఏర్పాటు చేయబడింది. అలా, నేర్చుకోవడాన్ని మరింత సులభతరం చేస్తూ ఈ రెండు భాషలను ఒకదానితో ఒకటి సులభంగా పోల్చుకోవచ్చు. ఈ బోధనా సహాయకం యొక్క రివైజ్డ్‌ ప్రచురణ ఎంత ఎక్కవగా ప్రజాదరణ పొందిందంటే, చివరకు ఇది 16 భాషల్లోకి అనువదించబడింది.

కామెనియస్‌ రచనల్లో అత్యంత ప్రఖ్యాతి గాంచినది, బహుశా అత్యంత సులభమైనది ద విజిబుల్‌ వరల్డ్‌. ఇది పిల్లలు చదివేందుకు అనువుగా చిత్రాలతో రూపొందించబడింది. ఇది కూడా విద్యారంగ చరిత్రలోనే ఒక మైలురాయి. “ఈ పుస్తకం యూరప్‌లో నూట పదిహేను సంవత్సరాల పాటు సాటిలేని మేటి పుస్తకంగా నిలిచిందని, రమారమి రెండు వందల సంవత్సరాల పాటు బాలశిక్షగా ఉపయోగించబడిందని” 20వ శతాబ్దానికి చెందిన విద్యా అధ్యాపకుడైన ఎల్‌వుడ్‌ కబర్లీ అన్నారు. చిత్రాలతోకూడిన ఈనాటి అనేక అచ్చు పుస్తకాలు బోధనా సహాయకాలుగా చిత్రాలను ఉపయోగిస్తూ, కామెనియస్‌ రచనల సాధారణ నమూనానే ఇప్పటికీ అనుసరిస్తున్నాయి.

కామెనియస్‌ త్వరలోనే ఒక మేధావిగా అభినందించబడ్డాడు. యూరప్‌ అంతటిలోని విద్వాంసులు ఆయనను నాయకుడిగా పరిగణించి, ఆయన సలహా తీసుకునేవారు. మగ్నాలియా క్రిష్టి అమెరికానా అనే పుస్తకం ప్రకారం, కామెనియస్‌ ప్రఖ్యాతి ఎంతగా పెరిగిందంటే, ఆయన 1654లో మస్సాచుసెట్స్‌, కేంబ్రిడ్జ్‌లోని హార్వార్డ్‌ విశ్వవిద్యాలయానికి ప్రధానాధికారిగా సేవ చేసేందుకు ఆహ్వానించబడ్డారు. కామెనియస్‌ దానిని నిరాకరించారు ఎందుకంటే, ఆయన జనాదరణను, కీర్తిని, ఉన్నతాధికారాన్ని పొందాలని ప్రయత్నించలేదు.

ఆయననేది ప్రేరేపించింది?

ఒకరు కామెనియస్‌ జీవిత విధానాన్ని పరిశీలించిన తర్వాత, ఆయనను ఏది ప్రేరేపించిందా అని అనుకోకుండా ఉండలేరు. కామెనియస్‌ విద్యను మానవజాతిని ఐక్యపర్చే శక్తిగా దృష్టించారు. ప్రపంచ శాంతిని కాపాడేందుకు సార్వత్రిక విద్య సహాయం చేయగలదని ఆయన నొక్కిచెప్పారు.

కామెనియస్‌ జ్ఞానాన్ని దైవత్వానికి జత చేశారు. జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మానవ జాతి చివరికి దేవుని వైపుకు నడిపించబడగలదని ఆయన నమ్మారు. ఆయనను ప్రేరేపించిన ప్రాథమిక కారకం బహుశా అదే కావచ్చు.

