కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 6/8 పేజీలు 10-13
  • ‘పిల్లలు పసివాళ్ళు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘పిల్లలు పసివాళ్ళు’
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉన్నత ప్రమాణాలు
  • ఆధునిక వాస్తవాలు
  • నిజమైన సమాధానం
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • వర్ధిల్లుతుండేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    తేజరిల్లు!—1997
  • పిల్లలు “యెహోవా ఇచ్చే ఆస్తి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 6/8 పేజీలు 10-13

‘పిల్లలు పసివాళ్ళు’

‘పిల్లలు పసివాళ్ళు; వాళ్లు నడువగల వేగాన్ని బట్టి నెమ్మదిగా నడిపించుకొని వస్తాను.’—యాకోబు, అనేకమంది పిల్లల తండ్రి, సా.శ.పూ. 18వ శతాబ్దం

పిల్లలపట్ల దుర్వ్యవహారమన్నది క్రొత్త విషయమేమీ కాదు. అజ్‌టెక్‌లు, కనానీయులు, ఇన్‌కాలు, ఫినోసియుల వంటి ప్రాచీన నాగరికతలు పిల్లలను బలి ఇచ్చే ఆచారానికి ప్రఖ్యాతి గాంచినవి. సా.శ.పూ. ఐదవ, మూడవ శతాబ్దాలకు మధ్యకాలంలో 20,000 మంది పిల్లలు బయలు దేవునికి, టానిట్‌ దేవతకు బలిగా అర్పించబడ్డారని ఫినోసియన్‌ల నగరమైన కార్టేజ్‌లో (ఇప్పుడు ఉత్తర ఆఫ్రికాలోని టూనిస్‌ నగర పరిసర ప్రాంతం) జరిగిన త్రవ్వకాల్లో వెల్లడయ్యింది! కార్టేజ్‌ బాగా వర్ధిల్లిన కాలంలో దాని జనసంఖ్య కేవలం 2,50,000 అని తెలుసుకున్నప్పుడు ఈ విషయం ఒకరికి మరింత దిగ్భ్రాంతిని కలిగించవచ్చు.

అయితే, వీటికి భిన్నంగా ఉన్న ఒక ప్రాచీన సమాజం ఉంది. పిల్లల విషయంలో క్రూరంగా వ్యవహరించే పొరుగువారి మధ్య ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు జనాంగం తమ పిల్లలతో వ్యవహరించడంలో ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఈ జనాంగానికి తండ్రీ, మూలపురుషుడూ అయిన యాకోబు ఇందుకు మాదిరిని ఉంచాడు. బైబిలు పుస్తకమైన ఆదికాండము ప్రకారం, యాకోబు తన స్వదేశానికి తిరిగి వెళ్తున్నప్పుడు, తన పిల్లలకు కష్టం కలుగకుండా ఉండే నిమిత్తం తన పరివారం నడిచే వేగాన్ని పిల్లల నడక వేగానికి అనుగుణ్యంగా సరిచేశాడు. ‘పిల్లలు పసివాళ్లు’ అని ఆయన అన్నాడు. ఆ సమయంలో ఆయన పిల్లలు 5 నుండి 14 ఏండ్ల వయస్సు గలవారు. (ఆదికాండము 33:13, 14) ఆయన సంతానమైన ఇశ్రాయేలీయులు కూడా పిల్లలతో అలాగే వ్యవహరించారు.

ఖచ్చితంగా, బైబిలు కాలాల్లో పిల్లలు ఎంతో చేయవలసి ఉండేది. మగ పిల్లలు పెరుగుతుండగా వారి తండ్రులు వారికి వ్యవసాయంలోను లేదా వడ్రంగం వంటి పనుల్లోను ఆచరణాత్మక శిక్షణ ఇచ్చేవారు. (ఆదికాండము 37:2; 1 సమూయేలు 16:11) ఆడ పిల్లలు ఇంటి వద్ద ఉండి, తమ భావి జీవితంలో తమకు ప్రయోజనకరమైనవి కాగల ఇంటి పనులను తమ తల్లుల నుండి నేర్చుకునేవారు. యాకోబు భార్యయైన రాహేలు, తాను యౌవనస్థురాలిగా ఉన్నప్పుడు గొఱ్ఱెలను కాచేది. (ఆదికాండము 29:6-9) యువతులు కోత సమయంలో పంట పొలాల్లోనూ, ద్రాక్ష తోటల్లోనూ పనిచేసేవారు. (రూతు 2:5-9; పరమగీతము 1:6)a ఇటువంటి పని సాధారణంగా తల్లిదండ్రుల ప్రేమపూర్వక పర్యవేక్షణ క్రింద విద్యతో పాటుగా నేర్పబడేది.

అదే సమయంలో, ఇశ్రాయేలులోని పిల్లలకు విశ్రాంతి, వినోదాల్లోని ఆనందం గురించి కూడా తెలుసు. ‘పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోను ఆడపిల్లలతోను నిండియుండటం’ గురించి ప్రవక్తయైన జెకర్యా మాట్లాడాడు. (జెకర్యా 8:5) సంత వీధులలో కూర్చుని పిల్లనగ్రోవి ఊదుతూ, నాట్యమాడుతున్న పిల్లలను గురించి యేసుక్రీస్తు ప్రస్తావించాడు. (మత్తయి 11:16, 17) పిల్లలతో అంత చక్కగా వ్యవహరించడం వెనుక ఏముంది?

ఉన్నత ప్రమాణాలు

ఇశ్రాయేలీయులు దేవుని నియమాలను అనుసరిస్తున్నంత కాలం తమ పిల్లలపట్ల దుర్వ్యవహారం చేయలేదు లేదా వారిపై అత్యాచారం చేయలేదు. (ద్వితీయోపదేశకాండము 18:10ను యిర్మీయా 7:31తో పోల్చండి.) వారు తమ కుమారులను, కుమార్తెలను “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము”గాను, “బహుమాన[ము]”గాను దృష్టించారు. (కీర్తన 127:3-5) తల్లిదండ్రులు తమ పిల్లలను ‘తమ భోజనపు బల్లచుట్టు ఉన్న ఒలీవ మొక్కలుగా’ పరిగణించేవారు, అప్పటి వ్యవసాయక సమాజంలో ఒలీవ చెట్లు ఎంతో విలువైనవి! (కీర్తన 128:3-6) ప్రాచీన హెబ్రీ భాషలో కుమారుడు కుమార్తె అనే పదాల కోసం ఒక్కో పదం ఉండటమే గాక, పిల్లల జీవితంలోని వివిధ దశలను సూచించడానికి తొమ్మిది పదాలు ఉండేవని చరిత్రకారుడైన ఆల్‌ఫ్రెడ్‌ ఎడర్‌షీమ్‌ పేర్కొంటున్నారు. “ఖచ్చితంగా, పిల్లల బాల్యంలోని వివిధ దశలకు పేర్లు ఇవ్వగలిగేలా పిల్లల జీవితాన్ని అంత నిశితంగా పరిశీలించినవారికి, తప్పకుండా తమ పిల్లలతో సన్నిహిత సంబంధం ఉండి ఉండాలి” అని ఆయన ముగిస్తున్నారు.

క్రీస్తు శకంలో, తమ పిల్లల పట్ల గౌరవంతోనూ, మన్ననతోనూ వ్యవహరించాలని తల్లిదండ్రులకు ప్రబోధించబడింది. ఇతరుల పిల్లలతో వ్యవహరించడంలో యేసు ఒక మంచి మాదిరి ఉంచాడు. తన భూపరిచర్య ముగింపులోని ఒక సందర్భంలో, ప్రజలు తమ పిల్లలను ఆయన దగ్గరకు తీసుకురావడం ప్రారంభించారు. యేసు పని ఒత్తిడి వల్ల అలసటతో ఉన్నాడని భావించి ఆయన శిష్యులు ఆ ప్రజలను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ యేసు తన శిష్యులను ఇలా మందలించాడు: “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు.” యేసు ‘పిల్లలను ఎత్తి కౌగిలించుకొన్నాడు’ కూడా. పిల్లలు అమూల్యమైన వారని, వారు దయతో వ్యవహరించబడటానికి యోగ్యులని ఆయన భావించాడనడంలో సందేహమేమీ లేదు.—మార్కు 10:14, 16; లూకా 18:15-17.

తర్వాత, అపొస్తలుడైన పౌలు తండ్రులకు ఇలా చెప్పాడు: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21) ఈ ఆజ్ఞకు అనుగుణ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు దుర్భరమైన పరిస్థితుల్లో పని చేయడానికి ఆ కాలంలోనూ అనుమతించలేదు; ఈనాడూ అనుమతించరు. పిల్లలు భౌతికంగానూ, భావోద్వేగపరంగానూ, ఆధ్యాత్మికంగానూ అభివృద్ధి చెందాలంటే, వారికి ప్రేమపూర్వక శ్రద్ధ, సురక్షితమైన వాతావరణం అవసరమని వారు గుర్తిస్తారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల తమకున్న నిజమైన ప్రేమను తమ పిల్లలు గుర్తించగలిగేలా దాన్ని వ్యక్తపర్చాలి. ఇందులో, తమ పిల్లలు నికృష్టమైన పరిస్థితుల్లో పని చేయకుండా కాపాడటం కూడా ఇమిడి ఉంది.

ఆధునిక వాస్తవాలు

మనం “అపాయకరమైన కాలముల”లో జీవిస్తున్నామన్నది వాస్తవమే. (2 తిమోతి 3:1-5) కఠినమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా, అనేక దేశాల్లో క్రైస్తవ కుటుంబాలు కూడా తమ పిల్లలను పనిలో చేర్చవలసిన అవసరం ఉందని తలంచవచ్చు. ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా, పిల్లలను ఆరోగ్యకరమైన, విద్యాపరమైన పనిలో చేర్చడం తప్పేమీ కాదు. అటువంటి పని పిల్లల విద్య, వినోదం, విశ్రాంతి వంటి వాటికి అడ్డురాకుండా వారు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా లేదా సామాజికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది లేదా సహాయపడుతుంది.

నిస్సందేహంగా, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు క్రూర, అమానుష, బాధించే యజమానుల క్రింద బానిసలుగా పనిచేయాలని కోరుకోరు కానీ, తమ శ్రద్ధాపూరిత పర్యవేక్షణ క్రింద పని చేయాలని కోరుకుంటారు. అటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే ఏ పనియైనా వారికి శారీరకంగానూ, లైంగికంగానూ లేదా భావోద్వేగపరంగానూ హాని కలిగించనిదై ఉండేలా చూస్తారు. తమ పిల్లలు తమకు దగ్గరగా ఉండాలని కూడా వారు కోరుకుంటారు. ఆ విధంగా, “నీవు నీ కుమారులకు వాటిని [దేవుని మాటలను] అభ్యసింపజేసి, నీ యంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను” అని ఆధ్యాత్మిక అధ్యాపకులుగా తమకివ్వబడిన బైబిలు ఆధారిత పాత్రను వారు నిర్వర్తించగల్గుతారు.—ద్వితీయోపదేశకాండము 6:6, 7.

అంతకంటే ఎక్కువగా, ఒక క్రైస్తవుడు తన తోటివారి సుఖదుఃఖములయందు పాలుపంచుకుని, సహోదరప్రేమ గలవాడైయుండి, కరుణాచిత్తుడై ఉండాలని చెప్పబడుతుంది. (1 పేతురు 3:8) అలాగే, అతడు “అందరియెడల . . . మేలు” చేయాలని కూడా ప్రోత్సహించబడుతున్నాడు. (గలతీయులు 6:10) ఇతరుల పట్లే ఇటువంటి దైవిక లక్షణాలను చూపించవలసి ఉంటే, ఇక తన సొంత పిల్లల పట్ల ఇంకెంత ఎక్కువగా వాటిని చూపవలసి ఉందో కదా! “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అన్న బంగారు నియమానికి అనుగుణ్యంగా, క్రైస్తవులు ఎన్నడూ ఇతరుల పిల్లలపట్ల దుర్వ్యవహారం చేయరు, వారు తోటి క్రైస్తవుల పిల్లలైనా లేక బయటివారి పిల్లలైనా సరే. (మత్తయి 7:12) అదనంగా, క్రైస్తవులు చట్టానికి కట్టుబడి ఉండే ప్రజలు కాబట్టి, తమ కోసం పని చేసేవారి వయః పరిమితి విషయంలో ప్రభుత్వం నియమించిన చట్టాలను తాము ఉల్లంఘించకుండా ఉండేలా జాగ్రత్త వహిస్తారు.—రోమీయులు 13:1.

నిజమైన సమాధానం

భవిష్యత్తు విషయం ఏమిటి? పిల్లలకూ, పెద్దలకూ శ్రేష్ఠమైన పరిస్థితులు ముందున్నాయి. బాల-శ్రామికత్వానికి శాశ్వత పరిష్కారం, బైబిలు “పరలోకరాజ్యము” అని పిలుస్తున్న రాబోయే ప్రపంచ ప్రభుత్వమేనని నిజ క్రైస్తవులు విశ్వసిస్తారు. (మత్తయి 3:2) దైవ భయంగల ప్రజలు శతాబ్దాలుగా, “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని వేడుకున్నప్పుడు దాని గురించే ప్రార్థించారు.—మత్తయి 6:9, 10.

మిగతా వాటితో పాటుగా, ఈ రాజ్యం బాల-శ్రామికత్వానికి నడిపించే పరిస్థితులను కూడా నిర్మూలిస్తుంది. ఇది పేదరికాన్ని పూర్తిగా తీసివేస్తుంది. “అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.” (కీర్తన 67:6) దేవుని రాజ్యం, ఆయన లక్షణాలపై ఆధారపడి ఉన్న సరియైన విద్యను అందరూ పొందగలిగేలా చూస్తుంది. “[దేవుని] తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.”—యెషయా 26:9.

దేవుని ప్రభుత్వం అసమానతలను పెంపొందించే ఆర్థిక విధానాలను నిర్మూలిస్తుంది. ఆ రాజ్యంలో జాతి, సామాజిక, వయో వివక్షతలకు, స్త్రీలపట్ల లేక పురుషులపట్ల వివక్షతకు స్థానం ఉండదు ఎందుకంటే, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలె[ను]” అన్న ఆజ్ఞ ఇమిడి ఉన్న ప్రేమ చట్టం ఆ ప్రభుత్వపు ప్రధాన చట్టమై ఉంటుంది. (మత్తయి 22:39) అటువంటి నీతియుక్త ప్రపంచ ప్రభుత్వం క్రింద, బాల-శ్రామికత్వ సమస్య పూర్తిగా నిర్మూలించబడుతుంది!

[అధస్సూచీలు]

a ఇది ఇండ్లలోను లేదా పొలాల్లోను పనిచేసే స్త్రీలను రెండవ తరగతి కుటుంబ సభ్యులుగా తక్కువ స్థానంలో ఉంచదు. సామెతలులోని “గుణవతియైన భార్య” వర్ణన, వివాహిత స్త్రీ కేవలం ఇంటిపనులనే కాదుగానీ వ్యాపార వ్యవహారాలను చూస్తుందని, పొలం పనులు చేస్తుందని, ఒక చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తుందని కూడా తెలియజేస్తుంది.—సామెతలు 31:10, 16, 18, 24.

[12వ పేజీలోని బాక్సు]

ఒక స్త్రీ తన దగ్గరున్న అమ్మాయిలను పంపివేసింది

కరేబియన్‌ ద్వీపాల్లోని ఒక దానియందు సిసీలియాb అనే ఒక స్త్రీ 15 సంవత్సరాల పాటు వ్యభిచార గృహాలను నడిపింది. ఆమె 12 నుండి 15 మంది అమ్మాయిలను కొనేది, వారిలో ఎక్కువమంది 18 ఏండ్ల లోపు వయస్సు గల అమ్మాయిలే ఉండేవారు. ఈ అమ్మాయిలు తమ కుటుంబాలు చేసిన అప్పులను తీర్చడం కోసం తమకు ఇష్టం లేకపోయినా ఆ వృత్తిలోకి దింపబడ్డారు. సిసీలియా ఆ అమ్మాయిల అప్పులను తీర్చి, వారిని తన కోసం పని చేయడానికి ఉపయోగించుకొనేది. వారు సంపాదించిన దానిలో కొంత వారి ఆహారానికీ, ఇతర అవసరాలకూ ఖర్చు చేసి, మిగిలిన దాన్ని తాను వారిని కొన్న వెల కోసం ప్రక్కన ఉంచేది. ఈ పద్ధతిన వారు తిరిగి స్వతంత్రులు కావడానికి సంవత్సరాలు పట్టేవి. ఈ అమ్మాయిలు తమ వెంట కాపలాదారుడు లేకుండా బయటకు వెళ్ళడానికి అనుమతించబడేవారు కాదు.

సిసీలియాకు ఒక ప్రత్యేక సందర్భం మాత్రం బాగా గుర్తుంది. ఒక వేశ్య తల్లి వచ్చి ఆహారపు పొట్లాలను, అంటే తన కూతురు “పని” చేసి సంపాదించిన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రతీ వారం వచ్చేది. ఆ అమ్మాయి ఒక బాబును పెంచేది. ఆమెకు తన అప్పులను తీర్చడం సాధ్యంకావడం లేదు, దానితో ఆమె స్వతంత్రురాలు కాగల ఆశ లేకుండా పోయింది. కనుక, తన కొడుకును సంరక్షించే బాధ్యతను తీసుకోమని కోరుతూ తన వ్యభిచార గృహ నిర్వాహకురాలికి ఒక ఉత్తరం వ్రాసి ఒకరోజు ఆమె ఆత్మహత్య చేసుకుంది. సిసీలియా తన నలుగురు పిల్లలతో పాటుగా ఆ బాబును పెంచింది.

సిసీలియా కూతుర్లలో ఒకరు యెహోవాసాక్షుల మిషనరీలతో బైబిలును పఠించడం ప్రారంభించారు. పఠనంలో పాల్గొనాలని సిసీలియాను ప్రోత్సహించేవారు, కానీ ప్రారంభంలో ఆమె తిరస్కరించింది ఎందుకంటే ఆమె చదవడం, వ్రాయడం నేర్చుకోలేదు. అయినప్పటికీ, క్రమేణా బైబిలు చర్చలను యాదృచ్ఛికంగా వినడం ద్వారా, ఆమె దేవుని ప్రేమను, సహనాన్ని అర్థం చేసుకుంది, ఆయన క్షమాగుణాన్ని గుణగ్రహించింది. (యెషయా 43:25) తానుగా బైబిలును పఠించాలన్న కోరికతో, ఆమె త్వరలోనే చదవడాన్ని, వ్రాయడాన్ని నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమె బైబిలు జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ ఉండగా, దేవుని ఉన్నతమైన నైతిక ప్రమాణాలను అన్వయించుకోవలసిన అవసరాన్ని గ్రహించింది.

ఒకరోజు, ఆమె అమ్మాయిలు వెళ్లిపోవచ్చని చెప్పింది, దానికి ఆ అమ్మాయిలు ఆశ్చర్యచకితులయ్యారు! తాము చేస్తున్నది యెహోవాకు అప్రీతికరమైనదని ఆమె వారికి వివరించింది. వారిలో ఎవ్వరూ తమ బాకీని తీర్చలేదు. అయితే, అందులో ఇద్దరు ఆమెతో పాటు కలిసి జీవించనారంభించారు. చివరకు, వెళ్లిపోయిన వారిలో ఒకరు బాప్తిస్మం తీసుకున్న సాక్షి అయ్యారు. దేవునికి అప్రీతికరమైన అభ్యాసాల నుండి విడుదల పొందడానికి ఇతర ప్రజలకు సహాయం చేస్తూ, సిసీలియా ఇప్పటికి 11 సంవత్సరాలుగా పూర్తికాల బైబిలు బోధకురాలిగా ఉంది.

[అధస్సూచీలు]

b ఆమె అసలు పేరు కాదు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి