బైబిలు ఉద్దేశము
క్రైస్తవులు మాస్‌ను ఎలా దృష్టించాలి?
ద న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, “ఒక క్యాథలిక్ మాస్‌కు హాజరు కాకపోతే అది ఒక పాపంగా చర్చి పరిగణిస్తుందని” ఇటీవల నొక్కిచెప్పిన పోప్ జాన్ పాల్‌తో నిష్ట గల క్యాథలిక్‌లు ఏకీభవిస్తారు. మాస్ అంటే ఏమిటి? దీని విషయమై బైబిలు, చర్చి ఏకీభవిస్తున్నాయా?
థింగ్స్ క్యాథలిక్స్ ఆర్ ఆస్క్‌డ్ ఎబౌట్ అనే పుస్తకంలో క్యాథలిక్ ప్రీస్టు అయిన మార్టిన్ జె. స్కాట్ మాస్‌ను ఇలా నిర్వచించారు: “మాస్ అంటే క్రీస్తు రక్తరహిత శరీరాన్నీ, రక్తాన్నీ బలివ్వడం. కల్వరి అనే ప్రాంతంలో క్రీస్తు రక్తపు బలి అర్పించబడింది. సిలువపై అర్పించబడిన బలి, మాస్ ప్రాథమికంగా ఒకటే. ఇది అతిశయోక్తీ కాదు, ఉపమానమూ కాదు, అలంకారికమూ కాదు.” ఆయనింకా ఇలా అన్నారు: “మాస్ అంటే దేవుని కుమారుడ్ని మన దైవపీఠాల మీదికి తీసుకు వచ్చి, త్రిత్వ దేవునికి ఆయనను బలిగా అర్పించడమని చెప్పబడుతుంది.”
మాస్ లేఖనాధారితమా?
మాస్ లేఖనాధార బోధపై అధారపడినదేనని యథార్థవంతులైన క్యాథలిక్‌లు నమ్ముతారు. అందుకు రుజువుగా ప్రభు రాత్రి భోజనమని సాధారణంగా పిలువబడే సమయంలోని యేసు మాటలను వారు చూపిస్తారు. యేసు తన అపొస్తలులకు రొట్టెను, ద్రాక్షారసాన్ని పంచి ఇచ్చినప్పుడు రొట్టెను సూచిస్తూ “ఇది నా శరీరము” అని, ద్రాక్షారసాన్ని సూచిస్తూ “ఇది . . . నా రక్తము” అని చెప్పాడు. (మత్తయి 26:26-28)a యేసు ఈ మాటలను పలికినప్పుడు నిజానికి రొట్టెను తన శరీరంగాను, ద్రాక్షారసాన్ని తన రక్తంగాను మార్చాడని క్యాథలిక్‌లు నమ్ముతారు. అయితే, యథార్థవంతుడైన ఒక క్యాథలిక్ ఆ లేఖనాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఉదాహరణకు, యేసు “నేను నిజమైన ద్రాక్షావల్లిని” అని చెప్పినప్పుడు తాను ద్రాక్షావల్లిగా మారిపోతానన్నది ఆయన ఉద్దేశం కాదు. (యోహాను 15:1) అలాగే, “ఆ శిల క్రీస్తే” అని చెప్పబడినప్పుడు దాని భావం క్రీస్తు శిలగా మారాడని కాదు. (1 కొరింతీయులు 10:4) కాబట్టి, మత్తయి 26:26-28 నందలి వచనాలు ప్రభు రాత్రి భోజన సమయంలో రొట్టె, ద్రాక్షారసం యేసు అక్షరార్థ శరీరంగాను, రక్తంగాను మారాయని రుజువుపర్చడం లేదు.
యేసు ఒకసారి ఇలా చెప్పాడని కొందరు గుర్తుచేసుకోవచ్చు: “పరలోకమునుండి దిగి వచ్చిన జీవముగల ఆహారమును నేనే . . . నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయవాడు నిత్యజీవము పొందును.” (యోహాను 6:51, 54) యేసు చెప్తున్న ఆ మాటలను విన్న కొందరు వాటిని అక్షరార్థంగా తీసుకుని విస్మయం చెందారు. (యోహాను 6:60) కానీ మనమిలా అడగవచ్చు, ఆ సందర్భంలో యేసు తన శరీరాన్ని రొట్టెగా మార్చాడా? ఎంత మాత్రం మార్చలేదు! ఆయన అలంకారికంగా మాట్లాడాడు. ఆయన తనను తాను రొట్టెతో పోల్చుకున్నాడు ఎందుకంటే, ఆయన తన బలి ద్వారానే మానవజాతికి జీవాన్నిస్తాడు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారానే రొట్టెను తినడం, ద్రాక్షారసాన్ని త్రాగడం నెరవేరుతాయని యోహాను 6:35, 40 స్పష్టంగా సూచిస్తుంది.
మాస్ క్యాథలిక్ చర్చి బోధల్లో ప్రధానమైనది కాబట్టి, ఈ సిద్ధాంతానికి లేఖనాధార మద్దతు ఉంటుందని ఒకరు అనుకోవచ్చు. కానీ లేఖనాలు అటువంటి మద్దతును ఇవ్వడం లేదు. ద క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా (1913 ప్రచురణ) దానికి కారణాన్ని ఇలా వివరిస్తుంది: “మన సిద్ధాంతానికి ప్రధాన మూలం . . . పూర్వుల ఆచారం, ఇది మాస్ బలికున్న విన్నపం చేసుకునే విలువను [వేడుకోవడాన్ని] మునుపటి కాలం నుండి ప్రకటిస్తుంది.” అవును, రోమన్ క్యాథలిక్ మాస్ పూర్వుల ఆచారంపై ఆధారపడినదే కానీ, పరిశుద్ధ లేఖనాలపై ఆధారపడినది కాదు.
పూర్వుల ఆచారం ఎంత నిజమని నమ్మబడుతున్నప్పటికీ, అది బైబిలుకు విరుద్ధమైనదైతే అది దేవునికి అంగీకారయుక్తమైనది కాదు. యేసు తన కాలంలోని మత నాయకులను ఇలా మందలించాడు: “మీరు పూర్వుల ఆచారము ననుసరించు నెపమున దేవుని వాక్కును వ్యర్థము చేయుచున్నారు.” (మత్తయి 15:6) యేసు దేవుని వాక్యాన్ని విలువైనదిగా ఎంచాడు కాబట్టి, ఆ పరిశుద్ధ లేఖనాలు ఈ మాస్‌ను గూర్చిన బోధ విషయమై ఏమి చెబుతున్నాయో మనం పరిశీలిద్దాం.
ఎంత తరచుగా క్రీస్తు బలి ఇవ్వబడ్డాడు?
మాస్ జరిగే ప్రతిసారి యేసు నిజానికి చనిపోడనీ, అది రక్తరహిత బల్యర్పణ మాత్రమేననీ క్యాథలిక్ చర్చి నొక్కి చెబుతుంది, అయినప్పటికీ మాస్ జరిగే ప్రతిసారీ యేసు బలి అర్పించబడతాడని అది బోధిస్తుంది. బైబిలు ఈ దృక్పథంతో ఏకీభవిస్తుందా? హెబ్రేయులు 10:12, 14ను గమనించండి: “క్రీస్తు సర్వకాలమునకును సరియగు పాపపరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను. పాపములనుండి శుద్ధి పొందిన వారిని, ఒకే ఒక బలి మూలముగ ఆయన శాశ్వతముగ పరిపూర్ణులుగ చేసెను.”
అయితే, ఒక యథార్థవంతుడైన క్యాథలిక్ ఇలా అభ్యంతరం చెప్పవచ్చు: ‘మనమందరం అనేకసార్లు పాపం చేస్తాం కాబట్టి, యేసు తనను తాను తరచుగా అర్పించుకోవలసిన అవసరం లేదా?’ దీనికి బైబిలు సమాధానం హెబ్రేయులు 9:25, 26లో ఇలా నమోదు చేయబడింది: “క్రీస్తు . . . తన్ను తానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు, ఒకే ఒకసారి జన్మించెను.” దీనిని జాగ్రత్తగా గమనించండి: క్రీస్తు “పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు.” దానికి కారణాన్ని, రోమా 5:19 నందు అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “ఆ ఒక్క మానవుని [ఆదాము] అవిధేయత ఫలితముగ అనేకులు పాపాత్ములుగ చేయబడినట్లే, ఒక మానవుని [యేసు] విధేయత ఫలితముగ అనేకులు నీతిమంతులగుదురు.” ఆదాము చేసిన ఒకే ఒక్క అవిధేయతా క్రియ మనమందరం మరణానికి లోనయ్యేలా చేసింది; యేసు చేసిన ఒకే ఒక్క విమోచనా క్రియ, ఆ బలియందు విశ్వాసముంచే మనందరి పాపాలు ఇప్పుడు క్షమించబడేలా, అలాగే భవిష్యత్తులో మనమందరం నిరంతర జీవితాన్ని అనుభవించేలా పునాదిని వేసింది.
యేసు ఒకసారి బలి ఇవ్వబడినా లేక ఆయన తరచుగా బలి ఇవ్వబడినా అది ఎంత తేడాను చూపుతుంది? యేసు బలి విలువపట్ల మెప్పుదలను కనపరచడం ఇందులో ఇమిడి ఉంది. అది ఇంతవరకు ఇవ్వబడిన వాటిలోకెల్లా అత్యంత గొప్ప బహుమానం, అది ఎంతో అమూల్యమైన బహుమానం, ఎంతో పరిపూర్ణమైన బహుమానం, తిరిగి ఇవ్వవలసిన అవసరం ఏర్పడని బహుమానం.
యేసు బలి నిస్సందేహంగా జ్ఞాపకం చేసుకొనదగినదే. అయితే, ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకోవడానికి, దాన్ని తిరిగి చేయడానికి తేడా ఉంది. ఉదాహరణకు, తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఒక జంట వాస్తవంగా తమ వివాహ వేడుకనంతటినీ మళ్లీ తిరిగి జరుపుకోకుండానే తమ వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతీ సంవత్సరం, యెహోవాసాక్షులు యేసు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరిస్తారు, అదీ ఆయన ఆజ్ఞాపించిన విధంగానే ఆచరిస్తారు అంటే ఆయన “జ్ఞాపకార్థము”గా దాన్ని ఆచరిస్తారు గానీ ఆయనను బలిగా అర్పించడం ద్వారా కాదు. (లూకా 22:19) అంతేగాక, సంవత్సరమంతటిలో ఈ క్రైస్తవులు తమ జీవితాలను, తమ క్రియలను, తమ నమ్మకాలను పరిశుద్ధ లేఖనాలకు అనుగుణ్యంగా ఉండేలా చేసుకుంటూ యేసుక్రీస్తు ద్వారా యెహోవా దేవునితో ఒక వాత్సల్యపూరితమైన సంబంధాన్ని వృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తారు.
తరచుగా, తమ ఆలోచనా విధానంలో మార్పు చేసుకోవాలని దీని భావం. కానీ, తాము పూర్వుల ఆచారాలకు గాక దేవుని వాక్యానికి యథార్థంగా మద్దతును ఇచ్చినట్లయితే, ఆశీర్వదించబడతామన్న విషయమై సాక్షులు సంతోషిస్తారు. రమారమి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక్కసారే చిందించబడిన యేసు బలి రక్తం నందు విశ్వాసముంచినట్లయితే, అది వారి పాపాలన్నింటి నుండి వారిని పవిత్రులనుగా చేస్తుంది.—1 యోహాను 1:8, 9.
[అధస్సూచీలు]
a ఈ శీర్షికలోని లేఖనాలన్నీ పవిత్ర గ్రంథము క్యాథలిక్ అనువాదము నుండి తీసుకోబడినవి.
[18వ పేజీలోని చిత్రం]
సెయింట్ గైల్స్ (వివరణ)
[క్రెడిట్ లైను]
Erich Lessing/Art Resource, NY