విద్యపై కామెనియస్‌కు ఉన్న అంతర్‌దృష్టి ఈనాడు కూడా ఎంతో విలువైనది. ఆయన క్రమబద్ధమైన బోధనా పద్ధతులు—దృశ్య సహాయకాలను ఉపయోగించడంతో సహా—ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించబడుతున్నాయి. ఇందులో వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించే సాహిత్యాలు కూడా చేరి ఉన్నాయి. వ్యక్తిగత బైబిలు పఠన సమయంలో లేక కుటుంబ బైబిలు పఠనాన్ని నిర్వహించేటప్పుడు, ఆయన ఇచ్చిన పద్ధతులను ఉపయోగించుకోవడం ద్వారా వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరం ప్రయోజనం పొందగలం. ఎలా?

“తమ వయస్సుకు, గ్రహణశక్తికి, ప్రస్తుత పరిస్థితికి పొందిక లేని విషయాలతో విద్యార్థులపై మోయలేని బరువును పెట్టకూడదు” అని కామెనియస్‌ అన్నారు. కాబట్టి, బైబిలును గురించి కానీ, ఇతర విషయాలను గురించి కానీ మీ పిల్లలకు బోధించేటప్పుడు, ఆ పాఠాలు వారికి అర్థమయ్యేవిధంగా చెప్పడానికి ప్రయత్నించండి. ప్రశ్నా జవాబుల పద్ధతిని ఉపయోగించడానికి బదులు వారికి బైబిలు పాత్రలను గురించి కథలుగా ఎందుకు చెప్పకూడదు? బైబిలు సంఘటనలను చిత్రాలుగా గీయమని, లేదా బైబిలు నాటకాలను నటించి చూపించమని వారిని ప్రోత్సహించడం ద్వారా వారు కూడా కుటుంబ బైబిలు పఠనంలో భాగం వహించేలా చేయండి. మీ ఊహాశక్తిని ఉపయోగించండి! అప్పుడు ఫలితాలు, మీ కృషికి తగిన విధంగా ఉంటాయి.—సామెతలు 22:6.

ప్రాముఖ్యంగా యౌవనస్థులకు క్రమంగా బోధించేందుకు రూపొందించబడిన నా బైబిలు కథల పుస్తకము, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక జవాబులుb (ఆంగ్లం) వంటి సచిత్ర సాహిత్యాల నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి. ఏ వయస్సులోని బైబిలు విద్యార్థులకు బోధించేటప్పుడైనా అది వారికి “పూర్తిగా ఆచరణాత్మకమైనదిగాను, సంపూర్ణ సంతోషాన్నిచ్చేదిగానూ” ఉండేలా చేసేందుకు చొరవ తీసుకోండి.

ఒక నిరంతర వారసత్వం

1656లో లెష్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో కామెనియస్‌ దాదాపు తనకున్నదంతా కోల్పోయాడు. అయితే, ఆయన మరొక విధమైన సంపదలను ఉంచినందుకు కృతజ్ఞతలు. ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “కామెనియస్‌ . . . బోధనలో మొత్తం ప్రాధాన్యతను పదాలకు గాక విషయాలకు ఇచ్చి, శాస్త్రీయమైన జ్ఞానాన్ని ఉపయోగకరమైన ప్రపంచ సమాచారాన్ని గురించిన బోధను తన రచనలకు ముఖ్యాంశంగా చేసుకున్నాడు.”

నిజానికి, బోధనను ఒక శాస్త్రంగా మార్చిన ఘనతను కామెనియస్‌కు ఆపాదించవచ్చు. ఆయన బోధనా పద్ధతులు తరగతి గదిని పూర్తిగా మార్చి వేశాయి. అమెరికన్‌ అధ్యాపకుడైన నికోలస్‌ బట్లర్‌ ఇలా చెప్పాడు: “విద్యారంగ చరిత్రలో కామెనియస్‌కు ఉన్న స్థానం అత్యంత ప్రాముఖ్యమైనది. ఆయన పూర్తి ఆధునిక ఉద్యమాన్ని ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగంలో ప్రవేశపెట్టి దాన్ని కొనసాగింప చేశారు.” అత్యంతాసక్తి గల బైబిలు విద్యార్థులైన యెహోవాసాక్షులకు కూడా ఆధునిక విద్యకు ఆద్యుడైన ఆయనకు కృతజ్ఞతలు తెల్పడానికి కారణముంది.

[అధస్సూచీలు]

a కామెనియస్‌ ఓపెరా డిడాక్టికా ఓమ్నియాలో భాగంగా ద గ్రేట్‌ డిడాక్టిక్‌ను 1657లో లాటిన్‌లో ప్రచురించాడు.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[16వ పేజీలోని బాక్సు/చిత్రం]

జాన్‌ కామెనియస్‌ యొక్క కొన్ని బోధనా సూత్రాలు

బోధనా సమాచారపు మోతాదు గురించి: “ఉపాధ్యాయుడు తాను ఎంత బోధించగలడో అంత కాదుగానీ, నేర్చుకొనే వ్యక్తి ఎంత గ్రహించగలడో అంత బోధించాలి.”

బోధనా పద్ధతుల గురించి: “నేర్చుకొనే వ్యక్తి త్వరగా, అంగీకారయుక్తంగా, పూర్తిగా నేర్చుకొనేలా సహాయపడడమే చక్కగా బోధించడం.”

“తన విద్యార్థుల అజ్ఞానాన్ని సహనంతో ఎలా భరించాలి, అలాగే ఆ అజ్ఞానాన్ని ప్రభావవంతంగా ఎలా పారద్రోలాలి అనేవి తెలిసినవాడే సమర్థుడైన ఉపాధ్యాయుడు.”

“బోధించడమంటే, విషయాలు ఒకదాని నుండి ఒకటి ఎలా తేడాను కల్గి ఉన్నాయో అంటే, వాటి వివిధ ఉద్దేశాలలోనూ, రూపాల్లోనూ, పుట్టుకలోనూ కల్గివున్న తేడాను చూపడమే. కాబట్టి, ఆ తేడాలను బాగా చూపగలవాడు బాగా బోధిస్తాడు.”

తార్కిక సంబంధం గురించి: “ఏదైతే అర్థవంతంగా ఉండదో, దాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు, అంచనా వేయడం సాధ్యం కాదు కాబట్టి దానిని గుర్తు పెట్టుకోవడం అసాధ్యం.”

“వివరాలు లోపించినప్పుడు, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం లేక ఒక ముగింపుకు రావడం దాదాపు అసాధ్యం, అలాగే దానిని గుర్తు పెట్టుకోవడం కూడా అంతే అసాధ్యం.”

గ్రహణశక్తి గురించి: “ఏదైనా ఒక విషయంలోని భాగాలలో ఒకటి ఏదైనా ఒకదానితో ఎలా, ఎందుకు సంబంధం కల్గి ఉంది, అలాగే అది దానివంటి ఇతర వాటితో ఎలా, ఎంతమేరకు విభేదిస్తుందన్న విషయాలను గ్రహించడమే దేనినైనా అర్థం చేసుకోవడం.”

“మనం చదువుతున్న దానిలో ఏముందో తెలుసుకోవడానికి మొదటిసారి చదవాలి, అర్థం చేసుకోవడానికి రెండవసారి చదవాలి, మన మనస్సులో ముద్రించుకోవడానికి మూడవసారి చదవాలి, చదివింది పూర్తిగా అర్థం అయ్యిందో లేదో నిర్ధారించుకోవడానికి, దాన్ని మనస్సులో మననం చేసుకోవడం ద్వారా నాల్గవసారి చదవాలి.”

[చిత్రం]

1883 ప్రచురణలోని “ద విజిబుల్‌ వరల్డ్‌,” నుండి ఒక పేజీ

[17వ పేజీలోని చిత్రం]

కామెనియస్‌ బోధనా సూత్రాలను అన్వయించుకున్న 1775లోని ఒక జర్మన్‌ బాలశిక్ష

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి