యువత ఇలా అడుగుతోంది
నేను కావాలనుకున్నవి నాకు దొరకవెందుకని?
“కొన్ని వస్తువులు నిజంగా చాలా మంచివి. అవంటే నాకు చాలా ఇష్టం; కానీ వాటిని కొనిచ్చే స్థోమత మా తల్లిదండ్రులకు లేదు.”—మైక్.
మీరు నిజంగా కావాలనుకున్నా పొందలేనివి ఉన్నాయా? బహుశా మీ మనస్సంతా ఆ క్రొత్త స్టీరియో మీదా, మిగతా పిల్లలందరూ వేసుకుంటున్న స్నీకర్‌ల మీదా, లేదా డిజైనర్ లోగో ఉన్న క్రొత్త జీన్స్ మీదా ఉందేమో. మీ తోటివాళ్ళలో కొందరు వాటిని కొనిపించుకుని, గర్వంగా ప్రదర్శిస్తుంటారు. మనకు అవి కొనుక్కునే స్థోమతలేదని మీ తల్లిదండ్రులు మీకు చెప్పి ఉంటే మీరు నిరాశకు గురై ఉండవచ్చు.
కొన్ని వస్తువులను కావాలని కోరుకోవడం సహజమే, కానీ చాలా మంది యౌవనస్థుల్లో వాటిని సొంతం చేసుకోవాలన్న కోరిక అదుపులో పెట్టుకోలేనంతగా ఉండవచ్చు. దీనికి ముఖ్య కారణం సమాచార మాధ్యమాలు చేసే ప్రచారమేనని అనిపిస్తుంది. యుక్తిగా రచించబడిన టీవీ ప్రోగ్రాములూ పత్రికలూ, రేడియోలో వ్యాపార ప్రకటనలూ, మీరు ఫలాని వస్త్రాలను ధరించకపోతే, ఫలాని వస్తువులను ఉపయోగించలేకపోతే మీ జీవితం వృథా అయినట్లేనన్న సందేశాన్ని తెలుపుతాయి. అంతెందుకు, కేవలం అమెరికాలోనే కౌమారప్రాయంలోని పిల్లలు వార్తామాధ్యమాలు ప్రచారం చేసేవాటిపై సంవత్సరానికి 10,000 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు!
తర్వాత, యౌవనస్థులు తోటివయస్కుల ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి ఉంది. “సానుభూతిగానీ, లోకజ్ఞానంగానీ లేని యౌవనస్థులలోకంలో, మీరు ఏ గుంపులో చేరాలని కోరుకుంటారో ఆ సామాజిక గుంపు చేత మీరు పాతకాలం వ్యక్తి అనిపించుకోవడం అంటే తోటివాళ్ళ ప్రమాణాన్ని చేరుకోలేకపోవడమో, నిరాకరించబడడమో మాత్రమే కాదు: అలా అనిపించుకోవడం జీవితంలో ఓడిపోయినవాడి లక్షణం” అని మార్కెటింగ్ టూల్స్ అనే పత్రికలోని ఒక శీర్షిక చెబుతుంది. “ఆధునికంగా” ఉండడంలో కీలకమేమిటి? అనేక మిత్ర బృందాల విషయానికి వస్తే, సాధ్యమైనంత మంచి వస్తువులను, లేటెస్ట్ వస్తువులను కొనుక్కోవడమే ఆధునికంగా ఉండడానికి కీలకం. అయితే వాటిని కొనుక్కునే స్థోమత మీకు లేకపోతే అప్పుడి సంగతి ఏమిటి? “నిజంగా మనస్సుకు చాలా కష్టంగా ఉంటుంది. ఏ బ్రాండుకూ సంబంధించని డ్రెస్సులను వేసుకుని స్కూలుకు వెళ్తున్నట్లయితే, అందరూ హేళన చేస్తారు” అని ఒక క్రైస్తవ యౌవనస్థుడు ఒప్పుకుంటున్నాడు. “ఎవరూ నన్ను తమ గుంపులోకి చేర్చుకోరు అనే భావన నాలో కొన్నిసార్లు కలుగుతుంటుంది” అని ఒక యౌవనస్థురాలు ఒప్పుకుంటుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యౌవనస్థులకు ఇలాంటి ఒత్తిళ్ళు కలుగవచ్చు. ఈ దేశాల్లోని ప్రజలు జీవితంలో అత్యవసరమైనవాటి కోసం కూడా ఎన్నో గంటలు కాయకష్టం చేయవలసి ఉంటుంది. మీ కుటుంబం విషయంలో ఇది నిజమైతే, మరింత మేలైన జీవన విధానం కోసం మీరు వాంఛించడం సహజమే. సంపన్న దేశాల్లో నిర్మించబడిన టీవీ షోలను, మూవీలను చూసిన మీరు ఆ షోలలోనూ, మూవీల్లోను చూపించిన ఖరీదైన వస్త్రాలు, ఇండ్లు, కార్లు కావాలని కోరుకోవచ్చు. అలాంటివాటిని పొందడం అసాధ్యమని అనిపించినప్పుడు, మీమీద మీకే కోపం వస్తుండవచ్చు, లేదా మీరు నిరాశానిస్పృహలకు గురికావచ్చు కూడా.
మీరు పేద దేశంలో నివసిస్తున్నా, సంపన్న దేశంలో నివసిస్తున్నా మీరు నిర్దిష్ట వస్తువులను పొందలేనందువల్ల మీరు కోపంగానూ, నిరాశగానూ ఉండడం హానికరమే గానీ ప్రయోజనమేమీ లేదు. అది మీరు మీ తల్లిదండ్రులతో వాదులాటలో దిగడానికి కూడా నడిపించవచ్చు. మీరు ఎలా అధిగమించగలరన్నదే ఇక్కడి ప్రశ్న.
భౌతికవస్తువులను గురించిన సమతుల్యమైన దృష్టి
తన ప్రజలు పేదరికంలో జీవించాలని గానీ, లేక వాళ్ళకు నిజంగా అవసరమైనవి ఉండకూడదని గానీ యెహోవా దేవుడు కోరుకోవడం లేదని మొదట గుర్తించండి. అందుకే, దేవుడు ఆదాము హవ్వలను ఏదో చెత్త దిబ్బ మీద కాక, చూడ్డానికి ఎంతో రమ్యంగా ఉండే చెట్లతో నిండిన అందమైన తోటలో ఉంచాడు. (ఆదికాండము 2:9) తర్వాత, అబ్రాహాము, యాకోబు, సొలొమోను వంటి దేవుడి సేవకులు అనేక భౌతిక వస్తువులను సొంతం చేసుకోగల్గారు. (ఆదికాండము 13:2; యోబు 1:3) అంతెందుకు, సొలొమోను చాలా బంగారాన్ని సొంతం చేసుకున్నాడు గనుక, ఆయన పరిపాలన కాలంలో, “వెండి యెన్నికకు రాలేదు”!—1 రాజులు 10:21, 23.
అయితే, మొత్తం మీద, దేవుడి సేవకుల్లో చాలా మందికి చాలా తక్కువ ఆదాయం ఉంటోంది. యేసు క్రీస్తు కూడా పేదవాడే; ఆయనకు ‘తలవాల్చుకోవడానికి’ కూడా ‘స్థలము’ ఉండేది కాదు. (మత్తయి 8:20) అయినప్పటికీ, తను కావాలనుకున్నవాటిని తను సొంతం చేసుకునే స్థోమత లేనందువల్ల ఆయన ఫిర్యాదు చేసినట్లు మీరెన్నడూ చదవలేదు. బదులుగా, “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; . . . ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని ఆయన బోధించాడు.—మత్తయి 6:31-33.
అంతమాత్రాన, తనకు డిజైనర్ వస్త్రాలు లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కావాలన్న ఒకరి కోరికను నెరవేర్చడానికి దేవుడు బాధ్యుడని అర్థం కాదు. దేవుడు తీర్చేది మన అవసరాలను, మనం కావాలనుకునేవాటిని కాదు. అందుకే “అన్నవస్త్రముల”తో తృప్తిపొందియుండమని బైబిలు మనకు ఉద్బోధిస్తుంది. (1 తిమోతి 6:7) సంతృప్తులముగా ఉండడం సులభం కాదన్న వాస్తవాన్ని ఢీకొందాం. “మీ అవసరాలకూ, మీ కోరికలకూ మధ్య ఎడతెగని పోరాటం సలపవలసి ఉంటుంది” అని మైక్ అనే పేరుగల యౌవనస్థుడు ఒప్పుకుంటున్నాడు. మనకుండే స్వార్థపు మనోవైఖరులకు తోడు, మనం దేవుడి ప్రధాన శత్రువైన అపవాదియైన సాతాను ప్రభావానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా పోరాడవలసి ఉంది. (1 యోహాను 5:19) ప్రజలు తాము దేనినో పొందలేకపోతున్నామని భావించేలా చేయడం అతని అతి పురాతన తంత్రాల్లో ఒకటి. అలా హవ్వ పరిపూర్ణమైన పరదైసులో జీవిస్తున్నప్పటికీ, తన నుండి దేన్నో దూరంచేసినట్లు తలంచేలా మోసగించబడింది!—ఆదికాండము 3:2-6.
అసంతృప్తి అనే గుంటలో పడే ఉరి నుండి మీరు ఎలా తప్పించుకోవచ్చు? మీరు సంతోషించడానికి మీకుగల విషయాలను ఎక్కువగా ఆలోచించండి. అయితే, అది వినీ వినీ విసిగెత్తిపోయిన మాట అని మీరు అనవచ్చు. కానీ, మీరు మీకు లేనివాటి గురించిన ప్రతికూల ఆలోచనల్లో చిక్కుకుపోకండి. సకారాత్మకంగా ఆలోచించండి. మీకు ఉన్నవాటిని గురించే గుర్తుచేసుకోండి. (పోల్చండి ఫిలిప్పీయులు 4:8.) “నేను నిజంగా కోరుకునే వస్తువులు చాలా ఉన్నాయి, కాని వాటి గురించే అస్తమానం ఆలోచిస్తూ ఉండను” అని మైక్ అంటున్నాడు.
యుక్తిగా రచించబడిన వ్యాపారప్రకటనలు మీ ఉద్వేగాలను సొమ్ము చేసుకుంటున్నాయేమో అని అనుమానించడం కూడా మీకు సహాయపడుతుంది.a (సామెతలు 14:15) ఆ క్రొత్త రకపు స్నీకర్‌లు లేదా కాంపాక్ట్ డిస్క్ ప్లేయర్ లేకపోతే “బ్రతకలేను” అనే తొందరపాటు నిర్ణయానికి వచ్చేముందు, విషయాలను గురించి ప్రశాంతంగా విశ్లేషించుకునేందుకు ప్రయత్నించండి. ‘నాకు అది నిజంగా అవసరమా? దానివల్ల ఆచరణాత్మక ప్రయోజనమేమైనా ఉందా? నాకు ప్రస్తుతం ఉన్నవి సరిపోతాయా?’ అని మీకై మీరు ప్రశ్నించుకోండి. ముఖ్యంగా, ఫలాని వస్తువు ఉండడం ప్రెస్టీజ్ సింబల్ అని ప్రోత్సహించే వ్యాపార ప్రకటనల విషయమై అప్రమత్తంగా ఉండండి. “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే” అని 1 యోహాను 2:16లో అపొస్తలుడైన యోహాను చెప్పిన మాటలు ఆలోచింపజేసే మాటలు.
మీకు నిజంగా ఏదైనా అవసరమున్నప్పుడు
న్యాయయుక్తంగానే మీకు ఏదైన అవసరముంటే అప్పుడేమిటి? మీరు దాని గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడే ముందు, ఏం మాట్లాడాలో ఆలోచించుకోండి. మీకు ఫలానిది ఎందుకు కావాలి, మీరు దాన్ని ఎలా ఉపయోగించాలని పథకం వేసుకుంటున్నారు, అది మీకు ప్రయోజనాన్నిస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని వివరించేందుకు ముందుగానే సిద్ధపడండి. మీ తల్లిదండ్రులు దాన్ని కొనడాన్ని తమ బడ్జెట్‌లో చేర్చే మార్గాన్ని కనుగొనవచ్చునేమో. ఒకవేళ వాళ్ళకు ఏ మార్గమూ కనిపించకపోతే,—బహుశా కొన్నాళ్ళ వరకు వాళ్ళకు అది సాధ్యంకాకపోతే, అప్పుడేమిటి? మీరు వేచి ఉండడం తప్ప మరే మార్గమూ లేకపోవచ్చు. (ప్రసంగి 7:8) ఇవి ‘అంత్యదినములు,’ తమ పిల్లలు కోరే వస్తువులనన్నింటినీ కొనిపెట్టే స్థోమత చాలా మంది తల్లిదండ్రులకు లేదు. (2 తిమోతి 3:1) వాస్తవంగా, అత్యవసరం కానివాటిని కొనివ్వమని మీరు మీ తల్లిదండ్రులను కోరకుండా ఉంటే, వాళ్ళ క్లిష్టమైన పాత్రను మీరు కొంత సులభతరం చేసినవారౌతారు.
అయినప్పటికీ, మీ అంతట మీరే ప్రయత్నించగలరేమో. ఉదాహరణకు, మీకు పాకెట్‌మనీ లభిస్తోందా? అలాగైతే, ప్రతి నెలా మీరు కొంత డబ్బు ఆదా చేసేలా జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవడాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దగ్గర్లో ఉన్న ఒక బ్యాంక్‌లో సేవింగ్ అక్కౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం కావచ్చు కూడా. (పోల్చండి లూకా 19:23.) అబీగెయిల్ అనే ఒక అమ్మాయి ఆ పనే చేసింది. “నేను నా డబ్బును రెండుగా కేటాయిస్తాను—ఒకటి నా బ్యాంక్ అక్కౌంట్‌లో వేసేందుకు, మరొకటి ఖర్చుల కోసం” అని ఆ అమ్మాయి అంటోంది. మీది పనిలో చేరే వయస్సైతే, ఏవైనా చిన్న పనులను, లేదా పార్ట్‌టైమ్ జాబ్‌ను చేసేందుకు కూడా మీరు ప్రయత్నించవచ్చు.b అలాగైతే, మీరు నిజంగా దేన్నో కొనుక్కోవాలనుకుంటున్నారనీ, దాని కోసం డబ్బు జమ చేయాలన్న స్పృహ మీకుందని మీ తల్లిదండ్రులు చూసినప్పుడు, సాధ్యమైతే, ఆ వస్తువు ఖరీదులో కొంత తాము భరించేందుకు వాళ్ళు పురికొల్పబడవచ్చు.
మీరు షాపింగ్ చేసే విధానంలో మార్పులు చేసుకోవడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక వస్తువు ఖరీదు చాల ఎక్కువగా ఉన్నట్లైతే, ధర తగ్గించేందుకు బేరమాడి ప్రయత్నించవచ్చు. బేరం కుదరకపోతే, ఆ వస్తువులు సేల్‌లో దొరుకుతాయేమో వేచి చూడండి. అదే వస్తువు ఇతర షాపుల్లో తక్కువ ధరకు దొరుకుతుందేమో చూడండి. నాణ్యతగల వస్తువులేనా కాదా అని జాగ్రత్తగా గమనించడం నేర్చుకోండి; కొన్నిసార్లు బ్రాండ్ పేరేమీ లేని మామూలు వస్తువులు సరసమైన ధరకు లభిస్తాయి.c
తృప్తిపడడం నేర్చుకోండి
“పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు” అని సామెతలు 27:20 హెచ్చరిస్తుంది. అవును, సమాధికి ఆకలి తీరనట్లే, కొంతమంది ప్రజల కోరికలకు అంతం ఉండదు—వాళ్ళకు ఎంత ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక కోరిక కలుగుతూనే ఉంటుంది. ఆ విధమైన స్వార్థపూరిత ఆలోచనా విధానాన్ని వదిలిపెట్టండి. కాలగమనంలో, అత్యాశ అనేది నిరాశనూ, అసంతోషాన్నీ తప్ప మరి దేనినీ తీసుకురాదు. “మీ సంతోషం, మీరు దేనినైనా సొంతం చేసుకోవడంపైనే ఎల్లప్పుడూ ఆధారపడి ఉన్నట్లయితే, మీరు ఎన్నటికీ సంతోషంగా ఉండరు. ఎల్లప్పుడూ ఏదో ఒకటి క్రొత్తది వస్తూనే ఉంటుంది, మీరు అది కావాలని కోరుకుంటూనే ఉంటారు. మీకున్నదానితో సంతోషపడేందుకు మీరు నేర్చుకోవలసిన అవసరముంది” అని జానథన్ అనే యౌవనస్థుడు అంటున్నాడు.
మీరు సంతృప్తులుగా ఉంటే, మీరు తోటివారి ఒత్తిడితో వ్యవహరించగలుగుతారు. “బ్రాండ్‌నేమ్‌గల స్నీకర్లను ఎవరో వేసుకోవడాన్ని నేను చూసినంత మాత్రాన, నేను కూడా బయలుదేరి అలాంటి జతే కొనుక్కోవాలనేమీ లేదు” అని విన్‌సంట్ అనే యౌవనస్థుడు అంటున్నాడు. నిజమే, మీరు కావాలనుకున్నదాన్ని సొంతం చేసుకోలేకపోవడం వల్ల అప్పుడప్పుడు బాధ అనిపించవచ్చు. కాని మీ అవసరాలు ఏమిటో యెహోవాకు తెలుసన్న విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. (మత్తయి 6:32) సమీప భవిష్యత్తులోనే, ఆయన ‘ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు.’—కీర్తన 145:16.
[అధస్సూచీలు]
a సెప్టెంబర్ 8, 1998 సంచిక తేజరిల్లు!లో వచ్చిన “ప్రకటనలు—మీరెలా ప్రభావితులౌతున్నారు” అనే శీర్షికల పరంపరను చూడండి.
b సెప్టెంబరు 8, 1998 సంచిక తేజరిల్లు!లో “నేను కాస్తంత డబ్బును ఎలా సంపాదించగలను?” అనే శీర్షికను చూడండి.
c సహాయకరమైన అదనపు సలహాల కోసం, జనవరి 22, 1995 (ఆంగ్ల) సంచికలో, “యౌవనస్థులు ఇట్లు అడుడుగుదురు . . . నేను నా బట్టల బీరువాను ఎలా మెరుగుపరచుకోగలను?” అనే శీర్షికను చూడండి.
[19వ పేజీలోని చిత్రం]
“బ్రాండ్‌నేమ్ లేని డ్రెస్స్ వేసుకుని స్కూల్‌కు వెళ్తే, ప్రతి ఒక్కరూ ఎగతాళి చేస్తారు”
[20వ పేజీలోని చిత్రం]
మీరు కావాలనుకునే ప్రతిదీ లేకపోయినా మీరు సంతోషంగా ఉండవచ్చు