తుపాను తర్వాత క్రైస్తవత్వం వెల్లివిరిసింది
మొజాంబిక్‌లోని తేజరిల్లు! ప్రతినిధి ద్వారా
1998 మార్చి 2 సాయంకాలం, మొజాంబిక్‌లోని మపుటో నగరం పెను తుపాను తాకిడికి గురైంది. మరునాడు ఉదయం, తుపాను చేసిన విధ్వంసం అంతటా కనిపిస్తోంది. పడిపోయిన చెట్లు సముద్ర తీరం వెంబడి చెల్లాచెదురుగా పడివున్నాయి, పొంగి ప్రవహించిన నీటి మూలంగా రోడ్లు పాడైపోయాయి, కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, వేరే ఇళ్లు కుప్పకూలిపోయాయి.
యెహోవాసాక్షుల బ్రాంచ్ కార్యాలయ భవనాలు చెక్కుచెదరలేదు. కాని వాటికి పొరుగునున్న, జింకు షీట్లు పైకప్పుగాగల కర్రలతోకట్టిన ఒక ఇల్లు తుపాను తాకిడిని తట్టుకోలేకపోయింది. ఆ ఇల్లు బలంగా వీస్తున్న గాలులకు ఎదురు నిలువలేక కుప్పకూలిపోయింది. సంతోషకరంగా, అందులో నివసించే వారంతా అంటే ఒక స్త్రీ ఆమె ఐదుగురు పిల్లలూ నిరపాయంగా బ్రతికి బయటపడ్డారు. అయితే, వస్తుపరంగా చూస్తే, వాళ్లు దాదాపు సమస్తాన్నీ కోల్పోయారు.
ఉదయాన్నే, వాచ్‌టవర్ సంస్థ బ్రాంచ్ కార్యాలయం నుండి స్వచ్ఛంద సేవకులు ఆ కుటుంబాన్ని దర్శించి, వాళ్లు కూలిపోయిన ఆ ఇంటి శిథిలాల్లో నుండి తమకున్న కొద్ది పాటి వస్తువులను వెలికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడాన్ని చూశారు. వాళ్లకు జరిగిన వస్తుపరమైన నష్టం వాళ్ల దుఃఖాన్ని అధికం చేసింది, ఎందుకంటే తమ ఇంటిని తిరిగి కట్టుకోవడానికి వారి దగ్గర తగినంత డబ్బులేదు. తండ్రిలేని ఆ కుటుంబానికున్న ఆదాయం అంతంత మాత్రమే, స్థానిక మార్కెట్లో ఆహార పదార్థాలను అమ్మగా వచ్చే ఆదాయమది.
పరిస్థితిని బేరీజు వేసి చూసిన తర్వాత, యెహోవాసాక్షులు వెంటనే వాళ్లకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. పునర్నిర్మాణంలో మరలా ఉపయోగించడానికి కూలిపోయిన ఇంటి భాగాలు పనికిరావని నిశ్చయమైపోయింది. కాబట్టి స్వచ్ఛంద సేవకుల బృందం అవసరమైన సామాగ్రినంతటినీ సమకూర్చి, ఒక చిన్న దృఢమైన ఇంటిని నిర్మించడం మొదలుపెట్టారు.
మొదట ఇరుగుపొరుగువారు దాని విషయమై ఉత్సుకతను చూపించారు, అయితే నిర్మాణపని అంత త్వరత్వరగా జరగడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ఐదు రోజుల్లో ఇల్లు పూర్తిగా నిర్మించబడి, నివాసానికి సిద్ధంగా ఉంది. తన క్రొత్త ఇంట్లోకి ప్రవేశించిన, ఆ స్త్రీకి తన భావాలను వ్యక్తపర్చడానికి మాటలు కరువయ్యాయి. అయితే, మాటలు అవసరం లేదు, ఎందుకంటే తల్లీ పిల్లల చిరునవ్వు వదనాలు, ప్రగాఢమైన మెప్పుతో నిండిన కళ్లు వారి ఆనందాన్ని స్వచ్ఛంద సేవకులకు స్పష్టంగా చూపించాయి.
స్వచ్ఛంద సేవకుల బృందం కూడా ఆనందించింది. నిజ క్రైస్తవ స్ఫూర్తిని ఆచరణాత్మకంగా చూపించడానికి ఒక అవకాశం లభించినందుకు వాళ్లు సంతోషించారు.—గలతీయులు 6:10.
[13వ పేజీలోని చిత్రాలు]
మార్చి 5
మార్చి 6
మార్చి 7
స్థానిక సాక్షులు ఈ కుటుంబ సభ్యుల గృహాన్ని పునర్నిర్మించారు