మా ఐదుగురు కొడుకులను బట్టి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను
హెలన్ సోల్స్బరీ చెప్పినది
1997 మార్చి 2, నా జీవితంలోని దుఃఖకరమైన దినాల్లో ఒకటి. అమెరికాలోని డెలావర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్ నగరంలో నా ప్రియతమ భర్త డీన్ అంత్యక్రియలకు దాదాపు 600 మంది స్నేహితులూ, కుటుంబ సభ్యులూ హాజరయ్యారు. ఆయన ఒక క్రైస్తవ పెద్దగా, యెహోవాసాక్షుల సంఘాల్లో ఒకదానిలో సంఘ పైవిచారణకర్తగా సేవచేసేవారు. గడిచిన మా 40 ఏళ్ళ సంతోషభరిత దాంపత్య జీవితాన్ని గూర్చి ఆలోచిస్తుంటే, నేను కృతజ్ఞురాలినై ఉండడానికి గల కారణాలు ఎన్నెన్నో. డీన్ సురక్షిత ప్రదేశంలో ఉన్నాడనీ, అంటే సర్వశక్తిగల దేవుడైన యెహోవా జ్ఞాపకాల్లో భద్రంగా ఉన్నాడనీ, మేము డీన్‌ను భవిష్యత్తులో చూస్తామనీ నాకు తెలుసు.
డీన్ 1950లో ఉన్నతపాఠశాల నుండి పట్టా తీసుకున్న తర్వాత ఎయిర్ ఫోర్స్‌లోకి ప్రవేశించారు. ఆయన మతనిష్ఠ గల వ్యక్తి కాదు, అప్పట్లో నేనిష్టపడే క్యాథలిక్ చర్చి బోధలతో ఆయన ఏకీభవించనట్లు ఉండేవారు. అయినా, మేము మా పిల్లలను క్యాథలిక్లుగానే పెంచాలనుకున్నాము. ప్రతి రాత్రీ మేము మోకరించి మనస్సులోనే ప్రార్థన చేసుకునేవాళ్ళం. నేను నా క్యాథలిక్ ప్రార్థనలను వల్లెవేసేదాన్ని. మావారు తన హృదయంలో ఏముందో దాన్నే చెప్పేవారు. కాలప్రవాహంలో మాకు ఐదుగురు కొడుకులు పుట్టారు. వాళ్ళకు బిల్, జిమ్, డీన్ జూనియర్, జో, చార్లీ అని పేర్లు పెట్టాం.
నేను చర్చికి నిష్ఠగా వెళ్ళేదాన్ని, నాతోపాటు మా అబ్బాయిల్ని కూడా ఎప్పుడూ తీసుకువెళ్తూండేదాన్ని. అయితే, చర్చి విషయంలో నాకున్న భ్రమలు తొలగిపోయాయి, మరిముఖ్యంగా అది వియత్నామ్ యుద్ధంలో భాగం వహించడంతో పూర్తిగా తొలగిపోయాయి. అమెరికా జోక్యం చేసుకోవడంలో గల ఔచిత్యాన్ని ప్రశ్నించిన ప్రజలతో ఒక మాజీ కార్డినల్ స్పెల్మ్యాన్, “అది మంచైనా చెడైనా సరే, నా దేశానికి మద్దతునిస్తాను” అని అన్నారు. మా చర్చి యుద్ధంలో భాగం వహిస్తున్నప్పటికీ, మా అబ్బాయిలను యుద్ధరంగానికి పంపడానికి నేను ఒప్పుకోలేదు. అయినప్పటికీ, నా కొడుకుల్లో కనీసం ఒక్కరైనా ప్రీస్టు అవ్వాలనీ, మావారు క్యాథలిక్‌గా మారాలనీ నేను ప్రార్థించేదాన్ని.
ఆలోచనలో మార్పు
నేను ఒక శనివారం సాయంత్రం కొంతమంది క్యాథలిక్ స్నేహితులతోనూ, స్థానిక చర్చి ఫాదిరితోనూ పార్టీలో గడుపుతున్నాను. ఆ పార్టీలో మేము త్రాగుతూ సరదాగా గడుపుతూ ఉండగా, “ఫాదిరిగారూ, మనమిలా పార్టీ చేసుకున్న తర్వాత, రేపు ఉదయం మీరు లేచి మాస్కు వెళ్ళలేకపోతే అది నిజంగా మరణకరమైన పాపం కాదంటారా?” అని ఒక స్త్రీ ఫాదిరిని అడిగింది.
“అబ్బే పాపమేమీ లేదు మంగళవారం రాత్రి రిక్టరీ దగ్గర మాస్ జరుపుకుంటే సరిపోతుంది. కాబట్టి, మీరు మాస్కు అక్కడికి వచ్చి, మీ మొక్కుబడులను తీర్చుకోవచ్చు” అని ఆయన జవాబిచ్చాడు.
ఏదేమైనాగానీ, ఆదివారంనాడు మాస్కు తప్పక వెళ్ళాల్సిందేనని నేను నా చిన్నతనం నుండి నేర్చుకున్నాను. నేను ఫాదిరిగారితో ఏకీభవించకపోయేసరికి ఆయన నన్ను శపించి, ఒక ఫాదిరిని ఒక స్త్రీ సరిచేయకూడదని కోపంగా అన్నాడు.
‘నా కొడుకులు ఇలా అవ్వాలనేనా నేను ప్రార్థిస్తున్నది?’ అని నాలో నేను అనుకున్నాను. ఫాదిరులంతా ఇలా ఉండరని నాకు తెలిసినప్పటికీ, అది నేను సంశయించేలా చేసింది.
1960ల మధ్యకాలంలో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోనూ, అటుతర్వాత డెలావర్‌లోని న్యూయార్క్‌లోనూ యెహోవాసాక్షులు మమ్మల్ని కలిశారు. వారికున్న క్రైస్తవ ఆసక్తిని బట్టి ఆశ్చర్యచకితురాలినైనప్పటికీ, “నన్ను క్షమించండి. నేను క్యాథలిక్ని గనుక నాకు ఆసక్తి లేదు” అని చెప్పేదాన్ని.
అది 1970 నవంబరు నెల, చలికాలం. ఒక ఉదయాన సాక్షులు మళ్ళీ వచ్చారు. వారు బైబిలును గురించి ఒక ప్రశ్న వేసి, “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” అని చెబుతున్న కీర్తన 119:105 చదివారు. ఆ మాటలు నన్ను ప్రభావితురాలిని చేశాయి. ‘బైబిలు! బహుశా అదే పరిష్కారమై ఉండవచ్చు, కానీ నా దగ్గర ఒక్క బైబిలు కూడా లేదే’ అని నాలో నేను అనుకోవడం నాకు జ్ఞాపకముంది. క్యాథలిక్‌లకు బైబిలు అవసరం లేదనీ, అది మనల్ని తికమక పెడుతుందనీ, బైబిలనేది ఫాదిరులు చదివి, వివరించడానికేననీ నాకు బోధించారు. బైబిలు లేకపోవడంవల్ల నేను ఒక నమ్మకమైన క్యాథలిక్‌గా ఉన్నానని అనుకునేదాన్ని.
ఆ రోజు, నిత్యజీవమునకు నడిపించు సత్యము అనే బైబిలు పఠన సహాయక పుస్తకాన్ని యెహోవాసాక్షుల దగ్గర నుండి తీసుకున్నాను. ఆ వారంలోనే దాన్ని చదివేశాను, నేను సత్యాన్ని కనుగొన్నానని తెలుసుకున్నాను! సాక్షులు ఈసారి వచ్చినప్పుడు రెండు బైబిళ్లను తీసుకువచ్చారు, అందులో ఒకటి క్యాథలిక్ అనువాదం. బైబిలు పఠన సహాయక పుస్తకంలో ఎత్తి వ్రాయబడిన లేఖనాలు సరిగ్గా క్యాథలిక్ బైబిల్లో ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఒక గృహబైబిలు పఠనం నాతో ప్రారంభించబడి, పురోభివృద్ధికరంగా సాగింది. మా అక్క సాలీ కూడా బైబిలు పఠించడం ప్రారంభించింది. 1972, ఆగష్టులో నేను మా అక్క సాలీతోపాటు బాప్తిస్మం తీసుకున్నాను.
మా వారు నన్నెప్పుడూ వ్యతిరేకించలేదు, కానీ క్యాథలిక్ మతంకాని మరోమతంలో నేను ఆసక్తిని చూపించడాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన ఎప్పుడూ వింటూ, గమనిస్తూ ఉండేవారు. నా మాట వినేలా చేసేందుకు మా పిల్లలపై ఇంతకుముందు ఎప్పుడూ కేకలు వేసేదాన్ని. కానీ, “కోపము, అల్లరి, దూషణ”లు కూడదని విరుద్ధంగా బైబిలు హెచ్చరిస్తుందని నేను తెలుసుకున్నాను. (ఎఫెసీయులు 4:31, 32) మరొక ప్రక్క మీరు పిల్లలపై కేకలువేస్తూ వాళ్ళకు తర్ఫీదును ఇవ్వలేరు. “అమ్మా, వాళ్ళు తాము ప్రకటించిన దాన్నే ఆచరిస్తారు!” అని యెహోవాసాక్షులను గూర్చి మా వారు ఒకసారి వాళ్ళమ్మగారితో చెప్పడం విన్నాను. అది జరిగిన కొంతకాలానికే, ఆయన బైబిలు పఠనాన్ని అంగీకరించారు. డీన్ 1975, జనవరిలో బాప్తిస్మం తీసుకున్న సాక్షి అయ్యారు.
మా ఐదుగురు కొడుకులకు శిక్షణనివ్వడం
నేను రాజ్యమందిరానికి వెళ్ళడం ప్రారంభించినప్పుడు, నా పిల్లలు అంతసేపు కూర్చోలేరని అనుకున్నాను. కాబట్టి వాళ్ళను వాళ్ళ నాన్నగారితోపాటు ఇంటి దగ్గరే వదిలిపెట్టేసేదాన్ని. అలా ఒంటరిగా కూటాలకు వెళ్ళడం సౌకర్యంగానూ, ఉపశమనంగానూ ఉండేది. కానీ, క్రైస్తవ కూటాల సమయాన్ని గూర్చి మాట్లాడుతూ, ఒక ప్రసంగీకుడు “మీ పిల్లలు టీవీ ముందు కూర్చుని ఎంత సమయాన్ని గడుపుతున్నారో మీరెప్పుడైనా ఆలోచించారా?” అని కూటంలో అడిగాడు. సరిగ్గా ఆ సమయంలో మా అబ్బాయిలుండేది టీవీ ముందరే. ‘ఇక ముందు అలా జరగకూడదు! వాళ్ళు నాతో పాటు వస్తున్నారు!’ అని అప్పుడే మనస్సులో అనుకున్నాను. పిల్లలను నాతోపాటు తీసుకువెళ్ళడానికి మా వారు ఒప్పుకున్నారు. కొంతకాలానికి ఆయన కూడా మాతోపాటు రావడం మొదలుపెట్టారు.
కూటాలకు క్రమంగా హాజరు కావడమన్నది మా కుటుంబ జీవితానికి ఒక క్రమపద్ధతిని, స్థిరత్వాన్ని ఇచ్చింది. కానీ, అంతకన్నా ఎక్కువ ప్రయోజనమే కలిగింది. నేనూ, మావారూ ఇరువురమూ మాది తప్పైనప్పుడు దాన్ని అంగీకరించి, బైబిలు ఇచ్చే మార్గనిర్దేశాన్ని శ్రద్ధగా అన్వయించుకుంటూ, పిల్లలను పెంచడంలో మా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించేవాళ్ళం, మేము ద్వంద్వ ప్రమాణాలను ఎప్పుడూ అనుమతించలేదు. ఆయనకూ, నాకూ ఏది సరియైనదో అదే మా పిల్లలక్కూడా సరియైనది. బహిరంగ ప్రకటన కార్యక్రమంలో క్రమంగా పాల్గొనడమనేది ఖచ్చితంగా జరగాల్సిందే.
వినోదం విషయానికి వస్తే, హింసాయుతమైన, అవినీతికరమైన చిత్రాలకు తావు లేదు. స్కేటింగ్ చేయడం, బౌలింగ్ చేయడం, మినియాటర్ గోల్ఫ్ ఆడడం, అమ్యూజ్మెంట్ పార్క్‌కు వెళ్ళడం, పిక్నిక్లకు వెళ్ళడం, శుక్రవారం రాత్రుళ్ళు పిజా తినడం వంటి వాటితో సహా ఆరోగ్యకరమైన కుటుంబ కార్యకలాపాలను మేము ఎల్లప్పుడూ ఆనందించేవాళ్ళం. మావారు ప్రేమగల కుటుంబ శిరస్సు. మా వైవాహిక జీవితమంతటిలో, కుటుంబ జీవితం ఉండవలసింది ఇలాగేనని మేము గుర్తించాము.—ఎఫెసీయులు 5:22, 23.
1970లో నేను యెహోవాసాక్షులతో పఠించడం ప్రారంభించినప్పుడు, బిల్కి 12 ఏళ్ళు, జిమ్‌కి 11 ఏళ్ళు, డీన్ జూనియర్‌కి 9 ఏళ్ళు, జోకి 7 ఏళ్ళు, చార్లీకి 2 ఏళ్ళు. వాళ్ళు అప్పట్లో రోజూ చర్చికి వెళ్తుండేవారు, కానీ ఇప్పుడు వాళ్ళు బైబిలును గురించి నేర్చుకుంటున్నారు. ఇది మాకు పురికొల్పునిచ్చింది. “చూడండర్రా! ఇలా వచ్చి దీన్ని చూడండి!” అని పిల్లలతో అనేదాన్ని. వాళ్ళు దగ్గరకు వచ్చేవారు, మేము మాకు తెలియని క్రొత్త విషయాన్ని గూర్చి ఉత్సాహంగా చర్చించుకునేవాళ్ళం. భూమిపై అత్యున్నత ఆధికారికత గల బైబిలును అధ్యయనం చేయడం ద్వారా పిల్లలు యెహోవాను ప్రేమించడాన్నీ, తమ తల్లిదండ్రులకు మాత్రమేగాక తమ దేవునిగా, సృష్టికర్తగా ఆయనకు కూడా లెక్క అప్పజెప్పాలని భావించడాన్నీ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు.
బైబిలు సత్యాలను నేర్చుకోవడానికి ముందు, మాకు బోలెడన్ని అప్పులుండేవి. అప్పులలో కొన్నింటిని తీర్చడం కోసం మా ఇంటిని అమ్మివేసి, ఒక అద్దె ఇంట్లోకి మారాం. మా క్రొత్త కారును కూడా అమ్మివేసి, ఒక పాత కారును కొన్నాం. సాధ్యమైనంత మేరకు సామాన్యమైన జీవితాల్ని గడపడానికే ప్రయత్నించాం. ఇది నేను ఉద్యోగం చేయకుండా పిల్లలతోపాటు ఇంట్లోనే ఉండడానికి వీలు కల్పించింది. మా పిల్లలకు ఇంట్లో అమ్మ అవసరత ఎంతైనా ఉందని మేము భావించాం. పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు క్రైస్తవ పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం కూడా నాకు లభించింది. చివరకు, 1983 సెప్టెంబర్‌లో నేను పయినీర్ను (పూర్తికాల పరిచారకురాలు) అయ్యాను. నిజానికి, మా పిల్లలకు వస్తుపరంగా శ్రేష్ఠమైనవి లేకపోయినప్పటికీ, తమకేదో కొరవడినట్లు వాళ్లు అనవసరంగా భావించలేదు. మా పిల్లలందరూ ఉన్నత వృత్తివిద్యా పాఠశాలలో చేరి, హార్టికల్చర్, వడ్రంగం, ఆటోమెకానిక్స్, గ్రాఫిక్స్ వంటి వృత్తి పనులను నేర్చుకున్నారు. అలా, తమ కాళ్ళపై తాము నిలబడడానికి సంసిద్ధులయ్యారు.
మా కుటుంబజీవితాన్ని గూర్చి తరచూ ఆలోచిస్తూ, ‘మాకు వస్తుపరంగా చూస్తే, ఏమీ లేకున్నా ఈ భూమిమీద ఉన్న ఆనందభరితమైన కుటుంబాలలో మాదొకటి’ అని నాలో నేను అనుకునేదాన్ని. కొద్ది కాలంలోనే, డీన్ సంఘంలో బాధ్యతలను చేపట్టే స్థాయికి చేరుకోనారంభించాడు. అలాగే, పిల్లలు కూడా. 1982లో డీన్ క్రైస్తవ పెద్దగా నియమించబడ్డాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, 1990లో మా పెద్ద అబ్బాయి బిల్ ఒక పెద్దగా నియమించబడ్డాడు. ఆ తర్వాత, జో కూడా అదే సంవత్సరంలో పెద్దగా నియమించబడ్డాడు, డీన్ జూనియర్ 1991లో, చార్లీ 1992లో, జిమ్ 1993లో పెద్దలుగా నియమించబడ్డారు.
తల్లిదండ్రులుగా మేము కొన్ని విషయాల్లో తప్పిపోయామని మాకు తెలుసు. మేము చేసిన మంచి విషయాలను గుర్తుంచుకోవడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. క్రైస్తవులుగా తమ చిన్ననాటి సంవత్సరాలను గురించి, మరి ముఖ్యంగా క్రైస్తవ పెద్దలుగా అర్హులయ్యేందుకు వారికి సహాయపడ్డ వారి చిన్ననాటి తర్ఫీదునుండి వాళ్ళు నేర్చుకున్న బైబిలు సూత్రాలను గురించి వాళ్ళకు ఏం గుర్తుందో చెప్పమని ఒక స్నేహితుడు మా అబ్బాయిలను అడిగాడు. వాళ్ళ వ్యాఖ్యానాలు నా హృదయాన్ని ఉత్తేజపరిచాయి.
నా కొడుకులు చెప్పినది
బిల్: “రోమీయులు 12:9-12 వచనాల్లో మేము నేర్చుకున్నది నా మనస్సులో గాఢంగా ముద్రించబడింది. ఆ వచనాల్లో కొంత భాగం, ‘సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. . . . ఆత్మయందు తీవ్రతగలవారై . . . నిరీక్షణగలవారై సంతోషించు[డి]’ అని చదువబడుతుంది. ప్రజలను ప్రేమించడమంటే ఏమిటో చూపగల సామర్థ్యం మా అమ్మానాన్నలకు ఉంది. ఇతరులపై ప్రేమ చూపించడం వారిని సంతోషపరుస్తుందని మీరు గ్రహించగలిగి ఉంటారు. మా ఇంటిలోని ఈ ప్రేమ గల వాతావరణమే, బైబిలు సత్యాలు మా ఆలోచనల్లో ఒక భాగమయ్యేలా చేసింది. సత్యానికి హత్తుకునేలా మమ్మల్ని చేసిందదే. మా తల్లిదండ్రులు బైబిలు సత్యాన్ని ఇంటా, బయటా కూడా ప్రేమించారు. తత్ఫలితంగా, సత్యాన్ని ప్రేమించడం నాకు ఎన్నడూ కష్టం కాలేదు. దాన్ని హత్తుకుని ఉండడం కూడా ఎన్నటికీ కష్టం కాలేదు.”
జిమ్: “నా మనస్సులోకి వచ్చే ఒక ప్రధాన సూత్రం, మత్తయి 5:37: ‘మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.’ (ఇటాలిక్కులు మావి.) మా తల్లిదండ్రులు మా నుండి ఏమి కోరుతున్నారన్నది నాకూ, మా అన్నదమ్ములకూ బాగా తెలుసు, క్రైస్తవులు ఎలా ఉండాలనే దానికి సజీవమాదిరికర్తలను మేము వాళ్ళలో చూశాం. వాళ్ళిద్దరూ ఎల్లప్పుడూ ఏకాభిప్రాయాన్ని కల్గి ఉండేవారు. వాళ్లు ఏనాడూ వాదించుకోలేదు. వాళ్ళెప్పుడైనా ఏ విషయంలోనైనా ఒకరితో మరొకరు ఏకీభవించనట్లైతే, ఆ విషయం మాకెన్నడూ తెలిసేది కాదు. వాళ్లు సమైక్యంగా ఉండేవారు. నిశ్చయంగా అది మాపై చెరగని ముద్రను వేసింది. మేం అమ్మానాన్నలనూ, ముఖ్యంగా యెహోవానూ నొప్పించాలనుకునేవాళ్ళం కాము.”
డీన్: “‘మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును’ అని సామెతలు 15:1 చెబుతుంది. మా నాన్నగారు సౌమ్యులు. నేను ఆయనతో వాదించినట్లుగా నాకు ఇసుమంతైనా గుర్తు లేదు—నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు కూడా. ఆయన ఎల్లప్పుడూ ఎంతో శాంతంగా ఉండేవారు, ఆయన్ని ఏదైనా వ్యాకులపర్చినప్పటికీ కూడా శాంతంగానే ఉండేవారు. నేను చేసిన తప్పుకు శిక్షగా ఆయన కొన్నిసార్లు నన్ను గదిలో బంధించేవారు లేదా కొన్ని ఆధిక్యతలను తీసేసేవారు. అంతేగానీ, మా మధ్య వాగ్వివాదాలు ఎన్నడూ జరగలేదు. ఆయన మాకు తండ్రి మాత్రమే కాదు, స్నేహితుడు కూడా, ఆయన్ని బాధ పెట్టాలన్న ఉద్దేశమే మాకుండేది కాదు.”
జో: “2 కొరింథీయులు 10:5లో, ‘ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరప[ట్టడం]’ గురించి బైబిలు మాట్లాడుతుంది. యెహోవా ప్రమాణాలకూ, నిర్దేశాలకూ విధేయులై ఉండాలని మేము మా ఇంట్లో నేర్చుకున్నాము. సత్యమే మా జీవితం. కూటానికి హాజరుకావడమే మా జీవన మార్గం. కూటాలకు వెళ్ళే సమయాన్ని మరొక పనిని చేయడానికి ఉపయోగించాలన్న తలంపే రాదు. క్రైస్తవ పరిచర్య కూడా మా జీవితాల్లో ఒక క్రమమైన భాగం—దానికిక మినహాయింపు లేదు. మాకు స్నేహితులు రాజ్యమందిరంలోనే ఉండేవారు. కాబట్టి స్నేహితుల కోసం మరొకచోట వెదకవలసిన అవసరమే లేదు. ఏ తండ్రైనా తన కొడుకుల్ని జీవానికి నడిపే రహదారిలో పెట్టడం కంటే ఎక్కువేం చేయగలడు!”
చార్లీ: “‘యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు’ అన్న సామెతలు 1:7వ వచనం నా మనస్సులో నాటుకుని ఉంది. యెహోవాను నిజమైన వ్యక్తిగా చూడడానికీ, ఆయన యందు భయాన్నీ, ఆయనపట్ల ప్రేమనూ వృద్ధి చేసుకోవడంలోని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికీ మా తల్లిదండ్రులు మాకు సహాయం చేశారు. ‘మేము చెబుతున్నందువల్లే మీరు దాన్ని చేయకుండా ఉండవద్దు, అసలు మీరు ఏమని అనుకుంటున్నారు? యెహోవా దీన్ని చూసినప్పుడు ఆయనెలా భావిస్తాడని మీరు అనుకుంటున్నారు? దీన్ని చూసినప్పుడు సాతాను ఎలా భావిస్తాడని అనుకుంటున్నారు?’ అని అడుగుతూ తర్కించేవారు.
“మేము నిజమైన వివాదాంశాన్ని గ్రహించేలా అది మాకు సహాయపడేది. అమ్మానాన్నలు అన్ని సమయాల్లోనూ మాతో ఉండరు. మా హృదయాల్లోనూ, మనస్సుల్లోనూ బైబిలు సత్యాలు నాటుకుపోయేలా తాము చేయగల్గినదంతా చేశారు. స్కూల్లోనూ, పనిస్థలంలోనూ, స్నేహితులతోనూ ఉండేటప్పుడు మాకు వాళ్ళ నిఘా ఉండేది కాదు. యెహోవా పట్ల మాకున్న క్షేమాభివృద్ధికరమైన భయం, మాలో గొప్ప తేడాను చూపించింది—అది నేడు కూడా మాలో ఉంది.
“అలాగే, అమ్మ తన పయినీరుపరిచర్యను గురించీ, తనకున్న శ్రేష్ఠమైన అనుభవాలను గురించీ ఎప్పుడూ చెబుతూండేది. పరిచర్య విషయంలో ఆమెకు ఎప్పుడూ అనుకూల దృక్పథమే ఉండేది, అది మాపై గొప్ప ప్రభావాన్ని చూపింది. మేము ఆమెలాగే ప్రజలను ప్రేమించే గుణాన్ని మాలో వృద్ధి చేసుకున్నాము, ఇంటింటి పరిచర్య కార్యక్రమం అత్యంత ఆనందదాయకంగా ఉండేదని మేం గుణగ్రహించేవాళ్ళం.”
కృతజ్ఞురాలినై ఉండడానికి కారణం
ఇప్పుడు మా అబ్బాయిలకు పెళ్ళిళ్ళయిపోయాయి. నాకు ఐదుగురు చక్కని కోడళ్ళు, వాళ్ళంతా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారు. అవును, నేను మరొక ఐదుగురు అబ్బాయిలతో అంటే ఐదుగురు మనమళ్ళతో ఆశీర్వదించబడ్డాను! వాళ్ళందరూ యెహోవాను ప్రేమించి, తమ జీవితాల్లో ఆయన రాజ్యాన్ని మొదటి స్థానంలో దృఢంగా ఉంచుకునేలా పెంచబడుతున్నారు. ఒకనాటికి వాళ్ళు కూడా తమ తండ్రుల్లాగా, తమ తాతలాగా పెద్దలు అవ్వాలని మేము ప్రార్థిస్తాము.
డీన్ చనిపోయిన కొద్దికాలానికి నా కొడుకుల్లో ఒకరు, “మా నాన్నగారిని నిజంగా మిస్సయ్యాను. ఆయన ప్రస్తుతం నిద్రిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు నొప్పి లేదు, బాధ లేదు. సర్జరీల, సూదుల, ద్రవపదార్థాలను నోటిలోకి పంపేందుకు వినియోగించే ట్యూబ్‌ల బాధ తప్పింది—కేవలం ప్రశాంతతే ఉంది. ఆయన చనిపోవడానికి ముందు నేను ఆయనకు వీడ్కోలు చెప్పలేకపోయాను. అనుకున్నవి అనుకున్నట్లు ఎల్లప్పుడూ జరగవు. మా నాన్నగారికి హలో చెప్పడం మిస్సవ్వకుండా ఉండేలా నేను జీవించాలని నిశ్చయించుకున్నానని మాత్రమే చెప్పగలను!” అని వ్రాశారు.
నా ప్రియతమ భర్తను బట్టీ, ఖచ్చితమైన పునరుత్థాన నిరీక్షణను బట్టీ యెహోవాకు ఎన్నెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను! (యోహాను 5:28, 29) నా ఐదుగురు కొడుకుల నిమిత్తం కూడా ఆయనకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటున్నాను!
[17వ పేజీలోని చిత్రం]
నేడు హెలన్ సోల్స్బరీ, ఆమె కుటుంబం