కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 4/8 పేజీలు 6-9
  • విమానం ఎలా ఉనికిలోకి వచ్చింది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విమానం ఎలా ఉనికిలోకి వచ్చింది?
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లోహవిహంగాలకు వాణిజ్య భవితవ్యం ఉందా?
  • ప్రపంచ గతిని మార్చడం
  • అభివృద్ధికి చెల్లించాల్సిన మూల్యం
  • ఆకాశయానంలో అగ్రగాములు
    తేజరిల్లు!—1999
  • ఆకాశయాన స్వప్నం
    తేజరిల్లు!—1999
  • విమానాలు ఎంత సురక్షితమైనవి?
    తేజరిల్లు!—1999
  • విమానాలు విహరిస్తూనే ఉండటానికి ఏం చేస్తారు?
    తేజరిల్లు!—1999
తేజరిల్లు!—1999
g99 4/8 పేజీలు 6-9

విమానం ఎలా ఉనికిలోకి వచ్చింది?

గాలికన్నా బరువైన లోహవిహంగాలను రూపొందించడంలో డిజైనర్లు చివరికి ఎలా సఫలీకృతులయ్యారు? వాళ్లు ఎగిరే కళలో నిజమైన నిష్ణాతులైన పక్షుల వైపుకు తమ అవధానాన్ని మళ్లించారు. 1889లో, ఒట్టో లిల్యన్థల్‌ అనే జర్మను ఇంజనీర్‌, కొంగల ఎగిరే అలవాట్లనుబట్టి ప్రేరేపించబడి, “ఆకాశయానానికి ఆధారమైన పక్షియానం” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ప్రచురించాడు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన తన మొదటి గ్లైడర్‌ను నిర్మించాడు. 1896లో, దాదాపు 2,000 గ్లైడర్‌లపై ఆకాశయానం చేసిన తర్వాత, లిల్యన్థల్‌ మోనో విమానంతో ప్రాక్టీస్‌ చేస్తుండగా చనిపోయాడు. ఫ్రాన్స్‌లో జన్మించిన అమెరికన్‌ ఇంజనీరైన ఆక్టేవ్‌ షనూట్‌, లిల్యన్థల్‌ నమూనాలను విస్తృతపర్చి, రెండు రెక్కలుగల గ్లైడర్‌ను రూపొందించాడు. అది మళ్లీ, గాలికన్నా బరువైన లోహవిహంగాల రూపకల్పనలో విశేషమైన పురోభివృద్ధిని సూచించింది.

అప్పుడు రైట్‌ సోదరులు రంగంలోకి ప్రవేశించారు. అమెరికాలోని ఒహాయో నందలి డేటాన్‌లో ఒక సైకిలు షాపు యజమానులైన ఒర్వెల్‌, విల్‌బర్‌ రైట్‌లు 1900లో, తమ మొదటి గ్లైడింగ్‌ ప్రయోగాలను ప్రారంభించారు. ఆ ప్రయోగాలు లిల్యన్థల్‌, షనూట్‌లు సాధించినవాటిపై ఆధారపడ్డాయి. రైట్‌ సోదరులు తర్వాతి మూడు సంవత్సరాల వరకు మెల్లిగా, పద్ధతి ప్రకారం పనిచేసి, ఉత్తర కరోలినాలోని కిట్టి హాక్‌లో పదే పదే ప్రయోగాత్మక గగన విహారాలు చేశారు. వాయుసొరంగాల సహాయంతో వాళ్లు క్రొత్త డిజైన్‌లను రూపకల్పన చేశారు. వాటిలో మొదటి వాయుసొరంగాన్ని వాళ్లు తమ బట్టలకుపెట్టే స్టార్చ్‌ డబ్బాతో తయారు చేశారు. వాళ్ళు తమ మొదటి ఆకాశయానం కోసం, నాలుగు సిలెండర్లుగల, 12 హార్స్‌పవర్ల ఇంజిన్‌ను రూపొందించి, దాన్ని ఒక క్రొత్త విమానం యొక్క క్రింది రెక్కమీదకు ఎక్కించారు. విమానం వెనుక భాగాన ఉండే చుక్కానికి ఇరువైపుల ఉన్న రెండు చెక్క ప్రొపెల్లర్‌లకు ఆ ఇంజిన్‌ శక్తినిచ్చేది.

1903, డిసెంబరు 14న, రైట్‌ సోదరుల క్రొత్త రూపకల్పన దాని కొయ్య ట్రాక్‌ మీది నుండి మొట్టమొదటిసారిగా పైకి లేచి, మూడున్నర సెకండ్లపాటు గాలిలోనే నిలిచింది! మూడు రోజుల తర్వాత ఆ సోదరులు మళ్లీ దాన్ని గాలిలోకి లేపారు. చివరికి అది పూర్తిగా ఒక నిమిషం పాటు గాలిలోనే ఉండిపోయి, 260 మీటర్ల దూరం వరకు వెళ్లింది. అలా విమానం విజయవంతమైంది.a

ఆశ్చర్యకరంగా, మలుపురాయివంటి ఈ సాఫల్యాన్ని మిగతా ప్రపంచం అంతగా పట్టించుకోలేదు. 1906 జనవరిలో, ది న్యూయార్క్‌ టైమ్స్‌ చివరికి రైట్‌ సోదరుల కథను ప్రచురించినప్పుడు, వారి “లోహవిహంగం” చాలా రహస్యంగా వృద్ధి చేయబడిందనీ, 1903లో ఆ సోదరులు “గాలిలో ఎగరడంలో కొద్దిపాటి సాఫల్యాన్ని” మాత్రమే సాధించారనీ ఆ పత్రిక తెలియజేసింది. నిజానికి, చారిత్రాత్మక ఆకాశయానం జరిగిన ఆ రాత్రే, ఆ విషయాన్ని ప్రెస్‌కు తెలియజేయమని కోరుతూ ఒర్వెల్‌ వాళ్ల నాన్నకు ఒక టెలిగ్రామ్‌ పంపించాడు. అయితే, ఆ సమయంలో, అమెరికాలోవున్న కేవలం మూడు వార్తాపత్రికలు మాత్రం ఆ కథను ప్రచురించడానికి సుముఖత చూపించాయి.

లోహవిహంగాలకు వాణిజ్య భవితవ్యం ఉందా?

ఆకాశయాన తొలినాళ్లలో, ప్రపంచమంతా ఆకాశయానం గురించి సంశయాత్మకంగా ఉంది. ప్రముఖ ఆకాశయాన అగ్రగాముల్లో ఒకడైన షనూట్‌ కూడా, 1910లో ఇలా ప్రవచించాడు: “అర్హులైన నిపుణుల అభిప్రాయం ప్రకారం, లోహవిహంగాల వాణిజ్య భవితవ్యం గురించి ఎదురు చూడడం నిష్ప్రయోజనకరం. వాటిని మోసుకు వెళ్లగల సామర్థ్యానికి పరిమితి ఉంది, ఆ పరిమితి ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది, కాబట్టి వాటిని ప్రయాణీకుల కోసంగాని, సరుకుల కోసంగాని ఉపయోగించడం అసాధ్యం.”

అయినప్పటికీ, రైట్‌ సోదరుల మొదటి ఆకాశయానం జరిగిన తర్వాతి సంవత్సరాల్లో ఆకాశయాన సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిన అభివృద్ధి సాధించింది. ఐదు సంవత్సరాల్లో ఆ సోదరులు, ఇద్దరు వ్యక్తులు కూర్చోగల బైప్లేన్‌ను నిర్మించారు, అది గంటకు 71 కిలోమీటర్ల వేగంతో, 43 మీటర్ల ఎత్తున ప్రయాణించగల్గింది. 1911లో, మొదటిసారిగా అమెరికా ఖండం మీదుగా విమానయానం జరిగింది; న్యూయార్క్‌ నుండి కాలిఫోర్నియాకు చేరడానికి 49 రోజులు పట్టింది! మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, విమానాల వేగం గంటకు 100 కిలోమీటర్ల నుండి గంటకు 230 కిలోమీటర్లకు చేరుకుంది. అవి 9,000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలిగేవి.

1920లలో, ఆకాశయాన రికార్డులు పత్రికల్లో పతాక శీర్షికలుగా ప్రచురించబడేవి. ఇద్దరు అమెరికన్‌ సైన్యాధికారులు 1923లో అమెరికా మీదుగా మొట్టమొదటిసారిగా మధ్యలో ఎక్కడా ఆగకుండా, ఈ కోస్తా తీరం నుండి ఆ కోస్తా తీరం వరకు 27 గంటలకంటే తక్కువ సమయంలో ప్రయాణించారు. నాలుగు సంవత్సరాల తర్వాత చార్లెస్‌ ఏ. లిండ్‌బర్గ్‌, మధ్యలో ఎక్కడా ఆగకుండా, న్యూయార్క్‌ నుండి పారిస్‌కు 33 గంటల 20 నిమిషాల్లో చేరుకుని వెనువెంటనే పేరుప్రతిష్ఠలను సంపాదించుకున్నాడు.

ఈ మధ్యలో, సరిక్రొత్త వాణిజ్య విమానమార్గాలు ఖాతాదారులను ఆకర్షించడం మొదలెట్టాయి. 1939 చివరి భాగం నాటికి, ఆకాశయానం ఎంత ప్రసిద్ధమైపోయిందంటే, అమెరికా విమానయానమార్గాలు సంవత్సరానికి దాదాపు 30 లక్షలమంది ప్రయాణీకులకు తమ సేవలను అందజేస్తున్నాయి. 1930ల ప్రామాణిక ఎయిర్‌లైనర్‌ అయిన డి.సి.-3 గంటకు 270 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ కేవలం 21మంది ప్రయాణీకులను తీసుకువెళ్లేది; కాని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, వాణిజ్య విమానాలు పరిమాణంలో ఎంతో పెద్దవిగానూ, ఎంతో శక్తివంతమైనవిగానూ రూపొందించబడి, గంటకు 480 కంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగేవి. 1952లో బ్రిటన్‌, వాణిజ్య టర్బోజెట్‌ విమానయాన సేవను ప్రవేశపెట్టింది. 1970లో, 400 సీట్లుగల బోయింగ్‌ 747 వంటి జంబోజెట్‌ విమానాలు రంగప్రవేశం చేశాయి.

బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ ఇంజనీర్ల బృందం 1976లో డెల్టా-వింగ్డ్‌ జెట్‌లైనర్‌ అయిన కాంకార్డ్‌ విమానాన్ని పరిచయం చేసినప్పుడు అది మరో మలుపురాయి అయ్యింది. దానిలో 100 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. అది ధ్వనికన్నా రెండు రెట్లు ఎక్కువ వేగంతో అంటే గంటకు 2,300 కంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కాని వాణిజ్య సూపర్‌సోనిక్‌ విమానాల విస్తృత ఉపయోగాన్ని, వాటి నిర్వహణకయ్యే ఖర్చులు పరిమితం చేసేశాయి.

ప్రపంచ గతిని మార్చడం

మీరు ఎన్నడూ విమానంలో ప్రయాణించకపోయినప్పటికీ, ఈ శీఘ్ర సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధి మూలంగా మీ జీవన గతి బహుశ మార్చబడి ఉంటుంది. విమానాలలో సరుకును రవాణాచేసే కార్యకలాపాలు భూగోళవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి; తరచూ, మనం తినే ఆహారం, ధరించే వస్త్రాలు, మనం పనిస్థలంలోనూ ఇంట్లోనూ ఉపయోగించే వస్తువులూ మహాసముద్రాలనూ ఖండాలనూ దాటుకుని వస్తున్నాయి. ఉత్తరాలూ, పార్సెళ్లూ ఎయిర్‌ మెయిల్‌ ద్వారా ఒక దేశం నుండి మరో దేశానికి దూసుకు వెళ్తున్నాయి. అనుదిన వ్యాపారనిర్వహణల కోసం వాణిజ్యం, కొరియర్‌ సేవల మీద ఎంతగానో ఆధారపడుతుంది. మనకు అందుబాటులో ఉన్న సరుకులూ, సేవలూ మనం వాటికోసం వెచ్చించే ధరలూ ఇవన్నీ మానవుని ఆకాశయాన సామర్థ్యంతో ప్రభావితం చేయబడ్డాయి.

ఆకాశయానం ప్రగాఢమైన సామాజిక మార్పులను కూడా తెచ్చింది. ఆకాశయానం మూలంగా ప్రపంచం నిస్సందేహంగా కుదించుకుపోయింది. కేవలం కొన్ని గంటల్లో, మీరు దాదాపు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా ఉండవచ్చు—మీరు భరించగల్గితే. వార్తలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి, ప్రజలూ అంతే.

అభివృద్ధికి చెల్లించాల్సిన మూల్యం

కాని అలాంటి అభివృద్ధి కోసం మూల్యం చెల్లించవలసి వచ్చింది. విమాన రాకపోకల రద్దీ పెరగడంతో, ఆకాశం మరింత ప్రమాదకరమైనదిగా తయారౌతుందని కొందరు భయపడుతున్నారు. ప్రతి సంవత్సరం విమాన ప్రయాణాల మూలంగా ప్రైవేట్‌ విమానాలు, వాణిజ్య విమానాలు ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నాయి. “పోటీదాయక ఒత్తిడి క్రింద, చాలా విమాన కంపెనీలు, అదనపు ఖర్చును ప్రయాణికులపై మోపగల్గినప్పుడు తాము నిత్యకృత్యంగా తీసుకునే అదనపు భద్రతా చర్యలను ఇప్పుడు తీసుకోవడం లేదు” అని ఫార్చూన్‌ అనే పత్రిక చెప్తుంది. అమెరికాలో విమానయాన భద్రతను కాపాడవలసిన బాధ్యతగల ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో “నిధులు కొరవడ్డాయి, ఉద్యోగులు కరువయ్యారు, అది సరైన విధంగా నిర్వహించబడడంలేదు” అని ఆ పత్రిక నివేదించింది.

అదే సమయంలో, పర్యావరణం పట్ల ఆసక్తిగల ఎంతోమంది జెట్‌ రాకపోకల అధిక రద్దీ మూలంగా ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని బట్టి అప్రమత్తులౌతున్నారు. “ప్రపంచ ప్రజల ఆకాశయానంలో అత్యంత విరుద్ధమైన అంశాల్లో ఒకటి” శబ్ద సమస్యను గురించిన చింతలతో వ్యవహరించడమని ఏవియేషన్‌ వీక్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీ అనే పత్రిక చెప్పింది.

విమానయాన ప్రయాణాలు పాతవైపోతున్నాయనే వాస్తవం ఈ సమస్యలకు తోడవుతోంది: 1990లో యు.ఎస్‌. ఎయిర్‌లైనర్లలోని ప్రతి నాలుగింటిలో ఒకటి 20 ఏళ్లకన్నా పాతదనీ, వాటిలో మూడొంతులు, వాటిని తయారు చేసేవారు మొదట్లో “వాటి ఉపయోగకరమైన జీవనకాలంగా” నిర్ణయించిన కాలాన్ని దాటిపోయాయనీ తేలింది.

కాబట్టి, ఆకాశయాన ఇంజనీర్లు ఇప్పుడు విపరీతమైన సవాళ్లను ఎదుర్కుంటున్నారు. ధరలు పెరిగిపోయినప్పటికీ, పర్యావరణ చింతలు అధికమైపోయినప్పటికీ కూడా వాళ్లిప్పుడు ఎక్కువమంది ప్రయాణీకులను తీసుకువెళ్లడానికి సురక్షితమైన, తక్కువ ఖరీదుగల మార్గాలను వృద్ధి చేయాలి.

ధరలు తగ్గించడానికి కొన్ని పరిష్కారాలు ఇప్పటికే మొదలయ్యాయి. జిమ్‌ ఎరిక్‌సన్‌, ఏసియావీక్‌లో వ్రాస్తూ, ఏరోస్పటియేల్‌కు మరియు బ్రిటీష్‌ ఏరోస్పేస్‌కు చెందిన ఫ్రాంకో-బ్రిటిష్‌ బృందం, 300 మంది ప్రయాణీకులతో శబ్దవేగంకన్నా రెండింతలు వేగంగా ప్రయాణించగల విమానాన్ని రూపొందించడానికి పథకాలు వేస్తోంది. ఒక్కో ప్రయాణీకుడికి అయ్యే ఖర్చు, ఇంధనవ్యయం తగ్గుతాయి. అనేక విమానాశ్రయాల్లో ఉన్న అధిక రద్దీయైన పరిస్థితులకు ప్రతిస్పందనగా, కొంతమంది పారిశ్రామిక దార్శనీకులు ఎక్కువమంది ప్రయాణీకులను తీసుకువెళ్లగల క్రొత్త తరం హెలికాప్టర్లను ప్రతిపాదించారు, ఒక్క హెలికాప్టర్‌ 100 మంది ప్రయాణీకులను తీసుకువెళ్లగల్గుతుంది. ఇప్పుడు సాధారణ ఫిక్సిడ్‌వింగ్‌ విమానాలు చేస్తున్నట్లుగా, దగ్గరి ప్రయాణ విమాన రాకపోకల్లో ఎక్కువ భాగాన్ని ఒకనాటికి ఈ హెలికాప్టర్లు చేయగలవని వాళ్లు విశ్వసిస్తున్నారు.

రాగల సంవత్సరాల్లో విమాన పరిశ్రమకు ఏర్పడగల అత్యవసరమైన అవసరాలను అతిపెద్ద హెలికాప్టర్లు, సూపర్‌సోనిక్‌ విమానాలు నిజంగా తీర్చగలవా? ఆకాశయానంలో క్రొత్త పుంతలను త్రొక్కడానికి మానవుడు ప్రయత్నిస్తుండగా, కాలమే దానికి సమాధానం చెప్పాలి.

[అధస్సూచీలు]

a 1901లో, అమెరికాలోని కనెక్టికట్‌లో నివసిస్తున్న జర్మను శరణార్థియైన గుస్టావ్‌ వైట్‌హెడ్‌ (వైస్‌కోఫ్‌) కూడా తాను కనిపెట్టిన విమానంలో ప్రయాణించాడని కొందరంటారు, అయితే దాన్ని ధృవీకరించడానికి ఫోటోలు లేవు.

[6వ పేజీలోని చిత్రం]

ఒట్టో లిల్యన్థల్‌, దాదాపు 1891

[క్రెడిట్‌ లైను]

Library of Congress/Corbis

[6, 7వ పేజీలోని చిత్రాలు]

చార్లెస్‌ ఏ. లిండ్‌బెర్గ్‌ 1927లో అట్లాంటిక్‌ మహాసముద్రం మీదుగా పారిస్‌కు విమానయానంచేసి, లండన్‌కు తిరిగి రావడం

[క్రెడిట్‌ లైను]

Corbis-Bettmann

[7వ పేజీలోని చిత్రం]

సాప్‌విత్‌ కామెల్‌, 1917

[క్రెడిట్‌ లైను]

Museum of Flight/Corbis

[7వ పేజీలోని చిత్రం]

డిసి-3, 1935

[క్రెడిట్‌ లైను]

Photograph courtesy of Boeing Aircraft Company

[7వ పేజీలోని చిత్రం]

సికోర్‌స్కీ ఎస్‌-43 ఫ్లయింగ్‌ బోట్‌, 1937లో

[8వ పేజీలోని చిత్రం]

కోస్ట్‌ గార్డ్‌ రెస్‌క్యూ హెలికాప్టర్‌

[8వ పేజీలోని చిత్రం]

ది ఆక్రోబాటిక్‌ పిట్స్‌, సామ్సన్‌ రిప్లికా

[8, 9వ పేజీలోని చిత్రాలు]

కాంకార్డ్‌ 1976లో నియమిత ఆకాశయానాలను ప్రారంభించింది

[8, 9వ పేజీలోని చిత్రాలు]

ఎయిర్‌బస్‌ ఏ300

[8, 9వ పేజీలోని చిత్రాలు]

తిరిగి ప్రవేశించిన తర్వాత, స్పేస్‌ షటిల్‌ హై-స్పీడ్‌ గ్లైడర్‌గా మారుతుంది

[9వ పేజీలోని చిత్రం]

“రుటాన వరీజ్‌” విమానం, 1978

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి