కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 4/8 పేజీలు 4-5
  • “నిస్సందేహంగా ఆకాశం తెరిచివుంది”!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నిస్సందేహంగా ఆకాశం తెరిచివుంది”!
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఫైర్‌ బెలూన్‌లు, “దహనశీల వాయువు”
  • గాలి వేగంతో గగన విహారం
    తేజరిల్లు!—2002
  • విమానం ఎలా ఉనికిలోకి వచ్చింది?
    తేజరిల్లు!—1999
  • పాఠకులనుండి ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • విషయసూచిక
    తేజరిల్లు!—2002
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 4/8 పేజీలు 4-5

“నిస్సందేహంగా ఆకాశం తెరిచివుంది”!

“అనంత విహాయాస పథాల్లో విహరించాలన్న కోరిక, మానవుడెంత పురాతనమైనవాడో అంత పురాతనమైనదే,” అని ది ప్రిహిస్టరి ఆఫ్‌ ఏవియేషన్‌ పుస్తకంలో చరిత్రకారుడైన బెర్టాల్ట్‌ లుఫర్‌ పేర్కొన్నాడు. ప్రాచీన గ్రీకు, ఐగుప్తు, అస్సీరియా దేశాలకు సంబంధించిన, ప్రాచ్య దేశాల పురాణగాథలకు సంబంధించిన చారిత్రక వృత్తాంతాల్లో ఎగిరే శక్తిని ఉపయోగించుకోవాలని ప్రయత్నించిన రాజులూ, దేవతలూ, కథానాయకులూ వంటివారిని గురించిన అనేకానేక ఇతివృత్తాలు ఉన్నాయి. ఇంచుమించుగా ఆ కథలన్నీ రెక్కలు చాచుకొని ఎగిరే పక్షులను అనుకరించిన మనుష్యుల గురించి చెప్తాయి.

ఉదాహరణకు, యేసుక్రీస్తు జననానికి ముందు 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రిందట జీవించినట్లు చెప్పబడుతున్న జ్ఞానవంతుడూ ధైర్యశాలీ అయిన షూన్‌ చక్రవర్తి గురించి చైనీయులు చెప్తారు. ఒక కల్పితగాథ ప్రకారం, షూన్‌ తగులబడిపోతున్న ధాన్యపు గిడ్డంగిపై చిక్కుకుపోయినట్టు గ్రహించి, రెక్కలు కట్టుకుని, అక్కడి నుండి ఎగిరిపోవడం ద్వారా తప్పించుకుంటాడు. అతడు ఒక కోట మీది నుండి క్రిందికి దూకి నేలమీదకు సురక్షితంగా చేరుకోవడానికి రెండు పెద్ద రెల్లుగడ్డి టోపీలను పారాచూట్లలా ఉపయోగించాడని మరో కథనం చెప్తుంది.

3,000 సంవత్సరాల నాటిదైన ఒక ప్రాచీన కథ, గొప్ప కళాకారుడూ రూపకర్తా అయిన డేడలస్‌ను గూర్చిన ఒక కథ గ్రీకుల మధ్య ప్రాచుర్యంలో ఉండేది. తానూ తన కుమారుడైన ఇకారస్‌ బందీలుగా ఉన్న స్థలమైన క్రేతు నుండి తప్పించుకోవడానికి పక్షి ఈకలు, ట్వైన్‌ దారం, మైనంతో రెక్కలను తయారు చేశాడు. “నిస్సందేహంగా ఆకాశం తెరిచి ఉంది, మనం తప్పించుకుని వెళ్లేది అక్కడి నుండే,” అని డేడలస్‌ అంటాడు. మొదట్లో రెక్కలు చక్కగా పనిచేశాయి. కాని, ఆకాశంలో ఎగరడానికి తనకున్న సామర్థ్యాన్ని బట్టి తనను తాను మైమరచిపోయిన ఇకారస్‌, పైపైకంటూ ఎగురుతూ వెళతాడు, దానితో సూర్యుని వేడి తగిలి అతని రెక్కల ఈకలను పట్టివుంచిన మైనం కరిగిపోతుంది. అతడు సముద్రంలోపడి చనిపోతాడు.

నిజంగా ఎగరాలని ఎంతగానో ఆకాంక్షించిన రూపకర్తల, తత్త్వవేత్తల ఊహలను అలాంటి కథలు ఎంతో ప్రేరేపించాయి. సా.శ. మూడవ శతాబ్దం తొలికాలంలోనే, చైనీయులు గాలిపటాలను తయారు చేసి వాటితో ప్రయోగాలు చేస్తూ, యూరపులో అలాంటి ప్రయోగాలు ప్రారంభం కావడానికి ఎంతోకాలం ముందే కొన్ని వైమానిక సిద్ధాంతాలలో తమకున్న అవగాహనను చూపించారు. 15వ శతాబ్దంలో, వెనిన్‌ నగర వైద్యుడైన జొవాన్నీ డ ఫోన్టానా, చెక్కతోనూ కాగితంతోనూ తయారు చేయబడిన రాకెట్లతో ప్రయోగాలు చేశాడు, అవి తుపాకి మందు విస్ఫోటనంతో పైకి వెళ్లేవి. దాదాపు 1420లో, ఫోన్టానా ఇలా వ్రాశాడు: “వాస్తవానికి, కృత్రిమంగా కదపడానికి వీలయ్యే రెక్కలను మనిషికి అమర్చడం సాధ్యమౌతుందనడంలో నాకు ఏవిధమైన సందేహమూ లేదు, ఆ రెక్కలతో అతడు గాలిలోకి ఎగిరి ఒక స్థలం నుండి మరో స్థలానికి ప్రయాణిస్తూ, కోటలను అధిరోహించగల్గుతాడు, సముద్రాలను దాటగల్గుతాడు.”

16వ శతాబ్దం తొలిభాగంలో, చిత్రకారుడూ, శిల్పీ, నైపుణ్యంగల మెకానికల్‌ ఇంజనీరూ అయిన లియోనార్డో డా విన్సీ హెలికాప్టర్ల కోసం పారాచూట్ల కోసం అలాగే గ్లైడర్ల కోసం రెక్కలను ఆడించడానికి వీలయ్యే విధమైన నమూనాలను గీశాడు, కాని అవి అంత స్పష్టంగా లేవు. తాను ప్రతిపాదించిన ఎగిరే యంత్రాల నమూనాల్లో కనీసం కొన్నింటినైనా ఆయన నిర్మించివుంటాడని రుజువులు సూచిస్తున్నాయి. అయితే, డా విన్సీ గీసిన నమూనాలేవీ నిజంగా ఆచరణాత్మకమైనవి కాదు.

ఆ తర్వాతి రెండు శతాబ్దాల్లో, తోలుపట్టీలతో కృత్రిమమైన రెక్కలను తమ శరీరాలకు అమర్చుకుని కొండచరియల మీదినుండీ కోటల మీదినుండీ క్రిందికి దూకేటప్పుడు ఆ రెక్కలను ఆడిస్తూ క్రిందికి దిగడానికి సాహసవంతులు చేసిన ప్రయత్నాలను గురించిన వివిధ వృత్తాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తొలి ‘టెస్ట్‌ పైలట్‌లు,’ ధైర్య సాహసాలుగల వారు—కాని వారి ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం కాలేదు.

ఫైర్‌ బెలూన్‌లు, “దహనశీల వాయువు”

1783లో పారిస్‌లోనూ ఫ్రాన్సు పరిసరప్రాంతాల్లోనూ అత్యద్భుతమైన వైమానిక రంగంలో ఒక హఠాత్‌ పురోభివృద్ధిని గురించిన వార్త వ్యాపించింది. జోసెఫ్‌ మీషెల్‌, జాకేట్యన్‌ మాంట్‌గోల్ఫియర్‌ అని ఇరువురు సోదరులు తాము చిన్న కాగితం బెలూన్‌లలో వేడి వాయువును నింపడం ద్వారా అవి వేగంగానూ సుళువుగానూ ఆకాశంలోకి ఎగిరేలా చేయవచ్చునని కనుగొన్నారు. వారు తమ మొదటి భారీ ఫైర్‌ బెలూన్‌ను కాగితంతోనూ నారబట్టతోనూ తయారు చేసి, ఒక పెద్ద మంట నుండి దుర్గంధభరితమైన పొగను దానిలోకి నింపారు. మనుష్యులు లేని ఆ బెలూన్‌ దాని ప్రారంభ ఆకాశయాన సమయంలో 1,800 కంటే ఎక్కువ మీటర్ల పైకి లేచింది. 1783 నవంబరు 21న, ఆ బెలూన్‌ ఇద్దరు ప్రయాణీకులను ఎక్కించుకుని పారిస్‌ మీదుగా 25 నిమిషాలపాటు ప్రయాణించింది, ఆ ఇద్దరినీ ప్రజలు వాయుచోదకులు అని పిలిచారు. అదే సంవత్సరంలో, జాకీస్‌ చార్లెస్‌ అనే మరో రూపకర్త ఉదజనితో నింపబడిన మొదటి బెలూన్‌ను వెలుగులోకి తెచ్చాడు, అప్పట్లో ఉదజని “దహనశీల వాయువు” అని పిలువబడేది.

బెలూన్‌ సాంకేతిక పరిజ్ఞానం మెరుగవుతుండగా, సాహసవంతులైన వాయుచోదకులకు త్వరితగతిన ఆకాశం ‘నిస్సందేహంగా తెరుచుకుంది.’ 1784 కల్లా, బెలూన్‌లు 3,400 మీటర్ల కంటే ఎత్తుకు ఎగరడం ప్రారంభించాయి. కేవలం ఒక సంవత్సరం తర్వాత, జాన్‌ప్యర్‌ ఫ్రాన్‌స్వా బ్లాంకార్డ్‌ ఉదజని బెలూన్‌లో ప్రపంచపు మొదటి ఎయిర్‌మెయిల్‌ ఉత్తరాలను తీసుకుని ఇంగ్లీష్‌ కాలువను విజయవంతంగా దాటాడు. 1862 కల్లా, వాయుచోదకులు యూరప్‌ అంతటిలోనూ అమెరికా అంతటిలోనూ ప్రయాణిస్తూ, ఎనిమిది కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తును చేరుకోగలిగారు.

కాని తొలి వాయుచోదకులు పూర్తిగా గాలి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడేవారు; బెలూన్‌ ప్రయాణించే దిశను లేక వేగాన్ని అదుపుచేయగల మార్గమే లేదు. 19వ శతాబ్దపు చివరి అర్ధభాగంలో పెట్రోలు మరియు విద్యుత్‌లతో నడిచే వాయునౌకల అభివృద్ధి ఆకాశయానాన్ని చాలామేరకు సాధ్యం చేసింది, కాని కాస్త అర్థచంద్రాకారంలో ఉండే, గాలికన్నా తేలికైన వాయునౌకలు మెల్లిగా ప్రయాణించేవి—సాధారణంగా గంటకు పది నుండి ముఫ్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేవి. డ ఫోన్టానా ప్రవచించినట్లుగా, మనిషి “గాలిలోకి ఎగిరి ఒక స్థలం నుండి మరో స్థలానికి” స్వేచ్ఛగా విహరించగల్గాలంటే క్రొత్త మార్గం అవసరమైంది.

[4వ పేజీలోని చిత్రం]

పురాణాల్లోని డేడలస్‌, ఇకారస్‌

[4వ పేజీలోని చిత్రం]

లియోనార్డో డా విన్సీ

[క్రెడిట్‌ లైను]

From the book Leonardo da Vinci, 1898

[4వ పేజీలోని చిత్రం]

మొట్టమొదటి, ప్రయాణీకులను తీసుకువెళ్లే, వేడి వాయువుగల బెలూన్‌ను మాంట్‌గోల్ఫియర్‌ సోదరులు రూపొందించారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి